Friday 13 July 2012

సత్యభామ సరదాలు 1

నారాయణులవారు సాయంత్రం చక్కగా ఫ్యాన్ కింద 
కూర్చొని పేపర్ చదువుతూ టి.వి.వీక్షిస్తున్నారు.
కొన్ని పూలు చిన్న గిన్నె లో వేసుకొని దారం తీసుకొని 
పక్కన నెల మీద కూర్చుంది లక్ష్మీదేవి.....పూలు కడదామని.
(దేవుళ్ళు కాదు మీరు పొరబడవద్దు.అన్నీ కల్పితాలే)

పిల్లలు రెండు రోజులు సెలవలు వస్తే అమ్మమ్మ గారి ఇంటికి 
వెళ్లారు.అందుకు ఇల్లాలికి పనిలో కొంచం వెసులుబాటు.
శ్రీవారికి కొంచం ప్రశాంతత.

మెల్లిగా మల్లెపూలకి కాడలు తీసేస్తూ టి.వి లో చూసింది.
ఎక్కడో లక్ష్మిదేవిని చూపిస్తూ ఉన్నారు.''ఇదిగో విన్నారా?''

''ఏమిటి?''పేపర్ లో నుండి కళ్ళు మాత్రం బయటపెట్టాడు.

''వచ్చే వారమే శ్రావణ్ శుక్రువారం''మెల్లిగా బాంబ్ పేలింది.
ఉలిక్కి పడ్డాడు.అసహనంగా కదిలాడు.''అప్పుడే వచ్చిందా?''
విసుగ్గా గొణిగాడు.ఎన్ని భావాలు చూపించినా అర్జీ పైన 
వాళ్లకు పంపించిన కింద ఆఫీసర్ లాగా నిమ్మళంగా ఉంది 
పూల కాడలు తల వంచుకొని వలుచుకుంటూ....

''ఇదిగో ఇప్పుడు చీరలు నగలు మాట ఎత్తకు...నీకే 
చెప్పేది....అసలు నెలాఖరు వంద సంగతి దేవుడెరుగు ...
పది రూపాయలు కూడా లేవు.తల పక్కకి తిప్పి చూస్తూ చెప్పాడు.

ఏమి చలనం లేదు.నల్లని కురుల మధ్య తల వంచుకొని 
వర్షించ బొయ్యే శ్రావణ మేఘాల్లా......

''సరే...సరే ఎప్పుడు వచ్చే పూజలను ఎందుకు కాదు అనటం 
రెండు వందల్లో ఏదైనా చీర తెచ్చుకో .....పక్కకు ఓరగా చూసాడు.

ఊహు....ఏమి మార్పు లేదు.తల కొంచమైనా ఎత్త లేదు.
చక్కటి పొడవైన వేళ్ళు చురుకుగా పూలను దారంతో 
బందిస్తూ తమాషాగా కదులుతున్నాయి.
చక్కటి కూచిపూడి నృత్యం చూసినట్లు కాసేపు తమకంగా 
చూసాడు.

''సరే....సరే నిజమేలే .....ఏమి వస్తున్నాయి రెండు వందలకు ,
ఐదు వందలలో కొనుక్కో ''

ఊహూ మౌనమే సమాధానం.సంపెంగ లాంటి ముక్కు చివర 
తెల్ల రాయి ముక్కు పుడక మాత్రం తళుక్కుమన్నది....మదిని 
మురిపిస్తూ......

''ఎలా వేగేది మీతో.ఎక్కడ నుండి తేను డబ్బులు ఇక్కడ 
చెట్లకు కాయటం లేదు.సంపాదిస్తే తెలుస్తుంది అది యెంత 
కష్టమో....మీ నాయన నాకేమి మూటలు ఇవ్వలేదు ....
నీ కోరికలు తీర్చటానికి''మధ్యతరగతి అక్కసు సెగలు కక్కింది.

చురుక్కున తగిలాయి చూపులు ......కాల్చేస్తున్నాయి 
యెర్రని కళ్ళ నుండి తూటాల్లాగా......పై చేయి  కిందికి  పోయింది.

మాట తడబడ్డాడు...అది...అది...కాసేపు నీళ్ళు నమిలాడు.
నిజమే మాట తూలాను ఎలా ....అనుకున్నాడు.
సన్నజాజుల వేళ సరదాగా ఉండాలి కాని సెగల పొగలు 
ఎందుకు...చల్లార్చాలనుకున్నాడు.

