Monday, 25 February 2013

నాన్న వేలు పట్టుకొని...అయిపొయింది :)

నాన్న వేలు పట్టుకొని (4) (ఎర్ర అరుగుల కధలు )
(మూడో భాగం లింక్ )
(రెండో భాగానికి లింక్ )
(ఒకటో భాగానికి లింక్ )
అదిగో అరుగుల మీద అంతా కోలాహలం చిన్ని చిన్ని పిల్లలు
ఎగురుతూ ,దుముకుతూ ........చిత్రం ట్రంక్ రోడ్ పక్కన ఉన్నా
పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉన్నారు అని ఎవరూ భయపడటం లేదు.
అరుగులు వదిలి రోడ్ మీదకు పోలేరు అని ధైర్యం కాబోలు.

వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు ,కాఫీ వాసన,పొయ్యి మీద ఉడికే ఆవిరులు
అంటా హడావడిగా.....గుమ్మానికి మామిడితోరణం కట్టి ఉంది
అక్కడ శుభాకార్యం జరుగుతున్నట్లు
చిత్రం లోపల మనుషులేమో ఆలోచనగా...హుషారు లేకుండా.

అదిగో మెల్లిగా సందడి మొదలు.
''చిన్నమ్మాయి మీ ఆయన వచ్చాడు''ఎవరిదో కేక.
అందరు సందడి గా బయటకు వెళ్లారు.హమ్మయ్య అందరి మొహాల్లో సంతోషం.
కాని ఏమి జరుగుద్దో అని సందిగ్దత.

''రా బావా''మావయ్య వెళ్లి బ్యాగ్ తీసుకున్నాడు.నాన్న మొహం కొంచెం
గంభీరంగానే .....''రండి అత్తమ్మ,రండి వదిన''అందరికీ  లోపలకు పిలుపులు.
మంచినీళ్ళు,కాఫీలు,మర్యాదలు.....
''ఓహ్ నాన్న వచ్చారంట....కాని నా దగ్గరకు
రాలేదే ,నేను మాత్రం ఎందుకు చూడాలి పెద్ద''
అమ్మ కొంగులో మొహం కప్పెసుకున్నాను.తల ఇటు తిప్పకుండా.
నాన్న రెండు మీటర్లు ఎదురుగా సోఫాలో కూర్చున్నారు.

జేజి నాయనకు నా మీద కోపం చూడటానికి  రాలేదు.
బాబాయి లు ఇద్దరు కూడా రాలేదు .
నాయనమ్మ  నలుగురు అత్తయ్యలు వచ్చారు.
మంచం దగ్గరకు వచ్చి''చూడవే నీ అత్తమ్మలం వచ్చాము''
నేను ఎందుకు చూస్తాను.నేను మా నాన్న కంటే జగ మొండి.గయ్యాళిరాక్షసి.
తల తిప్పను కూడా లేదు.
మా అమ్మ తిప్పపోఎసరికి ఒక్క సారి మొహం మాడ్చాను.
''వద్దులే వదినా''వెళ్లి కూర్చున్నారు.ఎవరు తాకరు.....
 ఎందుకంటె ఇంకా పుణ్యావచనం  కాలేదు కదా.తాకకూడదు.

''బాగా ఉన్నారయ్య''నాన్నను అమ్మమ్మ తలుపు చాటు నుండి పలకరించింది.
అమ్మమ్మ నాన్న ఎదురుగా ఎప్పటికీ రాదు.
ఏమైనా అవసరం అయితే అలానే అడుగుతుంది.
లేకుంటే మా చేత చెప్పి పంపిస్తుంది.
ఇంతలోకి స్వామీ పిలిచాడు పీటల మీద కూర్చోమని.
మా అమ్మ నన్ను ఒళ్లో వేసుకొని నాన్న పక్కన పీటల మీద కూర్చుంది.
అప్పుడప్పుడు తొంగి చూస్తూనే ఉన్నాను చూస్తాడు ఏమో అని....
ఊహు.....పో...ఏమిటి పెద్ద ...నాకేమైనా తెలుసా ఆడపిల్ల,మొగ పిల్లవాడు అని..
నేను కూడా  చూడను అని అమ్మ కొంగు కిందకి వెళ్ళిపోయాను.

''గంగేచ యమునేచ కృష్ణా గోదావరి...జలస్మిన్  సన్నిధం కురు''
లీలగా మంత్రాలు అగరొత్తుల పొగతో కలిసి....పూజ పూర్తీ అయింది.
నీళ్ళ లో మామిడాకులు ముంచి నాన్న మీద,అమ్మ మీద ,నా మీదా
చల్లారు....ఇంక ఎవరూ లేరా?
''ఏ రాణి ఎక్కడున్నావు?''
అప్పటి దాక మా నాన్న వచ్చింది చూడలేదు ఏమో అక్క బుజ్జి గౌను
వేసుకొని అక్కడకు వచ్చి నాన్న ని చూడగానే
''నాన్న''అని భుజాల మీద తూనీగా లాగ వాలి ఊగింది.
ఊగడం పడిపోతుందేమో అని రెండు చేతుల మీద
చేయి వేసి పట్టుకునాడు.''మొద్ద  పడిపోతావు''అక్క అరిచేతుల్లో
 ముద్దు పెట్టుకున్నాడు.కొంచెం కోపం తగ్గింది.
నవ్వుతూ ఉన్నాడు అక్కను ఒళ్లో కూర్చోపెట్టుకొని ...
స్వామీ అక్క మీద కూడా నీళ్ళు చల్లాడు.
అక్క ఆపకుండా చెపుతూనే ఉంది.
''నాన్న మరేమో మనకు చిన్న చెల్లి దొరికింది,
బుజ్జి కాళ్ళు,చేతులు,ఇంత బుల్లి కళ్ళు....కుయి అని ఎలుత్తాది  తెలుసా?''

''ఎక్కడ దొరికింది అమ్మా ?''అడిగాడు నాన్న నవ్వుతూ.
''ఏమో నాన్న అమ్మ తెచ్చింది''కళ్ళు ఆర్పుతూ చెప్పింది.
''చూడు చూడు''నా తల మెలి తిప్పి చూపించబోయింది.
మా అమ్మ కెవ్వు....''ఏయ్...ఏయ్...అలా తల తిప్పకూడదు విరిగిపోతుంది''
మా నాన్న బిక్క మొహం వేసుకున్న అక్కను మళ్ళా ఒళ్లో
కూర్చోపెట్టుకొని సముదాయించాడు.

