Saturday, 28 July 2012

పిత్రుత్వము సమస్యే పాపం ...

అనగనగ...అనగా...చిన్న కధ
బుజ్జి కోడి పిల్ల ఉంది .అది నాన్న ను వెతుకుతూ 
వెళ్ళింది.ఒక ఎద్దు కనిపించింది.
''నువ్వేనా మా నాన్నవు అడిగింది.
''కాదు మీ నాన్న ఇంకా చిన్నగా ఉంటాడు''చెప్పింది ఎద్దు.


ఇంకా ముందుకు వెళితే మేక కనిపించింది.
''నువ్వేనా మా నాన్నవు ''అడిగింది.
''కాదు మీ నాన్నకు రెండు కాళ్ళు ఉంటాయి''చెప్పింది మేక.


కొంచం దూరం వెళ్ళింది.ఒక బాతు నీళ్ళలో ఈదుతూ కనిపించింది.
''నువ్వేనా మా నాన్నవు?''అడిగింది.
''కాదు మీ నాన్న కొక్కొరోకో అని అరుస్తాడు?''చెప్పింది బాతు 


''మరి తెలుసుకోవడం ఎలాగా?''అడిగింది పిల్ల.
పాపం బాతు కు జాలి వేసింది .ఆ పిల్ల తపన చూసి కళ్ళలో నీళ్ళు
వచ్చాయి.
''ఏమి లేదు బాబు నీకు మీ నాన్నకు జీన్స్ ఒకటే ఉంటాయి...
వెళ్లి డి.ఎన్.ఏ. పరీక్ష చేయించుకో''అనింది.


ఆ కోడి పిల్ల కష్టాలు పడి  వాళ్ళ నాన్న ఎవరో తెలుసుకొని,పరీక్షలు 
చేయించుకొని ప్రపంచానికి నాకు నాన్న ఉన్నాడు అని గర్వంగా 
చెప్పింది.


కాని అందరికి ఇది సాధ్యమా?ఇలాగా పోరాడటం.....


''పుట్టగానే ఆకలి అమ్మను చూపిస్తే....అమ్మ నాన్న ను చూపిస్తుంది''


ఇది లేకుంటే వాళ్ళు సక్రమ సంతానం కాదని ముద్ర వేసేస్తారు.


నేను బాబు పుట్టేటపుడు తండ్రి యెంత ఫీల్ అవుతాడు అనేది 
ఇద్దరు ప్లస్ మిత్రులు అవినేని గారు,శ్రీనివాస్ చౌదరి గారు 
ఇద్దరి పోస్ట్లలో చదివాను.ఆ చిన్నారి బిడ్డ కోసం ఆ కష్టాలు 
ఎదుర్కొని ఒక తండ్రి ఎలా తపన్ పడుతాడో కళ్ళకు కట్టినట్లు 
ఉంది.మరి ఈ ఫీలింగ్స్ ఇలా పుట్టిన వాళ్లకు ఏర్పపడవు ఏమో?


రాజిరెడ్డి గారు వ్రాసినట్లు''ఒక దగ్గర ఇది చెయ్యొద్దు అని వ్రాసి ఉంటె 
అక్కడ అది జరుగుతుందనే కదా అర్ధం"


ఇక్కడ కొందరు చిన్నారులు తండ్రి వీపుపై ఊగుతూ,వేలు పట్టి నడుస్తూ 
కలల ప్రపంచం లో తూగుతున్నారు అంటే ......అక్కడ కొందరు 
తండ్రి తెలీక చీత్కారాలతో చిన్నపోయ్యి....చెత్త కుండీ లకో,నీళ్ళ ప్రవాహం లోకో ,
బతికి ఉంటె సిగ్గు పడుతూ వాడిపోయిన కలువలా 
ముడుచుకు పోతున్నారు అనే కదా అర్ధం.


పసి పిలలు వాళ్ళు వాళ్లకు ఏమి తెలుసు ?
మగ వాళ్ళ కోరికలకు బలిగా తమ తలను ప్రపంచపు 
వధ్యశిల  పై పెట్టామని....


అమ్మ పాల అమృతానికి కూడా నోచుకోక 
ఎంగిలి ఆకులు ఏరాలని......


తండ్రి ఇంటి పేరు,తల్లి పెట్టిన పేరు లేక 
లకారాల మాద్యమం  లో పిలిస్తే పలకాలని.....


చిత్తు కాగితాలు ఏరుతూ,బిచ్చం ఎత్తి బతుకుతూ 
అవిటి జీవితం గడుపుతూ నలగాలని....


నాన్న వేలు పట్టి నడిచే చిన్నారుల చూసి నపుడు 
పగిలే ఆశల బుడగలు రగిలే బాధతో చూడాలని....


పిడికెడు అన్నం  కోసం పది మంది కాళ్ళు వట్టాలని 
మద్యం సీసాలు మోయాలని ...........


