Saturday, 31 December 2011

కొత్త...కొత్తగా....ఇంకోసారి.....

ఇష్....నిన్నే......చెవి దగ్గర గుస...గుస.....
వేణువు మెల్లిగా  ఊదుతున్నట్లు...........
మనసుని చల్లగా మీటుతూ .......
నేను వచ్చేసా?
ఏమిటి?చిన్నగా గొణిగాను.....
మళ్ళా చల్లని  తెమ్మెర 
మనసు సంబరంగా గాలిలో తేలుతూ.....
ఎవరండి?....సమాధానం లేదు.....
చక్కని పరిమళం......నాసికా పుటాలపై ముగ్గులేస్తూ
చిన్నగా నవ్వు....సుపరిచితంగా......సముద్రం పై అలలాగా....


హే....ఎవరంటే మాట్లాడారేమిటి?
నీ కోసమే....అచ్చంగా నీకోసమే....వరాలు ఇవ్వటానికి వచ్చా....


"ఇంతకీ నువ్వు ఎవరు?
వరసకి నాకెవరు?
ఇంతగా వచ్చి,వచ్చి ఇస్తున్నావు...నేనెవరు?"


పెద్దగా పక...పక నవ్వు.....నేనేనమ్మాయి కొత్త సంవత్చారాన్ని.....
వావ్.....నువ్వా?అయినా నాకు పాత 2011 నచ్చింది.....
ఎందుకు?ఎందుకంటె.....ఈ సంవత్చరం నేను బ్లాగ్ ఓపెన్ 
చేసాను.సిస్టం నేర్చుకున్నాను.....కొత్త ఫ్రెండ్స్ వచ్చారు.....
అందరు మంచి వాళ్ళే.......


నేను కూడా నీకు అంతా మంచి చేస్తాను.......
ఎందుకు నాకు మాత్రమె?అందరికి చెయ్యి......


మరి నువ్వు మాత్రమె లోకాన్ని అందంగా చూస్తున్నావు...
నేను అద్దాన్ని మాత్రమే......నవ్వుతూ ఉన్నవాళ్ళకు 
నవ్వుతూనే కనిపిస్తాను.......చెడు చూసే వాళ్లకు 
చేదుగానే కనిపిస్తాను.......యెంత నిరాశ చీకటి అయినా 
ఆశ అనే దీపం తోనే తరిమి వెయ్యగలము......నన్ను నవ్వుతూ
చూసేవారికి  తప్పక మంచి చేస్తాను ......నీకు మాటిస్తున్నా 
సరేనా.......థాంక్ యు న్యూ ఇయర్.....2012.....


మరి మీకందరికీ హ్యాపి....హ్యాపి న్యూ ఇయర్....2012




మరి అందరు సంతోషంగా ఉండండి.....లైఫ్ సంతోషంగా 
పలుకరిస్తుంది........మరి మీ హాప్పినేస్స్ వెనుక ఏముంది 
అంటారా?


మెడిటేషన్ ,నా కుటుంబం,ఇంకా....no noise....only music....


నిజం మేమంతా చెత్త ప్రోగ్రామ్స్  చూడనే చూడం......మ్యూజిక్,
కామెడీ ఓన్లీ......


గృహస్తు తన ధర్మాన్ని తానూ నిర్వహిస్తే తక్కిన ఆశ్రమాలే 
కాక తానూ కూడా సంతోషంగా ఉంటాడు.....మన వారి తప్పులు 
చూడటం  మాని వాళ్ళలోని మంచి విషయాలు చూస్తుంటే 
వాళ్ళు మనకు కొత్తగా కనిపిస్తారు....కొంగ్రోత్తగా మురిపిస్తారు.....


మీ కోసం "నది"మాస పత్రిక ఎడిటర్ గారు వ్రాసిన 
గృహస్త ఆశ్రమం పై వ్రాసిన సంపాదకీయం.......


మళ్ళా ఒక్క సారి మీకు నూతన సంవత్చర శుభాకాంక్షలు 


"ముత్యాలా ధారలె.......మురిపించే రేయినే.....
నీ వళ్ళో హాయిగా....తీయ తీయగా నిదురించని....
థాంక్ యు ........2012"

Tuesday, 27 December 2011

నెమలీక......నవ్వు"లీక్"3

మా అత్తగారు వాళ్ళు నన్ను చూసి వెళ్ళిన తరువాత 
పెద్ద పండుగ అంటే సంక్రాంతి వచ్చేసింది.వాళ్లకు 
మాకు కూడా కిరాణషాప్స్ ఉన్నాయి కాబట్టి ఆ సీజన్ లో 
అందరం బిజి .తరువాత మా వాళ్ళు వెళ్లి వాళ్ళతో అన్ని 
మాట్లాడుకొని వచ్చారు.
ముచ్చటగా మూడో సారి మా పెద్ద మరిది గారిని తీసుకొని 
మా మామ గారు వచ్చారు నన్ను చూడటానికి.
నేను "నమస్తే"అని చెప్పాను.అయన నన్ను చూసి 
"మా వాళ్ళందరికీ నువ్వు నచ్చావమ్మ......మా అబ్బాయి 
రిజల్ట్స్ వచ్చాయి....సెకండ్ వచ్చాడు "అన్నారు.

బాబోయ్ సెకండ్ అనుకున్నా...తరువాత తెలిసింది 
సెకండ్ క్లాస్స్ అని...(నాకు ఫస్ట్ క్లాస్స్ ...ఇష్ చెప్పకూడదు 
ఆడపిల్లలం కదా)తరువాత పోటీ పరీక్షలకి వారె నాకు 
కోచింగ్ ఇచ్చారు ..అది వేరే సంగతి........
మా నాన్న వాళ్ళు మా మామగారితో మాకు నిశ్చితార్ధం 
అలవాటు లేదు ,లగ్న పత్రికలు మార్చుకుందాము అన్నారు.
సరే అని వాళ్ళు మార్చుకొని పెళ్లి మార్చ్ లో అని నిశ్చయించుకొని 
వెళ్ళిపోయారు........ఇంకా ఏముంది ?తరువాత...పప్పన్నమే....


