Thursday, 14 February 2013

''ఐ లవ్ యు''....''ఐ ప్రామిస్ యు''

నాన్న వేలు పట్టుకొని(2)  
(ఒకటవ భాగం లింక్ )

 పాపం ఆ కార్డ్ ముక్కకు ఏమి తెలుసు ఇన్ని కన్నీళ్లు 
దోసిట్లో నింపుకొని కబురుగా మోసుకెళుతున్నాను అని...
చక్కగా అన్ని ఊళ్లు దాటి అదిగో నెల్లూరు జిల్లాలోని సముద్ర 
తీరప్రాంతాన ఉన్న కోటలో ......
అన్నం తింటున్న మా నాన్న ఒళ్లో వాలింది.
గబా గబా అక్షరాల వెంట పరుగులు మొహం సీరియస్ 
కళ్ళలో కోపం జీరలుగా విచ్చుకొని  .....

అన్నం పెడుతున్న మా నాయనమ్మ కి కొంత అర్ధం అయినట్లే ఉంది.
అయినా బెరుగ్గా ''ఏమైందిరా?''
నాన్న చేతిలో కంచం పెరట్లోకి పోయింది విసురుగా....కోపాన్ని 
మెతుకులుగా చల్లుతూ,పాపం దానికి ఉన్న సొట్టలలో 
ఇంకోటి అదనంగా చేరింది నా వలన ...

''ఆడ పిల్లంట ఎవురికి కావాలా?
ఆడే పారేసి రమ్మను"కోపంగా వెళ్ళిపోయాడు.
అక్కడే ఉన్న మా ఇద్దరు బాబాయి లకు ,పెళ్లి కాని ఇద్దరు 
మేనత్తలకు విషయం తెలిసిపోయింది.

విన్న మా జేజినాయన విసుగ్గా పశువుల కొట్టానికి పోయి
పొలానికి బండి కట్టిస్తా అక్కడి పశువులను చూసి విసుక్కున్నాడు
'ఏమిటో పశువులకేమో పనికి రాని కోడేదూడలు,
ఇంట్లో ఏమో పనికిరాని ఆడ పిల్లలు'

పాపం పెరట్లోని బాదం చెట్టు మీద నుండి మెతుకుల మీద వాలబోయిన 
కాకి కూడా ....కోపం వాసన వచ్చిందేమో ఈ కోపాన్ని కాకి కబురుగా 
కావలిలో మా అమ్మమ్మ వెనుక ఇంట్లోని బాదం చెట్టు పై కూర్చొని 
అరిచింది...వాళ్ళు ఉలిక్కిపడేటట్లు.
ఎలాగబ్బ ఇంకా మా నాయనను చూసేది?నిజంగానే పారేస్తారా?
అదిగో మా మేనత్తలు ఆ కబురు అందరికి మోసుకొని పోయి చెప్పేసారు.

నిజం గడప దాటే లోగా అబద్దం ఆరు వూళ్ళు తిరుగుతుంది అంట.
మరి ఆడపిల్ల కబురేమో వంద ఊళ్లు తిరిగేస్తుంది నిమిషం లో.....
మా మేనత్తలు అప్పుడే పెళ్లి అయి ఉన్న ఇద్దరు మేనత్తలకు 
కబురు కార్డ్ వ్రాయించే పనిలో ఉన్నారు...ఇదీ దీనితో పాటు 
పెద్ద వదిన నీళ్ళుపోసుకొని ఉంది అనేది (మా పెదమ్మ)

హ్మ్...వాళ్ళ కోపం లో కూడా న్యాయం ఉంది.అప్పటికే 
మా పెదనాన్నకి ఒక అడ పిల్ల,మా నాన్నకి ఒక ఆడపిల్ల 
ఇప్పుడు నేను రెండో దాన్ని ...అంటే వెరసి ముగ్గురు,
మరి వంశాంకురం ఎలా?
నాకేమి తెల్సు నాకు తెలీకుండానే నా ఊపిరి తగిలి 
వారి ఆశల కుండ బ్రద్దలు అయిందని :(
అదిగో మా పెదమ్మ కు పుట్టే వాళ్ళే ఇంక మిగిలిన ఆశ.

అదిగో పాపం నాన్నకు ఎవరు ఎదురైనా ఒకే మాట...
''ఏమి వెంకటేసులన్నా మళ్ళా ఆడ పిల్ల అంటనే?''

