Thursday, 27 September 2012

''వేర్ ఇస్ బ్యూటిఫుల్ ''

''మద్యాహనం రెండు గంటలకు తిరిగి వచ్చేస్తావు కదా?''
దీనంగా ఈయన.ఇది మరీ ఎక్స్ట్రా ఇప్పుడే కదా పోతున్నాను.
మామూలుగానే ఎదురు చెప్పను.ఇప్పుడు ఇంకా బుద్దిగా తల ఊపాను.
మరి ఇప్పుడు వెళ్ళేది కోటకు అంటే అమ్మగారింటికి.
ఎలాగు అమ్మగారింటికి వెళితే మా వాచ్ లు పని చెయ్యవు 
మొబైల్స్ ఆగిపోతాయి ...అని వాళ్లకు ఎలాగు తెలుసు.
బుద్దిగా తల ఊపితే సరిపోతుంది.

బస్ స్టాండ్ లోకి రాగానే బస్ ఉంది.హమ్మయ్య ఎక్కి వెంటనే టికట్ 
తీసుకున్నాను.ఎందుకంటె హైవే మీద నుండి కోట దారి లోకి 
బస్  వెళ్ళ గానే మరిచి పోతాను....ఎందుకంటె మైమరిచిపోతాను 
కాబట్టి....స్వర్ణముఖి పక్కనే రోడ్డు.రోడ్డు మలుపు తిరిగినప్పుడల్లా 
నది పలకరిస్తూ కొండొక చోట పక్కనే నడుస్తూ అలరిస్తూ...
ఈ వైపు ఎప్పుడూ పచ్చని తివాచీ లాగా మూడు పంటలు...
చెరుకు తోటల్లో తలలు ఊపే తెల్లటి చీపురు పుల్లల గుత్తులు,
మాగాణి పై వాలి  ఉండి ఉండి  గాలి పటాల్లా పై కి ఎగిరే 
తెల్లని కొంగలు,గిజిగాడి గూళ్ళు ,చిన్న పిట్టలు,ఎగిరే తుమ్మెదలు,
నిమిరె  గాలి, దూరంగా గూడలి కొండ ..అలా...అలా..అలా...

ఈ రోజు వాతావరణం చాలా బాగుంది.
నదిని పలకరించాను కాని ఏముంది అక్కడ బోసి 
పోయిన ఇసుక దారి తప్ప.అంతే  ఇటు వైపు తిప్పెసాను తల.
పచ్చని గరికను కళ్ళతో నిమురుతూ ..అరె మధ్యలో 
పసుపు పచ్చగా ..ఏమిటి ఇవి? బంతి పూలు,ఇవి కూడా 
వేస్తున్నారా?కళ్ళలో నింపుకున్నాను.రంగులే రంగులు 
పుడమి తల్లి పూసుకున్నట్లు ,విధాత కుంచె నుండి జాలు వారిన 
వన్నెల చీర కట్టిన వర్ణ చిత్రం.రంగులు నింపుకున్న మనసుతో 
రెండో వైపు చూసాను...చిత్రం గల గలల చీర కట్టి సాగరునికై 
పరుగులు తీస్తూ ఆకాశపు అద్దం  లో చూసుకుంటున్న నదీకన్య ...
కళ్ళకు ఇందాక  కనపడనది....మనసుకి ఎలా కనపడింది.
కళ్ళతో మనసు కలిస్తే అంతేనేమో.''లైఫ్ ఈజ్ కలర్ఫుల్''

పెద్ద బాబాయి వాళ్ళ మనుమడిది అన్నప్రాసన.వెళ్లాను.
పలకరింపులు,నవ్వులు,సంతోషాలు ,వరసలు,
పిలుపులు....తడిసి ముద్ద అయ్యాను.ఇప్పటి పిల్లలు 
పొట్టతో పాకడం తక్కువ.ఒకే సారి మోకాళ్ళపై దోగాడుతున్నారు.
కాని వాడు చక్కగా పాకి వాడి జీవితం లోని 
మొదటి సాహస కృత్యం ....వాళ్ళ జేజినాయన చేయించిన 
బంగారు గ్లాస్స్ తాకేసాడు.అంతటా ఒక్కసారి విరిసిన 
నవ్వుల హరివిల్లు ''లైఫ్ ఈజ్ హార్ట్ ఫుల్ ''

''వదినా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మన హాల్ లోనే ''
అరె చూడాలి కాని తోడు?పాపం ''వేలమ్మాల్ ఇంటర్నేషనల్ 
స్కూల్'' చెన్నై నుండి వచ్చిన  ఎనిమిదో తరగతి మేనల్లుడు 
బలి.....నేను ,మా అక్క,మా చిన్న పిన్ని వెళ్ళాము 
వాడిని తీసుకొని.
కొంచెం ఊహించుకున్నాను.
శేఖర్.కమ్ముల సినిమా కాబట్టి.
సింపుల్ గా చెప్పాలి అంటే 
''సాండ్ విచ్''అంటే పై ముక్కలో 
కింద ముక్కలో అమ్మ సెంటిమెంట్ తో 
నిండిన బ్రెడ్స్,మధ్యలో ముగ్గురు 
మూడు రకాల వ్యక్తుల ప్రేమతో 
కలిసిన సలాడ్....అంతే .

