Tuesday 22 January 2013

మంచి విషయం షేర్ చెయ్యండి

ఇక దేశం అంతటా ''181'' మహిళా హెల్ప్ లైన్ 
 ఇదీ ఈ రోజు చదివిన న్యూస్.మరి లింక్ ఎక్కడా దొరకలేదు.
విషయం ఏమిటంటే ఇంతకూ ముందు మహిళలకు హెల్ప్ లైన్ 
కోసం కేటాయించిన నంబర్ 167 స్తానం లో ఈ నంబర్ కపిల్ సిబాల్ 
గారు మార్చారు.ఇదైతే ఈజీ గా గుర్తు ఉంటుంది అని.త్వరలో ఈ నంబర్ 
రాష్ట్రాలలోకి అమలు లోకి వస్తుందంట.వీలైనంత మందికి షేర్ చేయండి.
నెట్ లో ఉండేవాళ్లకు అవసరం ఉండదులే అనుకోవద్దు...ఎవరికి ఏ 
అవసరం వస్తుందో ఎవరికి తెలుసు.ఈ నంబర్ ద్వారా కౌన్సిలింగ్ 
చేస్తారా?లేదా పోలీస్ సహాయం ఇస్తారా?కంప్లైంట్స్ తీసుకుంటారా?
తెలీలేదు.ఏమి సహాయాలు ఉంటాయో అందరికి తెలిస్తే బాగుంటుంది.
ముఖ్యంగా పాపం పదునాలుగేళ్ళ లోపు చిన్న పిల్లలకి కూడా...
ఏమంటే వారి మీద జరిగే అకృత్యాలు చెప్పుకోలేక వాళ్ళలోనే వాళ్ళు 
కుమిలిపోతున్నారు.
అసలు కౌన్సిలింగ్ చేసే వాళ్ళ అవసరం యెంత ఉంది అంటె అంత ఉంది.
చిన్న విషయానికే ఆత్మహత్య చేసుకొనే వాళ్ళు వాళ్ళ బాధ బయటకు చెప్పేస్తే 
ఆ పని చెయ్యరు.ఇంకా ఇలాంటి ఒక హెల్ప్ లైన్ పిల్లలు మిస్ యూస్ చేయకుండా 
కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి.
ఒక సారి ఒక కధో ,నిజంగా జరిగిన సంఘటనో చదివాను.గుర్తుఉన్నంత
వరకు చెపుతాను,కొంత కల్పితం ఉండొచ్చు.కౌన్సిలింగ్ యెంత ధైర్యాన్ని 
ఇస్తుందో చూడండి.

ఒక ఫాంహౌస్.దానిలో ఒక భార్య భర్త .భార్య కు ఉన్నట్లుండి  
నొప్పులు వస్తాయి(బహుశా ఇది మన దేశం లో జరిగి ఉండదు)
భర్త కంగారు పడుతూ హెల్ప్ లైన్ కి ఫోన్ చేస్తాడు.
అప్పుడు అక్కడ ఒక అమ్మాయి మాట్లాడుతుంది.భర్తను కొన్ని 
ప్రశ్నలు అడిగి ప్రసవం దగ్గర పడింది అని ఆ అమ్మాయికి అర్ధం అవుతుంది.

ఆ అమ్మాయి చెపుతుంది.''మీరు ఏమి కంగారు పడకండి.
నేను ఇప్పుడే మా స్టాఫ్  కి ఇన్ఫాం  చేసాను.
అవును మీకు మొదటి సారి పిల్లలా?''
''అవును '''అని చెపుతాడు భర్త.
''మీరు స్పీకర్ ఆన్ చెయ్యండి''చేస్తాడు.

ఇప్పుడు మీరు ,మీ ఆవిడ మంచి బాబుని మీ ప్రేమకు ప్రతిరూపాన్ని 
చూడపోతున్నారు.యెంత మంచి క్షణాలు.మీ ఆవిడకు కంగ్రాట్స్.
తను చక్కగా మంచి హృదయం తో వాడిని భూమి  మీదకు 
రావాలి అని కోరుకోమనండి.'అంటుంది.
అంత బాధలోనూ ఆ భార్య నవ్వుతుంది.

''మరి మీ భార్య నుదురును ప్రేమగా నిమిరి ధైర్యం చెప్పండి.
ఇదంతా అందరికి మామూలే కదా.ఆమెను సౌకర్యంగా పడుకో పెట్టండి''
అని కొన్ని సూచనలు ఇస్తూ వాళ్లకు ధైర్యం చెపుతూ ఉంటుంది.

