Tuesday, 22 December 2015

మా నేల తల్లి (3)

( part 2 link ikkada )

''నాన్నా '' పరిగెత్తుతూ వస్తున్న నన్ను చూసి నాన్న
వెనక్కి తిరిగాడు . 
''చిన్నగా చిన్నగా '' ''అబ్బే మొద్దా ఏంది  ఈ బురద ''
అదంతా పట్టించుకోకుండా '' అటు చూడు అటు చూడు ''
గబ గబ అన్నాను . 
''ఏముంది అక్కడ !'' ఆశ్చర్యంగా అన్నాడు . 
''చూడు నాన్న మన చెట్లు అన్నీ ఎలా తొక్కేస్తున్నారో ''చూపించాను 
పక పక నవ్వాడు పొలం లోని మడి వైపు చూస్తూ .... 
మడి  లో నడుము అంత  పెరిగిన మొక్కల్ని దున్నేస్తూ తిరుగుతున్న 
కాడికి కట్టిన ఎద్దులు . 
''అది జనుము తల్లి , నేలకి సత్తువ '' 
''పేడ  చల్లారు కదా నాన్నా మళ్ళీ ఈ చెట్లు చంపడం ఎందుకు ''
''పంటకు పంటకు మధ్య ఇలా పేడ  , జనుము వేస్తె అది నేల తల్లికి 
భోజనం తల్లి. నువ్వు అన్నం తింటేనే కదా బలంగా ఉంటావు . 
నేల కూడా అంతే '' కొంచెం అర్ధం అయినట్లే ఉంది . 
ఆడవాళ్ళు వంగి నారు వేస్తూ ఉన్నారు . చేతులకు ఉండే గాజుల చప్పుళ్ళు , 
కొంచెం పైరు గాలి హాయిగా ఉంది . 
గనిమ మీద గోతం లో తెల్లగా ఆవాలు . పాలేరు కొన్ని బుట్టలోకి వంచుకొని 
నారు వెయ్యని పొలం లోకి దిగి చల్లుతూ ఉన్నాడు . 
ఇదేమిటి నాన్నను చూసి తల ఎగరేసాను . 
''అదీ బలానికే ఫాస్పేటు , మనకు బోలెడు పంట రావాలి కదా '' చెప్పాడు . 
''మరి ఇదే వెయ్యండి నాన్న . పేడ వద్దు యాక్ '' 
''తప్పు తల్లి . ఇది నువ్వు ఎప్పుడైనా పండక్కి స్వీట్ తింటావు కదా 
అలాగ ! జనుము , పేడ , నేలకు అన్నం కూరలు లాగా ,అవి ఎక్కువ తింటే 
నేల కి జబ్బే రాదు '' 
అర్ధం అయింది . నేనేమైనా మొద్దు పిల్లనా ఏమిటి !
''నాన్న అన్నం తెచ్చాను . తిందాము రా '' 
''ఉండమ్మా ఈ మడి నారేతలు అయిపోనీ , ఈ మోటార్ కూడా బాగు 
అయిపోతుంది . వాళ్ళు కూడా అన్నానికి వెళ్ళాలి కదా . 
ఈ రోజుకల్లా ఈ పొలం పూర్తి అయిపోవాలి . లేకుంటే కూలోళ్లు 
రేపు దొరకరు '' చూసాను . 
చీర దోపుకొని వంగి చిన్ని మొక్కలు సుతారంగా 
నేలలోకి నిలుపుతూ ముగ్గు జారినట్లే ఉంది ఆడవాళ్ళు ఏమి 
చేసినా ఇంత  అందంగానే ఉంటుందో ఏమో ! 
ముక్కు మీద జారుతున్న చెమట 
ముత్యాలుగా రాలుతున్నా తుడుచుకోకుండా
 శ్రద్దగా ఒక్కో వరుస వేసుకుంటూ ఉంటె 
,పై నుండే మబ్బు వాళ్ళను చూస్తుందో నీళ్ళలో 
దాని మొహాన్ని చూసుకుంటున్నట్లు నటిస్తుందో !
చుట్టూ చూస్తె ఎదురు గనిమ దగ్గర కొబ్బరి చెట్లు వరుసగా 
పక్కనే వీళ్ళ టిఫిన్ క్యారియర్ లు . ఏముంటుంది లోపల 
నాకు తెలుసు !మా అమ్మ మాకు కూడా అదే ఉదయం పెట్టేది . 

