Thursday 27 March 2014

కధా జగత్ లో నా కధ

నా చిన్న కధ  ''కధా జగత్ '' లో  

( devude yekkada? kadha link )



కధ అనేది ఒక అపురూపమైన ప్రక్రియగా దాని
ప్రభావం రెండు కోణాలలో నేను నా జీవితం లో చూసాను .
ఒకటి పాపగా మా అమ్మ దగ్గర వింటూ ....
రెండోది అమ్మగా మా పిల్లలకు చెపుతూ .

మొదటిది నా వ్యక్తిత్వాన్ని దృడంగా చేయడమే కాక
నా లోని విలువలు పెంచింది .

రెండోది మా పిల్లలను సరి అయిన దారిలో నడిపించి
మా బంధాన్ని బలపరిచింది .

అమ్మ చెప్పే వాటిల్లో ఏమి పెద్ద గొప్పగా ఉంటాయి !
కాని అది చెప్పింది వాళ్ళ అమ్మ అంతే ... అందుకే
వాళ్లకి అదంటే బోలెడు ఇష్టం .

నిద్ర లేవకపోయినా కధ ,పాలు తాగకపోయినా కధ
మొండికి వేస్తే కధ ,నిద్ర పోయేదానికి కధ .
నిజంగా ఈ కధ అనే ప్రక్రియ పిల్లలపై ఎంత
బలమైన ముద్ర వేస్తుందంటే .... అది లేకుంటే
నేను చాలా సార్లు పిల్లలని కొట్టాల్సి వచ్చేది .

కధ  సంస్కృతి ని మోసుకు పోయే వారధి
సమాజాన్ని చూపే అద్దం
ఆలోచన రేకెత్తించే ప్రశ్న
ఇలాటి మంచి కధలు లోకానికి అందించిన
ఎందరో మహానుభావులు .... అందరికి వందనాలు .


Thursday 20 March 2014

కొంచెం కవిత్వపు టీ పార్టీ



మార్చ్ ఇరవై ఒకటి ''ప్రపంచ కవితా దినోత్సవం ''
అన్నారు . మరి ప్రపంచమే ఇది జరుపుకోనేటపుడు
కొందరికి ఈ రోజు ఇంకా ఇరవై తేది ఉంటె కొందరికి 
ఇరవై ఒకటి  వెలుగు విచ్చుకొని ఉంటుంది . 
ఈ రోజు పోస్ట్ వేసినా పర్లేదు అనుకోని వేస్తున్నాను . 
మనిషి హృదయం అక్షరాలుగా రాలాలి అనుకున్నప్పుడు 
తేదీ ల మబ్బులు కోసం ఎదురుచూడదు . అది స్వయంభువు . 
తనకు తాను మదినుండి జాలువారి ఇతరుల మదిని 
మురిపిస్తూ రగిలిస్తూ కదిలిస్తూ ఆలోచనల లో ముంచేస్తూ 
ఉప్పెనగా ఎగసిపోతుంది . 

చాలా మంది అడుగుతుంటారు ... కవిత్వం ఎలా వ్రాయాలి ?
అని . 
నాకు తెలిస్తే కదా చెప్పడానికి !
ఎక్కడో ఏదో జరుగుతుంది ,ఒక బాధో 
ఒక నవ్వో ,ఒక అన్యాయమో ,ఒక ఆవిష్కరణో
తటాలున హృదయం స్పందిస్తుంది ... 
ఏదో ఉద్విగ్నత మనసుని నిలవనీదు . 
అరచేయి కూడా కాగితం అయిపోతుంది . 
భావం అక్షరం అయి నిలిచిపోతుంది . 
సలహా కావాలి అంటే ఒకటి ఇవ్వగలను . 
చదువు .... నీకోసం ముందటి వాళ్ళు 
కోట్ల భావాలు అక్షరాలుగా  పేర్చి పుస్తకాలుగా 
శరీరాలను మార్చుకున్నారు . ఏమి ఆశించకుండా 
చదువు అంతే . ఆ భావాలుగా నువ్వు మారేటట్లు , 
ఆ శకలాలను తాకేటట్లు ... కవిత్వంగా నువ్వు 
బయటకు పొంగేదాకా చదువుతూనే ఉండు ,
ఆ అమృతపు ధార కలం నుండి జాలువారుతుంటే 
అమ్మ తొలి చూలు బిడ్డను చూసుకున్నంత తృప్తి . 
కవిత్వం అంటే అంతే . ఇంకేమి లేదు .  

