ఇంటర్ చదివేటపుడు ఒక రోజు నా దగ్గర కు వచ్చి గమ్ముగా
పడుకున్నాడు నివాస్ . పిల్లలు అలా పడుకొని కబుర్లు చెపుతూ
ఉండటం నాకు అలవాటే . అయితే పాపం ఈ రోజు బోలెడు దిగులుగా
మౌనంగా ఉన్నాడు .
''ఏమి బంగారా '' చేతి మీద నిమిరి అడిగాను .
''అమ్మ నా ఐపాడ్ పోయింది . నాకు పాటలు ఎంత ఇష్టమో
నీకు తెలుసు కదా ''అన్నాడు . మా ఇంట్లో అందరికి పాటలు
పిచ్చి . వీడికి పిచ్చి స్క్వేర్ .
నాకైతే రాత్రి కిటికీ లోనుండి వీడి ఐపాడ్ కొట్టేసిన దొంగ మీద బోలెడు
కోపం వచ్చేసింది . దొంగ కాని కనిపిస్తే నా బిడ్డను ఇంత బాధ
పెట్టిన దానికి ముక్కు మీద ఒక్కటిచ్చేస్తాను .
అసలు ఆ ఐపాడ్ వీడికి పదో తరగతి మంచి మార్కులు వచ్చాయి అని
మా నాన్న డబ్బులు ఇస్తే ఇంకొంచెం వాళ్ళ నాన్న చేత ఇప్పించాను .
పదో తరగతి సెలవల్లో ఇలా తాతయ్య డబ్బులు ఇచ్చేది , మేన మామ
పంచెలు పెట్టేది అలవాటు . సోనీ ఐపాడ్ ఆడియో వీడియో సూపర్ గా
వచ్చేది . నిద్రపొయెదాక వింటూనే ఉంటాడు . ఒరే నిద్రపోయేటపుడు
మంచం కింద పెట్టుకోరా అని చెప్పేదాన్ని .... విన్నాడా వెధవ .
ఇప్పుడు ఆ దొంగోడు చక్కగా కిటికీ లో నుండి చేయి పెట్టి తీసుకెళ్ళి పోయాడు .
వెధవ దొంగ వెధవ దొంగ ....
పాపం వీడు గమ్ముగా పడుకొని ఉన్నాడు . అమ్మ నుండి బిడ్డకి
ఆంబ్రియం భౌతికంగా కట్ చేసినా మానసింగా ఉంటుందేమో .
లేకుంటే ఉత్తిగా అమ్మ పక్కన పడుకున్నా వాళ్లకు ఎందుకు దిగులు
తగ్గిపోతుంది ?
సరేలే పాపం వాళ్ళ నాన్న ను ఒప్పించి ఇంకోటి కొనిద్దాము అనుకున్నాను .
అప్పుడు ఎందుకో నాకు లోపల ఒకటి అనిపించింది .
''let him taste the bitter of life also ''
దుఃఖం నుండి తేరుకోవడం వాడే నేర్చుకున్నాడు .
తరువాత ఎప్పుడో వాడు దాచుకున్న డబ్బులతో ఓన్లీ ఆడియో ఐపాడ్
కొన్నాడు . ఇక ఇప్పుడు మొబైల్ వచ్చేసింది . అదీ వాడి చేదు కధ .
ఇదిగో ఇప్పుడు ఫేస్బుక్ లో నేనంటే ప్రేమ అని ఈ ఫోటో పెట్టాడు .
దేనికి కాకా పడుతున్నాడో ఏమిటో :)
హేమాకు కూడా నిన్న కొంచెం చేదు వచ్చింది .
ఏదో ఫ్రెండ్స్ అందరు ''ఫ్రెషర్ ''అయిపోతే
సాఫ్ట్వేర్ జాబ్స్ కష్టం అని జ్ఞాన బోధ చేసేసరికి
నిన్ననే మొదటి జాబ్ డ్రైవ్ ఐ బి ఎం వారిది
తిరుపతి లో అటెండ్ అయింది . ఉదయం
వెళ్ళిన వాళ్ళు సాయంత్రం అయినా రాక
పోతిరి . బయట మాకు టెన్షన్ . ఒక్కో స్లాట్
ఎక్సామ్ పెట్టడం రాని వాళ్ళని పంపెయ్యడం .
