Thursday, 31 October 2013

పలక -పెన్సిల్ పై సారంగ లో నా నాలుగు మాటలు

పలక -పెన్సిల్ పై సారంగ లో నా నాలుగు మాటలు
పలక - పెన్సిల్ అనేది ''పూడూరి రాజిరెడ్డి ''గారి కొత్త
పుస్తకం . అప్పుడెప్పుడో ఇది చదివితే రివ్యు వ్రాస్తాను
అన్నాను కదా . ఇదిగో సారంగ ఈ -పత్రికలో వ్రాసాను
చదువుకోండి . ఎలాగో వచ్చారు కొంచెం స్వీట్ తిని వెళ్ళండి :)

(saranga lo palaka pensil pai na sameeksha ikkada)

నేను వెళ్లి శార్వరి గారి ''అచలమైన గురువు ''రమణ మహర్షి
బుక్ చదువుకోవాలి . శార్వరి గారు రమణ మహర్షి గారు
సూపర్ కాంబినేషన్ కదా !

Monday, 21 October 2013

మీకు ఇలా ఎప్పుడైనా జరిగిందా ?

''అమ్మా నీకు థాంక్యు ఇంకా సారీ '' చెప్పింది మా అమ్మాయి ఫోన్లో . 
ఎందుకు అంటారా ?చెప్తాను ..... 

అదిగో హీరోయిన్ ని విలన్ కత్తి పెట్టి చంపుతూ ఉంటాడు . అప్పుడు 
ధడేల్ అని సౌండ్ ..... ముందు ఉండే టీపాయ్ గాలిలో ఆరు సార్లు 
తిరుగుతుంది . దాని పై ఉండే కత్తి వెళ్లి షాండ్లియార్ తాడు కోస్తుంది . 
భళ్ళుమని అంత పెద్ద బల్బులు కింద పడి  చిట్లిన శబ్దం . పగులుతూ 
ఉన్న గాజు ముక్కల్లోంచి ఒక్క ముక్క స్లో మోషన్ లో పైకి లేచి 
నేరుగా విలన్ చేతి పై గుచ్చుకొని వాడి చేతిలో కత్తి కింద పడి పోతుంది . 
అప్పుడు మెల్లిగా పై నుండి జారుతూ హీరో .... ''ఎవడ్రా నువ్వు ?''
ఎవరు పగల గోడితే గాజుముక్కలూ కూడా మాట వింటాయో వాడే 
పండుగాడు .... ఎనీ డౌట్స్ ?''అంటాడు . 
''పోబే .... నువ్విప్పుడు సీన్ లోకి వచ్చావు . నేను సినిమా మొదటి నుండి 
ఉన్నాను అంటాడు విలన్ . 
''ఎవరు ముందు వచ్చారు అని కాదన్నాయ్ .... దేన్నీ కొట్టాడు అనేది కాదు 
పాయింట్ ... కత్తి కింద పడిందా లేదా ?అనేది పండుగాడి ఇస్టైల్ '' 

అబ్బా ఈ సినిమాటిక్స్ మన తెలుగు సినిమాల్లో చూసేవే కదా కొత్త ఏముంది ?
ఇయ్యెమైనా నిజ జీవితం లో జరుగుతాయా ఏమన్నానా ?అంటారు కదా . 

నేను అదే అనుకునేదాన్ని మొన్న శనివారం వరకు .... సినిమాటిక్ అంటే 
సినిమాల్లో జరుగుతాయి అని . 

అన్నం తిందామని కారియర్ తెరుస్తూ ఉన్నాను , పాప ఫోన్ . 
ఇదేమిటి ఈయన ,హేమ ఇప్పుడు బాంక్ టెస్ట్ వ్రాయడానికి నెల్లూరు దాటిన
తరువాత వచ్చే ఎక్జామ్ సెంటర్ కి వెళ్ళారు కదా !ఇప్పుడు ఫోన్ ఏమిటి ? 

''అమ్మా ఏదో ఒక ఐ . డి లేనిదే ఎక్సాం  లోకి రానివ్వరంట ''చెప్పింది . 
''అంత  దూరం నేను ఎలా తీసుకెళ్ళాలి . ఇంకా అరగంట టైం  కదా ఉంది. 
ఇది జరిగే పనా ?ఇన్విజిలేట ర్స్ ఆలో చేయము అనేసరికి నలుగురు 
పిల్లలు పరీక్ష దాకా ఉండకుండా వాళ్ళను తిట్టుకుంటూ వెళ్ళిపోయారు 
అంట .
 ''ఏమి చేస్తారు అండి '' ఈయనను అడిగాను . అదే అర్ధం కావడం లేదు . 
కాని ఎక్సామ్ రెండున్నరకు వీళ్ళు ఏది తెచ్చినా ఆలో చేస్తాము అంటున్నారు . 
ఇంకో గంట లో ఏమి చెయ్యగలం ?అన్నాడు . 
మనసులో ఇక వ్రాయలేము అని డిసైడ్ అయిపోయినట్లున్నాడు . 
పాప మాత్రం కొంచెం ఆశతో ఉంది . 
''అక్కడి వాళ్ళను అడగండి '' అన్నాను . 
అందరు ఇన్విజిలేటర్స్  కటినం అంటారు కాని  నేను కూడా చేసి ఉన్నాను కాబట్టి
నాకు తెలుసు ....  పిల్లలకు సాధ్యమైనంత సహాయం చేయాలని 
 ఉంటుంది రూల్స్ కి లోబడి . 

వెంటనే ఫోన్ చేసాను .
 ''ఏమండీ మనం aadhaar  కార్డ్స్ డౌన్లోడ్ చేసుకో లేదు . 
అవి అక్కడ చేసుకోండి ''అన్నాను . 
''కాని దానికి నంబర్ ,డేట్ కావాలి కదా . ఇంటికి పోయి చెపుతావా ?''అన్నాడు . 
కేరియర్ మూసేసి పరుగున స్కూటీ తీసుకొని ఎదురుగా వచ్చే మేడంస్ కి 
పరిస్థితి చెపుతూ ఇంటికి వెళ్ళిపోయాను . అప్పటికే ఇక అరగంట టైం  ఉంది . 
ఎండలో అంత దూరం ఇంటికి వచ్చేసరికి తాళం కూడా తీయలేక పోయాను . 
ఎందుకో ఎక్సామ్ పోతే పోనీలే అనుకోను .
 ఇంతా చేస్తే ఇంటి రెవెన్యు నా డిపార్ట్మెంట్ కాదు . 
ఎన్ని కార్డ్స్ ,డిపాజిట్ బుక .పాలసీ బిల్స్ ..... ఇన్నింటి మధ్య ఈయన 
ఎక్కడ పెట్టాడో . నేను ఏ రోజు రూపాయి రాక పోక పట్టించుకోను . వెతికి 
వెతికి పదిహేను నిముషాల తరువాత దొరికింది ,ఫోన్ చేస్తే సరిగా పోవడం లేదు . 
మిస్స్డ్ కాల్ చూసి ఆయనే చేసారు . నంబర్ చెప్పాను .
 