చిక్కటి చీకటి లో సత్రాల వెనుక కుక్కలతో పోటీ 
పడి  గెలిచి ఎంగిలి ఆకులతో ఆకలికి ఆయుష్షు పోయ్యాలని 


ఈ దేశపు పౌరిడిగా కాక 
స్ట్రీట్ చిల్ద్రెన్ పేరుతొ కాందిశీకుల్లా బ్రతకాలని  


నాన్న వీపు సింహాసనం పై కూర్చున్న యువరాజులను చూసి 
నిలువ నీడ లేని బ్రతుకును పోల్చాలని  


పసి పిల్లలు వాళ్లకు ఏమి తెలుసు?


మానవత్వం కొంత చిగురించి 
ఒక్క మెతుకు తన పిడికేట్లో నుండి విదిలిస్తే 
చిన్నపోయిన బాల్యానికి గుండె గూటిలో చోటిస్తే 


సైకో కావాల్సిన బత్రుకు సైంటిస్ట్ లా చిగురిస్తుంది అని....
సంఘ విద్రోహిగా మారకుండా విజయాలు తెస్తుందని 
పసి పిల్లలు వాళ్లకు ఏమి తెలుసు?


మేధావులే తమ పుట్టుకకు కారణం అని 
ప్రజలు మారకుంటే ప్రభుత్వం ఏమి చెయ్యలేదని.....



Thursday, 26 July 2012

ఆహా మహాలక్ష్మి వచ్చేసింది...పూజ కాక ముందే ....

ఆహా మహాలక్ష్మి వచ్చేసింది...పూజ కాక ముందే ....
సంతోషాల జల్లు తెచ్చేసింది.
ఒక చక్కని వార్త నా ''ఆత్మ సహచరులు''పుస్తక సమీక్ష 
పుస్తకం.నెట్ లో వచ్చినట్లు.
చాలా మంచి పుస్తకం యెంత వ్రాసినా ఇంకా చెప్పాలని అనిపిస్తుంది.
ఇంతే ఇంత కంటే నేనేమి చెప్పలేను చదవండి.

పుస్తక సమీక్ష లింక్sameeksha link ikkada     


అబ్బ వాన వాసన ....ఇంట్లో రేపటి వరలక్ష్మి పూజ కోసం 
పనులు చేసుకుంటున్న నాకు కమ్మగా తగిలింది....
రావే ఫ్రెండ్ బయటకు అని.....

బయట తల పెడితే చెట్లన్ని లాల పోసుకుంటూ ఇంకా పోయ్యమని 
సంతోషం తో తలలు ఊపుతూ ఉన్నాయి.బయటకు పొతే బురద కాని 
వరండాలో కూర్చొని వాన చూడటం అందులో .....
''అందని మిన్నే ఆనందం,అందే మన్నే ఆనందం.....
అరె భూమిని చీల్చుకు వచ్చే పచ్చని  పసిరిక ఆనందం''
వింటూ చూస్తుంటే....అబ్బ.

''ఏక వీర''లో పెద్దాయన ఏమి వర్ణిస్తాడు  శ్రావణ మాసాన్ని....
ఊరేగింపుకు వెళ్ళిన ఏనుగులను,పట్టు  చీరలు 
మొల్లలు,మల్లెలు,చామంతులు ఏమి కాంబినేషన్....
వచ్చేడపుడు తడిసి మద్ద అవుతుంటాయి   .....

అయినా ఆ అమ్మ కటాక్షం అంటే ఎవరికి ఇష్టం ఉండదు?
సాక్షాత్తు ఆ నారాయణుడే...
''కంటి శుక్రవారము ఘడియ లేడింట''చూస్తె వెళ్లి పొయ్యి 
ఉంటాడు.

సాక్షాత్తు శంకరాచార్యుల వారే ''కనకధారా స్తోత్రం''లో 
''అంగం హరే పులక భూషణ మాశ్రయంతి''అంటారు.
అమ్మను తలుచుకుంటే అయ్యకు పులకలు కలుగుతాయట.
అమ్మ...అమ్మ వెంట అయ్యా....
అందుకే అమ్మను పూజిస్తే అందులో ఈ రోజు ....
ఆ తల్లి దయామాయీ ....కరుణా కటాక్ష కృపా స్వరూపిణి ....
చేతులు జోడిన్చగానే వరాలను ఒసగే చల్లని తల్లి....
ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది.

(పూలల్లో,పాలల్లో,పసుపు గడపలలో,నవ్వుల్లో,పువ్వుల్లో 
అంతా చల్లని తల్లి.అందుకే ఇంట్లో ఆడవాళ్ళను ఏడిపించకూడదు.
అప్పుడే సుఖం,శాంతి,సంపద......నిలుచున్న లక్ష్మి దేవిని 
పూజించవద్దు వీలు అయినంతవరకు)

మరి మంత్రాలూ రాని వారు కనిసం ఈ పాట అయినా పాడుకొని 
పూజ చేసుకోండి.చాలు....తల్లిని తలుచుకుంటే చాలు...
చల్లని నవ్వులతో వచ్చేస్తుంది.