''అది కాదు ....ఎలాగో డి.ఏ.పెరిగింది.వెయ్యి రూపాయలలో 
చీర కొనుక్కో .....షాప్ అతనితో వచ్చే నెల ఇస్తామని చెప్పు.''

ఇంకా మౌనమే ....కాకుంటే తల చిన్నగా ఊగింది 
రైలు కోసం పచ్చ జండా మొదట మెల్లగా ఊపటం మొదలు పెట్టినట్లు.

హుషారు వచ్చింది దొర గారికి....ఇంకొంచెం ....ఇంకొంచెం....
మాటలు పొడిగించాడు.''ఎలా ఉండాలి చీర ....నువ్వు పూజలో 
కట్టుకుంటే అంత మందిలో దేవ కాంత లాగా వెలిగి పోవాల...
పర్లేదు ఇంకో రెండు వందలు ఎక్కువైనా....నువ్వు 
మాత్రం కాకి ముక్కులో వజ్రం లా వెలిగి పోవాలా''

కవిత్వం ఏదో చెప్పెస్తున్నట్లు గొప్పగా పోగిడేసి స్వర్గానికి 
తీసుకు పోతున్నట్లు చెప్పాడు.

మౌనం వీడింది.పగడాల దీవిలో ముత్యాల సరం లాగా నవ్వు 
తళుక్కున విచ్చి పుటుక్కున  మాయం అయ్యింది.చేతిలో పూల దండ 
పూర్తీ అయ్యింది.

మెల్లిగా లేచింది.నారాయణుల వారు ఇంకా వరాలు ఇచ్చే మూడ్  లోనే 
ఉన్నారు.''ఇంకా యెంత కావాలో చెప్పు వ్రతానికి ,గాజులకి,పూలకి 
అంతా ఇచ్చేస్తాను.నువ్వు మాత్రం మా ఇంటి మహా లక్ష్మి లాగా 
నవ్వుతూ తిరుగుతూ పాల సముద్రం చేసెయ్యాల''

పక పక నవ్వుతూ నవ్వులతో పాటు దండ ను కూడా అతని 
దోసిలిలో జార్చి మనసుని నింపేసింది.
''వీటి కేమి తక్కువ లేదు''నవ్వుతూ అంది.
''మరి వేటికి తక్కువో''ఓర చూపులతో అడిగాడు.

ముసి ముసి నవ్వులతో వెనక్కి తిరిగింది జడను అందిస్తూ.
మాలను జడ లో తురిమి మురిసిపోయాడు....పొతే పోయిందిలే 
వెదవ డి.ఏ.ఇంత ఆనందం ఏమి చేస్తే వస్తుంది.

వివాహ చట్టం లో లేక పోయినా వచ్చే హక్కుతో పూలు పెట్టి 
పరిమళాల జల్లులో తడిసిపోయాడు.

8 comments:

swathi said...

nice post and nice idea should try on my hubby for this sravanamasam

వనజ తాతినేని/VanajaTatineni said...

అమ్మ.. లచ్చిందేవి!? ఏమి చతురత. !!!!
సూపర్.. షాపింగ్ .. చేసేయడమేనా ? ఊహు.. దున్నేయడమేనా !!
super!!

జలతారు వెన్నెల said...

So sweet!!! భలే రాసారే!!

హనుమంత రావు said...

సాధించినట్టు కనపడేది నారాయణులు గారు ... చివరికి సాధించేది లక్ష్మీదేవిగారు..
బాగావ్రాసారు శశికళ గారు..

శశి కళ said...

హనుమంత రావ్ గారు మీరు నా పార్టీయేనా?థాంక్యు



వెన్నెలా థాంక్యు.

శశి కళ said...

అక్కో వనజక్కా...)) నాకే పాపం తెలీదు .ఇదంతా కల్పితం చెప్పాను కదా...మనలో మాట షాపింగ్ వెళుతున్నాను లే...))


స్వాతి గారు వెల్కం ...థాంక్యు

jp said...

ఒక జంధ్యాల , ఒక శ్రీరమణ ,ఒక శశికళ ... మా పెదాలపై చిరునవ్వులు చిందేలా చేయడానికి వీళ్ళంతా వున్నారు . మిధునం కథ ప్రక్కన వుంచదగ్గదీ సత్యభామ సరదాలు.

శశి కళ said...

j.p గారు థాంక్యు