నిండుగా అన్నం . అది మునిగే దాకా నీళ్ళు . అందులో ఉప్పు కలిపి 
మేము రెండు చేతులు దోసిలిగా పడితే అందులో అన్నం పెడుతుంది . 
దాని మీద కొంచెం పచ్చడి . అన్నం కొంచెం అది కొంచెం అంతే !
ఒక్కో ముద్దకి బోలెడు చలవ . ఇక మధ్యాహ్నం బడి నుండి 
ఇంటికి వచ్చేదాకా ఆకలి అనే మాటే లేదు . అన్నం లో నీళ్ళు 
మా నాన్న తాగేస్తాడు . అందుకే మా నాయనకు బోలెడు బలం . 
నేను కూడా అలాగే తింటాను . అప్పుడు నాకు కూడా బోలెడు 
బలం వస్తుంది . ఇక నేలకి , దానికి బోలెడు బలం జనుము 
పేడ వేస్తున్నాము కదా !
 మా నాన్నకి పిల్లలు అయినా పొలం 
అయినా బోలెడు ప్రేమ . 

అయ్యా కొత్త బెల్ట్ బాగా పనిచేస్తుంది . 
మోటార్ వెయ్యమంటారా ?
మెకానిక్ అడిగాడు . 
నాన్న తల ఊపగానే మోటార్ వేయడం 
నీళ్ళు జయ్యని కాలవలోకి పోయి పొలాన్ని తడుపుతూ . 
''బాగుంది కదరా కొత్త బెల్ట్ , అంగడి లోకి  తెప్పిస్తాను ''చెప్పాడు నాన్న . 

ఏ కొత్తది అయినా నాన్నే ముందు వాడి చూస్తాడు . బాగుంటే 
అందరికంటే ముందే షాప్ కి తెప్పించి అమ్మేస్తాడు అది కూడా 
తక్కువ ధరకి . ఎక్కువ లాభం తో తక్కువ అమ్మే దానికంటే 
తక్కువ లాభం తో ఎక్కువ మందికి అమ్మాలి అంటాడు . 
అందుకే మా అంగడి అంటే చాలా ఇష్టం ఎంతో  మందికి. 

''రా బురద కడుక్కో '' 
నీళ్ళ తొట్టి లోకి దిగి తల నెమ్మదిగా మోటార్ కింద పెట్టాను . 
దబ  దబ నీళ్ళు ,ఉక్కిరి బిక్కిరి అయిపోయి తల తీసేసాను . 
పది సార్లు మునుగో మునుగు . 
బయటకి వచ్చి చూస్తె నాన్న ఇంకా పనిచేయిస్తూ ఉన్నాడు . 
రెండు చేతులు చాచాను రెక్కలు లాగా . జుయ్య్ .... 
గనిమ మీద పొలం అంతా పరిగెడుతూ .... రెండు సార్లు తిరిగే సరికి 
గౌన్ ఎప్పుడో ఆరిపోయింది . 
రెండో సారి పరుగులో చూసాను ఆ పిల్లని , నాకంటే కొంచెం పొడుగు . 
చేతిలో నార కట్ట పట్టుకోలేక అవస్థ పడుతూనే ఒక్కో మొక్క తీసి 
నేలలో గుచ్చుతూ ఉంది . మెల్లిగా అలవాటు పడుతున్న వేళ్ళు 
వేగాన్ని పుంజుకుంటూ ..... ఒక్కో మొక్క ఆ చేతి నుండి తీసుకోవడం 
విరగకుండా సుతారంగా గుచ్చడం , మధ్యలో మిగిలిన వాళ్ళ 
వరుస లో ఉన్నానా చూసుకుంటూ ఉంది . 
నాకు భలేగా ఉంది ఆ పిల్ల చేసే పని .... చూస్తూ ఉన్నాను 
ఆ చిన్న చేతుల వైపు , అవి పైకి లేస్తే నా చూపు కూడా పైకి , 
అవి కిందకి వెళితే నా చూపు కూడా కిందకి . 
ఒక నిర్ణయానికి వచ్చాను . 
అంటే మా నాన్నకి నాతొ ఇబ్బంది  మొదలైనట్లే మళ్ళీ 
'' నాన్నా '' పరుగు '' ఏమిటి తల్లి ? ''
'' ఏందంటే "
                          **********
                                                             ( ఇంకా ఉంది )



