Monday, 30 December 2013

మౌనమే నీ బాష ఓ మూగ మనసా ....

మౌనమే నీ బాష ఓ మూగ మనసా .... 
ఏమిటో కవి గారు ఇలాగ చెప్పారు . మౌనం దేని గూర్చి చెపుతుంది ?
ఎలా చెపుతుంది ?
'' మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ''
ఏమిటో మౌనం గా కూర్చుంటే ఏమి ఎదుగుతాము? ఎక్కడ 
ఎదుగుతాము ? 
ఏమి చెపుతున్నారు వీళ్ళు అందరు . ఉండండి ఒక పెద్దాయన 
ఉండేవాడు అరుణాచలం లో .... అందరి చేత మౌన స్వామీ అని 
పిలిపించుకుంటూ ఉండేవారు . ఆయనను అడుగుదాము . 




ఈయన నాకు ఎలా పరిచయం .... ఒక సారి ఒక పదేళ్లకు ముందు 
ఆటో లో వస్తూ ఉంటె ఈయన ఫోటో చూసాను . ముసలి వ్యక్తి ... 
ఎవరబ్బా ఈయన ఫోటో ఆటోలో పెట్టుకున్నారు అనుకున్నాను . 
అడగాలి అనుకుంటే మాటలు కూడా రావడం లేదు . ఆ ఫోటో 
చూస్తూ ఉంటె ఏదో నిశ్శబ్దంగా ... చూస్తూ ఉంటె చూడాలి అనిపిస్తూ 
ఉంది . ఆ ట్రాన్స్ లోనే ఇంటికి వెళ్లాను . ఎవరోలే అనుకున్నాను 
కాని ఆ నవ్వు .... అబ్బ ఏమి లాగేస్తుంది ... మరో ఆలోచనే రావడం లేదు . 
అదేదో సినిమాలో చెప్పినట్లు 
''అపరంజి సుతుడే అనురాగ విహితుడే అతడేమి అందగాడే '' 

మళ్ళా ఒక సారి బస్ లో చూసాను ఫోటో . చూపు తిప్పలేకపోతుంటిని. 
తరువాత ఒక బుక్ ఒక పిల్లవాడి దగ్గర దొరికింది . అందులో చూస్తే 
''రమణ మహర్షి '' అరుణాచలం లో ఉంటారు అని ఉంది . ఓహో వెళ్లి 
చూస్తే బాగుండును . ఎక్కడో అది ?
అనుకోకుండా నాన్న ఫోన్ . అరుణాచలం టూర్ బస్ వెళుతుంది ,వస్తారా ?
హమ్మయ్య నాన్న ఈయన పిల్లలు ఇంకా బస్ సీట్లు ఖాళి ఉన్నాయి 
అని చెల్లి పిల్లలు .... ఎప్పుడో రాత్రి ప్రయాణం మొదలు పెడితే వాడు 
శుబ్రంగా కాణిపాకం చూపించి సాయంత్రానికి చేర్చాడు అరుణాచలం . 
శివుడి గుడి మాకు తెలుసు .... ఎందుకంటె రాధిక '' శివయ్య '' 
సీరియల్ చూసే వాళ్ళం కదా . 
గుడి చూసి ఆశ్రమానికి వెళ్ళే సరికి చీకటి పడుతూ ఉంది . పెద్ద హాల్ 
లో ఆయన ఫోటో లు . చిన్నప్పటి నుండి . బాప్రే ఇంత చిన్నప్పటి 
నుండా ! ఎదురుగా లక్ష్మి అనే ఆవు సమాధి . ఆవుకు సమాధా  ?
అదీ ఇక్కడ !ఏదో ఇంటరెస్టింగ్ . ఈయన సామాన్యుడు కాదు . పక్కనే 
రూం లో స్వామీ వారు దివాన్ మీద కూర్చునట్లు ఫోటో . అదే గోచి . 
అదే నవ్వు . అదాటున చూస్తే ఆయన అక్కడ ఉన్నారా అనిపిస్తూ 
ఉంది . ఇంకా ఆయన వాడిన వస్తువులు ,ఆశ్రమం మొత్తం చూసి ఒక 
బుక్ కొనుక్కొని వచ్చేసాము . 

