Saturday 25 June 2011

కొత్త భార్య ....vs.....చెత్త సినిమా

అత్తగారింటికి వచ్చి బుద్దిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకొని ....
(అంత సీన్ లేదా ......గొణిగారంటే అమ్మ తోడు అడ్డంగా --------) 

సరే....సరే కూల్...కూల్....అంటారా...ok  కద లోకి వచ్చేస్తాను.
అప్పటికి మా అత్తగారింటికి వచ్చి వారం అయి ఉంటుంది. 
"ఏమండీ ఏమి తోచటం లేదు.సినిమా కి వెళదాము"అని అడిగాను.
మంచి కళ లోనే  ఉన్నారు వద్దులే అనలేదు.ఇప్పుడు టౌన్కి వెళ్ళలేము.
సరే ఈ ఊరిలో "పొట్టేలు పున్నమ్మ" సినిమా ఉంది పోదామా?
అన్నారు.సరే ఏమి చేద్దాము అప్పటికే మనం సినిమా ఆకలితో 
ఉంటిమి.ఆకలైతే సింహం గడ్డి కూడా తింటుంది అనుకోని 
(లాజిక్ అర్ధం కాలేదా.నాకు అర్ధం కాలేదు.కొంచం గొప్పగా ఉంటుందని 
వాడాను)
సరే పొట్టేలు నైనా చూడచ్చు అనుకోని వెళ్దామని 
ఒప్పుకొన్నాను.

సరే మాతో ఎవరైనా వస్తార మా తోటి?అని అందరిని అడిగితే 

ఎవ్వరు రామని చెప్పారు
(ఏదోలే మొహమాటపడుతున్నారు అనుకొన్నాను ముందుండే
విషయం  తెలీక )
కొంచం దూరమే కాబట్టి నడిచే వెళ్ళాము.
"నమో వెంకటేశా"పాటవేస్తున్నారు.
(పాటేమిటి?అంటారా ,ఆ పాట వింటే ఎక్కడి పనులు అక్కడ వదిలేసి పరిగెత్తాలి.లేకుంటే సినిమా నో ,ట్రైలర్స్ నో మిస్ అయిపోతాము)

 పర్లేదు not bad అనుకోని కుర్చీలో కూర్చొని చూస్తుంటే news reel 
మొదలైంది.ఇంకా మన పైనుండి ఎవరైనా పోతే కాళ్ళు తొక్కినా 
సరే పట్టించుకోకూడదు.సినిమా లోనే లీనమవ్వాలి లేకపోతే సినిమా 
అర్ధం కాదు.
(ఎందుకంటె ఆపరేటర్ లు వాళ్ళ ఇష్టం వచ్చిన 
దగ్గర కట్ చేస్తుంటారు పెద్ద సెన్సార్ బోర్డు లాగా)

సరే టైటిల్స్ వస్తున్నాయి చూస్తూ ఉన్నాను.టాక్.....మని 
సినిమా ఆగిపోయింది.
వెంటనే మా అయన వైపు ఒక లుక్ ఇచ్చాను.
పక్కకు తిరిగి కనుక్కొని "రీల్ తెగిందంట"నా వైపు 
తిరిగి చెప్పారు.సరే పొట్టేలు వచ్చేస్తే తమాషాగా ఉంటుందని
ఓర్చుకొని సినిమా లో లీనమయ్యాను.అందరు కనిపిస్తున్నారు గాని పొట్టేలు 
మాత్రం కనపడటంలేదు
(కొంపతీసి కాదు...కాదు....దానికి కొంప ఉంటుందా
...గడ్డి మేయటానికి వెళ్లి ఉంటుందా?)

మళ్ళ ఉన్నట్లుంది కళ్ళ ముందు చీకటి.ఇంకా మా వారి వైపు 
చూడాలన్నా చూడలేను.
(మా వారు మన కంటి చూపు మంట నుండి బతికి పోయారు)
పవర్ పోయిందంట.generator లేదు.

కొంచం సేపు చీకటి కి అలవాటు పడేసరికి పవర్ వచ్చేసింది.
మా వారు చాల సంతోష పడిపోయారు.ఎందుకంటె పవర్ రాకపోతే 
పాస్ లు ఇచ్చి పంపుతారు.మళ్ళా రేపు వచ్చి చూడాలి.
(రేపు రావటమా బాబోయ్?)

సరే ఆడవాళ్ళకు ఓర్పు ఉండాలి శశి  
అని నన్ను నేనే సముదాయించు కొని భర్త కోసం ,పొట్టేలు 
కోసం ఓర్పుగా సినిమా చూస్తున్నాను.

సినిమా బాగానే జరుగుతుంది గాని పొట్టేలు వచ్చే టైం కి 
ఏదో ఒకటి.సినిమా లో శ్రీ ప్రియ అంటూ ఉంది నా పొట్టేలు వచ్చిందో 
చూస్కో నీ సంగతి అని..
.(అమ్మయ్యా ..నా పొట్టేలు వస్తూన్దోచ్ )

అంతే మళ్ళ సినిమా డమాల్.....రీల్ మార్చాలంట.
single ప్రొజెక్టర్ కదా.రీల్ మార్చినపుడల్లా కొంత సినిమా కట్ 
చేస్తారు టైం కలిసి రావటానికి.

మళ్ళ పొట్టేలు కద నుండి గడ్డి కోసం పరారే.....
నేనేమో దాని కోసం  waiting ఇక్కడ.

