Friday 28 December 2012

గతమెంతో ఘన కీర్తి కలవోడ 1

అర్ధం అయింది కదా ఏమి వ్రాయపోతున్నానో.
అదే తిరుపతిలో జరుగుతున్న తెలుగుసభల గూర్చి.
ప్రభుత్వం  37 ఏళ్ళ తరువాత 27,28,29 తేదిలలో మన 
రాష్ట్రం లో తిరుపతి లో నిర్వహిస్తూ ఉంది.పాపం తెలుగు 
ఆక్సిజన్ ఇచ్చేవాళ్ళు లేక అంపశయ్య మీద మూలుగుతూ 
ఉంది.అది కాక మనకు గంట దూరం లో  చేస్తుంటే వెళ్ళాలి 
అని మనసు కొంచెం మూలిగింది.కాని బడి,ఇల్లు ఇవన్ని వదిలి 
ఏమి పోతాము లే అనుకోని గమ్ముగా ఉన్నాను.ఇంతలో 
ములుగు.లక్ష్మి ఫోన్....వస్తున్నావా?అని,తోడు ?అడిగాను.
మా వారు వస్తున్నారు చెప్పింది.హమ్మయ్య అన్నయ్య వస్తే దిగులు లేదు.
మెల్లిగా ఈయన చెవిలో ఊది సాయంత్రం వస్తాను అని ఒప్పించాను.
ఇంకేమిటి...బడికి ఫోన్ చేసి సి.ఎల్ చెప్పేసి రెండురెక్కలు విప్పేసుకొని 
యెగిరి తిరుపతికి .........

రేణుగుంట ముందే బస్ బై పాస్ లోకి వెళ్ళింది.ఇక అక్కడి నుండి అన్నీ ఫ్లేక్సీలు,మామిడి తోరణాలు,అరటి చెట్లు ,
చివరికి పూల కుండీల మీద కూడా ''అ,ఆ,ఇ ,ఈ ''అని ముగ్గులు,
ఆహా భలే తీర్చారు,అక్కడక్కడా తెలుగు మహానుభావులు,
''ఇది మన సొంత ఇంటి పండుగ ...రండి ...కలిసి మెలిసి పాల్గొందాము నిండుగా ''
ముఖ్య మంత్రి గారు నవ్వుతూ ఆహ్వానిస్తున్నారు.
అయ్యో అన్నగారు ఏరి?
''ఆవకాయ లేని అన్నమా?అన్న గారు లేని తెలుగు ఉత్సవమా ?''
హమ్మయ్య అరుగో కృష్ణుని లాగా....మనసు తృప్తి పడింది.ఇక 
వివిధ వ్యాపార సంస్తల వాళ్ళు కూడా ఫ్లేక్సీలు పెట్టారు.

