Friday, 29 June 2012

''అప్పిచ్చువాడు,వైద్యుడు...''అంటూ ...

''అప్పిచ్చువాడు,వైద్యుడు...''అంటూ ...
మన వాళ్ళు వైద్యుడు లేని ఊరిలోనే ఉండకూడదు 
అని ....ఆ వృత్తికి అంత గౌరవం ఇచ్చారు.


కాని ఇప్పటి రోజుల్లో అది కూడా వ్యాపారం అయిపోయ్యి 
డాక్టర్ అంటే భయం వేస్తుంది.


కాని వారిలో కూడా ఇలాగా సున్నితంగా ఆలోచించే వాళ్ళు 
ఉంటారని ఈ రోజు సాక్షి లో వారి గూర్చి చదివితే తెలిసింది.


 ''డాక్టర్స్ డే''అంట.
వృత్తిని దైవం గా భావించే అలాటి డాక్టర్స్ అందరికి 


''happy doctors day''


ఏమో......కాలు జారి బాత్ రూం లో పడిపొయ్యి ,
ఎవరు ఇంట్లో లేక ,వంటిరిగా ఉన్న కారణాన బ్లడ్ 
ఎక్కువగా పొయ్యి చనిపోయిన మా ప్లస్ మిత్రుడు 
ఇలాటి ఒక డాక్టర్ గారి దగ్గరకు  కాని సమయానికి 
తీసుకు వెళ్లుంటే బ్రతికే వాడు ఏమో.


మిత్రమా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ...
మీ ఆత్మకి శాంతి కలగాలి అని కోరుకుంటూ....







Monday, 18 June 2012

అబధ్రత లో.....బధ్రత

హమ్మయ్య.....ముగ్గురు కూర్చొనే సీట్ లో కొంచం సర్దుకొని 
కాళ్ళు  దారిలోకి పెట్టి ....ఏదోలే సీట్ దొరికిందని ఆనంద పడ్డాను.
రైలు  క్రిక్కిరిసి ఉంది.సీజన్ తో సంభందమే లేదు.ఇది చెన్నైనుండి 
నెల్లూరు  కి వెళ్ళే మేమో.ఎప్పుడూ ఇలాగే ఉంటుంది కిట కిట లాడుతూ.

కొందరు  కొత్త వాళ్ళు,కొందరు అప్పుడప్పుడూ ఎక్కే వాళ్ళు,కొందరు 
కాలేజ్  కి ఆఫీస్ కోసం రోజు వెళ్ళే వాళ్ళు.ఇదో ప్రపంచం.
దానిలో గమనిస్తే ఎన్నో ప్రపంచాలు.
ఒక దగ్గరే ఉంటారు...ఎవరికి వాళ్ళు గానే ఉంటారు.....
భారతీయత  ఉట్టిపడుతూ.

అపుడప్పుడూ  వచ్చేవాళ్ళు అప్పుడే మీరెక్కడ దిగుతారు అని వాకబు 
చేస్తున్నారు కూర్చున్న  వాళ్ళని .
ఎప్పుడూ వచ్చేవాళ్ళు ఇది మాకు అలవాటే అన్నట్లు 
లాఘవంగా  సర్దుకుంటున్నారు దారికి అడ్డం లేకుండా....
కొందరు కిందే కూర్చుంటున్నారు  న్యూస్ పేపర్ వేసుకోనివేసుకొని.

ఆహా  న్యూస్ పేపర్ ఎన్ని విధాలా ఉపయోగపడుతుంది....పూలకి పొట్లం లా,
కూర్చునేందుకు  పీటలా,న్యూస్ అందించే వాహకం లా,స్పూర్తి నిచ్చే టీచర్ లా...
నాలో  కవిత్వం పొంగి పోర్లుతుంది.లాభం లేదు.
వెంటనే దృష్టి వేరే వైపు మళ్లించాలి.
లేకుంటే  ఇక్కడ ఉండే వాళ్ళు బలి అయిపోతారు నా కవితలకి.

