Monday, 27 August 2012

సత్య భామ సరదాలు 4

బండి క్రింద పార్క్ చేసి ఇంటి మెట్లు ఎక్కుతున్న మూర్తి కి 
ఎడమ కన్ను అదురుతూ ఉంది.ఇంటి ముందుకు వెళ్ళే సరికి 
సత్య ,పక్కింటి ఆమె ఏదో సీరియస్ గా మాట్లాడుతున్నారు.
మొత్తానికి ఏదో గొడవ పడుతున్నారు.దగ్గరగా వెళ్లి నిలుచుకుంటే 
పక్కింటి ఆమె ''చూడండి సార్  ఇది ఏమైనా పద్దతిగా ఉందా?''
అని ఏదో చెప్పబోయింది.

''ఇది ఆడ వాళ్ళ విషయం ఆయనతో పని ఏమిటి?''అడ్డు పడింది 
సత్య...కాసేపు టాం అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటే ....గిర్రున 
కళ్ళు తిరిగిన మూర్తి కి అర్ధం అయింది ఏమిటంటే పక్కింటి ఆవిడ 
మోటార్ వేసి నీళ్ళు  పటుకుంటుంటే సత్య తను కూడా ఇంట్లో 
ట్యాప్ తిప్పి నీళ్ళు పట్టుకునింది.అక్కడ ఒకరు తిప్పితే ఒకరికి 
నీళ్ళు రావు.పట్టు వదలని భేతాళుడిలా మూర్తి ని ఇంట్లోకి పోనీకుండా 
నాలుగు దులిపేసి ఉక్కిరి బిక్కిర్ చేస్తుంది పక్కింటి ఆవిడ.
ఇంటికి రాగానే నీళ్ళు కూడా తాగకుండా ఏమిటి ఈ న్యూసెన్స్ ...
భలే కోపం వచ్చేసి సత్య ను దులిపేసాడు పెద్దగా...
''ఏమిటి చదువుకున్న  దానివేనా ,ఎందుకు తిప్పావు కుళాయిలో నీళ్ళు 
లోపలి కి  నడు లేకుంటే చంపేస్తా''ఉరిమాడు .....
పాపం తరువాత వచ్చే తుపాను గూర్చి తెలీక.

గెలిచినందుకు సంబరం తో పక్కింటి ఆవిడ పెదాలపై తళుక్కున 
మెరిసిన విజయ దరహాసం....మసక చూపుతో చూసి తల 
వంచుకొని నీళ్ళు నిండిన మబ్బులా  వెళ్ళిపోయింది లోపలికి.


అత్తా కొట్టినందుకు కాదు తోడు కోడలు నవ్వినందుకు అని 
మనసు కుత కుత ఉడుకుతోంది సత్యకి.పాపం అమ్మగారింట్లో 
ముద్దుల బాల అందులో ఎవ్వరిని నొప్పించడదు.
అందుకు ఒక్కరు ఒక్క మాట అనరు.అసలు ఈయనకు ఏమి పని అక్కడ 
..ఆలోచిస్తుంటేనే కళ్ళ నీళ్ళ పర్యంతం అయిపోతూ ఉంది.

విసురుగా నీళ్ళు,టీ గదిలో పెట్టేసి వెళ్లి పొయ్యింది.
ఏదో వ్రాసుకుంటున్న మూర్తి మాట్లాడపొయ్యాడు.కాని 
మనసుకు తుపాను వాసన వచ్చింది.పెళ్లి అయ్యి మూడేళ్ళు అయినా 
పిల్లలు లేరు కాబట్టి కొత్త దంపతులే.మళ్ళా  తల వంచుకొని రేపటి 
ఇన్స్పెక్షన్ కి నోట్స్ వ్రాసుకుంటూ ఉండిపోయ్యాడు.

రాత్రి నిశ్శబ్దంగా దొర్లిపోయింది వాళ్ళను కలపలేక మద్యలో 
గోడగా మారిపోయింది.హాల్ లో సత్య,రూం లో మూర్తి...
చాలా సేపు ఎదురు చూసాడు.అలాగే నిద్రపొయ్యాడు.
కోపం తో ,రోషం తో ఉడికి పోతున్న సత్య నెలవంక మాత్రం అయినా 
తొంగి చూడలేదు.బాధతో అలాగే నేల పై నిద్ర పోయింది.
ఉదయపు మౌనం రాజీ కుదర్చాలని చూసినా వీలు కాలేదు.
ఇన్స్పెక్షన్ హడా వడిలో మూర్తి  ఆఫీస్ కి వెళ్లి పొయ్యాడు.
సత్యను అలా చూస్తుంటే మదిలో ఏదో వెలితి గా ఉంది.
బండి మీద ఎక్కిన తరువాత కూడా పైకి చూస్తూ ఉన్నాడు.
వచ్చి టాటా చేపుతుందేమో అని.కాని రాలేదు.
                             @@@@@@@@

ఉదయం పదకుండు గంటలు అయింది.మామూలుగా బట్టలు 
ఉతికి బయట ఆరవేస్తుంది సత్య ఈ సమయానికి.
కాని బయటకు వాళ్ళ బుద్ది  కావటం లేదు.పక్కింటి ఆమె 
మొహం లో నవ్వు తలుచుకుంటేనే ....ముక్కు తిమ్మన గారి 
కలకంటి కంట ముత్యాల సరాలు జల జల మని రాలుతూ...
ఎర్రగా మారిన ముక్కు పుటాలు ఆకాశం పై సాయంత్రపు  
కెంజాయ రంగులా,పెదాలు అదురుతూ ...ఒక్క సారి తల 
విదిల్చి వెనుక కిటికీ తీసింది .

ఎదురుగా చిన్న ఇల్లు కింద పోర్షన్ 
అక్కడకు బాగా కనిపిస్తుంది.బట్టలు కుడుతూ ఉంది 
కాబోలు ఇంటిలోని ఆవిడ వాళ్ళ భర్త తలుపు తడితే తీయటానికి వచ్చింది.
తనతో పెద్దగా పరిచయం లేదు సాత్యకి.
ఎప్పుడైనా చూస్తె చిన్నగా నవ్వుతుంది.
భర్త ఏదో ఫ్యాక్టరీ లో పని చేస్తాడు కాబోలు సైకిల్ పై వెళుతుంటాడు.
ఇద్దరు పిల్లలను తను కూడా బట్టలు కుట్టి 
సంపాదిస్తూ మంచి స్కూల్ లోనే చదివిస్తూ ఉంటుంది.

ఆలోచనల ఉయ్యాల ఊగుతున్న సత్య''అబ్బా''అని బాధతో 
వేసిన కేకి ఉలిక్కిపడి కిందకి చూసింది.

భర్త జుట్టు పట్టుకొని వంచి వీపు మీద గుద్దుతూ ఉన్నాడు .
అదేమిటి అలాగ కొడుతున్నాడు.పరువు పోతుందని 
కాబోలు ఒక్క సారి అరిచి ఇంక కేకలు మింగేస్తూ ఉంది.
బాధకు వెలికి వచ్చినట్లున్న రక్తపు ముద్దలుగా మారిన కళ్ళలో 
నీళ్ళు......కింద పడేసి తంతున్నాడు కాళ్ళతో.ఇంక ఆగలేక పోయింది.
సత్య గబుక్కున లేచింది.
లేచేసరికే అమె  పెద్ద గా అరుస్తుంది ''రక్షించండి''అని....
మరి ఇంత సేపు ఓర్చుకొని ఇప్పుడు ఎందుకు కేకలు వేస్తున్నట్లు...
సత్య అలాగే చూస్తూ ఉంది.ఒక్కొక్కరే పోగు అవుతున్నారు...
చూరు మీద నుండి పడే చుక్కలే మడుగుగా మారినట్లు అంతలో 
ఒక గుంపు తయారు అయింది.

విషయం అర్ధం అయింది.''కొట్టండి రా  నా కొడుకుని''పట్టుకొని 
వీపు మీద రెండు వేసారు.చిత్రం సత్య ఆమెను చూస్తుంది .
ఆవిడ మౌనంగా చూస్తూ ఉంది.
కళ్ళలో చిత్రమైన భావం కొట్టనీలే అన్నట్లు.
కొన్ని దెబ్బలు పడగానే వాడికి కొంచెం బుద్ది  వచ్చినట్లు ఉంది
భార్య ను చూసి నమస్కారం పెట్టాడు కాపాడమని.
అడ్డం వచ్చింది....లేపింది చెయ్యి ఇచ్చి ....
నుదిటి పై కారుతున్న రక్తం...కొంగుతో తుడిచింది.