మా వారు వెంటనే కూల్ చేయటానికి డ్రింక్ తెచ్చి తంటాలు 
పడుతున్నారు.పతివ్రతని కాబట్టి మరీ ఆయనను అంత యేడిపించ
కూడదని చాల ఓర్పుగా పొట్టేలు వచ్చే దాక సినిమా చూస్తానని 
చిరు నవ్వు అతికించుకొని మరి చెప్పేసాను.

అలా....అలా...మూడు ఇంటర్వెల్స్...ఆరు పోప్కార్న్స్....
అయిన తరువాత........అబ్బ అదిగోండి పొట్టేలు ............
హయ్యా.........అనుకోని గంతు వేసేలోపల దాని పక్కనే 
కనిపించిన్దోకటి..............................
ఏమిటా?..............శుభం 

  కొత్త భార్యని అలాంటి సినిమా కి తీసుకెళ్ళి నందుకు ఇప్పుడైతేనా 
A.K నే (A.K.అంటే అప్పడాల కర్రా ......మీకెవరు చెప్పారు?
ఓహో ....అనుభవమా?)

క్జ్దెఅ ౪౫౭౮౫ వస్ర్వ్దుఇ  ౯౬౮౪౩౨౫౭ జేశ్ర్ఫర్డు  ౫౪౨౮౭ ధేఅనే  ....
(ఏమిటి అర్ధం కాలేదా?మా వారిని  తిట్టాను మీకెందుకు 
అర్ధం కావాలి పెద్ద?)

మరి ఈ అలక ఎలా తీరిపోయిందా?    

అద్దం మీద ఆవగింజ ఎంతసేపు ఉంటుంది?
వలపు గాలి విసురుగా వీచేవరకే......... 

సూపర్ మంత్రం ఇది.

మగవాళ్ళు A .k  నుండి తప్పించు కోవాలంటే నూరు సార్లు 
జపించండి.

ఆడవాళ్ళు వలపుల బంధం నిలుపుకోవాలంటే నూట ఒక్క 
సార్లు జపించండి.

ఏది ఒక సారి అనండి......జై పొట్టేలు.....జై జై పొట్టేలు......


Sunday 19 June 2011

వింటారా మల్ల ..మస్తుగుంటై కదలు...

ఒక నొక రోజు నేను మా అత్తగారింట్లో మా పాప (8 నెలలు)
తో  ఆడుకుంటూ ఉన్నాను.ఉన్నట్లుండి ఎదురుగా మా అమ్మ ,
నాన్న ప్రత్యక్షం
(అంటే ఆకాశం నుండి రాలేదు మీరలా మాట్లాడితే చెప్పనంతే) 

మా నాన్న అయితే చాల చాల సంతోషంగా ఉన్నారు.
ఇక ఇంట్లో అందరు వచ్చేసారు విషయం తెలుసుకోవాలని.

(ఎవరు ఎవరు వచ్చారో  చెప్పమంటారా?వద్దా తెలుసా?)

విషయం ఏమిటంటే నేను పాపను తొమ్మిదో నెల ప్రెగ్నెంట్ 
గా ఉన్నపుడు హైదరాబాద్ వెళ్లి జాబ్ కోసం ఒక state level 
పరీక్ష వీర లెవల్లో రాసి వచ్చామనమాట.మనము ఏమి పోడిచామో
తెలీదు కాని వాడు దెబ్బకు బయపడి జాబ్ ఇచ్చేసాడు

(అసలు అప్పుడు మనకు జాబ్ అవసరం.ఎందుకంటె మేమిద్దరం 
బుద్దిగా BEd రిజల్ట్స్ కూడా రాక ముందే పెద్ద వాళ్ళ మాట విని పెళ్లి చేసుకోన్నాము.
మా మామగారికి ఆయనకు అన్ని షాప్ లు ఉన్నాయి కాని 
బట్టల షాప్ లేదని అది మా చేత పెట్టిచ్చాలనుకొన్నారు.
మేమేమో కొంచం నీతి ,నిజాయతి రకాలమి షాప్ తప్పించుకోవాలంటే 
జాబ్ రావాల్సిందే.) 

అవును పే....ద్ద లెవెల్ లో ఉద్యోగం 
తెచ్చుకొన్నా కదా కధకి ఊ..కొట్టక పోతే పోనీ శేబాష్ శశి అన వచ్చు కదా.

జాబ్ వచ్చింది కదా సమస్య లేదనుకోన్నారా?
అసలు సమస్య ఇప్పుడే ......ఈ  నిముషమే స్టార్ట్ అయింది.....


(అబ్బ ఏమి లేదండి.ఈ కధలో అన్ని రసాలు ఉంటాయి.
మీరన్ని తాగొచ్చు,కాని బయానక రసం లేదు దాని కోసం అలా రాసాను)

మేమేమో మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ కి క్రింద సముద్రం దగ్గర 
నెల్లూరు లో ఉన్నామా?జాబ్ ఏమో పైన వరంగల్ లోని 
హనుమకొండ లో వచ్చింది.ఎలా పంపాలి మమ్మల్ని అది ప్రాబ్లం.

