Thursday, 12 May 2016

'24' ఏమనుకుంటున్నారు ?

'24' ఏమనుకుంటున్నారు ?
ఇది మళ్ళా మాట్లాడుదాము .
ముందు ఒక విషయం . దేవుళ్ళ గురించి బోలెడు
గొడవ ఇక్కడ . ఆయనేమో అందరి హృదయాలు నావే అని
చల్లగా కూర్చొని ఉన్నాడు .

అయ్యా గొడవ పడే వాళ్ళు ! మేము ఇక్కడ ఒకరి అభిప్రాయాలు
ఒకరం గౌరవించుకుంటూ ఒకరి పిల్లలకి ఒకరం పాటాలు
చెపుతూ భిన్నత్వం తో ఏకత్వం లో హాయిగా ఉన్నాము .
ఎవరి దేవుళ్ళు వాళ్ళ నమ్మకం .
మీ పర్సనల్ విభేదాల్లోకి మమ్మల్ని బలి చేయవాకండి .
అసలు వీళ్ళ విభేదాల్లో కి దేవుడినో , స్త్రీలనో లాగి
పరువు తీసే వాళ్ళు అంటే సంస్కారమే లేనట్లు లెక్క .
వాళ్ళ తల్లి కి కాని తెలిసి ఉంటె అసలు కని  ఉండదు
ఇలాటి వాళ్ళను . ఓయ్యో ! వాళ్ళ మొహాల దగ్గర
మైకులు పెట్టె వాళ్ళు ఆపండయ్యా . దేశ ప్రజల గౌరవం
పోతుంది . వీలయితే దేశ గౌరవం పెంచండి .


ఏమిటో ఈ ''24'' గురించి  వ్రాయరాదా అని లోపల నుండి ఎవరో
అడుగుతున్నట్లే ఉంది . మా పిల్లలు నేను చూడక ముందే
ఇది అమ్మకు నచ్చే సినిమా అని నిర్ధారించేశారు .
ముందు వేణు శ్రీకాంత్ బ్లాగ్ లో దీని రివ్యు సూపర్ గా ఉంది
చదివి రండి . నేను కూడా కొన్ని చెపుతాను .

venusrikanth blogspot link ikkada 24 review

మీకు ట్రైలర్ చూడగానే అర్ధం అయింది కదా ఇది
టైం మెషీన్ గురించి అని . కాకపొతే మన ఆదిత్య 369
లాగా చూసి రావడం కాక ఆ పాయింట్ లో మార్పు చేస్తే
ఎలా ఉంటుంది అనేది విక్రం గారు చక్కగా చూపించారు .
తమిళ్ వాళ్ళు ప్రయోగాలు చేయడం భలే ఇష్టం .
తెలుగులో ఒకే మూస . బహుశ మన వాళ్లకు నచ్చవేమో !
విక్రం గారు ఆదిత్య 369 చూడలేదు అన్నారు గాని
కొంచెం అలాంటి ఫిక్షన్స్ పోలికలు ఉన్నాయి .
కాక పొతే చక్కటి స్క్రీన్ ప్లే ప్రతి అంశాన్ని చివరికి
టోకన్ 144 ను కూడా వదలలేదు . దీనిలో మైనస్
అందరు చెప్పేది రెహ్మాన్ పాటలు సో సో గా ఉన్నాయి అని ,
కాని అంటే ట్యూ న్స్ కొంచెం మామూలువే కాని
లాలి పాట ,ప్రేమ దర్శనం పాటా అక్కడక్కడ వినిపిస్తూనే ఉన్నాయి .

మీకు '' ప్రకృతి ఉరిమితే '' కధ తెలుసా ? డైనోసార్ లను
చూడటానికి వెనుక కాలానికి టైం మెషీన్ లో వెళ్ళిన
యాత్రికుని కాలు కింద పడి  చనిపోయిన సీతాకోక చిలుక
వలన అతను ప్రెజెంట్ కి వచ్చేసరికి మొత్తం మారిపోయే
సంగతి . ఎక్కడ మనం పొరపాటు చేసామో , అక్కడకు
వెళ్లి దిద్దుకొనే వీలుంటే మొత్తం కధ మారిపోతుంది .
అదే విక్రం గారు చాలా ఆసక్తి గా చూపించారు . కామెడీ కొంచెం
ఉంటె ఇంకా బలే ఉండేది .

శివకుమార్ . తమ్ముడు విలన్ ఆత్రేయ . శివకుమార్ కొడుకు
మణి మూడు పాత్రల్లో సూర్య చక్కగా ఒదిగి పోయాడు .
శివ కుమార్ ,నిత్య (కీర్తి ) ల నెలల బిడ్డ మణి .
అప్పుడే 24 గంటలు ముందు వెనుకగా ప్రయాణం చేయగల
టైం మెషీన్ ను శివ కనుక్కుంటాడు . తమ్ముడు ఆదిత్య
దానిని సాదించుకొనే క్రమం లో వారిని చంపేసినా బాబు
వాచ్ మెకానిక్ గా శరణ్య దగ్గర పెరుగుతాడు . ఈ ప్రయత్నం
లో ఆదిత్య కోమా లోకి వెళ్లి పోతాడు . తిరిగి మేల్కున్నాక
వాచ్ ఎలా సాధిస్తాడు ? దానితో 26 ఏళ్ళు వెనక్కి వెళ్ళ గలిగాడా ?
లేక మణి దాని సహాయం తో అమ్మా నాన్న లను కాపాడుకున్నాడా ?
భలే సస్పెన్స్ . కాని కదా ఊరికే ముందుకు వెనక్కు ,ఎలా
తీసాడబ్బ ! చూడటానికే మనకు అర్ధం కావడం లేదు . అందరు
బ్రతకడాన్ని నేను అసలు జీర్ణించు కోలేక పోయాను . నిత్య , సమంతా
పెద్ద పాత్రలు లేకున్నా సో క్యూట్ . శరణ్య అయితే అమ్మ పాత్రలో
జీవించింది . ఇక టైం ప్రీజ్ చేసినపుడు వాన చినుకులు
ప్రీజ్ అవ్వడం సూపర్ . హాల్ అంతా చప్పట్లే .

నిజంగా మనం కాలం లో వెనక్కి వెళ్లగలమా ?వెళితే !!
అవును వెళ్ళ  వచ్చు . కాక పోతే మన ధ్యానం లో సూక్ష్మ
శరీరం తో , నమ్మరా ? అంతే ఇప్పుడు సైన్స్ అన్న తరువాత
అన్ని బౌతికంగా చూస్తె కాని నమ్మము . అప్పుడే గ్రహణాలు ,
గ్రహాల చలనం , తోక చుక్కలు కనిపెట్టారు టెలిస్కోప్
లేకుండా , అయినా నమ్మము .
ఒక పని చేయండి హైదరాబాద్ లో పిరమిడ్ మెడిటేషన్
'' న్యూటన్ , లక్ష్మి '' వాళ్ళ దగ్గరకు వెళ్ళండి . మీకు ఇప్పుడు
ఇబ్బంది పెట్టే పాత్ర తో గతం లో మీ అనుభందం ఎక్కడ
ఉందొ అక్కడకు తీసుకుని వెళతారు . అప్పుడు మీ తప్పును అక్కడ
ఒప్పుకొని రండి . ఇప్పటి పరిస్థితి అంతా ఎలా సవ్యంగా
మారుతుందో చూడండి .
ప్రతి ఒక్కరి పాత్ర ప్రతి ఘటన లో ఎంతో ప్రభావాన్ని
చూపుతుంది ,అది మంచికో చెడుకో అది వేరే సంగతి .
గుడ్ల గూబ ఈక ఈ సినిమాలో టైం మిషీన్ ని సృష్టించింది ,
కోమాలో ఉన్న విలన్ ని మేలుకొలిపింది . మంచి జరిగిందా
చెడు జరిగిందా ..... ఏమో ! వదిలెయ్యండి . మరి మీరు
పాల్గొనే జీవిత సంఘటన లను మీరు ఎటు వైపు
మరలించాలి అనుకుంటున్నారు ?
''Presence makes miracles whether it may be yours or mine ''

                                     @@@@@@@@@@

Friday, 8 April 2016

హమ్మయ్య ! ఉగాది కి ఊపిరి పీల్చాను

హమ్మయ్య ! ఉగాది కి ఊపిరి పీల్చాను 
అదేనండి ఊపిరి సినిమా లో ఊపిరి పీల్చాను . 

