లాంతరు చెండు (2 part) (yerra arugulu series)
(lantharu chendu part 1 link )
ఉదయపు ఎండ ఇంకా పెరట్లో పరుచుకోక ఎండాకాలపు
(lantharu chendu part 1 link )
ఉదయపు ఎండ ఇంకా పెరట్లో పరుచుకోక ఎండాకాలపు
చిరు చల్లని గాలి హాయిగా బాదం చెట్టు పై నుండి వీస్తూ
పలకరిస్తూ ఉంది పెరట్లోకి వచ్చిన వాళ్ళు అందరిని .
ఎంత పెద్ద పెరడు ఇప్పటి వాళ్ళు అయితే ఒక ఇల్లు కట్టేస్తారు
ఏమో దానిలో .
''అమ్మమ్మా ఈ రోజు మాకు పూల జడ వేస్తారు
తెలుసా?'' నిద్ర మత్తు వదలని కళ్ళతో రోలు పై కూర్చుని
బావి పక్కన పెంకుపంచ లో కూర్చొని ఉన్న అమ్మమ్మకు
గొప్పగా చెప్పాను .
మా అమ్మమ్మకు తెలీకుండా జరిగే విషయాలా
ఇవి ...... కాని మనుమరాలు మాటల్లోని మురిపెం ఆమెకు
బోలెడు సంతోషం .
''అలాగే లేవే తల్లి . మావయ్య లేవగానే మల్లె మొగ్గలకు పంపిస్తాను
ముందు ఆ రోలు దిగు . రోలు పై కూర్చొని తుమ్ముతావో ఏమో ''
''నేను దిగను ''ఎందుకో నాకు నచ్చక పోతే ఎవరు చెప్పినా
చెయ్యను అంత మొండి .
''దిగవె తల్లి . మళ్ళీ తుమ్మావే అనుకో ఆ రోలు మెడలో కట్టి
తిప్పుతారు ''
''ఎందుకు ?ఎవరికైనా చేసారా ?ఎప్పుడు చేసారు ?''
''నా వల్ల కాదే తల్లి నీకు చెప్పడం . మీరు పోయి కనకాంబరం
మరువం తెచ్చుకోరా ?మళ్ళీ ఎండ వచ్చేస్తుంది . పళ్ళు
తోముకొని వెళ్ళు "
''సరే పండ్ల పొడి ఇవ్వు '' ఇచ్చింది .
అదేమీ తియ్యగా ఉండదు . కుంకుమ బరిణ అంత డబ్బాలో
ఉంటుంది కొంచెం పసుపు పచ్చగా ..... కారం . పేస్ట్ తింటాము
అని ఇది ఇస్తారు . మా నాయన దగ్గర మాత్రం కోల్గేట్ పేస్ట్ .
ఎడమ చేతిలో కొంచెం వేసుకొని గబా గబా కుడి వైపు గోడ ఎక్కి
కూర్చున్నాను . ఆ గోడకి అవతల వైపు బాదం చెట్టు . కాని సగం
మా వైపే ఉంటుంది . మళ్ళా గోడ మీద నడుస్తూ పళ్ళు
తోముకుంటున్నాను .
''పళ్ళు తోమేటపుడు అలా నడవకూడదు తల్లి .
ఒక దగ్గర కూర్చో ''
''నడిస్తే ఏమి అవుతుంది ?నేను నడుస్తాను అంతే ''
''నడిస్తే పాపం అంట . అడుక్కి ఒక్క గుడి కట్టిస్తే పాపం
పోతుంది అంట ''
చెప్పింది అమ్మమ్మ ఓపిగ్గా ఒక వైపు పని
చూసుకుంటూ .
బాబోయ్ అన్ని గుళ్ళే ..... ఎందుకు వచ్చిన బాధ గోడ మీద నుండి
దూకాను .ధభీమని శబ్దం .
అమ్మ పరిగెత్తుకొని వచ్చింది .
''దూకవాకే శశి . నువ్వు ఏమైనా మగ పిల్లవాడివా ?
చెయ్యో కాలో విరిగితే పెళ్లి కూడా చేసుకోరు ''
మగ పిల్లవాడు అయితే ఏమిటి పెద్ద . ప్రతి ఒక్కటి అది
చెయ్యొద్దు ,ఇది చెయ్యొద్దు ,అది పాపం ఇది నేరం .
'' వనజక్క నువ్వు అనసూయ వాళ్ళ ఇంటికి వెళ్లి కనకాంబరం
పూలు కోసుకొని రండి . పూల జడ కి కావోద్దా ?''
చిన్న పోయిన మొహం చూసి అమ్మ బుజ్జగించింది .
అమ్మమ్మ మావయ్య ని పిలిచి
''సుబ్రహ్మణ్యం నువ్వు తూముల దగ్గరకు పోయి
మూడు లీటర్లు మల్లె మొగ్గలు తీసుకుని రాయ్య .
పెద్ధక్కకు చెప్పు తొందరగా వంట చేసుకుని రమ్మను .
వచ్చేటపుడు ఆకు (మరువం )కోసుకొని రమ్మను . పెద్ద జడ
కదా చాలా కావాలి ''
''అలాగే లేమ్మా . పది గంటలకు పూజ చేసుకొని వెళతాను ''
బావి దగ్గరకు పోయాడు స్నానానికి . మావయ్యకు అప్పటికి
అప్పుడు చేదుకొని బకెట్ తో పైన పోసుకొని స్నానం చేయడం ఇష్టం .
''తొందరగా వెళ్ళు ''
పూజ గది లోకి పోయాడు అంటే అది ఒక పెద్ద పని .