ఫేస్ బుక్ గ్రూప్ ''కవి సంగమం '' లో నా కవిత 

   

          ఎందుకో మరి కవిత్వమై 


ఒక్కోసారి .... 
ఎందుకో తెలీదు 

తొలి కిరణపు ముందటి గాలినై 
నిద్ర మబ్బులో ఉన్న మొగ్గల్ని 
లేపుతుంటాను 

సంజె వెలుగుతో చేరి 
పక్షుల ముక్కులపై 
కువ కువలాడుతుంటాను 

నల్లమబ్బు నుండి జారే 
తొలి చినుకులా తుళ్లి 
అలలపై చేరి 
ఆటలాడుతుంటాను 

అవమానిత ఎద
 గాయపు మంటనై 
ఆగ్రహపు సెగలు 
కక్కుతుంటాను 

అబలల ఆక్రందనలు 
మోసుకు తిరిగే 
కన్నీటి చుక్కనై
నేలకు రాలుతుంటాను  

దైన్యాన్ని కప్పుకొని 
నాలోకే ఒదిగి 
మౌన తపస్వినిగా 
మారుతుంటాను

తలపులను విదిల్చి 
కలపు రెక్కలు కదిల్చి
అక్షరాలను 
వెదజల్లుతుంటాను   

అవధుల్లేని ఆకాశాన్ని తాకి 
నా హద్దులు మరిచి 
విశ్వానికి ఊపిరులు 
ఊదుతుంటాను 

నా ఉనికికి 
ప్రపంచానికి 
మధ్య రేఖ ను కానక 
నేనే అది 
అదే నేను అయిన 
విశ్వాత్మగా 
నిలిచిపోతుంటాను .... 
కవిత్వమై కదిలిపోతుంటాను .... 

ఒక్కోసారి .... 
ఎందుకో తెలీదు . 

Monday 17 March 2014

కాలం మారిందంట ... ఏమి మారిందో

 ''ఈ రోజు నాయుడుపేట లో మహిళా దినోత్సవం 
యు . టి . ఎఫ్ వాళ్ళం బాగా చేస్తున్నాము . నువ్వు 
రారాదా ?''శ్రీవారి సజెషన్ ,మహిళా దినోత్సవ 
శుభాకాంక్షలు చెపుతూ . 
అయ్యో మా స్కూల్ లో ప్రీ ఫైనల్ జరుగుతున్నాయి . 
సెలవు పెట్టకూడదు ''అని .... 
''అయినా మేము మగాళ్లకంటే తక్కువే నంట కదా ,
మాకెందుకు లెండి ఇవన్నీ ''మనసులో మాట ఉంచుకొనే 
అలవాటే లేదు కాబట్టి గబుక్కున అనేసాను . 

అదీ కాక ఈ రోజు మా స్కూల్ లో పిల్లల చేత వివిధ 
రంగాలలో విజయం సాదించిన మహిళల గూర్చి వ్యాసాలు 
వ్రాయించి 'గోడ పత్రిక ' ప్రదర్శిస్తున్నాను . ఇంకా అందరి కంటే 
స్కూల్ కి ముందు వెళ్లి పిల్లలు నేను కలిసి స్కూల్ కి 
వచ్చే ఒక్కో మేడం కి చప్పట్లు కొడుతూ ఆహ్వానం పలికి 
చాక్లెట్స్ ఇస్తూ విషస్ చెప్పేలా ప్లాన్ వేసి ఉన్నాను . 
అసలు అనుకోకుండా అలా విషస్ పొందేసరికి మేడమ్స్ 
మొహాలు వెలిగిపోయాయి . మాకెందుకు మేడం అని 
కొందరు పైకి మొహమాట పడ్డారు . 

''లేదు మీకు కాకుంటే ఎవరికి చెపుతారు పిల్లలు ... 
మీరు విద్య సాదించారు ,ఆర్ధిక స్వావలంభన సాదించారు , 
ఇంకా ఇంత మంది పిల్లలకు బోదిస్తూ సమాజ సేవ చేస్తున్నారు . 
పిల్లలకు జీవిత సార్ధకత ను గూర్చి మీకంటే లైవ్ ఎక్సాంపుల్ 
ఎవరున్నారు ''అని చెప్పాను . 