అసలు ఎవరి లాపీ లో వాళ్ళను చెయ్యమని అడగొచ్చు
కదా . హాయిగా అయిపోద్ది . పాపం ఈ అమ్మాయి కి
ఫస్ట్ కాబట్టి ఎలా జరుగుద్దో కూడా తెలీదు .
ఫస్ట్ రౌండ్ అర్థమెటిక్ కాబట్టి ఖచ్చితంగా చేయగలను అనుకుంది .
ఒక్క ప్రశ్న తప్ప అన్నీ చేసింది . మరి ఎందుకు సెలెక్ట్ కాలేదో .
వీళ్ళ స్లాట్ లో ఎవరూ సెలెక్ట్ కాలేదు . అంత మంది వస్తే
పదుల్లొనె తీసుకున్నారు . ఈ పరీక్షల్లో ఇలాగే జరుగుద్ది అంట .
బాగా బాధ పడుద్దేమో అనుకున్నాను . హేమా బాధగా
ఉందా అని అడిగాను .
''ఇది కామన్ మా . ఏమైంది ?ఇప్పుడు నాకు డ్రైవ్ ఎలా
ఉంటుందో తెలిసింది కదా !''
పర్లేదు చేదు ను ఎలా తీసుకోవాలో తెలిసింది .
నా పెంపకం సరి అయినదే లాగుంది . నిజమే కదా !
రోజా ... మరువలేని తెరాద్భుతం
అప్పటికీ ఇప్పటికీ ''రోజా ''సినిమా ,మణిరత్నం
మాజిక్ ,రెహ్మాన్ మ్యూజిక్ ,మొత్తానికి మనసు ఒక
గమ్మత్తైన మత్తులో పడి ఈ రోజుకీ బయటకు రానంటూ
ఉంది . ఏ సినిమా ఇష్టం అంటే ... ప్రొఫైల్ లో ఉండే
ఒకే ఒక సినిమా రోజా . జీవితానికి బస్ అంతే . మనిషి
జీవితం స్ప్రుశించగల ప్రతీ కోణం ప్రతీ అనుభూతి
మాగ్సిమమ్ తెరావిష్కరణ చేసేసారు .
రోజా ఎవరు ?అందరిలాగే అమ్మా నాన్నల ప్రేమతో
ఊరి వాళ్ళ మధ్య అల్లరితో అమాయకంగా చిరు
గాలికి తోటలో ఊగుతూనో ,మంచులో తడుస్తూనో
పసి బిడ్డంత స్వచ్చమైన నవ్వుతో ఎగిరే మన
ఆడపడుచు . కాకుంటే వాళ్ళ అమ్మా నాన్నలకి
రెండో అమ్మాయి .
సినిమాకి ''రోజా '' అని పేరు పెట్టడం ద్వారానే
ఒక అమ్మాయే ఈ కధకు హీరో అని తన జీవితపు నడక
ఎగిసిన అలలు కుంగిన కలతలు ఎదుర్కున్న సవాళ్లు
.... ఇవే దీనిలో ఉన్నాయి అని చెప్పకనే చెప్పారు దర్శకులు .
ఏముంటుంది పెద్ద.... ఆడవాళ్ళ జీవితం లో వ్రాయడానికి ....
వాళ్ళు పుట్టారు . ఏదో పెళ్లి చేసుకున్నారు . ఇద్దరు
పిల్లలు ,వాళ్లకు వేళ కు ఇంత బువ్వ పెట్టడం .
ఏముంటుంది ?ఏమి చూపిస్తారు .
కాదు .... కాదు ఏదో ఉంది . వాళ్లకు కూడా
రోషం ఉంది ,మనసు ఉంది , ధైర్యం ఉంది ,
గెలుపు ఉంది .... అన్నిటికీ మించి ప్రశ్నించే
చూపుడువేలు ఉంది ...... అవసరానికి యముని
అయినా ఎదిరించి భర్తను గెలుచుకొనె సంకల్ప శక్తి ఉంది .
క్షణం క్షణం ఏమి జరుగుతుందా అని ముందుకు వాలి
చూసేంత చక్కని స్క్రీన్ ప్లే తో కధ ముందుకు వెళుతూ ఉంటె
రోజా మన ఊరి ఆడబిడ్డ అయినట్లు మన భుజాన్ని
తనకు ఆసరా ఇస్తాము . తన బరువుని కొంత
పంచుకుంటాము . కన్నీళ్లు నింపు కుంటూనే తను
గెలవాలి అని కోరుకుంటాము .
