Sunday 23 June 2013

ప్రేమ కధా (వి)చిత్రం

ప్రేమ కధా (వి)చిత్రం 
''ఆంటీ '' ఫోన్ లో గొంతు వినంగానే నాలో ఉత్సాహం ''అమ్మూ ''
''ఏమిటి బి టెక్ ఫస్ట్  ఇయర్ పరీక్షలు అయిపోయాయా?
సాయంత్రం సినిమాకి పోదామా?''మనసులోని హుషారు మాటల్లో 
పొంగిపోతూ .... అమ్ము పాత ఇంట్లో పక్కన ఇంటి అమ్మాయి . 
నా ఒక్క గానొక్క సినీమేట్ (అంటే సినిమాకి వెళ్ళటానికి వచ్చే తోడు ) 
తనేమో చదువుకు వెళ్ళింది ,నేనేమో కొత్త ఇంటికి ... ఇప్పుడు కలిసాము . 
ఇక సినిమాల రచ్చె :) 

''ఒ.కె సాయంత్రం 'యాక్షన్''కి పోదాము .థ్రీ డి అంట '' చెప్పింది . 
కళ్ళద్దాలు లేకుండా త్రీ డి అదేలాగబ్బ ,బోలెడు ఆశ్చర్యం తో సాయంత్రం 
స్కూటీ లో వెళ్లి పికప్ చేసుకున్నాను . మధ్యలో ఉన్నట్లుండి 
''ఆంటీ ప్రేమ కధా  చిత్రం వెళదాము '' అంది . 
పర్లేదు వెళదాము అన్నాను,అసలే బోలెడు సినిమా ఆకలి . 
హాల్ దగ్గర దిగేటపుడు చెప్పింది . ''ఆంటీ హారర్ మూవీ '' 
చచ్చాను ఏమిటి దారి ,నవ్వులాటకు అంటుందేమో చుట్టూ చూసాను . 
వచ్చి దాదాపు నెల అయినా ఫ్యామిలీ లేడీస్ వచ్చి ఉన్నారు చాలా మంది . 
అయితే పర్లేదు అన్న మాట . అయినా దెయ్యం అంటే భయం .   
ఇంతలో ''అమ్మూ  '' అంటూ నవ్వుతూ వచ్చారు దాని ఫ్రెండ్స్ ఇద్దరు .
అనుకోకుండా కలిసారు . నా సంగతి తెలిసినట్లుగా ఉంది . ''ఏమి భయం లేదు ఆంటీ
మేము రెండో సారి అదిగో మా వాళ్ళ కోసం వచ్చాము ,అంతా నవ్వే ''
దెయ్యం నవ్వేమిటి నా తలకాయ ....హ్మ్

సినిమా ఏమిటంటే ఊరికే చిన్న విషయాలకే ఆత్మహత్య లు
చేసుకొనే వాళ్ళ గూర్చి .... సినిమా మొదల్లోనే
సుదీప్ (హీరో )నందు (హీరోయిన్ )వాళ్ళ కామన్ ఫ్రెండ్
ప్రవీణ్ హోటల్ లో ఉంటారు . వాళ్ళు ముగ్గురూ
ఒక ఫాం హౌస్ కి వెళుతుంటారు . ఎందుకంటె పెద్ద విషయమేమీ లేదు
ముగ్గురూ కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి ....
ఏమిటి కెవ్వ్ అంటున్నారు . ఇంకా బోలెడు సీన్స్ ఉండాయి .
వీళ్ళకి ''నెల్లూరు గిరి '' అని ఒక అమాయకుడు ,వాడు కూడా
ఆత్మహత్య చేసుకోవడానికే .... వీళ్ళతో చేరి ఫాం హౌస్ కి
వెళతాడు . అక్కడ ఆ నలుగురి మధ్య కధ ఇది . మధ్యలో
దెయ్యం ఎక్కడిది అంటారా ? చెపుతాను

''ఓ ప్రభువా నాకు దెయ్యం సినిమాలో నవ్వుకొనుటకు 
నెల్లూరు గిరిని ఇచ్చితివి . లేని యెడల నాకు గుండె ఆగి ఉండును . 
నా గుండె ఆగనందుకు నీకు స్తోత్రం '' 