 ఇక్కడ మా మామగారి గూర్చి చెప్పుకోవాలి.
చనిపోయి ఎక్కడ ఉన్నారో గాని మేము 
శెలవలకువస్తే "మీరు వస్తేనే కళ అమ్మా"అనేవారు.
కోడళ్ళను కూతుర్లు లాగా చూసుకొనే వారు.
ఆయన ఏడేళ్ళ వయసులో వాళ్ళ అక్క పెళ్లి 
చేసుకొని వస్తుంటే వాళ్ళతో వచ్చేసి ,
వాళ్ళ అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు.
మా అత్తగారు వాళ్ళు ఐదుగురు 
అక్క చెల్లెళ్ళు,ఒక్క తమ్ముడు ...అందరికి పెళ్ళిళ్ళు ,పురుళ్ళు 
అన్నీ ఈయనే చేసారు.మా మామగారు వాళ్ళు 
ఐదు గురు అన్నదమ్ములు ,ముగ్గురు అక్క చెల్లెళ్ళు....
ఇంకా చూడండి బందువులు యెంత మం...దో......
ఇంత మందిలో,ఇన్ని బాధ్యతలలో నన్ను మా నాయన 
ఎలా ఇచ్చాడో?


బహుశ ఇన్ని మమతాను బంధాల అల్లికలోనే 
కోహినూర్  శోబిస్తుంది అని కాబోలు.....

అబ్బో.....శశి కళ కోహినూరా......అంటే నా సమాధానం ఒక్కటే....
"తానె ఎరుపు అమ్మాయి తన వారిలోన"


"ముచ్చటైన పాపను చూసి 
మురుసుకుంటూ 
కాలి పట్టీల గల గలలు 
అరికాళ్ళలో పెదాల స్పర్శ నుంచి 
మీసాల గిలిగింతకు 
పాప నవ్వితే ....ముత్యాలు ఏరుకునే 
తండ్రి నడగండి.....కూతురు ఎవరని....



లంగా,ఓణి లో మురిసిపోతూ 
పాపటి బిళ్ళ కావాలి నాన్నఅని అడిగితె 
వెచ్చని ఊపిరిని ముచ్చటగా పాపటిలో 
అద్ది పొంగిపోయే తండ్రిని అడగండి ....
కూతురు ఎవరని.... 

పతి పక్కన పత్ని గా మారి 
కాటుక కంటిలో కన్నీళ్లు నింపిన
కన్నకూతురిని చూసి 
ప్రేమతో మనసు చెదిరిన 
తండ్రి నడగండి....కూతురు ఎవరని....


మమతల మాలలు మనసుకు హత్తుకుంటూ 
చెపుతారు ......వరాల మూట....వజ్రాల తునక అని....

అమ్మ నాన్నల ప్రేమ కు ఏ షరతులు ఉండవు.
ఇంకా మనలో లోపాలు పెరిగే కొద్ది మిగతా పిల్లలను 
వదిలి మనకే అండగా నిలబడుతారు.మిగతా వాళ్లకు 
చెపుతారు "మీకేమి రా మీకు అన్నీ ఉన్నాయి....
పాపం వాళ్ళకే...మేము వాళ్ళతోనే ఉంటాము"అని.
నువ్వు ఇలా ఉంటేనే  ప్రేమిస్తాము అనే సంగతి ఆ ప్రేమ 
లో ఉండదు.
మా వారు అంటారు"నేను నిన్ను ఇంత బాగా చూసుకుంటున్నా 
కదా....ఇంకా మీ అమ్మ,నాన్నలనే కలవరిస్తావే?"అని.....
నేను అంటాను"వాళ్ళు ఇరవై ఏళ్ళు సాకారు కదా....
మీరు అన్నేళ్ళు చూడండి ...అప్పుడు చెపుతాను "అని.


సమస్య ఏమిటంటే మొన్న మార్చ్ కి ఇరవై ఏళ్ళు అయిపోయినాయి.
ఇప్పుడేమి చెపుతున్నావు అంటారా?
పెద్దగా ఏమి లేదు......ఏమి కారణం చెప్పాలా అని 
ఆలోచిస్తున్నాను....తల్లి తండ్రి ప్రేమకు విలువ కట్టగలమా?

Friday, 23 December 2011

హ్యాపి...హ్యాపి....బర్త్ డే లు....మళ్ళి మళ్ళి చేసుకోగా....

హాయ్ శైలూ....ఇప్పుడే పుట్టిన చిన్నారి పాపకు 
శుభాకాంక్షలు.......
తొందరపడి లేయ్యొద్దు......ముందు అరచెయ్యి 
చూసుకో......
ఇదిగో దేవునికి దండం పెట్టుకో....


అన్య దైవమూ కొలువా.....
నీదు పాదము విడువా.......


ఇప్పుడు ఎంచక్కా మీ వారి వైపు ఓ లుక్ 
ఇచ్చెయ్యి......


ఇప్పుడు చక్కగా నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి రాపో....
నీకోసం బోల్డెంత హంగామా ఉంది......


ఇప్పుడు నువ్వు ప్రియబాంధవి లో అందంగా నీలిమేఘాలకు 
మెరుపు హంగులద్దినట్లు వర్ణించావే.....ఆ కాలి పట్టీలు వేసుకోమ్మా....


ఇప్పుడు నా విషెస్.....










ఇప్పుడు నీకు విషెస్ చెప్పటానికి నీకోసం 
ఎవరు వచ్చారో చూడు......
















ఇంకా ఏమి తెచ్చారో చూడు......






నువ్వు ఇలాగే ...హాప్పీ....హాప్పీ గా....బోల్డన్ని పుట్టినరోజులు 
జరుపుకోవాలని కోరుకుంటున్నాను......


 బజ్జు మిత్రులు ......ఎక్కడున్నారు?


శైల బాల పుట్టిన రోజు జ్ఞాపకాలకు 
మీ అభినందనల పరిమళాలు అద్దండి......
తీపి జ్ఞాపకం గా మార్చండి.......


all these are for u........

Saturday, 17 December 2011

ఎంతో విలువైనది......

ఎంతో విలువైనది......ఏమిటో తెలుసా?
మనిషి ప్రాణం.....ఎందుకంటె అది ఉన్నప్పుడే 
మిగతా విషయాలు.....ప్రాణం ఉన్నా సంతోషం 
ఎప్పుడో తెలుసా?.....ఆరోగ్యం గా ఉన్నప్పుడు......
అందుకే అన్నారు........
"ఆరోగ్యమే మహా భాగ్యము"

మరి మీరు ఆరోగ్యం గా ఉండి,మంచి మనసుతో 
ఉంటె చాలా ప్రాణాలు కాపాడ వచ్చు అంటే ఇంకా 
మంచి విషయమే కదా...........