''రేయ్ ఇంక ఎప్పుడైనా  కొట్టావో''అరిచారు ఒకరు.
''వదిలేయ్యండన్నా...ఇంకెప్పుడూ చెయ్యడు''వాడికి బదులు 
బతిమిలాడింది .అందరు వెళ్లి పోయ్యాక మత్తు దిగినట్లు ఉంది.
అపుడే వచ్చిన పిల్లల తలపై చేతులుంచి ''ఇంకెప్పుడు 
తాగను రాజ్యం''పొగిలి పొగిలి ఏడుస్తున్నాడు.మెల్లిగా 
నడిపించుకు వెళ్ళింది.బిత్తర చూపులు చూస్తున్న పిల్లలను 
ఇంకో చేత్తో పట్టుకొని లోపలకు తీసుకెళ్ళింది.

మళ్ళా తలుపు వేయటానికి వచ్చింది.గాబరాగా చూస్తున్న 
సత్య వంక చిరు నవ్వు తో చూసింది.తాళి బొట్టు చేతితో 
చూపించి ....నుదిటి మీద బొటన వేలు చూపించింది...
''ఏమి చేద్దాము మొగుడు కదా''అన్నట్లు.

(చిన్నవాడి వైతేను చెయ్యెత్తి కొట్టేను....పెద్ద వాడివి అయితేను 
బుద్ది మంచి నేర్పేను )

ఇంతలో తలుపు చప్పుడు.ఈ వేల అప్పుడు ఎవరు అయి ఉంటారు 
కలత పడిన మనసుతో అటు కదిలింది ....సత్య...

                   (సశేషం ....మరి నాకు టైం లేదు.మిగిలినది రెండో భాగం లో)

Friday, 24 August 2012

వైశాలి...వదల బొమ్మాళి

హ్మ్....ఈ వేణు శ్రీకాంత్ ఒకడు ....
ఈయన అమ్మ పోస్ట్ వెయ్యగానే నాకు మా పిల్లలు గుర్తుకు వస్తారు.
ఈయన గోవిందా అనంగానే...నేను తిరుమలా అంటాను.
ఇప్పుడేమో దెయ్యం పోస్ట్ వేసాడు?

సర్లే వేస్తె వేసాడు అంటే ఈ రాజ్ కుమార్ సప్పోర్ట్ ఒకటి.
అబ్బో అరుందతి ని చూసి కేవ్వ్వ్వ్వ్వ్వ్ మన్నోళ్ళు  అని...

నేను యెంత దెయ్యాల సినిమా చూసి రాత్రిళ్ళు  మేలుకొని 
పక్కణ ఉన్న వాళ్ళను  పిశాచి లా పీక్కొని తినేదాన్ని అయినా 
నేను ఇష్టంగా(టి.వి.లో)చూసిన దెయ్యం సినిమా ఒకటి ఉంది.
(లేకుంటే జాలితో).......అదే వైశాలి ..... 

ఎప్పుడో అందరు చూసిందే అయిన మరొక్కసారి.....
వైశాలి అంటే మన అమ్మాయి...మన పక్కింట్లో ఆడుకునే 
చుట్టూ పక్కల తిరిగే పద్దతిగా పెరిగిన మనలో ఒకటైన 
అమ్మాయి.....స్వాతి ముత్యం అంత  స్వచ్చంగా ఉంటుంది.


ప్రేమ అనేది చెట్టుకే తెలీకుండా వసంతం లో వేసే కొత్త చిగురులా పుట్టుతుంది, 
కాబట్టి తెలీకుండానే తన వెంటబడే వాసు అనే అబ్బాయితో ప్రేమలో పడిపోతుంది.


అతనేమీ అల్లరి చిల్లరిగా తిరిగే వాడు కాదు.ఒక ఐ.పి.ఎస్.అవ్వాలనే లక్ష్యం 
తో ఉన్నవాడు.అమ్మాయి కూడా పద్దతి గల్లదే  కాబట్టి ఇద్దరం 
 స్నేహితులుగానే ఉందాము ....నాన్నకు నచ్చితే పెళ్లి అంటుంది.

ఇక్కడ కధ మలుపు తిరుగుతుంది.వైశాలి వాళ్ళ నాన్నకి వాసు పోలీస్ 
కావటం ఇష్టం లేదు.వేరే జాబ్ అయితే ఇస్తాను అంటాడు.
కాని వాసు తన లక్ష్యం అదే అని చెప్పి వెళ్లి పోతాడు.


 వాళ్ళ నాన్న వేరే అబ్బాయిని ఇచ్చివైశాలికి  పెళ్లిచేస్తాడు.
సరే చక్కగా భారతీయ స్త్రీ లాగే వాసుని మర్చిపోయి ప్రేమగా చూసుకొనే 
భర్త తో కాపురం చేస్తూ ఉంటుంది.
ఏమవుతుందో తెలీదు వైశాలి చచ్చి బాత్రూం నీళ్ళ టబ్ లో పడి ఉంటుంది.

ఇక తరువాత నుండి మొదలు అపార్ట్ మెంట్స్  లో ఒక్కొక్కరు చని పోవటం ...
మొదట పక్కింటి ఆంటీ,ఎదురింటి అంకుల్,ఇంకో అబ్బాయి.....
ఈ కేస్ లు ఇన్వెస్ట్ చెయ్యటానికి ''వాసు''పోలీస్ ఆఫీసర్ గా వస్తాడు.
ప్రతీ హత్య జరిగినపుడు నీళ్ళు  ఉండటం చూస్తాడు.కాని అతనికి 
విషయం అర్ధం కాదు.అప్పుడు వైశాలి వాళ్ళ చెల్లి లోకి వచ్చి 
తనను చంపిన వాళ్ళు అందరిని పగ తీర్చుకున్నాను 
 అని చెపుతుంది.

జరిగింది ఏమిటంటే ......ఒక మగావాడిని చంపాలంటే కత్తో,
ఏదో ఒక ఆయుదమో కావాలి....
కాని ఆడదానిని చంపాలంటే నీచపు మనస్తత్వంతో నింద  వేసే 
నాలుక చాలు....ఇప్పుడూ అదే జరిగింది.చక్కగా కాపురం చేసుకొనే 
ఒక అమాయకపు అమ్మాయి నిందలకే బలి అయిపొయింది.

ఒక రోజు భర్త వైశాలికి తాను  ఇంతకు  ముందు ఒక అమ్మాయిని 
ప్రేమించాను ఇప్పుడు మర్చిపోయ్యాను అని చెప్పి నీ సంగతి 
చెప్పు అంటే...నేను వాసు అనే అబ్బాయిని ప్రేమించాను అయితే 
మర్చిపోయ్యాను అని అమాయకంగా చెప్పేస్తుంది.

ఇక అక్కడ నుండి రగిలిపోతాడు....ఎదురింటి అంకుల్ 
వైశాలి గూర్చి బ్యాడ్ గా చెపుతాడు భర్తకి ...ఆతను 
పనమ్మాయి తో అసభ్యంగా ప్రవర్తించిన సంగతి 
వాళ్ళ భార్యకి చెపుతాను అని వైశాలి చెప్పేసరికి. 
దానికి ఆజ్యం పక్కింటి అంటి పోస్తుంది .....
నువ్వు లేనప్పుడు ఎవరు ఎవరో మగ వాళ్ళు 
ఇంటికి వస్తున్నారు అని సాక్ష్యం చెప్పి  (తన కూతురు కొనాల్సిన 
అపార్ట్మెంట్ వైశాలి వాళ్ళు కొన్నారని కోపం తో)

ఇక ఎదురింటి అమ్మాయి ని ''మగ వాళ్ళతో తిరాగ వద్దు  జాగ్రత్త ''
అని చెపుతుంది వైశాలి... అందుకు కోపం తో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ 
వాచ్ మాన్ ఎవరి కోసం వచ్చావు అంటే ''వైశాలి''కోసం అని 
చెప్పి ఇంకా నింద  ను పెద్దగా చేస్తాడు.