ఇదిగో వీళ్ళందరూ అక్కడ గడపడం లో సుదీప్,నందు ప్రేమలో 
పడటం ,నందు అంతకు ముందు నుండే వాడిని లవ్ చేసే సంగతి ,
మూడు నవ్వులు ,ఆరు పాటలు .... ఇద్దో ఇప్పుడే ట్విస్ట్ ..... 
సుదీప్ నందు మీద  చేయి వేస్తే చాలు అంతే ..... కెవ్వ్వ్వ్వ్వ్ 
ఎమైందా?నాకేమి తెలుసు ?నేను కిందికి వాలి పోయి సాయిబాబా 
అనుకుంటూ గడ గడ వణుకుతున్నాను . ''అమ్ము రాక్షసి '' 
అని ఒక్కటిచ్చాను . ''లేదు ఆంటీ దెయ్యం వెళ్లి పోయింది 
లేవండి ,ఇప్పుడు చూడండి ఎంత నవ్వో '' 
నిజమే సుమా అందరు సీట్ కు ఆనుకొ కుండా నవ్వేస్తున్నారు . 
ఎందుకో  నాకు అందరు అలా మైమరిచి నవ్వుతుంటే భలే సంతోషం . 
దెయ్యం రాను వచ్చి నపుడల్లా  నేను కిందికి వాలను .... 
అమ్ము ఏమో ప్లీస్ ఆంటీ చూడండి నా భుజం పట్టుకొని చూపించను ,
దాని బాధ పడలేక ''నెల్లూరు గిరి '' ని దెయ్యం కొడుతుంటే ఒక్క 
కన్ను మాత్రం తెరిచి చూసాను . 
ఇంక చూడండి నేను కూడా ... ''అక్కా ఇష్ పోసుకొని వస్తాను ''
అని దెయ్యాని బ్రతిమిలాడుతుంటే .... చిన్నగా నవ్వలేదు . 

విచిత్రం అన్నానే  ఇదే . దెయ్యం కనిపించినపుడల్లా హాల్లో నవ్వులే నవ్వులు . 
ఫ్యామిలీ లేడీస్ అందరు ఎందుకు వచ్చారో అర్ధం అయింది . 
ఏ మాటకి అ మాటే చెప్పుకోవాలి .... దెయ్యం మరీ రామ్ గోపాల్ వర్మ 
దెయ్యం అంత భయంకరంగా లేదు .... సో క్యుట్ ,జెంటిల్ ,జొవియల్ . 

సరే దెయ్యానికి ఏమి కావాలి అంటే .... చెపుతాను రమ్మని పాపం . 

శేఖర్ కమ్ముల కి '' హ్యాపీ డేస్ '' హిట్ ఇచ్చాము కదా ,
నందిని రెడ్డి కి ''అలా మొదలయింది '' హిట్ చ్చాము కదా 
అలాగే ఈ మారుతి కి ఈ సినిమా హిట్ ఇచ్చెద్దాము  . హాల్ కి 
వెళ్లి చూడండి . అసలే చిన్న సినిమాలకి థియేటర్ లు లేకుండా 
చేసి పైకి రాకుండా కుట్ర జరుగుతుంది . 
అందరికి న్యాయంగా మంచి చేసేవాళ్ళం మనమే . 
వెళ్లి చూడండి . అసలు స్త్రీ ల పై ఏమైనా చేసిన వాళ్ళను అప్పుడే 
ఎన్కౌంటర్ చేసేస్తే పీడా పోతుంది . 
నేను  సినిమా రెండో సారి నేను చూస్తాను . మీకు వీలు అయితే 
చూడండి . 

Monday 17 June 2013

ఆలు లేదు ... చూలు లేదు ...


 ఆలు లేదు ... చూలు లేదు ... కొడుకు పేరు సోమ లింగం :)
నిజమేనా ? ఇంకా పుస్తకమే బయటకు రాలేదు కదా దాని గూర్చి వ్రాస్తే 
ఇలాగే ఉంటుందా ?కాదు లెండి . ఆలు చూలు ఉన్నాయి . ఇదిగో క్రింద వ్రాసిన ముందు మాట 
సారంగ బుక్స్ వారి ముందు మాట  చూడండి .  
రాజిరెడ్డి అనే పేరు కేవలం వొకానొక పేరు కాదని ఇప్పుడు మనకు తెలుసు. ఆ సంతకం పైన కనిపించే వాక్యాలు కూడా సాదాసీదా వాక్యాలు కాదనీ తెలుసు. రాజిరెడ్డి చిరు వచన దరహాసాన్ని “పలక-పెన్సిల్” పుస్తక రూపంలో సారంగ బుక్స్ ద్వారా త్వరలో మీకు అందించబోతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ ఏడాది సారంగబుక్స్ ద్వారా వెలువడుతున్న తొలి పుస్తకం “పలక-పెన్సిల్”. ఆ పుస్తకం నించి వొక మెచ్చుతునక మీ కోసం!