Monday, 14 December 2015

శార్వరి గారు దిగులుగా ఉంది

శార్వరి గారు దిగులుగా ఉంది 

ఆయన 12/12/15 తేది  శివైక్యం జరిగింది అని తెలిసినప్పటి
నుండి . ఇక ఆయన నుండి మార్గదర్శనాలు రావా ! 
అసలు నేను ఎందుకు బాధ పడాలి ?
ఆయన ఏమైనా నాకు మాష్టారా . కాదేమో ! అవునేమో ! 
కాని ఒకటి ఖచ్చితంగా చెప్పగలను నేను పోతున్న దారిలో నాకంటే 
ముందు నడిచిన వారు , ఇంకా తన అనుభవాలను గ్రంధస్తం చేసి 
నాలాంటి వాళ్లకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చిన వారు . 
ఇంత వ్రాసి మిమ్మల్ని కదిలిస్తున్న అక్షరాల వెనుక ఉన్న శక్తి నాది 
కాదు , అసలు నేను ఏమి వ్రాసానో .... వ్రాసిన తరువాత మళ్ళీ 
చదువుతాను అని ..... లోపలి అంతరిక శక్తుల మర్మం చెపుతారు . 

తొమ్మిదేళ్ళ క్రితం , ఒక సారి వడదెబ్బ కొట్టి చచ్చి బ్రతికిన 
అనుభవం తరువాత నన్ను ఇక్కడకు మళ్ళీ నా విన్నపాన్ని 
మన్నించి పంపినది ఎవరు , అసలు అక్కడ ఏమి జరుగుతుంది !
అనే ఒక ఆలోచన నాలో . ఎప్పుడూ మేలుకొని ఉన్నంత సేపు 
అష్టాక్షరి జపమే తప్ప  ఇంకొకటి నాకు తెలీదు .
 కాని దీనికి భిన్నమైనది ఇంకొకటి ఉంది . 
తెలుసుకోవాలి అనే తపన . 

ఇక్కడ పిరమిడ్ క్లాసెస్ రాఘవేంద్ర గారు , గాంధి గారు 
చక్కగా నడుపుతున్నారు అని తెలుసుకొని మా ఇంట్లో 
ఒక వారం క్లాస్ పెట్టమని అడిగాను . 
ధ్యానం తరువాత ఏమి కనిపించాయి అని అడుగుతూ ఉంటారు . 
ఏమిటి కనపడేది ! నేను సైన్స్ స్టూడెంట్ ని ఒక పట్టాన నమ్ముతానా !
తెల్లవారు జామున ధ్యానం చేస్తుంటే ఒక్క సారి నుదురు దగ్గర 
ఎలక్ట్ర సిటీ స్పార్క్ వచ్చినట్లు మెరుపు , ముందుకు వాలి పోతూ 
ఉంటె విష్ణు చక్రాలు లాగా ఒక వరుస .... ఏమిటివి ? 

మళ్ళీ సామూహిక ధ్యానం లో పొట్ట లోపలికి వెళుతూ ఉన్నట్లు 
ఏదో పైకి ఉబుకుతున్నట్లు .... ఒకటే నోట్లో నీళ్ళు ఊరుతూ , 
ఇంత మంది నేను లేస్తే డిస్టర్బ్ అవుతారు . మింగేసాను . 
ఏమిటది ? ఇంకో జవాబు తెలియని ప్రశ్న . 