(ఏమిటి అందరు ముక్కు మీద వేళ్ళు వేసుకొన్నారు తీయండి 
పెద్ద అప్పట్లో అది చాల దూరం లెక్క)

సరే మన ప్రయత్నం మనం చేయాలి కదా అని మా నాన్న ,మా వారు 
నేను హైదరాబాద్ వెళ్లి మంత్రుల ఇళ్ళు అన్ని ఒక రౌండ్ 
వేసాము.మనకు నూకలు హనుమకొండ లో రాసుంటే 
వాళ్ళెందుకు దొరుకుతారు?అందరు వినాయక చవితి 
నిమజ్జనమని దొరకనే లేదు.ఇంకేమి చేస్తాము దిగులు పడుతూ 
తిరుగు రైలు ఎక్కేసాము 
"ఆ పల్లె లో ఎలా ఉండాలో ఏమిటో అని మాట్లాడుకుంటూ "ఉన్నాము.

అప్పుడు పక్కన ఒక ఆయన మాకు జ్ఞానోదయం చేసారు.
(వెనుక వేలుతురుందా చూడలేదు)
"అరె ఏమి అంటున్నారు మీరు హనుమకొండ అంటే వరంగల్ 
అదేమీ పల్లె గాదు"అన్నారు.
దెబ్బకి మా కళ్ళుదబ్బున విచ్చుకొని వెంటనే  ఇంటికి వచ్చేసి 
మూట ముల్లె సర్దుకొని  హనుమకొండ లో జాబు లో చేరిపోయాను.
పాపం ఆ రోజే విద్యార్దినిలు కి  అదృష్టం స్టార్ట్ అయిందని 
నా ఫీలింగ్.ఎందుకంటె మన లాంటి మంచి టీచర్ దొరికింది కదా

(వాళ్ళు వేరేగా ఆలోచించారా?మీకెవరు చెప్పారు?)

పాపం వారం రోజులు వదలకుండా వాళ్ళ బుర్రలు నింపేశాను.
వాళ్ళు ఇంటికి ఉత్తరాలు వ్రాస్తే మేము చదివి పోస్ట్ చేస్తాము.
అది వాళ్లకు తెలీదు.వాళ్ళైతే ఇక్కడ  మాకు కొత్త టీచర్ వచ్చింది 
గాని ఏమి అర్ధం అవుత లేదు మల్ల అని వ్రాసున్నారు.

విషయం ఏందంటే మన బాష వాళ్లకు అర్ధం కాదు.మనకు కూడా వాళ్ళ 
బాష అర్ధం కాదు.వాళ్లకి లెక్కలలో తీసివేతలో అప్పు తెచ్చుకుంటే 
అంటే అర్ధం కాదు.ఎమనాలా?దస్కం తెచ్చుకోండి అనాలి.

వెంటనే ఆ ఉత్తరాలు చదివి నాకు బోల్డు రోషం వచ్చింది.
వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి ,బాష ని భాష తోనే సేబాష్ 
అనిపించుకోవాలి అని గాట్టిగా ......మనసులు అనుకోని 
ఆ రోజు నుండి వాళ్ళ బాష జాగ్రత్తగా వినేదాన్ని.అంతా విని 
అర్ధం కాకా పోతే మళ్ళ ఆ......అనేదాన్ని. మళ్ళా మొదటినుండి 
అంతా చెప్పేవారు.

ఒక సారి maingate లోని చిన్న గేటు తీసుకొని స్కూల్ లోపలి కి 
వస్తూ ఉన్నాను.ప్రిన్సిపాల్ ఏదో అరిచి చెప్పింది.పాట అనేది వినపడింది.
మనల్ని పాట పాడమంటుంది అనుకోని బోల్డు ఆనంద పడిపోయాను.
(మరి అడిగి పాటలు ఎవరు వింటారు )పాడపోయి ఎందుకో ఆగి 
మరలా ఆమె వైపు చూసాను. ఈ సారి పెద్దగా చెప్పింది ,
పాటక్ పెట్టు అని.నా కర్ధం కాలేదని ఆమెకి అర్ధం అయింది .
దగ్గరకు వచ్చి తలుపు గడియ వేసింది.
పాటక్ అంటే అదన్న మాట.

ఇంత కష్టపడి నేను వాళ్ళ బాష నేర్చుకొంటుంటే వాళ్ళు నా గూర్చి 
ఏమనుకొన్నారో తెలుసా?నాకు చెముడని,వినపడదని.

(అంతే జరగాలి బాగా జరిగింది అనుకుంటున్నారా?)

ఆశ,దోశ ,అప్పడం ....రమ్మని, అందరు  నేను బాగా చెపుతున్నానని 
మెచ్చుకున్నారు తెలుసా.ఇంకొన్ని రసాలు ఈ సారి ఎందుకంటె 
juice తయారుచేస్తున్నాను

Saturday 11 June 2011

శ్రమకు శాల్యూట్

చేతి నుండి నోటికి చేరే ప్రతి ముద్ద కు 
రుచి చేర్చినది ........ఆ చిన్నారి చేతులే

మీ ప్రగతి బాటల ఆధార అణువు
ఆ స్వేదపు చుక్కదే..........
 
మీ ఆనందపు అలల సవ్వడి 
ఆ కలల బలిదానం పైనే .......

ఆర్దిక ఆశల హర్మ్యాలు 
చిన్నారి రెక్కల శ్రమయే ........
సృజించిన కొత్త విజ్ఞానం 
బాలల హక్కుల దోపిడీ నించే.......

ఎన్ని ఆశలు రెక్కలు తెగిపోయి 
 రాలి పడ్డాయి 
ఎంత బాల్యం బందీలుగా 
సంకెళ్లకు కట్టబడింది 
ఎన్ని నవ్వులు స్వార్ధపు 
ఆలోచనలకు అమ్మబడ్డాయి 
ఎన్ని కన్నీటి చుక్కలు 
ఎర్రగా మారి పరుల సుఖానికి 
పాటు పడ్డాయి...........