భర్త రగిలి పొయ్యి చివరికి కోపం తో వైశాలిని చంపేస్తాడు.
కాని అమాయకపు  ఆడపిల్ల తన కసిని చంపుకోలేక 
ఆత్మ గా మారి వాళ్ళు అందరిని చంపేస్తుంది.
చివరకు వాసు వైపు సాక్ష్యం చెప్పి వాసు తన చెల్లెలిని పెళ్లి 
చేసుకోనేటట్లు చేస్తుంది.

కాని ఇది యెంత మంది జీవితాలలో జరిగే విషాదం 

మొన్న ఒక ప్లస్సర్ వ్రాసారు...వీకెండ్ లో కూడా పని ఉందని 
ఆఫీస్ వాళ్ళు  ఇంటికి వెళ్ళద్దు అని చెపితే ....లేదు నన్ను ఇక్కడ 
ఉంచితే ఏమి చెయ్యలేను.ఒక్క సారి ఇంటికి వెళ్లి వస్తేనే నాకు 
ఎనేర్జీ అని ఆతను అంటే  ....ఇంక ఆఫీస్ వాళ్ళే అతన్ని పంపారంట 
ఇంటికి వెళ్లి మళ్ళా ఆఫీస్ కు రమ్మని.నిజంగా కుటుంభ బంధాలు 
యెంత బాగుంటాయి....యెంత బలాన్ని మనిషికి ఇస్తాయి.

వాటిని వృధాగా ఎవరో చెప్పారని అనుమానంతో నాశనం 
చేసుకొని అమాయకపు ఆడపిల్లల ఉసురు పోసుకోకూడదు.
మనం కూడా ఆడపిల్లల గూర్చి మాట్లాడేటప్పుడు ఆలోచించి 
మాట్లాడాలి.

'ముత్యాల ముగ్గు''సినిమాలో చెపుతుంది...''పెళ్లి అయ్యే 
దాకా అమ్మాయి చూసుకునే అద్దం  లాంటిది ...ఎందరో 
పెళ్లి కొడుకులు  వస్తుంటారు, చూస్తుంటారు,వెళుతుంటారు.
భర్త రాగానే అది ఫోటో ఫ్రేం అయిపోతుంది.అందులో భర్త తప్ప 
ఇంక  ఎవరు కనపడరు''అని.
అది నిజంగా నిజం.భర్తలే అనుమానించి నిముషం ,
నిముషం గుర్తు చేసి అమానుషంగా మానసిక 
చిత్రవధ చేస్తే....ఎవరికి చెప్పుకోలేక ఎందరో ఆత్మా హత్య ల వైపు 
నెట్టి వెయ్యబడుతున్నారు.

ఒక్క సారి మానవత్వం  తో ఆలోచించండి.చాలు .....

'మరి దెయ్యాలు,పగలు ఉన్నాయా అంటే.....ఒకటే చెపుతాను...
నిజంగా ఏదో ఒక భయమే మనిషిని మంచి దారిలో నడపగలదు 
అంటే...అది నిజంగా దెయ్యమే కాదు,పిశాచి,రక్త పిశాచి,భూతం..
ఇంకా రక రాకా లుగా మారి మీ పాపమే మిమ్మల్ని ముప్పు 
తిప్పలు పెడుతుంది అని చెపుతాను''

అమాయకుల ఉసురు ఊరికినే పోతుందా?



Wednesday, 22 August 2012

చిన్న వంటకం....

      lovely sandwitch with del sketchup
just try and see how it taste ....)))

first take some chapaati pieces and add chopped onions,
green chillee pieces,salt and mix thourougly with
tomoto kech up ....take this mixture in a bowl.



and toast  two breads put this mixsture
between them.

a tasteful sandwitch is ready for you with out a
hard preparation.



Thursday, 16 August 2012

పకడో...పకడో...పకడో....లాయి...లాయి...


పకడో...పకడో...పకడో....లాయి...
లాయి...
వదలకుండా పట్టుకున్నాను స్వాతంత్రం వచ్చింది కాబట్టి వెళ్ళాల్సిందే 
అని....సరే పద ..ఏమి చేస్తాము?

ఎలాగైతే మనకు ఎందుకు మన కోరిక తీరింది.పిల్లలు ముందు వెళ్లి పొయ్యారు.
వెళ్ళటమే మేలు అయింది.హాల్ నిండి ఉంది.నేల ఖాళీ.వీళ్ళు ముటామేస్త్రి లాంటి 
సినిమాలు లేక పోయేసరికి రావటం లేదో...లేక మన్మోహన్ దెబ్బకి అందరు దారిద్ర 
రేఖ ఎగువకు వెళ్లి పొయ్యారో.బెంచ్ పర్వాలేదు.
చైర్స్ అన్నీ పిల్లల అల్లరితో కువ కువ లాడుతున్నాయి.హమ్మయ్య ఎన్నాళ్ళకి 
అందరు కలిసి మెలిసి నవ్వుకుంటూ....
కధ లోకి వస్తే ''రవి పని పాట లేని జులాయి.వాళ్ళ నాన్న,అమ్మ,చెల్లి ఇది 
కుటుంభం.నాన్న లెక్కలు మాష్టారు.రవీ ఎప్పుడూ ఈజీ మనీ సంపాదించాలి అని 
చూస్తూ ఉంటాడు.వాళ్ళ నాన్న దగ్గర పది వేలు తీసుకొని గంటలో 
లక్ష చేస్తాను అని బయలుదేరుతాడు.
అక్కడ వ్యాన్ లో ఒక దొంగల ముటా దోపిడీ కి బయలుదేరుతుంది.
రవి వాళ్ళ నాన్న కూడా అ బ్యాంక్ లో ఐదు లక్షలు డిపాజిట్ చేసి ఉంటాడు.
అసలు ఆబ్యాంక్ చైర్ మాన్ వరద రాజులే ,బిట్టు అనేవాడిని పెట్టి ఆ 
దొంగ తనానికి పంపిస్తాడు.మొత్తం ఎనిమిది మంది.వాళ్ళలో ఒక చెవిటి,మూగ 
అమ్మాయి కూడా ఉంటుంది,ఇంకా బిట్టు తమ్ముడు లల్లా కూడా.
రవి కి తెలీక ఆ వ్యాన్ లో లిఫ్ట్ అడుగుతాడు.వాళ్ళు ఎక్కడకు వెళుతున్నావు? 
అని ఆరా తీస్తారు.బెట్టింగ్ కి వెళుతున్నాను అంటాడు.మరి పోలీస్ లకు తెలీదా..
అని అడిగితె తెలిస్తే వాళ్ళు అక్కడే ఉంటారు కదా అని చెప్పేసి అది ఎక్కడో అడ్రెస్స్ 
చెప్పి వెళ్ళిపోతాడు.ఈ దొంగతనం చేసేవాళ్ళు పోలీస్ లకు బెటింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి 
వాళ్ళను అక్కడకు పంపేసి చక్కగా బ్యాంక్ లోకి దూరి పోతారు.
ఇక్కడ మొదలైంది బాబు...ఎందుకులే...ఒకరిని ఒకరు డమాల్...డిష్యుం...
పక్కనుండి ఈయన ...ఎవరు ఎవర్ని కొడుతున్నారు శశి అని...సర్లెండి సంబరం 
రెగ్యులర్ తెలుగు సినిమా వ్యూయర్ ని నాకే అర్ధం కావటం లేదు ఇక్కడ...

ఏదో మొత్తానికి బిట్టు ఒక్కడు మిగిలాడు.అంతా గందర గోళం.
డబ్బులు అలాగా ఒక పెద్ద బాక్స్ లాగా కట్టేసి ఉంటారు.
లల్లా వచ్చి పెద్ద కంటైనర్  వ్యాన్ తో గోడ పగల కొట్టి మరీ 
ఆ డబ్బుని తీసుకెళ్ళి పోతాడు.