''మీరు భయపడాల్సిన పని లేదు మా డ్రైవర్ కి సమాచారం అందింది.
అందరు బయలుదేరుతూ ఉన్నారు.ఒక చక్కని పిల్లవాడిని 
మనం భూమి మీదకు తెస్తున్నాము.మీ అంత అద్రుష్టవంతులు ఇక 
ఎవరూ లేరు''

ఇద్దరు సంతోషపడి ధైర్యం తెచ్చుకుంటారు.
భర్తకు చెపుతుంది కౌన్సిలర్ ''చూడండి భయపడకండి.
ప్రకృతికి మనం అంటె ఎంతో ప్రేమ.మనం అడక్కుండానే మనకు 
కావాల్సినవి అన్ని ఇస్తుంది.ఆమెను కొంచెం ఒర్చుకోమని చెప్పండి.
మీ బాబుని చూసే క్షణాలు వచ్చేసాయి''
''మీ బాబు యెంత అదృష్టవంతుడు.పుట్టగానే ముందు నాన్నను 
చూస్తాడు.ఎవరి పోలికో చూడండి''

ఆమెకు ధైర్యం చెప్పండి మా స్తాఫ్ఫ్ దగ్గరకు వచ్చేసారు.
అవును మీరు సూర్యోదయం చూసారా?యెంత అందంగా ఉంటుంది.
మెల్లిగా సూర్యుడు వస్తూ...వెలుగు రేకలు తెస్తూ ...
మా బాబు కూడా అలాగే వస్తాడు మీ హృదయం లోకి వెలుగు రేకలు తెస్తూ.

మా స్తాఫ్ఫ్ వచ్చేస్తూ ఉన్నారు.మీరు కొంచెం వేడి నీళ్ళు తెచ్చి అక్కడ 
పెట్టండి.అరె బుజ్జి సూర్యుడు వచ్చేసాడా?మెల్లిగా చేతిలోకి తీసుకోండి.
భయపడకండి.ఏమి కాదు.ఇదంతా మామూలే.
మన బాబు ఆరోగ్యంగా మన ముందు ఉండాలి కదా.
వాడు చిరునవ్వుతో తిరుగాడాలి కదా...
ఇలాగా బాబు కి  ఎలా సర్వీస్ చెయ్యాలో చెప్పి వాళ్లకు వేరే 
ఆలోచన లేకుండా చేస్తుంది.వాళ్ళు ధైర్యంగా బాబుని పొందేటట్లు 
భర్త చేత చేయిస్తుంది.అప్పటికి వాళ్ళ స్టాఫ్  అక్కడకు చేరుకొని 
ఫస్ట్ ఎయిడ్ చేస్తారు.



అసలు విషయం ఏమిటంటే అంబులెన్స్ టైర్ పంచర్ అయి వాళ్ళు 
మార్చుకొని వచ్చేసరికి ఇంకా సమయం ఎక్కువ అయింది.
అది కాని చెపితే ఆ భార్య భర్త ఇంకా భయపడి ఉండేవాళ్ళు.
ఆ కౌన్సిలర్ ఇరవయ్యేళ్ళ పెళ్లి కాని అమ్మాయి.అయిన ఏమి 
భయపడకుండా వాళ్ళను భయపెట్టకుండా సరి అయిన దారిలో 
నడిపించింది.భయపడితే ఒక్కో సారి మనం చేయగలిగిన పనులు 
కూడా చెయ్యలేము.
ఈ ''181'' లో ఇలాటి మంచి కౌన్సిలర్స్ ఉంటె ఎన్నో ప్రాణాలు 
నిలబడతాయి.

ప్రభుత్వాలు  ప్రజల కోసం ఎప్పుడో ''నిర్భయ''లాంటి వాళ్ళ బలిదానం 
తరువాత కాకుండా, ఎప్పుడూ ఇలాటి మంచి పనులు చేయాలి 
అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

ఏమిటి చూస్తున్నారు ....నంబర్ షేర్ చేయండి 




Friday 18 January 2013

గాయానికి చిగుళ్ళు?