మరి రక్త  దానం చేయాలంటే కావాలసినది 
ఆరోగ్యం,మంచి హృదయం మాత్రమే.....
కావాలంటే చూడండి ఒక ఆటో డ్రైవెర్ 50 సార్లు 
రక్త దానం చేసాడంటే అతని దగ్గర ఏముంది....
ఇతరులకు ప్రాణదానం చేయాలనే మంచి హృదయం తప్ప......




ఇంకా కింది విషయం చూడండి...కుటుంబం మొత్తం 
రక్త దానం చేస్తారంట......యెంత గొప్ప విషయం.....




అన్ని దానాలలొకి అన్న దానం ,విద్యా దానం ,రక్త దానం 
ఉత్తమమైనవి.మొదటి రెండు ఎవరైనా చేయగలరు.
కాని రక్త దానం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే చెయ్యగలరు.
ఆ అవకాశం వస్తే రక్త దానం చేసి మనిషి కి ప్రాణం పోసి 
వారి హృదయాలలో "మనీషి"గా నిలిచిపొండి.


ఈ రోజు ప్రపంచం చిన్నది అయిపొయింది ....కాని మనిషి 
ఒంటరి అయిపోయాడు....ఎందుకో తెలుసా?తను నలుగురు 
కోసం నిలబడితేనే,తన కోసం నలుగురు ఉంటారని
 తెలీకపోవటం వలన.......నలుగురితో సర్దుకోవటం 
తెలీకపోవటంవలన........భావోద్వేగాల పై నియంత్రణ 
లేకపోవటం వలన......మరి అవి అదుపులో ఉంటె జీవితం ఎలా ఉంటుంది......లింక్ లోకి వెళ్లి చూడండి......


ఉందా....ఉద్వెగప్రజ్ఞ.......ఉంటె అందరు మీ వెంటె...

Wednesday, 14 December 2011

నెమలీక......నవ్వు"లీక్"...2

మరేమో ఇప్పుడు చెప్పోచ్చేంది ఏమిటంటే .....
మా బుర్ర తినకమ్మా....పాయింట్ కు వచ్చెయ్యి అంటారా...
సరే....


మా మామ మా సంభందాన్ని కుదిర్చారు అని చెప్పను కదా...
నెమలీక....నవ్వు"లీక్" ౧.....మరి మేము మా వాళ్ళు

ఫిక్స్ అయిపోయారు...తరువాత జరిగిన కధ........


ఒక మంచి రోజు చూసి మా మామ,ఈయన ఇద్దరే పెళ్లి చూపులకు 
కోటకి వచ్చారు.(మరి మేము చదువుకున్న వాళ్ళం కదా .....
అందుకని మాకు చాయిస్ ఇస్తున్నట్లు బిల్డ్ అప్ )


నాకైతే పెద్ద సిగ్గుపడటం ఏమి లేదు కాని ఫస్ట్ సంబంధం కదా 
పెళ్లి చూపులు అంటే ఏమిటి అని కుతూహలం........
(ఈయనకు రెండోది ...వాళ్ళు ఇల్లరికం పంపమన్నారని 
మా అత్తగారు ఆ సంభందం చేసుకోలేదు)
మా చిన్న పిన్ని వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేసారు.మామయ్య
పెద్ద పిన్ని వాళ్ళ తమ్ముడే...ఇంకా నాకేమి భయం ........
(అసలు భయం మన డిక్షనరీ లోనే లేదు)


పాపం ఈయనకే బోల్డెంత టెన్షన్ (ఎక్కడ కుదిరిపోతుందో 
అని...ఉద్యోగం రాకుండా)...వీళ్లేమో ఏదో అడుగు బాబు...
అంటున్నారు....మనమేమో తల దించితే కదా......
ఎలాగో ఒక్క ప్రశ్న అడిగారు.....


"డిగ్రీ రీసెంట్ గా చేసారా?"అని....(మరి ఈయన ఇంజినీరింగ్ 
కోసం చానా ఏళ్ళు వదిలేసారు)


మనం వదిలిన తూటా లాగా...."అవును అండి....అన్నీ 
ఫస్ట్ క్లాస్ లే"ఒక్క నిమిషం లేట్ లేకుండా సమాధానం.


ఇంకేమి అడగకుండా 35 కి.మీ.....పరుగో...పరుగు...
ఎందుకా మరి చెన్నూరు అక్కడే ఉంది మరి........


వాళ్ళ అమ్మ "నచ్చిందిరా అమ్మాయి?" అని అడగగానే.....
ఈయన గారు గుక్క తిప్పుకోకుండా వల్లించేశారు...


"వై దిస్....శశికళ ....శశి కళ......డీ....
పిల్ల చూస్తె వైటు....వైటు......
చదువు బ్రైటు
ఆస్తి దేమిలే లైటు 
కాకపొతే స్టౌటు" 


మా అత్తగారు సరేలే పోనీ అన్నారు  అనుకున్నారా.....అక్కడే 
మీరు బస్తా పప్పు వండి దానిలో జర్రున ఈదినట్లు........


"హు...నీకేమి తెలీదు మేము పోయి చూసి వస్తాము" అనేశారు.


రెండో సారి మా అత్తగారు,బావగారు,తోడుకోడలు,మా మరిది 
వచ్చారు(పాపం ఈయనను తీసుకు రాలేదు ....బలి ఇచ్చే 
మేక అభిప్రాయం ఏంది అడిగేది అన్నట్లు).వచ్చి నన్ను 
చూసారు.పాట పాడమన్నారు.అసలైతే నేను పాటలు 
బాగా పాడేదాన్ని.....కాని నేను చడువుకున దాన్ని అన్న 
మాట మా పిన్నమ్మలకు......"మా అమ్మాయి పాడదు....
కావాలంటే ఒక లెస్సన్ చెపుతుంది"అనేసారు.
(నా మీద యెంత నమ్మకమో....ఎవరి ముందైన చెప్పేస్తాను అని)


సరే ఒక బుక్ చదివించండి అన్నారు(మన గొంతు వినాలి కదా)
చక్కగా చదివాను.


మా అత్తగారు తెచ్చిన పూలు,పండ్లు నాకు ఇవ్వటానికి 
నా దగ్గరకు వచ్చారు....చుక్క పెట్టి పూల పొట్లం తీసుకొని 
అది ఓపెన్ చేయటానికి దారం రాక అవస్తపడుతున్నారు.
నేను ఇటివ్వండి అని తీసుకొని ఓపెన్ చేసి ఇచ్చాను.
తరువాత పూలు జడలో పెట్టటానికి తంటాలు పడుతుంటే 
ఎంచక్కా హెల్ప్ చేసాను(మరి మనకు ఎవరికైనా హెల్ప్ 
చేయటమంటే బలే ఇష్టం)


(మరి అక్కడే నాకు బోల్డు మార్కులు వచ్చాయి వాళ్ళ 
దగ్గర నుండి....అయితే అది నాకు తెలీదు)


అంతే మా అత్తగారు ఇంటికి వెళ్లి మా వారికి క్లాస్స్ తీసుకున్నారు.
"అమ్మాయి చాలా హుషారు,చదువుకుంది,మంచి అమ్మాయి(?)
మీకిద్దరికీ ఉద్యోగాలు వస్తే చాలా సంతోషంగా ఉంటారు అని....."