ఈ లోపల అక్కడ బెట్టింగ్  (అంటే ఏమిటో అనుకున్నా ..అదేదో క్రికెట్ నాకేమి 
అర్ధం కాలేదు)దగ్గర పోలీస్ రైడ్...వాళ్ళు మాట్లాడే టప్పుడు రవి నవ్వుతాడు.
''ఏమి రా నవ్వావు?''అంటే నా మాటలే మీరు చెపుతున్నారు అంటే 
ఎక్కడో బ్యాంక్ దొంగతనం జరుగుతూ ఉంది ఉంటుంది అని వ్యాన్ లో 
చూసినవి చెప్పి ఏ దొంగ ఎక్కడ ఉంటాడు,డబ్బు ఎక్కడ ఉండొచ్చు అనీ 
ఊహించి చెప్పేస్తాడు.(బన్నీ ని చూసి మీకు విచిత్రం అనిపించవచ్చు 
కాని మేము టి.వి.లో అప్పుడప్పుడు సి.ఐ.డి.అని ఒక సీరియల్ చూస్తుంటాము 
పనేమీ లేక పొతే...దానిలో ఆ పెద్దాయన ఇలాగే చెప్పేస్తుంటాడు...)

ఈ లోపల లల్లా ఆ వానలోనే ఒక డంపింగ్  యార్డ్ లో డబ్బుండే కంటైనర్ 
ఆపి దాని మీద చెత్త పోస్తుంటాడు.ఈ లోపల పోలీస్,రవి అక్కడకు అస్తారు.
గొడవలో లల్లా రవి చేతిలో చనిపోతాడు.పోలీస్ డబ్బులు మళ్ళా చూడవచ్చు...
ముందు నువ్వు హైదరాబాద్ లో ఏ.సి.పీ.సీతారాం(రాజేంద్ర ప్రసాద్)దగ్గరకు 
వెళ్ళు బిట్టూకి దొరకకుండా అని పంపేస్తాడు.ఇక్కడ నుండి రాజేంద్ర ప్రసాద్,
బన్ని,బ్రేహ్మి సందడే సందడి....మధ్యలో ఇలియానాను ప్రేమించటం...
వాళ్ళ నాన్నను,సవతి తల్లిని ఒప్పించటం....
మా పిల్లలు అయితే ''అమ్మా ఇలియానా...యాక్""అనేసారు.నాకు నచ్చలేదు.
పిల్లలు నాకు''నాది అన్నది నేదేలే...నీది అన్నది నాదే''టైప్ ఫ్రెండ్స్ కాబట్టి 
ఏదైనా అందరం షేర్ చేసుకుంటాము.

ఇక అమాయకుడైనా సీతారాం గారి సహాయం తో ఆ డబ్బులు మరలా 
అందరికి తిరిగి ఇప్పించటం,మధ్యలో చేసింగులు,డిష్యుం,డిష్యుం,
ముఖ్యంగా ఒక సారి కార్ ని బిల్డింగ్ మీదకు దూకించి అవతలి రోడ్ లోకి 
వెళిపోతాడు బన్ని...కేవ్వ్వ్వవ్వ్వ్వవ్....బన్ని నువ్వు టైటానిక్ లో  
ఉండకూడదా?ఇక బిట్టూ,బన్ని ప్లాన్లె,ప్లాన్లు...ఏమిటి గందర గోళం అంటే...
''ఏదో సముద్రం నుండి తిమింగలం బయటకు వచ్చి గాలి పీల్చుకున్నట్లు 
సంసారం నుండి తొంగి చూసేవాళ్ళం...మాకు లాజిక్ లు వద్దు...మేజిక్ లే
కావాలి"
కాకుంటే లాస్ట్ లో  ఇంతా చేసి ...విలన్ ని చంపెయ్యకుండా డిస్కషన్ పెట్టి 
తేల్చేసాడు.మళ్ళా రాజేంద్ర ప్రసాద్ గారి చేత కాల్పించాడు.

సిగిరేట్  పెట్టి మీద చిన్న అక్షరాలతో ''పొగ త్రాగటం హానికరం ''
అని వ్రాసినట్లు...ఈసీ మనీ వద్దు కష్టాలు వస్తాయి అని చెప్పాడు.
పాటలు కేక...పకడో..పకడో...అయితే నేను సూపర్ ఉంటుందనుకున్నాను.
పాట బాగుంది కాని డ్యాన్స్ లేదు.బన్ని లెవెల్ కి తగ్గ స్టెప్స్ లేవు.
రాజేంద్ర ప్రసాద్ నవ్వుల  ఉయ్యాలలో ఊపేసాడు.
ఇక డి.ఎస్.పి.మనలను జోష్ లో ఊపేసాడు.

ఒకటి నచ్చలేదు.రాజేంద్ర ప్రసాద్ ,బన్ని తో కలిసి ఇంట్లో తాగటం .
పర్సనల్ అయితే  వేరే విషయం...పబ్లిక్ గా ...పిల్లలు,భార్య ఇంట్లో ఉంటె 
పిల్లల మీద యెంత ప్రభావం చూపుతుంది.పోనీ ఆ సీన్స్ కధకు 
పనికి వస్తాయా అంటే లేదు.
''అసలు ఇల్లు అంటే ఒక బేషరతు ప్రేమకు నిలయం అయిన దేవాలయం.
దానిలోకి చెప్పులతో కూడా వెళ్ళం.అలాటిది ఇలాగా చూపించటం మనసుకు 
చివుక్కుమనిపించింది''

ఒకటి నచ్చింది. వరద రాజులు బిట్టు పక్కన ఉండే మూగ,చెవిటి అమ్మాయిని 
యెగతాళి చేస్తాడు.బిట్టు వాడిని చంపెటపుడు ''పిజికల్లి  డిసేబుల్డ్ వాళ్ళను యెగతాళి 
చేయకూడదు''అంటాడు.

నాకు బాబు పుట్టినపుడు కొంచెం చెవులు డమాల్....
మెడిటేషన్ నేర్చుకోక ముందు ఎవరైనా యెగతాళి చేస్తే బాధ పడేదాన్ని .
కాని నేర్చుకున్న తరువాత తెలిసింది అది నాకు ఇచ్చిన వరం అని
(అందరికి ఒకటి వస్తుందంట ప్రాబ్లెం...మనకు రెండు బ్లెస్సింగ్స్...గాడ్ ఇస్ 
గ్రేట్)
ఎందుకంటె ఇప్పుడు నేను మనుషులను చక్కగా విబజించు కోగలుగుతున్నాను ....
నా లోపాన్ని పట్టించుకోని వారు నా వారు....మిగిలిన వారు ''మీకు మీరే ...
మాకు మేమే''సింపుల్.యెంత మంచి మెజర్మెంట్ ఇచ్చాడు నాకు దేవుడు.

మీరు ఎవరి మీద జాలి పడక్కర్లేదు.వాళ్ళను మనుషులు అని గుర్తిస్తే చాలు.ప్రతీ 
ఒక్కరి పుట్టుకకి ఏదో కారణం ఉంటుంది.వాళ్ళ ఉనికి ఇక్కడ అవసరమే.
కావాలంటే క్రింది మ్యాటర్ చదవండి.
ఆ పాప కూడా భూమికి అవసరమే.లేకుంటే బ్రతకదు. 


Monday, 13 August 2012

ధ్యానం ....నిత్యజీవితం లో భాగం

ధ్యానం నిత్యజీవితం లో భాగం చేసుకోగలిగితే 
మన జీవిత విధానం లో చాలా మంచి మార్పులు 
వస్తాయి.
ముఖ్యంగా పాసిటివ్ ఆలోచనలతో ఆరోగ్యం చాలా 
మెరుగు పడుతుంది.ఏకాగ్రత పెరుగుతుంది.

నేను కొంచెం గమనించింది ఏమిటంటే ధ్యానం 
మామోల్లుగా కంటే పిరమిడ్ లో చేస్తే చాలా 
బాగుంటుంది.ఇంకా పిరమిడ్ కేంద్రాలలో దానిలో 
కూర్చొని సామూహిక ధ్యానం చేసినపుడు ఇంకా 
చాలా చాలా బాగుంటుంది.వీలయితే చేసి చూడండి.
మీలో ఒక మంచి మార్పుకు మేరు పునాది వేసిన వారు 
అవుతారు.
''ఒకరు చెప్పారు అని ఏది నమ్మొద్దు.
నువ్వు చేసి అనుభవంతో నమ్ము''...బుద్దుడు.