ఆడదానికి ప్రాణానికి మించిన సృష్టి భారాన్ని ఉంచింది
ప్రకృతి . ఇక దానితో పాటు ఆ భారాన్ని మోయగలదా
అని సహనానికి పరీక్షలు ,నెలకు మూడు రోజుల
నరకం ఎలాగు తప్పదు . అనిర్వార్యం అయినంత మాత్రాన
బాధ బాధ కాకుండా పోదు . ఇక లోపల ప్రాణి
ఊపిరి పొసుకున్నప్పటి నుండి ఇమడని తిండి ,
తిరిగే కళ్ళు ,కాళ్ళ వాపులు ఎలా కాపాడుకోగలవు నీ
రూపాన్ని అని అనుక్షణం సవాళ్ళు విసురుతూనే ఉంటుంది
ప్రకృతి . ఇక ఆ రూపం ఈ భూమికి వచ్చే రోజు అయితే
జీవన్మరణ సమస్య సృష్టిస్తుంది .... నీ ప్రాణమా ?పసి ప్రాణమా ?
తేల్చుకో అని .... బిడ్డ పుట్టుక సమస్య అయినపుడు
బయట నిలబడిన వాళ్ళు పెద్ద ప్రాణం కావాలి అని
సంతకం పెడుతారు. అదే ప్రశ్న తల్లిని అడిగితే
''బిడ్డ ప్రాణమే ''కావాలి అని సంతకం చేస్తుంది .
తన ప్రేమను,సృష్టి ని మోయగల అర్హతను నిరూపించుకుంటుంది.
బిడ్డ ప్రాణానికే ఇంత కష్టపడే తల్లికి .... భర్త ప్రాణం
ప్రశ్న అయితే ..... రేకు విచ్చుకున్న తొలి మురిపాలను
ఉగ్రవాదం పేరుతో దూరం చేస్తే ,తన సంకల్ప బలంతో
ఊరు కాని ఊరులో ,బాష తెలియని ప్రాంతం లో
ఎలా గెలుచుకుంటుంది భర్త ప్రాణాన్ని ?చిన్న మురిపాలతో
సాగిపోయే కొత్త దంపతుల కధ ,ఉగ్రవాద నేపధ్యాన్ని
పరిచయం చేస్తూ దేశ భక్తిని రగులుస్తూ వెళ్ళే తీరు
ప్రతీ ప్రేక్షకుడిని మంత్రించేస్తుంది . మళ్ళా మళ్ళా
చూడాలి అనిపించేస్తుంది .నవరసాలను దర్శకుడు
పండించే తీరు చూసి తీరాల్సిందే .
కధ తెలియని వాళ్ళు ఎవరున్నారు .... ఇంకో
సారి ఆ రుచి ని గుర్తు చేసుకుందాము .
రోజా చిన్న పల్లెటూరి లో పుట్టి ఆట పాటలతో
అల్లరితో ''నింగి హరివిల్లు వంచి చూడాలి ''
అని గంతులు వేస్తూ ఎగిరే అమాయకపు లేడి పిల్ల .
అక్కకు పెళ్లి చూపులకు వచ్చిన కంప్యుటర్ ఇంజినీర్
చెల్లి అయిన రోజాను చేసుకుంటాడు . అక్కను ఇక
తప్పని సరి అయి వాళ్ళ బావకు ఇచ్చి చేస్తారు .
అందరు అక్క పెళ్లి చెడగొట్టింది అని అనేసరికి ఆ
అమాయకపు రోజా మొగ్గ దిగులుతో ముడుచుకు
పోతుంది . పెళ్ళంటే నే ఉహ తెలియని తనకు ఇలాంటి
పరిస్థితి తెచ్చిన పెళ్లి కొడుకు మీద కోపంగా మారిపోతుంది .
ఇంట్లో తల్లీ కొడుకులు ఇంగ్లీష్ లో మాట్లాడుకొనే ఒక
నేపధ్యం లో ఆ పల్లెటూరి మొగ్గ ఇంకా ముడుచుకొని
పోతుంది . మనసులో మాట చెప్పుకోలేనంత ఒంటరి
అయిపోతుంది . అందుకే నాకు పాయసం చేసిస్తావా
తల్లి అని అడిగిన పై ఆఫీసర్ ముందు ,నేనిక మా ఊరు
వెళ్లి పోతాను , ఇంక ఇక్కడ ఉండను అని కుండ బద్దలు
కొట్టేస్తుంది .
