( part 2 link ikkada )
''నాన్నా '' పరిగెత్తుతూ వస్తున్న నన్ను చూసి నాన్న
''నాన్నా '' పరిగెత్తుతూ వస్తున్న నన్ను చూసి నాన్న
వెనక్కి తిరిగాడు .
''చిన్నగా చిన్నగా '' ''అబ్బే మొద్దా ఏంది ఈ బురద ''
అదంతా పట్టించుకోకుండా '' అటు చూడు అటు చూడు ''
గబ గబ అన్నాను .
''ఏముంది అక్కడ !'' ఆశ్చర్యంగా అన్నాడు .
''చూడు నాన్న మన చెట్లు అన్నీ ఎలా తొక్కేస్తున్నారో ''చూపించాను
పక పక నవ్వాడు పొలం లోని మడి వైపు చూస్తూ ....
మడి లో నడుము అంత పెరిగిన మొక్కల్ని దున్నేస్తూ తిరుగుతున్న
కాడికి కట్టిన ఎద్దులు .
''అది జనుము తల్లి , నేలకి సత్తువ ''
''పేడ చల్లారు కదా నాన్నా మళ్ళీ ఈ చెట్లు చంపడం ఎందుకు ''
''పంటకు పంటకు మధ్య ఇలా పేడ , జనుము వేస్తె అది నేల తల్లికి
భోజనం తల్లి. నువ్వు అన్నం తింటేనే కదా బలంగా ఉంటావు .
నేల కూడా అంతే '' కొంచెం అర్ధం అయినట్లే ఉంది .
ఆడవాళ్ళు వంగి నారు వేస్తూ ఉన్నారు . చేతులకు ఉండే గాజుల చప్పుళ్ళు ,
కొంచెం పైరు గాలి హాయిగా ఉంది .
గనిమ మీద గోతం లో తెల్లగా ఆవాలు . పాలేరు కొన్ని బుట్టలోకి వంచుకొని
నారు వెయ్యని పొలం లోకి దిగి చల్లుతూ ఉన్నాడు .
ఇదేమిటి నాన్నను చూసి తల ఎగరేసాను .
''అదీ బలానికే ఫాస్పేటు , మనకు బోలెడు పంట రావాలి కదా '' చెప్పాడు .
''మరి ఇదే వెయ్యండి నాన్న . పేడ వద్దు యాక్ ''
''తప్పు తల్లి . ఇది నువ్వు ఎప్పుడైనా పండక్కి స్వీట్ తింటావు కదా
అలాగ ! జనుము , పేడ , నేలకు అన్నం కూరలు లాగా ,అవి ఎక్కువ తింటే
నేల కి జబ్బే రాదు ''
అర్ధం అయింది . నేనేమైనా మొద్దు పిల్లనా ఏమిటి !
''నాన్న అన్నం తెచ్చాను . తిందాము రా ''
''ఉండమ్మా ఈ మడి నారేతలు అయిపోనీ , ఈ మోటార్ కూడా బాగు
అయిపోతుంది . వాళ్ళు కూడా అన్నానికి వెళ్ళాలి కదా .
ఈ రోజుకల్లా ఈ పొలం పూర్తి అయిపోవాలి . లేకుంటే కూలోళ్లు
రేపు దొరకరు '' చూసాను .
చీర దోపుకొని వంగి చిన్ని మొక్కలు సుతారంగా
నేలలోకి నిలుపుతూ ముగ్గు జారినట్లే ఉంది ఆడవాళ్ళు ఏమి
చేసినా ఇంత అందంగానే ఉంటుందో ఏమో !
ముక్కు మీద జారుతున్న చెమట
ముత్యాలుగా రాలుతున్నా తుడుచుకోకుండా
శ్రద్దగా ఒక్కో వరుస వేసుకుంటూ ఉంటె
,పై నుండే మబ్బు వాళ్ళను చూస్తుందో నీళ్ళలో
దాని మొహాన్ని చూసుకుంటున్నట్లు నటిస్తుందో !
చుట్టూ చూస్తె ఎదురు గనిమ దగ్గర కొబ్బరి చెట్లు వరుసగా
పక్కనే వీళ్ళ టిఫిన్ క్యారియర్ లు . ఏముంటుంది లోపల
నాకు తెలుసు !మా అమ్మ మాకు కూడా అదే ఉదయం పెట్టేది .