పత్రీజి గారి గూర్చి ఇంతకూ ముందు తెలియక పొతే 
దీనిని చదవండి.ప్రతి సంవత్సరం డిసంబర్ లో 
చివరి వారం ఎక్కడో ఒక దగ్గర ధ్యాన మహా సభలు 
జరుగుతాయి.లక్షల మంది ధ్యానులు అక్కడకు 
హాజరు అవుతారు.
(news link ikkada )



Friday, 10 August 2012

వార్నీ ...ఇదేమి బాట బాబయ్య

హ్మ్...గట్టిగా గాలి పీల్చాడు ముఖ్య మంత్రి.
అయితే ఏదో బాధ పడే విషయమే అయి ఉంటుందని 
ఊహించి వాళ్ళు కూడా హ్మ్...అని గాలి వదిలారు.
దెబ్బకి ఆ గాలికి లేచి గోడకి కొట్టుకొని కొంచెం కష్టపడి 
లేచి...ఏమిటిది ?కోపంగా అడిగాడు.
అంటే మీరు చేసారు అని మేము కూడా ...
ఇప్పుడు అది కాదు కావాల్సింది ప్రజలు 
మనలను మర్చిపోతున్నారు.
వాళ్ళు గుర్తుంచుకోవాలంటే 
ఏమి చెయ్యాలో అది ఆలోచించండి.

''అందుకే కదండీ కరంట్ కోతలు ...ఇషో..ఇషో..అని విసురుకుంటూ 
మనలను గుర్తు చేసుకుంటున్నారు.కాదు అమ్మ నా బూతులు 
తిట్టుకుంటున్నారు.
''ఏమి లాభం లేదు ఏదో ఒక బాట పట్టాల్సిందే....పోదాము పదండి''
అన్నాడు ముఖ్య మంత్రి.
''వద్దు,వద్దు వాళ్ళు మిమ్మల్ని నిలేస్తారు.అసలే ఖజానా ఖాళీగా 
ఉంది''చెప్పారు ముందు జాగ్రత్తకి.
''కుదరదు వెళ్ళాల్సిందే...ఏదో ఒకటి చెపుతాను వాళ్లకి,గొర్రె 
కసాయివాడిని నమ్మక పోయిన చరిత్రే లేదు''
      @@@@@@@@
ప్రజా బాట మొదలు...ముందు గా రైతులు ఎదురు అయ్యారు.
''ఎరువులు లేవు,విత్తనాలు లేవు,కరెంట్ లేదు ..ఎట్ట చెయ్యాలా?
నిలేసారు.
చిరు నవ్వు నవ్వాడు ప్రశాంతంగా 'మీరింకో విషయం మర్చిపొయ్యారు 
వానలు కూడా లేవు.ఇప్పుడు మేము చూడండి .....మేము కూడా 
అన్ని రకాల కరువుతో బాధపడుతున్నాము.అయినా మీలాగా 
అడుగుతున్నామా?మీరే మీ కష్టాలు తీర్చుకోవాలా?''దణ్ణం పెట్టి 
వెళ్లి పొయ్యాడు.
'వ్యాపారస్తులు నిలేసారు.''ఏమి చెయ్యాలా ?వ్యాట్ పెంచారు.
పన్నులు పెంచారు.దాడులు పెంచారు.కరెంట్ లేదు.''
''మీరు మరీని...మాకు ఇక్కడ పవర్ లేదు...ఢిల్లీ నుండి 
ఎప్పుడు ఆగిపోద్దో అని నేను కూడా బయపడుతున్నాను.బయపడితే ఎలాగా 
జరుగుద్ది.ఎవురి సమస్యలు వాళ్ళే తీర్చుకోవాల?''చిరునవ్వుతో 
వెళ్లి పొయ్యాడు.

విద్యార్దులు నిలేసారు''రీ ఇమ్బర్సేమెంట్ ఇవ్వనంటున్నారు.స్కాలర్షిప్ లు 
పెంచలేదు.ఇంట్లో ఆర్దిక ఇబ్బందులు మేము ఎలా చదవాలి?''
''భలే వాళ్ళే....ఇప్పుడు ఖజానా మొత్తం ఖాళి.మాకు ఆర్దిక భారం ఉంది.
నేను కొత్త ఇల్లు కూడా కట్టుకోలేదు.ఎవరికి వాళ్ళు కష్టపడి పైకి 
రావాలి అంతే కాని ప్రభుత్వం ని నమ్ముకుంటే ఎలా?మమ్మల్ని 
ఆదర్శంగా తీసుకోండి''వెళ్లి పొయ్యాడు.
ప్రజా బాట అయిపోయంది.
           @@@@@@@
ఇంటికి వెళ్ళాడు.కృష్ణునికి పూజ జరుగుతుంది.
''రారా కృష్ణయ్య ....రారా కృష్ణయ్య ''ఎలుగెత్తి పాడుతూ పూజ చేసాడు.
భక్తికి మెచ్చి కృష్ణుడు ప్రత్యక్షం అయ్యాడు.
''స్వామీ అన్ని కష్టాలే...ఆర్దిక ఇబ్బందులు,సీట్ ఇబ్బందులు,
స్వపక్షం,ప్రతిపక్షం,అన్ని వైపులా చుట్టూ ముట్టేస్తున్నాయి.
మీరే కాపాడాల..''అడిగాడు 
చిన్నగా నవ్వాడు కృష్ణుడు...''నన్ను చూడు నాకు ఎన్ని ఇబ్బందులు,
మంచి వెన్నకు కరువే,భక్తికి కరువే,ఇంకా గోపికలతో బాధలు,
వీళ్ళు కాక ఎనిమిది మంది భార్యల కోరికలు ...ఎవ్వరు ఎవరికి సహాయం 
చెయ్యలేరు.సలహాలు మాత్రమె ఇస్తారు.నీ స్వశక్తి తో మాత్రమె నువ్వు 
పైకి రావాల''జ్ఞానోదయం చేసి ఎక్కువ సేపు ఉంటె ఇంకా ఏమి 
అడుగుతాడో అని బుడింగున మాయం అయ్యాడు కన్నయ్య.

(నిన్న ఖమ్మం బాట తో నాకు బోల్డెంత జ్ఞానోదయం అయింది...
మరి మీకు?)

Wednesday, 8 August 2012

సత్యభామ సరదాలు 3

హుషారుగా వచ్చేసాడు ఇంటికి... ఊహించినట్లే తలుపులు 
తెరిచి ఉన్నాయి.హమ్మయ్య  సత్య వచ్చేసింది.....లోపలికి వచ్చి 
షూస్ విప్పక ముందే రెండు కాళ్ళకు వేలాడారు పిల్లలు 
డాడిఅంటూ....నవ్వుకుంటూ అమ్మగారు ఏరి అని తొంగి 
చూస్తూ వాళ్ళ బుగ్గలపై మామూలు  ఇచ్చేసాడు.

ఇక మొదలు సందడే...సందడి...
ఒకరు కాళ్ళపై ఊగుతూ 
ఒకరు వీపుపై ఊగుతూ అమ్మమ్మ 
ఇంటి  ముచ్చట్లు ...
నా మాట వినాలి అంటే నా మాటలు 
వినాలిఅని మొహం వాళ్ళ వైపు 
లాగుతూ ఉన్నారు.
నవ్వుకుంటూ సముదాయిస్తూనే  
కళ్ళతో వెతుకుతూ ఉన్నాడు...
ఇంకా మబ్బు చాటు నుండి 
చంద్రోదయం కాలేదు ఏమిటా..అని .

ఓహ్...పూలపరిమళం,టీ వాసన గాజుల చిరు శబ్దం లో కలిసి 
మనసు అటు వైపు దూకేస్తూ....చేతిలో టీ తీసుకొని చిన్నగా 
నవ్వాడు.అంత కంటే చిన్నగా నవ్వుతూ పిల్ల ల వైపు చూసింది.
అబ్బ ఈ ఆడవాళ్ళకి ఏమి పెడుతారో  పుట్టినింట్లో ఒక్క రోజు వెళ్లి 
వచ్చినా మొహం కళ కళ లాడిపోతూ ఉంటుంది...మనసులోనే నవ్వుకుంటూ 
మురిపెంగా అనుకున్నాడు.
పిల్లలని పక్కకు తీసుకువెళ్ళింది.స్నానం చేయిస్తా రండి అని.

