Thursday 20 March 2014

కొంచెం కవిత్వపు టీ పార్టీ



మార్చ్ ఇరవై ఒకటి ''ప్రపంచ కవితా దినోత్సవం ''
అన్నారు . మరి ప్రపంచమే ఇది జరుపుకోనేటపుడు
కొందరికి ఈ రోజు ఇంకా ఇరవై తేది ఉంటె కొందరికి 
ఇరవై ఒకటి  వెలుగు విచ్చుకొని ఉంటుంది . 
ఈ రోజు పోస్ట్ వేసినా పర్లేదు అనుకోని వేస్తున్నాను . 
మనిషి హృదయం అక్షరాలుగా రాలాలి అనుకున్నప్పుడు 
తేదీ ల మబ్బులు కోసం ఎదురుచూడదు . అది స్వయంభువు . 
తనకు తాను మదినుండి జాలువారి ఇతరుల మదిని 
మురిపిస్తూ రగిలిస్తూ కదిలిస్తూ ఆలోచనల లో ముంచేస్తూ 
ఉప్పెనగా ఎగసిపోతుంది . 

చాలా మంది అడుగుతుంటారు ... కవిత్వం ఎలా వ్రాయాలి ?
అని . 
నాకు తెలిస్తే కదా చెప్పడానికి !
ఎక్కడో ఏదో జరుగుతుంది ,ఒక బాధో 
ఒక నవ్వో ,ఒక అన్యాయమో ,ఒక ఆవిష్కరణో
తటాలున హృదయం స్పందిస్తుంది ... 
ఏదో ఉద్విగ్నత మనసుని నిలవనీదు . 
అరచేయి కూడా కాగితం అయిపోతుంది . 
భావం అక్షరం అయి నిలిచిపోతుంది . 
సలహా కావాలి అంటే ఒకటి ఇవ్వగలను . 
చదువు .... నీకోసం ముందటి వాళ్ళు 
కోట్ల భావాలు అక్షరాలుగా  పేర్చి పుస్తకాలుగా 
శరీరాలను మార్చుకున్నారు . ఏమి ఆశించకుండా 
చదువు అంతే . ఆ భావాలుగా నువ్వు మారేటట్లు , 
ఆ శకలాలను తాకేటట్లు ... కవిత్వంగా నువ్వు 
బయటకు పొంగేదాకా చదువుతూనే ఉండు ,
ఆ అమృతపు ధార కలం నుండి జాలువారుతుంటే 
అమ్మ తొలి చూలు బిడ్డను చూసుకున్నంత తృప్తి . 
కవిత్వం అంటే అంతే . ఇంకేమి లేదు .  

ఫేస్ బుక్ గ్రూప్ ''కవి సంగమం '' లో నా కవిత 

   

          ఎందుకో మరి కవిత్వమై 


ఒక్కోసారి .... 
ఎందుకో తెలీదు 

తొలి కిరణపు ముందటి గాలినై 
నిద్ర మబ్బులో ఉన్న మొగ్గల్ని 
లేపుతుంటాను 

సంజె వెలుగుతో చేరి 
పక్షుల ముక్కులపై 
కువ కువలాడుతుంటాను 

నల్లమబ్బు నుండి జారే 
తొలి చినుకులా తుళ్లి 
అలలపై చేరి 
ఆటలాడుతుంటాను 

అవమానిత ఎద
 గాయపు మంటనై 
ఆగ్రహపు సెగలు 
కక్కుతుంటాను 

అబలల ఆక్రందనలు 
మోసుకు తిరిగే 
కన్నీటి చుక్కనై
నేలకు రాలుతుంటాను  

దైన్యాన్ని కప్పుకొని 
నాలోకే ఒదిగి 
మౌన తపస్వినిగా 
మారుతుంటాను

తలపులను విదిల్చి 
కలపు రెక్కలు కదిల్చి
అక్షరాలను 
వెదజల్లుతుంటాను   

అవధుల్లేని ఆకాశాన్ని తాకి 
నా హద్దులు మరిచి 
విశ్వానికి ఊపిరులు 
ఊదుతుంటాను 

నా ఉనికికి 
ప్రపంచానికి 
మధ్య రేఖ ను కానక 
నేనే అది 
అదే నేను అయిన 
విశ్వాత్మగా 
నిలిచిపోతుంటాను .... 
కవిత్వమై కదిలిపోతుంటాను .... 

ఒక్కోసారి .... 
ఎందుకో తెలీదు . 

1 comment:

Karthik said...

Wowww..really superb:):)