మళ్ళ మా వారు.....వై...దిస్....శశికళ....శశికళ....డీ.....


వెంటనే మా అత్తగారు "జుయ్"అని అశ్వనినాచప్పలా
పరిగెత్తి వెళ్లి .....తిరిగి వచ్చి ఒక పోటో మావారి చేతిలో 
పెట్టారు.......అది ఆమె భావగారిని చిన్నప్పుడు ఎత్తుకొని 
తీయించుకున్న పోటో...."చూడురా నేను పెళ్ళికి ముందు 
ఎలా ఉన్నాను ....అన్న పుట్టిన తరువాత ఎలా ఉన్నాను...
మేము సంతోషంగా లేమా.....గుణం కావాలి కాని"అన్నారు.





(మావారితిక్కకుదిరింది......లేకుంటే నిండు జాబిలికి నెలవంక లా లేదని వంక పెడతారా?)


అక్కడ మా మామగారు ఆల్రెడీ మా నాన్నను చూసి ఫిక్స్ 
అయిపోయారు.


(అదంతే వాళ్ళు నాన్నలనే చూస్తారు)


ఇక వాళ్ళ తమ్ముడు ..అంటే మా మరిది ,మా వారికంటే 
ఒక సంవత్చారం చిన్న అంతే...ఇద్దరు ఫ్రెండ్స్ లా ఉంటారు.
"అనా చేసుకో,ఇద్దరికీ జాబ్స్ వస్తే నీ లైఫ్ ఎలా ఉంటుందో 
చూడు"అని గట్టిగా చెప్పేశారు.


ఇంకేమి చేస్తారు పాపం.....
కళ్ళలో ప్రాణాలు పెట్టుకొని అందరి వైపు దీనంగా ఒక 
లుక్ ఇచ్చారు.....ఊహు....ఎవ్వరు కరగలేదు.......
అలా ఆయన్ని ఫిక్స్ చేసేసారు వాళ్ళు.
(ఇప్పటికి రెండు అన్కాలే చెప్పాను కదా....ఇంకా మూడో 
అంకం ఉంది...అది ఎప్పుడైనా)


ఏమిటి మీవారు ఇంకా....కొలవారి..డీ ఏనా ...అంటారా?
కాదులెండి.....ఇలా పాడుతుంటారు ఇప్పుడు.........


మల్లెపూలు జడను పెట్టి ,మొగలిరేకులు 
జడకు చుట్టి ,హంసలా నడిచి వచ్చా .....మావయ్యా....
నీకు కట్నం యెంత కావాలో చెప్పయ్యా........అని నేను అంటే.....


అద్దమంటి మనసు ఉందీ ,అందమైనా సొగసు ఉందీ...
ఇంతకన్నా ఉండేదేంది చిట్టెమ్మా
నువ్వే నాకు కట్నమమ్మా చిట్టెమ్మా........అంటారు...


అంటే ఇంత బాగా అనటం ఆయనకు రాదు లెండి....
నేనే మీకోరకు అమందానంద కందళిత హృదయానందనై, 
తదీయ భావార్ద సారమేల్ల మాధుర్యమున తేలించి 
పూసౌరభాముల ముంచి ,శరత్చంద్రికా శీతాంశ కిరణాల 
దొర్లించి,కోయిల  కూజితముల రవళించి,మదీయ కలము 
హృదయాన అక్షరముగా విరియించి,భావశకలాలను
ఈ పోస్ట్ యందు విరాజిల్లచేసితిని.


మరి ఆయన ఏమి వచింపరా?అంటే....కళ్ళతో....నవ్వుతో 
వచియించేదారు.....కొండొకచో హృదయముతో కూడా.....


హా.....మరిచితిని ....వారు ఆవేశం వచ్చినపుడు "కావి" లు 
చెప్పెదరు.అవి ఏమిటి అంటున్నారా?కావి ...లు అంటే 
కాపురం లో చెప్పేవి . ఏమిటి ఒక్కటి చెప్పమంటారా?


శశి నాకు కవిత చెప్పాలనుంది నీ మీద అనగానే .....
నా కళ్ళ లో భయం.....నా వళ్ళంతా వణుకు.......


అప్పుడు గాని కాళిదాసు గారు నన్ను చూస్తె"కవితా భీత 
హరితెక్షణ"అంటారు......శ్రీ.శ్రీ.గారు చూస్తె....."కవితా పీడిత 
తాడిత ,ఓడిత,నారి"...ఇంకా ఎందుకు నిలుచుంటావు?
పొమ్ము  ముందుకు పొమ్ము దూరంగా...పొమ్ము  ముందు ...
అంటారు.....ఇక గిరీశం గారైతే ....ఫుల్లు మూన్ వైటట....
కవితేమో సంకట.....శశి పరిస్తితి వాట్ అట.......అనేస్తారు.


అయినా సరే ఒకటి చెప్పాల్సిందే అంటారా?
సరే మీ విధి మిమ్మల్ని అలా అడిగిస్తుంది........


"చలికాలం లో దుప్పటి నువ్వే 
ఎండాకాలం లో ఏ.సి.నువ్వే 
నా జీవితానికి సిలబస్ నువ్వే 
కొన్ని నవ్వులు ఇచ్చి పాస్ చేయ్యేవే"


"కెవ్వ్ ..వ్వ్...వ్వ్....వ్వ్...."నేను చెప్పానా ఎవరో పడిపోయారు?
వాళ్ళను లేపండి ముందు.......

Saturday, 10 December 2011

అసతోమ సద్గమయా........

విశ్వాసమే సాధనకు పరిపక్వత నిస్తుంది.

దత్త చరిత్రలో దంపతులు స్వామి చెప్పినట్లు ఎండిన కొమ్మకు 
నమ్మకం తో నీళ్ళు పోస్తే అది చిగుర్చటం 
చూస్తాము.

గురువు యందు గురి ఉంటేనే లక్ష్యాన్ని తొందరగా చేరుకోగలము.