బీరువా దగ్గరకు వెళ్ళాడు పర్స్ బీరువాలో పెడుదామని...తలుపు 
తీసి చూసాడు,ఏదో తళుక్కున మెరిసింది ,బంగారు రంగులో.
మెల్లిగా తలుపు పూర్తిగా  తెరిచి చూసాడు.సత్య నిన్న రాఖి కట్టడానికి 
వెళ్లి వచ్చింది.మరి ఇదేక్కడిది  అనుకున్నాడు.
తీసి చూస్తె గోల్డ్ వాచ్ మగవాళ్లది .చూడ ముచ్చటగా....ఎన్ని 
రోజుల నుండో అనుకుంటున్నాడు ఇలాటి మోడల్ కావాలి అని బడ్జెట్ సహకరించక 
ఎప్పుడు బయట పెట్టలేదు కోరికని.అయినా ఇది ఇక్కడ ఎందుకు ఉంది....
ఏదో ఊహ మెరిసింది కళ్ళలో మెల్లిగా కోపం పాకుతూ ...''సత్య''గట్టిగా అరిచాడు .

ఉలిక్కిపడి చిన్నాడిని టవల్ లో చుట్టుకొని వచ్చింది.
చేతిలో వాచితో ఉన్నా శ్రీవారిని చూడగానే కొంత అర్ధం అయింది.
''ఎక్కడిది?''అడిగాడు కోపం తో మొహం ఎర్రగా మారిపోయింది.
ఎప్పుడు ఇంత కోపం చూడలేదు.''అదీ..అదీ...కొన్నాను'
'
భయంగా సమాధానం చెప్పింది.
''ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు,ఊరుకుంటే మరీ అతి అయిపోతున్నావు.ఈ నెల లో యెంత 
ఖర్చు అయింది నీకు తెలీదా?అప్పుల్లో ముంచి వేసేయ్యి ...నేను లేకుండా 
పొతే నీకు విలువ తెలుస్తుంది''కాలితో తలుపును తన్నేసి బయటకు 
కోపంగా వెళ్లి పొయ్యాడు.భయపపడిన పిల్లలను దగ్గరకు తీసుకొని 
వచ్చే కన్నీళ్లు ఆపుకుంటూ వాళ్లకు అన్నం పెట్టి నిద్ర పుచ్చింది.
తరువాతా దిండే దుఃఖం  పంచుకొనే నేస్తం.
ఎప్పుడో రాత్రికి ఇంటికి వచ్చాడు.అన్నం వడ్డించ పొయ్యింది .
''నాకు ఆకలి లేదు''విసురుగా గ్లాస్ విసిరేసి వెళ్లి పొయ్యాడు.
ఇంత మౌనాన్ని,దుఖం ఎప్పుడు చూడని ఇల్లు చిన్నపోయ్యింది రాత్రంతా.
ఉదయం కూడా సత్య పలకరించినా విసుగ్గా పలక కుండా ఆఫీస్ కి వెళ్లి.పొయ్యాడు.
 బాక్స్ కూడా  తీసుకు వెళ్ళకుండా వెళుతున్న భర్త ను దిగులు మబ్బు చాటు 
చేసుకొని మసక చూపుతో చూస్తూ ఉండిపోయింది.
పిల్లలు బిక్కు బిక్కు మంటూ అమ్మ ఇంటికి రాని లేగా దూడల్లా....

''చ''విసుగ్గా అనుకున్నాడు మూర్తి .దీనంగా ఉన్న సత్య మొహమే కనిపిస్తూ ఉంది.
ఏమైంది?పక్కన ఉండే రవి ఎర్రగా ఉండే కళ్ళను చూసి ఏదో అనపోయ్యి ఆగిపొయ్యాడు.
''ఏమి లేదు''విషయం చెప్పేసాడు.
'నిజమే రా మన బాధలు మనకు ఉంటాయి.ఆడ వాళ్లకు  ఏమి తెలుస్తుంది.
అయినా తను ఇప్పుడు ఇలాగా ఎప్పుడైనా ఖర్చు పెట్టిందా అనవసరంగా?''అడిగాడు.
''లేదు.ఎప్పుడు నన్ను అడగకుండా షాపింగ్ చెయ్యదు.అసలు ఇంట్లోకి 
వెళ్ళ బుద్ధి కావటం లేదు.ఎన్ని మాటలన్నాను.ఎప్పుడూ ఇలాగ జరిగింది లేదు.
సత్యను సారి  ఎలా అడగాలో తెలీటం లేదు...అయినా తప్పు చేసింది తను ,
నేను ఎందుకు చెప్పాలి''విసుగ్గా అన్నాడు.తనకే ఇలాగా ఎందుకు రావాలి 
అనుకుంటూ...

''ఏమి పర్వాలేదు లేరా,సాక్షాత్తు కృష్ణ మూర్తి ఏమి చెప్పాడు,దేఖో,పకడో,లావో''
అని...''ఇదేమిటి?''అర్ధం కాక సమరం లో అర్జునిడి మొహం పెట్టుకుని అడిగాడు.
''ఏమి లేదు ఇంటికి వెళ్ళు,చూడు సత్యని,పట్టుకో కాళ్ళని,తీసుకో ప్రేమని,
మన భార్య ,మనం వేరు కాదురా ఏమి చేసినా తప్పు లేదు.అసలు అటువంటి 
సంపద ఎక్కడైనా సంపాదిన్చుకోగాలమా?''వినురా బాబు అని అభయ హస్తం చూపి 
కృష్ణ పరమాత్మ ఫోజ్  పెట్టేసాడు నిల్చొని.పక్కున నవ్వేసాడు మూర్తి .
ఎందుకో మళ్ళి సత్య తో తాను అనుకుంటే మనసుకు హుషారు వచ్చేసింది.

రాత్రి దొర్లుకుంటూ వచ్చేసింది మీ అలకలతో నాకేమి పని అనుకుంటూ...
పిలలు నిద్ర పోతునారు.పాపం భయపడి పోయినారు.
ఇందాక ఆఫీస్ నుండి వచ్చినా హోం వర్క్ పుస్తకాలనుండి
తలలు ఎత్త లేదు.పది అయినా మేడం గారి దర్శనం లేదు.

తొంగి చూసాడు హాలు లోకి.బ్యాగ్ లో పుస్తకాలు  సర్దుతూ ఉంది.
దగ్గాడు చిన్నగా.నిరశన ఝండా ఎగిరేస్తూ తల కూడా తిప్పి చూడలేదు.
''అవును పిల్లలు ఏ క్లాస్స్?
అనుకుంటూ పక్కన కూర్చొని తను కూడా పుస్తకాలు పెట్టసాగాడు.
విసురుగా లాగింది బ్యాగ్ లోవి....రెండో బ్యాగ్ లో పెట్టింది.
''ఓహ్,అయితే చిన్నాడివి అన్న మాట ఆ బుక్స్''అనుకుంటూ ''సత్యా'' 
మెల్లిగా పిలిచాడు.మొహం ఆ వైపుకు తిప్పేసరికి చెంపలపై 
ట్యూబ్ లైట్ కాంతి పడి చెంప చివర నెలవంక లాగా గమ్మత్తుగా..
చ..చ...వెదవ,వెదవా,ఎలాంటి సిచ్యువేషన్ సృష్టించుకున్నావు? 
తనను  తానె తిట్టుకున్నాడు.


పట్టుకున్న చెయ్యిని విదిలించుకొని పొయ్యి పిల్లల మద్య పడుకుంది.
ఇంక అయినట్లే..కదిలిస్తే ఏడుస్తూ లేసేస్తారు.ఏమిటి చెయ్యటం....అనుకున్నాడు.
వాగ్దేవిని నమ్ముకొని వాగ్బాణాలు మొదలు పెట్టాడు.....మన్మదుడిని కాసింత  
సాయం చెయ్యరా బాబు అని వేడుకొని......
''సత్య''పిలిచాడు.మొహం అటు తిపుకున్నా చెవులు ఇటే ఉన్నాయి.
పర్లేదు ప్రొసీడ్ ....''అసలు ఆ వాచ్ యెంత నచ్చిందో తెలుసా?అసలు అలాంటి 
వాచ్ కావాలని ఎన్ని రోజుల నుండి అనుకుంటున్నానో''
ఊహూ ఏమి లాభం లేదు.మౌనం ఇంత గట్టిగా ఉంటుందా?
అదేమైనా ప్లాటినం తో చేస్తాడా ఈ బ్రహ్మ దేవుడు.
అసలకు ఈ పెళ్లి కనిపెట్టింది ఆయనే...
కాసేపు తిట్టుకున్నాడు.ఇలాగ బతిమిలాడటమే అలవాటు లేదే...