అమ్మా బారసాల జరగాలి అదిలించాడు స్వామీ.
పెద్ద పళ్ళెం లో బియ్యం పోసాడు.
మధ్యలో పసుపు గణపతిని చేసి పూజించాడు.
తరువాత నాన్నను అడిగి బంగారు ఉంగరం తీసుకున్నాడు.
''అయ్యా అమ్మాయి పేరు ఇందులో రాయండి''బియ్యం పళ్ళెం లో
చూపించాడు.అందరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు....
వసంతం లో శిశిరం వచ్చినట్లు....అందరు అమ్మాయి పుట్టిన బాధలో
ఉంటిరి,ఒక్కరు ఈ పిల్లకు పేరు పెట్టాలి అనే ఆలోచన లేదు.
దేవుడా..... పిల్లలు పుట్టక ముందే పేరు పెడుతూ ఉంటె
నాకు ఒక పేరు కూడా వీళ్ళు ఆలోచించలేదా?
అమ్మ పెడుతుంది లే  అని నాన్న నిర్లిప్తంగా,
ఆయన ఏమంటాడో అని అమ్మ.
మేమేమి చెప్పగలం అని అమ్మమ్మ వాళ్ళు.......

పాపం మా మేనత్తలకు బోలెడు జాలి వేసినట్లు ఉంది.
పాపం అదేమీ చేస్తుంది ఎంత ఆడపిల్ల అయినా పేరు పెట్టాలి కదా....
హమ్మయ్య నేను మనిషిని నాకు పేరు పెట్టాలి అనే ఆలోచన వచ్చింది అది చాలు....
చిన్న నవ్వు మేఘం నా పెదాలపై ఇంద్ర ధనుస్సులా మారి....
అమ్మ ''అదిగో పిల్ల  నిద్రలో నవ్వుతుంది నాకేమి పేరు పెడతారో అని''అంది
.....అందరు నాన్నతో సహా కుతూహలంగా చూసారు.
బుల్లి రోజా రంగు పెదాలపై నవ్వు  స్వచమైన నీట్లో మెరిసిన చిన్న అలలాగా
తళుక్కున మెరిసి వెళ్ళిపోయింది.ఇంకా నాన్న నన్ను ఎత్తుకొనే లేదు.
చూస్తాను ఈ బింకం ఎంత సేపో.

''స్వామీ ఏ అక్షరం రావాలి?''అడిగారు.
''గ'' ఏమున్నాయి ''గ '' తో పేర్లు కూసింత సేపు గందరగోళం గా మాటలు
బయటి ట్రంక్ రోడ్ ఇంట్లోకి వచ్చినట్లు....గలభా గలభా......
''గిరిజ''ఊహూ మా మూడో మేనత్త ది అదే పేరు.
మరేమిటి?''గంగ'' ఓహ్...అసలే ఇది ఇప్పటికే గయ్యాళి అని పేరు
తెచ్చుకుంది ..అందరు గయ్యాళిగంగమ్మ అంటారు వద్దు....
మరేమిటి?

ఏమిటో ఇది కొంపతీసి ...ఒసే...అని జీవితాంతం పిలిచేస్తారో ఏమిటో?
హమ్మయ్య మా అత్తమ్మలు అందరు వాదించుకొని ఒక పేరు
తేల్చారు.
'వదినా గ  తో వద్దు.రాగమ్మ వాళ్ళ ఇంట్లో పాప  పుడితే
శశి కళ అని పెట్టారు. మనకు ఆ పేరు ఎందుకు ఉండకూడదు.
మనం వాళ్ళ కంటే ఏమి తక్కువ?అదే పెట్టు''చెప్పేసారు.

అమ్మ నాన్న వైపు చూస్తె ఆయన ఏమి చెప్పలేదు.
(ఛా ఇంతా చేసి నాకు వేరెవరో పేరా?పోనీలే ఏదో ఒకటి ..
అసలు పేరు లేకుండా ఉండేదాని కంటే ఇదే బెటర్. ఈ పోనీలే ఏదో
ఒకటి అనే పదం ...ఇక జీవితం లో మొదలు,ఏమి చేస్తాము
ఆడ పిల్లని కదా.అందులో రెండో ఆడపిల్లని)

''బాబు ఆ పేరు చెవిలో మూడు సార్లు చెప్పండి''నాన్నకు
చెప్పాడు స్వామీ.
వంగాడు నాన్న ..
ఏమి చెపుతాడో అని నేను కొంచెం వంగాను.
చిన్నగా చెవి మీద వాలి...
వెచ్చని ఊపిరి తగులుతూ ఉంది...
''శశి కళ''మూడు సార్లు చెప్పాడు.
స్వామీ అక్షింతలు ఇచ్చాడు
నా మీద వేయమని.వేసాడు.
''ఎత్తుకో నాన్న,ఎంత సేపు''
విసుక్కునాను.చూస్తూ ఉన్నాడు.
అప్పుడు వచ్చి ఎత్తు కున్నారు  అత్తమ్మలు
''శశి కళ''అని పిలుస్తూ
''రాణి నీ చెల్లి పేరు శశి కళ''
అక్క కూడా నవ్వుతూ నా పక్కన నిల్చుంది.
నాన్న నవ్వుతూ చూస్తున్నారు లేచి సోఫాలో కూర్చొని.
మెల్లిగా తీసుకు వెళ్ళింది అమ్మ.
ఆయన అరిచేతిలోసరిగ్గా ఇమిడిపోయాను.
అబ్బో నాన్న అరిచేయి ఎంత పెద్దదో!


మా అమ్మ చెపుతూ ఉంటుంది.....
కత్తి తో నన్ను పొడవాలి అని వచ్చిన కసాయోడు కూడా
నన్ను చూస్తె కరుణతో కరిగిపోతాడు అంట.
ఇక మా నాన్న ఎంత....
తన రూపం చిన్న పాపగా మారి పలకరిస్తూ
చిన్ని కళ్ళు మూస్తూ తెరుస్తూ....తన చేతిలో వెచ్చగా .....
మెత్తగా,
అప్పుడే పుట్టిన పిల్లలు ''గుళ్ళో అయ్యవారు చేసిన చక్ర పొంగలి
అంత మెత్తగా ఉంటారంట''
ఇక ఆగలేక పోయాడు మా నాన్న.
చక్కగా వంగి చిన్నగా తీపి ముద్ర.
''అబ్బ గడ్డం గుచ్చుకుంటుంది''కుయ్యి అన్నాను.

ముళ్ళ తోలు కప్పుకున్న నాన్న లోపల దోరగా 
పండిన పనస తొనల ప్రేమ వాసన....
ఎంత బాగుందో.నాన్న నాకు భలే నచ్చేసావు.

ప్రేమగా మళ్ళా''కుయి''అని ఇంకో సారి పలకరించాను.
దూరంగా అమ్మమ్మ,అమ్మ కళ్ళలో నీళ్ళు నింపుకుంటూ...
''వీళ్ళు ఒకళ్ళు అన్నిటికీ ఏడుపే''''కుయి''అని
మరోసారి విసుక్కున్నాను.

అప్పుడు నన్ను మా నాన్న ఒళ్లో పండేసుకొని ఆయనకు ఇష్టం
అయినట్లుగా నా అరిచేతిలో తన  వేలు ఉంచి
బుజ్జి వేళ్ళు దూరంగా జరిపి
మల్లె పూవు అంత మెత్తగా ఉన్న అరిచేతిలో ముద్దు పెట్టుకున్నాడు.
''బంగారు తల్లి''అంటూ.