ఇంటికి వచ్చినాక మా చిన్న పిన్ని అడిగింది ''గిరి ప్రదక్షిణం ''చేసారా ?
అని . అదేమిటి ?వింతగా అడిగాను . ''పిచ్చి మొహమా అరుణాచలం 
లో చెయ్యాల్సిందే గిరిప్రదక్షినం ,ఆయన తపస్సు చేసిన స్థలాలు ,తీర్దాలు 
ఉంటాయి .ఇంకా అసలు ఆ కొండే దేవుడు ''అని చెప్పింది . 
తరువాత బుక్ చదివాను ..... స్వామీ వారే దగ్గరుండి అందరిచేత 
గిరి ప్రదక్షిణం చేయించేవారంట . ఎప్పుడు కొండకు ఆనుకొని నడవొద్దు ,
అక్కడ నిశ్శరీరులైన దేవతలు ప్రదక్షిణం చేస్తుంటారు ''అని చెప్పి 
దూరంగా  నడిపిస్తూ ఉంటారంట . 
ఆ మహిమలు ,ఆయన అరుణాచలం కి రావడం ,ఆయన మృత్యు 
అనుభవం చదువుతూ ఉంటె ఎందుకులే నా బాధ బాధ కాదు . 
అయ్యో ఇంత విషయాన్ని మిస్ అయిపోతినే . ముందు ఈ బుక్ 
చదివి ఉండకూడదా అని ఒకటే దిగులు . 

తరువాత పక్కింటి వాళ్ళు వెళుతుంటే నేను ఒక్కటే వాళ్ళతో వెళదాము 
అనుకున్నాను . చిత్రం నివాస్ అప్పుడే బాత్రూం తలుపు వేస్తూ బొటన వేలు 
నలిగి ఒకటే రక్తం . పదో తరగతి చదివే పిల్లాడు ,ఏమైనా చిన్న పిల్లాడా 
ఇలా జరిగింది అని .... శకునం బాగా అనిపించక వెళ్ళ లేదు . 
తరువాత చెప్పారు ... రమణ మహర్షి గారి అనుమతి అయితేనే 
మనం వెళ్ళ గలం అని . ఇప్పటికీ వెళ్ళ  లేదు. 

ఆయన చెప్పేది ఒకటే మౌనంగా కూర్చొని నేను ఎవరిని అని 
విచారణ చేస్తూ ఉంటె ఆ నేను ఎవరో అదే తనలోకి లాక్కుంటుంది . 

కాని నా అనుభవం ఏమిటి అంటే మనం మౌనంగా కూర్చోవడం 
కాదు ,సద్గురువు ఎనెర్జీ లోకి మనం రాగానే మనం మౌనం లోకి 
వెళ్లిపోతాము . ఏమి జరుగుతుందో మనకు తెలీదు కాని ఏమో 
తెలిసినట్లు ఏదో ప్రశాంతత . అది అనుభవించాల్సిందే ..... 
మాటల్లో చెప్పలేము . 
ఈ రోజు వారి జయంతి . ''సద్గురు రమణ మహర్షుల వారి 
పాద పద్మములకు ప్రణామాలు ''  

చూస్తే బాగుండును .  

Thursday, 26 December 2013

నవ్వుల ఎక్స్ ప్రెస్


''అమ్మా రేపు క్రిస్మస్ సెలవు కదా ,నాన్న  నువ్వు 
నెల్లూరు కి వస్తారా .... వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాకి 
పోదాము . భార్గవి వాళ్ళు టికట్స్  తెచ్చుకోను
 వెళుతున్నారు ,మీరు వస్తాను అంటే మీకు తెచ్చి పెడతాము ''
నెల్లూరు నుండి పాప ఫోన్ . 
వార్నీ ఈ సినిమా ఇంకా కంచికి చేరలేదా !
అంటే దీన్ని అందుకునే చాన్స్ ఇంకా ఉంది సుమా . 
బహుశా మేర్లపాక గాంధి కి ఋణం ఉందేమో 
మన డబ్బులు :) 