''సాయంకాలా సమయం లో ......సంధ్యా దీపారాదనలో 

వచ్చెను తల్లి మహా లక్ష్మి ......వచ్చెను తల్లి మహా లక్ష్మి 

పాల సముద్రిని పుత్రికగా ......పరంధాముని ప్రాణ సతి
రావమ్మా ఇక రావమ్మా....మమ్మేలగా ఇక రావమ్మా 

విద్యను ఇచ్చే విద్యా లక్ష్మి .....సంతానం ఇచ్చే సంతాన లక్ష్మి 
సౌభాగ్యం ఇచ్చే సౌభాగ్య లక్ష్మి.....ధైర్యం ఇచ్చే ధైర్య లక్ష్మి 

మెడలో ఎన్నో హారాలు ......సిగలో ఎన్నో పుష్పాలు 
నవ్వుచు వచ్చెను నా తల్లి.......నను కరుణిమ్చెను  నా తల్లి 

వరములను ఇచ్చే వర లక్ష్మి......ధాన్యం ఇచ్చే ధాన్య లక్ష్మి 
ధనమును ఇచ్చే ధన లక్ష్మి ......విజయమును ఇచ్చే విజయ లక్ష్మి 

కాళ్ళకు గజ్జెలు కట్టింది ....మెడలో హారం వేసింది 
పిలిచిన వెంటనే పలికింది ......అడిగినదంతా ఇచ్చింది 

సాయంకాలా సమయం లో.....సంధ్యా దీపారాధన లో 
వచ్చెను తల్లి మహా లక్ష్మి....వచ్చెను తల్లి మహా లక్ష్మి ''


వ్రాసిన వారు: తన్నీరు శశికళ
********
ఇది రిచార్డ్ బాక్ (Richard Bach) చేత వ్రాయబడిన వన్ (One) కి తెలుగు అనువాదం. దీనిని మహేంద్రవర్మ గారు అనువదించారు. ఇది సమాంతర కాల జీవనాలను, ప్రత్యామ్నాయ జీవిత కాలాల గూర్చి బాగా వివరిస్తుంది. మనం మన జీవితం లోని వివిధ ఘట్టాలలో మన ఎంపిక దారుల వలననే ఇలాగా జీవిస్తున్నాము అని చాలా చక్కగా ఉదాహరణనలతో వివరిస్తుంది.
కాలం గూర్చి కూడా బాగా చెప్పుతారు దీనిలో.నిజానికి అంతా వర్తమానమే తప్ప గతించిన కాలం,భవిష్యతు లేదు.మనం ఎక్కడకు కావాలంటే అక్కడకు వెళ్లి చూడొచ్చు.దీనిని అర్ధం చేసుకోవాలంటే కొంచం కష్టమే. కాని ఇక్కడ ఇచ్చిన బాక్,లేస్లి జీవిత ఘటన ల ద్వారా మనకు చక్కగా అర్ధం అవుతుంది.
ముందుగా లేస్లి,బాక్ తమ సొంత విమానం లో ప్రయాణం చేస్తూ విమానాశ్రయం వారిని ల్యాండింగ్ కు పర్మిషన్ అడుగుతూ ఉంటారు.అప్పుడు లెస్లీ నే విమానం నడుపుతూ ఉంటుంది. ఉన్నట్లుండి బంగారు రంగు కాంతి కనపడి దాని తరువాత వారు నగరం పై మాయమై ఒక సముద్రం పై ఎగురుతుంటారు.దానిలో కింద చాలా అల్లికలు కనిపిస్తాయి వల లాగా. అవి కలుస్తూ దూరంగా పోతూ ఒక వల లాగా అల్లుకొని ఉంటాయి. తర్వాత వారు అవి తాము వచ్చిన జీవిత గమనాలు అని అవి కలిసే దగ్గర రెండు రకాల ఎంపికలు మనం చేసుకోవచ్చు అని తెలుసుకుంటారు.ఇంకా తాము ఎక్కడకు గతం లోనైనా,భవిష్యత్తు కైనా వెళ్లి చూడొచ్చు అని తెలుసుకుంటారు.
ఉదాహరణకి లేస్లి,బాక్ వారు కలిసిన మొదటి క్షణాలకు వెళుతారు. అప్పుడు వాళ్ళే వాళ్లకు యవ్వనం లో కనిపిస్తుంటారు. నిజానికి వాళ్ళు ఇద్దరు ఒకరికి ఒకరు అడ్జస్ట్ అవ్వటానికి చాలా టైం వృధా చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళ యవ్వన శరీరాలకు మీ ఆత్మ సహచరులను వదులుకోవద్దు. ఎందుకు కాలం వృధా చేస్తారు? వెంటనే కొన్ని కోరికలు వదులుకొని పెళ్లి చేసుకోండి అని కలుపుతారు. అలా తమకు వృధా అయిన కాలాన్ని వాళ్ళు వృధా చేసుకోకుండా చూస్తారు.
ఇంకా వీళ్ళు గతం లో భవిష్యత్తు లో చాలా ఘటనల దగ్గరకు వెళ్లి వాళ్ళ ఎంపికలు మార్చుకుంటే ఎంతో వినాశనాన్ని ఆపొచ్చు అనే ఆలోచన వాళ్ళలో కలిగిస్తారు.
వీళ్ళు ఒక ఎంపిక పై దిగినపుడు ఒక వ్యక్తి తపస్సు చేసి ఒక పుస్తకం సాధించటం చూస్తారు. వీళ్ళు చూస్తుండగానే ఆతను దానిని మంటల్లో వెయ్యబోతాడు. వీళ్ళు వెళ్లి అతనిని ఆపుతారు. “ఎందుకు అలా చేస్తున్నారు మీకు ఏమైనా పిచ్చా?” అని అడుగుతారు. అప్పుడు వాళ్ళ మధ్య సంభాషణ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బుక్ ఉంచితే ఏమి అవుతుంది అని అడుగుతాడు. చాలా మంది చదువుతారు. అప్పుడు ఒక మతం ఏర్పడుతుంది. అది గొప్పది అనే వాదన మొదలు అవుతుంది. తరువాత యుద్దాలు, అవసరమా … ఇదంతా అని వివరించి బుక్ ని మంటల్లో పడేస్తారు. ఇలా ఒక ఎంపిక వలన మన జీవిత గమనం ఎలా మారుతుందో చాలా ఉదాహరణలు ఉన్నాయి.
అసలు మనం లేస్లి,బాక్ లతో ప్రయాణిస్తూ అవన్నీ దగ్గర నుండి చూసినట్లు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ పుస్తకం చదివిన తరువాత మన జీవితం మన ఎంపికల పలితమే అని ఇలాంటి వర్తమానాలు చాలా ఉన్నాయని గ్రహిస్తాము.మన ఆలోచనలలో చాలా మార్పు వస్తుంది.
కాని ఈ సమాంతర కాలం అనే భావన అర్ధం చేసుకోవటం కొంచం కష్టం గానే ఉన్నప్పటికీ అర్ధం చేసుకుంటే మన జీవితం మంచి మలుపు తిరుగుతున్దనటం లో సందేహమే లేదు.
ఈ రిచర్డ్ బాక్ వ్రాసిన జోనాథన్ సీగల్ పుస్తకం మనలో చాలా పాజిటివ్ యాటి ట్యూడ్పెంచుతుంది.
ఆత్మ సహచరులు పుస్తకం నుండి కొన్ని మంచి వాక్యాలు
”ప్రేమ తత్వాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు ఇక ప్రతి క్షణం నీవేమి నేర్చుకుంటావో ఆ అనుభవం తో నీ ప్రపంచాన్ని మార్చుకోగల శక్తి నీకు వస్తుంది”
”విశ్వ చిత్రం లో ఎక్కడకు వెళ్ళినా మీరు ఇద్దరు కలిసే వెళుతారు. ఏ మూల నుండి చూసినా ఒకరు మరొకరి ప్రేమ సంరక్షణలో ఉంటారు.”
”నీకు ఆమె శక్తి కావాలి.ఆమెకు నీ చోదన సామర్ధ్యం కావాలి. మీరు ఇద్దరు కలిస్తేనే గగన విహారం సుసాధ్యం”
అసలు ఈ పుస్తకాన్ని చదివి అనుభూతి సొంతం చేసుకోవాలి అంతే.యెంత చెపినా తక్కువే.
ప్రతులకు చిరునామా:
house.no.16-11-477/6/1/A-6
andhrabank A.T.M.counter,
beside sahadev reddy sweet house,
dilshuknagar,
hyderabad,phone -040 66637630,9290125886.