నాకు బాధగా ఉంది మానవతకు అయిన గాయాన్ని 
మళ్ళి మళ్ళి తడమాలంటే ........
నాకు సిగ్గుగాఉంది విషపు ముళ్ళ గాట్లని నగ్నంగా  
మళ్ళి మళ్ళి చూపాలంటే...........
ఏదో ఒక అక్షరం మళ్ళీ మళ్ళీ నా హృదయాన్ని చిదుముతూనే  ఉంది 
బాధ లావాలా స్రవిస్తూనే ఉంది....
గాయాన్నిమళ్ళి మళ్ళి  పచ్చిగా చేస్తూ....

ఈ రోజు చదివాను ....
మళ్ళా గాయాన్ని కెలుకుతూ నాలుగు మాటలు 
ప్చ్....మనం ఇంతే 

మనకు సాంకేతికత కావాలి..శిక్షణ లేకుండా 
డిగ్రీలు కావాలి....నేర్చుకోకుండా 
ధనం కావాలి...వివేకం లేకుండా 
సౌఖ్యం కావాలి.... విచక్షణ లేకుండా 
మతం కావాలి..నిబద్దత లేకుండా 
ఈ రోజుకి బతుకుదామనుకుంటాం ...
రేపన్నది లేకుండా...
ఏది విత్తితే అదే పంట అవుతుందని మర్చిపోతూ 

హ్మ్..మనం ఇంతే....మనం ఇంతే ....ఇంతేనా?


ఎదలోపల ఏదో రాగాన్ని వింటూ తుళ్ళి పడుతుంటాను
అక్షరాలకు ఊహలరెక్కలు తొడిగి దిగంతాల వరకు ఎగురుతుంటాను 
కలల నీటిలో ఎగిరిపడే చేపలా నవ్వుతుంటాను

అదిగో ఉన్నట్లుంది వినిపిస్తుంది ఒక్క ఆక్రందన ...
ఏ పశువు కాలి గిట్టల క్రింద నలిగిన పసి మొగ్గదో 
కట్నపు కోరల్లో బలి అయిన విషాదానిదో 
అనుమానాగ్ని కీలల్లో కాలుతున్న హృదయానిదో 
ఆసిడ్ దాడులు ఎదుర్కున్న అందానిదో....
వివక్షల్లో నలిగిపోయిందో 
కామెంట్లతో కుంగిపోయిన మనసుదో 
అక్రమ సంబంధాలకు అకారణంగా బలి అయిందో 
తప్పు లేకుండానే అపరాధభావనతో నలిగిన పసి మనస్సుదో 
ఏదో ఒక మూలుగు....శక్తి విహీనమై 
సహాయం కోసం ఎదురు చూస్తూ 
మళ్ళి మళ్ళి హృదయపు గాయాపు పచ్చిని తిరగబెడుతూనే ఉన్నాయి 
చీము నెత్తురు కన్నీళ్ళుగా మారి  రాలుతూనే ఉన్నాయి...

రోషపు పిడికిళ్ళు బిగించాలని ఉంది 
మీకేమి హక్కు మా మీద  అని చెంపలు పగలగొట్టాలని ఉంది 
జుట్టు పట్టుకొని నది వీధిలోకి లాగాలని ఉంది
తప్పు లేకున్న వేలెత్తి చూపిస్తున్న చేతులను విరిచేయ్యాలని ఉంది...

బయటకు కదలాలి అనుకున్నపుడే తెలుస్తాయి కాళ్ళకు కట్టిన సంకెళ్ళు 
మాటలు రాల్చాలి అనుకున్నప్పుడు తెలుస్తాయి కలానికి ఉన్న హద్దులు 
హద్దులు చీల్చుకొని సూర్య కిరణం లా మారి 
ఇంకొక వైపు ఇంద్రధనుస్సుని విరియించాలి అని ఉంది  
నీకెందుకు అంటే ........
వెధవ హృదయం ఇంకా జీవపు ఊపిరి పీలుస్తున్నందుకు కాబోలు 

(ఒక ఆంగ్ల కవిత స్వేచ్చానువాదం పూడూరి.రాజిరెడ్డి గారి ది,లింక్ )