ఎప్పటినుండో .... ఎవరో ఫేస్బుక్ రివ్యు లో 
మొత్తం కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి నవ్వుతోనో !
ఏడుపుతోనో ! అని పెట్టినప్పటి నుండి ఈయనికి 
రిక్వెస్ట్ పెడితే కొన్ని పనులు ,కొన్ని వీలు కాదులు ,
కొన్ని క్రికెట్ లుగా రోజులు దొర్లి , దేవుడి దయ వలన 
మనోళ్ళు ఫైనల్ కి రాలేదు కాబట్టి ఈ రోజుకి 
వెళ్ళగలిగాను . ఇందు మూలంగా మీరు నాకు 
దేశ భక్తి లేదని మీరు భావించవద్దు . ఇన్ని వత్తిడుల 
మధ్య దేని కోసం అయితేనేమి నా దేశ ప్రజలు 
కేకలు వేస్తూ నవ్వుకునేది ఏదైనా నాకు 
''మామ్ '' '' జి ఎస్ ఎల్ వి '' ప్రయోగాలంత  గొప్పదే!
''లోకా సమస్తా క్రికెటో భవంతు ''
''సర్వేజనా సంతోషం భవంతు '' 

ఇది ఇంటచ్బు బుల్స్ కి రీమేక్ . మనకు చేరే రీతిలో 
మలచి పి వి పి వాళ్ళు తీసారు . కధలో ఎంత లీనం అయిపోతాము 
అంటే ఇప్పుడు లిరిక్స్ ఎలా ఉన్నాయి ,సీన్స్ 
ఎలా తీసారు మళ్ళా చూడాలి అనుకుంటున్నాను . 
కధ  చెప్పే ముందు మా వారు సర్టిఫికేట్ చెప్పేస్తాను . 
''అసలు సినిమా అప్పుడే అయిందా అన్నారు ''
ఆయన అన్నాడు అలాగ అంటే ఆ సినిమా కి  ఆస్కార్ 
వచ్చినట్లే ! 

కొంత వరకు మీకు తెలుసు కదా ,విక్రమాదిత్య (నాగార్జున )
చాలా హుషారు సాహసం గల బిజినెస్ మాన్ . 
పారిస్ లో గ్లైడింగ్ చేస్తూ కింద పడి చేతులు కాళ్ళు 
పారలైజ్ అయిపోయి వీల్ చైర్ లో ఉంటాడు . అతని 
పి . ఏ . తమన్నా (కీర్తి ) ఫ్రెండ్ లాయర్ ప్రకాష్ రాజ్ (ప్రసాద్ ) 
నాగార్జున ను చూసుకోవడానికి పెరోల్ మీద బయటకు వచ్చిన 
శీను (కార్తీక్ ) చేరుతాడు . తరువాత అతనికి చేరువై 
అతనిలోని డిప్రెషన్ తొలగించి నవ్విస్తాడు . కాని 
తన భవిత ను వదిలేస్తూ అతని సేవలు చూస్తూ కూర్చోలేడు 
కదా అందుకే '' మీకు బాధ పడే పరిస్థితి రాకుండా చూసే 
మనిషిని చూసాను '' అని అతనికి ఇష్టం అయిన ప్రియ ను 
కలిపేస్తాడు . 

నిజానికి ఇది ఒక కధ కాదు , ఒక డిసేబుల్డ్ పర్సన్ ,ఒక 
సామాన్య వ్యక్తి రెండు కోణాలలో చూపిన కధ . 
కధ లో మనం నవ్వుకుంటూ ఉంటాము . అటు శీను 
ఇంటి నుండి ఏదో ఒక ఎమోషన్ సీన్ , మళ్ళా ఇటు 
నాగార్జున తో ఉంటాము అటు ఏదో ఒక ఫ్లాష్ బాక్ , 
నిజంగా స్క్రీన్ ప్లే హాట్స్ ఆఫ్ . కంచె తరువాత 
మళ్ళీ మంచి సినిమా చూసాను . విక్రమాదిత్య కు 
బాగయి పోవడం లాంటి తెలుగు సినిమా ముగింపు లు 
పెట్టలేదు పైడిపల్లి వంశీ కాని ముగింపు లేకుండా 
కధ ఉండదు కాబట్టి చనిపోవడం కాకుండా ప్రియతో 
కలిపాడు . ఇది తాత్కాలిక ముగింపే , ఏదో పెయింటింగ్ 
అభిరుచి తో వాళ్ళు దగ్గర అయ్యారు . కాని నిజానికి 
దగ్గర అయిన తరువాత లోపాలు పెద్దవిగా కనిపిస్తాయి . 
అందులో చేతులు కాళ్ళు రెండూ లేనివాళ్ళతో సాహచర్యం 
అంటే గాంధారి లాగా జీవితం అంతా కళ్ళు కట్టేసుకోవడమే !

ఒక లిరిక్ ఉంది దీనిలో ''నీవేం ఇచ్చావో నీకైనా తెలుసా 
నేనేం పొందానో తెలుసా " 
నిజానికి శీను లాంటి భాద్యత లేని వ్యక్తి విక్రం కి ఎలా 
నచ్చాడు ?ఏమి ఇవ్వగలిగాడు ? 
అదే అడిగిన మిత్రుడు ప్రసాద్ తో ''వాడికి జాలి దయ 
లేవు . ఇప్పుడు నాకు వాడే కరక్ట్ '' అంటాడు విక్రం 
శీను యెంత జాలి దయ లేని వాడు అంటే కాళ్ళకు 
స్పర్శ లేదని వేడి నీళ్ళు పోసి నవ్వుకుంటాడు . 
అర్ధ రాత్రి విక్రం కి ఊపిరి ఆడనపుడు పట్టించుకోక 
ఐ . సి . యు లు చేర్చాల్సి వస్తుంది . ఇక వానిలో 
విక్రం కి కావాల్సింది జాలి లేని తనం . 

అంటే డిసేబుల్డ్ పర్సన్స్ సారీ పిజికల్లీ చాలెంజ్ద్ పర్సన్స్ 
ఇతరుల సానూభూతితో ఎంత విసిగి పోయిఉంటారో నాకు 
బాగా తెలుసు , స్వీయ అనుభవం.  అప్పటికీ నాకేమి 
పెద్ద లేదు పార్షియాల్ డెఫ్ , అదీ రెండిటి ఆడియో లెవల్స్ 
తేడా కాబట్టి మాట నాకు సరిగా అర్ధం కాదు చిన్నగా ఉంటె . 
ఇందిర గారు , ఏదో నాతొ అభిమానంగా చెపుతున్నారు . 
నాకు వినపడటం లేదు అని ఎలా చెప్పాలి , అది 
ఎలా ఉంటుంది అంటే జోలె పట్టి జాలి అడుక్కున్నట్లు . 
చెపితే అవతలి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో కూడా 
చెప్పలేము , నవ్వే వాళ్ళు కూడా ఉంటారు . మెల్లిగా 
ఆగమని చెప్పి చెవిలో దూది తీసి చూపించాను . 
ఏమి అనకుండా ఇంకొంచెం పెద్దగా మాట్లాడుతాను అని 
చక్కగా మాట్లాడారు . ఎంత చక్కని సంస్కారం తన 
పెదాల మీద ఉండే చిరు నవ్వు అంత  అందంగా . అది 
కదా కావాల్సింది !