అప్పటికి విషయం అర్ధం అయిన భర్త రోజా వాళ్ళ
అక్క విజ్ఞప్తి తోనే తను రోజా నచ్చింది అని చెప్పాను
అని చెప్పి అపార్ధాన్ని తొలగిస్తాడు . వాళ్ళ అక్కతోనే
మాట్లడిస్తాడు .
కోపం తొలగిపోయి ప్రేమ అంకురించే క్షణం ప్రతీ జీవితం
లో చినుకు ముత్యమైనంత అద్భుతం .
అంకురించిన తొలి ప్రేమ తొందరింతలు
చిలకలుగా ముడిచి భర్తకు అందించక ముందే
అతనికి ఏదో యుద్ధ విషయం డీకోడింగ్ చేయడానికి
రమ్మని కాశ్మీరుకు రమ్మని పిలుపు వస్తుంది .
అల్లుకోనంత వరకే తీగను దూరం చేయగలం ,ప్రేమతో
అల్లుకున్న తీగ తొలి మురిపాలు తీరకుండా దూరంగా
వెళతాను అంటే ఊరుకుంటుందా ?అత్తగారితో చెప్పి
ఒప్పించి భర్తతో తను కూడా కాశ్మీర్ కి వెళుతుంది .
అక్కడ ఫోటోగ్రఫీ చూసి తీరాల్సిందే ఇక కొత్త జంట
వలపు తలపులు గడ్డి పరకతొ అరికాలు నిమిరినంత
సున్నితంగా దర్శకుడు చూపిస్తుంటే మైమరిచి
మురిసిపోయే లోపల ఉగ్రవాదులు జైలు లో ఉన్న
తమ మనిషిని విడిపించుకోవడం కోసం భర్త
ను కిడ్నాప్ చేస్తారు .
ఊరు కాని ఊరులో బాష తెలియని ప్రాంతం లో
పట్టుదల తో అందరిని అడుగుతూ మిలటరీ
అధికారులను వెడుతూ భర్త కోసం పడిన పాట్లు
చూసి తీరాల్సిందే . శెబాష్ అనాల్సిందే .
''దేశం కంటే నే భర్తే ముఖ్యమా ?''అని అడిగిన
మిలటరీ అధికారికి '' అవును నాకు నా భర్తే ముఖ్యం ''
అని గట్టిగా చెప్పి ఆడదాని ఔన్నత్యాన్ని ఆకాశానికి
పెంచేస్తుంది . విడిపించలేము ... అని చెప్పిన మంత్రి గారిని
మీ బిడ్డ యితే ఇదే మాట అనగలరా అని నిలదీసి
మనసుని కదిలిస్తుంది . జైల్లో ఉన్న బందీని తన భర్త
ప్రాణానికి బదులుగా విడిపించటానికి ఒప్పిస్తుంది .
ఇక బందీ గా ఉన్న రిషీ తన భార్య జ్ఞాపకాలలో
''నా చెలి రోజావే ''పాట పాడితే , ప్రేమావేశం లో ప్రేక్షకుడు
మునిగి వాళ్ళు కలవాలి అని తపన పడిపోతాడు ,
బందీగా ఉన్నా ''ఝండా ''తగలపెడుతుంటే రిషీ
ప్రాణాలకు తెగించి ఆపే తీరు ,ఇలా చేస్తే ఏమొస్తుంది
అని ఉగ్రవాది తో వాదించే తీరు అంతర్లీనంగా మన
దేశ భక్తిని ప్రేరేపిస్తుంది . ఇక ఉగ్రవాదాన్ని అప్పుడప్పుడే
వచ్చే నూనూగు మీసాలకు అంటించే వైనం ,
పసి ప్రాణాలు ప్రయోజనం లేకనే గాలిలో కలిసిపోవడం
తద్వారా ఉగ్రవాది మనసే మారిపోయే తీరు
చూసి దర్శకత్వ ప్రతిభకు,సినిమా నిర్మాణం లోని
ప్రతీ ఒక్కరికీ హాట్స్ఆఫ్ అనాల్సిందే .
ఇన్ని కష్టాలు గడిచి ఉగ్రవాది మనసు మారి
రిషీ ని వదిలేస్తే... రెండు శరీరాలు ఏక మనస్కులై
ఆ జంట మన ముందు నిలబడితే అందరి మనసులు
ఉల్లాసం తో ఉరకలు వేస్తాయి .