సగం రాత్రి లేస్తూ ఉంటాను , ఏవో శబ్దాలు యేవో వాయిద్యాలు 
మ్రోగుతున్నట్లు , శివ లింగం నుండి వెలువడుతూ ఓంకారం .... 
ఏమిటి ఈ పిచ్చి కలలకు అర్ధం . ఎంతగా  లైట్ తీసుకో ఏవో భ్రమలు 
అని సర్ది చెప్పుకున్నా ..... ఒక్క గురువు ఉంటె బాగుండును . 
ఇవన్నీ చెప్పేవాడు కదా అని బాధతో ఏడ్చేదాన్ని . 
బ్రతికి ఉన్న బాబాలు , గురువుల మీద నాకు నమ్మకం లేదు . 
కాని నాకు ఒక గురువు కాక పొతే సందేహాలు తీరే జ్ఞానం కావాలి , 
అదే ఆలోచన . అసలు వీటిని ఎవరితో పంచుకోవాలి , పిచ్చిదాన్ని 
అనుకుంటారు . లోపల నుండి మాత్రం తెలుసుకోవాలి అనేబలమైన 
తపన .... రామకృష్ణ పరమహంస గారు చెపుతూ ఉంటారు 
''పక్క గదిలో ధన రాసులు ఉంటె దానిని పొందడానికి దొంగ 
యెంత తపన పడతాడో అంత  తపన పడాలి దేవుడి కోసం . 
అప్పుడే ఆయన నీ కోసం వస్తాడు '' అని . 
నిజంగా లోపల ఏదో వ్యధ , ఏదో కోల్పోతున్నట్లు , ఏదో కావాలన్నట్లు . 

అప్పుడు మా అక్క ఇచ్చింది ''అసతోమా సద్గమయా '' శార్వరి . 
ఆహా దప్పిక నీళ్ళు అడిగితే దేవుడు అమృతమే పంపాడు . 
మూడు పేజీలు  తిప్పగానే కళ్ళు మూతలు పడిపోతాయి . 
శరీరం ఉందొ లేదో ! తెరిపన పడాలి అనే అవసరం లేక పోతే 
నిద్ర లోకి వెళ్ళిపోవడమే . 
ఇక వరుస '' మాస్టర్ సి . వి . వి '' మాష్టారు గారి అద్భుత ప్రయోగాలు . 
నిజమా ఎలా నమ్ముతాము . పాలల్లో వెన్న ఉంది అంటే నమ్మేస్తామా . 
మాష్టర్ సి . వి .వి నమస్తే అనుకోండి , కుండలిని బోరింగ్ ఈజీ గా 
చేసేస్తాడు . అంత  ఈజీనా ! పట్టు పడితే తేల్చుకునేదాకా వదలను నేను . 

పైకి వెళ్లి  ఆకాశం చూస్తూ కూర్చున్నాను . మెల్లిగా కళ్ళు మూసుకొని 
మాష్టర్ సి . వి . వి గారు నమస్తే . ఏమి జరిగింది , ఏమి లేదు . 
కాదు ఏదో ఉంది . మెల్లిగా వెనుక వైపు ఏదో ఎగసి పైకి వస్తూ 
తల మొత్తం భారంగా , అలాగే చాలా సేపు కూర్చుండిపోయాను . 
ఇక అంతే  లైబ్రరీ లో శార్వారీ పుస్తకాలు వదలకుండా చదువుతూ ఉంటె 
వాళ్ళు '' మేడం శార్వరి వి ఎక్కువ చదవకండి . ఎవరికీ అలవాటు 
పడకూడదు . అందరి జ్ఞానం మనం తెచ్చుకోవాలి . జ్ఞానం ముఖ్యం '' 