డబ్బు ఉన్నా ఆరోగ్యం లేక పొతే సుఖం ఉండదు ,సుఖం 
సంతోషం ఎక్కడ ఉంటాయి వాళ్ళు వాళ్ళుగా ఉన్నప్పుడే ! 
శీను లో విక్రం కి నచ్చినది అదే , అతనిలో తన చైతన్యం 
తన పార్శ్వం కనిపిస్తూ ఉంది . ఆగిపోయిన తనలోని 
అదే హుషారు జోరు ఒక్కసారి ఇంకో రూపంలో , అందుకే 
శీనుకి విక్రం బాగా కనెక్ట్ అయిపోయి అతను డ్రైవ్ చేస్తుంటే 
తానె చేసినంత హ్యాపీ . ఆతను వదిలి వెళ్ళిపోతే తనలోని 
ఒక బాగం వీడిపోయినంత బాధ . ఫ్రస్టేషన్. మనకి కూడా 
కొందరంటే భలే ఇష్టమో ప్రేమో ఏదో ఒకటి కలుగుతూ ఉంటుంది . 
కారణం ఇదే , అక్కడ ఉండే మనమే . మనం మనంగా 
ఉండే అవకాశం సమాజం ఇవ్వదు . నియమాల మధ్య 
నడవమంటుంది . ఒక రకంగా మనం కూడా చేతులు కాళ్ళు 
లోలోపల పారలైజ్ అయిన స్టేజ్ లోనే ఉన్నాము . 
''నాకు ఎగరాలి అని ఉంది శీను '' అని విక్రం అన్నప్పుడు 
నిజంగా మనకు కూడా ఎగురుతున్న అనుభూతి ! 


ఇక ఆడవాళ్ళతో విక్రం రెండు సీన్స్ ఒకటి తనకు 
ఆక్సిడెంట్ అయినందువలన తనతో సుఖ పడదు అని 
బలవంతంగా నచ్చలేదు అని చెప్పి వదిలేసిన 
పాత ప్రేయసి నందిని ని విక్రం కలవడం . తనకు 
పుట్టిన పాప స్పర్శ ను మనసారా ఆస్వాదించడం . 
అదీ ప్రేమంటే ! తనకు నచ్చిన వాళ్ళు బాగుండాలి 
అని కోరుకోవడం , వాళ్ళ ఆనందాన్ని తానూ మనస్పూర్తి 
గా అనుభవించడం . అది ఫీల్ అయిన వాళ్ళు తప్ప 
ఇలాంటి సీన్ వ్రాయలేరేమో . 

రెండోది వీల్ చైర్ మీదే పారిస్ లో ఒక అమ్మాయి ని తనతో 
డేట్ కి ఒప్పించడం . నిజంగా నాగార్జున మన్మధుడు 
అనిపించడానికే ఈ సీన్ వ్రాసి ఉంటారు . అన్నీ ఉన్న 
భర్తలు కూడా అలా భార్యలతో ప్రవర్తించక వాళ్ళ 
థాంక్స్ కోల్పోవడమే కాక ద్వేషాన్ని రగిలిస్తున్నారు . 

నిజంగా పాత్రధారులు ఆ కేరక్ట ర్స్ కి ప్రాణం పోశారు . 
పాటలు , మ్యూజిక్ , కెమరా అన్నీ భలే ఉన్నాయి . 
చూడక పోతే మీరొక మంచి సినిమా మిస్ అయినట్లే :-)

                       @@@@@@@ 

Monday, 29 February 2016

మీ అమ్మ కూడా ఇంతేనా ? ఉత్తుత్తి నేనా ?

నివాస్ గాడు పూనే ట్రైనింగ్ కి వెళ్లి ఒకటిన్నర నెల . 
మూడు నెలలు అయితే కాని నెల్లూరు కి రానన్నాడు . 
ఎంత పిల్లలు పెద్ద అయిపోయారు అని మనసుకు 
సర్ది చెప్పుకున్నా తల్లి మనసుకు వాడు ఎలా ఉన్నాడో 
అనిపిస్తూనే ఉంటుంది (అందరికీ ఇంతేనా ?)
మంచి చెడు నేర్పెసాము . ఎంచుకున్న విలువలతో 
తన జీవితాన్ని సార్ధకం చేసుకుంటూ వెళ్ళడం ఇక వాడి పని . 
జన్మ ఇచ్చెసాము ,మంచో చెడో దానిని నడిపించుకోవడం 
వాడి చేతులోనే ఉంది . అబ్బ వాడి చిన్న చేతుల్లో ఇంత 
పెద్ద జీవితం పడుతుందా !
ఇంకా ఏమి చిన్నవాడు ..... చక్కగా మీసాలు వచ్చేసి ఓటు 
హక్కు కూడా వచ్చేస్తే .... 
అయినా సరే అప్పుడప్పుడు చూస్తె బాగుండును . 
హమ్మయ్య వీడియో చాటింగ్ లో దొరికాడు :-)

అదిగో రింగ్ అవుతూ ఉంది . వచ్చేసాడు బిడ్డ స్క్రీన్ మీదకి 
అమ్మా అంటూ ..... ఛీ ఇప్పుడే మా కెమరా బ్లాక్ అవ్వల్నా ?
వాడికి మాత్రం మమ్మల్ని చూడాలి అని ఎంత కోరిక ఉంటుంది !


సరే ఏమి చేద్దాము .... వాడినైనా చూడొచ్చు .... 
''ఏం డూయింగ్ '' అన్నాడు 

''చపాతి ఈటింగ్ '' నవ్వాను . 
''అబ్బ మా నీ చపాతి కూర తిని ఎన్ని రోజులు అయిందో '' 

''ఏది నీ రూం చూపించు రా '' 
చూపించాడు . పిల్లలు వీడి లాగానే ఉన్నారు . 
టి . వి చూపించాడు . ఏమి చూస్తున్నారు ?
ఓహో ..... మీలో ఎవరు కోటీశ్వరుడు ?

''తెలుగు వస్తాయా రా ?'' 
''అన్నీ వస్తాయి మా . నువ్వు ఎలా ఉన్నావు ?
నాన్న ఎలా ఉన్నారు ? విశేషాలు ఏమిటి ?''

''అందరు బాగుండారు . మాకేమి విశేషాలు ఉంటాయి !
నువ్వే చెప్పు '' 

''అమ్మ ఇక్కడ మూడు పూట లు చపాతీలే ,పావ్ బాజీ 
పాని  పూరి . పక్కనే పెద్ద మాల్ ఉంది . ఏమైనా దొరుకుతాయి '' 

అప్పుడెప్పుడో చూసిన వీడియో గుర్తుకు వచ్చింది . 
అక్కడ ఉండే స్టూడెంట్ కి పూనే అమ్మ సాంబారు చేసి పెడితే , 
చెనై లో ఉండే స్టూడెంట్ కి ఇక్కడ ఉండే అమ్మ అక్కడి 
వంటలు చేస్తుంది . అలాగ ఎవరైనా మమ్మీ అక్కడ నా బిడ్డకు 
దొరికితే బాగుండును . అసలే వాడికి టిఫిన్ అంటే ప్రాణం . 
ఎందుకులే వాడికి గుర్తు చేయడం . 