pustakam.net
http://pustakam.net/?p=11949

Monday, 23 July 2012

మణులు అడిగానా?మాన్యాలు అడిగానా?



''కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్''రూం అంతా ప్రతిద్వనించింది.


''అబ్బ చిన్నగా అరువు...నీ తొక్కలో ఫ్లాష్ బ్యాక్ కి 
ఇంత  బిల్డ్ అప్ ఎందుకు ?''


ఆఫీస్ లో దిగులుగా కళ్ళు మూసుకొని కూర్చున్న మూర్తిని 
పనిమాలా కెలికినందుకు తన మీద తానె జాలి పడుతూ 
అడిగాడు పణి.
మరి నేను కూడా  ఆ లెవెల్ లో అరిచాను మా ఆవిడ కోరిక విని ....


ఒక్క సారి రయ్యుం....రయ్యుం...రయ్యుం....నిన్న రాత్రికి 
వెళ్లి పొయ్యాడు.


''ఏమండీ''....''చెప్పండి''
''ఏమండీ''ఇంకా గోముగా....
ఎక్కడో నక్క ఊల వినిపించింది.....ఎడమ కన్ను ఆదరసాగింది.
ఛీ...ఛీ....అవన్ని అబాద్దాలు,శకునాలు నమ్మకూడదు అని 
మనసులో అనుకొని...అయినా రెండు సార్లు పిలిచిందంటే 
కొంప మునిగే మాటే ......అయినా వానొస్తే మునిగే కుంటల్లో 
ఇల్లు కట్టుకునే వాళ్ళే బయపడకుండా ఉంటున్నారు .
నా కొంప ఎలా మునుగుతుంది అనుకొని .....చెప్పమన్నట్లు 
చిన్నగా తలూచాడు ....మెల్లని మందహాసం విష్ణు మొర్తిలాగా 
ఒలికిస్తూ(అసలు పేరు అదే)


వెంటనే లక్ష్మి దేవి కాళ్ళ దగ్గరకు వెళ్లి పొయ్యింది.....
మెల్లిగా కాళ్ళు  ఒత్తుతూ  ....అనసులో మాట బయట పెట్టింది.