రాజీవ్ విద్య మిషన్ ట్రైనింగ్ మొన్న జరిగింది.
ఎప్పుడు మాకు గణితం ఎలా బోధించాలా అని 
చెపుతూ ఉంటారు.కాని ఈ సారి వెరైటీగా బాలల 
హక్కులు ఏమిటి ?వాటిని కాపాడటానికి టీచర్స్ 
ఏమి చేయాలి చెప్పారు.ఇప్పుడుప్రపంచ బాలల 
కార్మికవ్యతిరేక  దినోత్శావం సందర్భంగా అవి మీకు చెపుతాను 
ఏమిటి వద్దా?కుదరదు వినాల్సిందే.

అసలు లెక్కల వాళ్లకు సోషల్ ,హక్కులు చెపుతుంటే 
నాకు ఎట్లుందో తెలుసా?తూనీగ రెక్కలు కట్టేసి చరిత్ర లో 
ఫెవికాల్ తో అతికించి నట్లుంది.పోలిక బాగాలేదా?

అయినా సరే మీరు తెలుసుకొని మీ పిల్లలికి ,మీ చుట్టూ 
ప్రక్కల పిల్లలికి ఈ హక్కులు మనిషిగా ఇవ్వాల్సిందే.
విశ్వ ఋణం తీర్చుకోవాల్సిందే......మీ మనుగడ కాపాడినందుకు.
          
            1 .Right to life
            2. Right to protection
            3. Right to development 
            4.Right to participation 

సేవకు ఒక జీవితం,సంపాదనకు ఒక జీవితం మనకు 
ఇవ్వదు విశ్వం.మనం ఎంత సంపాదిస్తున్న మనం సేవ చేయాలనుకొంటే ఎలాగైనా చేయవచ్చు.
మంచి హృదయం ఉండాలంతే.
కనీసం మీ ఊరి స్కూల్లో పిల్లలను చేర్పించి 
విద్యా రంగపు అభివృద్ది లో పాలుపంచుకోండి.
బాలల హక్కులు కాపాడండి.

నాకు చిన్నప్పుడు radio లో నేర్చుకొన్న పాట
గుర్తుకు వస్తుంది.

"హం చలేంగే సాత్ ...సాత్ ...
హం చలేంగే సాత్ ...సాత్ ...
 హం చలేంగే సాత్ ...సాత్ ...ఏక దిన్.......

ఓహో ....మన్ మే హై విశ్వాస్ .....
పూరా హై విశ్వాస్......................
హం చలేంగే సాత్ ...సాత్ ......ఏక్ దిన్ ......

Friday 10 June 2011

ముందుంది ముసళ్ళ పండగ

హాయ్ ఏమిటి చదవాలని చాలాహుషారుగా ఉన్నట్లున్నారే?
అవునూ....ఇంతకి ఈ సామెత ఎలా వచ్చిందంటారు?
తెలిస్తే కొంచం చెప్పవచ్చు కదా మీలో ఎవరైనా........

మళ్ళి long long  ago నే................................
మా పెళ్ళైన తరువాత అక్కడ వ్రతాలు ,పూజలు ఇక్కడివి 
నిద్రలు అన్ని అయినాక ఒక మంచి రోజు చూసుకొని 
మా మామగారు వచ్చి నన్ను వాళ్ళింటికి తీసుకు 
వెళ్ళారు .ఎంత బుద్ధిగా వెళ్ళానో తెలుసా?వాళ్ళు 
కూడా మంచి అమ్మాయి అనుకోని ఉంటారు.

(ఏమిటి  అల్లరి పిల్ల అని తెలుసుకొని నాలిక కరుచుకొని 
ఉంటారా.మీరు మనసులో అనుకొన్నది వినిపిస్తుందిలే)

 అలా వాళ్ళ ఊరికి వెళ్లేసరికి అందరు మన కోసం 
ఎదురు చూస్తున్నారు.ఈయనైతే సెలవు పెట్టి మరీ 
(ముందుంది ముసళ్ళ పండగ అని తెలీదుగా మరి)

ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఎంత మంది ఉండేది చెప్పాలండి.
(చెప్పొద్దా?అదంతా జాన్తానై వినాల్సిందే)
మా అత్తగారు,మామగారు వాళ్ళ నలుగురు కొడుకులు ,
ఒక అమ్మాయి (ఇంతేనా అంటారా?)మా అత్తగారు వాళ్ళ 
అమ్మ ,చిన్న అత్తగారు ,మా తోడుకోడలు వాళ్ళ పాపా,
(ఇంతేనా అంటారా?)ఇంకా వాళ్ళ వాళ్ళలో చదువు కోసమని 
ఇంకో మరిది వచ్చే పోయేవాళ్ళు ఇంట్లో ఎంత మందో 
చూసుకోండి.మా వారు రెండో వారు కాబట్టి ఇంకా మిగిలిన 
ఇద్దరు మరుదులుకి,చెల్లిలికి అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు.
 (మా అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ, నాన్న ముగ్గురు ఆడ పిల్లలము ఇంకా ఒక తమ్ముడు అంతే)

నేను వెళ్ళగానే వాళ్ళ ఇంట్లో సందడే సందడి.
మా వారు హ్యాపీ గా నవ్వుకుంటున్నారు ఆ సందడి చూసి.
మా తోడుకోడలు ,ఆడ బిడ్డ వాళ్ళు అల్లినవి ,paint 
వేసిన చీరలు చూపిస్తున్నారు ఎలా ఉన్నాయని?
(మనం అప్పుడు all in one లెండి.అప్పుడు అమ్మాయికి 
పని ముద్దా ?పాట ముద్దా?అని అడిగేవారు.
ఇప్పుడు system ముద్దా?software ముద్దా ?అని అడుగుతున్నారు)

హ్యాపీ గా ఉంది కదా .మొసళ్ళ పండగేమిటిఅంటారా? 
wait and see .