''ఒరే  అక్క కవిత చదువుతుందట '' 
ఓక నిమిషం విని , విననట్లు ఆక్షన్ . 
అందరం నవ్వుకున్నాము . 

''ఇంకేమిటి విశేషాలు ?'' ఈ ప్రశ్న అక్కడి నుండో ఇక్కడి నుండో 
పదిహేనో సారి అడగడం . 
ఏముంటాయి మాట్లాడుకోవడానికి !

కాసేపు ఎడుస్తునట్లు , నవ్వుతున్నట్లు , నాలుక బైట ఉంచి ... 
ఏదో వాడి తేలీ ఫిలిం అక్క్షన్ చేస్తాడు . పర్లేదు బిడ్డ కళ్ళ 
ముందు అల్లరి చేస్తున్నట్లే ఉంది . 

ఎవరు కనుక్కున్నారో ఈ వీడియో కాలింగ్ 
''శతమానం భవతి '' 

ఏముంది మాట్లాడింది ..... అంతా ఉత్తుత్తినే ..... 

అయితే నేమిటి నా బిడ్డ బాగున్నాడు అని తెలిసింది . 
వాడు ఏమి తింటున్నాడు అని తెలిసింది . 
ఫ్రెండ్స్ తో బాగున్నాడు అని తెలిసింది . 
జలుబు లేదు అనుకున్నాను . 
అన్నిటికి మించి అమ్మ తో మాట్లాడాను అనే తృప్తి వాడికి .... 

ఏమి లేదు కాని ...... ఏదో మరి అటు నుండి ఇటు , 
ఇటు నుండి అటు ప్రవహిస్తూ .... 
తల్లి బిడ్డలా బంధం అంతేనేమో ! 

మీ అమ్మ ఇంతేనా :-)
                    @@@@@@@@ 


Tuesday, 2 February 2016

కొన్ని విషయాలు చెప్పాలి

కొన్ని విషయాలు చెప్పాలి 

see this

ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకు ?
కొన్ని సార్లు కొన్ని విషయాలు ఎవరికైనా చెప్పాలి 
అనిపిస్తుంది . బహుశా అవి చెప్పక పోతే ఇంకో 
తరానికి చేరవు ఏమో! 

ఒక పదహారు ఏళ్ళకు ముందు విషయం .... 
ఇంటి పక్కన ఒక శ్రీ వైష్ణవుడు అయిన టీచర్ 
మా ఇంటి పక్కన ఉన్నారు . ఆయన ఇల్లాలు 
ఇద్దరు మంచివాళ్ళు . 
ఒక రోజు నేను వెళ్లి ''నాకు కనక ధారా స్తోత్రం 
నేర్పిస్తారా ?'' అని అడిగాను . 

''నువ్వు చదువమ్మా . తప్పులు పోయిన దగ్గర 
చెపుతాను '' అని ఓపికగా చెప్పారు . 
''నాకు మంత్ర పుష్పం నేర్పిస్తారా ?'' అడిగాను . 
సహస్ర శీరుషం  దేవం విశ్వాక్షం ...... 

''లేదమ్మా మంత్రపుష్పం స్త్రీలు చదవకూడదు ''
చెప్పారు . 
నేనేమి అనలేదు . పెద్ద వాళ్ళు ఒక మాట 
చెప్పారు అంటే యేవో కారణాలు ఉంటాయి . 

ఇప్పుడు శని సింగనాపూర్ గుడి లోకి స్త్రీలు 
ఎందుకు వెళ్ళ  కూడదు ? అయ్యప్ప గుడి లోకి 
స్త్రీలు ఎందుకు వెళ్ళ కూడదు ? ఎందుకు 
వివక్ష అని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు ? 

నాకు తెలిసిన విషయం ఏమిటి అంటే గుళ్ళోకి 
కొన్ని వర్ణాలు వెల్ల కూడదు అనేది మధ్యలో 
యేవో ఆధిపత్యాల వలన వచ్చింది కాని , 
ఇలా స్త్రీలు వెళ్ళ  కూడదు అనేది మాత్రం 
కొన్ని ఆ గుడి ఏర్పరిచిన సూత్రాల మీద ఆధార 
పడి  ఉంటుంది అనుకుంటున్నాను . 

ఇక్కడ గుడి నిర్మాణానికి ట్రాన్స్ ఫార్మర్స్ కి 
ఉండే సంభంధం సూచిస్తూ తీసిన ఒక షార్ట్ ఫిలిం 
లింక్ ఇద్దాము అనుకున్నాను . అది నాకు 
దొరక లేదు . 
అసలు భారత దేశ విజ్ఞానం ఎంత సైన్స్ ను 
చూపిందో జంతర్ మంతర్ లో చూస్తె తెలుస్తుంది . 
మధ్యలో వచ్చిన బ్రిటీష్ పాలన మన సంస్కృతిని 
దెబ్బ తీయడం  వలన సైన్స్ మీద ఆధారపడిన మన 
ప్రపంచం కుల మతాలుగా ,మూడ నమ్మకాలుగా 
మిగిలిపోయింది . 

శని సింగనాపూర్ నేను చూసాను . అది ఒక 
విగ్రహం కాదు , ఒక బండ లాగా ఉంది . 
నేను అనుకున్నాను బహుశా అది శని గ్రహం నుండి
పడిన శకలం అయి ఉండవచ్చు అని !
మరి అది శని గ్రహం నుండి పడినది అని మనవాళ్ళకు 
ఎలా తెలిసిందో . ఇంకా మనం వేరే గ్రహాల నుండి 
తెచ్చిన దూళి రేడియేషన్ మన మీద పడకుండా 
దీనికి ఎప్పుడు నువ్వుల నూనె తో అభిషేకిస్తూ 
ఉన్నారేమో ! ఆడవాళ్ళ గర్భాశయం విషయం లో 
మన వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవడం మనం 
గ్రహణం అప్పుడు చూస్తున్నాము . పాయింట్ వెయ్యో 
వంతు రేడియేషన్ కూడా తరువాతి తరానికి సోక 
కుండా అవి జాగ్రత్తలు . గ్రహాణ  మొర్రి నిజం 
కాక పోవచ్చు . కాని రేడియేషన్ శిశువుల మీద 
ప్రభావం చూపిస్తుంది అనేది నిజం . మరి ఆ విగ్రహం 
నుండి ఆడ వాళ్లకి ప్రభావం కలగా కుండా అది 
జాగ్రత్త కావొచ్చు . 

అయ్యప్ప గుడి కూడా అంతే . స్త్రీలు పెద్ద వాళ్ళు అక్కడికి 
వస్తారు . అది ఒక గుడి ప్రయాణం కాదు , నలభై రోజులు 
సంకల్పంతో మనసును జయించి బ్రహ్మచర్యం 
పాటించడం లో మనుషులు కు ఇచ్చే ట్రైనింగ్ . 
వారు వారి విధులను సరిగా పాటించెందుకే అక్కడకు 
స్త్రీల ప్రవేశం లేదు . వారికి ఆ విధి అవసరం లేక 
రాకూడదు అని చెప్పి ఉంటారు . 