అక్కడి వాళ్ళు అందరు పాప మీద జాలితో నిమిషాలు లెక్క పెడుతున్నారు . 
లేట్ అయితే ఆన్లైన్ ఎక్జామ్ ఓపన్ చేయలేరు అంట .
 పేరెంట్స్ కూడా పాపం ఆగిపోయి ఈ అమ్మాయికి 
సహాయం చేయమని అందరిని అడుగుతున్నారు అంట . 
స్టాఫ్ కూడా ఈ అమ్మాయి కోసమే  హడావడి . 
మళ్ళా ఫోన్ చేసాను . ఇంకా పది నిముషాలే . వచ్చిందా ?అడిగాను . 

ఊహు సర్వర్ స్లో ..... కొంచెం నిరాశగా అన్నాడు . 
ఈయన ఫోన్ కట్ చేయక ముందే పక్కన స్టాఫ్ అంటున్నారు . 
మీ వైఫ్ ని పాప కాలేజ్ ఐ . డి స్కాన్ చేసి పెట్టమనండి అని . 
''సరే మీరు మెయిల్ ఐ . డి ని ఎస్ ,ఎం .ఎస్ లో పంపండి '' 
అని చూద్దును కదా మొబైల్ లో' లో బేటరీ' కాషన్ .
 చచ్చాము . సాయిబాబా నువ్వే చూడు 
అనుకొని గబా గబా కాలేజ్ ఐ . డి వెతికి (నయం పారెయ్య లేదు )
స్కూటీ మీద నెట్ కి పరుగు .

 అదృష్టం ఆ అబ్బాయి అన్నానికి వెళుతున్నాడు . 
ఆపి స్కాన్ చేసే లోపే ఫోన్ .... మళ్ళీ ఇంకో మెయిల్ ఐ . డి చెప్పారు . 
అది ఓపన్ చేసి ఉన్నాము అని . పంపారా అని అడుగుతూ నే ఉన్నారు ,
రెండు నిమిషాలే ఉంది . అందరు వాళ్ళ పాపే అయినట్లు టెన్షన్ పడిపోతూ ఉన్నారు . 
నాకు టెన్షన్ అనిపించింది . పాపం నెట్ అబ్బాయి గబా గబా చేసాడు . 
''వచ్చింది ''అటు వైపు నుండి ఈయన అరుపు . 
హమ్మయ్య పాపకి ఇవ్వు ఫోన్ ''అన్నాను . 
''లేదు నీ మెయిల్ చూడగానే లోపలి పంపేసారు . లాస్ట్ మినిట్ '' 

పాప ఎలా ఉందో ఊహించగలను . చేతులు వణుకుతూ ఉంటాయి . 
పరీక్ష ఎలా వ్రాస్తుంది ?సరే నా కూతురు అయితే మేనేజ్ చేస్తుంది నెగటివ్ 
థింకింగ్ చేయదు అనుకున్నాను . 

అందరు పేరంట్స్ ఊపిరి పీల్చుకున్నారు అక్కడ స్తాఫ్ఫ్ తో సహా .... 
వాళ్ళే ఓపన్ చేసి ఇచ్చారంట పాపకు  టెన్షన్ పడొద్దు అని ధైర్యం చెప్పి . 
అందరం పిల్లలు గల వాళ్ళమే . ఇలాటి టెన్షన్ లు పడిన వాళ్ళమే . 

మళ్ళా ఫోన్ చేయాలి అని చూస్తే ''నో టాక్  టైం ''చెపుతూ ఉంది . 
మొబైల్ కూడా ఆఫ్ అయిపోయింది . నా పవర్ అయిపోయింది అని . 
అప్పుడు ఆకలి దెబ్బకి కళ్ళు తిరుగుతున్నాయి . ఇంటికి వచ్చి తిన్నాను . 

సాయంత్రం ఇంటికి వచ్చి ''అమ్మా థాంక్యు మళ్ళా సారీ '' అంది . 
''ఎందుకమ్మా ''అడిగాను . 
''నీ వలెనే నేను వ్రాయగలిగాను . ఇంక ఒక్క నిమిషం దాటి నువ్వు మెయిల్ 
పంపినా వృధా అయ్యేది . చాలా మంది తిరిగి వెళ్లి పోయారు అమ్మ . 
మేము చివరి దాకా ఆశతో ఎదురు చూసాము కాబట్టి వ్రాయగలిగాను ''
అంది . 
''అవును ఏ పనైనా చివరి దాకా ప్రయత్నం చేయాలి . మన ప్రయత్నం సిన్సియర్ 
గా ఉంటె దేవుడు సహాయం చేస్తాడు '' అన్నాను . 
నిజంగా సినిమాటిక్ గా ఉందా లేదా ?

పరీక్ష ఎలా వ్రాసింది అంటారా ..... ఎవరికి తెలుసు ?
లాస్ట్ దాకా ప్రయత్నం చేయండి . ఓర్పు ఉంటె సాదించగలరు 
అని చెప్పటానికి పోస్ట్ వేసాను ..... 

ఇంతకీ మీకు ఎపుడైనా ఇలా జరిగిందా ?

Wednesday, 16 October 2013

లాంతరు చెండు (పార్ట్ 4 ) (ఎర్ర అరుగుల కధలు సీరీస్ )


(part 3,2,1 link ikkada )
           లాంతరు చెండు (పార్ట్ 4 )  (ఎర్ర అరుగుల కధలు సీరీస్ )
''పూల జడ నాకు వెయ్యరా ?ఎందుకు వెయ్యరు ?
నాకు పూల జడ ............... వాఆఆఆఆఆ ''
కళ్ళు చేతులు విదిలిస్తూ కింద పడుకొని ఏడుస్తూ 
ఉన్నాను . 
''ఏయ్ శశి లే . మట్టి కదా . ''
చుట్టూ ఉండే వాళ్ళు లేపుతున్నారు . 
కాని మొండిగా విదిలించేస్తే 
లేపలేక ఉన్నారు . 
ఒకటే పట్టు .... పూల జడ కావాలి .... 

మా రాణి అక్క ,శైల అక్క అందరు బిక్క మొహాలు వేసుకొని చూస్తున్నారు . 
ఏమైనా దొరకక పోతే ఏడవటం తెలుసు కాని ఇలా మొండిగా సాదించడం 
వాళ్లకు తెలీదు . 
అందుకే వాళ్ళ ఎనిమిది మందితో వేగడం ఒక ఎత్తు 
నాతో వేగడం ఒక ఎత్తు పెద్ద వాళ్లకి . 