నిజంగా కొద్ది పాటి ప్రశంస కూడా దొరక్క అందరు ఎంత 
నిసృహ లోకి వెళుతున్నారు అంటే ,వాళ్ళ సామర్ధ్యాలను 
వాళ్ళే మర్చిపోతున్నారు . 
చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఆదివారం అల్లా సెలవు 
ఇవ్వకపోతే పోనీ .... కనీసం ఈ ఒక్క రోజు వాళ్ళు చేసిన 
పనుల్లో ఏదో ఒక మంచి పనికి మెచ్చుకోవచ్చు కదా !
వంట చేయవచ్చు కదా!తప్పు లకు  వెంటనే విమర్శించే 
మీరు, నాటకీయమే కావచ్చు ... మెచ్చుకోవడం ,లేదా 
విషస్ ,లేదా బహుమతి ఇవ్వడం ఎంత ఆనందంగా 
ఉంటుంది . మురిసిపోయి పళ్ళెం నిండా మురిపాలు వడ్డించరా   
ఏమిటి ?ఏమిటో కాలం మారిందంట . ఇంకా ఆడవాళ్ళను 
ఎలా సంతోషపెట్టాలో తెలీదు కాని పెద్ద . 

సరే పిలిచారు కదా అని పర్మిషన్ పెట్టి స్కూల్ నుండి 
స్కూటీ లో బయటకు వచ్చేసరికి ఎదురుగా ఒక గుంపు . 
చెన్నై హైవే మీద మా స్కూల్ దగ్గర డివైడర్ కట్ అవుతుంది . 
కారు ,రోడ్ దాటే స్కూటర్ డిష్యుం . మనిషి బోర్లా 
పడున్నాడు . ఎవరో 108 కి ఫోన్ చేస్తున్నారు . హమ్మయ్య 
అనుకోని ఏమి కాకూడదు అని ప్రార్ధించుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళే సరికి 
108 వస్తూ కనిపించింది . ఇదంటే నాకు భలే ఇష్టం . 
మనిషి బాగానే ఉన్నాడు . హమ్మయ్య . లేకుంటే ఇంక
రాత్రికి నిద్ర కష్టమే . ఎంత మంచి రోడ్స్ వేస్తే అన్ని ఆక్సిడెంట్ లు 
పెరుగుతున్నాయి . ప్రమాదానికి పేదా గొప్ప తేడా లేదు . 
ఏదో శాటిలైట్ ప్రపంచం అంట .... ప్రమాదం తరువాత మొదటి 
అరగంట ఎంతో విలువ అనితెలిసి కూడా ప్రాణాలు కాపాడుకోలేక పోతున్నాము , 
కాలం మారిందంట ఏమి మారిందో ?