రాత్రి ఏడు గంటలదాకా అలా హుషారుగా గడిచింది.
అప్పుడు చపాతిలు చేస్తున్నాము.నేను పాముతుంటే 
వాళ్ళు కాలుస్తున్నారు.అప్పటికి నా మొహంలో 
రంగులు మారిపోయి దిగులు మేఘాలు వచ్చేసాయి.
మా అక్క చూసింది.ఏమైంది శశి ?కళ్ళు నిండిపోయాయి 
మీ నాన్న గుర్తుకు వచ్చాడా?అంది ఇంక చూసుకోండి 
వరద గోదారే కళ్ళలో .అన్ని వదిలేసి మిద్ది మీదకు వెళ్ళాను.

(ఇప్పటికైనా చపాతి చూస్తే నాన్నే జ్ఞాపకం.ఆయన అంతే 
నేను వస్తున్నానంటే చపాతి,vegitable కర్రీ కి అన్ని తెచ్చి పెట్టేస్తారు.
ఏమిటి మీకు కొంచం పెట్టాలా?అవతల నేను ఏడుస్తుంటే )

ఇంక ఇంట్లో అందరు నా వెనుకే.నేను ఎక్కిళ్ళు తప్ప 
ఏమి చెప్పక పోతిని .అప్పట్లో ఫోన్ ఉంటె గొప్ప.పైగా 
trunkbooking  చేయాలి.మగవాళ్ళంతా ఫోన్ దగ్గరే.
line కలిసి మా నాన్న మాట్లాడగానే బావగారు,మామయ్య 
మరుదులు అందరు పరిగెత్తారు
"మీ నాన్న మాట్లాడుదువురా "అని.
ఒక్క సారి ఫోన్ ఎత్తుకొని ఓఓఓ ......అని ఏడ్చేసాను.

ఇక్కడ వాళ్లకి గుండెల్లో జన శతాబ్ది పరిగేత్తినట్లు 
గుండె కొట్టుకొంటుంది(ముఖ్యంగా ఈయనికి )
మా నాన్న కాసేపు ఓదార్చి "రేపు వస్తాను"
అని మాటిచ్చి పెట్టేసారు.

వీళ్ళంతా హమ్మయ్య అనుకున్నారు.మా అత్తగారు 
పెరుగన్నం కలుపుకొని వచ్చి తినమ్మా అనింది.
కొంచం తిని ఏడుస్తూనే వెళ్లి పడుకొన్నాను.
పాపం ఈయన తిన్నారో లేదో (నేను ఏడుస్తుంటే 
ఎలా సహిస్తుంది పాపం)నేను నిద్ర పోయిన చాల 
సేపటికి హమ్మయ్య అనుకోని నిద్రపోయారనుకొంటా.
(అప్పుడు ఇగో లు అవి లేవండి.ఒకరు ఏడిస్తే ఇంకొకరు 
బాద పడటమే)

ఉదయం దొడ్లో తులసి కోట దగ్గర పూజ చేసుకుంటూ 
ఉన్నాను.వీధి వాకిలి దగ్గర ఇంకెవరు ?మా నాన్నే .
అసలైతే పెద్ద ఇల్లు రైలు పెట్టెల లాగ.వీధి వాకిలి 
దగ్గర ఎవరైనా ఉంటె పరిశీలనగా చూస్తే కాని కనపడరు.

అసలు నన్ను ఒక వైపు ,మా నాన్న ని ఒక వైపు 
ఉంచి పరుగు పందెం పెడితే గోల్డ్ మెడల్ ఖాయం.
(ఇప్పుడు olympics కి వెళ్ళమంటారా ?మా బంగారాలే)

ఇంక మా నాన్న తో మా పిన్ని కూతుర్ని(నాలుగేళ్ళు)
మామ కూతుర్ని తీసుకొచ్చారు.అంటే ఊరు మొత్తం 
నా కోసం తేలేరు కదా.వాళ్ళతో ఆడుకోనేదాన్ని పెళ్లి 
కాకముందు.
ఇక చూడండి మా నాన్న దగ్గర కూర్చుని కబుర్లే కబుర్లు.
మిగతా వాళ్ళంతా ఆయనకు మర్యాదలు చేస్తున్నా నేను 
మాత్రం లేవలేదు లేస్తే ఎక్కడ వెళ్ళిపోతాడో అని.
"నిన్న మధ్యాహ్నం అన్నం తిన్నావా ?"అడిగాడు నాన్న.
"తిన్నాను.అత్తమ్మ గోంగూర పచ్చడి కలిపి పెట్టింది"
(కలిపి పెట్టటం ఏమిటా?అసలు మీరు ఎపుడూ అలా
తినలేదా?నాన్న ,పిల్లలం అమ్మ కలిపి పెడితేనే తినేది 
అలవాటు.చివర గుజ్జు కోసం అందరం కొట్టుకుంటాము.
అసలు తోడ బుట్టిన వాళ్ళతో కలిసి తింటే రుచి పెరుగుతుంది.
కావాలంటే తిని చూడండి)