నేను వదులుతానా ఏమిటి?
చటుక్కున ఆ వేలు పట్టేసుకున్నాను.

''వదలొద్దు నాన్న 
ఇలాగే పట్టుకో 
చెట్లు చూపించు 
చెమరింపులు చూపించు 
చైతన్యం చూపించు 
చెలిమిని చూపించు 
కలిమిని చూపించు 
లేమిని చూపించు 
మబ్బుని చూపించు 
మురిపం చూపించు 
మసకేసిన కళ్ళతో 
లోకం అంతా  చూపించు....
ఒట్టు నాన్న 
దాన్నంతా జయించి నీకు కానుకగా ఇచ్చేస్తాను''

హమ్మయ్య ఒక మనసుని జయించేసాను :)
ఏమిటి సాక్ష్యం కావాలా?

అప్పగింతలు అప్పుడు నా రెడు చేతులు  పాలలో అద్ది
అమ్మా నాన్న ఆయన చేతిలో అద్దేటపుడు....
ప్రేమ పొంగి చుక్కలుగా మారి పాలలో కలిసిపోయి
మా వారి అరిచేతులకు అంటిన కన్నీటి తడిని(*) అడగండి
చెపుతుంది నాన్నకు నేనంటే  ఎంత ప్రేమో''


నేనువదిలి వెళ్లాను అని నువ్వేమి బాధపడవాకు నాన్న
బెస్ట్ టీచర్ అవార్డ్ తెచ్చుకున్నా
వుమన్ఎంటర్ ప్రిన్యుర్  గా ఎన్నిక అయినా
ఏ అవార్డ్ లో అయినా ,రివార్డ్ లో అయినా
నా పేరు పక్కన నించొని మెరిసిపోతూనే ఉంది
సమాజం నాకు ఇవ్వని నీ ఇంటి పేరు
''తన్నీరు వాళ్ళ అమ్మాయా తమాషానా?అని మురిసిపోతూ ''

(*) బహుశా ఈ కధ ఎర్ర అరుగుల కధల  కు చివర కధ కావొచ్చు.
ఎందుకంటె నాకు పెళ్లి అయిపోయంది కదా.

ఒక్క కైమోడ్పు:

జీవితపు తునకే కధ అని
అమ్మ యాసలో  సాగితే
తువ్వాయి అమ్మ దగ్గర పాలు తాగినంత తృప్తి
కలుగుతుందని ....
తమ కధలతో నాకు స్పూర్తి
ఇచ్చిన నామిని గారికి,ఖదీర్ బాబు కి
నా ధన్యవాదాలు

(http://khadeerbabumd.blogspot.com link ikkada )

Tuesday, 19 February 2013

వస్తావా నాన్నా ....

నాన్న వేలు పట్టుకొని (3)   (ఎర్ర అరుగుల కధలు)
(రెండో బాగానికి లింక్)
(నాన్న వేలు పట్టుకొని మొదటి భాగం లింక్ )
వరుసగా ఐదు గుమ్మాలు.వెనుక పెంకుల పంచ.
దాని పక్కన బావి.మా మేనమామ బావిలో నీళ్ళు తోడి పోసుకుంటూ ఉన్నాడు.
కావలి ఎర్ర గులక నేల.బావికి వరలు అవసరం లేదు.
తవ్వుకుంటూ వెళ్ళడమే.నీళ్ళు కూడా స్వచ్చంగా ఉంటాయి.
ఎండాకాలం లోతుకు వెళ్ళినా మామూలుగా చాలా ఎత్తు
 వరకు ఉంటాయి నీళ్ళు.ఒక్క చాంతాడు తో  తోడుకోవచ్చు.
మా మావయ్యకు అలా తోడుకొనే పోసుకోవడం ఇష్టం.
అలా పోసుకుంటూ వీడి గుమ్మం దగ్గర మనిషి తచ్చాడడం చూసాడు.
అమ్మమ్మ వంటిట్లో వంట చేసుకుంటూ ఉంది.
గబా గబా వాళ్ళు తుడుచుకొని వచ్చి తలుపు దగ్గరకు నడిచాడు.
కమ్ముల తలుపు నుండి కనిపిస్తూ ఉన్నాడు పులయ్య.
తలుపు తీస్తే లోపలి వచ్చాడు.
''ఏమ్మా పాప ఎలా ఉంది'' అమ్మని పలకరించాడు.

పుల్లయ్య డి కిరాణా షాప్ ,తాతయ్య చనిపోయిన తరువాత ఇంట్లో
ఆడవాళ్ళు సామాన్లకు రాలేరని షాప్ కు పోయేటపుడు వచ్చి
 ఏమి కావాలో అడిగి సాయంత్రం తెచ్చి ఇస్తాడు.
గొంతు విని అమ్మమ్మ కూడా బయటకు వచ్చింది.

''పుల్లయ్యా  పెంచెలు సామాన్లు చీటీ ఇచ్చాడు కదా?''అడిగింది.
''ఇచ్చాడమ్మా  అదే అడగటానికి వచ్చాను.ఆ సామాను ఏబై మందికి కూడా
సరిపోదు .మీకు బంధువులు ఎక్కువ కదా?''అడిగాడు.

''ఏమి చెప్పమంటావు పుల్లయ్య , ఆడ పిల్ల పుట్టింది.
వాళ్ళ నాయన వస్తాడా లేదా అనేది భయంగా ఉంది.బార సాల కూడా
పెట్టుకుందామా వద్దా అనుకున్నాము.మగ దిక్కు లేని సంసారం .
భయం తో చేతులు కాళ్ళు ఆడటం లేదు.
రేపు కాకుండా ఎల్లుండి బారసాల.
దగ్గరి వాళ్ళు అయినా రాక పొతే ఎవురు పనులు చేస్తారు.
అసలు దిగులుతో నాకేమి అర్ధం కావడం లేదు''చెప్పలేక చెప్పలేక చెప్పింది.
అమ్మ,పెదమ్మ,మావయ్య మౌనంగా వింటూఉన్నారు .
పెదమ్మ కు అప్పటికే ఒక అబ్బాయి,ఇద్దరు ఆడపిల్లలు.
ఆ ఊరిలోని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకుండా అమ్మమ్మతో అక్కడే ఉంది
ప్రస్తుతం.పెదనాన్నే షాప్ నుండి అన్నానికి ఇక్కడకు వచ్చి వెళుతూఉన్నారు.

అదిగో బయట ఉన్న మంచం అంత  పెద్దగా రెండు వైపులా ఉన్న
ఎర్ర అరుగుల నిండా పిల్లల గోల ఆడుకుంటూ.
వాళ్లకు ఇవేమి పట్టవు.
అన్నిట్లో ఉంటూ ఏమి అంటకుండా....
బాల్యం ఎంత హాయి....రాలే చినుకు నుండి
ఇంద్ర ధనుస్సు విచ్చుకున్నట్లు వాళ్ళ నవ్వుల్లో వేల కాంతులు.