చుట్టూ  చూసాను.పక్క సీట్ లో ఫ్యామిలీ ఎక్కడికో వెళుతున్నారు.
భార్యా,భర్త ఇద్దరు పిల్లలు.చిన్న పిలాడికి నీళ్ళు తాగిస్తూ ఉంది.
నిలబడటం  కష్టం అయిపోయ్యి కాళ్ళు మార్చుకుంటున్నారు...ఇష్..అబ్బా..
అంటూ  ...ఒక దగ్గర కొత్తగా పెళ్లి అయిన జంట లాగుంది.
చిన్నగా  దగ్గరకు వంగి కిటికీ లో నుండి చూస్తూ కబుర్లు చెప్పుకుంటూనారు.

పిల్లలు,పెద్ద  వాళ్ళు  ఒకరి మీద ఒకరు పడుతూ ....
పల్లీలు ...మురుకులు...బిస్కెట్లు ...అరుపులు...
లాఘవంగా తప్పుకోమని జనాల మధ్య నుండి అరుస్తూ ,
వెళుతూ  వ్యాపారం చేసుకుంటున్నారు.ఇంత కష్టం లో 
కూడా  ఎన్ని జీవనాలు గడుస్తున్నాయో......

ఆ పక్క  సీట్ వెనుక వైపు సీట్ చూసాను.అది రెండు సీట్లది.
అందులో  ఒకతను కూర్చుని ఉన్నాడు.
మామూలుగా రెండు సీట్ల దానిలో ముగ్గురు  కూర్చుంటారు.
అందులో పిల్లల తల్లులు ఉన్నారు చుట్టూ .......
అయినా  ఎవ్వరూ అతని ప్రక్కన కూర్చో టానికి సాహసించటం లేదు.
ఏమై ఉంటుంది కుతూహలంగా పరిశీలనగా చూసాను.

పక్కన  ఉండే ఇరవై ఏళ్ళ అమ్మాయిని చూసి అడుగుతున్నాడు 
.....నీ ఫోన్ ఇటియ్యి ,నంబర్ యెంత?ఏమో చనువు ఉన్నట్లు అడుగుతున్నాడు.
ఆ  అమ్మాయి బయంతో ముడుచుకు పోతుంది.
పక్కన జరగటానికి స్తలం లేదు.
కొంచం  ముందులో కుర్రాళ్ళు.ఎలా వెళుతుంది పాపం .
తగలకుండా నిలబడటం కష్టం  కదా.
అయినా రైలు లో తగలటం పెద్ద పట్టించుకోరు కాని 
వేరే  వాళ్ళ స్పర్శ ఎవరికైనా విసుగే.....

ఆతను  తెల్ల పంచె,తెల్ల చొక్కా,
నలబై ఏళ్ళ పైనే వయసు ఉంటుంది.
ఆ  అమ్మాయికి కూతురు 
వయసు ఉంటుంది.మరి వీడి కేమి రోగం 
ఇలా ఏడిపిస్తున్నాడు?
అప్పుడు వచ్చింది ఆ వైపు నుండి 
గప్పు మని కంపు అదీ  సంగతి అయ్యగారు 
మందు మీద ఉండాడు.
ఛీ ...జుగస్సు...చూసే వాళ్లకు .

ఆ  పిల్ల ముడుచుకొనే కొద్దివాడు రేచ్చిపోయ్యి మాట్లాడుతునాడు.
ఆ అమ్మాయి అందరు తననే చూస్తున్నాడనే స్పృహతో తల 
వంచుకొని  వణికి పోతుంది.ఛా....ఏమి ఆడ పిల్లలు భయ పడుతూ...
సరేలే పాపం మళ్ళా మాట్లాడితే .....వీళ్ళు అందరు చూడు 
ఆడ పిల్ల ఎలా మాట్లాడుతుందో అని ప్రచారం చేస్తారు.
ఎందుకులే గొడవ అనుకున్నాదేమో ...అనుకున్నా 
జాలితో.

వాడు ఆ అమ్మాయిని చూసి ఇదో ఇక్కడ కూర్చో వెకిలిగా నవ్వుతూ 
పక్కకి జరిగాడు.ఆ పిల్ల అసహ్యంగా చూసి అటు తిరిగి నిలబడింది.
వాడు ఫోన్ వచ్చినట్లు...హలో..హలో..అంటూ వెకిలిగా చూస్తూ 
నిలబడ్డాడు.మధ్యలో ఒకామె నిలబడి ఉంది.పెద్దావిడ.
ఇందాకటి నుండి అన్నీ చూస్తూ ఉంది.
వాడు ఫోన్ చేసినట్లు నటిస్తూ ముందుకు ,వెనకకు వంగి ఆ పిలాని 
అన్ని కోణాల్లో తినేస్తూ చూస్తున్నాడు.తూలి  పడ  పొయ్యాడు.