(saranga ku link ikkada )

ఎవురబ్బ ఈ రాజి రెడ్డి
నేను మాత్రం చూసానా ఏమిటి
సాహిత్యాభిమానిని కాబట్టి అక్షర రూప
పరిచయం .

ఏమి ఉంటుంది ఈ పుస్తకం లో ?
లింక్ లోకి వెళ్లి చూస్తే అర్ధం అవుతుంది .
కాని ఒక్క రెండు మాటలు కాదు లెండి కొన్ని
కబుర్లు చెపుతాను . అప్పుడు మీకు ఈ
పుస్తకం చదవాలి అనిపిస్తుంది .

మళ్ళా ఇంకో సారి అదే ప్రశ్న .... ఎవురబ్బ ఈ పూడూరి రాజిరెడ్డి ?

ఒక సారి రెండేళ్ళ క్రితం ఫండే లో పదాలు పెదాలు చదువుతూ ఉన్నాను .
ఎందుకో ఒక వాక్యం దగ్గర మనసు ఆగిపోయింది . అది ఒక తండ్రి ,బాబు
ఆడుకొనే దాగుడు మూతలు . అది ఆట కంటిన్యు చేయమని చెబుతున్నాయి 
వాడి కళ్ళు నవ్వుతూ .... మరి ఆ స్పృహ నాకెందుకు లేదు అని . 
ఉలిక్కి పడ్డాను . నాకు ఇలాంటి భావాలే వస్తూ ఉంటాయి .
ఎలాగు అభినందించడం లో నేను చాలా హుషారు కాబట్టి బాగుందని మెయిల్
చేసాను . పాపం ఆయన మొహమాటానికి మీకు ఇంట్రస్ట్ ఉంటె నా బ్లాగ్
చూడండి అని లింక్ ఇచ్చారు .
అసలు బ్లాగ్ అంటే తెలీని నాకు అప్పుడు ఒక కొత్త  ప్రపంచం
ఇది మంచి మాధ్యమం నా రచనా సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి అని అనుకోని
బ్లాగ్ మొదలు పెట్టి దేవుని దయ వలన ఇప్పటి దాకా అందరు మంచి ఫ్రెండ్స్
సహాయంతో కొనసాగిస్తున్నాను . పాపం ఆయనకు తెలీకుండానే నాకు
లింక్ ఇచ్చి సహాయం చేసారు కదా అందుకు థాంక్స్ కూడా వ్రాసేశాను .

ఒక పాటకురాలిగా నాకు రచయిత తో పని లేదు . నన్ను హంట్ చేసే అక్షరం ,
దానిని ప్రయోగించడం లోని సొగసు ,చివరలో మనసులో ఉప్పొంగే మంచి
భావన ఇవి కావాలి .
అసలు ఈయన ఏమి వ్రాస్తాడు ? మా బాబు అడుగుతుంటాడు.... ఎముందమ్మ
దీనిలో అన్ని సార్లు చదువుతావు ,నిజమే ఏమి ఉండదు , ఉత్తినే మనం
రోజు చూసేవే వ్రాస్తాడు . ఏముంది లే  దీనిలో అనుకొనే లోపు ఏదో ఎమోషన్
మనలను ఎక్కడో టచ్ చేస్తుంది . రచయిత  మహా మాంత్రికుడు సుమండీ . 
ఆయన హిడన్ అజండా లు ''పలక -పెన్సిల్ '' లో దులిపాడంట .
మనకెందుకు అనుకుంటాము . మన లోవి గట్టిగా దాచుకుంటాము ఎక్కడ
జారి అందరు ముందు పడిపోతాయో అని .... ఆయన కొబ్బరి బొండం త్రాగితే
మనకేమి లేకుంటే మనకేమి అనుకుంటాము . ఇంతలో ఎక్కడో మన త్రాగలేక పోయిన
కోక్  గుర్తుకు వచ్చేస్తుంది . ఆయన దస్తి కుడి జేబులో పెట్టుకుంటే ఏమిటి ?
ఎడమ జేబులో పెటుకుంటే ఏమిటి అనుకుంటాము ... ఇంతలో మనం
జంకుగా ఎదుర్కున్న ఫైవ్ స్టార్ హోటల్ గుర్తుకు వస్తుంది .
ఎత గట్టిగా పట్టుకున్నా ఇద్దో ఈయన గమ్మత్తు ముందు మొత్తంగా
మన హిడన్ అజెండా బయట పెట్టీ పెట్టక నువ్వు నా తమ్ముడివి ,ఫ్రెండ్ వి
ఇలాగా అక్షర రూపం లో ఆయనను ఏదో ఒక రూపం లో హత్తుకుంటాం
ఆత్మీయంగా ...... ఇంతా మాయ చేసి అమ్మకు నోరు చూపించిన కృష్ణుడి
మల్లె మన నోరు తెరిపించి ,స్వేచ్చగా బ్రతకడం ఈ జన్మ లో నాకు రాదు
అని మన పుస్తకాల రాక్ లో ఆత్మీయంగా బందీ అయిపోతాడు . 