వెంటనే న్యూక్లియర్ బాంబ్ పడినట్లు ఉలిక్కి పడ్డాడు.
అడ్డంగా ,నిలువుగా నానా రకాలుగా తల ఊగించాడు 


విచ్చుకున్న యెర్ర పెదాలు....సున్నాలా మారిపొయ్యి 
మూతి మూడు వంకరలు తిరిగింది.
''మణులు అడిగానా?మాన్యాలు అడిగానా?''
నిష్టూరాలు.....చక్కని రాత్రి వృధాగా ఎందుకు...
ప్రస్తుతానికి శాంతి ఝండా ఎగరేశాడు ....రేపు వాకాబు చేస్తాను అన్నాడు.
(మనసులో మన్మోహన్ లాంటి దిగులు పెట్టుకొని)


''వాకబు చెయ్యటం కాదు ,సాధించాలి''సుప్రీం కోర్ట్ ఆర్డర్.


రయ్యుం...రయ్యుం..ఇప్పటి కాలానికి 


సరే ఇంతకీ కోరిక ఏమిటి అడిగాడు కొంచం జాలి,కొంత విసుగు కలిపి 
పెరుగులో జాం కలుపోకొని తినే మొహం పెట్టి.....


''ఏముంది .....గోరింటాకు కావాలంట,శ్రావణ మాసం పెట్టుకోవాలి అంట''


''ఓస్...దాని దేముంది హెన్నా కోన్ ఒకటి కొనిచ్చేయ్యి''అన్నాడు పణి .


''మరదే నీకు తెలీని విషయం నిజం గోరింటాకే పెట్టుకోవాలంట.
అది పెట్టుకుంటేనే లక్ష్మి దేవి ఆశీర్వాదిస్తుంది అంట.పైగా 
మీ కోసమే కదా ఈ వ్రతాలు అని సెంటిమెంట్''


''హూ కష్టమే పదా పర్మిషన్  పెట్టి వెదుకుదాము''చెప్పాడు స్నేహ ధర్మం తో.


అప్పుడు మొదలైంది వాస్కోడిగామా ఇండియా కనుక్కొనే ప్రయాణం....
అదిగో అక్కడ ఉంది అంటారు ,తీరా  వెళితే అపార్ట్మెంట్స్  కట్టేసి ఉంటారు.
అలా అలా అడుగుతూ  సుదూర తీరాలకి వెళ్లి పొయ్యారు...అంటే నగరం 
పొలిమేరలకు.


''లాభం లేదు బాస్ ....పల్లెల్లో కూడా సెజ్ ల పుణ్యమా అని ,రింగ్ రోడ్లు 
అని ఎక్కడా చెట్లు ఉండవు''నిరాశగా చెప్పాడు ఫణి 


ఏమిటి దారి దిగులుపడుతూ దీనంగా మొహం పెట్టాడు మూర్తి 
పింక్ కార్డ్ అందుకున్న సాఫ్ట్ వేర్ లాగా....రాత్రికి తలుపు తియ్యక 
పొతే ఎక్కడ ఉండాలి అని ఆలోచిస్తూ.....


''హేయ్...హేయ్''ఎక్కడో బర్రెలు తోలుకుంటూ వచ్చాడు గోపాలకృష్ణుడు .
''బాబ్బబ్బా   ...బ్బు...'అని వెంటపడ్డారు తరుణోపాయం చెప్పమని.
చిన్నగా నవ్వి హైవే వైపు వేలు చూపించాడు.


నిజమే సుమీ...ఎందుకు రాలేదు ఇంత మంచి ఐడియా....
జామ్మని వెళ్లి పొయ్యారు ......డివైడర్ మీద కాగితం పూల 
చెట్లు వీళ్ళ హుషారు చూసి మెల్లిగా తలలు ఊపాయి 
ఆహ్వానిస్తున్నట్లు.....


వాటిని దాటగానే కనిపించాయి ....గోరింటాకు చెట్లు డివైడర్  మీద.
వజ్రాల ఘని చూసినట్లు వెలిగిపోయ్యాయి ఇద్దరి మొహాలు.
సర్రున దూసుకెళ్ళి....కోసుకోచ్చేసారు......
               @@@@@@@@@@@@@


అన్నం తిని టి.వి.చూస్తూ కూర్చుని ఉంటె మెల్లగా చేతి వేళ్ళ స్పర్శ 
కళ్ళు మూస్తూ....కమ్మని గోరింటాకు వాసన వేళ్ళ నుండి 
అద్భుతంగా ఉంది....చేతులు తియ్యమనకుండా ఆగ్రాణిస్తూ 
కూర్చున్నాడు.