''కుండలినీ '' అదిగో బుక్ దొరికేసింది . నా సందేహాలన్నీ తీరిపోతూ 
లలన చక్రం ఎనర్జీ వచ్చినపుడు నోట్లోకి ఊరుతూ అమృతం , ఇదేనా ! 
ఓహో ఇదంతా మనం మన లోపలి పోయే దారిలో ఒక క్రమం అన్న మాట . 
కొందరి దారి వేరేగా ఉండవచ్చు . 
''మృత్యోర్మా అమృతంగమయా '' ఆహా ఇక సందేహాలు పెద్దగా లేవు . 
ముందుకు పోయే దారి ఇంకా తెలుసుకోవాలని తప్ప . 
నాతొ చుట్టూ ఉండే కొందరిలో ఇప్పుడు ఆత్మీయత బంధం కనిపిస్తూ 
ఉంది . కాని వాళ్లకి తెలిసిన బంధాలతో దానిని నిర్వచించలేనపుడు 
వెల్లడి చేయడం లో ప్రయోజనం లేదు . ఎవరి జ్ఞానాన్ని వాళ్ళు 
ఆత్మ శాంతి పేరుతొ వెతుకుతూ ఉన్నారు . జ్ఞానం కలగనిదే 
ఆత్మకు శాంతి లేదు . జ్ఞానం అంటే ! దేవుడిని తెలుసుకోవడం కాబోలు . 
అలాగైతే ఇక ఆయనను చూడాల్సిందే ఎలాగైనా . 
ఇక చివరిగా చూసిన ఆయన బుక్ ''శంబల '' దానిని చదవాలి 
ఎలాగైనా , విశాలాంధ్ర వాన్ వచ్చినపుడల్లా అడిగేదాన్ని . 
లేదు మేడం , ఈ సారి మీకోసం తప్పక తెస్తాము అనేవాళ్ళు . 
ఒక రోజు నివాస్ ఫోన్ . 
''అమ్మా విజయవాడ లో బుక్ ఎక్జిబిషన్ లో ఉన్నాను . 
నీకేమి బుక్ తెమ్మంటావు ?"
నాకేమి ఇష్టమో వాడికి బాగా తెలుసు . 
''శంబల తీసుకుని రారా , శార్వరి గారు వ్రాసినది '' 
చెప్పాను . 
నా కొడుకు చేతుల్లో నుండి దానిని తీసుకున్నప్పుడు ఎంత 
ఆనందమో !! ఆపకుండా చదివేసాను . రెప్పలు వాలిపోతున్నా సరే . 
అవును శంబల , ఎనర్జీ లెవల్స్ బాగా ఉండే మాష్టర్స్ ఉండే చోటు . 
ఊరికినే మనం కారెక్కి వెతికితే కనిపిస్తుందా , కుదరదు అంత 
ఎనర్జీ లెవల్స్ కి పదార్దం చేరలేదు , ఆస్ట్రో ట్రావలింగ్ చేయాల్సిందే . 
మన కోసం శార్వరి గారు చేసి ప్రతి అనుభూతి అక్షరాలుగా 
మనకు అందించారు . ఎనర్జీ లెవల్స్ శరీరం భరించలేనంత 
చేరినపుడు వాళ్ళు శరీరం లో ఉండరు . వదిలేసి తేజో రూపాలకి 
వెళ్ళిపోతారు . మాష్టర్ సి . వి . వి గారు ఇది చాలా క్లియర్ గా 
చెప్పారు . అలాగే శార్వరి గారు కూడా వెళ్ళిపోయి ఉంటారు . 
శంబల కేనా !! మరి ఈ సారి ఆ విశేషాలన్నీ అక్షర రూపం 
ఎవరి ద్వారా రూపం దాల్చుతాయో , మాష్టార్ల సంకల్పం ఎలా 
ఉందొ . 
దేవుడిని చూడాలి అని పట్టు బట్టి ధ్యానం చేసాను కదా , 
ఇంతకీ అక్కడ కనపడింది ఎవరు .... నేనే !! అద్దం లో 
చూసుకున్నట్లు .... ఎంత  బాగున్నాను చూస్తూనే ఉండాలి 
అనిపిస్తూ ఉంది . మైనం పోసిన స్పూన్ నీళ్ళలో వేసి ఎండలో 
చూస్తె దాని చుట్టూ మెరిసినట్లు ఏదో మెరుపు పూత నా చుట్టూ . 
చూస్తూ ఉంటె ఎంత  బాగుంది . 
అన్నీ బాగున్నాయి కాని అక్కడ నేనే ఉంటె దేవుణ్ణి అడగాలి 
అనుకున్న వరాల లిస్టు ఎవరిని అడగాలి ? ఎవరి కాళ్ళకి 
మొక్కాలి !
                          @@@@@ 




Tuesday, 8 December 2015

మా నేల తల్లి 2

( నేల తల్లి పార్ట్ 1 లింక్ ఇక్కడ )
( link here )