మీటింగ్ కి వెళ్లాను . కొంత మంది ఆడవాళ్ళు వేదిక మీద . కాని 
కావలిసిన ఏర్పాట్లన్నీ చక్కగా స్వీట్ హాట్ తో సహా మగవాళ్ళే 
అందిస్తూ మీటింగ్ చక్కగా సాగటానికి సహకరిస్తున్నారు . 
వాళ్ళు యు . టి ఎఫ్ . వాళ్ళు చక్కగా చేయాలి అని చెప్పారు 
అంట . వెనుక మా వారు కూర్చొని ఉన్నారు లెండి . అందుకు అన్ని 
విషయాలు నాకు తెలిసాయి . 
రిటైర్డ్ ఎం . ఈ . ఓ సుశీల గారిని ,ఉత్తమ ఉపాధ్యాయురాలు బారతి 
గారిని నన్ను చక్కగా సన్మానించారు . అందరు మాట్లాడాల్సిందే అని 
ఒక హెచ్చరిక . విధి లేక చాలా మంది మాట్లాడారు . ఏమో అనుకున్నాను 
వీళ్ళు బయటకువచ్చి మాట్లాడారు కాని ఎంత చక్కటి కోణాలు 
టచ్ చేస్తూ మాట్లాడారో .... ఒక అందమైన  రంగుల హరివిల్లు 
జీవితాన్ని చూపిస్తూ ఆవిష్కరింప బడింది . 
సుశీల అన్నారు చదువుకొని ఉద్యోగం చేసేవాళ్ళు అన్నా కొంత 
మనసునివిశాలం చేసుకొని సమాజం గూర్చి ఆలోచించాలి అన్నారు . 
భారతి గారు తాను ఇక్కడకు బయలుదేరగానే వాళ్ళ భర్త 
ఎదురొచ్చిన సంగతి ''వంట చేసి ఎక్కడికైనా పొమ్మని ''విశాల 
హృదయం తో పర్మిషన్ ఇచ్చిన సంగతి ,శోభా రాణి గారు తను 
కస్తూరిబా డ్రాప్ అవుట్ స్కూల్ లో ఒకో సారి అక్కడే ఉండి  పల్లెలు తిరిగి 
పిల్లలను ఇప్పించిన సంగతి చెప్పి వాళ్ళ భర్త కు కృతజ్ఞతలు 
చెప్పారు . అనిత గారు అయితే తాను అందరికి ఈ మీటింగ్ కోసం 
ఫోన్లు చేసినా ఎవరూ రాలేదని బాధపడి మనకు వాళ్ళే వేదిక ఏర్పాటు 
చేసి మాట్లాడుకోమన్నా మనం ఇలా రాక పోతే మన సమస్యలు ఎలా 
పరిష్కారం అవుతాయి అని ప్రశ్నించారు . ఇంకా తను తన బాబు చేత 
కూడా అన్ని పనులు చేయిస్తాను అని ,చిన్నప్పటి  నుండి ఆడ మగ 
తేడా చూప్న్చాకూడదు అని చెప్పారు . 
ఇక వసంతమ్మ గారు పోయన సారి ఈ సారి సభ మేమే చేసుకుంటాము 
అన్నాము కాని వీలు కాలేదు . ఈసారి తప్పకుండా మా వేదిక మేమే 
చేసుకుంటాము అని చర్విత చరణపు హామీ ఇచ్చారు . 

ఇక నేను ''స్వేచ్చ కావాలనడం తప్పు కాదు . కాని దానిని సద్వినియోగం 
చేస్తేనే మన మీద గౌరవం తెచ్చుకోగలం . ముందు సభలకు హాజరు 
కావాలి . అపుడు సంఖ్యా బలమే చాల చట్టాలు తెచ్చు కోవడానికి 
ఉపయోగపడుతుంది'' అని చెప్పాను .

ఇంతా చేస్తే మీటింగ్ తరువాత వచ్చిన వాళ్లకి ''జ్యూస్ సెట్ ''ఇచ్చారు ,
అయినా కాని  చూద్దుము కదా .... ఆడవాళ్ళు అందరు ఇంటికి వెళ్లి పోయారు .
ఏమంటే వంట సగం లో వదిలి వచ్చారంట . 
హ్మ్ .... కాలం మారిందంట . ఏమి మారిందో ?
మనలో మాట ..... మహిళా దినోత్సవం అయిపోయి ఎన్ని రోజులు 
అయింది ?ఇప్పటి దాకా వ్రాసి ఇప్పటికి పోస్ట్ వేసాను అంటే ,
పనుల వల్లే కదా :))


Tuesday 4 March 2014

''టెంపుల్ రన్ '' చూసారా ?

''టెంపుల్ రన్ '' చూసారా ?
హ్మ్ ... పిల్లలు ఇద్దరూ వాళ్ళ లాప్ టాప్ లు 
వాళ్ళు తీసుకొని ఎగిరి పోయాక,ఇంట్లో ఉండే 
డస్క్ టాప్ లో హార్డ్ డిస్క్ పోయే సరికి అధ్దో 
అప్పుడు చూసాను చేతిలో ఉండే ఆండ్రాయిడ్ ఫోన్ 
వైపు ... అవసరమే అన్నిటికీ అమ్మ కదా !


సరే ఏ టెక్నాలజీ అయినా పిల్లలు నేర్పితేనే కదా 
అమ్మలకు తెలిసేది (కొన్ని సార్లు నాయనలకు కూడా )
వాళ్ళే కొన్ని ఆప్స్ డౌన్లోడ్ చేసిచ్చారు . పాటలు 
డౌన్లోడ్ చేసీమంటే పెద్ద పోజ్ .... ఇప్పుడు మా మేనల్లుడు 
అఖిల్ చక్కగా ప్లే స్టోర్ ఆప్ డౌన్లోడ్ చేసిచ్చాడు ,హ్యాపీ 
గా నెట్ అందుబాటులో ఉంటె పాటలు వినొచ్చు ,
డౌన్ లోడ్ చేసుకోవచ్చు . 