ఒక గోడ అంతా దేవుని ఫోటోలు .
''వీర బ్రహ్మేంద్ర స్వామీ ,ఈశ్వరమ్మ ''మిగిలిన
దేవుళ్ళు ..... రెండు ఫోటోలు భలే ఉండేవి . చూసుకొనే అద్దం మీద
దేవుడి ఫోటో కత్తిరించి అతికించినట్లు .... ఒక దానిపై గోపిక మీద
కృష్ణుడు హోలీ రంగు పిచ్చికారి చేస్తున్నట్లు ,ఇంకో దానిలో
పాండురంగడు నడుము పై చేతులు ఉంచి నిలుచుకున్నట్లు .
ఇవి కాక కింద పీట మీద ఒక గుండ్రటి యంత్ర రేకు ,దాని ముందు
చిన్ని వెండి గొడుగు కింద శంకు ,చక్రాలు . ఈ యంత్రానికి రోజు
కుంకుమ పూజ చేస్తాడు మావయ్య . మా అమ్మమ్మ కు పిల్లలు
పుట్టక పోతే పెంచల కోన లో ఒక అవ్వ (యోగిని )ఇచ్చింది అవి .
ఎన్నో ఏళ్ళుగా అవి పూజ చేస్తూనే ఉంటారు . వీటన్నింటికి పూలు
పెట్టి పూజ చేసి ఇంకా ఒక గంటకు పైన ధ్యానం చేసి కాని పూజ గది
నుండి ఇవతలికి రాడు . అప్పటి వరకు ఎంత పని వచ్చినా
ఎవరం గది తలుపు తీయము . ఇక ఈ రోజు తొందరగా పూజ
చేసి పూలకు వెళ్ళాలి .
కావలి లో తూముల దగ్గర వరవ కట్ల మీద పూలు అమ్ముతారు .
తొందరగా వెళితే రాగానే మొగ్గలు మనకు ఇస్తారు . లేకుంటే
కర్ర తో మొగ్గలపై మెల్లగా కొడతారు విచ్చుకోవాలి అని . అలా
కొడితే మనం ఈనె పుల్లలకు గుచ్చితే సరిగా నిలబడవు పూలు .
జడ నుండి రాలిపోతాయి .
అందరికి పనులు పంచేశారు .
నేను వనజ అక్క
(ఏదో వ్రాస్తున్నాను కాని ఏ రోజు అక్క అనను .
మా పెదమ్మకి కిషోర్ అన్న పుట్టిన
తరువాత మా అమ్మకి పెళ్లి అయింది . తరువాత మా పెదమ్మకి
ఇద్దరు అమ్మాయిలు మళ్ళా అబ్బాయి మళ్ళా అమ్మాయి .
మా అమ్మకు అంతే . కాకుంటే ఒకటో రెండేళ్ళు తేడా . అందుకు
ఎవరి వయసుతో వాళ్ళు ఫ్రెండ్స్ . అక్క అనేది లేదు .ఏమి లేదు )
ఇద్దరం అనసూయ వాళ్ళ ఇంటికి బయలుదేరాము .
అక్కడ మేమే పూలు కోసుకోవాలి . వాళ్ళు లెక్క పెట్టి డబ్బులు తీసుకుంటారు .
వంద ఇరవై పైసలు . తెలిసిన వాళ్ళం అయితే డబ్బులు తగ్గించరు కాని
కొన్ని పూలు అదనంగా ఇస్తారు . లేకుంటే కొంచెం సన్నటి కాడలు
కల పూలు డిల్లీ కనకాంబరాలు (?)అంటారు అవి పెద్దగా బాగుండవు .
కాడలు బలహీనం కాబట్టి చెండు కు కుట్టలేము అవి కొన్ని ఊరకనే
ఇస్తారు .
కమ్మలు ,దండలు వేసుకొని వెళ్ళినా పెద్ద భయం లేదు .
మేము పది నిమిషాలు పైనే నడిచి రైలు కట్ట దగ్గరకు వెళ్ళాలి .
ఒక్కో సారి పూలు కోస్తుంటే గూడ్స్ వెళుతూ ఉంటాయి .
''కూ చిక్ చిక్ '' అంటూ పాములాగా అన్ని పెట్టెలు వెంట వేసుకొని
వెళుతూ ఉంటె పూలు కోయడం ఆపేసి అపురూపంగా చూస్తూ ఉండేదాన్ని
మా ఊరికి ట్రైన్ రూట్ లేదు (ఇప్పుడూ లేదు )అందుకు మాకు
రైలు చూడటమంటే సంతోషం . ఒక్కో సారి టాటా లు చెప్పేవాళ్ళం .
మాకు ఉహ తెలిసినాక మా నాయన మాకు తీర్చిన గొప్ప కోరిక
గూడూరు లో మా పిల్లలు అందరిని రైలు ఎక్కించి కావలి తీసుకొని
రావడం . రైలు కిటికీ దగ్గర కూర్చొని వెనక్కి పరిగెడుతున్న పట్టాలు
చూస్తుంటే మా నాయన అందరికంటే మంచి నాయన అనిపించాడు .
గబగబా పూలు కోసుకొని వెళ్ళిపోయాము . మల్లె పూలు వచ్చేసాయి .
ఆకు కూడా వచ్చింది . ఆడవాళ్ళు ఒక దగ్గరకు చేరి మొదలు పెట్టారు .
అన్నీ రెడీగా కుట్టుకొని మధ్యాహ్నం పిల్లలకు జడవేసి దాని పై కుడుతారు.
(ఇంకా ఉంది )
No comments:
Post a Comment