మంత్రము అనేది ఒక ఎలెక్ట్రో మాగ్నటిక్ తరంగ 
సృష్టి ( దేవాలయ నిర్మాణం వీడియో దొరికితే 
చూడండి ) అది ఎన్ని హెడ్జ్ లలో వెలు వడాలో 
అంత స్థాయి లో వెలువడితేనే అది ప్రభావం 
చూపించవలసిన చక్రాల పై ప్రభావం 
చూపుతుంది . మంత్రం పుష్పం చదవాల్సిన 
గొంతుక స్త్రీ కి సరిపోదు . అందుకు వాళ్ళు 
చదవకూడదు . తెలుసుకుంటూ వెళితే మన 
సంస్కృతి లో విజ్ఞాన ఖని ఉంది . మధ్యలో వచ్చిన 
పెత్తనాల అజమాయిషీ లలో ఎంతో విజ్ఞానాన్ని 
కోల్పోయాము . ఈ రోజు అందరు మన సంస్కృతి 
ని ఎగ తాళి చేస్తుంటే ..... దాని వెనుక ఉన్న 
సైన్స్ ను మనం చెప్పలేని స్థితిలో తల వంచు 
కొంటున్నాము . 
మళ్ళీ ఎందరో మహర్షులు మహానుభావులు ఇవన్నీ 
చెప్పడానికి ఇక్కడకు రారు . మనమే మన తార్కిక 
జ్ఞానం పెంచుకొని ప్రతి కట్టడం వెనుక , సూత్రం 
వెనుక ఉన్న అసలు సూత్రాన్ని కనుగొనాలి . 
ఇంత  పెద్ద నిర్మాణాలు కేవలం మూడ నమ్మకాల 
కోసం చేసినవి కాదు . ఇన్ని నిభందనలు వివక్ష 
తో పెట్టినవి కాదు . 
స్వార్ధం తో పెట్టినవి మాత్రం ఖండించాల్సిందే !



''యత్ర నార్యంతు పూజ్యంతి తత్రే రమంతు 
దేవతా '' 
స్త్రీలు పూజింపబడు చోట దేవతలు చరించుదురు . 
వాళ్ళు పై లోకం నుండి రావలిసిన అవసరం లేదు 
మీరు ఇంట్లో ఆడవాళ్ళను గౌరవంగా చూసుకుంటే 
వారే మంచి మనసుతో దేవతలుగా మారి మీ ఇంటిని 
కాపాడుతారు . పరస్పర గౌరవమే మన భారత నిర్మాణానికి 
మూలాధారం . 



Thursday, 21 January 2016

మా నేల తల్లి (4) ...... ఎర్ర అరుగుల సీరీస్


మా నేల తల్లి (4) ...... ఎర్ర అరుగుల సీరీస్ 

maa nela thalli part 3 link ikkada

నా కంటే ఒక జానా పొడుగు ఉంటుందేమో ఆ అమ్మాయి !
అంత చక్కగా వంగి నాట్లు వేస్తుంటే నాకు 
భలేగా ఉంది . 
''నాన్నా , నేను కూడా వేస్తాను '' 
''వద్దు తల్లి బురద అవుతుంది '' 
అంతే చటుక్కున మట్టి మీద కూర్చొని ఊ చేస్తాను 
అని రాగాలు . అక్కడ నాయన ప్రాణం ఒప్పుకోదు .,
బిడ్డ ఏడిస్తే . ముద్దు వచ్చినపుడే చంక ఎక్కాలి అని 
ఏ బిడ్డలకు అయినా తెలుసు . 

నేను మడి  లోపలకు కాలు పెడుతుంటేనే 
ఆడంగులు అంతా అడ్డుకునేసారు . 
''వద్దు బుజ్జమ్మా , బురద పడిపోతావు ''అని 
నేనా వినేది  ''మరి ఆ యమ్మి పడిపోలేదే !''
 చూపించాను ఆ అమ్మాయిని . 

''ఆ యమ్మికి పని అలవాటు కావాలా తల్లే ,నీకెందుకు 
ఇయ్యన్నీ ?'' 

''నేను నేర్చుకుంటాను ''
''నువ్వు చదువుకుంటుళ్ళా  బుజ్జమ్మా , ఆ యమ్మి కి 
ఏమి లేదు . పనీ పాట రాక పోతే ఎట్టా బతుకుద్ది '' చెప్పారు . 

''నాన్నా '' పెద్దగా అరిచాను . 

''వెయ్యనీండి మే ''చెప్పేసాడు ''జాగ్రత్త '' అన్నాడు . 

ఇంకేంది దూకాను ..... బురదలో కాలు ఇరుక్కునిపోయింది . 
గౌను మీద మళ్ళీ బురద నీళ్ళు . కాలు లోపల 
నుండి లాగడం కష్టంగా ఉంది . అయినా భయపడి 
పారిపోతానా ..... 

పక్కనామే నాలుగు మొక్కలు ఇచ్చింది
 ''ఎయ్యి బుజ్జమ్మా '' 

చూసాను పక్క్కకి వాళ్ళు సర సర బురదలో మొక్కలు 
గుచ్చుకుంటూ వెళుతున్నారు . 
నేను వంగి లైన్ చూసుకొని ఒక్కటి గుచ్చాను . 
చేయి తీసేసరికి పడిపోయింది . మళ్ళీ లేపి గుచ్చాను . 
నిలబడింది . కాలు లాగుతుంటే బురద లో నుండి 
రావడం లేదు . ఆ అమ్మాయి ఎలా నడుస్తుందో !
పడుతూ లేస్తూ వాళ్ళ తోటే  గుచ్చేస్తుంది . 
ఇంకోటి .... ఇంకోటి .... 
హయ్య నాకు వచ్చేస్తుంది నారు 
వెయ్యడం . 

''అట్టా  కాదు బుజ్జమ్మ , అంత దూరం లో వెయ్యకూడదు ''
చెప్పింది పక్కనామే . 
వాళ్లకు అన్నానికి వేళ అయిపోతున్నా 
నాన్నకు కోపం వస్తుందని వేస్తూ ఉన్నారు . 

''అట్ట ఏస్తే కొన్ని నాట్లే  పడుతాయి ''
''పడితే '' అన్నాను 
'' మీ నాయనకే వరి తగ్గుద్ది '' చెప్పింది .
అమ్మో మా నాయనకు చానా వడ్లు రావాలి . 
దగ్గర దగ్గరగా గుచ్చాను . 

''అంత దగ్గరగా వెయ్యకూడదు బుజ్జమ్మా '' 
''వేస్తె '' 
''మొక్క ఎట్టా పెరుగుద్ది ?
 అప్పుడింక వెన్నులు ఎట్టా వస్తాయి ? 
దోమలు కూడా వచ్చేస్తాయి వెలుతురు పడక పోతే '' 

అర్ధం అయింది . దగ్గరగా వెయ్యకూడదు . దూరం గా 
వెయ్యకూడదు . అమ్మ ముగ్గులో చుక్కలు పెట్టినట్లు 
వెయ్యాలి . ఇది వచ్చేసింది కాని ఈ బురదలో కాలు ఎలా 
లాగాలో తెలీడం లేదు . చేతిలో మొక్కలు అయిపోయాయి . 
'
'ఇంకా కావాలి అన్నాను అటు వైపు నడుస్తూ . 
అంతే ముందుకు పడిపోబోయాను కాలు పైకి రాక . 
గబుక్కున పట్టుకున్నారు . 

''తల్లే నువ్వు వెయ్యబాకమ్మా !నువ్వు పడిపోతే సెట్టేయ్య 
మమ్మల్ని తిడతాడు . ఎళ్ళు బుజ్జమ్మా . గనిమ మీద 
కూర్చో పో '' అందరు బ్రతిమిలాడినట్లు చూస్తున్నారు , 
కొంచెం జాలి కూడా ! 

''సరే పాట  పాడండి అయితే '' 
అన్నాను పైకి ఎక్కి కూర్చొని 

''సెట్టేయ్యో !పాట  పాడితే సినిమాకి డబ్బులు ఇయ్యాల ''
నాన్నను చూసుకొని అడిగారు . 

