గురజాడ గారు నమోనమః
వాయుగుండ్ల శశికళ
గురజాడ గారి జయంతి నుండి అనుకుంటూ ఉన్నాను. కొన్ని అక్షరాలు
దగ్గరగా కూర్చి కృతజ్ఞతా హారంగా వేద్దాము అని!అప్పుడే నేను
ఏమీ వ్రాయకుండానే చిలకమర్తి వారి జయంతి కూడా వచ్చింది.
పర్లేదు,ఇంకా సంధర్భం మించిపోలేదు. 125 ఏళ్ళు ఉత్సవాలు
ఇంకోసారి గుర్తుచేసుకుంటూ వ్రాయొచ్చు. మా స్థితిగతులు అంత
బాగా వ్రాసినవారికి మా పనిభారం గురించి మాత్రం తెలియదా. క్షమించేస్తారు.
ఇంతకీ ఇప్పుడేమి వ్రాయపోతాను!బావిలో కప్పలా ఉండే నాకు
కన్యాశుల్కం అయినా వరకట్నం అయినా లోకం లో మా స్థితి
ఎంత దీనంగా ఉందొ చెప్పే కన్యాశుల్కము నాటకం కంటే
మనసుకు దగ్గర అయిన రచన ఇంకొటి లేదు.
ఎలా నిలిచిఉంది ఈ నాటకం?సమకాలీనత అంటారు కొందరు.
పోవలిసిన ఆధునిక జాడ ను కూడా ఇది చర్చించింది.
ఎప్పటికి ఈ నాటకాన్ని సమకాలీనం అనకుండా చరిత్ర అంటామో
అప్పుడు కదా గురజాడ వారి కల నెరవేరినట్లు!
ఒక రచన చదివితే అందులోని కథ తో పాటు అప్పటి పరిస్థితులు
సామాజిక న్యాయాలు అన్నీ మన ముందుకు వచ్చేస్తాయి.
సమయానికి కన్యాశుల్కం పుస్తకం ఇంట్లో లేదు.
పోనీ ఆయనను మరియు అలాటి సంస్కరణ వాదులను గుర్తుచేసుకొని
నమస్కరించుకుంటూ కొన్ని పాత్రలు పాఠకురాలిగా
గుర్తుచేసుకుంటాను.కొన్ని స్త్రీ పాత్రలు గుర్తుచేసుకుందాము.
అగ్నిహోత్రావధానులు లాంటి కోపాగ్నులకు ముడి పడి
వాళ్ళ మాటనే అనుసరిస్తూ ,వివేకం తప్పు అని చెప్పినపుడు
వారిని ఎదిరించి భంగపడుతూ బ్రతకలేక వారితో ఉండలేక
బావికో ,ఉరితాడుకో ప్రాణం అప్పచెప్పి కుటుంభం పరువు
కాపాడి పోయే ఇల్లాళ్ల పాత్రలు ఇప్పటికీ మారలేదు.ఆడదాని
మాటకు విలువేమిటి! తాంబూలాలు ఇచ్చేసాము తన్నుకుని
చావండి అని మగవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతూనే
ఉన్నారు.
ఇక బుచ్చమ్మ. చిన్న వయసులో పెళ్లి చేస్తే భర్త చనిపోయిన
విధవరాలు. తండ్రి పెత్తనానికి భర్త నుండి సంక్రమించిన ఆస్తి
అప్ప చెప్పి తండ్రి ఇంటిలోనే ఇంటెడు చాకిరీ చేస్తూ గడుపుతూ ఉంటుంది.
కోరికలు ఏమీ లేకుండా మిగిలిన వాళ్ళ సుఖమే తన సుఖం గా
భావిస్తూ పనియంత్రంగా మారిపోతుంది.
మనిషి ఎంత యంత్రంగా మారినా కొన్ని స్పందనలు ఉంటాయి.
చెల్లికి ముసలివాడి ని ఇచ్చి పెళ్లి చేయబోయే సందర్భం లో
తండ్రికే ఎదురు మాట్లాడుతుంది. నా సొమ్ము ఇచ్చి తమ్ముడికి
పెళ్లి చేయమని,చెల్లిని వదిలెయ్యమని కోరుతుంది.
కానీ తండ్రి ఆధారంగా బ్రతుకు ఈడ్చవలసిన స్త్రీ ఎంతవరకు
పోరాడగలదు. చివరికి గిరీశం మాష్టారు గారి సహాయం కోసం
తాను ఏమైనా సహాయం చేస్తాను అంటుంది.
అప్పటి సమాజం లో నూటికి తొంబై మంది విధవల జీవితాలు
ఇలాగే సాగాయేమో!