మళ్ళ మొదలు పెట్టాడు....
'అసలు నేనైతే ఇంత అందమైన వాచ్ సెలెక్ట్ చెయ్యలేనబ్బా?'
ఏమైనా నీ సేలేక్షనే సెలక్షన్''మొహం మీదకి తొంగి చూసాడు.
మౌనం కొంత కరిగినట్లే ఉంది.''అవును ..అవును...మీరు కూడా నా సెలక్షనే ''
పెదవి విరుపు...అబ్బ మన్మదుని చేతిలో చెరుకు గడ విరిగిపోయ్యిందా?
చటుక్కున లైట్ వెలిగింది.''ఏమిటి ఏమిటి మళ్ళా చెప్పు?నీ సేలేక్షనా అంటే 
మీ అమ్మా వాళ్ళు నచ్చలేదా,నువ్వే అడిగావా?''చిన్నగా నవ్వుతూ అడిగాడు 
దొరికావులేపో అని చిలిపిగా చూస్తూ ....చటుక్కున లేచి కూర్చుంది...
చూసి మళ్ళ సిగ్గుపడి పోతూ....అలక మాకేమి పని అని చక్కగా 
సర్దుకొని పలు వరుసల మెరుపులో కలిసిపోయింది.

''నిజమా?''అని అడిగాడు.సమాధానం లేదు.గువ్వలా ఒదిగిపోవడమే.
''సరే రేపు డబ్బులు ఇస్తాను షాప్ లో ఇచ్చెయ్యి''చెప్పాడు.
''డబ్బులు అక్కర్లేదు''చెప్పింది చిన్నగా.
''అక్కరలేదా ఎందుకు?''ఆశ్చర్యంగా అడిగాడు.
''మా అన్నయ్య రాఖీ కి ఇచ్చిన డబ్బులు పెట్టి మా బాయ్ ఫ్రెండ్ కి వాచ్ కొనేసాను''
కొంటెగా చెప్పింది.
వార్నీ అనవసరంగా రెండు  రోజులు బాధగా మోలిగింది మనసు.
'మరి నిన్నే చెప్పలేదే?''అడిగాడు గారంగా.
''ఎక్కడ చెప్పనిచ్చారు...మీకు ఏది వచ్చినా వడగళ్ళ వానే''విసురుగా 
అనింది వర్షానికి ముందు చెళ్ళు మని తాకే చల్లటి గాడ్పులాగా....
అర్ధం అయింది....''ఏమొచ్చినా''ఉడికిస్తూ  పెద్దగా నవ్వేసాడు.
ముసి ముసి నవ్వులు సిగ్గు దానికి జతగా కలిసి .....మనసులో కొత్త కొత్త 
రాగాల ప్రేమ చిగుళ్ళు....



Friday, 3 August 2012

ఏమి చేద్దాము చెప్పండి ...ఇలా కధలు వ్రాసుకోవడం తప్ప ....

ఎన్నోచూస్తాము...ఎన్నో వింటాము...ఎన్నో చదువుతాము.
గుండె గదులు తడిమితే ఎన్ని జ్ఞాపకాలు....
కలల కొమ్మలు వంచి మెల్లగా ఊపితే ఝల్లున పడే 
మంచు జల్లు,పరిమళాల జల్లు....ఒక్కసారి ఉలిక్కిపడే లాగా చేస్తాయి.

కధ వ్రాయటానికి అన్నీ మన అనుభవాలు కానక్కర్లేదు.
మనసుని కదిలించేవి ఎక్కడున్నా పట్టుకొని 
కధగా అల్లుకోవచ్చు.నేలను వదిలి సాము చెయ్యకుండా 
ఒక్క క్షణం ఆలోచింప చేస్తే....కధ ప్రయోజనం సఫలం 
అయినట్లే.

నా  కధ ''ఔను...నేను మామూలు మనిషినే''మాలికా సంచికలో 
చదవండి.
మాలిక సంపాదక వర్గానికి కృతఙ్ఞతలు 