అదిగో సులోచనక్క''ఏమి చిన్నఅమ్మాయి ఏమి చేస్తుంది నీ బుజ్జి
కూతురు?''అమ్మ కళ్ళలో నీటిపొర.
''ఏడవకు లెమ్మ ,ఏమి కాదులే ,వస్తాడు మీఆయన .
భార్యా బిడ్డల్ని వదిలేస్తారా ఏమిటి?''
సుఖాల్లో పలకరించక పోయినా కష్టాల్లో పలకరించాలి అంట.
ఇందరం ఉన్నాము భయం లేదు అని చెప్పటానికి,ఇంతా అంతా
కష్టమా ఆడపిల్ల పుట్టటం....అందులో అమ్మమ్మ అందరికి సహాయం
చేస్తూ ఉంటుంది.ఎవరి పెళ్లి అయినా మా ఇల్లే విడిది ఇల్లు.అందుకని
అమ్మకి ఆడ పిల్ల పుట్టింది అని తెలిసి వచ్చే వాళ్ళతో పోయే వాళ్ళతో
ఇల్లు సందు లేదు.అరుగులు కళ కళ లాడిపోతున్నాయి.పిల్లల కేక లతో,
గుర్రం ఎక్కినట్లు ఆడే వాళ్ళు,పడవ ఎక్కినట్లు ఆడే వాళ్ళు,యెగిరి దుమికే వాళ్ళు
అమ్మ వాళ్ళు లాక్కుని పోతుంటే అరుగులు వదిలి రామని కేకలు
వేస్తున్నారు.ఇప్పుడు నా బుజ్జి కాళ్ళకు సత్తువ ఉంటె ఎంత బాగుండును.
వాళ్ళతో యెగిరి ఉందును.

''సరేనమ్మ నేను వస్తాను.సామాను సాయంత్రం పంపిస్తాను''
బయలుదేరాడు పులయ్య.
''పుల్లయ్య మామిడాకుల సంగతి చూడు''చెప్పింది.
సరే అని వెళ్ళిపోయాడు.

''సులోచన నువ్వు పూల సంగతి చూడు,అసలే కోట వాళ్లకు పూలు అంటే
 భలే ఇష్టం ''చెప్పింది అమ్మమ్మ.

''రెండు లీటర్లు మల్లె పూలు,సన్న జాజులూ తెప్పిస్తాను.అనసూయ వాళ్ళ
ఇంట్లో కనకాంబరాలు కోసి పంపమంటే సరి పోతుంది.''అనింది అమ్మమ్మ.
''అలాగే కట్టి పంపిస్తానులే పిన్ని.మరి చిన్నఅమ్మాయి  సంగతి ఏమిటి?
(అమ్మ పేరు నాగరత్నం .అయినా అందరు ఇలాగే పిలుస్తారు )
బాలింత విచ్చిన పూలు  పెట్టుకోకూడదు.ఆ రోజు ఉదయాన్నే అంగడిలో
ఉన్న మొగ్గలు తెప్పించు.వెంటనే కట్టి ఇచ్చేస్తాను.ఓయ్ బుడ్డి పిల్ల
నీకు కూడా లాంతరుచెండు కుట్టిస్తాలే(*)''నన్ను చూసి నవ్వుతూ అనింది.

నాకు అర్ధం అయింది నన్నే పిలుస్తున్నారు అని .....
అమ్మ చెంగు లోనుండి బయటకు చూసి మళ్ళా
లోపలకు తల పెట్టేసాను.
''దాని మొహం దానికి లాంతరుచెండు  ఏమిటి?
జుట్టు మోస్తుందా?''
''ఏమి కాదు లేవే మూడు మొగ్గలు వేసి కడుతాను చిన్నది,
ఆడ పిల్ల పూలు లేకుండా ఏమిటి.అసలు దానిది రింగుల జుట్టు.
ముద్దుగా ఉంటుంది''
నవ్వింది అమ్మ చినగా నా రింగుల జుట్టు వేళ్ళతో దువ్వుతూ.
ఆమె కూడా వెళ్ళిపోయింది.

అమ్మమ్మకి ఇంకా భయంగానే ఉంది
''పెంచెలు బావా వాళ్లకి రమ్మని ఉత్తరం
వ్రాసావు కదా.''''వ్రాసాను''చెప్పాడు.
''అది కాదురా మావయ్యని,అత్తమ్మని ,బావని ,వాళ్ళ చేల్లెల్లని ,
తమ్ముళ్ళని,పెద్ద బావని,అక్కని అందరిని
పేరు పేరునా రమ్మని వ్రాసావు కదా''
''వ్రాసాను అమ్మ.తప్పకుండా రావాలి అని వినయంగా వ్రాసాను''

''హ్మ్..ఏమో నాయన ఆ పరమేశ్వరుడు ఈ గండం ఎలా గట్టేక్కిస్తాడో
ఏమిటో?..అవును చిన్నమ్మాయి మీ అయన ఏమి బంగారు తెస్తాడో
దీనికి ,తెలిస్తే బాగుండును.మనం వేరేది చేయించవచ్చు''

''హ్మ్...అసలు వస్తాడో రాడో  తెలీడం లేదు.ఇంత దురదృష్టవంతురాలికి
ఎందుకు పుట్టావే తల్లి''అని నన్ను హత్తుకొని కన్నీళ్ళతో నిండిపోయింది.

''అయ్యో వద్దులే తల్లి ,బాలింత ఏడవకూడదమ్మ ,ఏడవొద్దు తల్లి
ఏడవొద్దు.పురిట్లో వచ్చిన జబ్బులు పుడకల దాకా పోవంట.
ఏడవకు తల్లి.''
అమ్మమ్మ కన్నీటి పర్యంతం అయిపోతూ....
మావయ్యను దగ్గరికి పిలిచింది.
''రే పెంచేలు.ఆచారి దగ్గరకు పోయి బంగారు దండ కొంచెం బరువుగానే
చెయ్యమను.ఆడపిల్ల ఎదిగితే బోసిమెడ తో ఏమి తిరుగుతుంది.
అదసలె పుట్టెడు కష్టం లో ఉంది.మనం దాని కష్టం తీర్చలేము.
ఎలాగో వంకీలు,మొలగజ్జెలు ఉన్నాయిలే.దండ బాగా చేసి ఎల్లుండికి
ఇచ్చెయ్యాలి అని చెప్పు.మళ్ళా మీ బావా వాళ్ళు వచ్చేస్తారు''

''సరే అమ్మ అని ఒకటిన్నర కిలోమీటర్ దూరం లోని విష్ణాలయం
 దగ్గర ఉన్న ఆచారి దగ్గరకు బయలుదేరాడు మావయ్య.
మళ్ళా పిలిచింది
''అలాగే కొత్త బజారు,పిన్నమ్మ,రంగమన్నారు బాబాయి లను రమ్మని చెప్పు.
నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు ,త్వరగా రమ్మని చెప్పు''

మళ్ళీ పిలిచింది
''పాతూరుకి పోయి పాల వాళ్లకి పదిహేను
లీటర్ల పాలు కావాలని చెప్పు.బాగా పోయాలి అని చెప్పు''

పాపం డిగ్రీ చదివే మావయ్య మొగ పిల్లవాడు కాబట్టి లేత భుజాల మీద
అన్ని బాధ్యతలు వేసుకొని తిరిగింది తిరిగిందే...అక్క కష్టం కొంత
అయినా తీర్చాలి అని.