అపుడు మొదలయ్యింది అసలు కధ.''దొంగ నా కొడకా''
పెద్దావిడ చొక్క పట్టుకుంది...ఇందాకటి నుండి చూస్తుండా ....
@*&%$@@()%$#@^&***(^%$# ....వరదలాగా అన్ని పక్కల నుండి 
తిట్లు.నేను లేచి నిలబడి ఆ అమ్మాటికి వత్తాసుపలికాను.
''వేదవ...నేను ఇందాకా కూర్చున్నాను వాడి పక్కన ....
కాళ్ళు  పైన పైన వేస్తాడు పక్కకు జరుగుతూ...చంటి పిల్లను 
భుజం పై వేసుకున్న ఆవిడ చెప్పింది.కళ్ళల్లో కసి తీరనట్లు చూస్తూ.


పక్కన కుర్రాళ్ళకు విషయం అర్ధం అయింది .వాడు ఇంకా నేనేమి 
చేశాను అని ఆడవాళ్ళను దబాయిస్తున్నాడు.
మనిషి స్పర్శకు....మగాడి స్పర్శకు తేడా తెలీదా?
అనుభవిస్తే తెలుస్తుంది దానిలో ఉండే నరకం.


కుర్రాళ్ళకు సహనం చచ్చిపోయింది.రెండు పీకారు వాడి వీపు పై.
పర్లేదు కుర్రాళ్ళు కొందరు మంచి వాళ్ళే ఉంటారు.
నలుగురు నాలుగు వైపులా వాయించేసారు.
దెబ్బకి నమస్కారం పెడుతూ 
''వదిలేయ్యండయ్యా...ఇంకెప్పుడూ చెయ్యను''
ఒప్పుకున్నాడు.తూలిపోతూ ఉన్నాడు.పోలీస్ స్టేషన్ లో 
అప్పగిస్తాము అనుకున్నారు తరువాత స్టేషన్ లో దిగి.
కాని అందరు చర్చించుకొని ఆడవాళ్ళు ఎలా వస్తారు స్టేషన్ కి 
అనుకొని ....చివరి సారి హెచ్చరించి ...తరువాత స్టేషన్ లో 
వాడిని బలవంతంగా దించేసారు.

ఆ సీట్ లో కూర్చుని ఆ అమ్మాయి,ఇంకో పసి పాప తల్లి హమ్మయ్య అనుకున్నారు.


నిజమే ఇలాంటి ట్రైన్ యెంత అబధ్రత అనుకున్నాను కాని 
జనాల వలన యెంత మంచి జరుగుతుంది.చెయ్యాల్సిందంతా 
ఇలాటి వాళ్ళను ఎదిరించటమే.

అభద్రత వాతావరణం లో కూడా యెంత బధ్త్రత.
ఉన్నారు  మంచి మనుషులు ఇంకా బతుకు పై ఆశ కలిపిస్తూ ....
 

Saturday, 16 June 2012

నాన్నకు నమస్సులు....చెట్టులా చల్లగా చూడు...

''ఎందుకు పిల్లలు నాన్న దగ్గర ఉండకుండా అమ్మ దగ్గరకే 
వెళుతుంటారు''అడిగింది మా పాప వాళ్ళ తమ్ముడిని....


''ఏముంది నాన్నలు ఎప్పుడూ రూల్స్ అంటుంటారు 
అందుకని''చెప్పాడు బాబు.


మొన్న వీడు  సీనియర్ ఇంటర్ పాస్ అయ్యాడని తిరుమలకి వెళ్ళాము.
క్యు లో చిన్న,చిన్న పిల్లలతో వీళ్ళు తెగ ఆడుతున్నారు.
అప్పుడు వీళ్ళకు వచ్చిన డౌట్ ఇది.