''చిన్నమ్మాయికి ఎప్పుడూ బాధలే అమ్మ . ఎలా చేస్తావే ఈ పిల్లతో ''
బాధగా అనింది పెదమ్మ అమ్మను చూస్తూ . 
అమ్మ ఏమి అనలేక కళ్ళలో నీళ్ళు నింపుకుంటూ ఉంది . 
''ఇద్దరికీ ఎలా వేస్తారే ?నీ అఘాయిత్యం కాక పోతే . 
ఇంకో రోజు వేస్తార్లె . మొండి వేస్తె ఎలా ?'' సులోచన అత్త అంటూ ఉంది . 
''నాకే వెయ్యండి . అక్కకు వద్దు . నేను ఎందుకు పూలు అన్ని కోసుకొని 
వచ్చింది '' ఏడుస్తూనే చెపుతున్నాను . 
''అది కాదమ్మా '' 
''ఊహు నాకు జడ కావాలి '' నన్ను సముదాయించ కుండా  వాళ్ళు అక్కకు 
జడ వేయలేరు . 
కోపం వస్తే పూలు అన్ని కూడా లాగెస్తాను . అంత మొండి . 

అమ్మ బాధపడుతూ రేపు వేస్తాము లెమ్మా అని అంటూనే ఉంది . 
ఏమిటి రేపు పెద్ద .... అదేదో అక్కకే రేపు వేయండి అని నా పట్టుదల . 

వీళ్ళతో పని కాదని  రూట్ మార్చేసా .... 
''నాన్నా నాకు పూల జడ కావాలి ''
 పెద్దగా ఏడుస్తూ కింద మళ్ళా దొర్లి ఏడుపు కొనసాగించాను . 
అందరు ఉలిక్కిపడ్డారు . 
''ఈ పిల్ల చెప్పినా చెపుతుంది . ఇంకేమి లేదు వాళ్ళ నాన్న అప్పటి కప్పుడు 
పూలు తెప్పించి కుట్టమంటాడు . ఏమి చేద్దాము ?''
మా అమ్మ భయం మా అమ్మది . 
మా నాన్నకు కాని పిల్లలు ఏడ్చారు అని 
తెలిస్తే ఇంక కావలికి పంపించడు సెలవలకి .

మెల్లిగా నన్ను కూర్చోపెట్టి కళ్ళు తుడిచింది పెదమ్మ . 
''మా అమ్మ కదా ఏడవద్దమ్మ . చూడు మొహం అంతా ఎలా అయిపోయిందో ''
సముదాయించింది . 
''నాకు పూల జడ కావాలి పెదమ్మా ''మళ్ళా ఏడ్చాను . 
మొండి తగ్గి బోలెడు బాధ గొంతులో . 
పిల్లలు ఏడుస్తారేమో అనే ఊహే భరించలేని వాళ్లకి 
నేను అలా ఏడుస్తుంటే చూడలేక పోతున్నారు . ఎలా చెప్పాలో తెలీడంలేదు . 

''ఎలా వేస్తారు చెప్పమ్మా ?నీకు క్రాఫ్ కదా !సవరం కూడా అల్లలేము ''
మెల్లిగా విషయం చెప్పింది పెదమ్మ . 
నేను ఒక్క క్షణం నిర్ఘాంత పోయాను . అసలు ఆ విషయమే ఆలోచించలేదు . 
మరి ఎందుకు వీళ్ళు నన్ను ఆశ పెట్టాలి . అయినా క్రాఫ్ ఉంటె నాది తప్పా ?
నలుగురు పిల్లలతో వేగుతూ ఇద్దరికీ జడ వేయలేను అని నాకు అమ్మ 
బేబీ క్రాఫ్  చేయించింది .తప్పు ఎవరిది ?మనసు లో బాధ మొహం లో 
ప్రతిఫలించి అసలే ఎడుపుతూ చిన్నపోయిన మొహం ఇంకా చిన్నగా . 
అందరికి బోలెడు జాలి ........... నాకేమి వద్దు . 
దూరంగా వెళ్లి దిగులుగా కూర్చున్నాను . 

రంగుల పూలు రాసులుగా పోసుకొని 
నవ్వులు విరజిమ్మల్సిన చందమామ 
దిగులు మబ్బును కప్పుకొని 
చిన్నపోయిన మొహం తో .... 

అందరు ఏదో మాట్లాడుకున్నారు . ఇప్పుడు కాని వాళ్లకు దేవుడు 
వాళ్లకు శక్తి ఇస్తే అందరు ఒకే గొంతుతో నాకు బారెడు జడ రావాలి 
అని కోరుకుంటారు ఏమో . 

పెదమ్మ ''దామ్మ శశి ''పిలిచింది పెదమ్మ . 
''రాణి నువ్వు జరుక్కోవే . ముందు శశి కి వేస్తాము '' అనింది 
సులోచన అత్త . 
ఎలా వేస్తారు అత్త ?అడిగాను . 
''మరే అసలు జడ అసలు బాగోదు తెలుసా ?అందుకు నీకు కృష్ణుడి లాగా 
కొండి వేసి లాంతరు చెండు నీకే పెట్టేస్తాము . '' చెప్పింది . 
ఏదో నాకు కూడా వేస్తారు అనగానే నాకు ఉత్సాహం . 
''అదిగో చూడు కృష్ణుడి కి కొండి అంటేనే ఇష్టం . వాళ్ళ అమ్మ కూడా 
రోజు వేసి దాని మీద నెమలీక పెట్టేది '' చెపుతూ ఉన్నారు . 
రాముడికి అద్దం లో చందమామ చూపించిన అమ్మ కూడా ఇలాగే 
చెప్పి ఉంటుంది . 
అవును నిజమే . కృష్ణుడు భలే ఉంటాడు . నాకు చాలా ఇష్టం . 
''మరి లాంతరు చెండు నాకు పెడితే .... అక్కకో '' అన్నాను . 
''పర్లేదులే ఏదో కుట్టేస్తాము . నువ్వే బాగుంటావు చూడు '' 
పకపకా నవ్వేసాను . అందరిలో కొండంత బరువు దిగినంత హాయిగా . 

ఆడవారి వేళ్ళు చక చక కదులుతూ చిన్నారి పాప తల మీద ముచ్చటగా 
ఒక్క జడ అల్లి దాని చుట్టూ గాజుతో అల్లిన చిన్న కొండి  ఉంచి ముచ్చటైన 
లాంతరు చెండు ముడవగానే అన్ని వైపులకు దాని పరిమళాలు . 
తరువాత అక్కను కూర్చో పెట్టి రంగుల జడ అల్లేశారు . 

ఇద్దరికీ మంచి దుస్తులు వేసి పెదమ్మ ,అమ్మ అమ్మమ్మ చెప్పిన నగలు 
అన్నీ మాకు అలంకరించారు . వాళ్ళు అన్నీ చేసేలోపు అమ్మమ్మ 
వెండి గిన్నెలో అన్నం కలుపుకొని వచ్చి చిన్న చిన్న ముద్దలు చేసి నోటిలో 
పెట్టింది . ఎందుకంటె అసలు కధ  ఇప్పుడు కదా మొదలు . 
మళ్ళా నిద్రకు వచ్చాము అంటే అన్నం తినము . 
మళ్ళా రాత్రి ఆకలితో నిద్ర పోలేము అని వాళ్లకు బాధ . 