''చిన్నమ్మాయి రూపాయ మిద్దె (*)వాళ్ళను పిలవాలా?''అడిగింది.

''పిలవక పొతే ఎట్టమ్మ!తోడుకోడలు అక్క వాళ్ళు కదా''చెప్పింది అమ్మ.

ఇక మా పెదమ్మ వాళ్ళ ముగ్గురు పిల్లలు,మా అక్కపని,
బాలింత పని, ఇంకా  వంట,
బారసాల పనులు,వచ్చే పోయే వాళ్ళను పలకరించడం
ఇవన్నీ ఒక ఎత్తు , మా అమ్మని ఓదార్చడం ఒక ఎత్తు .
కాలం ఎవరి కోసం ఆగుతుంది రేపే బారసాల.

రాత్రికి అమ్మ కంటికి కునుకు పడితే ఒట్టు.అంటుకోని రెప్పల నడుమ
కన్నీటి చెలమ ఊరుతూనే ఉంది.ఫోన్ లు ఉన్నా బాగుండును.

నేను ఇక్కడ ఉంటిని.అక్కడ మా నాన్న మనసులో ఏముందో నాకేమితెలుసు!
''వస్తాడా?ఈ పాపని ఎత్తుకుంటాడా ?ఏమంటాడో?''భయం,దుఖం
 కలగలిసి సంద్యా సమయం లాగా.....
దిండు మీద వాలిన అమ్మ మనసులో చుట్టూ
అలుముకున్నలాంటి చీకటే....ఒక్కటే ఆశా కిరణం,
నాన్నకు చిన్న పిల్లల పై గల ప్రేమ ....

రాత్రంతా పక్క నుంచుకొని వెచ్చగా నిద్ర పుచ్చే నాన్న,
ఏడిస్తే అమ్మ కంటే ముందు ఆకలి తీర్చే నాన్న,
చిరు నవ్వుల కెరటాలు విచ్చుకుంటే పొంగిపోయే నాన్న,
భుజం సింహససనం పై కూర్చుండ పెట్టి చిన్ని పాపాలను 
ఊరేగించే నాన్న .....
ఆడ పిల్ల అనే ఒక్క కారణం తో రాకుండా ఉంటాడా?

ఏమో తండ్రి ప్రేమ జయిస్తుందో,సమాజం ఇచ్చిన మూర్ఖం జయిస్తుందో?
కల్లోల సముద్రం లాంటి అమ్మ మనసులోని అలజడి
ఆమె గుండెల నుండి ఎగసి నాలో కూడా దుఖాన్ని నింపుతూ ఉంది.
''రా నాన్న ప్లీజ్,అమ్మ ఎలా ఏడుస్తుందో చూడు''
నేను చిన్ని కృష్ణుడిని అయినా బాగుండేది ......అమ్మ గుండెల్లోని
అమృతమే కాక ,బాధని కూడా పీల్చేద్దును''

''నా పిచ్చి కాని కృష్ణుడినే  అయితే ఈ ఏడుపులన్నీ ఎందుకు....
వెదవ ఆడ పిల్లగా పుట్టబట్టి కాని ''
                                                    (ఇంకా ఉంది)

(లాంతరు చెండు ,రూపాయ మిద్ది ....ఇలాగా స్టార్ గుర్తులు ఉండేవి
కధలు అన్న మాట.అన్నీ వ్రాయను.కొన్ని వ్రాస్తాను.ఎందుకంటె
ఇవి బుక్ గా  చేసి అమ్మకు ఇచ్చి
''నాకు దేవుడు ఎంత మంచి పాపను ఇచ్చాడో''
అని అమ్మ పొంగిపోతూ నా బుగ్గ మీద ముద్దు
పెడితే ఆనందించాలి అని.....
విషణ  భీషణ గోషణ రోషణ  కోరిక.
...ఇవేమిటి అంటే నాకు మాత్రం ఏమి తెల్సు ..కోరిక బీభత్సంగా ఉంది
అనేదానికి విశేషణాలుగా అవి వ్రాసాను.అర్ధం తెలీదు.
ఎవరు పుట్టించక పొతే పదాలు ఎలా పుడతాయి చెప్పండి?)

Thursday, 14 February 2013

''ఐ లవ్ యు''....''ఐ ప్రామిస్ యు''

నాన్న వేలు పట్టుకొని(2)  
(ఒకటవ భాగం లింక్ )

 పాపం ఆ కార్డ్ ముక్కకు ఏమి తెలుసు ఇన్ని కన్నీళ్లు 
దోసిట్లో నింపుకొని కబురుగా మోసుకెళుతున్నాను అని...
చక్కగా అన్ని ఊళ్లు దాటి అదిగో నెల్లూరు జిల్లాలోని సముద్ర 
తీరప్రాంతాన ఉన్న కోటలో ......
అన్నం తింటున్న మా నాన్న ఒళ్లో వాలింది.
గబా గబా అక్షరాల వెంట పరుగులు మొహం సీరియస్ 
కళ్ళలో కోపం జీరలుగా విచ్చుకొని  .....

అన్నం పెడుతున్న మా నాయనమ్మ కి కొంత అర్ధం అయినట్లే ఉంది.
అయినా బెరుగ్గా ''ఏమైందిరా?''
నాన్న చేతిలో కంచం పెరట్లోకి పోయింది విసురుగా....కోపాన్ని 
మెతుకులుగా చల్లుతూ,పాపం దానికి ఉన్న సొట్టలలో 
ఇంకోటి అదనంగా చేరింది నా వలన ...

''ఆడ పిల్లంట ఎవురికి కావాలా?
ఆడే పారేసి రమ్మను"కోపంగా వెళ్ళిపోయాడు.
అక్కడే ఉన్న మా ఇద్దరు బాబాయి లకు ,పెళ్లి కాని ఇద్దరు 
మేనత్తలకు విషయం తెలిసిపోయింది.

విన్న మా జేజినాయన విసుగ్గా పశువుల కొట్టానికి పోయి
పొలానికి బండి కట్టిస్తా అక్కడి పశువులను చూసి విసుక్కున్నాడు
'ఏమిటో పశువులకేమో పనికి రాని కోడేదూడలు,
ఇంట్లో ఏమో పనికిరాని ఆడ పిల్లలు'

పాపం పెరట్లోని బాదం చెట్టు మీద నుండి మెతుకుల మీద వాలబోయిన 
కాకి కూడా ....కోపం వాసన వచ్చిందేమో ఈ కోపాన్ని కాకి కబురుగా 
కావలిలో మా అమ్మమ్మ వెనుక ఇంట్లోని బాదం చెట్టు పై కూర్చొని 
అరిచింది...వాళ్ళు ఉలిక్కిపడేటట్లు.
ఎలాగబ్బ ఇంకా మా నాయనను చూసేది?నిజంగానే పారేస్తారా?
అదిగో మా మేనత్తలు ఆ కబురు అందరికి మోసుకొని పోయి చెప్పేసారు.

