నాన్న చెట్టు...నాన్న ఆకాశం...నాన్న సముద్రం...
మరి ఇంత గొప్ప మా నాయన స్పర్శ నేను ఎప్పుడు మొదటగా
పొంది ఉంటాను?
అసలు నేను ఈ గాలి ఈ నేల స్పర్శ ఎప్పుడు పొంది ఉంటాను?
రండి నాతొ చూపిస్తాను.
అదిగో కావలి లో ట్రంక్ రోడ్ పక్కన ఎర్రఅరుగుల ఇల్లు.
రెండు అరుగుల మధ్యలో ఆరు మెట్లు.మెట్లు దాటి లోనికి వెళితే
ఊచలు పెట్టి కిటికీలుగా చేసిన గది.అక్కడ చెప్పులు వదిలేసి లోపలి పొతే
దంతులతో కూడిన పెద్ద హాలు.....మధ్యలో ఒక పెద్ద దూలానికి
నల్లమానుతొ చేసిన పెద్ద ఉయ్యాల ఇనుప గొలుసులతో వేలాడతీసి...
గోడలకు పెద్దవాళ్ళ పటాలు,వినాయకునికి జ్ఞాన పలం ఇస్తూ
శివ పార్వతులు ఒక వైపు,
రామేశ్వర సైకత లింగం పూజించే సీతా రాములు మరో వైపు కొలువు
తీరి ఉంటారు.అదిగో అక్కడే పుట్టాను నేను.
బహుశా నేను పుట్టినపుడు ఇలాగా జరిగి ఉంటుంది.
ఇంత గంభీరంగా వ్రాయకూడదు అనుకున్నాను.
కాని ఈ దేశం లో రెండో అమ్మాయికి ఇంత కన్నా
గొప్ప స్వాగతం లభించదు అనేది వాస్తవం.
అదిగో మా పెదమ్మ,అమ్మమ్మ ,మేన మామ
ఎవరు వస్తారో అని ఆత్రుతగా ....
చిన్నగా ఏడుపు.ఆత్రుత గా చూసిన వారికి
పిడుగు పడినట్లే వార్తా.....మళ్ళీ ఆడపిల్లే :(
అమ్మ ఇది తెలియగానే మా మూడేళ్ళ అక్కను చూస్తూ
నన్ను చూస్తూ కన్నీటి సముద్రం అయిపోయి ఉంటుంది...
అయ్యో నేను ఈయనకు ఏమి చెప్పాల్నా అని?
పొంగిన దుఖాన్ని ఆపలేక దిండు మీదకు జారిపోతూ .......
అదిగో అమ్మమ్మ బాధతో వెనక్కి వాలిపోయి ఉంటుంది ...
అయ్యో మగ దిక్కు లేక పోయినా ఈ చిన్న పిల్లోడిని
పెట్టుకొని ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేసి సంసారాన్ని
ఎలాగో లాక్కోస్తున్నాను ...
ఇప్పుడు ఆ మొండి మనిషికి రెండోసారి ఆడపిల్ల పుట్టింది
అని చెపితే ఏమి చేస్తాడో ఎలారా భగవంతుడా
నా బిడ్డకు ఈ సమస్య వచ్చినే అని దేవునికి మొక్కుతూ
ఉంటుంది....
ఇక పెదమ్మకు బాధ తో చెంపలు తడిసిపోతుంటే
అమ్మ దగ్గిరికి పరిగెత్తుకొని వెళ్లిఉంటుంది...
దుమికే ధుఖం ''అక్కా''అని జాలిగా మొరపెడుతూ ...అమ్మని చూసి
కన్నీరైన పెదమ్మ''ఏడవగాకమ్మ ,బాలింతవి ఏడవకూడదు''అని తానూ
ముందుగా శోక సముద్రం అయిఉంటుంది.
వీళ్ళని చూసిన మావయ్య లేని పెద్దరికాన్ని పైన వేసుకొని
ఇద్దరి అక్కల బాధని ,అమ్మ భయాన్ని కలం లో నింపుకొని
కార్డ్ మీద కబురుగా ''మళ్ళీ అమ్మాయే పుట్టింది''అని వ్రాసేటపుడు
బాధతో,భయం తో చేయి వణికే ఉంటుంది....
ఇక చూడటానికి వచ్చే బంధువులు,స్నేహితులు
''అయ్యో చిన్నమ్మాయికి మళ్ళీ ఆడపిల్ల అంట''అని జాలితో
కూడిన ఓదార్పులు అమ్మ లోని శోకాన్ని ఇంకా ఎక్కువగా చేస్తూ....
అయ్యో పొత్తిళ్ళలో పడుకున్న నేను ఏమి చేసేది?
నా మొదటి శ్వాస ఇన్ని దిగులు కాగడాలు వెలిగిస్తుంది అనుకుంటే
నా మొదటి ఉనికి రెప్పల లోయల్లో
ఇన్ని కన్నీటి సునామీలు తెస్తుంది అనుకుంటే
పసి బిడ్డ గానే పుటుక్కున ప్రాణం వదిలేసి ఉందును....
పెరిగి ప్రపంచానికి ఏమి చేసాను కనుక....
అంతా చీకటేనా?ఇక అలాగే పెరగాలా?
కాదు ఎక్కడో ఆశ ఉండే ఉంటుంది....అమ్మ మనసు అందరిలో
మేల్కొని ఉంటుంది...
మా అమ్మకు దూరపు వరుస అయ్యే అత్త అని ఉంటుంది...