మరి బారతీయులు గురువును ఆశ్రయించుటలో
ప్రధాన లక్ష్యం ఏమిటి?విశ్వవ్యాపితమై నిర్గుణ రూపంగా 
విలసిల్లుచున్న పరబ్రహ్మ ను చూడటమే.

"అసతోమ సద్గమయా"సత్యం వైపు నడిపించు.

గురువు దారి చూపేవాడు.ఆ దారిలో సాధన చేయటమే 
సత్యాన్ని తెలుసుకోవటమే వారికి ఇవ్వగల గౌరవం .
సత్యాన్ని మరచి,సాధన మరచి తనను కొలవమని 
ఏ గురువు కోరాడు.గురువు కూడా సహా సాధకుడే.


నేర్చుకోవాలే కాని ప్రక్రుతి లోని ప్రతీది చెట్టు,నది,
పురుగు,జంతువూ,గాలి ,మన పక్కన వారు ఏదో 
ఒక విషయం నేర్పిస్తారు.ప్రతి వారి లోని పరమాత్మ 
ను గౌరవించమని చెప్పటమే దత్తాత్రేయ,సాయిబాబా
వివిధ అవతారాలలో కనపడిన ఉద్దేశ్యం.

గురువులు,మతాలూ అన్నీ లోపల బియ్యపుగింజ 
ఏర్పడటానికి సహకరించే పైన ఉన్న పొట్టు లాంటివి.
మనలో సత్యావిష్కరణ జరిగిన తరువాత మనము 
ఉండము ,అవీ ఉండవు.

"అఖండ మండలాకారం వ్యాప్తంచేన చరాచరం"

ఏ సత్యం కోసం ఇన్ని దారులు నిర్మింప బడినాయో
ఆ సత్యాన్ని విస్మరించి ఈ దారులు గొప్పదనాన్ని 
గూర్చి వాదులాడుకోవటం మన సాధనకు ఉపయోగ పడదు.


శిష్యుడు సాధనతో పరిపక్వత చెందినపుడు తదుపరి
 మార్గం వైపు మార్గదర్శనం చేయటానికి గురువు వచ్చే తీరాలి.
కాని గురువు ఏదో ఆకాశ మార్గం లో వస్తాడు అనుకోవటం 
భ్రమ.మన లాంటి మనుషులు లాగానే కనిపిస్తాడు.
ఇవ్వాల్సిన సందేశం పంపిస్తాడు.

ఇహ లోక సుఖాల బావి నుండి మనను బయట పడవేసి 
అనంత విశ్వాన్ని ,సత్యాన్ని చూపే తాడు లాంటి వాడు 
గురువు.ఆ తాడుకి దూరంగా జరిగి ఆ సత్యాన్ని 
తెలుసుకోవటమే మనం ఆయనకీ ఇవ్వగల గౌరవం.

"అజ్ఞాన తిమిరాన్ధస్యజ్ఞానంజన శలాకయా
చక్షురున్మేని తంఎన తస్మైశ్రీ గురువేన్నమః "

జ్ఞాన మనే కాటుక కనులకు పూసి అజ్ఞానమనే 
చీకటిని తొలగించు వాడే గురువు.అలాంటి గురుపరంపరను 
తనలో కలిగి ఎందరినో జ్ఞానవంతులు చేస్తున్న 
భారతమాత వడిలో జన్మించినందుకు మనం ఎంతో
అదృష్టవంతులం.


 

Monday, 5 December 2011

నెమలీక....నవ్వు "లీక్"

అందరికి మా బాబు పుట్టిన రోజుకి ఆశీస్సులు 
ఇచ్చినందుకు థాంకులు...............



దానికి ప్రతిగా ఈ నవ్వు "లీక్స్"
అంటే ఏమి లేదులే.....తూచ్.......


మరి నేమ్లీక ఏమిటి అంటారా....కొంచం మంచు లచ్మి 
స్టైల్ లో కాకర కాయ లాగా కమ్మగా మాట్లాడుదామని......


మా పెళ్లి  ఎలా అయింది అప్పుడప్పుడు నేను 
మా వారు చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటాము
అవన్నమాట.....


(ఏమిటి మీ వారు నవ్వుతారా?ఏడుస్తారా?అని 
.....ఎక్కడో ......)


ఇప్పటికే మిమ్మల్ని రెండు నెమలీకలు ఇచ్చాను .....
గుర్తున్నాయా?మళ్ళీ ...ఒ...సారి వాయొలెన్స్


ముందుంది ముసళ్ళ పండగ



అప్పుడు నేను అప్పుడే బి.ఇడి పరీక్షలు వ్రాసాను అన్న మాట.
మా నాన్న వాళ్ళు నలుగురు అన్నదమ్ములు .మా నాన్న 
రెండో వారు.వాళ్ళు అందరు కలిసి నాకు సంభందం చూడాలని 
గూడూరు లో మా మామ ఒకాయన ఉంటె ఆయన దగ్గరికి వెళ్ళారు.


ఆయన మీ అమ్మాయి బాగా చదువుకుంది(అప్పట్లో అదే గొప్ప)
మీకు చెన్నూరు లో ఒక అబ్బాయిని చూపిస్తాను.ఆ అబ్బాయి 
కూడా ఇప్పుడే బి.ఇడి వ్రాసిఉన్నాడు
(మరి ఈయనగారు ఇంజనీరింగ్ కోసం కొన్నేళ్ళు 
వేస్ట్ చేసి నా క్లాస్ మేట్ అయిపోయారు,వేరే 
కాలేజ్ లెండి)అని చేన్నూరికి తీసుకుని వెళ్ళారు.


అక్కడ వీళ్ళ ఇంటికి కాకుండా మా భందువుల ఇంటికి వెళ్లి , 
మొదటవీళ్ళకి  చెప్పి పంపారు.అప్పుడు ఈయన టెన్త్ మాథ్స్
 ట్యూషన్ చెప్పేవారు.డిగ్రీ చదివేటప్పుడు నుండి చెప్పేవారు.
ఈయన ఉంటె మాథ్స్ ఎవరు ఫెయిల్ అవరని నమ్మకం.


మా భందువుల అమ్మాయి ఈయన దగ్గరే ట్యూషన్.
ఈ అమ్మాయి ట్యూషన్ కి వెళ్లి "ఈ రోజు సురేష్ సార్ పూర్తిగా 
చెప్పకుండానే వెళ్ళిపోతారు చూడండి "అని చెప్పిందంట.
(ఇవన్ని నాకు పెళ్లి అయినాక తెలిసాయి)


మా వారు ఏమోలే అనుకోని ప్రాబ్లం చెపుతూ ఉన్నారు.
ఇంతలో వాళ్ళ తమ్ముడు వచ్చి "అమ్మా వాళ్ళు పిలుస్తున్నారు"
అని తీసుకెళ్ళి పోయాడు.