నిజం గడప దాటే లోగా అబద్దం ఆరు వూళ్ళు తిరుగుతుంది అంట.
మరి ఆడపిల్ల కబురేమో వంద ఊళ్లు తిరిగేస్తుంది నిమిషం లో.....
మా మేనత్తలు అప్పుడే పెళ్లి అయి ఉన్న ఇద్దరు మేనత్తలకు 
కబురు కార్డ్ వ్రాయించే పనిలో ఉన్నారు...ఇదీ దీనితో పాటు 
పెద్ద వదిన నీళ్ళుపోసుకొని ఉంది అనేది (మా పెదమ్మ)

హ్మ్...వాళ్ళ కోపం లో కూడా న్యాయం ఉంది.అప్పటికే 
మా పెదనాన్నకి ఒక అడ పిల్ల,మా నాన్నకి ఒక ఆడపిల్ల 
ఇప్పుడు నేను రెండో దాన్ని ...అంటే వెరసి ముగ్గురు,
మరి వంశాంకురం ఎలా?
నాకేమి తెల్సు నాకు తెలీకుండానే నా ఊపిరి తగిలి 
వారి ఆశల కుండ బ్రద్దలు అయిందని :(
అదిగో మా పెదమ్మ కు పుట్టే వాళ్ళే ఇంక మిగిలిన ఆశ.

అదిగో పాపం నాన్నకు ఎవరు ఎదురైనా ఒకే మాట...
''ఏమి వెంకటేసులన్నా మళ్ళా ఆడ పిల్ల అంటనే?''

షాప్ కి వెళితే కొనుగోలుకు వచ్చే వాళ్ళు అడగడం....
''అయ్యో సెట్టేయ్యకు మళ్ళా ఆడ పిల్లంట...ఇచ్చో ..పాపం''

పొలానికి వెళితే అక్కడ కూడా పరామార్శలె...
హ్మ్...అందరి ముందు తల ఎత్తుకొని తిరిగే నాయన 
ఎన్ని సానుభూతుల బరువు మోయాల్సి వచ్చిందో.
అందుకే కోపం వచ్చి ఉంటుంది నా మీద.

అదిగో పెద నాన్న ,నాన్న ని జాలిగా చూస్తూ 
''ఏమిరా మళ్ళా ఆడ పిల్ల అంట కదా
హ్మ్...సరే కాని ఏమి చేద్దాము?''ఓదార్పు.

నాన్నకు భలే విసుగ్గా ఉంది.
''కనింది లే  ఎదవ @#$*#@ ఆడ పిల్లని ఉద్దరించడానికి ''
ఛా విసురుగా లేచి ఇంట్లోకి వెళ్లాడు.
పాపం మా మేనత్తలు,బాబాయి లు మాట్లాడటానికే 
జంకుతున్నారు.

ఇంక మా నాయనమ్మే అడిగింది.''వెళ్ళవా?"
మా నాయన గమ్మున ఉన్నాడు....మొండి వెళ్ళడు 
అర్ధం అయింది.
''ఎలాగా రా పదకుండో రోజున అయినా వెళ్లి పుణ్యావచనం 
చేయించుకోక పొతే,దేవునికి దీపం ఎలా పెడతాము?""
అయినా సమాధానం లేదు.
అయ్యో మా నాయన నన్ను చూసేదానికి వస్తాడో రాడో.
నిజంగానే మా అమ్మను పారేయ్యమంటాడా ఏమిటి?

నాకేమి తెలుసు నాయన 
దేవుడు మోసం చేసాడు 
నిన్ను మనిషిగా పంపిస్తున్నాను భూమి మీదకి 
అని చెప్పాడు కాని....
ఇలాగ పుడితే మీ నాయనకు  అవమానం అని చెప్పలేదు 
''ప్రామిస్ యు'' నాన్న నీ తల గర్వంగా 
ఎత్తుకునే పనులే చేస్తాను....
''ఐ లవ్ యు '' నాయనా 
ఒక్క సారి నన్ను చూడటానికి రావా ప్లీజ్.....

(పెదమ్మకి ఎవరు పుట్టారు అంటారా?అందుకే కదా 
''ఎర్ర అరుగుల కధలు ''సిరీస్ వ్రాస్తున్నాను .చదవండి.తెలుస్తుంది.)

Monday, 11 February 2013

నాన్న వేలు పట్టుకొని ......

నాన్న చెట్టు...నాన్న ఆకాశం...నాన్న సముద్రం...
మరి ఇంత గొప్ప మా నాయన స్పర్శ నేను ఎప్పుడు మొదటగా 
పొంది ఉంటాను?
అసలు నేను ఈ గాలి ఈ నేల స్పర్శ ఎప్పుడు పొంది ఉంటాను?
రండి నాతొ చూపిస్తాను.

అదిగో కావలి లో ట్రంక్ రోడ్ పక్కన ఎర్రఅరుగుల ఇల్లు.
రెండు అరుగుల మధ్యలో ఆరు మెట్లు.మెట్లు దాటి లోనికి వెళితే 
 ఊచలు పెట్టి కిటికీలుగా చేసిన గది.అక్కడ చెప్పులు వదిలేసి లోపలి పొతే 
దంతులతో కూడిన పెద్ద హాలు.....మధ్యలో ఒక పెద్ద దూలానికి 
నల్లమానుతొ చేసిన పెద్ద ఉయ్యాల ఇనుప గొలుసులతో వేలాడతీసి...
గోడలకు పెద్దవాళ్ళ పటాలు,వినాయకునికి  జ్ఞాన పలం ఇస్తూ 
శివ పార్వతులు ఒక వైపు,
రామేశ్వర సైకత లింగం పూజించే సీతా రాములు మరో వైపు కొలువు 
తీరి ఉంటారు.అదిగో అక్కడే పుట్టాను నేను.

బహుశా నేను పుట్టినపుడు ఇలాగా జరిగి ఉంటుంది.
ఇంత గంభీరంగా వ్రాయకూడదు అనుకున్నాను.
కాని ఈ దేశం లో రెండో అమ్మాయికి ఇంత కన్నా 
గొప్ప స్వాగతం లభించదు అనేది వాస్తవం.