అమ్మ చెప్పింది ''శశి అక్కని కూడా అందరి ఇళ్ళకి తీసుకెళ్ళి చూపించవే . 
శేషత్తమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళండి ''చెప్పింది . 
అంటే ఇప్పుడు మేము ట్రంక్ రోడ్ మీద అందరి ఇళ్ళకి ఇటు జండా మాను 
వైపు కావమ్మ అక్క వాళ్ళ ఇంటి దాకా ,అటు కొత్త బజారు దాకా వెళ్లి 
మా పూల జడలు చూపించి రావాలి . మళ్ళీ శేషత్తమ్మ ఇంటికి అంటే 
ఒంగోల్ బస్ స్టాండ్ దగ్గరకు వెళ్ళాలి . 

అమ్మ ఒక్క నిమిషం అని కాటుక చిన్న చుక్కగా తీసుకొని మా ఇద్దరికీ 
కింది పెదవి కింద గడ్డం మీద దిష్టి  చుక్కగా పెట్టింది. పెళ్లి అప్పుడు 
చుక్క బుగ్గ మీద పెడతారు . మామూలుగా పిల్లలు బాగున్నారు అనిపిస్తే 
మా అమ్మ అలా పెడుతుంది . 

ఒక్కో ఇంటికి వెళుతూ ఉంటె వాళ్లకి బోలెడు హుషారు మమ్మల్ని చూడగానే . 
ముందు నన్ను చూస్తారు . లాంతరు చెండు ఎవురు కుట్టారే ?భలే ఉన్నావు . 
బుగ్గలు పుణికి మళ్ళీ అక్కను రమ్మంటారు ,తిప్పి చూస్తారు . జడ భలే 
కుట్టారే ,ఎవురు సులోచనా ఏనా ?''ప్రేమగా అడుగుతారు . 
కబుర్లు చెప్పించుకుంటారు . 

పక్కన వాళ్ళు ఎవరి పిల్లలు అంటే .... కాంతమ్మ మనవరాళ్ళు ,చిన్నమ్మాయి 
పిల్లలు అని చెపుతారు. అందరు ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడం ,
గొప్పగా చూడటం ..... నేనైతే కిరీటం పెట్టుకొని తిరిగే మహా రాణి అయినా నా 
దర్పం చూసి చిన్నపోవాల్సిందే . 
ఒక్కరి ఇంటి ముచ్చట అందరు తమదిగా పంచుకొని మురిసిపోయే రోజులు . 
కొందరు పిల్లలం వచ్చాము అని ఒకటో రెండో రూపాయలు చేతిలో పెడుతారు ,
అక్క బుద్ధిగా ''వద్దండి అమ్మ అరుస్తుంది'' అని చెపుతుంది . 
నేను మాత్రం ''తీసుకో అక్క వాళ్ళ పాప జడ కుట్టించుకున్నప్పుడు అమ్మమ్మ 
ఇచ్చింది లే ''అని సత్యాలు చెపుతాను . 
'
'నా తల్లే ఎంత తెలివే నీకు ''అని నా ముద్దు మాటలకు మురిసిపోతారు . 
తిరిగి .... తిరిగి ..... అలసిపోయి ఇంటికి వచ్చాము . 
నాకు కళ్ళు మూతలు పడిపోతున్నాయి . అలాగే సోఫాలో వాలిపోయాను . 
అయ్యో పిల్లలు అలిసిపోయారమ్మ .... ఒక్క నిమిషం ఉండండి అని 
అమ్మమ్మ పెరటి దగ్గరికి లాక్కొని పోయింది .

 ''ఇంకా ఏంది అమ్మమ్మ ''
''ఒక్క నిమిషం తల్లి ''చెప్పి చిన్న మట్టి కుండ లో గుడ్డ వత్తి నూనె లేకుండా 
వెలిగించి మా చుట్టూ తిప్పింది . 
''ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో దిష్టి వీధిలో దిష్టి 
ఆడ వాళ్ళ దిష్టి మగ వాళ్ళ దిష్టి నా దిష్టి చీపో ... చీపో '' 
మూడు సార్లు ఇటు మూడు సార్లు అటు తిప్పింది . 
నేను ఆవలింతలు కూడా మర్చిపోయి చూస్తూ ఉన్నాను కుతూహలంగా . 
కుండ లో వత్తి వెలుగుతుండగానే ఒక నీటి పళ్ళెం లో దానిని బోర్లించింది . 
కుండ లో నుండి వేడి గాలి బయటకు వచ్చి నీటి లో నుండి 
''గుడ ... గడ ''శబ్దం . 
''ఏంటి అమ్మమ్మ ఇది ''కుతూహలంగా అడిగాను . అది నాకు భలే నచ్చేసింది . 

అలాగ నేను కూడా ప్రయోగం చేద్దాము అనుకున్నాను . 
''అయ్యో దిష్టి అమ్మ . ఎంత ఉందో చూడు ''చెప్పింది అమ్మమ్మ ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని . 
''దిష్టా ?బాబోయ్ . అమ్మమ్మ ఇప్పుడు అది ఎక్కడికి పోయింది ?''
''నా వల్ల  కాదె తల్లి నీకు చెప్పడం . నిద్ర వస్తుంది అన్నావు కదా . 
మిద్ది మీద మావయ్య పరుపులు వేసాడు పడుకో పో . 

''దిష్టి కి అమ్మా నాన్న ఉంటారా ?పాపం దిష్టి ఎక్కడకు పోయిందో ఏమో '' 
ఎదురుగా పైన కుసుమహర స్వామి ఫోటో ''ఈయన కధ  ఏమిటో . 
ఎన్ని విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినవి ''కలల్లో తెలుస్తాయో ఏమో 
కంటి పాపల పై వాలిన నిద్ర దుప్పటిని కప్పుకొని ఆ రాజ్యానికి వెళ్ళిపోయాను . . . 
                     
                            *******************
                                                                    (అయిపోయింది )
(ఇంకేమైనా కధలు ఇక్కడ వ్రాయాలి అనిపిస్తే వ్రాస్తాను. 
లేకుంటే ఇంక పుస్తక రూపం లోనే )
పెదమ్మ గూర్చి ఇంకో రెండు ముక్కలు .... మొన్న బై ఎలెక్షన్ అప్పుడు 
కావలి దగ్గరగానే డ్యూటీ . క్యారియర్ పెదమ్మ పంపింది . తీసి చూడగానే 
సంతోషం తో కూడిన నవ్వు నా పెదాల మీద .... ఇక్కడ నేను ప్రిసైడింగ్ ఆఫీసర్ ,
నా సంతకం తో ఆ పోలింగ్ బూత్  లో ఎలెక్షన్ కూడా రద్దు అవుతుంది . 
ఇక్కడ చూస్తే నా కిష్టం అని నూనె వంకాయ కూర కలిపిన అన్నం ,పెరుగు 
కలిపిన అన్నం చక్కగా సర్ది మళ్ళా స్పూన్ చేయి కడుక్కోకుండా,నా పనికి 
ఇబ్బంది కాకుండా ఇంకా .... నాకు చాలా ఇష్టం అని పక్కింట్లో అడిగి చిన్ని 
జామ పిందెలు వేసి పంపించింది . మిగిలిన స్టాఫ్ అన్నానికి రండి మేడం అన్నా 
కూడా మీరు వెళ్ళండి అని పంపేసి మా పెదమ్మ ను తలుచుకుంటూ తిన్నాను . 

