Saturday 9 November 2013

అనగనగా ఒక మియావ్ ......


అంటే బుజ్జి పిల్లి అన్న మాట . 
ఇప్పుడు మీకు ఒక మంచి కధ  చెపుతాను . 
 నేను వ్రాసిందే . మీకు తప్పకుండా నచ్చుతుంది . 

బుజ్జి పిల్లి పిల్ల . అప్పుడే పుట్టింది . 
తల్లి పిల్లి మంచిది . బుజ్జి పిల్ల మంచిది . 
అయితే ఆ అమ్మ పిల్లి నోటితో దానిని   ఎత్తుకొని తీసుకుని పోతూ ఉంది . 
అప్పుడప్పుడు కొంచెం కళ్ళు తెరిస్తే బుజ్జి మియావ్ కి కింద 
దారి వెళుతూ  ఉంటుంది . లేకుంటే వెనక్కి వెళ్ళే చెట్లు . 
చిన్న పిల్ల కదా పూర్తిగా తెరవలేక కళ్ళు మూసేసుకుంటూ ఉంది . 
మళ్ళీ  తెరిచినపుడు కొంచెం తల ఎత్తి పైకి చూసింది . 
నీలాకాశం  దాని కింద కొంచెం అమ్మ మీసాల చివరలు .... 
మళ్ళా రెప్పలు ఆర్పి చూస్తే అమ్మ పిల్లి చెవుల చివర్లు .... 
తెల్లటి చెవులు వెలుతురు పడి  కొంచెం ఎర్రడాలుగా . 
అది వాళ్ళ అమ్మని చూడలేదు . అది తనను ఎత్తుకుపోతుందని తెలీదు . 
బుజ్జి పిల్ల మెల్లిగా శక్తి వస్తూ ఉంటె తోక ఊపుతూ చుట్టూ చూస్తూ ఉంది . 

భలే ఉంది కదా ... కధ . 

ఏమిటి నచ్చలేదా ?సరే ఇంకొంచెం చెపుతాను . 

మెత్తగా ఉండే బుజ్జి పిల్లి  పిల్ల ..... చిన్నగా మియాం అంటూ .... 
వాళ్ళ అమ్మ దానిని నోటితో తీసుకొని పోతూ ఉంది . 

చిన్న పిల్లి పిల్ల .... దానిని వాళ్ళ అమ్మ తీసుకుని పోతూ ఉంది . ఎక్కడికీ ? 

నచ్చలేదా ?ఇంతే కధ .... ముగింపు కావాలా ? 

అయ్యో ఇది నా కొత్త ప్రయోగం అండి . అన్నీ నేనే చెప్తే పాటకులు 
ఏమి చేస్తారు ?ఓ కొడుతూ వింటారా .... వాళ్ళ బుర్రలకు పని ఉండొద్దా ? 
అయినా నచ్చలేదా ? 
ఇదే కధ  మీ పిల్లల కు చెప్పండి . ఎంత నచ్చుద్దో !

ఒక బాబు అంటాడు ''బుజ్జి మియాం ని నా దుప్పట్లో పడుకోబెట్టుద్ది ''అని 
ఇంకో పాప అంటుంది ''నా సైకిల్ బుట్టలో పెట్టడానికి ''అని 
ఇంకో పిడుగు అంటాడు ''నా పుస్తకాల బ్యాగ్ లో పెట్టుద్ది . నేను మా 
ఫ్రెండ్స్ కి చూపిస్తాను ''అని .... ఇంకా బోలెడు ఎండింగ్స్ చెపుతారు . 

ఏమిటి ఇన్ని ఎండింగ్స్ ఉన్నా నచ్చలేదా ?మీ మేధావులతో ఇదే 
తల నొప్పి .... మీకు  నచ్చిన ఎండింగ్ చెపితే కాని మీకు నచ్చదు . 
సరే ఇంకొంచెం చెపుతాను . 