''అట్టా గే  ఇస్తాను కానీండి మే , ఎప్పుడు సూసినా సినిమాలే 
కాపురాలు చేసేది లే '' అన్నాడు 

''వెంకటేసులన్నో ఎన్ . టి . ఓడి సినిమా , సూడాలన్నా '' 
గబా గబా హుషారు వచ్చేసింది వాళ్లకి పైన సూర్యుడి 
ఎండగా ఉన్నా , లోపల ఆకలి కాలుతూ ఉన్న .... 
ఇంకెంత కొంచెమే . మహా అయితే పది నిమిషాలు . 

ఇంత మందికి సినిమాకి ఇవ్వడము అంటే మాటలు కాదు . 
మా నాయన అంతే . పనిలో మెప్పిస్తే ఇచ్చేస్తాడు . 
అందుకే ఈడ కి రావాలి అంటే ఒక పక్క భయం ఉన్నా 
హుషారుగా ఉంటది వాళ్లకి . 

వాళ్ళు పాడే పాటలు వింటూ రెండు గె నాల మధ్య 
ఉన్న కాలువ నీళ్ళలో దిగి పరిగెత్తాను . 
దెబ్బకి బురద అంతా పోయింది . 

మడి  చుట్టూ రెండు రౌండ్లు పరిగెత్తే సరికి 
ఆడవాళ్ళు నారేతలు అయిపోయి 
మగోళ్ళ కు  సద్ది పొయ్యడానికి దూరంగా 
ఉండే చెట్లు కిందకు వెళ్లి పోయారు .

ఆ అమ్మాయి మాత్రం లేట్ అయినట్లు ఉంది 
ఒక్కటే సద్ది టిఫిన్ తీసుకొని నడుస్తూ 
దూరంగా కనిపించింది . 
ఇంకొంచెం దగ్గర కు వెళ్లేసరికి ఎవరో పెద్దోడు 
ఆ యమ్మి భుజం చుట్టూ చేతులు వేసి లాగుతూ ... 

ఆ పిల్ల ఒక్క విదిలింపు విదిలిస్తూ ఉంది . 
దగ్గరకు పరిగెత్తే సరికి నేను చూసే లోపల విదిలించుకొని 
వెళ్లి పోయాడు . 
ఆ పిల్ల మొహం లో .... ... ఒక్కటే అసహ్యం 
మూడు రెక్కలు విచ్చుకున్న రోజా పువ్వులో నాలుగో 
రెక్క ఎలా వస్తుందా అని తొంగి చూస్తె ఒక్క 
గొంగళి  పురుగు పాకుతూ వస్తే మొహం లో 
కనపడేంత అసహ్యం ..... ఏమిఅయి  ఉంటుంది ? 
తెలుసుకోవాల్సిందే ......దగ్గరగా పరిగెత్తాను . 

                              @@@@@        ( ఇంకా ఉంది )  

                        



Tuesday, 22 December 2015

మా నేల తల్లి (3)

( part 2 link ikkada )

''నాన్నా '' పరిగెత్తుతూ వస్తున్న నన్ను చూసి నాన్న
వెనక్కి తిరిగాడు . 
''చిన్నగా చిన్నగా '' ''అబ్బే మొద్దా ఏంది  ఈ బురద ''
అదంతా పట్టించుకోకుండా '' అటు చూడు అటు చూడు ''
గబ గబ అన్నాను . 
''ఏముంది అక్కడ !'' ఆశ్చర్యంగా అన్నాడు . 
''చూడు నాన్న మన చెట్లు అన్నీ ఎలా తొక్కేస్తున్నారో ''చూపించాను 
పక పక నవ్వాడు పొలం లోని మడి వైపు చూస్తూ .... 
మడి  లో నడుము అంత  పెరిగిన మొక్కల్ని దున్నేస్తూ తిరుగుతున్న 
కాడికి కట్టిన ఎద్దులు . 
''అది జనుము తల్లి , నేలకి సత్తువ '' 
''పేడ  చల్లారు కదా నాన్నా మళ్ళీ ఈ చెట్లు చంపడం ఎందుకు ''
''పంటకు పంటకు మధ్య ఇలా పేడ  , జనుము వేస్తె అది నేల తల్లికి 
భోజనం తల్లి. నువ్వు అన్నం తింటేనే కదా బలంగా ఉంటావు . 
నేల కూడా అంతే '' కొంచెం అర్ధం అయినట్లే ఉంది . 
ఆడవాళ్ళు వంగి నారు వేస్తూ ఉన్నారు . చేతులకు ఉండే గాజుల చప్పుళ్ళు , 
కొంచెం పైరు గాలి హాయిగా ఉంది . 
గనిమ మీద గోతం లో తెల్లగా ఆవాలు . పాలేరు కొన్ని బుట్టలోకి వంచుకొని 
నారు వెయ్యని పొలం లోకి దిగి చల్లుతూ ఉన్నాడు . 
ఇదేమిటి నాన్నను చూసి తల ఎగరేసాను . 
''అదీ బలానికే ఫాస్పేటు , మనకు బోలెడు పంట రావాలి కదా '' చెప్పాడు . 
''మరి ఇదే వెయ్యండి నాన్న . పేడ వద్దు యాక్ '' 
''తప్పు తల్లి . ఇది నువ్వు ఎప్పుడైనా పండక్కి స్వీట్ తింటావు కదా 
అలాగ ! జనుము , పేడ , నేలకు అన్నం కూరలు లాగా ,అవి ఎక్కువ తింటే 
నేల కి జబ్బే రాదు '' 
అర్ధం అయింది . నేనేమైనా మొద్దు పిల్లనా ఏమిటి !
''నాన్న అన్నం తెచ్చాను . తిందాము రా '' 
''ఉండమ్మా ఈ మడి నారేతలు అయిపోనీ , ఈ మోటార్ కూడా బాగు 
అయిపోతుంది . వాళ్ళు కూడా అన్నానికి వెళ్ళాలి కదా . 
ఈ రోజుకల్లా ఈ పొలం పూర్తి అయిపోవాలి . లేకుంటే కూలోళ్లు 
రేపు దొరకరు '' చూసాను . 
చీర దోపుకొని వంగి చిన్ని మొక్కలు సుతారంగా 
నేలలోకి నిలుపుతూ ముగ్గు జారినట్లే ఉంది ఆడవాళ్ళు ఏమి 
చేసినా ఇంత  అందంగానే ఉంటుందో ఏమో ! 
ముక్కు మీద జారుతున్న చెమట 
ముత్యాలుగా రాలుతున్నా తుడుచుకోకుండా
 శ్రద్దగా ఒక్కో వరుస వేసుకుంటూ ఉంటె 
,పై నుండే మబ్బు వాళ్ళను చూస్తుందో నీళ్ళలో 
దాని మొహాన్ని చూసుకుంటున్నట్లు నటిస్తుందో !
చుట్టూ చూస్తె ఎదురు గనిమ దగ్గర కొబ్బరి చెట్లు వరుసగా 
పక్కనే వీళ్ళ టిఫిన్ క్యారియర్ లు . ఏముంటుంది లోపల 
నాకు తెలుసు !మా అమ్మ మాకు కూడా అదే ఉదయం పెట్టేది . 

నిండుగా అన్నం . అది మునిగే దాకా నీళ్ళు . అందులో ఉప్పు కలిపి 
మేము రెండు చేతులు దోసిలిగా పడితే అందులో అన్నం పెడుతుంది . 
దాని మీద కొంచెం పచ్చడి . అన్నం కొంచెం అది కొంచెం అంతే !
ఒక్కో ముద్దకి బోలెడు చలవ . ఇక మధ్యాహ్నం బడి నుండి 
ఇంటికి వచ్చేదాకా ఆకలి అనే మాటే లేదు . అన్నం లో నీళ్ళు 
మా నాన్న తాగేస్తాడు . అందుకే మా నాయనకు బోలెడు బలం . 
నేను కూడా అలాగే తింటాను . అప్పుడు నాకు కూడా బోలెడు 
బలం వస్తుంది . ఇక నేలకి , దానికి బోలెడు బలం జనుము 
పేడ వేస్తున్నాము కదా !
 మా నాన్నకి పిల్లలు అయినా పొలం 
అయినా బోలెడు ప్రేమ . 