అవును నాన్న రూలర్......నాన్న హిట్లర్......నాన్న చండ శాసనుడు....
మరి తన మనసులోని సలలితమైన హృదయం ఎవరికి తెలుసు?
కటినత్వం వెనుక ఉన్న కమ్మని భాద్యత ఎవరికి తెలుసు?
తను సర్దుకొని తన మనసులో యెంత మందికి చోటిచ్చాడో,
ఎన్ని భాద్యతలు కళ్ళ నీళ్ళు  గుండె గుమ్మం దాటి రాకుండా మోసాడో 
ఎవరికి తెలుసు?


ఎపుడు వచ్చేస్తుంది ఇంత కమ్మని భాద్యత తెలీకుండా తన జీవితం  లోకి .....


కాంతులీను నక్షత్రాలు జీవం పోసుకొని 
తన ప్రతిరూపంగా చేరపోతున్నారనే 
కమ్మని కబురు విన్నప్పుడా....


పొట్ట మీద మృదువుగా నిమిరినపుడు 
తగిలిన చిన్ని తల నీ తోడూ కావాలి అని 
కోరినపుడా......


ఏదో తెలియని అందం ఎద లోతుల్లో సుడి తిప్పుతుంటే 
తుళ్లిపడి పెదాల్ని ఇంకా రూపుదిద్దని రూపానికి అద్దినప్పుడా.....




ప్రసాదపు పొంగలి అంత  మెత్తగా,పవిత్రంగా 
తన అరచేతుల్లోకి చిన్ని ప్రాణి చేరినపుడా....


చిరు నవ్వుల జిలుగులతో ఎత్తుకొని 
ప్రపంచపు దారులు చూపమని చేతులు 
చాపినపుడా......


వేలు పట్టి నడుస్తూ మనకు  లోకాన్ని 
మరో కోణం లో చూపినపుడా.....


తనయులు తెలీకుండానే మనలో భాగమై త్యాగం లోనే 
ఆనందం  ఉన్నదని  హృదయాన్ని తృప్తితో నిమిరినపుడా....


పిల్లలే జీవితం...పిల్లల కోసమే జీవితం......
పిల్ల విజయమే తన విజయం.......


అమ్మ ప్రేమల పందిరి హత్తుకుంటే ఆనందం.....
కాని ఆ పందిరికి తండ్రే ఆలంబనం.......


తండ్రి చెట్టు.....
తల్లి చెలమ.....
దొరికిన వాళ్ళకే జీవిత మధురిమ.


HAPPY FATHERS DAY 


ఎందరో చక్కగా భాద్యత చూపించి పిల్లలను 
సమాజానికి అందించిన నాన్నలు.
వాళ్ళు అందరికి ఈ పోస్ట్ అంకితం.


ఈ రోజు సాక్షి ఫ్యామిలి లో నాన్నల పేజ్ మీ కోసం 







Wednesday, 6 June 2012

యెంత ఘోరం......హ్మ్మ్...

నిజంగా యెంత ఘోరం.......ఒక ముస్లిం ఆడ పిల్ల పై 
ఇచ్చిన తీర్పులో హై కోర్ట్ ముస్లిమ్స్ పదిహేను ఏళ్ళు దాటితే 
ఇష్ట పూర్వకంగా వివాహం చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చిందంట.


అసలు ఏ మతం అయితే ఏమిటి ....అసలు పదిహేనేళ్ళు ఒక చిన్న
పసి మొగ్గ....నిజంగా ప్రపంచమే తెలీని ఒక చిన్ని చేప....మరి తనకు 
ఏది మంచిదో ఎలా తెలుస్తుంది.మరి ఈ తీర్పు ఎందుకు ఇలా ఇచ్చారో 
నాకు తెలీదు.....ఏది మంచిది ఏది కాదో కూడా నాకు తెలీదు.


