Monday 2 June 2014

ముచ్చటగా మూడోసారి

''ఏమండీ రేపు ఏదో ఉత్సవం ఉందని ఇంకో రెండురోజులు 
ఉండమంటున్నారు అమ్మా నాన్న '' చెప్పింది ఫోన్ లో శ్వేత . 
అవతలి నుండి ఒక్క క్షణం నిశ్శబ్దం . 
తరువాత ''నీ ఇష్టం '' ఫోన్ కట్ . 
హ్మ్ .... అంటే ఆయనకు ఇష్టం లేదు అన్న మాట . 
మగవాళ్ళ మాటలకు అర్ధాలు వేరులే . 
అయినా తానేమి ఊరికే అమ్మగారింటికి వచ్చిందా ?
పిల్లలు చదివేవి చిన్న క్లాస్ లు అయినా మామూలుగా ఇక్కడకి 
రాలేము కదా ఈ వేసవి సెలవల్లో తప్ప . అయినా ఆయనను 
వదిలి ఉండటం నాకు ఏమైనా సరదానా ?ఏదో అన్నదమ్ములకు 
బట్టలు పెట్టి సారే ఇవ్వాలి అక్క చెల్లెళ్ళు అంటే వచ్చింది కాని !
ఎప్పుడూ అన్నదమ్ముల చేత సారే పెట్టించుకుంటాము . 
వాళ్ళు ఎలాగు భగినీ హస్త బోజనానికి దీపావళి తరువాత వచ్చేది లేదు . 
ఇలాగ అయినా వాళ్లకు బట్టలు పెట్టడం ఎంత బాగుంటుంది .  

సారె అంటే ఏమిటి ?ఆత్మీయతల మార్పిడి . బాగుండాలి అనే 
ఆకాంక్ష . నేనున్నాను అనే భరోసా . రక్త స్పర్శ .
ఏమి చెప్పినా ఈ మగవాళ్ళకు అర్ధం కాదు . 

''అమ్మా ... అమ్మా ''అరుస్తూ వచ్చారు చిన్న పాపలు ఇద్దరు . 
తల్లి మొహం చిన్న పోయిందని  గమనించకుండా రెండు చేతులు 
లాగుతూ ''మా కిద్దరికీ ఈ రోజు అమ్మమ్మ పూల జడలు వేయిస్తుందంట ''
ఇంత పొడుగు జడ .... చేతులు ఊపుతూ ,చూపిస్తూ హుషారుగా 
ఎగురుతూ . ముద్దుగా ఎగురుతున్న బొమ్మలిద్దర్నీ చూసేసరికి 
హుషారు వచ్చింది శ్వేతకి . దగ్గర తీసుకొని ముద్దులు పెట్టింది . 
''అలాగేలే . కొత్త పట్టు పావడాలు వేస్తాను . ఫోటో తీయిస్తాను ''

''పిల్లలు రండి . తాటి ముంగాలు తెచ్చాను. ముంజెలు తిందురు . 
శ్వేతా రామ్మా ,వాళ్లకి వలిచి పెడుదువు '' ప్రేమగా నాన్న పిలుపు 
వినగానే ''హయ్య తాతయ్య ముంజెలు తెచ్చాదోచ్ ''ఎగురుతూ 
వెళ్ళిపోయారు . ఆడపిల్లలు ఉండే ఇంటి అందమే వేరు గుమ్మానికి 
బంతి పూల తోరణాలు వేలాడినట్లు ,సందెవేళ జాజిపూల 
పరిమళాలు వీచినట్లు .... ఆ సందడే వేరు .   
                          *********