అయ్యా కొత్త బెల్ట్ బాగా పనిచేస్తుంది . 
మోటార్ వెయ్యమంటారా ?
మెకానిక్ అడిగాడు . 
నాన్న తల ఊపగానే మోటార్ వేయడం 
నీళ్ళు జయ్యని కాలవలోకి పోయి పొలాన్ని తడుపుతూ . 
''బాగుంది కదరా కొత్త బెల్ట్ , అంగడి లోకి  తెప్పిస్తాను ''చెప్పాడు నాన్న . 

ఏ కొత్తది అయినా నాన్నే ముందు వాడి చూస్తాడు . బాగుంటే 
అందరికంటే ముందే షాప్ కి తెప్పించి అమ్మేస్తాడు అది కూడా 
తక్కువ ధరకి . ఎక్కువ లాభం తో తక్కువ అమ్మే దానికంటే 
తక్కువ లాభం తో ఎక్కువ మందికి అమ్మాలి అంటాడు . 
అందుకే మా అంగడి అంటే చాలా ఇష్టం ఎంతో  మందికి. 

''రా బురద కడుక్కో '' 
నీళ్ళ తొట్టి లోకి దిగి తల నెమ్మదిగా మోటార్ కింద పెట్టాను . 
దబ  దబ నీళ్ళు ,ఉక్కిరి బిక్కిరి అయిపోయి తల తీసేసాను . 
పది సార్లు మునుగో మునుగు . 
బయటకి వచ్చి చూస్తె నాన్న ఇంకా పనిచేయిస్తూ ఉన్నాడు . 
రెండు చేతులు చాచాను రెక్కలు లాగా . జుయ్య్ .... 
గనిమ మీద పొలం అంతా పరిగెడుతూ .... రెండు సార్లు తిరిగే సరికి 
గౌన్ ఎప్పుడో ఆరిపోయింది . 
రెండో సారి పరుగులో చూసాను ఆ పిల్లని , నాకంటే కొంచెం పొడుగు . 
చేతిలో నార కట్ట పట్టుకోలేక అవస్థ పడుతూనే ఒక్కో మొక్క తీసి 
నేలలో గుచ్చుతూ ఉంది . మెల్లిగా అలవాటు పడుతున్న వేళ్ళు 
వేగాన్ని పుంజుకుంటూ ..... ఒక్కో మొక్క ఆ చేతి నుండి తీసుకోవడం 
విరగకుండా సుతారంగా గుచ్చడం , మధ్యలో మిగిలిన వాళ్ళ 
వరుస లో ఉన్నానా చూసుకుంటూ ఉంది . 
నాకు భలేగా ఉంది ఆ పిల్ల చేసే పని .... చూస్తూ ఉన్నాను 
ఆ చిన్న చేతుల వైపు , అవి పైకి లేస్తే నా చూపు కూడా పైకి , 
అవి కిందకి వెళితే నా చూపు కూడా కిందకి . 
ఒక నిర్ణయానికి వచ్చాను . 
అంటే మా నాన్నకి నాతొ ఇబ్బంది  మొదలైనట్లే మళ్ళీ 
'' నాన్నా '' పరుగు '' ఏమిటి తల్లి ? ''
'' ఏందంటే "
                          **********
                                                             ( ఇంకా ఉంది )



Monday, 14 December 2015

శార్వరి గారు దిగులుగా ఉంది

శార్వరి గారు దిగులుగా ఉంది 

ఆయన 12/12/15 తేది  శివైక్యం జరిగింది అని తెలిసినప్పటి
నుండి . ఇక ఆయన నుండి మార్గదర్శనాలు రావా ! 
అసలు నేను ఎందుకు బాధ పడాలి ?
ఆయన ఏమైనా నాకు మాష్టారా . కాదేమో ! అవునేమో ! 
కాని ఒకటి ఖచ్చితంగా చెప్పగలను నేను పోతున్న దారిలో నాకంటే 
ముందు నడిచిన వారు , ఇంకా తన అనుభవాలను గ్రంధస్తం చేసి 
నాలాంటి వాళ్లకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చిన వారు . 
ఇంత వ్రాసి మిమ్మల్ని కదిలిస్తున్న అక్షరాల వెనుక ఉన్న శక్తి నాది 
కాదు , అసలు నేను ఏమి వ్రాసానో .... వ్రాసిన తరువాత మళ్ళీ 
చదువుతాను అని ..... లోపలి అంతరిక శక్తుల మర్మం చెపుతారు . 

తొమ్మిదేళ్ళ క్రితం , ఒక సారి వడదెబ్బ కొట్టి చచ్చి బ్రతికిన 
అనుభవం తరువాత నన్ను ఇక్కడకు మళ్ళీ నా విన్నపాన్ని 
మన్నించి పంపినది ఎవరు , అసలు అక్కడ ఏమి జరుగుతుంది !
అనే ఒక ఆలోచన నాలో . ఎప్పుడూ మేలుకొని ఉన్నంత సేపు 
అష్టాక్షరి జపమే తప్ప  ఇంకొకటి నాకు తెలీదు .
 కాని దీనికి భిన్నమైనది ఇంకొకటి ఉంది . 
తెలుసుకోవాలి అనే తపన . 

ఇక్కడ పిరమిడ్ క్లాసెస్ రాఘవేంద్ర గారు , గాంధి గారు 
చక్కగా నడుపుతున్నారు అని తెలుసుకొని మా ఇంట్లో 
ఒక వారం క్లాస్ పెట్టమని అడిగాను . 
ధ్యానం తరువాత ఏమి కనిపించాయి అని అడుగుతూ ఉంటారు . 
ఏమిటి కనపడేది ! నేను సైన్స్ స్టూడెంట్ ని ఒక పట్టాన నమ్ముతానా !
తెల్లవారు జామున ధ్యానం చేస్తుంటే ఒక్క సారి నుదురు దగ్గర 
ఎలక్ట్ర సిటీ స్పార్క్ వచ్చినట్లు మెరుపు , ముందుకు వాలి పోతూ 
ఉంటె విష్ణు చక్రాలు లాగా ఒక వరుస .... ఏమిటివి ? 

మళ్ళీ సామూహిక ధ్యానం లో పొట్ట లోపలికి వెళుతూ ఉన్నట్లు 
ఏదో పైకి ఉబుకుతున్నట్లు .... ఒకటే నోట్లో నీళ్ళు ఊరుతూ , 
ఇంత మంది నేను లేస్తే డిస్టర్బ్ అవుతారు . మింగేసాను . 
ఏమిటది ? ఇంకో జవాబు తెలియని ప్రశ్న . 