షాప్ కి వెళితే కొనుగోలుకు వచ్చే వాళ్ళు అడగడం....
''అయ్యో సెట్టేయ్యకు మళ్ళా ఆడ పిల్లంట...ఇచ్చో ..పాపం''

పొలానికి వెళితే అక్కడ కూడా పరామార్శలె...
హ్మ్...అందరి ముందు తల ఎత్తుకొని తిరిగే నాయన 
ఎన్ని సానుభూతుల బరువు మోయాల్సి వచ్చిందో.
అందుకే కోపం వచ్చి ఉంటుంది నా మీద.

అదిగో పెద నాన్న ,నాన్న ని జాలిగా చూస్తూ 
''ఏమిరా మళ్ళా ఆడ పిల్ల అంట కదా
హ్మ్...సరే కాని ఏమి చేద్దాము?''ఓదార్పు.

నాన్నకు భలే విసుగ్గా ఉంది.
''కనింది లే  ఎదవ @#$*#@ ఆడ పిల్లని ఉద్దరించడానికి ''
ఛా విసురుగా లేచి ఇంట్లోకి వెళ్లాడు.
పాపం మా మేనత్తలు,బాబాయి లు మాట్లాడటానికే 
జంకుతున్నారు.

ఇంక మా నాయనమ్మే అడిగింది.''వెళ్ళవా?"
మా నాయన గమ్మున ఉన్నాడు....మొండి వెళ్ళడు 
అర్ధం అయింది.
''ఎలాగా రా పదకుండో రోజున అయినా వెళ్లి పుణ్యావచనం 
చేయించుకోక పొతే,దేవునికి దీపం ఎలా పెడతాము?""
అయినా సమాధానం లేదు.
అయ్యో మా నాయన నన్ను చూసేదానికి వస్తాడో రాడో.
నిజంగానే మా అమ్మను పారేయ్యమంటాడా ఏమిటి?

నాకేమి తెలుసు నాయన 
దేవుడు మోసం చేసాడు 
నిన్ను మనిషిగా పంపిస్తున్నాను భూమి మీదకి 
అని చెప్పాడు కాని....
ఇలాగ పుడితే మీ నాయనకు  అవమానం అని చెప్పలేదు 
''ప్రామిస్ యు'' నాన్న నీ తల గర్వంగా 
ఎత్తుకునే పనులే చేస్తాను....
''ఐ లవ్ యు '' నాయనా 
ఒక్క సారి నన్ను చూడటానికి రావా ప్లీజ్.....

(పెదమ్మకి ఎవరు పుట్టారు అంటారా?అందుకే కదా 
''ఎర్ర అరుగుల కధలు ''సిరీస్ వ్రాస్తున్నాను .చదవండి.తెలుస్తుంది.)

10 comments:

జయ said...

మనసును కదిలించిందండి. Really, I feel for you.

వనజ తాతినేని/VanajaTatineni said...

చాలా బావుంది శశి.. మనసు తడి అయింది.
సిరీస్ అన్నారు అన్నారు ..వెరీ ఇంటరెస్టింగ్ .

శశి కళ said...

వనజ అక్క...ప్రస్తుతానికి వ్రాస్తాను.మీలాంటి వాళ్ళు ఎలాగో ఎంకరేజ్ చేస్తారు


జయ గారు..థాంక్ యు.మీతో మరీ పరిచయం లేక పోయినా ఎందుకో చాలా ఆత్మీయంగా అనిపిస్తారు మీరు

Unknown said...

'ఏమిటో పశువులకేమో పనికి రాని కోడేదూడలు,
ఇంట్లో ఏమో పనికిరాని ఆడ పిల్లలు':(((

జ్యోతిర్మయి said...

ఆడపిల్లనగానే వినిపించే మాటలు...కొన్నేళ్ళుగా పాతుకుపోయిన బావాలు....చాలా బాగా వ్రాస్తున్నారు శశి గారు.

A Homemaker's Utopia said...

చాలా బాగా రాశారు శశి గారు..:-)

జయ said...

శశికళ గారు, ఇది పరిచయం కాదా! మరి నాకూ అలాగే అనిపిస్తుంది కదా:)థాంక్యూ.

రాజ్ కుమార్ said...

silence...
waiting for next part..

శశి కళ said...

అవును సునీత గారు థాంక్యు

జ్యోతి గారు అవి జరిగినవే...థాంక్యు

శశి కళ said...

జయ గారు నిజమే ...ఫ్రెండ్లీ శశి కళ


హోంమేకర్ గారు థాంక్యు


రాజ్ థాంక్ యు :))