బస్ నుండి దిగుతున్న పిల్లలను చూసేసరికి ఆనంద్ మొహం లో 
కళ . ''డాడీ '' ఇద్దరు చుట్టేశారు వాళ్ళ నాన్నని . ఇద్దరు ఒకే రకం 
గౌన్లు వేసుకొని ,హెయిర్ బాండ్ వేసుకొని ముచ్చటగా ఉండేసరికి 
బస్ స్టాండ్ లో అందరు ఇటే  చూసారు . వెనుకనే దిగుతుండే భార్య 
చేతిలో బాగ్ తీసుకొని ముభావంగా ఉండిపోయాడు . కనీసం 
చిరునవ్వు కూడా ఇవ్వని భర్తని చూసి నిరాశ పడింది . 
ఇవేమీ తెలీని పిల్లలు ఆటోలో కూడా నాన్న భుజాలు వదలకుండా ఊగుతూ 
బోలెడు కబుర్లు చెపుతూ ఉంటే అన్య మనస్కంగా ఊ  కొడుతూ 
ఉన్నాడు . 
కోపం నా మీద కదా పిల్లలు ఏమి చేసారు అనుకుంటూ ఇంట్లోకి 
వెళ్లి వంట లో మునిగిపోయింది .  పిల్లలకు స్నానాలు చేయించి 
అన్నం తినిపించి నిద్రపుచ్చి వచ్చినా ,ఆనంద్ భోజనానికి 
రాకుండా టి . వి చూస్తూనే ఉన్నాడు . 

''భోజనానికి రండి '' తప్పని సరి అన్నట్లు వెళ్లి కూర్చున్నాడు . 
పప్పు పచ్చడి తన ప్లేట్ లో వడ్డించుకొని తనకి వడ్డించ పోయేసరికి 
వద్దు అని వారించాడు . 
గబుక్కున ప్లేట్ లో అన్నం పెట్టుకొని పెరుగు వేసుకున్నాడు . 
''ఏమిటి ఈ పని ?ఇవన్నీ తినకుండా ''కూరలు చూపించింది . 
''వద్దులే ఇలాగే అలవాటు అయిపోయింది . నువ్వు సుఖంగా 
ఉంటె చాలు కదా ? నువ్వే తిను ?'' కటినంగా అన్నాడు . 

''పదేళ్ళు అయింది మన పెళ్లి అయి . ఎప్పుడైనా ఇలాగ 
చేసానా ? అమ్మా వాళ్ళు నోరు తెరిచి అడిగితే ఎలా కాదనగలను . 
అక్కడ నేను మాత్రం అన్నానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో 
అని బాధ పడ్డానో తెలుసా ?'' విసురుగా కంచం దగ్గర నుండి 
లేచి వెళ్లి పిల్లల దగ్గర పడుకుంది . మెల్లిగా వెక్కుతున్న చప్పుడు . 

అరే బాధ పెట్టానే అనుకున్నాడు మనస్సులో . భార్య కంటి తడి 
చూసి మనసు గిల గిలా కొట్టుకుంది . తన సంగతి తెలిసి 
కూడా ఇలా ఎలా అనేసాడు ? అయినా తన బాధ తెలుసుకోవద్దా ? 
అసలు వాళ్ళు లేని ఇల్లు ఎంత విసుగ్గా ఉంటుంది ?అసలు ఇంటికి 
కూడా రాబుద్ది కాదు . తనను నవ్వించినా పర్వాలేదు , ఏడిపించినా 
పర్వాలేదు , కూరలో కరివేపాకంత తీసేసినా పర్వాలేదు ... 
తను లేకుండా గది గోడలు పట్టుకొని వేలాడే ఆ దిగులు కంటే 
నాన్సెన్స్ అయినా పర్లేదు తన మాటలు చాలు . తన ఉనికి చాలు . 
ఎలాగైనా ఓదార్చాలి . ఈ క్షమాపణలు అవీ రావే . అయినా 
నేర్చుకోవాలి తప్పదు . పెళ్లి కాక ముందు ఏమి తెలుసనీ ... 
అన్నీ నేర్చున్నట్లే ఇదీనూ . వెళ్లి శ్వేత పక్కనే పడుకున్నాడు . 
అటు తిరిగి ఉంది . ఇన్ని రోజుల తరువాత హ్యాపీ గా ఉండకుండా 
ఈ సిచ్యుయేషన్ ఏమిటి ?మనసులోనే తల బాదుకొని ... 
బుగ్గల పై మెరుస్తున్న బెడ్ లైట్ వెలుతురు చూస్తూ ... 
ఏమి మాట్లాడాలి ?

అటు తిరిగి ఉన్న శ్వేత కనురెప్పల  తడిని దిండు తుడుస్తూ ఉంది . 
పక్కన తగిలే వెచ్చదనం అర్ధం అయింది . పిల్లలు నిద్ర లేస్తే 
బాగుండు కోపంగా అనుకుంది . కొంచెం దూరంగా జరుగుతూ . 