ఇది కధ కాదు . ఒక దారి . ఒక కుటుంభం తన
ప్రయోజనాలకే కాక దేశం లోని ఇతరులు గూర్చి
ఆలోచించుకుంటూ వెళ్ళాలి అని చెప్పే ఒక సందేశం .
అదే ఒక కుటుంభ జీవిత ప్రయోజనం .
దేశం అంటే మట్టి కాదు .... ఇదిగో ఇలాంటి
కుటుంభాలే . ఇలాంటి మంచి మనసులె .
రోజా ఒక్క ఆడ పిల్ల కాదు . అందరి ఆడపిల్లలలోని
చైతన్యం . దానిని గౌరవించిన జాతి వెలుగు
దారిలో నడిచి పోతుంది ఆనడం లో సందేహమే
లేదు .
కొత్త ఏడాది వచ్చి ఇన్ని రోజులు అయినా బ్లాగ్ చెట్టు
మీద వాలి ఇంత సాహిత్యపు గాలి పీల్చుకున్దాము అంటే
ఎక్కడ .... అట్లాస్ వీపు మీద ప్రపంచ బరువు లాగా
ఫైనల్ వైపు పరుగులు వంటింట్లో ఉరుకులు .
ఏదో ఇప్పుడు ''పూడూరి రాజి రెడ్డి ''గారి ''రియాలిటీ చెక్ ''
సమీక్ష పుణ్యమా అని ఇలా వచ్చాను . ఏదో పుస్తకాలు
అనే లేబుల్ కింద కొన్ని వ్రాసుకుంటే రేపు వృద్ధాప్యం లో
పుస్తకం లోని నెమలీకలు లాగా చూసుకొని మురిసి పోవచ్చని ఆశ .
ఈయన మూడో పుస్తకం ఇది . బ్రతుకు దారి పక్కన మనం
చూసే నిత్య జీవిత దృశ్యాలని తనదైన వచన శైలి లో
తాత్వికతను జోడించి యాబై వారాలు ''సాక్షి ఫండే ''
కాలం లో వ్రాసిన ఖండిక ల సమాహారం ఈ పుస్తకం .
అక్షర విలువను తెలుసుకొని చొరవగా ప్రచురించి
సాహిత్య అభిరుచిని చాటుకున్న ''తెనాలి ప్రచురణ లు ''
వారు అభినందనీయులు .
ఇంతకి ఈ పుస్తకం నేను చదవలేదు . కాని సాక్షి పాటకురాలిగా
ఆ కలం వేలు పట్టుకొని ఆ ప్రదేశాలన్నీ చూసాను నేను .
పుస్తకం కొందాము అంటే ఆ ''కినిగే . కాం ''వాళ్ళు
''ఈ ప్రతి'' తప్ప మామూలు బుక్ అమ్మక పోతిరి .
ఇక ఎమ్. ఓ చేసి తెప్పించుకొని ఆ యజ్ఞం అంతా
పూర్తి చేసి చదవాలి .
ఇప్పుడైతే ఊపిరి పీల్చుకొను కూడా కష్టం గా ఉంది .
కాని మంచి పుస్తకం చదివిన మిత్రులు పరిచయం చేస్తే
నేను ఆ పుస్తకాలు చదివినట్లు ఈ పుస్తకం కూడా కొందరికి
పరిచయం చేయాలి (ముఖ్యంగా నా బ్లాగ్ వ్యుయర్స్ కి )
అనుకోని వ్రాస్తున్నాను .
పదహారు ఏళ్ళ క్రితం అనుకోకుండా హైదరాబాద్ దగ్గర
''చిల్కూరు బాలాజీ '' దగ్గరకు వెళ్ళాము . చాలా ప్రశాంతంగా
ఉంది . పూజారి దగ్గర ఉండి అనీ వివరించి పదకుండు
ప్రదక్షిణాలు చేసి కోరుకుంటే ఏ కోరిక అయినా
తీరుతుంది . తీరితే నూట ఎనిమిది చేయాలి అని చెప్పారు .
ఏదో జీవితం చాపను పరిచినా దిండు మీద ఆయన
పడుకుంటే ఆ దండె మీద పడుకొని మధ్యలో ఒక పాపాయి ని
బాబు ని వెచ్చగా కాపాడుకొని మురిసిపోయే మధ్య తరగతి
వాళ్ళం .... అప్పటికప్పుడు కోరికలు అంటే ఎలా వస్తాయి !