కాని ఒక ఎదగని పసి పాప మనసే పదిహేను ఏళ్లకు ఉంటుందని 
నాకు తెలుసు.కనీసం తనను అందరు ఆడదాన్ని గా చూస్తారు
అని తెలీనంత.......తను అందరిలాగే మనిషి అనుకునేంత అమాయకత్వమే 
తనలో ఉంటుంది.ప్రపంచం అంతా రంగుల లోకం లాగే కనిపిస్తుంది.
మరి ఈ తీర్పు ఎలాగా ఆమోదించటం....ఏమో దీనిలో ఎన్ని కోణాలు 
ఉన్నాయో...కాని ఎటు వెళ్లి పోతుంది భారత దేశం ....కష్టపడి 
అమ్మాయి పెళ్లి వయసు పద్దెనిమిది అని తీసుకోచ్చాము.....కనీసం 
తను శారీరకం గా అయినా సిద్దపడుతుందని....మళ్లా దేశాన్ని 
బాల్య వివాహం లోకి తీసుకెళ్ళి పోతారా ఏంది.....


ఎన్ని గండాలు దాటి ఈ దేశానికి వస్తుంది 
ఒక ఆడపిల్ల....లోకం లో ఎన్ని రంగుల్నో 
ఊహించుకుంటూ.....ఏమి ఇస్తాము తనకి వివక్షల 
స్వాగత గీతాలు........


అవును నాకెందుకు బాధ ఇందరికి లేనిది....
వద్దు..నాకేమి తక్కువ.....నేను ఎందుకు 
బాధపడాలి.......


నా హాస్టల్ నుండి శేలవలకు వెళ్ళిన పిల్లలు వచ్చేటపుడు 
మెళ్ళో తాళి,కళ్ళలో నీళ్ళు.....అయినా నాకెందుకు?


పెళ్లి జరిగిపోయింది,వాడు తాగి తన్నితే పెటాకులు 
అయిపొయింది,పసి మొగ్గ మొగ్గగానే కలల జీవితాన్ని 
రాల్చేసుకుంది.....నేను ఎందుకు బాధపడాలి.....


తన్నులే ఇచ్జ్హ్చాడో వాడు ఆ చిన్నారికి,జబ్బులే ఇచ్చాడో....
నేను ఎందుకు బాధపడాలి.....మనసు భారం చేసుకొని 
టి.సి.ఇచ్చేస్తా అంతే......నేను చేసేది ......తనను ఎవరు 
ఈ దేశం లో పుట్టమన్నారు....అదీ ఆడపిల్లలాగా.....




''ఎన్ని గండాలు చిన్ని పాప నీకు 
మొగ్గగా చిరు ఊపిరి పోసు కుంటూ ఉంటేనే 
వివక్షల పరీక్ష గుచ్చు కుంటుంది.......


కలలను మొదలంటా తున్చేస్తూ ఊపిరిని 
తుదకంటా లాగేస్తుంది......


కాదు కూడదంటూ మొండికేస్తే 
వడ్ల గింజకు పని పెడుతుంది .....


అమ్మతనం అడ్డు పడితే ముళ్ళ కంచెకు 
ఉరి వేస్తుంది.....


కుక్కలకు భయపడితే 
కాలవలో విసిరేస్తుంది.....


కాలాన్ని ఎదిరిస్తే 
నువ్వు ఊపిరి పీలిస్తే అడుగడుగునా 
కీచకులే....
వయసుని మరిచి 
మానవత్వాన్ని విడచి 
కోరికల గుర్రాలు తొక్కి చంపుతాయి ....


ఆల్చిప్పలో ముత్యం లా 
యవ్వనం ఒలికి వస్తే 
వలపు వలలు ,ప్రేమల గాలాలు 


చిరు చేప లా చిక్కి నీవు 
ఆట బొమ్మలా అమ్మ బడుతావు 
అంగడి బజారులో కొనబడతావు....


కోరికల కొలిమి లో 
మోసపోయి రెక్కలు విరిగి 
జబ్బులతో రాలిపోతావు 


జీవితానికి విలువ లేదా అని అడిగితె 
ఆడ పిల్లగా పుడితే ఇంతే .....
ఇక పుట్ట వద్దు  అంతే.....


కంచే చేను మేస్తే కాచేదేవ్వరు ?
చట్టాలే వినకుంటే న్యాయం చెప్పెదేవ్వరు?







Monday, 4 June 2012

ఇష్ ....ఇష్హో....ఇష్.....

ఇష్ ....ఇష్హో....ఇష్.....