మొన్న సెప్టంబర్ 22 నాన్న మా నలుగురు పిల్లలను తీసుకుని వెళ్ళారు . 
విషయం పెదమ్మ మంచం లో పడిపోయింది . చూసాను . ఏమి మాట్లాడాలి . 
అందరు వెళ్ళినాక వెళ్లి కూర్చున్నాను .ఎలా చనిపోతామో అని భయంగా 
ఉందా ?అడిగాను . చిన్నగా తల ఊపింది . పెదమ్మకి  ,అమ్మకి పెళ్ళికి 
ముందే చాలా పెద్ద గురువు గారి దగ్గర అమ్మమ్మ మంత్రం బోధ చేయించింది . 
అంటే ఎన్ని ఏళ్ళు నుండి ఈ మార్గం లో ఉన్నారు వాళ్ళు .  
మాకు ఉహ తెలిసినప్పటి నుండి వాళ్ళ దగ్గర మేమే విన్నాము
 తత్వాలు ,బోధలు .... వాళ్లకు మేము ఏమి చెప్పాలి ?

''మంచి వారు మన సద్గురు మూర్తి మర్మము తెల్పినారే 
సంచితములు విడగొట్టి వైచి వగ దెంచి వేసినారే 

తారక చైతన్యమును కనుటకు దారి చూడు మనెనే 
చూరు కింద ఆ కాకి చందమున చూపు చూడమనెనే 

సమ్మతముగా సద్గురు పాదమ్ములు నమ్మి కొల్వుమనెనే 
బ్రహ్మ కల్పములు మారిన నీకిక జన్మము లేదననే ''

ఈ పాట గుర్తుకు వచ్చింది . 
''మీరు గురు బిడ్డలు . ఆయనే మిమ్ములను తీసుకొని వెళుతాడు . 
భయం లేదు . కర్మ తోలగాలంటే మంత్రం జపం చేసుకో . ''
అని చెప్పే పైకి వెళ్ళే దారి మొత్తం గుర్తు చేసాను . 
ఆమె మనసు కొంత నెమ్మది అయినట్లు అనిపించింది . 
వచ్చేసాము . 
మూడు రోజులకు ఫోన్ . ఆమె ఇక లేదు . 

కాని నేను వచ్చిన పక్క రోజు 
 '' శశిఎంత బాగాచెప్పింది ''అని చెప్పి ఆనంద పడిన విషయం 
మా వనజక్క చెప్పినపుడు ,మా చిలక పలుకులకే మురిసిపోయే 
ఇలాంటి తల్లులను ఇచ్చినందుకు 
ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను . 
పిల్లల తెలివి తేటలకే కాదు వారి అల్లరికి , మొండికి ,కోపానికి 
విసిగించినడానికి పొంగిపోయే ఇలాంటివాళ్ళ ను మన జన్మలో 
కలిగి ఉన్నందుకు ఎంత అదృష్టం . అయినా ఇది ఇప్పుడు చరిత్ర . 
తరువాత ఎవరికి గుర్తు ఉంటుందో చెప్పలేము . 
మా పెదమ్మ గారి ఆత్మకు శాంతి కలగాలి అని కోరుకుంటూ ఆవిడకే అంకితం . 
                                @@@@@@@@@@@@ 

Wednesday, 9 October 2013

లాంతరు చెండు (పార్ట్ 3)

         లాంతరు చెండు  (పార్ట్ 3).... (యెర్ర అరుగుల కధలు సీరీస్ )

(part 2 link ikkada )

(part 1 link ikkada )

అందరు ఆడవాళ్ళు వంట చేసుకొని పదకొండు కల్లా వచ్చేసారు
మళ్ళా మొగవాళ్ళు భోజనానికి వచ్చేసరికి కావాల్సిన చెండ్లు 
కుట్టి వెళితేనే మధ్యాహ్నం జడ వేయగలరు . 
పూల సరం అంటే రెండు పూలు అటొకటి ఇటొక పువ్వు  పెట్టి చేతివేళ్ళతో 
దారం తిప్పుతూ అల్లుతారు . మామూలుగా అమ్మేవి ఇవే . 
ఇవి ఎక్కడకు కావాలంటే అక్కడ వరకు తుంచుకోవచ్చు.   . 
కాని చెండ్లు అలా కాదు మనకు ఎంత పొడవు కావాలో ముందే 
చూసుకొని అందరు సరిపోతుందా అనుకోని సూదితో కుడుతారు . 
అట్టజడ అయితే బాధ లేదు . ఆకులు కావాల్సిన విధంగా కట్ చేసుకొని 
మల్లె పూలు గుచ్చిన ఈనె పుల్లలు అటు ఒకటి ఇటు ఒకటి ఉంచి 
మధ్య ఖాళీలో అడ్డంగా కొన్ని వరుసలు మల్లెలు ,కొన్ని వరుసలు 
కనకాంబరాలు , కొన్ని వరసలు ఆకు కుట్టేస్తారు . 
తరువాత కుచ్చుల జడపై ఉంచి అక్కడక్కడ సప్పోర్ట్ గా టాకాలు వేసేస్తారు . 

కాని పూలు కుచ్చుల జడపై ఉంచి కుట్టేటపుడే చాల రకాల చెండ్లు కావాలి . 
ముందు నెత్తి బిళ్ళ చిన్న జడతో నడినెత్తి మీద వేసి దాని చుట్టూ ఆకు చెండు 
దాని చుట్టూ కనకంబరాల చెండు  దాని చుట్టూ మల్లెల చెండు మూడు 
వరసలు పెడుతారు . జడ మీద అన్ని పూలు కుట్టేస్తారు . 
 ఇప్పుడు పైన నెత్తి బిళ్ళకి జడకి మధ్య ఖాళీ ఏర్పడుతుంది . 
అదిగో దాని కోసం కుడతారు లాంతరు చెండు . 
అది ఎంత చక్కగా కుడితే జడకు అంత అందం . 
అందుకే బాగా కుట్ట గలిగిన  వాళ్ళే  ఆ పని చేస్తారు . 

మామూలు మల్లెల చెండు  కి సూదికి మూడు 
మల్లెలు పక్క పక్కన వచ్చేట్లు కుడుతారు . 
అంటే ఒక వైపు పూలు ఒక వైపు పూల కాడలు 
కనిపిస్తాయి . అది తల పైన పెట్టేస్తారు . 
తొడిమలు బయటకు కనపడకుండా . 
లాంతరు చెండుకు మాత్రం దారం చుట్టూ 
మొగ్గలు వచ్చేట్లు సూదికి కుడుతారు . 
అంటే మీకు ఎక్కడ చూసినా పూలే . 
తొడిమలు కనపడవు . 
చాల అందంగా ఉంటుంది . 