అక్కడ మా వాళ్ళు కూర్చుని ఉన్నారు.పాపం ఈయన 
బలికి సిద్దమైన మేకలా బుద్దిగా కూర్చుని అడిగిన సమాధానాలు 
అన్నీ చెప్పారు.


అక్కడ మా వాళ్ళు ఈయన సమాధానాలకి ఫ్లాట్ అయిపోయారు.
మా చిన్న బాబాయికి అయితే బోల్డంత నచ్చేసారు ఈయన.
మా బాబాయి ,పిన్ని నన్ను సొంత బిడ్డలాగా చూసుకొనే వారు.


(మా నాయనమ్మకి నలుగురు అబ్బాయిలు,నలుగురు 
అమ్మాయిలు ...మా పెదనాన్న పెళ్ళికి మా చిన్న బాబాయి 
వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతున్నాడు.అంత గ్యాప్.
అందుకని మా బాబాయి,పిన్నమ్మ లకు మాకు అంత తేడా 
ఉండేది కాదు.ఫ్రెండ్స్ లాగే ఉండే వాళ్ళు)


మా బాబాయి"శశికి సురేషే సరిపోతాడు"అని గట్టిగా 
చెప్పేశారు.(పాపం మా వారి మీద హెంత నమ్మకమో 
మొండి రాక్షసి తో వేగ గలడని)


అలా మా వాళ్ళు మా పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయారు.


మరి మా వారి సంగతేమీటి అంటారా?


పాపం ఉద్యోగం వచ్చేదాకా పెళ్లి చేసుకోవాలని ఆయనకు లేదు.
మరి వాళ్ళు ఈయనను ఎలా ఫిక్స్ చేసారో ఇంకో సారి చెపుతాను.


పెళ్లి శుభ లేఖ చూసి  అందరు అమ్మాయి కూడా నీ చదువే 
లవ్ మ్యారేజ్ నా?.....అంటే పెళ్లి పీటల మీద చూడండి 
కాదని తెలుసుకుంటారు అనేసారంట.........


marriages are made in heaven ....నమ్ముతారా మరి....
ఎవరు నమ్మినా నమ్మక పోయినా ఒకరు ఖచ్చితంగా 
నమ్మారు.


ఆ వ్యక్తీ ఎవరంటే ఇంకెవరు......మా వారు......

Friday, 2 December 2011

గ్లీకు వీలుడు.....నా లాకుమాలుడు....

రండి...రండి...దయ చేయండి...
తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ....


ఏమిటి వెతుకుతున్నారు?గ్లీకు వీలుడి కోసమా?


వాడు ఎవరో కాదండి మా అబ్బాయే...ఈ రోజు వాడి 
పుట్టిన రోజు అందుకని వాడికి చిన్నప్పటి సంగతులు 
గుర్తు చేస్తూ ఈ పోస్ట్.


ముందు క్రింద ఉండే పోటో చూసెయ్యండి.
తరువాత దాని కధ చెపుతాను.




అదుగో...సుమో మీద పడుకొని ఉండే బుజ్జిగాడే 
మా గ్లీకు వీరుడు.


ఇది మూడో సంవత్షరం పుట్టిన రోజు పోటో.
పిల్లల మొదటి పుట్టిన రోజు మన సంతోషానికి.....
మూడో పుట్టిన రోజు వాళ్ళ సంతోషానికి .......
ఎందుకంటె అప్పుడు వాళ్లకి ఉహ తెలిసి ఉంటుంది 
కాబటి ప్రతిది బలే ఎంజాయ్ చేస్తారు.


అప్పుడు వాడు మా అమ్మా వాళ్ళ దగ్గర ఉండే వాడు.
ఈ పుట్టిన రోజుకి మూడు రోజుల ముందు జరిగిన సంగతి.


ఆ రోజు ఉదయం దేవుడి గూడు ముందు కూచొని 
మా అమ్మ ఆరునెలల పిల్ల వాడు మా తమ్ముడి కొడుకుని 
వాళ్ళ కూర్చో పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంది.
వీడు పక్కనే నిలబడి చూస్తూ ,అమ్మ చెప్పే శ్లోకాలు 
ముద్దుగా పలుకుతూ ఉన్నాడు.


ఇంతలో....గూటి తలుపుని మా తమ్ముడి కొడుకు 
కాలితో తన్నాడు.అది కొంచం కదిలింది.దాని పక్కనే 
పాలు కాగపెట్టుకొనే కుంపటి ఉంది.....కుంపటి తెలుసా 
అండి ?దానిలో బొగ్గులు వేసి పైన వంట చేసుకుంటారు.


దానిపై పాలు మరుగుతూ ఉన్నాయి.అవి మా నాన్న 
కోసం కాగ పెడతారు.అలా ఎర్రగా కాగిన పాలు చల్ల 
వేస్తేనే మా నాన్నకు పెరుగు తింటారు(మాకు కూడా 
ఆ మీగడ,పెరుగు దండిగా పెడుతుంటాడు)


ఆ కుంపటి దొర్లి పోయి పాలు నేల అంతా పరుచుకున్నాయి 
పొగలు వస్తూ...మా అమ్మ భయం తో  ఉలిక్కిపడి 
"నివాస్ వెనక్కి వెళ్ళు"అని పెద్దగా అరిచింది.


వీడు భయం గా వెనక్కి వెళ్ళబోయి జారి ముందుకి 
పాలల్లో కుడి వైపుగా పడిపోయాడు,ఈ లోపల మా 
తమ్ముడి కొడుకు మా అమ్మ వళ్ళో నుండి పక్కకి 
దొర్లి పాలల్లో పడిపోయాడు.


ఆమె పెద్దామే.లేసి గబా గబా ఇద్దరినీ తీసుకెళ్ళి పక్కన పెట్టి 
నీళ్ళతో కడిగి చూస్తె ....అబ్బ...ఎందుకులెండి......


మా తమ్ముడి కొడుకుకి నడుము పైన పాలు పది కాలి 
వాడి బంగారు మొల గజ్జెలు అచ్చు లాగా పది పిందెలు 
పడిపోయాయి.
మా బాబు కుడి వైపు కాలు చెయ్యి కాలి బొబ్బలు వచ్చాయి.