''అభివృద్దికి ఉండాలి నింగే హద్దు ,అది బాషాచారాలు మింగే వద్దు''
...హోటల్ బ్లిస్స్, ఇదేమిటిఅంటారా? 
నాకు అర్ధం కాకనే ఇక్కడ ఉంచాను.
బస్ స్టాండ్ లో ఉచితబాస్ లో ఎక్కి పన్నెండుకు 
''పశు వైద్య విశ్వ విద్యాలయం''చేరుకున్నాము.
ఎవరో అంబాజీ అంట భలే వేసారు స్టేజ్,బోజన శాల,స్టాల్స్,సైకత శిల్పం 
ప్రధాన వేదిక అయితే అదిరింది.తామర పువ్వు నుండి వచ్చినట్లు భలే వేశారు.
(ఫోటోలు నేను ఫోటో బ్లాగ్ పెట్టిన తరువాత ఉంచుతాను)
ఆహ్హ్హ తెలుగు పండుగ చూస్తుంటే కళ్ళకు విందే.ఇక రక రకాల 
శకటాలు,సాంస్కృతిక కళా రూపాలు ....పాండురంగ భజన,
తప్పెట్లు,బుడ బుక్కల వాళ్లు,చెంచులు,పగటి వేషగాళ్ళు వాళ్లు 
కూడా కొంచెం ఊపిరి పీల్చుకున్నట్లు ఉన్నారు.భోజన ఏర్పాట్లు 
బాగున్నాయి కాని చాలలేదు.
కిరణ్ గారు చాలా కష్టపడి తెలుగులో మాట్లాడారు(హమ్మయ్య మన 
పరువు పోలేదు)అందరు పంచలలో చక్కగా ఉన్నారు . 
నాకైతే వై .ఎస్.ఆర్ గారు గుర్తుకు వచ్చారు.మన ఆహార్యానికి 
యెంత గౌరవం ఇస్తారో ఆయన.
స్టాల్స్,అక్షరం చెట్టు,సైకత శిల్పం ఇంకో పోస్ట్ లో వ్రాస్తాను.
మధ్యాహ్నం 
''రాళ్ళ బండి కవితా ప్రసాద్''గారి 
ఆధ్వర్యం లో ''ఆధునిక కవి సమ్మేళనం'' జరిగింది.
ఇది ఇంకో పోస్ట్ వ్రాస్తాను.బస్ ఎక్కుతుంటే ఈయన 
అంపకాలు''పుస్తకాలు కొనుక్కొని రావొద్దు''ఇంకా 
అంటారు ........

ఏముంటుంది దానిలో?
ఎలా ఉంటుంది?ఎలా చెప్పాలి ?
అనుభూతిని అక్షరీకరించగలమా?
నీ గుండెలపై నా తల వాలినపుడు నీకెలా ఉంటుందో 
అక్షరాలు నా కనుపాపల పై వాలినపుడు అలా ఉంటుంది .....
నా పాపటి కుంకుమ నీ పెదాల పై యెంత రుచి ఇస్తుందో 
బాష వెనుక భావాలు నాకు అంత  రుచినిస్తాయి .........
పాప ను తొలిసారి నీ చేతుల్లోకి తీసుకుంటే స్పర్శ ఎలా ఉందొ 
ఇష్టమైన పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంటే నా మనసుకు అలా ఉంటుంది ......
ఎలా చెప్పాలి?ఏమని చెప్పాలి?హ్మ్ .......

ఈ రోజు పేపర్ చదివినాక ఒకర్ని చూడలేదే అని మనసు బాధగా 
మూలిగింది.అది ''అన్యా గారు '' ఈవిడ ఎవరు అంటే...ఎనబైల్ల్లో 
ఉన్నత పాటశాల  స్తాయికి  వచ్చిన వాళ్లు అందరికి 
విశాలాంధ్ర వ్యాన్ ద్వారా పరిచయం అయిన సోవియట్ పుస్తకాలు 
''రాదుగా''''ప్రగతి'' ప్రచురణ సంస్తలలో పని చేసిన వారు.
అప్పట్లో పిల్లల తలపుల్లో సృజనాత్మకత  ఈ పుస్తకాల 
వలన వికసించేది.ఈ రోజుకు కూడా నాకు విశాలాంధ్ర వ్యాన్ 
అంటే అంత  గౌరవం,ఇష్టం.మా నాన్న వేలు పట్టి వ్యాన్ లోకి 
వెళ్లి కొన్న ''ఎర్ర కోడి''కధలు ,జమీల్య,రసాయనిక మూలకాల 
రహస్యాలు(ఈ పుస్తకం చదివే మాకు రసాయన శాస్త్రం అంటే భలే 
ఇష్టం వచ్చింది.ఊరికే చెప్పకుండా చిన్న చిన్న కవితలతో 
కధలుగా ఆవిష్కరణలు చెపుతుంటే....ఈ రోజుకు కూడా నేను 
దానిని చదువుతూ ఉంటాను).అసలు పెళ్లి అయినాక అత్తగారింటికి 
వెళ్ళటానికి బట్టలు కంటే ముందు ఈ పుస్తకాలు సర్దుకున్నాను.
''మా నాన్న వేలు పట్టుకొని'' ''అమ్మ దిద్దించిన అక్షరాలు ''
రెండు పోస్ట్లులు  వేస్తాను చూడండి.ఇప్పటికీ నా దగ్గర ఉన్న 
 నావి,మా పిల్లలకి కొన్నవి రాదుగా,ప్రగతి ప్రచురణలు 
ఫోటోలో చూడండి.
చిత్రం ఏమంటే మా పిల్లలకు కూడా అవి భలే నచ్చాయి.
ఇప్పటికి ''బుల్లి మట్టి  ఇల్లు''కధలో మేక పాట  పాడి లేపి 
వాళ్ళను నవ్విస్తుంటాను.దొరికితే ఒక్క సారి వాటిని చూడండి.