ఇక మా వారికి అయితే మా నాన్న తో మాట్లాడుతున్నారు 
కాని గుండె గుండెలో లేదు.నేనెక్కడ ఊరికి వెళ్లి పోతానో 
అని.(మనం కొంచం మొండి రాక్షసి)

ఇక మా నాన్నకి పరిస్థితి అర్ధం అయింది.నేను ఉండను 
అంటానని.ఆ మాట అనక ముందే "సురేషు నువ్వు 
ప్రతి ఆదివారం ఊరికి  అమ్మాయిని తీసుకురా కొన్ని 
రోజులు"అన్నారు.మా వారు నేను ఉంటానంటే 
ఎలాంటి షరతులకైనా సిద్దంగా ఉన్నారు.అల్లాగే 
మామయ్యా అని గట్టిగా మాటిచ్చారు.

మా నాన్న వెళ్లిపోతుంటే దిగులుగా చూస్తూ 
ఉండిపోయాను.మా వారికి నా దిగులు తీర్చేసరికి 
బహుశా అందరు దేవతలు కనపడి ఉంటారు.

ఏమిటి ఆడ పిల్లలు ఇంత దిగులు పడతారా అంటారా?
మీకు మూడు సమాధానాలు చెపుతాను మీరు ఎలాంటి వాళ్ళు 
అయితే ఆ సమాధానం చదువుకోనండి.

1 .మీకు అమ్మాయి ఉంటె

మీకెలాగో తెలుసు "పుట్టగానే పూవు పరిమళిస్తుంది.
పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది"మీకేమి చెప్పను 
అవసరం లేదు.

2 .మీకు అమ్మాయి లేకపోతే
మీరో ఒక పని చేయండి.ఒక మొక్కని నాటండి.
ఇరవయ్యి ఏళ్ళు బాగా పెంచండి.తరువాత పీకి 
ఇంకో దగ్గర వేయండి.అది ఎలాగా ఉంటుందో 
ఆడపిల్లలు అంతే.

3 .మీకు పెళ్లి కాకపోతే
అయితే మీరు మీ గుండెల్లో కొంచెంచోటు,
బోలెడన్ని kerchiefs తీసి పెట్టుకోండి.
ఎందుకు అంటారా?






ముందుంది మొసళ్ళపండగ      

Sunday 5 June 2011

నేను ఎంత ఇవ్వాలనుకొన్నాను మీ కోసం.......

నేను ఎంత ఇవ్వాలనుకొన్నాను మీ కోసం.......

స్వచ్చమైన గాలి తో వళ్ళంతా నిమిరి 
మీ హృదయకుహరం లో ఆరోగ్యపు ప్రతిష్ట చేద్దామనుకున్నాను 

మంచి నీళ్ళ అలలలో ఉరకలేయించి 
సంతోషపు పడవలో తిప్పుదామనుకున్నాను 

 పసిపాపలా దుమ్ములో పొర్లించి 
మనసులోని కల్మషాలు కడిగివేయాలనుకొన్నాను

వెచ్చని అగ్ని ని రగిలించి చైతన్యాన్ని 
కలిగించి మరో లోకపు వింతలు ఆవిష్కరింప 
చేయాలనుకొన్నాను 

అంబరాన్ని మీకు పూబాటగా చేసి 
అపరిమిత జ్ఞానాన్ని  ఇవ్వాలనుకొన్నాను 

 నా అంతట మీరే అయి పూలతో ,చేలతో 
నేలతో, గాలితో మమేకమై జీవిస్తుంటే 
సృష్టి సార్దకమైంది అని సంతసిల్లాలి అనుకొన్నాను 

మీరేమి చేసారు?.....................................................

ఈ క్షణపు సుఖం  కోసం 
మీ రేపటిని బలి చేసారు............

స్వార్ధపు ఆశల కోసం 
సకలాన్ని చంపుకొన్నారు..........

ఆరోగ్యాన్ని బలి పశువును చేసి
అమ్మ లాంటి ప్రకృతిని అమ్ముకొన్నారు.........

కరిగిన కల ,ఎండిన నేల
కాలుష్యమే నలువైపులా 
ఇదే మీరు గీచిన నా ఈనాటి చిత్తరువు.....

ఈ రోజు పర్యావరణ దినోత్శావం సందర్భంగా .........
మరి మీరేమి చేస్తారు?ప్రకృతి ఇచ్చినవన్ని అనుభవిస్తున్నారు 
కదా.దానిని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది.

అది అందరి పని నా ఒక్కడిది కాదు అంటారా?

 నిజం గా ఏమి చేయలేరా?మీ తెలివితో ,హృదయం తో 
ఆలోచించండి. 
కనీసం plasticcovers కి బదులు clothbags వాడటం,
నీళ్ళను పొదుపు చేయటం,
అన్నాన్ని వృధా చేయకుండటం,
నీ వ్యాపార అవసరాలలో కొంత వరకైనా ప్రకృతి కి 
హాని కలిగించకుండటం
మీ ప్రక్కన మీ సహచరిగా చిన్న మొక్క 
ఉండేటట్లు చూసుకోవటం.......
ఏదో ఒకటి మీరు చేయగలిగినది...........