నేను ఇక రాత్రి అంతా వాడికి సేవలు చేస్తూ కూర్చున్నాను.
ఇక వాడు పడుకోవాలంటే ఎలా?పొరపాటున కుడి వైపుకి 
తిరిగితే......ఇంకేమి చెయ్యాలి?రాత్రంతా వాడిని నా పొట్టకు 
కరిపించుకొని అలాగే పడుకున్నాను.మధ్యలో లేచి చూస్తూనే 
ఉన్నాను.అలా మూడు రోజుల తరువాత వాడి పుట్టిన రోజు 
వచ్చింది.


(మరి యెంత కష్టపడి పిల్లలను పెంచుకుంటాము.
మీరు అలాగే అమ్మకి,దేశానికి సహాయం చేసి మంచి పేరు 
తేవాలి) 


వాడికి అంతకు ముందే నే పుట్టిన రోజుకి ఫాంట్ వేస్తాను 
అని చూపించాను.పాపం వాడికి ఆశ పెడితిని.ఆ బొబ్బల 
మీద ఫాంట్ ఎలా వేయాలి?డాక్టర్ కి చెప్పి లైట్ గా 
బాందేజ్ వేయించి దానిపై ఫాంట్ వేసాను.


అప్పుడు గ్రీకు వీరుడు పాట ఫేమస్ .మరి అలాగా విమానం పై 
కూర్చో పెట్టి పోటో తీయ లేము కదా..అందుకని సుమో పై 
కూర్చో పెట్టి పోటో తీయించాము.


మరి ఆ అమ్మాయి ఎవరు అంటారా?


నాకు నచ్చింది.ఎక్కడ ఉందొ ఏమో?
ఇంకో ఆరేళ్ళ తరువాత మీరందరూ కలిసి వెతికి 
పట్టుకోచ్చేయ్యండి....


మీ కష్టం ఉంచుకోము......ఎంచక్కా పప్పు భోజనం 
పెట్టిస్తాము....

Sunday, 27 November 2011

బాపు...బాపు...అనే హృదయ మందిరం

బాపు..బాపు అనే హృదయ మందిరం
చూసి తీరాలని ఉండే రామ రాజ్యము....



అబ్బ బాపు గారంట....రామ రాజ్యమంట....
చూడాల్సిందేనని మనసు కి ఒకటే ఆరాటం....

అన్ని రోజులు హాస్పిటల్ లో సిలైన్ చుక్కల్లో క్షణాలు 
లెక్క పెట్టుకొన్నాను......ఎప్పుడెప్పుడు హాస్పిటల్ నుండి 
వచ్చేస్తానా అని....మరి బుద్దిగా సిలైన్ పెట్టించుకొని ,
ఇంజేక్షన్స్ వేయించుకుంటే తీసుకొని వెళతాను 
సినిమాకి అన్నారు ఈయన....


(పెద్ద జబ్బేమి లేదండి...ఏదో వాటర్ పొల్యుషన్....
నా బాధ మీకేవరికి రాకుండా వర్షాలు 
వెళ్ళే దాక నీళ్ళు కాచి తాగండి)

ఇంతా జరిగి వెళ్లి చూస్తె.....ప్చ్...అసలు రామ...రామ...
పాట యెంత బాగుంటుందో అని ఎదురు చూసాను....
కనీసం అందమైన పిల్ల వాడిని కూడా పెట్ట లేదు.....

అసలు బాపు గారు ఎలా తీయాలి అనేది బొమ్మ గీసి 
తన వ్యూ చూపిస్తారట.....మరి గ్రాపిక్స్ ఆయన వ్యూని
మింగేసాయో ఏమో.....అసలు ఈ టీవీ భాగవతం నా కళ్ళ
ముందు ఇంకా మెదులుతూనే ఉంది.ఇదైతే ఒక దృశ్య 
కావ్యం అవుతుందనుకున్నాను.



 అసలు సముద్రం దగ్గర వాళ్ళం ...మాకు అభిమానం వస్తే 
తాడెత్తు అల తలమునకలుగా ముంచి నట్లే ఉంటుంది...
యెంత పొగుడుతూ రాద్దామని అనుకొన్నాను.పోనీలే 
రమణ గారు వెళ్ళిపోయినా .....ఆయన బుడుగుగా జన్మించే
వరకు ఈయన లోటు తీరుస్తాడు అనుకొన్నాను.......

బాల కృష్ణను గూర్చి ఏమి చెప్పను...మళ్ళ అన్నగారు 
పై నుండి బాధపడుతారు....కాక పొతే డైలాగులు నాలిక 
పై నుండి కాకుండా వాళ్ళ నాన్నలా చెప్పి ఉంటె బాగుండేది.


నయన తారలో కను బొమ్మలు పెద్దగా గీసి,ఐ లాషేస్ పెట్టి,
కుంకుం పెట్టి బాపు గారు కాబట్టి సీతాదేవిని పట్టుకు రాగలిగారు.
అసలు ఆ కళ్ళలో దయ,బేలతనం ఉండాలి....కాని ఆమె 
కళ్ళలో ఆత్మా విశ్వాసం కనిపిస్తూ ఉంటుంది....అసలు సీతమ్మ
"నను బ్రోవమని" వచ్చేవారిని కరుణతో ఆదరించేలా ఉండాలి.

సత్య భామ కళ్ళు వేరు,సీతమ్మ కళ్ళు వేరు.భామ అంటే 
ధనువు పట్టినా,తనువు ముట్టినా అంతే....ఆ కళ్ళు చూస్తె
నే ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతుంటుంది.సరేలెండి ...బాగుంది.


స్క్రీన్ ప్లే అసలు పాత సినిమా చూసి చేసినా సరిపోయేది.
అనవసరమైన గ్రాపిక్స్ కి ఇచ్చేసారు టైం అంతా.సీత రాముల 
మమతలకు సరిపోనే లేదు.అసలు పాత దానిలో ఇంత సినిమా 
చూపి హాస్యానికి కూడా ఒక ట్రాక్ చూపారు.ఇక్కడ ఏమి 
లేదు.
లవ కుశులు బాగున్నారు.రాజ మందిరం లో పాడిన పాట 
చాలా బాగుంది.ఇప్పటి మ్యూజిక్ లో ఇంకా బాగా మంచి 
పాటలు చేసి ఉండ వచ్చు.

సరే లెండి ఈ కాలంలో రాముడేందుకు?
అనుకొనే వాళ్ళు ఉన్న సమయం లో సాయిబాబా గారి 
ప్రయత్నం అభినందనీయం.