Tuesday 25 December 2012

డిల్లీ సంగతి సరే మరి గల్లీ సంగతి?2

భూమి ఆకాశం నువ్వే.....గర్జించు 

ఆగొద్దు ...ఆపొద్దు 
యువతా ఆగొద్దు 
భూమి ఆకాశం నువ్వే అయ్యి గర్జించు 
నీ సహనం మోసే చివరి పుడక ఇదేనని నినదించు .....
గాజులు వేసుకున్న చేతిలోని గాండీవం సవరించు 

యుద్ధం లో గెలిచినా ఝండా అయినా 
కర్మాగారాల్లో కరిగే శ్రామిక శక్తి అయినా 
అక్షరాల్లో  ఒదిగే మేధస్సు అయినా 
ఆకాశాన్ని అంటిన విజ్ఞానం అయినా 
నీ రక్తం నుండి వచ్చినదే 
నీ స్తన్యం తో పెరిగినదే ........

కష్టాన్ని అన్నం గా మారుస్తూ కాలిన చేతులకు 
తక్కువ కూలితో నారేతలు వేస్తూ  పుళ్ళు పడిన పాదాలకు 
తాగి తన్నిన తన్నులకు 
సుఖపడుతూ  మనకు పంచిన రోగాలకు 
మిగిలిన తెల్ల అన్నమే పరమాన్నం గా నింపుకున్న ఆకలికి 
కంట్లో అదిమిన కన్నీటి చుక్కలకు 
కాలే కడుపు తో చేసిన కష్టానికి 
మోసిన నీటి కుండలకు 
మోస్తున్న పరువు బరువులకు 
ప్రతి ఒక్కరు లెక్క చెప్పాల్సిన సమయం ఇదే 

కిరాతకుల కాళ్ళ కింద నలిగిన ఆ చిన్నారి పువ్వు 
స్పృహ వచ్చి  బాధతో మూలిగినపుడు 
సూదులుగా గుచ్చే మాటలను విన్నప్పుడు 
మౌనంగా డిప్రషన్ లోకి వెళ్లబోయే క్షణాన 
మానని గాయాన్నిమాటలతో  పచ్చి పుండు లాగా
కేలుకుతున్నప్పుడు .....మన ధైర్యం 
ఆమెకు ఊపిరి పోయాలి ......
మన తోడ్పాటు ఉత్తెజాన్ని  ఇవ్వాలి .....

ఆగొద్దు యువతా  ఆగొద్దు ....
భూమి ఆకాశం నీవే అయి గర్జించు 

''పరులు కోసం మోగే గుండె 
విప్లవాలు నినదించే డప్పు''

ఆత్మ సాక్షి గల ప్రతి ఒక్కరు నీ వెంటే 
అమ్మ పాలు తాగిన ప్రతి ఒక్కరు నీ వెంటే 
వాళ్లు పిలిస్తే రావాలా?అని ప్రశించే అధికారం 
అమ్మ పాలు తాగామని గుర్తొచ్చి కదలాలి ....
మేము  మీ వెంటే .....
మీ రక్షణే మా భవిత 
అని మేలుకొని మోకరిల్లాలి 