వీటితో పాటు ఇదిగో '''టెంపుల్ రన్ '' అనే గేం 
కూడా డౌన్లోడ్  చేసారు . మామూలుగా వాళ్ళు 
ముగ్గురూ యేవో ఆడుతుంటారు కాని నేను ఎపుడూ 
పెద్దగా ఆడను . సరే ఇదేమిటో చూద్దాము అని ఆడాను . 

సింపుల్ గా చెప్పాలంటే ఒక గుహ నుండి ఒక మనిషి 
పరిగెత్తుతూ బయటకు వస్తాడు . (టెంపుల్ ఎక్కడ ఉండబ్బా ?)
అతని వెనుక గబ్బిలాలు తరుముతూ వస్తూ 
ఉంటాయి . అతను ఒక పాత బ్రిడ్జ్ మీద పరిగెడుతూ 
ఉంటాడు . మధ్యలో బ్రిడ్జ్ తెగి పోయి  ఉంటె మనం దూకాలి . 
(అంటే మనిషి మనం ఎలా కదిలిస్తే అలా కదులుతాడు ,
ఒక రకంగా ఆ మనిషి మనమే ,మళ్ళా మనం కాదు . 
కాని మనమే కదిలిస్తాము . వాడు పడిపోతే మాత్రం 
మనకు దెబ్బలు తగలవు కదా ... ఏదో మొత్తానికి 
మనమే పరిగేత్తినట్లు ఉంటుంది )
ఇంకా అక్కడక్కడ  మర్రి చెట్టు వేళ్ళు అడ్డం వస్తూ ఉంటాయి . 
ఇంకా బ్రిడ్జ్ మలుపు దగ్గర మనం తిరుగక కుండా 
నేరుగా పోతే సముద్రం లో పడిపోతాము . 
అంటే పరిగెత్తే టపుడు బ్రిడ్జ్ ను చూసుకోవాలి . 
మర్రి వేళ్ళు వస్తే యెగిరి దూకాలి . మలుపు వస్తే 
తిరగాలి . వీటిలో ఏది తప్పుగా చేసినా మనిషి 
చనిపోతాడు . గేం ఓవర్ . ఎంత పరిగెత్తి తే అంత 
స్కోర్ . 
ఇంకా ఇలా పరిగెత్తేటపుడు మధ్యలో వచ్చిన కాయిన్స్ 
టచ్ చేస్తే బోలెడు స్కోర్ . మనలో మాట నాకింకా 
పరిగేత్తడమే సరిగా రాలేదు . ఇంకా కాయిన్స్ ఎక్కడ 
స్కోర్ చేసేది . కాపాడుకోవడం ,సంపాదించడం చేస్తూ 
వెనుక వచ్చే గబ్బిలాలకు దొరక్కుండా ఎంత సేపు 
ఆడితే అదీ ఆట . మధ్యలో ఎన్ని ఊహించనివి ఉన్నాయో !
చాలా స్కోర్ చేస్తే కొన్ని శక్తులు కూడా వస్తాయి . 

ఇదంతా సాఫ్ట్ వేర్ డిజైనింగ్ పుణ్యమే కదా . ఎన్ని 
ఆప్షన్స్ డిజైన్ చేస్తే అంత మజా !టెక్నాలజీ ఎంత గొప్పగా 
ఉంది అనుకున్నాను . 

ఇంతలో ఒకటి అనిపించింది . మనిషి జీవితం మాత్రం 
ఇంత కన్నా ఏ మాత్రం భిన్నంగా ఉంది . వెనుక 
తరిమే మృత్యువు కి దొరకకుండా ఎదురు దెబ్బలు 
తగలకుండా జాగ్రత్త పడుతూ .... మధ్యలో డబ్బులు 
సంపాదిస్తూ ... ఏదో స్కోర్ కోసం ఎప్పుడూ పరుగులే 
కదా !జీవితం నుండే ఆట వచ్చిందా ?
ఫిక్షన్ కూడా నాన్ ఫిక్షన్ నుండే  వచ్చిందా ?
ఏమో మరి మనిషి జీవితం మాత్రం నాకు ఎప్పటికీ 
అర్ధమే కావడం లేదు .