భర్త చిటికెన వేలు పట్టుకుని అమాయకంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన
నాకు అత్తవారింట్లో అడుగిడేనాటికి లోకం పోకడ తెలియదు.
బిఈడి చదివితే టీచర్‌గా ఉద్యోగం చేసుకుంటూ హాయిగా గడిపేయవచ్చని
అమ్మానాన్నలు చదివించారు, ఇద్దరిదీ ఒకే ప్రొఫెషన్ అయితే బావుంటుందని బిఈడి
చదివిన అబ్బాయిని తెచ్చారు. అలాగేనని పెళ్లి చేసుకున్నాను.
మాది నెల్లూరు జిల్లా కోట, మా వారిది గూడురు దగ్గర చెన్నూరు.
ఆయన మిత్రమండలి స్కూల్లో హెడ్‌మాస్టర్‌గా పని చేస్తూ మరో కోచింగ్‌సెంటర్‌లో లెక్కలు చెప్పేవారు. ఆయన దగ్గర లెక్కలు నేర్చుకున్న పిల్లలంతా పాస్ అవుతారనే పేరు ఉండేది.
నాకు నా కాళ్ల మీద నిలబడాలి అనే పట్టుదల ఎక్కువ. పెళ్లయిన ఏడాదికి పాప పుట్టడం,
వరంగల్ జిల్లా హన్మకొండలో నాకు ఉద్యోగం రావడం ఒకేసారి జరిగాయి.
ఆయనకు ఒకవైపు కెరీర్, మరోవైపు నేను.
నా కోసం ఆయన ఉద్యోగాన్ని వదిలి హన్మకొండకు వచ్చారు.
అక్కడే ఒక ప్రైవేట్ స్కూల్లో జాబ్‌లో చేరారు. తర్వాత బాబు పుట్టినప్పుడు ఆయన
ఆ ఉద్యోగం కూడా మాని బిడ్డను చూసుకున్నారు.
ఇదంతా నాణేనికి ఒక వైపు... రెండో వైపు చాలా చిత్రమైన అనుభవాలను మిగిల్చింది.
సమాజం చాలా చిత్రమైంది. ఒక్కొక్కరు ఒక్కోరకంగా మాట్లాడేవాళ్లు. ‘నువ్వు ఆడవాళ్లలాగా ఇంట్లో పిల్లలను చూసుకోవడం, పెళ్లాన్ని కూలికి పంపించడం ఏమిటి?’’ అంటూ సన్నిహితులు సైతం ఆయన వద్ద చెప్పే మాటలు తెలిసి భూమి కంపించిపోయినట్లయింది నాకు. ఆయన నోటి నుంచి వచ్చే ఒక్కో మాట ఒక్కో శూలంలాగ గుచ్చుకునేది. కానీ ‘ఎవరో ఏదో అంటే ఏమవుతుంది? మనం, మన కుటుంబం బాగుండడానికి ఏం అవసరమో అది చేయాలి. ఎవరో అన్న మాటల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటే నష్టపోయేది ఎవరు?’ అని ఆయనకు నచ్చచెప్పాల్సి వచ్చేది. ఆయనకు రెండుసార్లు టీచర్ ఉద్యోగం ఇంటర్వ్యూలో మిస్ అయింది. ఇలా కాదని నేను బలవంత పెట్టి కోచింగ్‌కి పంపించాను, మూడవ ప్రయత్నంలో ఉద్యోగం వచ్చింది. నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఆయన పోస్టింగ్ చాలా దూరంగా.
ఆయనకు ఉద్యోగం వచ్చిందని ఆనందించాలో, దూరంగా ఎక్కడో పోస్టింగ్
వచ్చినందుకు విచారించాలో తెలియని పరిస్థితి నాది. ఇక ముందుగా నేను ధైర్యం చిక్కబట్టికున్నాను.‘‘పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు ఉద్యోగంలో జాయిన్ అవండి’’
అని ఆయనకూ ధైర్యం చెప్పి పంపించాను.
ఇన్నేళ్ల మా వైవాహిక జీవితంలో నేను ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఆయన కోపం.
నాకు కోపం వస్తే మౌనంగా ఉంటాను. మాట జారితే వెనక్కి తీసుకోలేమని నా నమ్మకం.
ఆయన అలా కాదు కోపం వస్తే తిట్టిపోస్తారు. నేను ఓర్చుకోగలిగినంత సేపు ఓర్చుకుంటాను,
ఆ తర్వాత ‘‘మీరు తిట్టి ఏం సాధించారో చెప్పండి, నా మనసు కష్టపెట్టడం తప్ప’’ అంటాను.
ఆ మాటతో ఆపేస్తారు. ఆయన బలహీనతను భూతద్దంలో చూస్తే జీవితంలో మిగిలేది శూన్యమే.
నేను బెస్ట్ టీచర్ అవార్డు, బహుమతులు అందుకున్నానంటే ఆయన సహకారమే.
ఆయన సహకారంతో నేను కెరియర్‌లో చాలా సాధించాను, అలాంటి వ్యక్తిలో ఒక చిన్న లోపం.
కోపం వస్తే దాన్ని ఆపుకోలేరు. అది చిన్న సమస్యే కాబట్టి సరిదిద్దుకోలేనా,
సర్దుకుపోలేనా అనిపిస్తుంది. నేను కూడా ఇగోకు పోతే ఇరవై ఏళ్ల మా దాంపత్యం పరిపూర్ణంగా
సాగేది కాదు. అందుకే నేను అంటాను
‘అహంతో అణువునైనా జయించలేం, ప్రేమతో ప్రపంచాన్ని జయించవచ్చు’ అని.
- శశికళ, వాయుగుండ్ల, నెల్లూరు జిల్లా