అదిగో మా పెదమ్మ,అమ్మమ్మ ,మేన మామ 
ఎవరు వస్తారో అని ఆత్రుతగా ....
చిన్నగా ఏడుపు.ఆత్రుత గా చూసిన వారికి 
పిడుగు పడినట్లే వార్తా.....మళ్ళీ ఆడపిల్లే :(

అమ్మ ఇది తెలియగానే మా మూడేళ్ళ అక్కను చూస్తూ 
నన్ను చూస్తూ కన్నీటి సముద్రం అయిపోయి ఉంటుంది...
అయ్యో నేను ఈయనకు ఏమి చెప్పాల్నా అని?
పొంగిన దుఖాన్ని ఆపలేక దిండు మీదకు జారిపోతూ .......
అదిగో అమ్మమ్మ బాధతో వెనక్కి వాలిపోయి ఉంటుంది ...
అయ్యో మగ దిక్కు లేక పోయినా ఈ చిన్న పిల్లోడిని 
పెట్టుకొని ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేసి సంసారాన్ని 
ఎలాగో లాక్కోస్తున్నాను ...
ఇప్పుడు ఆ మొండి మనిషికి రెండోసారి ఆడపిల్ల పుట్టింది 
అని చెపితే ఏమి చేస్తాడో ఎలారా భగవంతుడా 
నా బిడ్డకు ఈ సమస్య వచ్చినే అని దేవునికి మొక్కుతూ 
ఉంటుంది....

ఇక పెదమ్మకు బాధ తో చెంపలు తడిసిపోతుంటే 
అమ్మ దగ్గిరికి పరిగెత్తుకొని వెళ్లిఉంటుంది...
దుమికే  ధుఖం ''అక్కా''అని జాలిగా మొరపెడుతూ ...అమ్మని చూసి 
కన్నీరైన పెదమ్మ''ఏడవగాకమ్మ ,బాలింతవి ఏడవకూడదు''అని తానూ 
ముందుగా శోక సముద్రం అయిఉంటుంది.

వీళ్ళని చూసిన మావయ్య లేని పెద్దరికాన్ని పైన వేసుకొని 
ఇద్దరి అక్కల బాధని ,అమ్మ భయాన్ని కలం లో నింపుకొని 
కార్డ్ మీద కబురుగా ''మళ్ళీ అమ్మాయే పుట్టింది''అని వ్రాసేటపుడు 
బాధతో,భయం తో చేయి వణికే ఉంటుంది....

ఇక చూడటానికి వచ్చే బంధువులు,స్నేహితులు 
''అయ్యో చిన్నమ్మాయికి మళ్ళీ ఆడపిల్ల అంట''అని జాలితో 
కూడిన ఓదార్పులు అమ్మ లోని శోకాన్ని ఇంకా ఎక్కువగా చేస్తూ....

అయ్యో పొత్తిళ్ళలో పడుకున్న నేను ఏమి చేసేది?
నా మొదటి శ్వాస ఇన్ని దిగులు కాగడాలు వెలిగిస్తుంది అనుకుంటే 
నా మొదటి ఉనికి రెప్పల లోయల్లో 
ఇన్ని కన్నీటి సునామీలు తెస్తుంది అనుకుంటే 
పసి బిడ్డ గానే పుటుక్కున ప్రాణం వదిలేసి ఉందును....
పెరిగి ప్రపంచానికి ఏమి చేసాను కనుక....

అంతా చీకటేనా?ఇక అలాగే పెరగాలా?
కాదు ఎక్కడో ఆశ ఉండే ఉంటుంది....అమ్మ మనసు అందరిలో 
మేల్కొని ఉంటుంది...
మా అమ్మకు దూరపు వరుస అయ్యే అత్త అని ఉంటుంది...
''చిన్నమ్మాయి పిల్ల గుమ్మడి పండులాగా ముద్దుగా ఉండే''
అమ్మ చిరు ఆసక్తి తో నా మొహం లోకి తొంగిచూసి ఉంటుంది.

ఇంకో పిన్ని అంటుంది''చందమామ లాంటి మొహం ,ఎర్రటి బుగ్గలు''
అమ్మ తప్పక వేలితో నిమిరే ఉంటుంది.

పెదమ్మ అని ఉంటుంది''రింగులజుట్టు,యెంత ముద్దుగా ఉందే పిల్ల''
ఇంకో పిన్ని అని ఉంటుంది ...
''నీకేమి దిగులు పల్లేదు పోవే తప్పకుండా ఏ రాజ కుమారుడో 
వెతుక్కుంటూ  వచ్చి తీసుకెళ్ళి పోతాడు,తెల్లటి పిల్ల''
అదిగో రాబోయే రాజ కుమారుడు కళ్ళలో మెదిలాడు 
ఏమో అమ్మ పెదాలపై మెరిసిన చిన్న నవ్వు...
చిన్నగా నాపై తన పెదాల ముద్ర వేసే ఉంటుంది.

ఉబికి వచ్చే అమ్మతనాన్ని ఆపలేక చేతుల్లోకి తీసుకొని 
హృదయానికి వెచ్చగా హత్తుకొని ఉంటుంది.
''అబ్బ అమ్మ స్పర్శ యెంత బాగుందో.....
పొట్ట లోకి బయటకు వచ్చినా ప్రపంచం బాగానే ఉందబ్బ''
చిన్నగా ''కుయి'' అన్నాను అమ్మని పలుకరిద్దాము అని.

''రాక్షసి ఆ గొంతు చూడు'' మావయ్య....మొదటి ముద్దు పేరు 
పెట్టేసాడు.
పెదమ్మ,అమ్మ,అమ్మమ్మ అందరు నవ్వేసారు.
చిన్న పాప ఆగమనాన్ని స్వాగతిస్తూ...
పెరటి గోడ వెనుక బ్రహ్మం గారి మటం నుండి 
ఆయన కూడా దీవించె ఉంటాడు
''మంచి దారిలో వెళుతావు తల్లి''
అని...... :)

ఇవన్నీ సరే మా నాన్న నన్ను ఎప్పుడు తాకి ఉంటారు?
అది ఎలాగా ఉంది ఉంటుంది?అసలు కావలికి వస్తారా?
లేక ఆడపిల్ల పుట్టింది అని అలుగుతారా?
నేను ఏమి చేస్తాను,నా పుట్టుక నాచేతిలో ఉందా?
రా నాయనా......నిన్ను చూడాలి.....
                                      (ఇంకా ఉంది)

Friday, 1 February 2013

అమ్మ దిద్దించిన అక్షరాలు ........

రెండక్షారాలు ఎంత తియ్యగా ఉన్నాయి.....
సుఖం లోనే కాదు .....కష్టం లో తలుచుకుంటే కూడా
ఇంతకూ ముందు ''తెలుగు మహా సభలు''గూర్చి వ్రాసినపుడు 
ఈ పోస్ట్ వ్రాస్తాను అని చెప్పాను.
ఇప్పటికి వీలు అయింది.ఎందుకంటె అమ్మ అంటే  పదాల కూర్పు కాదు....
ఆత్మీయతల పేర్పు.

అమ్మ అనే పదం నా జీవితం లో పుటింది నేను పుట్టినాకే కదా ....
అమ్మ అంటూ ఉంటుంది ''శశి నువ్వు పుట్టింది నాకు తెలీదు 
ఒక రకమైన మగత లోకి వెళ్లాను.నువ్వు పుట్టాక లేపారు అని.''
మరి ఎందుకు అలాగా నాకు తెలీదు.కాని అప్పుడు పెట్టాల్సిన కష్టం అంతా
నా అల్లరితో పెళ్లి వరకు పెట్టేసాను.