Tuesday 15 January 2013

పప్పులు బెల్లాలు ఒక మంచి పుస్తకం

పోయిన సంవత్సరం చదివిన వాటిలో ఒక మంచి పుస్తకం 
''పప్పులు బెల్లాలు''.ఇది ''కోట పురుషోత్తం ''గారు పిల్లలకు 
స్పూర్తి కలిగించే వివిధ పద్యాలు,కధలు,వ్యాసాలూ తో 
నిండిన ఒక సేకరణ .ముందుగా పురుషోత్తం గారిని ఒక 
మంచి ప్రయత్నం చేసినందుకు అభినందిస్తున్నాను.
వారే ''రెండో ప్రపంచ రచయితల సదస్సు''సావనీర్ లో నా పేరు  
చూసి ఫోన్ చేసి ''అమ్మా  నేను పప్పులు బెల్లాలు అనే పుస్తకం లక్ష కాపీలు 
ప్రచురించి టీచర్ లకు,పిల్లల కు ఉచితంగా పంచుతున్నాను.చదవండి.
చదివించండి.పిల్లలను స్పూర్తితో నడిపించండి''అని చెప్పి 
ఇరవై పుస్తకాలు పంపారు.

ఏందబ్బా ఈయన నాకన్నా పిచ్చోడి లాగా 
ఉన్నాడు ఉత్తినే డబ్బులు ''పప్పులు బెల్లాలు''గా పంచేస్తున్నాడు అనుకున్న 
మాట నిజం.కాని ఆ పుస్తకం చదివిన తరువాత ఆయనకు ఫోన్ చేసి 
అభినందనలు తెలపకుండా ఉండలేక పోయాను.పిల్లలకు ఈ బుక్ 
ఇచ్చి వదిలేస్తే చాలు ఇక ఏ దారిలో వెళ్ళాలో వల్లే నిర్ణయించుకుంటారు.
(నిజం ...నా తలగడ దగ్గర పడేసి ఉన్న పుస్తకం మా పాప వదలకుండా 
మొత్తం చదివి దానిలో మాటలు రిపీట్ చేస్తే నేను చాలా సంతోషించాను)
ఆయన నాకు ఇవి అమ్మటం లేదు అని చెప్పారు కాని లోపల పేజెస్ 
లో వంద రూపాయులు,విశాలాంద్ర,నవోదయాలలో దొరుకును అని ఉంది.
ముఖ చిత్రం ,ఆయన ముందు మాట చూడండి.సమీక్ష మళ్ళా వ్రాస్తాను 



చదివారు కదా.తన తండ్రి ఇచ్చిన డబ్బు సార్ధకత చేయాలని,ఆ తండ్రి పేరు 
నిలపాలి అని ఒక కొడుకు చేసిన మంచి ప్రయత్నం.(మీరు కూడా ఎవరైనా 
రచయితలూ పుస్తకానికి సహాయం చేయమంటే చేసి మీ నాన్న గారి పేరు 
వేయండి.ఆచంద్ర తారార్కం ఆ పుస్తకం ఉన్నంతవరకు వాళ్ళు నిలిచిపోతారు)

సరే దీనిలో విషయ సూచిక ఏమి లేదు.వరుసగా ఏమి ఉన్నాయో చెపుతాను.
చిన్న నీతి పద్యాలు పురాణాలలోవి ఇచ్చినవి , పై మెరుగులు చూసి 
స్నేహం చేయకూడదు అని ,చిన్న దానం అయినా కాపాడుతుంది 
అని చిన్న కధలతో పిల్లలకు పద్యాభిలాష కలిగే విదంగా వివరించారు.

ఏదైనా శ్రద్ధ తో చేస్తే ,ఏకాగ్రతతో చేస్తే గెలుపు పొందగలరు.ఇంకా గణితం లో 
''పై''ఎలా కనుగొన్నారో మీరు ప్రయోగాలు చేసి తెలుసుకుంటే మర్చిపోరు.
అని వాళ్ళు ఎలా చదివితే బాగుంటుందో చక్కగా పికాసో,బాపు,నార్కే ఇలాగా 
ఉదాహరణలు చూపుతూ ఇచ్చారు.
అమ్మ అంటే గొప్పది అని ''కవి వర ప్రసాద్ రెడ్డి గారు''ఇంకా ఇతరులు 
ఎలా చెప్పారో పిల్లలు మనసు హత్తుకోనేలాగా చెప్పారు.