పిల్లి పిల్లకు కొంచెం శక్తి వచ్చింది . పరిసరాలు చూస్తూ ఉంది . 
మెల్లిగా కుడి వైపు బద్దకంగా పంజా ఇసిరి కొట్టింది . చిత్రం కింద ఉండే 
దారి కుడి వైపుకు వెళ్ళింది . అరె భలే ఉందే !అనుకుంది . 
ఈసారి ఎడమకు పంజా విసిరింది . చిత్రం ఎడమకు వెళ్ళసాగింది . 
కాసేపు ఎడమ కాసేపు కుడి ఇలాగా ఎన్నో సార్లు ప్రయోగాలు చేసింది . 
అరె నాకు ఎంత శక్తి నేను ఎటు కావాలి అంటే అటు వెళ్ళగలను . 
ఏమైనా చేయగలను !అనుకుంది . ఒక నిమిషం గమ్ముగా ఉంది . 
చిత్రం అది ఏమి చేయకపోయినా ముందుకు వెళుతూనే ఉంది అని 
గ్రహించింది . ఎడమ పంజా విసిరింది . అయినా చిత్రం ఎడమ వైపుకు కదలలేదు . 
బిత్తర పడిపోయింది . అయ్యో నా శక్తి ఏమైంది ?అనుకుంది . 
ఏమి చెయ్యాలి ?  గమ్ముగా కూర్చుంటే ఏమైనా అవుతుందేమో .... అని భయం 
వేస్తూ ఉంది . మళ్ళా ధైర్యం తెచ్చుకుంది . మెల్లిగా తల పైకి ఎత్తి 
చూసింది . మెత్తగా తన నడుమును పట్టుకొని ప్రేమగా ముందుకు 
చూస్తూ దృడంగా అడుగులు వేస్తూ ఏదో శక్తి ..... అర్ధం అయింది . 

ఆకాశాన్ని అంటుతూ అంతటా నిండి నిబిడీకృతమైన ఈ శక్తి ప్రతిబింబ మైన 
చిన్న అణువును నేను . నా ప్రమేయము నామ మాత్రమె . 
సురక్షితమైన గమ్యానికి చేర్చగల శక్తి వడిలో  ఊగే బుజ్జి పిల్లను నేను . 
ఈ ప్రయాణాన్ని గమనిస్తూ ఆనందిస్తూ అనుభవాలని ,జ్ఞాపకాలను పోగు 
చేసుకొని పరిపూర్ణ జ్ఞానం తో ఎదగడమే నేను చేయవలసినది . 

అంటే అది చక్కగా అమ్మ స్పర్శను అనుభవిస్తూ తన శక్తి కి గర్వపడకుండా 
చుట్టూ పరిసరాలను గమనిస్తూ ఆనందం లో మునిగిపోయింది . 

అరూపమైన ఇరుసులో నిలబడి చలించే ప్రాణికి గమ్యం తో పని ఏముంది ?
ప్రయాణం తో తప్ప ?
ఎక్కడికి వెళుతున్నామో అర్ధం అయితే ఆనందం . 
అర్ధం కాక పోతే మహదానందం ..... ఇప్పటికైనా కధ నచ్చిందా ? 

మనలో మాట గణపతి స్వామీ ''రమణి మహర్షి '' దగ్గరకి వచ్చిన భక్తునికి 
రమణ మహర్షి వైపు చూపుతూ ఇలా అన్నారంట ,
''మా తమ్ముడు వేయి రూపాయలు సంపాదిస్తున్నాడు ,నేను వంద రూపాయలు 
సంపాదిస్తున్నాను . నువ్వు పది రూపాయలు అయినా సంపాదించుకోవా ?''అని . 

మరి మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు ?ఒక్క సారి లెక్కలు చూసుకోండి !