నిండుగా అన్నం . అది మునిగే దాకా నీళ్ళు . అందులో ఉప్పు కలిపి
మేము రెండు చేతులు దోసిలిగా పడితే అందులో అన్నం పెడుతుంది .
దాని మీద కొంచెం పచ్చడి . అన్నం కొంచెం అది కొంచెం అంతే !
ఒక్కో ముద్దకి బోలెడు చలవ . ఇక మధ్యాహ్నం బడి నుండి
ఇంటికి వచ్చేదాకా ఆకలి అనే మాటే లేదు . అన్నం లో నీళ్ళు
మా నాన్న తాగేస్తాడు . అందుకే మా నాయనకు బోలెడు బలం .
నేను కూడా అలాగే తింటాను . అప్పుడు నాకు కూడా బోలెడు
పేడ వేస్తున్నాము కదా !
మా నాన్నకి పిల్లలు అయినా పొలం
అయినా బోలెడు ప్రేమ .
అయ్యా కొత్త బెల్ట్ బాగా పనిచేస్తుంది .
మోటార్ వెయ్యమంటారా ?
మెకానిక్ అడిగాడు .
నాన్న తల ఊపగానే మోటార్ వేయడం
నీళ్ళు జయ్యని కాలవలోకి పోయి పొలాన్ని తడుపుతూ .
''బాగుంది కదరా కొత్త బెల్ట్ , అంగడి లోకి తెప్పిస్తాను ''చెప్పాడు నాన్న .
ఏ కొత్తది అయినా నాన్నే ముందు వాడి చూస్తాడు . బాగుంటే
అందరికంటే ముందే షాప్ కి తెప్పించి అమ్మేస్తాడు అది కూడా
తక్కువ ధరకి . ఎక్కువ లాభం తో తక్కువ అమ్మే దానికంటే
తక్కువ లాభం తో ఎక్కువ మందికి అమ్మాలి అంటాడు .
అందుకే మా అంగడి అంటే చాలా ఇష్టం ఎంతో మందికి.
''రా బురద కడుక్కో ''
నీళ్ళ తొట్టి లోకి దిగి తల నెమ్మదిగా మోటార్ కింద పెట్టాను .
దబ దబ నీళ్ళు ,ఉక్కిరి బిక్కిరి అయిపోయి తల తీసేసాను .
పది సార్లు మునుగో మునుగు .
బయటకి వచ్చి చూస్తె నాన్న ఇంకా పనిచేయిస్తూ ఉన్నాడు .
రెండు చేతులు చాచాను రెక్కలు లాగా . జుయ్య్ ....
గనిమ మీద పొలం అంతా పరిగెడుతూ .... రెండు సార్లు తిరిగే సరికి
గౌన్ ఎప్పుడో ఆరిపోయింది .
రెండో సారి పరుగులో చూసాను ఆ పిల్లని , నాకంటే కొంచెం పొడుగు .
చేతిలో నార కట్ట పట్టుకోలేక అవస్థ పడుతూనే ఒక్కో మొక్క తీసి
నేలలో గుచ్చుతూ ఉంది . మెల్లిగా అలవాటు పడుతున్న వేళ్ళు
వేగాన్ని పుంజుకుంటూ ..... ఒక్కో మొక్క ఆ చేతి నుండి తీసుకోవడం
విరగకుండా సుతారంగా గుచ్చడం , మధ్యలో మిగిలిన వాళ్ళ
వరుస లో ఉన్నానా చూసుకుంటూ ఉంది .
నాకు భలేగా ఉంది ఆ పిల్ల చేసే పని .... చూస్తూ ఉన్నాను
ఆ చిన్న చేతుల వైపు , అవి పైకి లేస్తే నా చూపు కూడా పైకి ,
అవి కిందకి వెళితే నా చూపు కూడా కిందకి .
ఒక నిర్ణయానికి వచ్చాను .
అంటే మా నాన్నకి నాతొ ఇబ్బంది మొదలైనట్లే మళ్ళీ
'' నాన్నా '' పరుగు '' ఏమిటి తల్లి ? ''
'' ఏందంటే "
**********
( ఇంకా ఉంది )
.