''అబ్బా '' అరిచాను . గనిమ మీద నుండి జర్రున జారి .... 
కింద పడి  గౌను , కాళ్ళు మొత్తం బురదే .
పరిగెత్తాడు పాలేరు . లేపాలంటే ఒక చేతిలో పార , 
రెండో చేతిలో నాయన కోసం తీసుకొని పోయే క్యారియర్ . 
నేనే లేచి నిలబడ్డాను . దూరంగా పడింది కాలి చెప్పు . 
అంతా కోత కోసేసిన కయ్యాలు . ఇంకా వీళ్ళు దున్నుకోలేదు . 
నేల నీళ్ళు తాకి మెత్త బడుతూ నారు కోసం ఎదురు చూస్తూ 
ఉంది , అన్నం వండి బిడ్డ కోసం ఎదురు చూసే తల్లి లాగా , 
నిజంగానే నేల తల్లి . ఎదురు ఆశించకుండా మనకు ఆనందాన్ని 
పంచేవి , ఆకలి తీర్చేవి తల్లి అంత  గొప్పవే !!

''చెప్పు తెచ్చుకో బుజ్జమ్మా ,ఆలీసం అయితే సెట్టయ్య 
తిడతాడు '' 
''ఊహూ నేను పోను బురద , యాక్ '' 
గౌను వైపు చూస్తె బురద . 
పార చేతికిచ్చి , గనిమ మీద నుండి దిగి చెప్పు తీసుకొని 
వచ్చాడు . వేసుకున్నాను . 
''నేను నడవను . ఎత్తుకో '' చెప్పేసాను మొండిగా నిలబడి . 
''పద బుజ్జమ్మా , మళ్ళా ఇంకో మడి  దున్నాలా !!'' 
నచ్చ చెప్పాడు . 
''ఈ బురద అంతా  చూడు , నేను నడవను '' 
నిస్సహాయంగా చుట్టూ చూసాడు . 
దూరంగా ఎద్దుల బండి . మాదే . ఎద్దుల కొమ్ములకు 
రంగు చూడు . పెద్ద పండుగ కు పూస్తాము . ఇంకా గూడలి 
తిరణాలకి నాయనమ్మ వాళ్ళతో ఈ బండిలోనే పోయేది . 

''సరే బండెక్కి వస్తాలే '' చెప్పాను . హమ్మయ్య ఇంక 
పెద్ద కాలువలో నడిచే పని లేదు . 
బండి దగ్గరకు వస్తుంటే వాసన . పేడ ! 
''ఎక్కలేవులే బుజ్జమ్మా , ఎరువు బండి '' 
నిజమే దానిని తోలే వాడే ఎద్దుల కాడి మీద కూర్చుని ఉన్నాడు . 
వెనుక బుట్ట లాగ పెట్టి దాని నిండా గడ్డి , పేడ . 

ఇదంతా మా నాయనమ్మ ఇంటి నుండి వస్తున్నట్లు ఉంది . 
నాయనమ్మ ఇల్లు అంటే ఒక వీధి  చివరి నుండి ఇంకోవీధి  చివరి దాకా !
ముందు అంగళ్లు . వెనుక ఇల్లు . ఆ వెనుక పంచ . అక్కడ 
అవ్వ , మేనత్తలు ఎప్పుడూ విస్తరాకులు కుడుతూనే ఉంటారు . 
ఎక్కువ వస్తే అమ్మేస్తారు . వెనుక పెద్ద పెరడు , మునగ  చెట్లు
బాదం చెట్లు .... మా నాయనమ్మ అవన్నీ అమ్ముతుంది . 
మా అవ్వ , జేజినాయన , నలుగురు కొడుకులు 
ఎందరు ఉండారో అందరు పనిచేసేవారే , ఒకరు చేయడం 
ఒకరు ఖాళీగా ఉండడం లేదు . పని అందరిది . ఆదాయం అందరిది . 
 వెనుకరేకుల పంచ,  దానిలో పాడి , దాని పక్కన 
చీమ చింత గుబ్బల చెట్లు , దాని వెనుక రోజు పాలేరు 
వేసి పెట్టె పేడ  కుప్ప . అదే ఇక్కడకు తీసుకుని వచ్చి నట్లున్నారు . 