నాకు తెలిసి భారతదేశంలో విలువలేనిది ఏమిటంటే అక్కడ 
పుట్టిన ఆడపిల్ల.అందులో రెండో పాప అంటే  అసలు పట్టించుకోరు.
కాని అమ్మ నాకు చక్కని పేరు పెట్టడమే కాక ఎవరైనా పూర్తి పేరు  
వ్రాయకపోయినా ఒప్పుకోదు.మొత్తం పేరు ''శశి కళ''అని వ్రాయి.
అప్పుడే కళ గా ఉంటుంది అంటుంది.

అక్షరం అంటే క్షరం కానిది.అది అన్ని కోణాలలో అమ్మ ఇచ్చే జ్ఞానం 
కూడా....అదే ఈ రోజు నా ఎదుగుదల కింద ఉన్న బలం.

అమ్మ నేర్పిన జ్ఞానం నాకు ఉహ తెలిసి వినాయక చవితితోనే ....
మా అమ్మ పిల్లలు అందరిని కూర్చోపెట్టి ,పుస్తకాలు ఆయన 
ముందు ఉంచి శ్లోకాలు మా చేత పలికిస్తూ ,ఒక్కో పత్రీ వేయిస్తూ 
పూజ చేయించేది.మరి ఊరికినే పలికేస్తే నేను ఎలా అవుతాను?
ఆమె మొదలు పెడుతుంది''శుక్లాం భరధరం''
నేను ''చుక్లాం బలదలం ''ఆమె ''విష్ణుం''నేను''విషుం''
ఆమె ''శశి వర్ణం''నేను.....హయ్య నా పేరు నా పేరు అని యెగిరి 
గంతులు.నీ పేరే లెమ్మ పలుకు.''శశి అంటే  స్వచ్చమైన తెలుపు''
మంచిగా అలా  ఉండాలి అని బతిమిలాడి పూజ చేయించేది.
అలా శ్లోకాలతో నాలుక తిరిగే దాక వల్లే వేయించేది.

తరువాత అక్షర జ్ఞానం .....మా ఇంట్లో చిన్న పిల్లల పుస్తకాలు 
''చందమామ''''బుజ్జాయి''''బాల జ్యోతి''ఇలా సమస్త 
పుస్తకాలు మా నాన్న కొనేవారు.ఆయనకు నిద్రపోయే ముందు 
చదువుతూ దిండు కింద పెట్టుకొని నిద్ర పోయేవారు.నాకు ఇప్పటికీ 
అదే అలవాటు.
ఆ పుస్తకాలు చూసే వాళ్ళం.రంగు రంగు బొమ్మలు...గుర్రాలు,
రాక్షసులు,రాకుమార్తెలు...ఇలాగ....మరి మాకు చదవడం రాదు.
ఇంక ఎవరు శరణు....అమ్మే....
'అమ్మా అమ్మా చెప్పమ్మా''అని తిరిగే వాళ్ళం.అయితే మీరు 
అక్షరాలు గుర్తుపట్టి  చెపితే చెపుతాను అనేది.ఇంక చేసేదేమీ లేదు.
చచ్చినట్లు గుర్తు పట్టి కూడి కూడి చదివేవాళ్ళం.అప్పుడు ఆ కధ అక్కడ ఉన్న దానికి 
మించి చెప్పి ఊహా లోకం లో తిప్పుకొచ్చేది.ఆ వర్ణనలో మేము ఎక్కడ 
ఉండేది మర్చిపోయేవాళ్ళం ...
అయ్యో అప్పుడే అయిపోయిందా అని నిరాశ,బెలూన్ లో 
గాలి తీసేసినట్లు.....అక్క,తమ్ముడు,చెల్లి నలుగురం ...అమ్మ అందరికి 
అన్నం కలిపి ముద్దలు పెట్టేది....ముద్దలతోటి కధలు,కొన్ని సార్లు కధ సగం 
చెప్పి తరువాత ఏమి అవుతుందో చెప్పండి అనేది.
మా చెల్లి మరీ చిన్న పాప, కాని మేము పోటీలు పడి 
ఊహించి చెప్పేవాళ్ళం.ఇక బడికి వెళ్ళే తరుణం.
(తరువాత ఈ కధలు అల్లే జ్ఞానం తో హై స్కూల్ కి వెళ్ళినాక 
బొమ్మల పుస్తకాలకు కధలు పంపెదాన్ని....అందుకే అంటారు 
ఏదైనా చిన్నప్పుడే రావాలి అని)

బడి అంటే .....నేను బడికి వెళ్ళలేదు.స్కూల్ కి వెళ్లాను.
అవును మా ఊరిలో ఒక రెడ్డి గారి అమ్మాయి కోసం 
ఒక బుజ్జి స్కూల్ ఒక ఆంగ్లో ఇండియన్ మేడం,వారి భర్త ఉండేవాళ్ళు .
మేడం ఎప్పుడూ గౌన్స్ వేసుకునే వాళ్ళు.వాళ్లకు సహాయంగా 
కుమారి టీచర్.అసలు ఆ స్కూల్ లో ఎంత మంది పిల్లలు అనుకుంటున్నారా?
నేను మా పెదనాన్న పిల్లలు ఇద్దరు ఇంకో ఐదారుమంది  బయట పిల్లలు.
నా కే.జి.అయ్యేసరికే స్కూల్ మూసేసారు.అప్పుడు కుమారి మేడం 
మళ్ళా స్కూల్ లాంటిది పెట్టి మమ్మల్ని లాక్కోచ్చింది.తరువాత 
హై స్కూల్ మామూలు జెడ్.పి.స్కూల్ లో.

ఒకటి రెండు తరగతులు అంతా ఇంగ్లీష్.అమ్మను ఒప్పచెప్పించుకోమంటే 
ఆమెకు రాదు.ముందు నా దగ్గర చదవడం నేర్చుకొని ఒప్పచెప్పించుకునేది.
నేను ఒకటో తరగతి లోనే మా అమ్మమ్మకు లెటర్  వ్రాసాను,
అడి చూసి మురిసిపోయింది.ఏ చిన్న మంచి విషయం చేసినా భలే 
ప్రోత్సహిస్తుంది.ఎక్కడ సైకాలజీ నేర్చుకుందో.....

ఇంకా ఎన్ని పోస్ట్లు ఉన్నాయో....అమ్మ నేర్పించిన విషయాలు వ్రాస్తే 
అందుకే ఇంకో పోస్ట్ వరకు సశేషం :)
ఒక్కసారి మీ అమ్మని తలుచుకొని,మీ బుడి బుడి అడుగులు చూసి మురిసిపోయిన 
అమ్మను తలుచుకోనినవ్వుకోండి వారాంతం లో....
అంత కన్నా మనకు తృప్తి ని ఇచ్చేది ఇంకేది లేదు .