ఇంకా కధల మీద అభిరుచి పెంచేటట్లు...వాళ్ళు సొంతంగా కధలు 
వ్రాయ వచ్చు అని చూపేదానికి ఖదీర్ బాబు గారి ''మా అమ్మ 
పూల వ్యాపారం''అనే కధను ఇచ్చి మీరు కూడా ఇలాగ సొంత 
యాస లో వ్రాయండి అని కిటుకులు చెప్పారు.(మా పాప ఈ 
కధ మొత్తం చదివేసి అమ్మ మనం కూడా సన్న జాజుల చెట్టు 
వేసుకున్దాము అనింది.పేదరికం లో కూడా యెంత చక్కగా గౌరవం 
కాపాడుకున్నారో)

ఇంకా ''శ్రీ శ్రీ ''గారి శైశవ గీతిని,ఓల్గా రచనలను ,సుధామూర్తి 
గారు తనకు ఇష్టమైన పుస్తక పటనం అందరికి అందాలి అని 
లైబ్రరీలు ఎలా పెట్టారో చిన్న కధ  లాగా భలే ఇచ్చారు.

ఇంకా ''ఔరంగజేబు తన గురువుకు వ్రాసిన లేఖ''
''అబ్రహం లింకన్ తన కుమారుని గురువుకు వ్రాసిన లేఖ''
టీచర్స్ చదువే కాకుండా వారి వ్యక్తిత్వాలు కూడా 
తీర్చిదిద్దాల్సిన బాధ్యత ను గుర్తుచేస్తున్నాయి.

ఇక చివరిలో ''తెలుగు  పద్యము...మా నాన్న ''అని ఇచ్చిన 
కొన్ని పేజీలు చూస్తె వాళ్ళ నాన్న గారి మీద మనకు ఎంతో 
గౌరవభావం పెరిగిపోతుంది.
ఒక్క మాటలో చెప్పాలి అంటే 

''మీకు ఈ పుస్తకం దొరికితే అదృష్టం.మీ పిల్లలకు ఇచ్చేసి 
చదువుకోమని చెప్పండి.తెలుగు మీద,విలువల మీద,
పెట్టుకోవాల్సిన లక్ష్యాల మీద,అమ్మ నాన్నల మీద వారికి 
యెంత గౌరవం వస్తుందో మీరే స్వయంగా చూస్తారు''

ఇది రచయితగా,ఉపాధ్యాయురాలిగా,అమ్మగా నేను 
అనుభవించి చెపుతున్న మాట.
పురుషోత్తం గారు మీరు ఇంకా ఇంకా ఎన్నో మంచి పుస్తకాలు 
వెలువరించి అందరి హృదయాలలో నిలిచిపోవాలి.





Saturday 12 January 2013

ఆ స్పూర్తి ఇప్పటికీ చైతన్య కిరణం

''దివ్యాత్మలారా మేలుకొనండి ''

''Arise awake stop not still the goal  is reached''

''ఇనప నరాలు ఉక్కు గుండెలు ఉన్న యువతే భారత దేశానికి 
కావాలి ''


ఆర్.ఎస్.ఎస్. కొంత మతవిద్వేషాలు రెచ్చగొట్టింది అనే వాదన ఉన్నప్పటికీ
ముగ్గులు వేసుకుంటూనో,పాటలు పాడుకుంటూనే తిరిగే మా లాంటి
ఆడపిల్లలకు ఒక శివాజీ గూర్చి,మేము జిజియా బాయి లాగా పిల్లలను పెంచాల్సిన
అవసరాలు గూర్చి,వివేకానందుని చైతన్య కిరణాల గూర్చి పరిచయం చేసి
ఈ రోజుకు కూడా మా ఆలోచనలు సమాజ శ్రేయస్సు పై ఉండేటట్లు చేసే ఘనత
దానిదే.కత్తి మంచికైనా చేడుకైనా ఉపయోగపడుతుంది.
దేనికి వాడాలి అనే విచక్షణ మనం పెంచుకోవాలి.

ఆయన మాట దూసుకొని పోయే బాణం.
ఆయన పిలుపు వెల్లువలా యువత ను దూకించే శక్తి
ఆయన ఆచరణ తర తరాలలో నిలిచిపోయే జ్ఞాపకం.

వివేకానందుల వారు చక్కని అందగాడు.పైగా విదేశాలకు వెళ్లారు.
అక్కడ మన లాగా నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వరు.
ఎందరో ఆడవాళ్ళ దగ్గర నుండి ఆహ్వానాలు.మదువు కళ్ళ ముందరే.