నిజానికి నాకైతే ఈయన వ్రాసిన వాటి లో ఓన్ చేసుకొనేవి ఏమి లేవు ...
నేను మహా ధైర్యం ..... అదిగో ఒక్కటి ఉంది . రోజు పక్కేనే వెళ్ళే
ఇంట్లో మామిడి చెట్టు కూడా చూడక పోవడం .
ఇలాటివి నాకు స్కూల్ లో బొలెడు . మీటింగ్ లో నేను అక్కడే ఉన్నా
సమన్స్కురాలినై ఉండనని మా స్తాఫ్ఫ్ మొత్తానికి తెలుసు .
అందుకే ప్రిన్స్ పాల్ పది సార్లు అయినా అడుగుతుంది ''శశి ఏమి చెప్పానో
చెప్పు '' అని ...... సరే ఈయన వ్రాసేవన్నీ బాగుంటాయా అంటే ......
కొన్ని ఉంటాయి అండి  మా వరకు బియ్యం మధ్యలో నల్ల రాళ్ళు లాగా ....
ఎలా ఉంటాయి అంటే
''నాకు మాత్రమె నూట రెండు మంది ప్రియురాళ్ళ మినహాయింపు ఉండొద్దా ''
అంటాడు . దీనిని ఇప్పుడు మేమెలా జీర్ణించుకోవాలి . కూసింత తల తిప్పెసుకొని
నవ్వుకుంటూ సగటు భారతీయ స్త్రీల గౌరవం పెంచేస్తూ ముందుకు వెళ్లిపోతాము .

అది ఎలాగా అంటే ..... ఇప్పుడు స్కూల్ లో పిల్లలు ఫంక్షన్స్ అప్పుడు డ్యాన్స్
వేస్తుంటారు . మేము ఉంటె సినిమా పాటలు ఎంజాయ్ చేయ లెరు.
ఈలలు ,చప్పట్లు ఉంటేనే వాళ్లకు తృప్తి . చేసేదేముంది వాళ్ళ వయసు ముచ్చట
గౌరవించి మేము నవ్వుకుంటూ తల తిప్పేసి దూరంగా వెళ్లి పోతాము .
అలాగని శృతి మించితే భాద్యత తో కూడిన మా దండం దశ గుణం భవేత్
ఎలాగు ఉంటుందని వాళ్లకు కూడా తెలుసు .
మనలో మాట ఈయన గురు కులం లో నా స్టూడెంట్ అయ్యుంటే ఎంత బాగుండును .
మరి నా శిష్యులలో ఎన్నో ఉద్యోగాల  వారు ఉన్నారు కాని రచయితలు లేరు :(
 నిజంగా నా శిష్యుడు అయి ఉంటె బాగా వ్రాసినా ఆయుక్షీణ  భయంతో పొగడకుండా
''బడుద్దాయి ఏమిటా ఇంగ్లీష్ తెలుగు కలిపిన బాషా సంకరం '' అని తృప్తిగా
తిట్టి ఉండేదాన్ని . టీచర్స్ నాలుక కరుకు అయినా..... ఆశీస్సు నిష్కల్మషం
సుమండీ .
ఇంకో మాట ఈయనకి ఈయన వ్రాసినవి మనం చదువుతుంటే మన ముఖ కవళికలు
ఎలా ఉన్నాయో చూడాలి అని ఉందంట .... నాకైతే నేను పై వాక్యం లో
వ్రాసిన తిట్టు ని ఆయన చదివితే ఎలా ఉంటాడో చూడాలి అని ఉంది ....
ఎందుకంటె మంచులో తడిసి వెచ్చని సూర్య కిరణాలకి విప్పుకొనే
తెల్లని నంది వర్ధనం ఎలా ఉంటుందో ..... హృదయానికి ఆత్మీయత తగిలినపుడు
పెదాలపై విరిసే నవ్వు ఇంకా స్వచ్చంగా ఉంటుంది . ఏమంటారు ?