అప్పటికి ఇప్పటికి ఏమి మారింది...కాలం....ఎప్పటికి 
ఆడవారు నిందలకు గురి కావలసిందే....తామే 
నిరూపించుకోవాల్సిందే.......నయం ఆమె తిరిగి 
అయోధ్యకి రాకుండా భూమి లోకి వెళ్లి మంచి పని 
చేసింది....మొదటి సారి నింద పడినా బిడ్డల కోసం 
బతికింది....ఇంకో సారి నింద పడుంటే ఇంకెలా బతికున్ను 
పా....పం.

రాముడు ఉన్నాడో లేడో....కాని మనిషి బ్రతకటానికి 
ఒక పద్దతి కావాలి......మీటర్ని కొలవటానికి ఒక కొలతను 
మ్యూజియం లో ఉంచినట్లు.......

అసలు మనిషి ఇలా ఉండాలి అనుకోటానికి ,ఆలు మగలు 
పక్కన ఉన్నప్పుడే కాదు దూరంగా ఉన్నప్పుడు కూడా 
మనసులు ఒకటిగా ఉండాలి అనుకోటానికి ఆదర్శంగా 
రాముడి తరువాత ఎవరు ఆంటే చెప్పలేక పోతున్నారు.


మన వాళ్ళు ఇచ్చిన రాముడిని కూడా "రాజు గా తన 
ధర్మాన్ని నిర్వర్తించటానికి సీతని అడవులకు పంపాడు 
కాని భార్యగా తన మనసు నుండి దూరం చేయ లేదు"
అని గట్టిగా చెప్పలేక పొతే .....మీ పిల్లలకు ఇలా బతకాలి 
మనిషి... అందరి కోసం ...స్వ సుఖాలు చూసుకోకుండా 
అని ఎవరిని చూపుతారు?


హూ......సరే మొత్తానికి పాత లవ కుశ ఎప్పటికి గొప్పదే 
అని నిరూపించారు.............

Friday, 25 November 2011

ఇంకో సారి వయోలేన్సు........

మా వారి పుట్టిన రోజు సందర్బంగా 
ఇంకో సారి వయోలేన్సు వాయించాలని పించింది.

నా పెళ్ళైన కొత్తల్లో సంగతి.
 
పెళ్లి అయిన తరువాత మా ఇంటికి మా వారు వచ్చి నపుడునేను వయోలిన్ నేర్చుకోన్నానని తెలిసింది.
ఒక సారి వాయించవా?అని అడిగారు      
 
(ఖర్మ అలా అడిగించింది) 
సరే అని వేరేవాళ్ళ ఇంట్లో వయోలిన్ ఉంటె తెప్పించి
మొదలు పెట్టాను.
 
(ఎలాగయినా శబాష్ అనిపించుకొని వయోలిన్ 
కొనిపించు కోవాలని అనుకున్నాను )
 
 ఇద్దరం శ్రద్ధగా కూర్చున్న తరువాత మొదలు పెట్టాను.
మొదట మోహన రాగం అయితే నచ్చుతుంది అందరికి అని 
మొదలు పెట్టాను.గ గ పా పా ....దప సా సా....వర వీణ ...మృదు పాణి  ...వనరుహలో ..చను రాణి.....
 
పాట అయిపోయినా అయన మొహం లో ఫీలింగ్స్ లేవు
 
(ఆయనకు సంగీతం గూర్చి ఏమి తెలీదని అప్పుడు తెలిసింది)
 
అర్ధం అయితే వాయించటమే గొప్ప ఇక ఏమి రాని వాళ్లకి అర్ధం కావాలంటే ...దేముడా ఏమిటే ఈ అగ్ని పరీక్ష ?
 
కల్యాణి వాయించాను.పేస్ లో ఏమి మార్పు లేదు.
భైరవి ...ఊహు ........బ్రోచేవారెవరురా ?...........
ఊహు.......ఎవరు వచ్చి బ్రోవలేదు...............
 
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి ..........ఊహు.......
ఆమె కూడా రాలే.....
 
(ఇక్కడ వయోలిన్ కొనీడని మనకు టెన్షన్ )
 
నన్ను బ్రోవ నీకు భారమా?నీదు స్మరణ గాక వేరే ఎరుగను.......ఊహు.......ఏమిటి దారి?
రోషం వచ్చేస్తుంది,రాగాలకి ఇల్లు కదిలి పోతుంది ఈన గారి మనసు మాత్రం కరగలేదు.
 
ఒక చిన్న ఉపాయం వచ్చింది.ఎస్ అలాగే చేయాలి అనుకొన్నాను.సినిమా పాటలు వాయిస్తే
ఎలా ఉంటది అనుకోని దేవుడికి దండం పెట్టుకొని
 
(పనిలో పని కొబ్బరికాయ లంచం ఇస్తానని అనుకొన్నాను)
 
ఉపాయం బాగుంది కాని నాకేమి సినిమా పాటలు రావు.
ఒక అక్క ముద్దుగా నాకు ఒక పాట నేర్పించింది.
అదేమిటి అంటే "చూడు పిన్నమ్మ పాడు పిల్లడు.......పాట"
 
వాయించబోయి ఒక్క క్షణం ఆలోచించాను.
బుద్ధి ఉండే వాళ్ళు ఎవరైనా ఆ పాట వాయిస్తే
వయోలిన్ కొనివ్వరు అని నా బుద్ధి ఆపేసింది.
 
ఏమిటి దారి?
 
సమస్య మళ్ళా మొదలు?సరే మిస్సమ్మ లో పాట 
"సా ని స రి మా ...రీ ని సా సా....
మాకు మేమే మీకు మీరే .....పాట మొదలెట్ట పోయాను.
 
(మళ్ళా బుద్ధి ఒక్క చరుపు చరిచింది.కొత్త పెళ్లి కొడుకు ఆ పాట పాడితే పారి పోతాడని)
       
అయ్య..........urekhaa ...........ఒక పాట గుర్తు కు వచ్చింది.
అందరికి తెలిసిన పాట.
 
దొరికిందే చాలని వాయించాను.ఏమిటంటే జనగణమన........
 కద అయిపోలేదండి.అక్కడే మొదలు అయింది.

మద్యహ్ననికల్ల రాజీవ్ గాంధి చనిపోయారు.
వారం రోజులు టివి లో,రేడియో లో
 వయోలిన్ అంటే వయోలిన్...........ఇంకేక్కడ కొనిస్తారూ........ఇరవయ్ ఏళ్ళు అయినా
నేనేదో రాజీవ్ గాంధి ని చంపినట్టు ఇంత వరకు వయోలిన్ కొనిలేదు .