ఆగొద్దు యువతా ఆగొద్దు....
ఆపొద్దు యువతా ఆపొద్దు 
        @@@@@@


''హోంగే కామియాబ్ ....హోంగే కామియాబ్  ఏక్ దిన్
ఓహో మన్మే హై  విశ్వాస్ ....పూరా హై విశ్వాస్ ''

''హం చలేంగే సాత్ సాత్ 
హం చలేంగే సాత్ సాత్ 
హం చలేంగే సాత్ సాత్ .....ఏక్  దిన్ 
ఓహో మన్మే హై  విశ్వాస్ ....పూరా హై విశ్వాస్ 
హం చలేంగే సాత్ సాత్ .....ఏక దిన్ ''

ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు సాక్షి వారు నిరసన ప్రదర్శన 
కొవ్వోత్తులతో పాల్గొనండి.ఇదే కాదు ఏ ప్రదర్శన అయినా 
మీరు పాల్గొనండి.గడ్డి పరకలు ఒక్కటైతేనే ఏనుగును కూడా 
బంధించగలవు.
ఒక్క సారి మార్చ్ ఎనిమిది ఎలా ''మహిళా దినోత్సవం ''వచ్చిందో 
గుర్తు చేసుకోండి.శ్రమ లకు ఓర్వందే....ఏ అవకాశం మనకు 
లభించలేదు.మహిళా సాధికారత మన లక్షం .
బద్రత కావాలి అవశ్యం.
పేపర్ వాళ్లు నిర్వహించిన కొన్ని కార్యక్రమాలు చూసాను.
పాల్గొన్నాను.మనలను గౌరవంగానే చూస్తారు.పలకరిస్తారు.
తప్పకుండా పాల్గొనండి.మన గౌరవం మనమే కాపాడుకోవాలి.
మన బిడ్డలు మనకు యెప్పుడు  తోడూ ఉంటారు.




Monday 24 December 2012

డిల్లీ సరే....గల్లీల సంగతి ఏమిటి?