ఎప్పుడైనా మీరు నిజంగా మంచి పని చేసాము అనుకొంటే 
మీ కుడి చేయి ఖాళీగా ఉందా?
ఎందుకు అంటారా ?

ఉంటె దాంతో మీ ఎడమ బుజం మీద తట్టుకోండి 
శేబాష్........శేబాష్......శేబాష్.........అని.........

 

Friday 3 June 2011

వీణా వాదన...అరణ్య రోదన..

  "నేను లేక వీణ పలుకలేనన్నది 
   నేను లేక బ్లాగు నిలవలేనన్నది"
అందుకని అమ్మా వాళ్ళ ఇంటికి వెళ్లి త్వరగా వచ్చేసానన్న మాట.
మీకోసం వీణ కధ తెచ్చేసా.ఏమిటి అలా చూస్తున్నారు ?
violin పోయే.......వీణ వచ్చే డాం ....డాం....డాం.....
అలా  అడిగి చెప్పించుకుంటారు కాబట్టే మీలో ఎందరో 
మహానుభావులు కనిపిస్తున్నారు......

                  ఆ రోజు                 

 ఒక రోజు పాత violin పోస్ట్ తప్పులు ఎడిట్ చేస్తూ
పిల్లలికి అన్నం పెట్టి వద్దామని signout చేయకుండా 
వెళ్లాను.అప్పుడు...ఆ క్షణాన...ఏం జరిగిందంటే....
ఏమి జరిగిందంటే..............................


ఏమి జరగలేదులే.మా వారు వచ్చి 
ఆ పోస్టింగ్ చదువుతూ కనిపించారు
(ఏమంటారో అని నాకు suspence మీరెందుకు ఆలా 
monitor దగ్గరగా రావటం .ముక్కు తగులుతుంది జాగ్రత్త)

ఆయన చదవటం అయిపోయినాక ..................................

(ఏంటి పెద్ద...తిట్టారా?తిట్టారా?అని అడుగుతారు.
ఏమి పొగిడారా?అని అడగవచ్చుగా కుళ్ళు)

ఏమి తిట్టలేదు ,ఏమి పొగడలేదు ఓఒహ్.....చిన్నగా నవ్వుతూ
నవ్వుతూ ..............ఏమి శశి వీణ గూర్చి వ్రాయలేదే అన్నారు?
(ఈ పోస్టింగ్ వ్రాయటానికి కారణం ఆయననితెలుసుకొని  
అయన మీద ఎవరో పళ్ళు నూరుతున్నారు.
ఎవరో నాకు తెలియాలి అప్పుడు ............
ఏమి చేస్తానా?ఇంకా నిర్ణయం తీసుకోలేదు.) 

ఇప్పుడు ఇంకో కారణంచెపుతా.
ఎంత బాగా చదివే blogviewers దొరికారు.
నా జన్మ ధన్యం అయింది.

28 తేది రాత్రి అమ్మ నాన్నల మధ్య కూర్చొని దూరదర్శన్ 
hyd చూస్తున్నాను.(అదే మా ఇంట్లో అయితే  pogo మారిస్తే
పిల్లలు ఒప్పుకోరు)
ఆహ వీణ పాటల మీద programme ఎంత హాయిగా ........
కాసేపు నాన్న పై వాలుతూ,అమ్మ వడిలో తూలుతూ 
వీణ పాటలు వింటూంటే....(నా మాట విని మీరుకూడా 
కాసేపు పెద్దయిన సంగతి ,ఉద్యోగం సంగతి మరిచిపోయి
మీ అమ్మ,నాన్నల మధ్యన  గడిపి రండి...బతుకు పై తీపి
భవిష్యత్తు పై ఆశ రాకపోతేచూడండి .......రాకపోతే ఏంటి అంటారా?
నాకు వీణ లేదు లేకుంటే ఇచ్చేద్దును.....)

"పాడెద నీ నామమే గోపాల హృదయములోనే 
పదిలముగానే నిలిపితి నీ రూపమేగా......"
పాటల విశేషాలు ,పాటలు మధ్యలో అమ్మ ,నాన్న వాటి గూర్చి 
చెప్పే కధలు (మీకు కూడా వినాలనుందా?)

"సుందరాంగ మరువగలేనోయ్ రావేలా ...
నా అంధ చందములు దాచితి నీకై రావేల..."
వైజయింతి మాల ఈ పాటతో శ్రీలంకకి వెళ్లిందట అమ్మ 
చెప్పింది.

"సఖియా వివరింపవే...వగలెరిగిన చెలునికి 
నా కధ..........."
సావిత్రి అందమే అందం చూడు అన్నారు నాన్న.
 పతివ్రతలను ఏడిపిస్తే ఏమవుతుంది చూడు అంది అమ్మ.
(వాళ్ళిద్దరిని అటు ఇటు తల తిప్పుతూ చూస్తూ వింటూ ఉన్నాను.) 





పెద్ద అన్ని anr పాటలే వేశారు. ntr పాటలే వేయలేదు 
పోనిలే సావిత్రి ఉంది కాబట్టి క్షమించేశా .

ఏంది నా వీణ కధ కావాలా?
 అబ్బ ఎంత మంచి వాళ్ళో అడిగి మరి చెప్పించుకుంటున్నారు.
అప్పుడు మేము వరంగల్ లో ఉండే వాళ్ళం.మా స్కూల్ కి 
కొత్తగా వీణ టీచర్ వచ్చింది.ముగ్గురు టీచర్లము  వీణ
నేర్చుకోవాలని ఆమెను అడిగాము.ఆమె సరే ఒక్క వీణ ఉంది.
ఒక్కో వారం ఒక్కొక్కరి ఇంట్లో ఉంచుకొని సాధన చేయండి.
నేను అప్పుడు అప్పుడు నేర్పిస్తాను అన్నారు.