కాని కాళికా దేవి అమృత పానం చేసిన వాడికి ఈ మద్యం ఒక లెక్క కాదు.
ఆత్మ సాక్షాత్కారం పొందిన వాడు ఈ మానసిక దౌర్భాల్యానికి లొంగడు.
ఎక్కడ ఉన్నా నా భారతమే నాకు తీర్ధ స్టలి అని గర్వంగా మానసిక
స్తైర్యం తో యువతకు పిలుపునిచ్చారు.దౌర్భాల్యాలకు లొంగిన యువత
దేశానికి చేసేదేమీ లేదు.పర కాంత మాత తో సమానం.

ఉక్కు సంకల్పంతో ,నైతిక విలువలతో నిలిచి పక్కవారికి
స్పూర్తి నివ్వాలి యువత.
150 జన్మదినం సందర్భంగా ఆయన ను ఒక్క సారి జ్ఞప్తికి తెచ్చుకుందాము.

''శిష్యుడు సిద్దంగా ఉంటె గురువు వచ్చి తీరాలి''
అంటే  గురువే వస్తారు అని కాదు నీకు తెలుసుకోవాలి అనే అభిలాష ఉన్నప్పుడు 
నీకు కావాల్సిన జ్ఞానం పుస్తకంగానో,మనిషి మాట రూపం లోనో 
తప్పక వస్తుంది.నిండిన టీ కప్పులో ఏమి పోయలేము.
అహంకారం తో నిండిన వానికి జ్ఞానం లభించదు .

రామ కృష్ణుల వారు అంటారు 
'పక్క గదిలో ధన రాసులు ఉనాయని తెలిస్తే వాటిని చేరాలి 
అని దొంగ యెంత తపించి పోతాడో అంతగా మనం దేవుని కోసం 
తపించాలి''

''బాలస్తావా క్రీడాసక్త 
స్తరుణస్తావ  త్తరుణీ సక్తః 
వృద్ధ స్టావ చ్చిన్తా సక్తః 
పరే బ్రాహ్మణి కోపి నసక్తః ''


(venu gopal reddy gari article link ikkada)

Friday 11 January 2013

లోక హితార్ధమే తిరుప్పావు


పండుగ ఒక్క రోజే పట్టు చీర కట్టినా మన సంస్కృతీ ఈ మాత్రం నిలిచి ఉంది అంటే 
అది చాలా వరకు ఆడ వారి వలననే.అంతర్లీనంగా వారు చేస్తున్న కృషి 
పలితం గానే ఒక తరాన్నుండి ఇంకో తరానికి అది ప్రవహిస్తూ ఉంది.
గోదా దేవి,రంగనాయకుల కళ్యాణం లోక హితార్ధమే.ఆరాధనా భావానికి గుర్తు.
మిగిలిన రోజులలో మీకు వీలు కాకున్నా పర్వాలేదు.భోగి పండుగ రోజు అయినా 
అమ్మ వారికి పూజ చేసి ''తిరుప్పావు''పాడుకోండి.ఇక్కడ తెలుగులోనే ఇచ్చాను.
మీరు సులభంగా చదువుకోవచ్చు.భాష ముఖ్యం కాదు,భక్తి  ముఖ్యం.






Thursday 10 January 2013

బోలెడు నవ్వులు :))

ఈ రోజు జి.ఆర్.మహర్షి గారి ''కిస కిస''ఆర్టికల్
చదివినాక ఇప్పుడు మేము ఎదుర్కుంటున్న బోలెడు నవ్వులు
గుర్తుకు వచ్చాయి.
(జి.ఆర్.మహర్షి ఆర్టికల్ లింక్ ఇక్కడ )

అపార్ట్ట్ మెంట్ భలే చీప్ గా సాదించారే ఆటోలకు కూడా
అనుకూలంగా అని మిత్రులు అన్నప్పుడు జ.హా ఇచ్చేసి

డబ్బులకోసం పన్ను నొప్పి తగ్గడం కోసం చేతిలో
డెబ్బై వేల జీతం కాగితాలు పెట్టుకొని బయలుదేరినపుడు
మనకు కాక వేరే వాడికి ఎందుకు ఇస్తారని వి.హా చేసుకొని

రెండు నిమిషాలు అనుకున్న మనకు రెండు గంటల పైనే కూర్చో పెట్టి
ఇవ్వడం ఇష్టం లేదని తెలుస్తున్నా యేవో కాగితాలు తెస్తే
వచ్చే ఏడాది ఇస్తాము అది కూడా  మీకు కాబట్టి ఇస్తాము అని
బ్యాంక్ అన్నప్పుడు సూది వేసినా కనపడే మహా నంది కొలను
లాంటి మన మొహాన్ని కష్టపడి మొ.హా తో కప్పెసుకొని