''యాక్ , ఏమి చేస్తారు దీన్ని ? ''
'' అది ఎరువు బుజ్జమ్మా , అది వేస్తె నేలకు సత్తువ
నాయనకు చాలా వడ్లు వస్తాయి '' 
ఓహో , పేడ వలన ఇంత  ఉపయోగమా !!
నేనింకా కళ్ళాపు చల్లడానికి అనుకున్నాను . 

''తొందరగా పొతే కరంట్ ఉంటాది , మోటార్ వేస్తె 
బురద కడి గేసుకోవచ్చు '' చెప్పాడు . 

హా ..... అని గునుస్తూనే మెల్లిగా ముందుకు కదిలాను .... 
అదాటున చూస్తె కలువ పూవుకు బురద అంటినట్లు  కనిపిస్తుందేమో ! 

పెద్ద కాలువ వచ్చేసింది . సన్నటి దారి మలుపు తిరుగుతూ లోపలి కి . 
వంగి చూసాను . నీళ్ళు పారుతూ ఉన్నాయి . పక్కన గడ్డి దుబ్బలు 
నాకంటే ఎత్తుగా . ఇంకా వాటి మొదుళ్ళ  లో చిన్న కలుగులు , 
వెనక్కి పరిగెత్తాను . నేను రాను . గుండె గబ గబ కొట్టుకుంటూ ఉంది . 

''నేను రాను , ఎత్తుకుంటేనే వస్తాను '' మొండిగా కూర్చున్నాను . 
ఎలాగా ఎత్తుకునేది , నిస్సహాయంగా చూసి పార పట్టుకో 
అని ఇచ్చి ఎత్తుకొని మెల్లిగా నీళ్ళలో దిగాడు . పాదాలు మునిగి 
కొంచెం పైకి పారుతున్నాయి నీళ్ళు . వీపు మీద నుండి చూసాను 
భయంగా , కలుగు దగ్గర రిబ్బను లా తిరుగుతూ ..... గబుక్కున కళ్ళు మూసుకున్నాను . 

''దిగమ్మ , పద '' 
''ఒక వైపు కయ్యల్లో వంగి నాట్లేస్తూ కబుర్లు చెప్పుకుంటూ , నవ్వుకుంటున్నారు 
ఆడవాళ్ళు . 
''మే కానీండి , పొద్దయి  పోతా  ఉండాది'' ఆదిలించినాడు . 
ఉలిక్కిపడి పని తొందరగా చేస్తున్నారు . 
పెద్ద పాలేరు అంటే సెట్టిగారు తరువాత , డబ్బులు , పని అన్నీ మందల 
చెప్పేవాడు కదా . 
''మా నాయన ఏడి ? '' అడిగాను . 
''ఆ పక్క మోటార్ కాడ ఉండాడు '' 
పొలానికి ఇబ్బంది లేకుండా రెండు వైపులా మోటార్లు . 
ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్ళు , ఇంకా పంట కాలువ లో 
కూడా ఉంటాయి . కష్టం పడాలే కానీ ఆ తల్లి పచ్చటి సంపద 
దోసిట్లో పోస్తుంది . చెమట అంటే దానికి ఎందుకంత ఇష్టమో ! 
ఒక్కో సారి పొలాన్ని రెండు భాగాలుగా చేసి అటు తమదలొ , సజ్జలో 
ఇటు ఐ . ఆర్ . ట్వంటీ లో , మొలగోలుకులో వేస్తాడు . 
వర్షాన్ని బట్టి ,ఉండే కాలాన్ని బట్టి ఏవి ఎయ్యాలో మా నాయనకు 
భలే తెలుసు . 
గనిమ మీద నుండి పరిగెత్తుతూ వెళ్లాను . 
ఒక వైపు ఇందాక వచ్చిన బండి నుండి ఎరువు తీసి చల్లుతూ 
ఉన్నారు . 
ఇంకో వైపు పచ్చటి మొక్కలు . ఏమిటో అవి ? 
'' నాన్నా అని అరుస్తూ పరిగెత్తాను . 
ఆ పొలం వైపు వేలు చూపిస్తూ ..... 
ఏమైంది ? మా నాన్న కళ్ళలో ఆశ్చర్యం . 
                                           ( ఇంకా ఉంది )