ఖచ్చితంగా ఆ బుక్ నా చేతులు తాకగానే దాని సమీక్ష నా బ్లాగ్ లో రేకులు
విప్పుతుంది చూడండి :) 

Saturday 15 June 2013

నేను చూసిన ఒక నాన్న

నేను చూసిన ఒక నాన్న 
''పైకి ఎగురవేసిన పిల్లవాడు ఎందుకు నవ్వుతూ ఉంటాడు భయపడకుండా ...... 
ఏ పరిస్థితి లో కూడా తనను భద్రంగా పట్టుకొనే నాన్న ఉన్నాడు అనే నమ్మకం వలన ''

ఇప్పుడు నేను మా నాన్న గూర్చి చెప్పడం లేదు . ఆయన 
నిస్సందేహంగా మంచి నాన్నే .... ఎలా చెప్పగలం అంటే సింపుల్ ,
ఇంత వివక్ష ఉండే సమాజం లో కూడా నేను నా సొంత వ్యక్తిత్వం 
తో పెరిగాను అంటే ..... ఆయన ఆలంబన కదా :)

నేను చాలా చాలా దగ్గరగా చూసాను ఒక కుర్రవాడు భర్తగా ,
అక్కడ నుండి నాన్నగా మారటం . అధ్దో ఆయన ఫీలింగ్స్ 
ఇక్కడ పంచుకుందాము అని వ్రాస్తున్నాను . మీరు క్లెవర్స్ 
కాబట్టి అర్ధం అయిపోయింది కదా ఎవర్ని గురించో ...... 

ఆయన పరిచయం ,సాహచర్యం 3/3/1991 న మా నాయన 
ఆయన కాళ్ళు కడిగి ''ఈ అమ్మాయి ఇక మీది,చూసుకొనే భారం మీది ''
అని చెప్పి పై  కండువాతో తో కళ్ళు అద్దుకొని పాలల్లో నా చేతులు అద్ది 
ఆయన చేతుల్లో ఉంచినప్పటి నుండి చూసాను ఒక కొత్త జీవితం 
ఎలా ఊపిరి పోసుకొని భాద్యత వైపు మనిషిని సిద్ధం చేస్తుందో ..... 
ఒక్క నెల భర్త పోస్ట్ లోకి వెళ్లి పూర్తిగా అనుభవించక ముందే రెండో నేలకే 
'' నాన్న '' అనే పోస్ట్ ను   డాక్టర్ కన్ఫాం చేయగానే ఆయన కళ్ళలో 
భాద్యతతో కూడిన గర్వపు మెరుపు ,రూపు దిద్దు కొనీ బిడ్డ మీద అపారమైన 
జాగ్రత్త ఒక్కోసారి నాకు కూడా కుళ్ళు వచ్చేటట్లు ..... 
''మెట్లు దిగేటపుడు అబ్బాయి పట్టుకొని దిన్చుతున్నాడు కదా జాగ్రత్తమ్మా ''
చిన్నత్తగారి సూచన వినగానే కొంపతీసి చూసేసారా అనే చిన్న సిగ్గు . 
అప్పటికీ పెద్దలు,చిన్నవాళ్ళు ఉంటారు అని జాగ్రత్తగా ఉంటాము . 
ఆ మెట్లు స్థంభం చుట్టూ తిరిగేటపుడు సన్నగా మారే దగ్గర నిద్ర మత్తులో కాలు 
జారుతానేమో ని ఈయనగారి ముందు జాగ్రత్త ,ఇప్పుడు ఇలా పట్టించేసింది . 