ఒకరేమో సెలవు అంటారు ఒకరేమో అంత  ఇవ్వలేము  అంటే
నిజమే కాబోలు అని పక్కకు చూస్తె మన పక్కింటి కోటి గాడికి
కోటి రూపాయలు శాంక్షన్ అవ్వడం చూసి
గోచి గుడ్డ తో తిరిగేవాడు వ్యాపారం చేస్తాడు అని ఎట్టా  నమ్మారో
కోటి రూపాయలు ఆస్తి ఇస్తామన్న మనకు లక్షలు ఇవ్వటానికి నమ్మడం లేదే
అనుకోని మ.హా

ఎన్ని బ్యాంకులు తిరగాలని నీరసంగా అంటే నిన్ను చూడందే ఇవ్వరు
అని శ్రీ వారు అంటే పోనీలే డియర్ నీ కోసం ఎన్నిబ్యాంకులకు అయిన
వస్తాను అని కొర కొరలు కప్పేస్తూ వి.హా ఇచ్చేసి

లాస్ట్ బాంక్ ఇదేనని తెసుకెళితే వాడు అన్నీ విని అలాగే
ఇస్తాము అని చెప్పి ముందు కార్ లోన్ తీసుకోండి నాకు
టార్గెట్ పూర్తవుతుంది అని చెపితే మాడిపోయిన శ్రీవారి
మొహం చూసి లోల్


ఇంక వదిలేస్తావా అని అడిగితె లేదు వచ్చేస్తుంది
అని ధైర్యంగా లైఫ్ ఇన్స్యూరెన్స్  వైపు చూపిస్తే
ఆహా మన లైఫ్ కు యెంత బద్రత అని చి.హా

వాడు మనం చూపించిన కాగితాలు అన్నీ పనికి రావు
అని చెప్పి వేరే కాగితాలు అండమాన్ నికోబార్ దీవిలో
తెమ్మని చెప్పినపుడు కిం.ప.దొ.న ......

భళి భళి భళి భళి దేవా బాగున్నదయా నీ మాయ...
బహు బాగున్నదయా నీ  మాయ......అనుకొని
జీవితం నేర్పే సహనం అనే పాటాన్నినేర్చుకోవడమే
అంతకన్నా చేసేదేమీ లేదు.

(జ.హా =జయ హాసం
వి.హా =వికటాట్టహాసం
మొ.హా=మొహమాటపు హాసం
మ.హా=మధ్య తరగతి మందహాసం
వి.హా=విరక్తి హాసం
కిం.ప.దొ.న=కిందపడి దొర్లి నవ్వడం
వీటిలో చాలా బ్లాగర్ బులుసు సుబ్రమణ్యం గారు చెప్పినవి)


Tuesday 8 January 2013

అభౌతిక స్వరం.....ఒక చక్కటి పుస్తకం

''అభౌతిక స్వరం''పోయిన సంవత్సరం లో 
నేను చదివిన ఒక మంచి పుస్తకం.
పెద్ద వాళ్ళల జీవితం లో ఒక సంక్లిష్ట క్షణాన్ని 
తీసుకొని దానిని వారు ఎలా ఎదుర్కున్నారో
లేదా ఆలోచించారో రచయిత ''మాధవ్ .శింగరాజు''
గారు చాలా చక్కగా వ్రాశారు.కవితా శైలిలో సాగిన 
వచనం పుస్తక ప్రియుల ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది 
అందు  లో సందేహమే లేదు.
పుస్తకాలు ''కినిగే''లో మరియు ''నవోదయ''లో లభ్యం.
ఎవరికైనా దొరకక పొతే ఈ నంబర్ కు ఫోన్ చేసుకోవచ్చు.
9848618166
''అభౌతిక స్వరం''పేరు వినగానే 
దేని గూర్చి అని కొంత
కుతూహలం.దానిని తీరుస్తూ 
ముందు మాటలోనే వ్రాశారు 
రచయిత''అభౌతిక స్వరం 
అంటే మంద్ర స్వరం.జీవిత 
అనుభవాలతో రాటు దేలిన 
మనిషి భౌతికంగా మెత్తబడినా 
అభౌతికంగా అది పదును 
తేలిన మృదు బాషణ''

