#శివయ్య@75
శివయ్య@75
శివయ్య@75
#వాయుగుండ్లశశికళ,7-8-2018
శివయ్యా!
భలే వాడివయ్యా
గుప్పెడు కవితావాక్యాలు జేబులో వేసుకొని వచ్చి
ఎన్ని హృదయాలు నీ వైపుకు లాగేసావు!
ఒక్కచిగురాకు తాకిడికే తూలే బక్కపలుచని వాడు
ఇన్ని ఆత్మీయతలు ఎలా సాదించాడో చెప్పమంటుంది కాలం
ఆ రహస్యం నువ్వే చెప్పు
ఒక్క వాక్యం లో వేల నేత్రాలుగా విప్పారడం నీకలవాటేగా
పెన్న నీళ్లు తాగిన పుణ్యం కాబోలు నెల్లూరు ఈరోజు నీ పుట్టినరోజు వేడుక సంబరంగా జరుపుకుంది
ఈతకోట వారి సంకల్ప బలం మందిని చేర్చుకొని
విమర్శలను ఒరుసుకుంటూ చప్పట్ల తీరం చేరిపోయింది!
కొత్తపుస్తకపు పరిమళం లా మా ఊరు వచ్చిన
కవికి నోరు తీపి చేసి ఆలింగనాల శాలువా కప్పింది
కవిలోకం
శివా!భూమి ఆకాశం కలిసే చోట ఎక్కడో కలిసే ఉంటాము ......పెనవేసున్న రైలుపట్టాలు ఉన్నాయని రాసుకోనీ వాళ్ళని ,
ఎంత ప్రేమ కురిసింది దేవిప్రియ గారినుండి!
నిలువెత్తు మాటే నువ్వట
సామాన్యుడికి బలమట
నువ్వు మనవడివి లోకి వెళ్లినా
మనవడు నీ లోకి వచ్చినా
జాలువారేది కవిత్వమట
ఏమి మాటలజాలు ఉమగారిది!
నీ దారి నిరంతరం పారే కవితల నది
ఆత్మీయతలు కు నెలవది
కాళిదాసు గారి ఆప్యాయత,జయప్రద గారి
ఆత్మీయత నీ గుండెను నింపే ఉంటాయిలే!
అతడు మేము అంటూ ఎన్ని కలాల కవాతులు
గుండె కవాటాలు తెరిచి ప్రేమను కుమ్మరిస్తూ
తండ్రి అనురాగాన్ని నీ నుండి పొందినవాళ్ళు
అమ్మ లాలనను నీ ఒడి లో చూసినవాళ్ళు
ఇప్పుడు వెదురులు పగలగొట్టి వేణువులు చేసారు, అక్షర రాగాలు ఆలపించడానికి
నేను ఒక్కణ్ణే అనుకున్నాను,వెనుకకు తిరిగి చూస్తే
ఎన్నో మిణుగురులు
ఆ కాంతి వైపు ఎగురుతూ అంటున్నారు
ఎన్ని గుండెల్లో కవిత్వం వెలిగించావో
నీ పుట్టినరోజు ఆ వెలుగులో వెలిగిపోతూ ఉంది
నిరంతర జ్వలనాల కవీ
కన్నీటితో ముంచిన బొటనవేలితో సాక్ష్యం అద్దగల నీ బాటలో ఇప్పుడు వేల పాదాలు
నీ పథాన్ని చరిత్ర చేస్తూ
ఇప్పుడు నీ ఆత్మ కథ వేల హృదయాల ప్రేమ కథ!
ఒక సామూహిక స్వరమై ప్రతిధ్వనించే నువ్వు....
శివుడా..నువ్వు శివుడవ్వకూడదు,ప్రజాకవి సత్కీరుడవ్వాలి....
నీ పలకరింపే కవితలకు ఊపిరూదే అమృతం
శివమెత్తిన తెలుగు పద్యం నువ్వు
సహనం నీ భుజాన వేలాడే అమ్ములపొది
కవిత్వాన్ని ఎలా చేదుకోవాలో చెప్పి
మా దోసిట్లో కొన్ని అక్షరాలు పోసి గుండెలకు హత్తుకొని
కవిత్వంలా నిలబడ్డ మనిషివో
మనిషిలా నిలబడ్డ కవిత్వమో!!!
కాలంలోకి వెడతావో
ఒడ్డుకు చేరి కవిత్వం అవుతావో
ఏదైతే నేమిటి
శివుడా...నువ్వు శివుడవ్వకూడదు,ప్రజాకవి
సత్కీరుడవ్వాలి
ఒకటి మాత్రం ఈరోజు అందరికీ తెలిసిపోయింది
75 ఏళ్ల వయసు నీ దేహానిదే
నువ్వు ఎప్పుడూ పిల్లల్లో పిల్లవాడివి
యువకుల్లో యువకుడివి
అందరిలో కలిసిపోయే నెలబాలుడివి
చేత్తో కవితా కేతనం ధరించి
చరిత్రకు బాటవేస్తూ కదిలే
నిరంతర పథికుడివి!!
@@@@@@
నిన్న 6-8-2018 శివారెడ్డి గారి జన్మ దినం సందర్బంగా నెల్లూరు టౌన్ హాల్ "అతడు మేము"కవితల పుస్తకం ఆవిష్కరించారు .
అందులోని కొన్ని వాక్యాలతో కవితా రూపం లో వ్రాసిన కవితా పుస్తక సమీక్ష.
శివారెడ్డిగారికి నమస్సులతో.....శశి తన్నీరు