నొప్పులు మొదలు అవ్వగానే మేము కోట నుండి వచ్చేలోగానే ఈయనగారు హాస్పిటల్ 
కు వచ్చేసి టెన్షన్ పడుతూ తిరగడం చూసి అమ్మ ,పిన్ని వాళ్ళు నవ్వుతుంటే 
అంత బాధ లోను చిన్న గర్వం ఇంత మంచి తండ్రిని పొందుతున్న పిల్లలను తలుచుకొని .... 

మొదటి సారి పాపను ఎత్తుకొని ఆనందపడుతూనే పట్టుకోవడం రావడం లేదని
 భయంగా ఇచ్చేసిన తండ్రి మురిపెంగా పాపకు రాత్రి నన్ను
 ఇబ్బంది పెట్టకుండా పాలు త్రాగించడం ,
స్కూల్ కు వెళ్ళే దాకా పాపను ఎత్తుకొని మురిసిపోవడం ....... 
ఇంత కంటే గొప్ప విషయం ఎవరు ఎగతాళి చేసినా లెక్క చేయకుండా నా జాబ్ తో 
నేను బాబు ను చూసుకోవడం కష్టంగా ఉందని తను జాబ్ మానేసి వాడిని 
పెంచడం ...... చెప్పొద్దా నేను వచ్చే లోగా వాడికి స్నానం చేయించడం ,కబుర్లు 
చెప్పడం ,రోజుకొక కొత్త బొట్టు పెట్టి నాకు చూపిస్తుంటే ,నాకు రావాల్సిన నిధి ఏదో 
ఈయనకు వెళ్ళిపోయిన ఫీలింగ్ . 
ఏదైనా పిల్లలకు ఇష్టమైన వస్తువులు తెస్తే పిల్లలు తిన్నారా అని అడిగి విసిగించడం 
తిన్నారు అంటే ఆ కళ్ళలో ఎంత మెరుపో ..... ఇది ఎక్కడో చూసాను .... 
అవును నేను బొద్దుగా ఉన్నా సరే దగ్గర ఉండి  మీగడ పెరుగు అన్నం 
మా అమ్మ చేత పెట్టించి నా అరిచేతిలో మీగడ పెడుతూ ఉంటె మా నాన్న 
కళ్ళలో ఇదే తృప్తి . 
ఇంకా వాళ్లకు పరీక్షలు అయితే ఈయన నిద్ర లేని రాత్రులు ,రాంక్ వస్తుందా 
రాదా అని టెన్షన్ .... ఒక్కో సారి నీ చదుకు టెన్షన్ పడింది చాలదా ?అనే నా అరుపులతో 
ముగుస్తుంది . వేరే ఊరికి పోయినా పిల్లలకు ఈయనే అలారం ,అల్లరి చేస్తే 
దారిలో పెట్టె కటినత్వం వెనుక నా దగ్గర వర్షించే కళ్ళు ,పిల్లలు బహుమతులు 
సాధించినపుడు మెరిసిపోయే కళ్ళు ,నిద్ర పోకుండా వాళ్ళ భవిత కోసం ఆలోచిస్తూ ఉండే కళ్ళు 
నిజంగా నాన్న కావడం డబ్బు కోసం పరుగుల్లో అందరు విస్మరిస్తున్న గొప్ప వరం . 
అందుకే వ్రాసాను నా 'నానీ ' లో 
                             ''నాన్న సముద్రం 
                              పైన గంభీరం 
                              లోపల చూడండి 
                             మమకారం ''    
కాని భాద్యత లేని కొందరు నాన్నల వలన అనాధలుగా పెరుగుతూ లకారాలతో 
పిలిపించుకొనే పిల్లలను చూస్తే ఈ నాన్నన పోస్ట్ లేకుండాపోతే బాగుండును 
అనిపిస్తుంది . 

తల్లి భాద్యత లో భాగంగా పని సరిగా చేయనపుడు పాపను మందలిస్తే 
''అమ్మా నీ లోపాలు ను సవరించుకొనే నాన్న లాంటి భర్త నాకు కూడా 
దొరుకుతాడు లేమ్మా '' అని నమ్మకంగా చెపుతుంటే ..... అరె ఇలాంటి 
నాన్న నాకు ఉంటె బాగుండును అనిపిస్తూ ఉంటుంది . 
(మా నాయన ఏమి తక్కువ కాదు లెండి )
ఇప్పుడు వ్రాయాలి అనిపించింది ఇదిగో ఈ కవిత చేసిన పని 

kavitha link ikkada