ఏమిటి ఇంతకు ముందు మిస్ అయ్యారా అంటే ....
 హ్మ్ అదో పెద్ద కధ  . 
కాదు లెండి చిన్న కధ . 
నివాస్ డిసంబర్ మూడో తేది వచ్చాడు
 సెం హాలిడేస్ అని . రాగానే సాయంత్రం రెడీ 
అయి పోతున్నాడు . ఎక్కడికిరా ?అని అడిగితే 
''వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ '' సినిమాకి అన్నాడు . 
నేను వస్తాన్రా అన్నాను . 
''పోమా నేను మా ఫ్రెండ్స్ తో వెళుతున్నాను ''అని వెళ్ళిపోయాడు . 
అక్కడ నుండి రాక ముందే నెట్ లో ప్లాన్ చేసుకొని ఉంటారు ,

రాచ్చసుడు .... చిన్నప్పటి నుండి వీడిని 
ఎన్ని సినిమాలకు తీసుకొని వెళ్లి ఉంటాను . 
ఇంకా నాన్నతో పో అనే సలహా పడేసి వెళ్ళాడు . 
హ్మ్ ... ఆయన గారు తీసుకెళితే వీళ్ళను ఎందుకు అడగడం . 
సరే అని పాప వచ్చాక అడిగిస్తే .... అప్పటికి ఆయన రూల్స్ .... 
అంటే మనుషులు తోసుకో కూడదు , సిగిరెట్ పొగ ఉండకూడదు , 
తల నొప్పి రాకూడదు ఇన్నిరూల్స్  ఆ సినిమా నెగ్గేసింది కాబట్టి ఒప్పుకున్నాడు . 
ఇంకేముంది ఎక్స్ ప్రెస్ ఎక్కడమే అనుకోని థియేటర్ కి వెళ్ళాము . 
తీరా చూస్తే మేము తప్ప అక్కడ ఎవరూ లేరు . 
అడిగితే సినిమా ఈ రోజే మారింది
 ''బన్నీ ఆండ్ చెర్రి '' అని చెప్పారు . చేసేదేముంది మళ్ళా ట్రైన్ మిస్ . 
తల ఎత్తి ఈయన వైపు చూడకుండా బుద్ధిగా ఆ సినిమా చూసేసి వచ్చాము . 
పోనీ ఆ ట్రైన్ ని ,ఇదేమన్న పవన్ కళ్యాణ్ సినిమానా 
నెల్లూరు కి పోయి చూడ టానికి ,నాలుగు రోజులు పోతే
 టి . వి లో వచ్చేస్తుంది అనుకున్నాను . 
ఇదిగో లేకలేక లేక లేక లేక లేక లేక సెలవు వచ్చేసరికి పాప ఫోన్ . 

సెలవు లేక ఏమిటి అంటే .... ఆ సమైఖ్యాంద్ర స్ట్రైక్ పుణ్యామా అని 
ఆదివారాలు కూడా పని . దేవుడా! ఆదివారం లేకుంటే ఇరవై ఏళ్ళు 
ఉద్యోగం చేసి ఉండేదాన్ని కాదేమో అనిపిస్తుంది . ఇంకొంచెం ఉంటె 
హిమాలయాలకు వెళ్లి పోదాము అనిపిస్తూ ఉంది . ఏదో అక్కడ సినిమాలు , 
సెక్యూరిటీ లేదని ఆగాను . ఈ . ఎల్స్ కొందరు సరండర్ చేసారు ,మా ఆదివారాలు 
మేము, ఇంకా ఇంకో పదిహేను నెలలు రెండు రూపాయల అప్పు కట్టే వాళ్ళు ... 
కష్టం మొత్తం సముద్రం పాలు . అవతలి వాళ్ళు మమ్మల్ని కనీసం మనుషులుగా 
కూడా గుర్తించక పోతిరి . లోక్ సత్తా ఆయన అన్నట్లు .... మనం కలిసి ఉంటామో 
విడిపోతామో మనం మనం తెల్చుకోవాలా .... చస్ అవతలి వాళ్ళు ను 
అడగడమేమిటి .... వాళ్ళు షరతులు పెట్టడం ఏమిటి ?ఇంతా చేస్తే 
వాళ్ళు చించిన ముక్కలు ఇద్దరికీ పనికి వస్తాయో లేదో తెలీక పోతుండె . 
''అసలు తెలుగోళ్ళు అంటే ఎవరు ?.... ఎవరు సప్పోర్ట్  లాగేస్తే కేంద్రానికి 
దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే తెలుగోడు '' మనమేంది వాళ్ళను 
పొగడడం ఏమిటో . కలిసున్నా విడిపోయినా పక్క పక్క న ఉండాల్సిన 
వాళ్ళం ఆవేశం లో మాటలు జారుకుంటే సాయం అవసరం అయినపుడు పరిస్థితి ఏమిటి ?