మాధవ్.శింగరాజు గారు 
సాక్షి ఫ్యామిలీ లో వ్రాసిన ''నేను''
శీర్షిక లో వచ్చిన గొప్పవాళ్ళ
స్వగతాలు ఇవి.ఇప్పుడు ఈయన 
సాక్షి లో పనిచేస్తున్నారు.
అంతకు ముందు వార్తలో పని చేస్తూ 
వెనుక పేజ్ ''ఛాయాచిత్రాలు''
మాధవ్ గారిగా అందరికి పరిచితుడు.
ఇది మొదటి పుస్తకం.
గొప్పవారి జీవితం లో 
ఏదో ఒక సందర్భం లో వారి 
అంతరంగ ఘర్షణ స్వరంగా మార్చి
అక్షరాలుగా కూర్చి మన ముందు 
ఉంచారు రచయిత.
''వచనం కవిత గా మారితే 
స్వరం గా మారి అలరిస్తుంది''
ఒకరు ఇద్దరు కాదు 
యాబై మంది పైగా  ప్రసిద్ధుల 
ఆలోచనలోతుల్లోకి మనలను 
అలవోకగా తీసుకొని వెళ్లి ...అరె 
అంతలోనే అయిపోయిందా?
అనుకునేలా చేస్తారు రచయిత.
(ఇంకా చాలా మందివి 
పుస్తక కూర్పులో లేవు.
కాగితపు కొరత కాబోలు)

పేరుకు మంద్ర స్వరమే 
కాని వ్యక్తుల స్వభావాలను బట్టి 
వారి అంతరంగాలు 
మధ్య స్తాయిలో,హెచ్చు స్తాయిలో 
భావాలను మన ముందు పరుస్తాయి.
ఒక వైపు ఐన్ స్టీన్ మనతో గాంధీజీ 
ఆత్మను పంచుకుంటూ ఉంటె 
ఇంకో వైపు అలగ్జాండర్ ''ఖండాలు 
సరిపోని వాడైనా పుడమి కడుపులో 
ఇమిడిపోవాల్సిందే''అని తాత్వికతను 
పులుముతుంటాడు.
శాలింగర్ ఏకాంతపు కారణం 
అక్షరాలకు అద్దుతూ ''ఏమి చెప్పమంటారు?
నేను ఇష్టపడే వ్యక్తుల పై మొహం మొత్తి
జబ్బున పడ్డాను.నేను గౌరవించే వ్యక్తీ కావాలి ''
అని అన్వేషణ లో ఉంటాడు.
అంతలోనే నోస్ట్రాడామస్ తనను గౌరవించె వాళ్ళతో 
''దివ్యదృష్టి దైవ సృష్టి ....
ఆయన ఊదే ఒక బూరను మాత్రమె ''
అని తన ఉనికికి ఊపిరి ఎవరో చూపుతుంటాడు.
జ్యోతీబా పూలే,జేమ్స్ కుక్,జెరో నీమో,రమణ మహర్షి,
ఆర్.కే.లక్ష్మణ్ ,సలీం ఆలి ఎంతో 
మంది ఆలోచనలు మాధవ్ గారి 
అక్షరాలతో కొత్త సొబగులు దిద్దుకొని 
కాగితం పై అలవోకగా వొదిగి 
మన దృష్టి ని పుస్తకం నుండి మరలనీవు.

అసలు ఆడవాళ్ళ అంతరంగాలు 
మగ వాళ్ళు ఎలా వ్రాయగలరు 
అనే సంశయం వస్తే 
''బిల్లీ జాన్ కింగ్''టెన్నీస్ లో 
బాబి రిగ్స్ ని ఓడించినపుడు 
తన భుజం తట్టిన తీరు.....
''కల్పనా చావ్లా''కళ్ళలో ఆత్మా విశ్వాసం 
అక్షరాలుగా రగిలినపుడు....
చూపు తగ్గినా ''మేడం క్యూరీ ''
విజయం నుండి చూపు తిప్పనపుడూ...
అంతరంగావిష్కారానికి కావాల్సింది 
అంతర్నేత్రం తప్ప జెండర్ కాదు 
అనిపిస్తుంది. 
చక్కటి శైలి,భావ పుష్ఠి 
మనలను అలరిస్తాయి.పుస్తక ప్రియులు 
తప్పక చదవ వలసిన పుస్తకం.
రచయిత ముందు ముందు 
ఇంకా మంచి రచనలు 
తీసుకుని వస్తారని ఆశిద్దాం.