మెల్లిగా చేతి వెళ్ళు నిమిరి గర్వంగా అన్నాడు ....
''చెప్పు ఈ సారి ఏమి తెమ్మంటావు?''


కిలకిల  నవ్వులకు,గాజుల సంగీతం తోడై టి.వి పాటలో 
కలిసిపోయింది.


''పంచ వన్నె చిలుకా జలకాలాడగా మంచు బిందువులు సేకరిస్తా 
దేవత స్నానం చేసిన జలము గంగా జలముగా సేవిస్తా...''

Wednesday, 18 July 2012

స్నేహానికి యెంత విలువ....

స్నేహానికి యెంత విలువ ఉంది నిజంగా అందుకే
ఆద్యాత్మికత లో కూడా  దాన్ని అంత బలపరచారు.

ఒక నాటకం లో పోర్శియా  అంటుంది"దయ అనేది
వానలా మెల్లగా స్వర్గం నుండి కురుస్తుంది.అది
ఇచ్చిన వాళ్లకి,స్వీకరించిన వాళ్లకి కూడా సంతోషం
కలిగిస్తుంది " అని.......

స్నేహం  కూడా అంతే.ఎందుకో కొందరిని చూస్తె కొత్తగా
అనిపించదు.పై పెచ్చు ఎన్నో రోజుల నుండి వాళ్ళను
ఎరిగినట్లు ఉంటుంది.

ఇప్పుడే పరమహంస యోగానంద వారి విదేశాలలో చెప్పిన
ప్రసంగాల వ్యాస సంపుటి చదివాను.యెంత చక్కగా ఉందొ
స్నేహం గూర్చి.....

మచ్చుకి కొన్ని.....
''ఎవరి పట్ల అయినా నీకు దివ్యాకర్షణ కలిగితే వారితో స్నేహం చెయ్యండి.
ఏదో పూర్వ జన్మలో వారు మీకు స్నేహితులై ఉంటారు''

''హృదయపూర్వకంగా బేషరతు అయిన ప్రేమను వ్యక్తం చేసే
అవకాశాలు కల్పించటానికి అయన స్నేహితుల రూపంలో
వస్తాడు''

''నేను అందరికి మిత్రున్ని...నా శత్రువులకు కూడా...
అని చెప్పే స్తితి నీలో రావాలి''

''స్నేహం కోసం మీ కోరిక తగినంత ఉంటె ,మీతో ఆద్యాత్మిక అనుసంధానం
కలిగిన వ్యక్తీ దక్షిణ ద్రువం వద్ద ఉన్నా స్నేహం అనే అయస్కాంత
శక్తి మీ ఇద్దరినీ ఒక చోటికి ఆకర్షిస్తుంది''

ఇలాగే ఎన్నో మంచి విషయాలు.....చదవండి.....కొన్ని ఇస్తున్నాను.







Saturday, 14 July 2012

ఎక్కడకు వెళుతున్నాం?ముందుకా...వెనక్కా...

ఈ రోజు సాక్షి లో సంపాదకీయం చదివాను.
ఒక గ్రామం లో ఆడవాళ్ళపై చేసిన కట్టడి,అల్లరి మూకలు 
మహిళలపై చేసిన ముట్టడి చదివాను.
ఏమిటిది మళ్ళా ఆటవిక దశకు వెళ్లి పోతున్నామా?


యెంత చదువుకున్నాము....యెంత సంస్కారం నాగరికత 
నేర్చాము.చదువురాని వాళ్ళు గౌరవం ఇచ్చినంత మాత్రం 
మహిళకు గౌరవం బధ్రత ఇవ్వలేక పోతుంటిమె...హ్మ్ ...
ఎందుకొచ్చిన చదువు?


నేను ఒక సారి మా ఊరి స్కూల్ పిల్లలు సముద్రం దగ్గర లైట్ హౌస్ 
చూడటానికి పోతుంటే వాళ్ళ టీచర్స్ తో పాటు నేను కూడా వెళ్లాను.
మా ట్రాక్టర్ చెడిపోయి ఒక సముద్ర తీర గ్రామం లో రాత్రికి ఉండాల్సి వచ్చింది.
అప్పుడు వాళ్ళ మంచి మనసు,ఆతిధ్యం రుచి చూసాము.


అలాగే వాళ్ళ కట్టు అంటే యెంత కటినంగా ఉంటుందో చూసాము.
వాళ్ళు అప్పటికి అప్పుడు వెలివేస్తే ఒక కుటుంభం ఆ ఊరి వదిలి 
వెంటనే వెళ్లి పొయ్యారు.


ఇంత  మంచి కట్టుని ఆ సముద్ర గ్రామాల వాళ్ళు ఆ ఊరికి 
కరంట్,రోడ్లు,స్కూల్స్ అలాటివి తెచ్చుకోవటం లో 
వాడుకుంటే యెంత బాగుంటుంది కదా......