అమల ఇంజనీరింగ్ చదువుతున్న పెద్ద కొడుకుని,
సీనియర్ ఇంటర్ చదువుతున్న కూతురుని 
ఒకటో క్లాస్స్ చదివే చిన్న కూతుర్ని తనకు 
క్యాన్సర్ వచ్చిన సంగతి చెప్పకుండా ఒక సంవత్చరం 
హైదరాబాద్ లో ''సన్ షైన్''కాలనీ లో ఉన్న వాళ్ళ 
అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తుంది.ఇక వాళ్ళు 
అక్కడ చిన్న కాలనీ లో ఉంటారు.ఇక హ్యాప్పీ డిస్ లో లాగా 
పక్కన గోల్డ్ ఫేజ్ లో ఉన్న గొప్ప వాళ్ళతో క్రికెట్,బేట్స్,గొడవలు,
తగాదాలు,ప్రేమలు ....కుర్ర పిల్లల చేష్టలు అనీ మామూలే.


మిక్కీ మేయర్ సంగీతం కొన్ని సార్లు అలరించిన కధా  బలం 
లేక మనకు విసుగు వచ్చేస్తుంది.చివరికి అమల కూతురు ,కొడుకు 
ప్రేమ గొడవల్లో చదువు సంగతి మర్చిపోతారు.అప్పుడు అమ్మకు 
క్యాన్సేర్ అని తెలిసి అమ్మ కు ఇచ్చిన మాట కోసం బాగా 
చదువుతారు.అందరు స్తిరపడుతారు.ఇక్కడ అమల ఆక్షన్ కి 
మా ముగ్గురి  కర్చీఫ్ లు తడిసిపోయ్యాయి.నయం 
శేఖర్.కమ్ము అమలని బ్రతికించాడు ....
లేకుంటే ఇంటికి వచ్చే దాకా ముక్కు 
చీదుతూ ఉండేవాళ్ళం.

శ్రియా,అంజన జవేరి తామింకా బ్యూటిఫుల్ అని నిరూపించారు.
ముఖ్యంగా అంజనా జవేరిని వానలో తడుపుతూ చూపినా 
ఒక చక్కని మనసు తాకే అందం,ఒక పూవు వానలో తడిసి 
ఊగుతున్నట్లు ....అవును అందం మనసుని పులకింప చెయ్యాలి 
కాని మనిషిని పశువుని చెయ్యకూడదు.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఏమిటో అర్ధం కాలేదు.శేఖర్.కమ్ముల 
తీయక పోయిన బాగుండేది.బయటకు రాగానే చెంబుడు 
కాపీ ఇస్తే తాగేద్దాము అనిపించింది నాకు.
బయటకు రాగానే మా పిన్ని అదిగో సాయి బాబా గుడి కొత్తది 
కట్టి  ఉన్నారు చూద్దాము రండి అని ఎదురుగా గుడి లోకి 
తీసుకుపోయింది.బాబాకి నమస్కరించి కూర్చున్నాను.
అప్పుడు గుర్తుకు వచ్చింది.పోయిన డిసంబర్  లో నాకు 
బాగ లేక హాస్పిటల్ లో ఉన్నప్పుడు మా అమ్మ ఈ గుడికి 
ఇస్తామని మా చేత మొక్కించింది.ఇంకా గుడి కట్టలేదు అని 
మేము మర్చిపోయ్యాము.దేముడు గుర్తు చెయ్యటానికే పిలిచాడా?

మీరు ఒక్క సారి మామూలు  రోజుల్లో గుడికి వెళ్ళండి.
యే ఆర్భాటాలు వద్దు,అలంకరణలు వద్దు.
ఆయన ఇచ్చినవి ఆయనకు మళ్ళీ ఇవ్వటం ఎందుకు?
ఏమి వద్దు.
మీ అహాలు పక్కన పెట్టండి.మొబైల్ పక్కన పెట్టండి.
టెన్షన్లు చెప్పుల దగ్గరే వదిలెయ్యండి.మెల్లిగా వంగి పాదాలు 
పట్టుకోండి బాబావి..... కూర్చోండి అలా కరుణ జాలు 
వారే కన్నులు చూస్తూ...
ప్రశాంతంగా ....అప్పుడు మీరే అంటారు 

ప్రశాంతంగా మనసు ఉన్నప్పుడు ...నిజమే 
''లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్''అని కాదా చెప్పండి?

5 comments:

Lakshmi Naresh said...

very good narration akka...

vikki said...

అచ్చు తెలుగు పుస్తకాలకు ప్లీజ్ విజిట్
http://www.logili.com/

మీకు నచ్చిన పుస్తకాల మీద మీ రివ్యూ లను పంపండి.
review@logili.com

..nagarjuna.. said...

Third para is very beautiful :)

హరే కృష్ణ said...

ఇన్ని review లు చదివాక కూడా ఈ సినిమాకి వెళ్లారు చూడండి
వైపరీత్యం అంటే ఇదే

శశి కళ said...

థాంక్యు లక్ష్మి

నాగార్జున గారు థాంక్యు


ఏమి చేద్దాము అండి ..టైం :(