''అది కాదు శ్వేతా , మీరు లేకుండా నాకు ఇక్కడ ఎంత విసుగ్గా 
ఉంటుంది . అన్నం హోటల్ లో సరిగా ఉండదు . నాకు జ్వరం 
కూడా వచ్చేసింది '' బోలేడంత జాలి పుట్టేటట్లు చెప్పాడు . 

''అవును జ్వరాలు వచ్చేస్తాయి . వెధవ బుద్దులూ వచ్చేస్తాయి . 
అందుకే అప్పుడప్పుడూ ఇలాంటి పరీక్షలు పెట్టాలి ''ఇంకా 
కోపం తగ్గక . 

''ఇంతకీ పాస్ అయ్యానా లేదా ?'' 
''అయ్యారు లేండి . పక్కింటి వాళ్ళను ఒక కన్ను వేసి ఉంచమని 
చెప్పాను '' చిన్నగా నవ్వుతూ చెప్పింది . 

'' అందుకేనా నన్ను రోజు ఆవిడ ఒక్క కన్నుతో చూస్తుంది ''
అల్లరిగా చేయి వేయబోయి ... అబ్బ తల పట్టుకున్నాడు 
భార్య వేసిన మొటిక్కాయకి . 
''ఏమి తింటారే పుట్టింట్లో . ఇంత బలం వచ్చేస్తుంది మీ చేతులకి ''
తల తడుముకుంటూ చెప్పాడు . 
''ఏదో సరదాకి వేస్తే .... అయినా పక్కింటి వాళ్ళను అలా అనొచ్చా ?
మనం గౌరవంగా చూస్తేనే వాళ్ళు మనకు గౌరవం ఇస్తారు '' 

''ఏమిటి ఇది సరదానా ?తిట్టదాలు కొట్టడాలు ఇయన్నీ మీకు సరదాలు 
అయితే మేము ఏమి కావాలి . ఇది గృహ హింస కాదా ?
చూడు మూడు బొప్పెలు '' 

''ఒక్కటి వేస్తే మూడు వచ్చాయా మొద్దబ్బాయి ?'' నవ్వుకుంటూ 
ఇంకోటి ఇచ్చేసింది . 
''అన్యాయం ఇదేమిటి ?ఇలాగ ఇచ్చెస్తున్నావు ?
ఇదిగో చూడు ఐదు బొప్పెలు తల మీద .... రక్షించండి ''

చిన్నగా అరుస్తూ .... నవ్వుతూ . 

అతను అన్న తీరుకు పక పక నవ్వేస్తూ గబుక్కున పిల్లల వైపు 
చూసింది . లేవకుండా ఉంటె బాగుండును అనుకుంటూ . 
''ఇవే కదా భవిష్యత్తు లో మీకు మధుర జ్ఞాపకాలు ''
ఇంకో సారి మొట్టి '' ముచ్చటగా మూడో సారి '' అంది .  
భార్య నవ్వుకు హుషారు పెరిగిపోయి మెల్లిగా చేతులు చుట్టి 
''నా మీద నమ్మకం లేక పోతే ఎలా ?పిల్లల మీద ఒట్టు 
వేసేదా ?''అడిగాడు . 

ఇష్టంగా ఒదిగిపోతూ ''వద్దు పిల్లల మీద ఒట్టు వేయొద్దు . 
ఆయుక్షీణం . అసలు ఒట్టు వేసే పరిస్థితి వస్తే మన మధ్య 
నమ్మకమే లేనట్లు . నమ్మకమే లేని పరిస్థితి వస్తే 
కాపురమే చేయను '' 
ఇంటి ఇల్లాలు ఒదిగి ఉన్నా బాగుంటుంది . కాసింత రోష పడినా 
బాగుంటుంది . ఈ బంధం ఎంత బాగుంటుంది కట్టేసి 
స్వేచ్చ లేకుండా చేసినా సరే దానిలో మహత్తు  మత్తు ఏమిటో 
ఎంత అనుభవించినా బాగుంటుంది . తృప్తి గా అనుకున్నాడు . 
                      *****************