Friday, 13 July 2012

సత్యభామ సరదాలు 1

నారాయణులవారు సాయంత్రం చక్కగా ఫ్యాన్ కింద 
కూర్చొని పేపర్ చదువుతూ టి.వి.వీక్షిస్తున్నారు.
కొన్ని పూలు చిన్న గిన్నె లో వేసుకొని దారం తీసుకొని 
పక్కన నెల మీద కూర్చుంది లక్ష్మీదేవి.....పూలు కడదామని.
(దేవుళ్ళు కాదు మీరు పొరబడవద్దు.అన్నీ కల్పితాలే)

పిల్లలు రెండు రోజులు సెలవలు వస్తే అమ్మమ్మ గారి ఇంటికి 
వెళ్లారు.అందుకు ఇల్లాలికి పనిలో కొంచం వెసులుబాటు.
శ్రీవారికి కొంచం ప్రశాంతత.

మెల్లిగా మల్లెపూలకి కాడలు తీసేస్తూ టి.వి లో చూసింది.
ఎక్కడో లక్ష్మిదేవిని చూపిస్తూ ఉన్నారు.''ఇదిగో విన్నారా?''

''ఏమిటి?''పేపర్ లో నుండి కళ్ళు మాత్రం బయటపెట్టాడు.

''వచ్చే వారమే శ్రావణ్ శుక్రువారం''మెల్లిగా బాంబ్ పేలింది.
ఉలిక్కి పడ్డాడు.అసహనంగా కదిలాడు.''అప్పుడే వచ్చిందా?''
విసుగ్గా గొణిగాడు.ఎన్ని భావాలు చూపించినా అర్జీ పైన 
వాళ్లకు పంపించిన కింద ఆఫీసర్ లాగా నిమ్మళంగా ఉంది 
పూల కాడలు తల వంచుకొని వలుచుకుంటూ....

''ఇదిగో ఇప్పుడు చీరలు నగలు మాట ఎత్తకు...నీకే 
చెప్పేది....అసలు నెలాఖరు వంద సంగతి దేవుడెరుగు ...
పది రూపాయలు కూడా లేవు.తల పక్కకి తిప్పి చూస్తూ చెప్పాడు.

ఏమి చలనం లేదు.నల్లని కురుల మధ్య తల వంచుకొని 
వర్షించ బొయ్యే శ్రావణ మేఘాల్లా......

''సరే...సరే ఎప్పుడు వచ్చే పూజలను ఎందుకు కాదు అనటం 
రెండు వందల్లో ఏదైనా చీర తెచ్చుకో .....పక్కకు ఓరగా చూసాడు.

ఊహు....ఏమి మార్పు లేదు.తల కొంచమైనా ఎత్త లేదు.
చక్కటి పొడవైన వేళ్ళు చురుకుగా పూలను దారంతో 
బందిస్తూ తమాషాగా కదులుతున్నాయి.
చక్కటి కూచిపూడి నృత్యం చూసినట్లు కాసేపు తమకంగా 
చూసాడు.

''సరే....సరే నిజమేలే .....ఏమి వస్తున్నాయి రెండు వందలకు ,
ఐదు వందలలో కొనుక్కో ''

ఊహూ మౌనమే సమాధానం.సంపెంగ లాంటి ముక్కు చివర 
తెల్ల రాయి ముక్కు పుడక మాత్రం తళుక్కుమన్నది....మదిని 
మురిపిస్తూ......

''ఎలా వేగేది మీతో.ఎక్కడ నుండి తేను డబ్బులు ఇక్కడ 
చెట్లకు కాయటం లేదు.సంపాదిస్తే తెలుస్తుంది అది యెంత 
కష్టమో....మీ నాయన నాకేమి మూటలు ఇవ్వలేదు ....
నీ కోరికలు తీర్చటానికి''మధ్యతరగతి అక్కసు సెగలు కక్కింది.

చురుక్కున తగిలాయి చూపులు ......కాల్చేస్తున్నాయి 
యెర్రని కళ్ళ నుండి తూటాల్లాగా......పై చేయి  కిందికి  పోయింది.

మాట తడబడ్డాడు...అది...అది...కాసేపు నీళ్ళు నమిలాడు.
నిజమే మాట తూలాను ఎలా ....అనుకున్నాడు.
సన్నజాజుల వేళ సరదాగా ఉండాలి కాని సెగల పొగలు 
ఎందుకు...చల్లార్చాలనుకున్నాడు.

''అది కాదు ....ఎలాగో డి.ఏ.పెరిగింది.వెయ్యి రూపాయలలో 
చీర కొనుక్కో .....షాప్ అతనితో వచ్చే నెల ఇస్తామని చెప్పు.''

ఇంకా మౌనమే ....కాకుంటే తల చిన్నగా ఊగింది 
రైలు కోసం పచ్చ జండా మొదట మెల్లగా ఊపటం మొదలు పెట్టినట్లు.