నేను వెంటనే వీణ పట్టుకొని ఫోటో తీయించుకొని 
మా అత్తగారింటికి పోస్ట్ చేసాను.నేను వీర లెవల్లో 
నేర్చేసుకున్నానని అనుకొని సరస్వతి దేవిలా
ఉన్నానని మా మరుదులు మెచ్చుకుంటూ ఉత్తరం వ్రాసారు.
(అప్పటికి జస్ట్ సరిగమ వచ్చు అంతే.
ఆ ఫోటో ఇక్కడ పెట్టొచ్చు కాని నా సాదనా 
భాదితులు నన్ను గుర్తిస్తే తన్నే ప్రమాదం ఉంది)

ఎంత అన్యాయం నన్ను చూస్తేనే అందరికి కుళ్ళు.
నేను వేరే వాళ్ళింట్లో సాధన చేస్తుంటే వాళ్ళ పక్కింటివాళ్ళు 
వచ్చి ఆ మేడం ని అడిగారట.(నేర్పమని కాదు.)

"ఏందండీ ఎప్పుడు వాయిస్తూవుంటే మేము 
ప్రశాంతంగా ఉండొద్దా?"అని.నేనే అప్పుడు వాయించానని
ఇప్పటికి నేనెవరికి చెప్పలేదు.

 ఇక పోతే టీచర్ సంగతి.మాకు పాటలు చెప్పలేక వీణ తీసుకొని 
వెళ్లి పోయింది.మా వారి సంగతి అంటారా........

"ఏమండీ వీణ కావాలి intrest గా ఉంది"అడిగా.
"వద్దులేమ్మ నీకు intrest అయిన వాటితో ఇల్లు 
నిండిపోయింది"అన్నారు.
instruments అంటే భర్తకి intrest లేక పోతే ఎలాగండి?

ఆ రోజే ఒక నిర్ణయానికి వచ్చాను ఎప్పటికైనా నేర్చుకొని 

THAT IS SASIKALA   అనిపించుకోవాలని ....

ఏమిటి మీరు కూడా ఒక నిర్ణయానికి వచ్చారా?
ఏమని?ఆలా చూస్తారేమిటి?వెనక చేతుల్లో ఏముంది?
అయ్య బాబోయ్............

Wednesday 1 June 2011

బాపు బొమ్మ.....అనుభూతుల చెలమ....



 పరిమళాల విరి 
నవరసాల ఝరి
మనసులోని ఆనంద లహరి 
మునగాలనిపించెను మరీ మరీ.......


కన్నయ్య బుగ్గ మీద నునుపు 
అలిగిన కన్నె కళ్ళ ఎరుపు 
చిన్ని పెదాల మధ్య విరుపు
జిగి బిగి అల్లికతో జడ చరుపు 

 

బుడుగు అల్లరి అల్లిక 
రాధ గోపాలాల ప్రేమ మల్లిక
విరహిణి అయి గోపిక 
ప్రేమామృత ధారలలో మునుగునిక...



భూమిపై పరిచిన రంగుల హరివిల్లు 
వేసవి లో తాకిన మల్లెల జల్లు 
ఎంత వర్ణించిన మిగులు 
బాపు బొమ్మల సొగసులు......


ఏంటమ్మా?ఎక్కడికో వెళ్ళిపోయావుఅంటారా?
అవునండి స్వర్గ లోకపు అంచుల దాక వెళ్ళిపోయాను.
ఏంటి అక్కడ నుండి దూకి చావు అంటారా?అనలేదా?
నాకు వినపడిందే.....క్రాస్ టాక్ అయుంటుంది......

బాపు గారి నకల్లు ,ఫోటో లు చూస్తేనే ఇలా అయిపోయానే 
ఇంక ఒరిజినల్స్ చూస్తే ఇంకేమవుతానో ...అయ్యబాపూ ఓయ్ ......
హైదరాబాద్ లో 4,5,6,june నెలలో ఒరిజినల్స్ exbhisition 
అంట.చూసి తరించు పోండి.నీకేమమ్మా నువ్వు కూడా చూడు 
పోయి అంటారా ,మేమెంత దూరం లో ఉన్నాము మాకెక్కడ 
వీలవుతుంది?అంత అదృష్టం ఉండొద్దా?

నీకే కాదమ్మా మాకు కూడా బాపు బొమ్మలు ఇష్టమే 
అంటారా?మా బంగారాలే ....(ఇలా అంటే ఏదో ఫిట్టింగ్ పెడతానని 
మా ఇంట్లో వాళ్లకి తెలుసు ,మీకు తెలీదు కదా)
పోండి...పోండి...పోయి ఆ కళని కళ్ళ నిండా నింపుకొని 
కలం లో కూర్చి అక్షరాలుగా మార్చి ఆ అమృతం తో మీ 
బ్లాగ్ లు ముంచేయండి.ముంచగానే నాకు ఒక మెసేజ్ 
కొట్టండి నేను కూడా ఆస్వాదిస్తాను.మీ ఇల్లు బాపు బొమ్మగాను......
ఎంత చక్కగా రాసారండి...అని కామెంట్ కూడా వ్రాస్తాను.