పూటకూళ్ళమ్మ. తాను కూడా విధవరాలు. ఎవరూ అండగా లేక
స్వశక్తితో అందరికీ వండిపెడుతూ ఆధారం కోసం గిరీశం ను
సమాజం భాషలో ఉంచుకుంటుంది. తన కష్టార్జితం మొత్తం
ఖర్చు పెట్టేస్తున్నా ,అబద్దాలు చెప్పి జల్సా చేస్తున్నా గిరీశాన్ని
వదలలేక అలాగే గడుపుకొని వస్తూ ఉంటుంది. చివరికి తన
డబ్బుతో సానిసాంగత్యం కూడా గిరీశం మొదలు పెట్టేసరికి
ఏ ఆధారము అక్కర్లేదని చీపురు తిరగేస్తుంది. సొమ్ము అవసరం
కోసం ఉన్న బంధాలు ఎంతవరకు నిలుస్తాయి.
డామిట్ కథ అడ్డం తిరిగింది అనుకోని గిరీశం లాంటి
మనుషులు పారిపోతారు తమని నమ్మే ఇంకో చోటు వెతుక్కుంటూ!
ఇక ఇప్పుడు పూటకూళ్ళమ్మ కి ఒంటరి బ్రతుకే అయినా
తన శక్తి మీద తానూ జీవిస్తూ గౌరవంగా ఉంటుంది.
మీనాక్షిది వేరే కథ.కోరికలకు లొంగిపోయి కొంచెం సొమ్ము
ఆశ చూపితే తండ్రికి అయినా అబద్దాలు చెప్పగలదు.
కోరిక ఉండాలి కానీ లొంగదీసుకొనే మహానుభావులకు
ఎప్పటికీ కొరత లేదు. కానీ పీకల మీదకు వస్తే ఆడదాన్ని ఒంటరిగా
వదిలి అందరు పరువు ముసుగు లో పారిపోయేవారే!
అప్పటి విధవల స్థితి ఇంతే. అయితే బుచ్చమ్మ లాగా తండ్రి
చాటునో అన్న చాటునో బ్రతుకు వెళ్లదీయడం లేదా పూటకూళ్ళమ్మ
లాగా ఒకరిని నమ్ముకొని ఉండటం లేదా మీనాక్షి లాగా హీనంగా
మారిపోవడం. ఇంతకంటే ఇప్పుడు స్త్రీలు మాత్రం ఎక్కడ
ముందుకు వెళ్లారు? చదువు కుంటున్నారు. చదువుకు తగ్గ
సంస్కారం ధైర్యం వివేకం ఎక్కడ చూపిస్తున్నారు?
సమాజ నిర్మాణం లో యెంత మంది నిలబడుతున్నారు?
స్త్రీ ఎలా ఉండాలి అనేది కూడా తన కలగా మధురవాణి పాత్రలో
చూపిస్తారు గురజాడ.
స్త్రీ అయినా హాయిగా నవ్వాలి అప్పుడే తాను ఒక మనిషి.
ఆడపిల్ల నవ్వకూడదు అనే సమాజం లో ఎంత హాయిగా
నవ్వుతుంది మధురవాణి!తన స్వేచ్ఛ అందులో ప్రజ్వరిల్లేటట్లు
మగవాళ్ల పరువులు కొట్టుకొనిపోయేట్లు ,ఏమిటా నవ్వు అని
అసహనపు గొంతులతో అడిగేటట్లు,ఎనరూ తనను ఏమీ
చెయ్యలేరు అనేటట్లు,సానిది అని యెగతాళి చేసే లోకానికి
నువ్వు అంటే నాకు ఏమీ లెక్క లేదు అని బదులు చెప్పినట్లు
పకపకా నవ్వుతుంది మధురవాణి.
మధురవాణి చదువు గురించి చెప్పరు కానీ సంస్కారం గురించి
తెలివి గురించి ఆయా పాత్రలతో మాట్లాడే విధానం లో వినయం
గురించి చెప్పకనే చెప్పారు గురజాడ స్త్రీ తన వ్యక్తిత్వాన్ని
నిర్మించుకోవాల్సిన విధానం ఏమిటో!
మధురవాణి చేత గిరీశం తో ఒక మాట పలికిస్తారు గురజాడ
'' మీరు నాలాగే తెలివిగల వారే కాని చేదు మార్గం లో
వాడుతున్నారు దానిని''అని.
మోసం చేసే వాళ్ళను మోసం చేయగలదు ,మంచి వారికి
సహాయం చేయగలదు. ఎవరికి నూనె వ్రాసి దువ్వాలో,హెడ్
తో ఎలా మాట్లాడాలో, ఊరిలో పలుకుబడి ఎలా పెంచుకోవాలో
అన్నీ తెలుసు మధురవాణి కి. నాటకం లో అబద్దాలు
చెప్పినా, మోసం చేసినట్లు చూపినా,వలపు నటించినా
ఒక చిన్నపిల్ల బాగుకోసమే తనకు చేతనైన సహాయం
చేస్తుంది.
ఆంటినాచ్ గా ఉన్న గౌరవనీయులు సౌజన్యారావు పంతులు
చేత గౌరవింపబడే ఈ పాత్ర ఎంతో గొప్ప గా ఊహించి
సృజించారు గురజాడ వారు.
ఆయన వేసిన జాడలు ఇప్పటికీ మనకు అనుసరణీయం.
@@@@@@
No comments:
Post a Comment