సగం రాత్రి లేస్తూ ఉంటాను , ఏవో శబ్దాలు యేవో వాయిద్యాలు 
మ్రోగుతున్నట్లు , శివ లింగం నుండి వెలువడుతూ ఓంకారం .... 
ఏమిటి ఈ పిచ్చి కలలకు అర్ధం . ఎంతగా  లైట్ తీసుకో ఏవో భ్రమలు 
అని సర్ది చెప్పుకున్నా ..... ఒక్క గురువు ఉంటె బాగుండును . 
ఇవన్నీ చెప్పేవాడు కదా అని బాధతో ఏడ్చేదాన్ని . 
బ్రతికి ఉన్న బాబాలు , గురువుల మీద నాకు నమ్మకం లేదు . 
కాని నాకు ఒక గురువు కాక పొతే సందేహాలు తీరే జ్ఞానం కావాలి , 
అదే ఆలోచన . అసలు వీటిని ఎవరితో పంచుకోవాలి , పిచ్చిదాన్ని 
అనుకుంటారు . లోపల నుండి మాత్రం తెలుసుకోవాలి అనేబలమైన 
తపన .... రామకృష్ణ పరమహంస గారు చెపుతూ ఉంటారు 
''పక్క గదిలో ధన రాసులు ఉంటె దానిని పొందడానికి దొంగ 
యెంత తపన పడతాడో అంత  తపన పడాలి దేవుడి కోసం . 
అప్పుడే ఆయన నీ కోసం వస్తాడు '' అని . 
నిజంగా లోపల ఏదో వ్యధ , ఏదో కోల్పోతున్నట్లు , ఏదో కావాలన్నట్లు . 

అప్పుడు మా అక్క ఇచ్చింది ''అసతోమా సద్గమయా '' శార్వరి . 
ఆహా దప్పిక నీళ్ళు అడిగితే దేవుడు అమృతమే పంపాడు . 
మూడు పేజీలు  తిప్పగానే కళ్ళు మూతలు పడిపోతాయి . 
శరీరం ఉందొ లేదో ! తెరిపన పడాలి అనే అవసరం లేక పోతే 
నిద్ర లోకి వెళ్ళిపోవడమే . 
ఇక వరుస '' మాస్టర్ సి . వి . వి '' మాష్టారు గారి అద్భుత ప్రయోగాలు . 
నిజమా ఎలా నమ్ముతాము . పాలల్లో వెన్న ఉంది అంటే నమ్మేస్తామా . 
మాష్టర్ సి . వి .వి నమస్తే అనుకోండి , కుండలిని బోరింగ్ ఈజీ గా 
చేసేస్తాడు . అంత  ఈజీనా ! పట్టు పడితే తేల్చుకునేదాకా వదలను నేను . 

పైకి వెళ్లి  ఆకాశం చూస్తూ కూర్చున్నాను . మెల్లిగా కళ్ళు మూసుకొని 
మాష్టర్ సి . వి . వి గారు నమస్తే . ఏమి జరిగింది , ఏమి లేదు . 
కాదు ఏదో ఉంది . మెల్లిగా వెనుక వైపు ఏదో ఎగసి పైకి వస్తూ 
తల మొత్తం భారంగా , అలాగే చాలా సేపు కూర్చుండిపోయాను . 
ఇక అంతే  లైబ్రరీ లో శార్వారీ పుస్తకాలు వదలకుండా చదువుతూ ఉంటె 
వాళ్ళు '' మేడం శార్వరి వి ఎక్కువ చదవకండి . ఎవరికీ అలవాటు 
పడకూడదు . అందరి జ్ఞానం మనం తెచ్చుకోవాలి . జ్ఞానం ముఖ్యం '' 

''కుండలినీ '' అదిగో బుక్ దొరికేసింది . నా సందేహాలన్నీ తీరిపోతూ 
లలన చక్రం ఎనర్జీ వచ్చినపుడు నోట్లోకి ఊరుతూ అమృతం , ఇదేనా ! 
ఓహో ఇదంతా మనం మన లోపలి పోయే దారిలో ఒక క్రమం అన్న మాట . 
కొందరి దారి వేరేగా ఉండవచ్చు . 
''మృత్యోర్మా అమృతంగమయా '' ఆహా ఇక సందేహాలు పెద్దగా లేవు . 
ముందుకు పోయే దారి ఇంకా తెలుసుకోవాలని తప్ప . 
నాతొ చుట్టూ ఉండే కొందరిలో ఇప్పుడు ఆత్మీయత బంధం కనిపిస్తూ 
ఉంది . కాని వాళ్లకి తెలిసిన బంధాలతో దానిని నిర్వచించలేనపుడు 
వెల్లడి చేయడం లో ప్రయోజనం లేదు . ఎవరి జ్ఞానాన్ని వాళ్ళు 
ఆత్మ శాంతి పేరుతొ వెతుకుతూ ఉన్నారు . జ్ఞానం కలగనిదే 
ఆత్మకు శాంతి లేదు . జ్ఞానం అంటే ! దేవుడిని తెలుసుకోవడం కాబోలు . 
అలాగైతే ఇక ఆయనను చూడాల్సిందే ఎలాగైనా . 
ఇక చివరిగా చూసిన ఆయన బుక్ ''శంబల '' దానిని చదవాలి 
ఎలాగైనా , విశాలాంధ్ర వాన్ వచ్చినపుడల్లా అడిగేదాన్ని . 
లేదు మేడం , ఈ సారి మీకోసం తప్పక తెస్తాము అనేవాళ్ళు . 
ఒక రోజు నివాస్ ఫోన్ . 
''అమ్మా విజయవాడ లో బుక్ ఎక్జిబిషన్ లో ఉన్నాను . 
నీకేమి బుక్ తెమ్మంటావు ?"
నాకేమి ఇష్టమో వాడికి బాగా తెలుసు . 
''శంబల తీసుకుని రారా , శార్వరి గారు వ్రాసినది '' 
చెప్పాను . 
నా కొడుకు చేతుల్లో నుండి దానిని తీసుకున్నప్పుడు ఎంత 
ఆనందమో !! ఆపకుండా చదివేసాను . రెప్పలు వాలిపోతున్నా సరే . 
అవును శంబల , ఎనర్జీ లెవల్స్ బాగా ఉండే మాష్టర్స్ ఉండే చోటు . 
ఊరికినే మనం కారెక్కి వెతికితే కనిపిస్తుందా , కుదరదు అంత 
ఎనర్జీ లెవల్స్ కి పదార్దం చేరలేదు , ఆస్ట్రో ట్రావలింగ్ చేయాల్సిందే . 
మన కోసం శార్వరి గారు చేసి ప్రతి అనుభూతి అక్షరాలుగా 
మనకు అందించారు . ఎనర్జీ లెవల్స్ శరీరం భరించలేనంత 
చేరినపుడు వాళ్ళు శరీరం లో ఉండరు . వదిలేసి తేజో రూపాలకి 
వెళ్ళిపోతారు . మాష్టర్ సి . వి . వి గారు ఇది చాలా క్లియర్ గా 
చెప్పారు . అలాగే శార్వరి గారు కూడా వెళ్ళిపోయి ఉంటారు . 
శంబల కేనా !! మరి ఈ సారి ఆ విశేషాలన్నీ అక్షర రూపం 
ఎవరి ద్వారా రూపం దాల్చుతాయో , మాష్టార్ల సంకల్పం ఎలా 
ఉందొ . 
దేవుడిని చూడాలి అని పట్టు బట్టి ధ్యానం చేసాను కదా , 
ఇంతకీ అక్కడ కనపడింది ఎవరు .... నేనే !! అద్దం లో 
చూసుకున్నట్లు .... ఎంత  బాగున్నాను చూస్తూనే ఉండాలి 
అనిపిస్తూ ఉంది . మైనం పోసిన స్పూన్ నీళ్ళలో వేసి ఎండలో 
చూస్తె దాని చుట్టూ మెరిసినట్లు ఏదో మెరుపు పూత నా చుట్టూ . 
చూస్తూ ఉంటె ఎంత  బాగుంది . 
అన్నీ బాగున్నాయి కాని అక్కడ నేనే ఉంటె దేవుణ్ణి అడగాలి 
అనుకున్న వరాల లిస్టు ఎవరిని అడగాలి ? ఎవరి కాళ్ళకి 
మొక్కాలి !
                          @@@@@