సర్లెండి సినిమాకి పోతూ ఈ కధ  ఎందుకు ? 
మొత్తానికి వెళ్ళాము . నేను ఈయన ,పాప ,చెల్లి పిల్లలు భార్గవి రమ్య గౌతం 
ఇంకా మా అక్క కూతురు కాబోయే డాక్టరమ్మ సిరి . మా కుటుంభం లో 
ఏకైక బై . పీ  . సి . ఎం . బి . బి ఎస్ మొదటి సంవత్సరం . అసలు సినిమా 
ప్లాన్ తనదేనని తెలిసింది . మా బంగారు తల్లి . మొత్తానికి హీరో ఎన్నో 
సార్లు ట్రైన్ మిస్ అయినా నేను సినిమా మిస్ కాలేదు . 

ఇదిగో ఇదే హీరో కుటుంభం . వాళ్ళ నాన్న నూరు తప్పులు చేసాడు అని 
సొంత తమ్ముడినే ఇంట్లోంచి బయటకు పంపేశాడు . ఇప్పుడు అందరి గొడవలకి 
వెళ్లి సర్ది చెప్పే హీరో గారు తొంబై తొమ్మిది తప్పులు చేసి నూరో  తప్పు 
చెయ్యకూడదు అని కష్ట పడటమే సినిమా అంతా . వాళ్ళ కుటుంభం అంతా 
వాళ్ళ అన్న పెళ్ళికి తిరుపతికి బయలుదేరితే వాళ్ళ అమ్మ తాళి తీసుకురావడం 
మరిచిపోతుంది . 
అక్కడ మొదలు అయిన కధ తాళి తేవడం లో 
హీరోయిన్ ను కూడా చేర్చుకొని ఇంకో జంట కలపడం.... 
హీరో ఏమో షాద్ నగర్ లో ,ధోన్ 
లో కర్నూలు లో ఎక్కడి కక్కడ వేరే వాళ్ళ సమస్య లలో తల దూర్చుతూ 
ట్రైన్ మిస్ అవుతూ చివరికి చేరుకుంటాడ ... వాళ్ళ నాన్న నూరు తప్పులు 
అయ్యాయి అని తరిమేస్తాడా ?అనేది కధ . ముగింపు చెప్పెస్తాలే . సినిమా 
వచ్చి చాలా రోజులు అయిందిగా . తరమడు . వేయి తప్పులకు హద్దు పెంచుతాడు . 

కొత్త వాళ్ళు బాగా చేసారు అనే కంటే డైరక్టర్ బాగా చేయించుకున్నాడు అనొచ్చు . 
ప్రతి ఫ్రేం లో ఎడిటింగ్ కాని, ఫోటోగ్రఫీ కాని తన అభిరుచి చాలా బాగా 
కనిపించింది . హోలీ బాక్ గ్రౌండ్ లో ఫైటింగ్ ఎంత కలర్ ఫుల్ గా ఉందో !
ఇంకా ''మెల్లిగా మెల్లిగా '' పాట  అయితే ప్రతి ఫ్రేం ఒక చక్కటి చిత్రకారుడు వేసినట్లే ,
పాపం ఆ అమ్మాయి దుస్తులు పొదుపుగా వేసినా ఆ ఫ్రేం లో ఒక పువ్వుగా ఒదిగిపోయింది . 