ఇంకేమి లేక ఈయన నేను ఎం . ఎస్ . సి పాస్ కావాలి అని
కోరుకున్నాడు . ఏమి కోరుకున్నాడో తెలీక ఆయన
కోరిక తీరాలి అని నేను మొక్కేసాము .
తీరా పదేళ్ళ తరువాత మొక్కు తీర్చే అవకాశం వస్తే
ఈయన నేను ఎలా తిరుగుథనొ అని బెంగపడిపోయాడు .
అక్కడకు పోయి చూస్తే గుడి చుట్టూ అది జనాలు కాదు
అప్పటి ప్రశాంతత ఎక్కడికి పోయిందో .... నన్ను తిరగలి మీద కూర్చున్న
మినప గింజ లాగా వాళ్ళే నూటా ఎనిమిది తిప్పేసారు .
అప్పుడు అనిపించింది ... .. ఈ రోజు ఉన్నట్లు రేపు ఏదీ
ఉండటం లేదు ఈ రోజు పరిస్థితిని ,మనుషుల ఆలోచన లను
రికార్డ్ చేయగలిగితే రేపటి వారికి ''కాలం వ్రాసిన డైరీ ''
గా ఇస్తే ఎవరైనా ఎంత బాగుంటుంది అని . అదిగో
అప్పటి నా ఆలోచన ''రియాలిటీ చెక్ '' తీర్చింది .
ఈ రోజు ''సాక్షి సాహిత్యం ''లో దానిపై సమీక్ష చూస్తే
ఆ జ్ఞాపకాలు అన్నీ మళ్ళీ గుర్తుకు వచ్చాయి .
వాన వెలిసినాక కొమ్మ ఊగితే పైన పడిన చిన్న నీటి
బిందువులతో జ్ఞాపకాల ఉలికిపాటు .
అన్నిటికంటే నచ్చినది బిచ్చగాళ్ళ గూర్చి వ్రాసినది ...
''ఈ ముసలి తాబేలు ఎప్పటికి కొంత చిల్లర సంపాదిస్తుంది ''
అని రచయితే అక్షరాల స్పర్శ తో ఆమె ముసలి ముడతలు
తాకించినపుదు కళ్ళ నీళ్ళు మనకు తెలీకుండానే జారిపోతాయి .
''ఒకరి గెలుపు ఇంకోరి ఓటమి కాకుండా ఉంటె ఎంత
బాగుండును ''అని ఇంకో రచన లో చేసే ఆకాంక్ష మనను
ఆలోచన లో పడేస్తుంది .
ప్రతి వారానికి ఒక స్థలం లో తిరిగి దానితో ముడిపడిన ఆలోచనని
ద్రుష్టి కోణాన్ని తనదైన హాయి గొలిపే వచనం లో మన
ముందు ఉంచుతారు రచయిత .
ఇక పద ప్రయోగాలు అభిరుచి ఉన్న వాళ్లకి పాయసం తిన్నట్లే .
బాగా నచ్చింది ఒకటి చెపుతాను . తన పత్రిక ఆఫీస్ లో
పేపర్ సెట్టింగ్ నుండి ప్రింటింగ్ వరకు వ్రాసింది అది ....
నిజంగా తన అక్షరాలతో అక్కడంత తిరిగిన నాకు ఆ ప్రింటింగ్
చూడాలి అనే కోరిక తీరనిది గానే మిగిలిపోయింది .
ఇక్కడ వారిని వర్ణిస్తూ ఒక్కొక్కరికీ ''ఆత్మకధేడు అనుభవాలు ''
అంటారు రచయిత. జీవితాన్ని కొలవల గల ఒక చక్కని కొలత .
పూల దండ గుచ్చిన వారికే ఇంకొకరు అల్లిన పూదండ లోని
సొగసు కష్టం తెలుస్తాయి .ఈ పుస్తకపు రుచి తెలుసుకోవాలంటే
అదిగో ఆ ముఖ చిత్రం మీది చిన్ని బాబులాగా మన
అస్తిత్వాలు అహాలు వదిలేసి నగ్నంగా దైవత్వాన్ని కప్పుకొని
తలుపు చాటు నుండి తొంగి చూసే పిల్లాడంత కుతూహలంగా
ఈ పుస్తకం లోకి తొంగి చూడాల్సిందే . సాహితీ ప్రియులకు
చక్కని విందు అనడం లో సందేహం లేదు .
''సాక్షి సాహిత్యం లోని సమీక్ష ఇక్కడ ''
(reality check pai sameeksha 25/01/2014)
(kinge ebook koraku link ikkada )