Tuesday 5 November 2013

వుయ్ త్రీ వాచ్డ్ క్రిష్ త్రీ



అంటే ఏమిటి అంటే .... నిన్న ఈ సమయానికి నేను ,బాబు ,ఈయన 
క్రిష్ 3 చూస్తూ ఉన్నాము . అప్పుడు బాబు అమ్మా నువ్వు రేపు 
బ్లాగ్ లో వ్రాస్తావు కదా అప్పుడు ఈ పేరు పెట్టు అన్నాడు . పాపం ఈ రోజు 
విజయవాడ కి వెళ్ళిపోయాడు . ఈ పేరు పెడితే చదువుతాడు కదా కొంచెం 
అమ్మ మీద బెంగ ఉండదు అని వ్రాసాను . 



సినిమా మొదలు అయ్యేంత వరకు వాడు చాలా విషయాలు చెపుతూనే 
ఉంటాడు . ఈయన పక్కన కూర్చొని ఏమి మాట్లాడుతుంటారే నువ్వు 
పిల్లలు ఎప్పుడూ అని ఉడుక్కుంటూ ఉంటాడు . నాకు ప్రపంచం లో 
అన్ని విషయాలు చెప్పేసి జ్ఞాన దీపం వెలిగించాలి వీళ్ళ ఆత్రుత . 

క్రిష్ సినిమా నేను చూసాను . దానికి ముందు ''కోయి మిలేంగి '' అంట . 
నేను చూడలేదు . ఎలాగో క్రిష్ చూసిన వాళ్లకి ఇందులో పాత్రలు పరిచయం చెయ్యక్కర్లేదు . 
కొంచెం కధ  హింట్ ఇస్తే చాలు .  

రోహిత్ మెహ్రా సైంటిస్ట్ (క్రిష్ వాళ్ళ నాన్న ) సూర్య రశ్మి తో ఎండిపోయిన కొమ్మకి జీవం 
పోయాలని ప్రయోగం చేస్తూ ఉంటాడు .క్రిష్ ని ప్రియ ని పిలిచి ఆ ప్రయోగం చూపిస్తాడు . 
దానికి కావలసిన ప్రయోగం పరికరాలు ఒక పెన్నులో ఉంచిపెడుతాడు . ఆ 
ప్రయోగం చూడాల్సిందే సూపర్ . కాని ఆ చెట్టు బ్రతికి మాడిపోతుంది . ఎందుకంటె 
ఎక్కువ  శక్తి అందినది  . కావాల్సిన శక్తి ఇచ్చేలా ఫిల్టర్ తయారు  చేయాలి అనుకుంటాడు .  

ఈలోగా ఎక్కడో మంచు కొండల్లో డెన్ కట్టుకున్న విలన్ కొత్త వైరస్ ని పంపి 
మళ్ళా దానికి ఆంటి డోస్ అమ్ముతూ వ్యాపారం చేస్తుంటాడు . ఇక్కడ విలన్ 
గూర్చి కొంత ... తల తప్ప మిగతా బాగం చచ్చు బడి ఉంటుంది . రెండు చేతి 
వెళ్ళు మాత్రమె పనిచేస్తూ ఉంటాయి . తన ఆలోచనతో ఆ వేళ్ళతో లోహాలను 
అనుకున్నట్లు పగలు కొట్టగలడు . కైన సైటిస్ (ఈ పదం ఎక్కడో చదివాను 
.... రమేష్ చంద్ర మహర్షి అధినేత పుస్తకం లో .... పుస్తకం చాలా బాగుంటుంది ) 

సరే విలన్ పేరు ఖాన్ . ఈయన తన తెలివితో తన డి .ఎన్ . ఏ ,
జంతువుల డి . ఎన్ . ఏ కలిపి మనిషి లాంటి మృగాలు పుట్టిస్తూ ఉంటాడు . 
అవి వాటి శక్తులతో ఈయనకు సహాయం చేస్తూ ఉంటాయి . 
ఆయనకీ అంత తెలివి ఎందుకు వచ్చిందో ,అలా 
ఎందుకు నడవలేక పోతున్నాడో తెలీక తన డి . ఎన్ . ఏ ఉండేవాళ్ళు ఎక్కడైనా 
దొరికితే వాళ్ళ బోన్ మేరో తో తను నడవాలి అని వెతుకుతూ ఉంటాడు . 