పెదమ్మ కూడా వంట చేసుకొని వచ్చింది . ఒకరు ఈనె పుల్లలకి పూలు 
గుచ్చితే ,ఒకరు మల్లెలు చెండ్లు ,ఒకరు కనకాంబరాలు కాలి పట్టీ ... 
వేళ్ళు నైపుణ్యంగా మెలికలు తిరుగుతూ ఉన్నా మాటల దారి 
మాటలదే . నేను చూస్తూ పూలు అందిస్తూ వాళ్ళు తెమ్మన్నవి తెస్తూ 
తెగ తిరిగేస్తున్నాను .
 మామూలుగా అసలు పని చేయను . 
కాని జడ మీద ఇంట్రెస్ట్ . 
పెద్ద అయినాక మా చెల్లికి మొగిలి పూలు ,
ముత్యాలు ఎన్నో జడలు వేసాను . 
ఎందరు పెళ్లి కూతుర్లకు వెసానో . 

పెదమ్మ అంటూ ఉంది
 ''చిన్నమ్మాయి జడ మధ్యలో చిన్న బొమ్మలు పెడదాము '' 
''అలాగే అక్క . ఎవరి ఇంట్లో ఉన్నాయి చెప్పు .తెప్పిద్దాము ''
''ఆ పక్క వాళ్ళు మొన్న సంపంగి పూలతో జడ వేసారు కాని భలే బరువుగా 
ఉంది . పిల్లలు మోయలేరు '' 
''ఏమి లంగా వేసుకుంటావు . ఏమి దండ వేసుకుంటావు '' మురిపెంగా 
అడిగింది పెదమ్మ నన్ను ....
 కళ్ళు ఆర్పకుండా పూలు కుట్టే వైపే చూస్తూ ఉంటె . 

''ఒయ్ శశి జడ అంటే తమాషానా ... కదిలితే సూదితో గుచ్చుతాము తెలుసా ?''
అంది సులోచన అక్క . ఇంకా శైల అక్క సులోచన ఆత్త కూతురు సుజాతక్క అందరు 
కుట్టినవి జాగ్రత్త్తగా తడి బట్టలో చుట్టిపెడుతున్నారు వాడిపోకుండా . 

''ఇక పదండి అందరు అన్నం తిందురు కాని '' చెప్పింది పెదమ్మ . 

కావలి లో ట్రంక్ రోడ్ ఇటు వైపు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే 
రోడ్ కి ఆ వైపు పది ఇళ్ళు తరువాత రామాలయం ,కొంచెం పక్కగా 
పోలీస్ స్టేషన్ ఉంటుంది . దాని పక్కన పెదమ్మ వాళ్ళ ఇల్లు . తొమ్మిది 
మంది పిల్లలం ఆడుకుంటూ అన్నం సమయానికి ఎక్కడ ఉంటామో 
తెలీదు  . అందుకని అమ్మమ్మ ,పెదమ్మ ఇద్దరు ఎక్కువగా వండి పెట్టేవారు . 
పిల్లలకు ఎక్కడ ఆకలి అవుతుందో అని . 

ఇందరికి అమ్మ అయినా ,పెదమ్మ అయినా చేతి ముద్దలు కలిపి పెడుతారు . 
మేము అందరం కబుర్లు ,కధలు చెపుతూ ఉంటె ఊ కొడుతూ తింటాము . 
అమ్మ పెద్ద ముద్దలు పెడుతుంది . అంటే మేము ఒక్క ముద్ద తినేలోపు 
అందరికి తలా ఒక ముద్ద పెట్టొచ్చు . కాని పెదమ్మ అలా కాదు చిన్ని చిన్ని ముద్దలు 
సరిగ్గా ఒక్క సారి నోరు పట్టే అంత ముద్దలు ,ఒక్క సారి నోట్లో పెట్టుకుంటే 
చేయి ఖాళి . అందుకు పెదమ్మ స్పీడ్ గా పెట్టేది చేయి ఎండిపోతుంది అని . 

తింటూ ఉంటాము ,నవ్వుకుంటూ ఉంటాము . కాని పెదనాన్న వస్తే గప్ చిప్ . 
తినేటపుడు   పొర పోతుంది అంటారు . 
ఏమి అరవరు .అసలు  అరిచి ఎవరు చెప్పరు . 
ప్రేమగా చెపుతారు కాని మాట వినాల్సిందే . 

భోజనం అయిపోగానే సులోచన అత్త వాళ్ళ ఇంటికి వెళ్లి పోయాము . 
సవరం ,కుచ్చులు ,నెత్తి బిళ్ళ తీసుకొని దువ్వెన పట్టుకొని కూర్చొని ఉంది . 
నేను .... పరిగెత్తుకొని వెళ్లి కూర్చోపోయాను . 
''జడ నీకు లేదు . రాణి నువ్వు రామ్మా '' అక్కని పిలిచి కూర్చో పెట్టుకొని 
దువ్వసాగింది . 

నాకు పూల జడ లేదా ?ఒక్క సారి ఏమి అర్ధం కాక రోషం ,కళ్ళలో నీళ్ళు . 
అసలు నేను నిన్నటి నుండి ఎంత ఆశగా ఉంటె నాకు ఎందుకు లేదు . 
నిరసన తెలపాలి అంటే నాకు ఉండే ఒకే ఆయుధం ... 
దభీమని కింద నేల మీద పడుకోని  వాఆఆఆఆఆఆఆఆఆఆ ..... కాళ్ళు 
చేతులు విదిలిస్తూ ''నాకు పూల జడ కావాలి '' 
అందరు ఉలిక్కిపడ్డారు . 


                                                           (ఇంకా ఉంది )

Friday, 4 October 2013

ఉదయపు తీపి

            ఉదయపు తీపి 

''ఉండేవి ఉంటూనే ఉంటాయి 
అంత మాత్రాన ..... 
పండగలు లేకుండా పోతాయా ?
పలకరింపులు బంద్ అయిపోతాయా ?
రాక పోకలు తెగిపోతాయా ?ఇచ్చి పుచ్చుకోవడం ఆగిపోతుందా ?
 ఒక నాటి సంస్కృతా ?ఒక నాటి సాంప్రదాయమా ?
ఒక నాటి ఆత్మీయతలా ?ఒక నాటి అనుబందాలా ?
ప్రాంతాల లెక్క కాదు .... అంతరంగం ముఖ్యం 
పరమాన్నాలు ఎన్ని రకాలు కాదు .... తియ్యదనమే ముఖ్యం 
కలిసి తీపిని పంచుకుందాము 
                             (కర్టసీ ఈ రోజు సాక్షి ఫ్యామిలీ మొదటి పేజ్ )

ఏ అమ్మ కన్న బిడ్డ వ్రాశాడో ..... ఆ అమ్మ కడుపు చల్లగుండాలి . 
అసలు ఎందుకో చదవగానే మనస్సులో ఏదో తృప్తి ,ఆనందం . 