నా కధ మాలికా శ్రావణ పూర్ణిమ సంచికలో....లింక్ 

ఔను ….నేను కూడా మామూలు మనిషినే

రచన : తన్నీరు శశి

”ఏమి వెళతారు లోపలికి….రండి టీ తాగి వెళుదురు.”
పిలిచింది పక్కింటి ప్రేమ.ఉదయాన్నే వరండాలో పడిన పేపర్ కోసం వచ్చాను లేచి.
ఆదివారం కాబట్టి పిలిచింది ఇలాంటి ఆప్యాయతలకు లొంగి ఈ కాంప్లెక్స్ వదలలేకున్నాను.
”లేదు…లేదు …ఈ రోజు ఒకామెను రమ్మన్నాను ఇల్లు శుభ్రం చెయ్యటానికి
ఆమె వచ్చే లోపల వంట చెయ్యాలి”చెప్పాను.
”అవునా యెంత ఇస్తాను అన్నారు డబ్బులు?”
”ఎక్కడ దొరుకుతున్నారండి  పని వాళ్ళు?.ఈమె ఏదో ఆకుకూరలు అమ్ముతూ ఇంటికి వచ్చింది.పని వాళ్ళు కావాలంటే ,రోజు కూలి ఇస్తే తనే వస్తాను అంది,సరే రమ్మన్నాను”అన్నాను.
ఈ లోపల టీ తీసుకొని వచ్చింది.వద్దు అనలేని బలహీనత మంచు కమ్మేసినట్లు లొంగదీసుకొని….కొంచం స్పృహ వచ్చేసరికి చేతిలో వేడిగా టీ కప్పు….ఇంక పని అయినట్లే.
”మీరు మరీ అమాయకులండి(నిజమే సుమీ)
రోజు కూలి అంటే యెంత ఇస్తున్నారు?”అడిగింది.
”యెంత అంటే రెండు వందలు ”
”రెండు వందలా?బాబోయ్ …మీ అమాయకత్వంతో ఆడుకుంది.రోజు కూలి నూట యాబై రూపాయలే” వివరంగా అరటిపండు చేతిలో పెట్టినట్లు చెపింది.
వినగానే మొహం ఉదయాన్నే సూర్యున్ని చూసిన కలువలాగా వాడిపోయింది నాకు”నిజమా…అయ్యో …సరేలే ప్రేమా..పని వాళ్ళు ఎక్కడ దొరుకుతున్నారు….అదీ కాక బతికి చెడ్డ మనిషి లాగా ఉంది.ఎక్కడ పని చెయ్యదు లాగా ఉంది.రెండు వందలకు ఆశ పడి వస్తూ ఉంది. మాట ఇచ్చేస్తిని .ఇంకేమి చేస్తాము”
దిగులుగా చెప్పి లోపలి వెళ్లాను.
చేతిలో డబ్బులు అవి యెంత అయినా కాని వృధాగా పొతే యెంత బాధ.”ఎలాగైనా ఆ డబ్బులకు సారి పొయ్యే పని ఎక్కువ చేయించుకోవాలి” మనసులో గట్టిగా అనుకున్నాను.
ఇంతలో వాణి వచ్చింది ”రా …రా…నీకోసమే ఎదురు చూస్తున్నాను. రోజు కూలి అడిగితివి ఇంత లేట్ గా వస్తే ఎలా” అడిగాను పై చెయ్యి నాదనే దర్పం తో . .
”లేదమ్మా ఇంటికి వెళ్లి అన్నం తిని వస్తున్నా …ఇంక వెళ్ళకుండా పని చెయ్య వచ్చు అని”
ఎప్పుడూ మాటలు పడిన మనిషి కాదు కాబోలు …..కళ్ళలో కొంచం బాధ మబ్బేసిన చందమామ కాంతి లేకుండా పోయినట్లు……
ఏ మాటకు ఆ మాటే చెప్పుకవాలి….చాలా బాగా సామాన్లు అన్ని తీసి ఒక్కోటి శుభ్రంగా తుడుస్తూ ఉంది.సరే నేను మాట మంతీ   చెపుతూ కూర్చున్నాను.
అలాగైతేనే ఈ పని వాళ్ళు బాగా పని చేస్తారు.ఎక్కువ డబ్బులు ఇస్తున్నా ఎక్కువ పని చేయించుకోవాల్సిందే కదా….
”ఏమి వాణి ఏ ఊరు మీది ”చెప్పింది ”ఓహో దగ్గరే అన్న మాట”
అదిగో ఆ బ్యాగులు, డబ్బాలు  అన్నీ పాతవి శుభ్రం  చేసి  సర్దు”పురమాయించాను..
అటక పై నుండి అన్నీ దించ సాగింది.ఎన్ని రోజులు అయిందో శుభ్రం  చేసి.
ఒకటే దుమ్ము…ఒకటే తుమ్ములు…నేను బయటకు వచ్చేసాను.
లోపల తుమ్ముతూ,దగ్గుతూ అన్నీ దించింది.బయట పెట్టుకొని తుడవసాగింది.
మళ్ళీ  కూర్చొని అన్నీ తుడుస్తూ ఉంది
”పిల్లలు యెంత మంది ?
మీ ఆయన ఏమి చేస్తుంటాడు”అడిగాను.
తన కన్నీళ్ళలో కన్నటి చెలమ….మెల్లిగా ఊరుతూ…
”లేదమ్మా పోయిన ఏడాది చచ్చిపోయిండు” కారణం అడుగుదాము అనుకున్నాను….అయినా ఏముంటాయి పెద్ద కారణాలు వీళ్ళకి తాగుడు తప్ప.అయినా ఆడ మనసుకు జాలి అనిపించింది.
ఇదిగో ఈ బ్యాగ్ లు నువ్వే తీసుకో పాతవి ఇచ్చేశాను.
(నేను కాబట్టి ఇంత డబ్బులు ఇచ్చి బ్యాగ్ లు కూడా ఇచ్చాను. గర్వంగా అనిపించింది)
బాబోయ్ ఇప్పుడు ఏడుస్తూ పని లేట్ చేస్తుందేమో…..
‘సరే…సరే పిల్లలు ఎందరు?””ఇద్దరు….ఇద్దరు ఆడపిల్లలు.
పెద్ద దానికి పెళ్లి అయిపొయింది.చిన్నది ఏదో తరగతి”చెప్పింది.
ఇది చూస్తె చిన్న వయసుగా ఉంది…..బాగా నీట్ గా తయారు అయ్యి వచ్చింది. మొగుడుపోతే ఇలాగేనా  ఉండటం.పిల్లకు పెళ్లి అయింది అని చెపుతుంది…..
”యెంత వయసు పిల్లలకు ”ఆసక్తిగా అడిగాను.
ఇదిగో ఈ బట్టలు మడత పెట్టి సర్దు అని పాట బట్టలు కుప్ప ముందు వేశాను….ఇంత డబ్బులు ఇచ్చి పని చేయించుకోక పొతే ఎలా?
(ఇయ్యేమి పాత బట్టలో.ఒక అలమారుకు సరిపోతాయి…అన్ని వందలు,వందలు పోసి కొన్నవి…ఈ పిల్లలు ఏమో పట్టటం లేదంటారు.చూస్తూ ఒకరికి ఇవ్వాలంటే ప్రాణం ఉసూరుమంటూ ఉంటుంది .అలా అని ఉంచుకొంటే స్ధలం అంతా  వాటికే సరి పోతుంది)
వాణి చెపుతూ ఉంది.పెద్ద దానికి పద్నాలుగు, చిన్నదానికి పన్నెండు.
”మరి పెద్దదానికి పెళ్లి చేసావా?ఇంత చిన్న వయసులో?”
ఏమి ఆలోచిస్తారు వీళ్ళు అంత చిన్న పాపకి పెళ్ళా?”
నా మనసు నీరు అయిపోతుంది.గుండెలో ఏదో భారం నొక్కుతూ ఉంది. మనసు మెల్లిగా కరిగిపోయింది.
”ఏమి చేస్తామక్కా…ఈయనకు బాగా లేకుండా ఉంది.రేపో మాపో చనిపోతున్నట్లున్నాడు. కనీసం బిడ్డ పెళ్లి చూసి చచ్చిపోతాడు అని చేసేసాను”
గుడ్లలో నీళ్ళు కక్కుతుంది…గుండ్ల కమ్మ లాగా ….
”ఇప్పుడు ఏడ్చి ఏమి లాభం…అప్పుడు ఉండాలి తెలివి.ఇంతకీ ఆ బిడ్డ నీ దగ్గర ఉందా?”అడిగాను ఏమి వినాల్సి వస్తుందో అని బయపడుతూనే.
ఊహించినదే చెప్పింది.”ఆరు నెలల క్రితం పెద్దమ్మాయి అయింది.అందుకే కాపురానికి పంపేసాను”ఇంకా చెపుతూనే ఉంది.
నాకు ఒక్క సారి గుండె ఆగినట్లు అయింది.”కాపురానికా…అంత చిన్న పిల్లని”
”దాని మొగుడు మంచోడేనా ….ఏమి చేస్తాడు”
ఎలాగైనా ఆ బిడ్డ బాగుండాలి అని మనసు మెలిక తిప్పుతూ కోరుతూ ఉంది నాకు.
కట్టలు తెంచుకున్న దుఃఖం వరదలా ఉరికింది.
”లేదక్కా ….వాడు బెల్దారి పనికి పోతాడు,పది ఏళ్ళు పెద్ద దాని కంటే….రాత్రికి తాగటం,తన్నటం”వెక్కిళ్ళ మధ్య చెప్పింది.
యెంత ఘోరం….ఇప్పుడేమిటి చెయ్యటం ?ఎలాగోలా కొంత అయినా సహాయం చెయ్యాలి.
”ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడ ఉంది?”అడిగాను.
”ఆడే ఉంటె వాడి దెబ్బలకి చచ్చి పోద్ది అని  ఇంటికి తీసుకుని వచ్చాను.నా దగ్గరే ఉంది”చెప్పింది
కొంత సౌలభ్యం వాళ్లకి….మధ్య తరగతి వాళ్ళు లాగా చచ్చి పోయినా భర్త దగ్గర ఉండాలి అనరు.
”అందుకే నాకు వేరే దారి లేక కూరలు అమ్ముతున్నాను.ఇప్పుడు నువ్వు పిలిస్తే కూడా పిల్లలకి  బట్టలకైనా వస్తాయి అని వచ్చాను.నేను ఇలా శుబ్రంగా తయారు అయినా ఊర్లోవాళ్లకి బాధే. అయన బతికి ఉన్నప్పుడు ఇలాగా ఉండాలి అనేవాడు.అలాగే అలవాటు అయింది.మిగిలిన అందరు ఇప్పుడు నేను కూరలు అమ్మటం లేట్ అయినా చెవులు కోరుక్కుంటారు.ఇద్దరు ఆడ పిల్లలను కాపాడ లేక నన్ను నేను కాపాడుకోలేక అవస్త పడి పోతున్నాను”చెప్పింది.
”బాధ పడకు ఆ బట్టలన్నీ నువ్వే తీసుకుపో”చెప్పాను కరిగి నీరైన మానవత్వంతో.
అప్పటికి సగం పని అయింది.ఇంకా బయట కిటికీలు తుడవాలి. పొద్దు పోతుంది.పంపించాలంటే నాకు మనసు ఒప్పటం లేదు.
రెండొందలు ఇచ్చి పూర్తి పని చెయ్యక పొతే ఎలా?
”ఇదిగో వాణి మిగిలిన పని రేపు వచ్చి చెయ్యి….అప్పుడే బట్టలు తీసుకొని వెళ్ళొచ్చు  కాని”లోపల పెట్టేసాను.
దిగులుగా చూసింది…బట్టల వైపు చూస్తూ”రేపు కూడానా ?”
ఎవరు ఏమంటారో అనే భయం తన కళ్ళలో  రెపరెప లాడుతూ ఉంది.
”కనీసం డబ్బులు అయినా ఇయ్యక్కా…బియ్యం కొనుక్కొని వెళ్ళాలి”
(అమ్మో రేపు రాక పొతే మిగిలిన పని ఎవరు చేస్తారు….ఇచ్చేది లేదు )
అయినా లెక్క చెయ్యలేదు.
”అవును రావాల్సిందే….మిగిలిన పని పూర్తీ చెయ్యాల్సిందే,అప్పుడే ఇస్తాను డబ్బులు కూడా ”మౌనంగా  వెళ్లి పొయ్యింది…..దిగులుగా తల వంచుకొని.

నేను మాత్రం ఏమి చేస్తాను…నేను మీలాగే మామూలు మనిషినేగా…