''చిన్నమ్మాయి పిల్ల గుమ్మడి పండులాగా ముద్దుగా ఉండే''
అమ్మ చిరు ఆసక్తి తో నా మొహం లోకి తొంగిచూసి ఉంటుంది.
ఇంకో పిన్ని అంటుంది''చందమామ లాంటి మొహం ,ఎర్రటి బుగ్గలు''
అమ్మ తప్పక వేలితో నిమిరే ఉంటుంది.
పెదమ్మ అని ఉంటుంది''రింగులజుట్టు,యెంత ముద్దుగా ఉందే పిల్ల''
ఇంకో పిన్ని అని ఉంటుంది ...
''నీకేమి దిగులు పల్లేదు పోవే తప్పకుండా ఏ రాజ కుమారుడో
వెతుక్కుంటూ వచ్చి తీసుకెళ్ళి పోతాడు,తెల్లటి పిల్ల''
అదిగో రాబోయే రాజ కుమారుడు కళ్ళలో మెదిలాడు
ఏమో అమ్మ పెదాలపై మెరిసిన చిన్న నవ్వు...
చిన్నగా నాపై తన పెదాల ముద్ర వేసే ఉంటుంది.
ఉబికి వచ్చే అమ్మతనాన్ని ఆపలేక చేతుల్లోకి తీసుకొని
హృదయానికి వెచ్చగా హత్తుకొని ఉంటుంది.
''అబ్బ అమ్మ స్పర్శ యెంత బాగుందో.....
పొట్ట లోకి బయటకు వచ్చినా ప్రపంచం బాగానే ఉందబ్బ''
చిన్నగా ''కుయి'' అన్నాను అమ్మని పలుకరిద్దాము అని.
''రాక్షసి ఆ గొంతు చూడు'' మావయ్య....మొదటి ముద్దు పేరు
పెట్టేసాడు.
పెదమ్మ,అమ్మ,అమ్మమ్మ అందరు నవ్వేసారు.
చిన్న పాప ఆగమనాన్ని స్వాగతిస్తూ...
పెరటి గోడ వెనుక బ్రహ్మం గారి మటం నుండి
ఆయన కూడా దీవించె ఉంటాడు
''మంచి దారిలో వెళుతావు తల్లి''
అని...... :)
ఇవన్నీ సరే మా నాన్న నన్ను ఎప్పుడు తాకి ఉంటారు?
అది ఎలాగా ఉంది ఉంటుంది?అసలు కావలికి వస్తారా?
లేక ఆడపిల్ల పుట్టింది అని అలుగుతారా?
నేను ఏమి చేస్తాను,నా పుట్టుక నాచేతిలో ఉందా?
రా నాయనా......నిన్ను చూడాలి.....
(ఇంకా ఉంది)
10 comments:
ఎంత ఆర్ద్రంగా రాసారు . నిజంగా మీకు జరిగిందేనా ?
very very very touching...and salutes to your spirit, Sasi Garu
మమ్మల్ని మీ ఇంటి వరకూ తీసికెళ్ళి చూపించేశారు. చాలా బాగా వ్రాసారు శశిగారు.
నాకు బాగా బాగా బాగా నచ్చిన పోస్ట్ ఇది శశిగారూ...
భలే రాశారండీ... చాలా బాగుంది..
తర్వాతి భాగం కోసం చూస్తున్నా..
శశిగారు, ఎంత అద్భుతంగా మీ ప్రపంచంలోకి లాక్కెళ్ళారు, ఎంత చక్కని శైలి.మరో భాగం లేకపోయినా సరే....రెప్పలలోయల్లో కన్నీటి సునామీలు, దిగుళ్ళ కాగడాలు చాలా గొప్ప పదబంధాలు.
"పెరిగి ప్రపంచానికి ఏమి చేసాను కనుక...."
చుట్టూ ఉన్న ఆనందాన్ని చూసే మనసు, ఇతరుల మనసును ఆలోచింపజేసే ఈ వ్రాతలు చాలవు(చాలవా?). తలరాత అనుకునే వారి ఆలోచనలు మార్చే, కనీసం ఆలోచింపజేసే, నిజాయితీగా ఎవరికి వారే ప్రశ్నించుకునేలా చేసే ఈ చైతన్యం చాలదూ.......
ఈ పరిస్తితులు లేని , ఈ పరిస్తితులపై పోరాడే చైతన్యం సమాజంలో పెరగాలి.
చాలా బాగుంది.
chalabaga raasarandi... tappakunda.. next post kuda chaduvutaanu
అయ్యో పొత్తిళ్ళలో పడుకున్న నేను ఏమి చేసేది?
నా మొదటి శ్వాస ఇన్ని దిగులు కాగడాలు వెలిగిస్తుంది అనుకుంటే
నా మొదటి ఉనికి రెప్పల లోయల్లో
ఇన్ని కన్నీటి సునామీలు తెస్తుంది అనుకుంటే
పసి బిడ్డ గానే పుటుక్కున ప్రాణం వదిలేసి ఉందును....
పెరిగి ప్రపంచానికి ఏమి చేసాను కనుక....
Okkasariga naku oppiri aaginatlu anipinchindandi. "పుటుక్కున ప్రాణం వదిలేసి ఉందును...." ee mata chadavagane.
guru prasad garu mee anandam lo mee nannagari prema choodagaliganu.oka vela yerra arugulu pustkam vrasthe meeku cheputhanu lendi.hyderabad lo untara ?
Post a Comment