అరవై రోజుల నుండి ఈ సెగల పోగల మధ్య ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను . 
వాళ్ళు గెలిచారు అంటారు . వీళ్ళు ఓడారు అంటారు . 
అక్కడ నుండి ఎగతాళి ..... ఇక్కడ నుండి ఆవేశాలు 
స్ట్రైక్ లో ఉండే వాళ్ళే గర్వంగా ఉన్నారు .... 
రాని  వాల్ల్లె దొంగ చాటుగా గుబులు పడుతూ తిరుగుతున్నారు . 
ఇన్నిటి మధ్య నా లాంటి వాళ్ళు ''అయ్యో మొన్నటి దాక అందరం 
కలిసి మెలిసి ఉంటిమే ,ఈ రోజు మన అనుకున్న వాళ్ళనే శాపనార్ధాలు 
ఎలా పెడతాము ''అని బాధ . రగిలిన్చేవాల్లకు ఏమి లాభమో .... 
మనకు ఏమి నష్టమో .... అన్న దమ్ములు మరీ ఇక మొహాలు కూడా చూసుకోరా 
అనేంత దిగులు . 

ఇదిగో ఇలాంటప్పుడు ఈ మాటల జల్లు .... జీవితం పై ఆశను చిగురిస్తూ . 

''వాక్యం రసాత్మకం కావ్యం 
క్షణం రసాత్మకం జీవితం ''
చాలు నాలుగు అక్షరాలతో కడుపు నిండిపోయింది . 
నా లాంటి తలలు ఉద్యమాల కోసం ఏమి చేయక్కర్లేదు . 
ఇలాంటి పిల్లలను పది మందిని దేశానికి ఇస్తే విశ్వమానవ 
సౌబ్రాత్వుత్వం వైపు మానవాళి అదే నడుస్తుంది . 

ఏమివ్వగలం ఇలాంటి వాళ్లకు బదులుగా 
''చిన్న పిల్లలు అయితే పటిక బెల్లమో ,ఆయస్కాంతమో ,గోలీలో 
ఇస్తాము . మనంత పెద్ద అయిన వాళ్లకు ఏమి ఇవ్వాలి ..... 
చల్లగుండు అనే దీవెన తప్ప '' 

''నీ తల్లి మోసేది నవ మాసాలేరా ఈ తల్లి మోయాలి కడ వరకురా 
..... ఈ ఋణం ఏ రూపానా తీరెదిరా '' 




Thursday, 3 October 2013

లాంతరు చెండు (2 part)

         లాంతరు చెండు (2 part) (yerra arugulu series)             

(lantharu chendu part 1 link )

ఉదయపు ఎండ ఇంకా పెరట్లో పరుచుకోక ఎండాకాలపు 
చిరు చల్లని గాలి హాయిగా బాదం చెట్టు పై నుండి వీస్తూ 
పలకరిస్తూ ఉంది పెరట్లోకి వచ్చిన వాళ్ళు అందరిని . 
ఎంత పెద్ద పెరడు ఇప్పటి వాళ్ళు అయితే ఒక ఇల్లు కట్టేస్తారు
ఏమో దానిలో .
 ''అమ్మమ్మా ఈ రోజు మాకు పూల జడ వేస్తారు 
తెలుసా?'' నిద్ర మత్తు వదలని కళ్ళతో రోలు పై కూర్చుని 
బావి పక్కన పెంకుపంచ లో కూర్చొని ఉన్న అమ్మమ్మకు 
గొప్పగా చెప్పాను . 

మా అమ్మమ్మకు తెలీకుండా జరిగే విషయాలా 
ఇవి ...... కాని మనుమరాలు మాటల్లోని మురిపెం ఆమెకు 
బోలెడు సంతోషం . 

''అలాగే లేవే తల్లి . మావయ్య లేవగానే మల్లె మొగ్గలకు పంపిస్తాను 
ముందు ఆ రోలు దిగు . రోలు పై కూర్చొని తుమ్ముతావో ఏమో ''

''నేను దిగను ''ఎందుకో నాకు నచ్చక పోతే ఎవరు చెప్పినా 
చెయ్యను అంత మొండి . 
''దిగవె తల్లి . మళ్ళీ తుమ్మావే  అనుకో ఆ రోలు మెడలో కట్టి 
తిప్పుతారు ''
''ఎందుకు ?ఎవరికైనా చేసారా ?ఎప్పుడు చేసారు ?''
''నా వల్ల  కాదే తల్లి నీకు చెప్పడం . మీరు పోయి కనకాంబరం 
మరువం తెచ్చుకోరా ?మళ్ళీ ఎండ వచ్చేస్తుంది . పళ్ళు 
తోముకొని వెళ్ళు "

''సరే పండ్ల పొడి ఇవ్వు '' ఇచ్చింది . 
అదేమీ తియ్యగా ఉండదు . కుంకుమ బరిణ  అంత డబ్బాలో 
ఉంటుంది కొంచెం పసుపు పచ్చగా ..... కారం . పేస్ట్ తింటాము 
అని ఇది ఇస్తారు . మా నాయన  దగ్గర మాత్రం కోల్గేట్ పేస్ట్ . 

ఎడమ చేతిలో కొంచెం వేసుకొని గబా గబా కుడి వైపు గోడ ఎక్కి 
కూర్చున్నాను . ఆ గోడకి అవతల వైపు బాదం చెట్టు . కాని సగం 
మా వైపే ఉంటుంది . మళ్ళా గోడ మీద నడుస్తూ పళ్ళు 
తోముకుంటున్నాను . 
''పళ్ళు తోమేటపుడు అలా నడవకూడదు  తల్లి .
ఒక దగ్గర కూర్చో '' 

''నడిస్తే ఏమి అవుతుంది ?నేను నడుస్తాను అంతే ''
''నడిస్తే పాపం అంట . అడుక్కి ఒక్క గుడి కట్టిస్తే పాపం 
పోతుంది అంట ''
చెప్పింది అమ్మమ్మ ఓపిగ్గా ఒక వైపు పని 
చూసుకుంటూ . 

బాబోయ్ అన్ని గుళ్ళే ..... ఎందుకు వచ్చిన బాధ గోడ మీద నుండి 
దూకాను .ధభీమని శబ్దం . 

అమ్మ పరిగెత్తుకొని వచ్చింది . 
''దూకవాకే శశి . నువ్వు ఏమైనా మగ పిల్లవాడివా ?
చెయ్యో కాలో విరిగితే పెళ్లి కూడా చేసుకోరు '' 
మగ పిల్లవాడు అయితే ఏమిటి పెద్ద  . ప్రతి ఒక్కటి అది 
చెయ్యొద్దు ,ఇది చెయ్యొద్దు ,అది పాపం ఇది నేరం . 

