Friday, 1 May 2015

కాళోజి ,హనుమ కొండ ,కొన్ని జ్ఞాపకాలు

''శశి మేడం ,ప్రిన్స్ పాల్ మేడం గారు రమ్మంటున్నారు ''
చెప్పగానే మేడం దగ్గరకు వెళ్లాను . 
జాబ్ లో చేరి ఐదు నెలలు అయినా, మేము  జాబ్ కోసం వచ్చిన ఫస్ట్ జెనరేషన్ 
కాబట్టి ఇంకా ఇలాగ ఇంకొకరి కింద పని చేయడం ,ఆదేశాలు వినయంగా 
పాటించడం అంతగా రాలేదు . అదీ కాక మేడం మాతో నే కొద్ది రోజులు 
పని చేసి ఇంచార్జ్ తీసుకొని ఉన్నారు . 
విషయం ఏమిటన్నట్లు చూసాను . 
''శశి మేడం మీకు మా తెలుగు తల్లి పాటోస్తదా? ఇద్దరు పిల్లలకు 
జరంత నేర్పించుడ్రి '' మేడం చెప్పారు . 
పిల్లలకు పాటలు నేర్పించడం అంటే నాకు భలే సరదా !ఇంకా 
మా తెలుగు తల్లి పాట మా సంగీతం కాలేజ్ లో మాకు ప్రార్ధన గీతం . 
''సరే మేడం . ఎందుకు నేర్పడం ?''
''డి . డి సార్ చెప్పిన్రు . హన్మకొండ పార్క్ లో పద్నాలుగో తేది 
అంబేద్కర్ జయంతి జరుగుతుంది . దానిలో ప్రార్ధన పాడాలి '' 

అర్ధం అయింది వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారో ! 
అప్పటికి ఎన్ . టి . ఆర్ గారు సాంఘిక సంక్షేమ గురుకులాలు 
ఎర్పరిచినా ఇంకా వాటి మీద సోషల్ వెల్ఫేర్ అధికారం పనిచేస్తూ ఉంది . 
కాబట్టి డి . డి మాట కొంత వరకు అలెర్ట్ గా చెయ్యవలసిన పని . 
అదీ కాక సాంఘిక సంక్షేమం వారికి అంబేద్కర్ జయంతి లో 
పాల్గొనడం దేవుడి ఉత్సవం లో పాల్గొన్నంత బాధ్యత . 
సరే అని ముగ్గురు పిల్లలను ప్రిపేర్ చేసాను . 
                             *******
మళ్ళీ పిలుపు ప్రిన్స్ పాల్ రూం నుండి . వెళ్లాను . మేడం చైర్ లో 
ఎవరో అధికారి ,కుర్చీ పట్టనంతగా . ఒక బటన్ వదిలేసి నిర్లక్ష్యంగా 
కూర్చొని ఉంటె , మేడం పక్కన నిలబడి ఉన్నారు . 
మేడం చిన్నగా చెప్పారు ''డి . డి సార్ '' 
నమస్తే చెప్పాను . పిల్లలను పిలిచి పాడించమని చెప్పారు . 
పాడించాను . చివరలో కొంత రాగం తప్పు పాడుతున్నారు . 
గబుక్కున నేను అందుకొని పూర్తి చేసాను . అది కొంత వివాదం 
లోకి నన్ను లాగుతుందని నేను ఊహించలేదు . 
విని తల ఆడించారు . బయటకు వచ్చేసాము . 
తరువాత మెల్లిగా చెప్పారు ప్రిన్స్ పాల్ మేడం సార్ చెప్పిన సంగతి , 
''ఆ మేడం బాగా పాడుతున్నారు . ప్రార్ధన ఆమె చేత కూడా పాడించండి ''
అని చెప్పారంట . 
విషయం తెలీగానే మా శ్రీవారి  కి కొంత కోపం . ఇతరుల ముందు పాడటం 
కొంత నామోషి కాబోలు . '' లేదు లేదు ,పాడదు '' అనేసారు . 
చివరికి అందరు నచ్చచెప్పి నాతో ,పిల్లలు ,ఇంకో మేడం నిలబడి 
పాడేట్లు  సర్ది చెప్పారు . నిజంగా కొన్ని వివాదాలు మంచి జ్ఞాపకాలు తీసుకొని 
వస్తాయి అని నాకు తెలీదు . 

                                              ********
అంబేద్కర్ జయంతి రోజు పార్క్ లోని వేదిక దగ్గరకు వెళ్ళాము . 
సభ ప్రారంభం లో వేదిక మీదకు వెళ్లి ప్రార్ధన చేసేటపుడు ముందు వరుసలో 
ఉన్న పెద్ద వాళ్ళను చూసాను . ఒక పెద్దాయన చాలా బాగా అనిపించాడు . 
ఆయన కళ్ళ ద్దాలు కలుపుతూ ఒక గొలుసు కిందకి వేలాడుతూ ,
అందరు ఆయన దగ్గరికి వచ్చి నమస్కరిస్తూ ఉంటె చూస్తూ ఉన్నాను . 
దాదాపు ఒకటిన్నర గంటలు జరిగిన సభలో ఆయన మాటలు కోసం 
ఎదురు చూసాను . అంత పెద్దాయన ఏమి మాట్లాడుతాడు ! అని చిన్న 
క్యూరియాసిటీ . మాటల్లో చాలా స్థిరత్వం ఉంది . తాను నమ్మిన దాని 
మీద నడిచే వాళ్లకు మాత్రమె వచ్చే స్థిరత్వం . వర్గాల అంతరాల గూర్చి 
అవి సమయ వలసిన మార్గాల గూర్చి చెప్పినట్లు గుర్తు . 
ఆయన పేరు ,ఆయన గొప్పదనం అప్పుడు నాకు తెలీదు . 
కాళోజీ గారిని దగ్గర నుండి చూసాను . ఆయన భావాలను స్ప్రుశించాను ,
అని అనుకున్నప్పుడు ఇప్పుడు నాకు మనసులో ఏదో సంతోషంగా 
ఉంటుంది . ఆ ప్రార్ధన గీతం మీద కృతజ్ఞత గా ఉంటుంది . 

మనిషి గొప్పదనం అతని పేరులోనో ,అతని డబ్బులోనో ,అధికారం లోనో 
ఉండదు . అతను త్రికరణ శుద్ధి గా పాటించే విలవల్లో ఉంటుంది . 
జీవితం మనకు తెలీకుండా నే పరిచయం చేసే వాళ్ళ పరిచయం 
మనసు లోతుల్లో మిగిలిపోయే ముత్యం లాంటి విలువైన జ్ఞాపకం . 
అయ్యో ఆయన  కవి అని తెలిస్తే ,ఏదైనా మాట్లాడి ఉందును అనుకుంటూ 
ఉంటాను కాని ,కొంత జీవితం దాటి ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు 
అనిపిస్తూ ఉంటుంది ..... ఎంత గొప్ప వాళ్ళు కనపడినా ఏమి 
మాట్లాడలేము . మనసులో వీళ్ళు ఇలాగ ఉంటారన్న మాట అనుకోవడం 
తప్ప . ఎందుకంటె వాళ్ళ పరిచయం మనకు వాళ్ళ అక్షరాలుగా మాత్రమే !!
                                                @@@@@@@


1 comment:

వనజ తాతినేని/VanajaTatineni said...

అంతే శశీ ! కొంత కాలం దాటేసి వచ్చాక ..వారిని అక్షరాలలో చూడటమే ! మంచి జ్ఞాపకం . ఇంతకీ ఇప్పుడు మీ పాట వినలేదు
ఎట్టగబ్బా !