ఆ మంచి నీళ్ళు ఇటు ఇవ్వండి.
ఎక్కడ ఉన్నాయి ...అయి పోయినాయి...
వచ్చే స్టేషన్ లో అయినా దిగి తీసుకుని రండి.

ఆ రోజు ''శనివారం జూన్ రెండు 
ఉదయాన్నే పది నలబై రెండూ...."
మేము బాబు ని ఇంజనీరింగ్ చేర్చటానికి విజయవాడ 
కృష్ణా ఎక్ష్ప్రెస్స్ లో వెళుతున్నాము.ఉదయం ఎనిమిది గంటలకు 
మొదలైన మా ప్రయాణం ఇదిగో ఇలాంటి మాటలు వింటూనే జరుగుతుంది.

ఎండలా అవి...బాబోయ్...ఇష్హో...ఇష్హు....అసలే ట్రైన్ ఆగేది 
రెండు నిమిషాలు.అ రెండు నిమిషాల్లో నే అందరు బాటిల్స్ 
పట్టుకొని దిగటం ...మళ్ళా ట్రైన్ కదులుతుందని ఎక్కటం.
కొన్ని స్టేషన్ ల లో అయితే నీళ్ళు కూడా లేవు.

అంతా జనాలే.సెలవల నుండి వచ్చేవాళ్ళు,తీర్ద యాత్రల 
నుండి వచ్చేవాళ్ళు .....నిలబడను కూడా స్తలం  లేదు.
మళ్ళా బయట నుండి వేడి గాలులు.విజయవాడ కు వెళ్ళేటప్పటికి 
ప్రాణం సోమ్మ సిల్లి నట్లు అయింది.

ఎలాగో ఆ కోనేరు లక్ష్మయ్య యునివర్సిటి అడ్రస్ తెలుసుకొని 
వెళ్ళాము.అడుగు పెడుతుండగానే ఎత్తుగా ఎదిగిన వక్కల చెట్లతో 
స్వాగతం పలుకుతూ చల్లగా అనిపించింది.కాలేజ్ ఇంకా కొంత 
ఎక్స్తేటెన్షన్  చేస్తునారు.ఎలాగో మాట్లాడి ఫి కొంత కట్టేసి వచ్చాము.
అంతే ఇంక వాడు కాలేజ్ లో చేరినట్లే....ఇప్పుడు కొంచం దిగులుగా 
అనిపించింది.వీడు ఎప్పుడూ మాకు దూరం గా ఉండలేదే అని...

''పదినెలలు పెట్టినా  అమ్మ 
స్పర్శను వీడను అని  ఉన్న వాడు...

పది అడుగులు వేసినా అమ్మ ఉందా వెనుక 
అని చూచిన వాడు....

చిట్టి పాదాల తో హృదయాన్ని తట్టి 
లేపిన వాడు.....

గోరు ముద్దలతో పొట్ట నింపితే 
చిరు నవ్వులతో ఇల్లు నింపిన వాడు ...

నేడు చదువుకై ప్రపంచపు దారిలో 
అమ్మను వదిలి సాగిపోతున్నాడు ...

రెక్కలు వచ్చిన పక్షి గూడు వదలకుండా 
ఉంటుందా?

నీళ్ళు నిండిన నది సాగరం వైపు కదల కుండా ఉంటుందా?

భారం గా మారిన అమ్మతనం 
అశ్రు కణం గా మారి వెలికి రమ్మంటే 
నీ వ్యక్తిత్వానికి తగదు రాను అంటుంది...

ఏమి చెయ్యగలను .....ఇంక నా బాబు కోసం ...
ఆత్మీయతను,ఆశీస్సులను 
ఆ చిన్నారి రెక్కలకు బలం గా పంపటం తప్ప...."


విజయవాడ బస్ స్టాండ్ కు వచ్చిన తరువాత ,పుస్తకాల 
షాప్ లో ఒక పుస్తకం చూసి వాడికి నా గుర్తుగా కొనిచ్చాను.
అమ్మ గుర్తుకు వస్తే చదువుకో అని.దానిలో ఏముందో 
నాకు తెలీదు.కాని నన్ను ఆకర్షించింది.దానిలో కొన్ని పేజెస్ 
మీ కోసం .మరి అందరి ఆశీసులు మా వాడికి ఉంటాయని ఆశిస్తున్నాను .