'' వనజక్క నువ్వు అనసూయ వాళ్ళ ఇంటికి వెళ్లి కనకాంబరం 
పూలు  కోసుకొని రండి . పూల జడ కి కావోద్దా ?''
చిన్న పోయిన మొహం చూసి అమ్మ బుజ్జగించింది . 

అమ్మమ్మ మావయ్య ని పిలిచి
 ''సుబ్రహ్మణ్యం నువ్వు తూముల దగ్గరకు పోయి 
మూడు లీటర్లు మల్లె మొగ్గలు తీసుకుని రాయ్య . 
పెద్ధక్కకు చెప్పు తొందరగా వంట చేసుకుని రమ్మను . 
వచ్చేటపుడు ఆకు (మరువం )కోసుకొని రమ్మను . పెద్ద జడ 
కదా చాలా కావాలి ''

''అలాగే లేమ్మా . పది గంటలకు పూజ చేసుకొని వెళతాను ''
బావి దగ్గరకు పోయాడు స్నానానికి . మావయ్యకు అప్పటికి 
అప్పుడు చేదుకొని బకెట్ తో పైన పోసుకొని స్నానం చేయడం ఇష్టం . 
''తొందరగా వెళ్ళు ''

పూజ గది లోకి పోయాడు అంటే అది ఒక పెద్ద పని .
 ఒక గోడ అంతా దేవుని ఫోటోలు .
 ''వీర బ్రహ్మేంద్ర స్వామీ ,ఈశ్వరమ్మ ''మిగిలిన 
దేవుళ్ళు ..... రెండు ఫోటోలు భలే ఉండేవి . చూసుకొనే అద్దం మీద
దేవుడి ఫోటో కత్తిరించి అతికించినట్లు .... ఒక దానిపై గోపిక మీద 
కృష్ణుడు హోలీ రంగు పిచ్చికారి చేస్తున్నట్లు ,ఇంకో దానిలో 
పాండురంగడు నడుము పై చేతులు ఉంచి నిలుచుకున్నట్లు . 

ఇవి కాక కింద పీట  మీద ఒక  గుండ్రటి యంత్ర రేకు ,దాని ముందు 
చిన్ని వెండి గొడుగు కింద శంకు ,చక్రాలు . ఈ యంత్రానికి రోజు 
కుంకుమ పూజ చేస్తాడు మావయ్య . మా అమ్మమ్మ కు పిల్లలు 
పుట్టక పోతే పెంచల కోన లో ఒక అవ్వ (యోగిని )ఇచ్చింది అవి . 
ఎన్నో ఏళ్ళుగా అవి పూజ చేస్తూనే ఉంటారు . వీటన్నింటికి పూలు 
పెట్టి పూజ చేసి ఇంకా ఒక గంటకు పైన ధ్యానం చేసి కాని పూజ గది 
నుండి ఇవతలికి రాడు . అప్పటి వరకు ఎంత పని వచ్చినా 
ఎవరం గది తలుపు తీయము . ఇక ఈ రోజు తొందరగా పూజ 
చేసి పూలకు వెళ్ళాలి . 

కావలి లో తూముల దగ్గర వరవ కట్ల మీద పూలు అమ్ముతారు . 
తొందరగా వెళితే రాగానే మొగ్గలు మనకు ఇస్తారు . లేకుంటే 
కర్ర తో మొగ్గలపై మెల్లగా కొడతారు విచ్చుకోవాలి అని . అలా 
కొడితే మనం ఈనె పుల్లలకు గుచ్చితే సరిగా నిలబడవు పూలు . 
జడ నుండి రాలిపోతాయి . 

అందరికి పనులు పంచేశారు .
 నేను వనజ  అక్క
(ఏదో వ్రాస్తున్నాను కాని ఏ రోజు అక్క అనను . 
మా పెదమ్మకి కిషోర్ అన్న పుట్టిన 
తరువాత మా అమ్మకి పెళ్లి అయింది . తరువాత మా పెదమ్మకి 
ఇద్దరు అమ్మాయిలు మళ్ళా అబ్బాయి మళ్ళా అమ్మాయి . 
మా అమ్మకు అంతే . కాకుంటే ఒకటో రెండేళ్ళు  తేడా . అందుకు 
ఎవరి వయసుతో వాళ్ళు ఫ్రెండ్స్ . అక్క అనేది లేదు .ఏమి లేదు )

ఇద్దరం అనసూయ వాళ్ళ ఇంటికి బయలుదేరాము .
 అక్కడ మేమే పూలు కోసుకోవాలి . వాళ్ళు లెక్క పెట్టి డబ్బులు తీసుకుంటారు . 
వంద ఇరవై పైసలు . తెలిసిన వాళ్ళం అయితే డబ్బులు తగ్గించరు కాని 
కొన్ని పూలు అదనంగా ఇస్తారు . లేకుంటే కొంచెం సన్నటి కాడలు 
కల పూలు డిల్లీ కనకాంబరాలు (?)అంటారు అవి పెద్దగా బాగుండవు . 
కాడలు బలహీనం కాబట్టి చెండు కు కుట్టలేము అవి కొన్ని ఊరకనే 
ఇస్తారు .

 ఏమిటో పిచ్చి కాలం . ఆడపిల్లలు ఒంటరిగా బంగారు 
కమ్మలు ,దండలు వేసుకొని వెళ్ళినా  పెద్ద భయం లేదు . 
మేము పది నిమిషాలు పైనే నడిచి రైలు కట్ట దగ్గరకు వెళ్ళాలి . 

ఒక్కో సారి పూలు కోస్తుంటే గూడ్స్ వెళుతూ ఉంటాయి . 
''కూ చిక్ చిక్ '' అంటూ పాములాగా అన్ని పెట్టెలు వెంట వేసుకొని 
వెళుతూ ఉంటె పూలు కోయడం ఆపేసి అపురూపంగా చూస్తూ ఉండేదాన్ని 
మా ఊరికి ట్రైన్ రూట్ లేదు (ఇప్పుడూ లేదు )అందుకు మాకు 
రైలు చూడటమంటే సంతోషం . ఒక్కో సారి టాటా  లు చెప్పేవాళ్ళం . 
మాకు ఉహ తెలిసినాక మా నాయన మాకు తీర్చిన గొప్ప కోరిక 
గూడూరు లో మా పిల్లలు అందరిని రైలు ఎక్కించి కావలి తీసుకొని 
రావడం . రైలు కిటికీ దగ్గర కూర్చొని వెనక్కి పరిగెడుతున్న పట్టాలు 
చూస్తుంటే మా నాయన అందరికంటే మంచి నాయన అనిపించాడు . 

గబగబా పూలు కోసుకొని వెళ్ళిపోయాము . మల్లె పూలు వచ్చేసాయి . 
ఆకు కూడా వచ్చింది . ఆడవాళ్ళు ఒక దగ్గరకు చేరి మొదలు పెట్టారు . 
అన్నీ రెడీగా కుట్టుకొని మధ్యాహ్నం పిల్లలకు జడవేసి దాని పై కుడుతారు. 
                                                     (ఇంకా ఉంది )