హుషారు వచ్చింది దొర గారికి....ఇంకొంచెం ....ఇంకొంచెం....
మాటలు పొడిగించాడు.''ఎలా ఉండాలి చీర ....నువ్వు పూజలో 
కట్టుకుంటే అంత మందిలో దేవ కాంత లాగా వెలిగి పోవాల...
పర్లేదు ఇంకో రెండు వందలు ఎక్కువైనా....నువ్వు 
మాత్రం కాకి ముక్కులో వజ్రం లా వెలిగి పోవాలా''

కవిత్వం ఏదో చెప్పెస్తున్నట్లు గొప్పగా పోగిడేసి స్వర్గానికి 
తీసుకు పోతున్నట్లు చెప్పాడు.

మౌనం వీడింది.పగడాల దీవిలో ముత్యాల సరం లాగా నవ్వు 
తళుక్కున విచ్చి పుటుక్కున  మాయం అయ్యింది.చేతిలో పూల దండ 
పూర్తీ అయ్యింది.

మెల్లిగా లేచింది.నారాయణుల వారు ఇంకా వరాలు ఇచ్చే మూడ్  లోనే 
ఉన్నారు.''ఇంకా యెంత కావాలో చెప్పు వ్రతానికి ,గాజులకి,పూలకి 
అంతా ఇచ్చేస్తాను.నువ్వు మాత్రం మా ఇంటి మహా లక్ష్మి లాగా 
నవ్వుతూ తిరుగుతూ పాల సముద్రం చేసెయ్యాల''

పక పక నవ్వుతూ నవ్వులతో పాటు దండ ను కూడా అతని 
దోసిలిలో జార్చి మనసుని నింపేసింది.
''వీటి కేమి తక్కువ లేదు''నవ్వుతూ అంది.
''మరి వేటికి తక్కువో''ఓర చూపులతో అడిగాడు.

ముసి ముసి నవ్వులతో వెనక్కి తిరిగింది జడను అందిస్తూ.
మాలను జడ లో తురిమి మురిసిపోయాడు....పొతే పోయిందిలే 
వెదవ డి.ఏ.ఇంత ఆనందం ఏమి చేస్తే వస్తుంది.

వివాహ చట్టం లో లేక పోయినా వచ్చే హక్కుతో పూలు పెట్టి 
పరిమళాల జల్లులో తడిసిపోయాడు.

Thursday, 12 July 2012

ఎలాగున్న సంతోషంగా ఉండాలని అనుకుంటే....

''నువ్వు ఎలా ఉన్నా సంతోషంగా ఉండటానికే 
నిర్ణయించుకొని జీవిస్తుంటే అదే ధ్యానం ''......ఓషో.

ఇపుడే సాయంత్రం ఆరు నుండి ఏడు వరకు మొత్తం 
దేశం లో గల అన్ని పిరమిడ్ ధ్యాన కేంద్రాలలో ఉన్న 
అందరం కలసి సామూహిక ధ్యానం చేసాము.
సంకల్పం ఏమిటంటే దేశం లో సకాలం లో సరిగా వర్షాలు పడాలి.
అది పత్రీజి గారి మేస్సేజ్.బహుశా మాస్టర్స్ ఎవరైనా 
ఆయనకు ఇచ్చి ఉంటారు.
ఇంత కంటే మంచి అవకాశం రాదులే ....
ఒక మంచి సంకల్పం తో గంట ఉండటానికి అని వెళ్లి వచ్చాను.

మనకు మన జీవితం లో కొన్ని విషయాలు లేక 
వ్యక్తులు నచ్చక పోవచ్చు.కాని అవన్ని మనకు సమతుల్యతలోనే 
ఉన్నాయని అవి మనకు మంచి చేస్తాయి అని భావిస్తే 
జీవితం చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది.అప్పుడు జీవితం ఎలాగా 
ఉంటుందంటే ''కమ్మని పాటకు రూపం వస్తే అది నీలాగే 
ఉంటుందని ''అని సంతోషంగా అన్ని ఇబ్బందుల్లో కూడా 
పాడుకోగలం.

ఇబ్బందిని కూడా మన జీవితం లోకి ఎలా తీసుకోవాలో 
వివేకానందుని కధలో ఉంది.
దక్షిణేశ్వరం లో పంచవటి అనే చోట వివేకానందుల వారు 
ధ్యానం చేసుకొనే వారు.అక్కడ సాయంత్రం సైరన్ మోగేది పెద్దగా.
దాని వలన అతనికి ధ్యాన భంగం అయ్యేది.

ఒక సారి రామ కృష్ణుల వారితో చెప్పుకొని బాధ పడ్డారు.
అప్పడు రామ కృష్ణుల వారు''ఆ శబ్దాన్ని కూడా నీలోకి తీసుకో 
అప్పుడు అది నిన్నేమి చెయ్యలేదు'' అన్నారు.
అలాగే ఆయన చేసారు.
మనం కూడా  ఇబ్బంది కరం అనిపించేవి మనలో 
తీసుకుంటున్నాము అనుకొని ....వాటి నుండి వచ్చే 
పాఠాలు నేర్చుకుంటే అవి మనలను ఏమి చెయ్యవు.

మీ కోసం ఓషో గారి బుక్ ''నిత్య జీవితం లో ధ్యానం ''
నుండి కొన్ని పేజెస్.......