ఇక హీరో కి బాగ్ ఇచ్చినోడి (యాద్ గిరి) కామిడీ ,టి . సి కామిడీ ,తాగుబోతు 
రమేష్ కామిడీ బాగున్నాయి . ఎడిటింగ్ ఏమవుతుందా అనిపించేటట్లు ఉంది . 
కధలో పెద్దగా బలం లేక పోయినా చక్కటి సంగీతం ,కధనం డబ్బులు వేస్ట్ 
కాలేదు అనిపించింది . 
పని కట్టుకొని చూడక్కర్లేదు కాని చూసే వీలు ఉంటె ,సినిమా చూద్దాము 
అనిపిస్తే ఈ సినిమాని ఎంచుకోవచ్చు . 
సినిమా అయిపోయాక వస్తుంటే చూసాను ,సీట్ లు కోసేసి ఉన్నాయి . 
హ్మ్ సిటీ అయినా ఇంతే ,బాల్కనీ అయినా ఇంతే . కోసేవాడికి పోయేదేముంది !
ఓనర్ కి తెలుస్తుంది దాని బాధ :(

Sunday, 1 December 2013

పుట్టిన రోజు శుభాకాంక్షలు

పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఏమి ఇంజినీరింగ్ చదువులో ఏమిటో !
బిడ్డలు కనీసం పుట్టిన రోజుకు కూడా ఇంటికి రాలేక పోతున్నారు .
''నివాస్ పుట్టిన రోజు శుభాకాంక్షలు కన్నయ్య ''
''శతమానం భవతి ''
ఇంకా నీ లాబ్ ఎక్సామ్ కి ఆల్ ది బెస్ట్ .
ఇవన్నీ రెండో తేది చదువుకో రేపు నాకు తీరదు అని ఈ రోజే
ముందస్తుగా చెపుతున్నాను :)

ఇంకా ఫేస్బుక్ గ్రూప్ ''కవి సంగమం ''లో నీ కోసం వ్రాసిన
కవిత :))
వట్టి కవితేనా ...... అంటే ఇదిగో ఇవన్నీ నీ కోసమే :)


అప్పుడు నీవక్కడ ఉన్నావా ?
                                                                        01/12/2013
    జ్ఞాపకాల సద్ది మూటను 
ఒక్క సారి విప్పి చూడరాదా !
అప్పుడు నీవు అక్కడ ఉన్నావో లేదో ...... 

ఊపిరి పోసుకున్న నీ ప్రతిబింబం 
అమ్మా అనే రాగాన్ని తొలిసారి ఆలపించినపుడు 
చిట్టి అడుగుల వామనుడు ఎంతో ఎదిగి 
నీ హృదయ సీమనే మూసేసినపుడు 
వీపు సింహాసనం పై చుట్టుకున్న చిన్ని చేతులు 
మురిపంగా నీపై  జంపాల ఊగినప్పుడు 
బడికి వెళ్ళలేక చిన్నారి 
బెంగ నీ కాళ్ళకు చుట్టి కదలనీయనప్పుడు 

నీ చేయి దిండు స్పర్శ తగిలి 
బుజ్జి ఊహలు కధలుగా మారినపుడు 
ఊ కొడుతూ చిన్ని ఊసులు 
చిరు నిద్రలోకి జారినపుడు 
పాలభాగాన్ని చుంబిస్తూ పిల్ల తెమ్మెర 
ముంగురులను సర్దినపుడు 
కాళ్ళు చేతుల సంకెళ్ళతో 
నిన్ను కట్టిన బరోసాతో రెక్కల గుర్రాల పై 
బుజ్జి పాపలు ఎగిరినపుడు ..... 
ఒక్క సారి చూసుకో నీవు అక్కడే ఉన్నావా ?

గాలి ని మూటలు కడుతూ 
ఆశల ఎండమావుల వెంట పరిగెడుతున్నావా 
లేక అక్కడే ఉన్నావా ?
చిగురించిన జ్ఞాపకాల తడి మనసుకు అద్దుతూ 
నిజం చెప్పు నీవు అక్కడే ఉన్నావా ?
                 *******************