చివరికి ఆ వైరస్ భారత్ మీద ప్రయోగిస్తే దాని ఆంటి డోట్ ని క్రిష్ రక్తం నుండి 
రోహిత్ తయారు చేసి దేశాన్ని రక్షిస్తాడు . తన రక్తం లేకుండా ఆంటీ డోట్ 
ఎలా తయారు చేసారు అని తెలుసుకోవడానికి తన మనుషులను పంపిస్తాడు 
ఖాన్ . ఆ ఫైటింగ్స్ అవన్నీ గ్రాఫిక్స్ లో చూడాల్సిందే . సినిమా హాల్ లో ఒక్కరు 
కూడా సీట్ కు ఆనుకొని చూడలేదు . సినిమా అంతా టెన్షన్ తో 
ముందుకు వంగి చూడటమే అందరు .
 చపట్లు కూడా బాగానే ఉన్నాయి . 

ఇంతలో ప్రియ కడుపుతో ఉంది అని తెలుస్తుంది . మా వాడు వెంటనే ''అమ్మా 
క్రిష్ ఫోర్ '' అన్నాడు . అబ్బ క్రిష్ ఫోర్ . బుజ్జిగాడు ఆంజనేయ స్వామిలాగా 
యెగిరి సూర్యుడిని మింగి చెట్లు విరిచేసి .... కాదు .... కాదు ... సాటిలై ట్స్ తో 
ఫుట్ బాల్ ఆడుతూ ,హరివిల్లు పై స్కేటింగ్ చేస్తూ ..... 
ఎవరైనా లక్ష కాదు కాదు రెండు లక్షలు ఇవ్వండి . నేను బాబు క్రిష్ ఫోర్ కధ 
వ్రాసి ఇచ్చెస్తాము . ఏమి హారీ పాటర్ వ్రాసిన రౌలింగ్ అమ్మే కదా ... 
నేను కూడా అమ్మను కాబట్టి వ్రాసేస్తాను . 

క్రిష్ పైనుండి వేలాడుతున్న ఒక బాబు ను రక్షించి ''నువ్వు కూడా క్రిష్ వే ''
అని చెప్పడమే కాక నా లాగా పై నుండి దూకకూడదు అని చెప్పడం బాగుంది . 

ఇక ఖాన్ ప్రియను ఎత్తుకొని పోయి రోహిత్ ద్వారా జన్మ రహస్యం తెలుసుకొని 
ఇంకా పాపం క్రిష్ డమాల్ చచ్చిపోతాడు . ఎలా బ్రతుకుతాడా ?అదే సస్పెన్స్ . 
వెళ్లి హాల్ లో చూడండి . మ్యూసిక్, గ్రాఫిక్స్, కధ ,కధనం అన్నీ బాగున్నాయి . 
పాటలు ఏమి పెద్ద బాగా లేవు . కాని మీ పిల్లలతో సినిమా భలే ఎంజాయ్ 
చేయోచ్చు . హాయిగా వెళ్లి రండి . జీవితం లో ఎప్పుడూ ఉండే పనులే కాని . 

(మనలో మాట సిట్టర్ లో కూర్చున్న బుజ్జి నెలల పిల్లాడి మీద ఎన్నో 
అంతస్తుల భవనం విరిగి పడుతుంటే అడ్డంగా క్రిష్ పడుకొని దాని బరువు 
తాను భరిస్తాడు . బాలివుడ్ వాళ్ళు కాబట్టి అందరు మెచ్చుకున్నారు కాని 
అదే మన బాలయ్య బాబు చేసుంటే మెచ్చుకుంటారా ?
అందుకే పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదూ అనేది )