అమ్మా మేమందరం మిగిలిన కాలేజ్ వాళ్ల తో కలిసి 
డిల్లీ అమ్మాయి విషయం లో ఏదైనా నిరసన తెలియచేస్తే 
ఎలా ఉంటుంది?అడిగింది పాప.
నా మనసులో ఉన్నది అదే ....మేము ఏదో చెప్పడం,
అభిప్రాయాలు తెలపడం కాదు, ఎవరి దగ్గర నుండి చైతన్యం 
రావాలో అక్కడ నుండి రావాలి.వాళ్ళ విషయాలను ,హక్కులను 
పరిరక్షించుకునే చైతన్యం తప్పని సరి వాళ్లకు.ఎప్పుడూ ఎవరో 
ఒకరు వచ్చి కాపాడరు.అసలు ఆ అమ్మాయికి తోడు ఉన్నారు 
కూడా ,ఏమి అయింది?ఎవరు పిలిస్తే అంత మంది వచ్చారు?
తప్పు ఒప్పులు నిర్ణయించగల విచక్షణే అంత మందిని అక్కడకు 
రప్పించింది.
నేను ఇక్కడ అభిప్రాయాలు ఏమి చెప్పను.కొంచెం విశ్లేషిస్తాను. 
ఎందుకంటె అభిప్రాయాలు అనేవి ఏనుగు పరిశీలించే గుడ్డి వాళ్ళ 
మాటలు లాంటివి.కాలు పట్టుకున్నవాళ్ళు  స్థంభం లాగుంది అంటారు.
తోక పట్టుకున్న వాళ్లు సన్నగా తాడు లాగా ఉంది అంటారు.విజ్ఞతతో 
మనం అన్నీ విని ఒక నిర్ణయానికి రావాలి .
అందరు ఒకే గొంతుతో చెప్పే మాట ''వాళ్లకు పెద్ద శిక్ష పడాలి 
అపుడే మిగిలిన వాళ్లకు భయం ఉంటుంది''అని.నిజమే 
కానీ అదే పరిష్కారం కాదు.తీసుకోవాల్సిన చాలా చర్యలలో 
అది ఒకటి.
రెండోది ......మీరు చదివే ఉంటారు.పక్క రోజు వాళ్ళల్లో కొంత 
మంది తమ తప్పు ఒప్పుకొని తమకు శిక్ష వేయమని ఒప్పుకున్నారు.
మరి ఆ తెలివి ముందు రోజు ఏమి అయింది?సమాధానం అందరికి 
తెలుసు...మద్య పానం .అది మనిషి లోని మృగాన్ని బయటకు తెస్తుంది.
ఆ మృగానికి మనం వేసిన శిక్షలు అప్పుడు భయం కలిగించవు.
ముందు చేయాల్సింది .....దీని గురించిన ఎరుక అందరిలోకి 
తీసుకుని రావడం .తాగడం అనేది మామూలే  అని తాగడం అలవాటు 
అయిన వాళ్లు అనవచ్చు.అందరికి అలవాటు అయినంత మాత్రాన 
అది తప్పు  కాకుండా పోదు.ఖచ్చితంగా వాళ్లు దానిలోనుండి బయటకి 
రావాల్సిందే.
మేము ''లీడ్ ఇండియా''ట్రైనింగ్ లో మానసిక నైపుణ్యాలు అనే 
క్లాస్స్ లో ఏమి చెపుతాము అంటే....ఆలోచనలు>>మాటలు>>
చేతలు>>అలవాటు>>వైఖరి .....ఇలాగ ఒక వరుసలో మనం 
మంచి అలవాట్లు వైపు అయినా,చెడు వైపు అయినా వెళ్ళిపోతాము.
ఆలోచనలు అనే స్టేజ్ లో విచక్షణ అనేది ఉపయోగిస్తే మనం 
మంచి వైపుకు వెళ్లి పోతాము.మనం దీనిని చిన్న పిల్లలు అప్పటి 
నుండి అభివృద్ది చేయాలి.
దీనితో పాటు అమ్మాయిలూ కొంత వరకు ఆత్మ రక్షణ విద్యలు 
నేర్చుకోవాలి.మన పురాణాలలో స్త్రీలు కూడా నేర్చుకొనేవారు.

అసలు వీళ్ళు ఎందుకు బయటకి రావడం అనేవాళ్లకు చిన్న 
విన్నపం .....స్త్రీ పురుష శక్తులు పరస్పరాశ్రితాలు.తెలివి గల 
సమాజం వాళ్ళలోని జ్ఞానాన్ని కూడా చక్కగా వినియోగించుకొని 
ముందుకు వెళ్ళాలి.సగం లోకం లో నిండిన శక్తిని చదువుకున్న 
సంస్కారవంతులుగా ఉన్న మనం చిన్న చూపు చూడ కూడదు.

''ఆడవాళ్ళు కూడా చక్కగా పనులు నిర్వహించగలరు.
సమాజ నిర్మాణం లో వారి భాగం కూడా ఉండాలి 
అనుకొనే వాళ్లు ఈ క్రింది మేటర్ చదవండి''






Monday 17 December 2012

కొంచెం మా విద్యార్ధినులను దీవించండి

కొంచెం మా విద్యార్ధినులను దీవించండి ....
విషయం ఏమిటి అంటే ''ప్రపంచ తెలుగు మహా సభలు''
సందర్భంగా మా బడిలో చిన్న కవితా శిక్షణ 
కార్యక్రమం పెట్టాను.అందులో పిల్లలు వ్రాసినవే ఈ 
''అక్షరం''కవితా సంకలనం.రాసి లో చిన్నదే ...
మరి వాసి లో అంటారా పిల్లల వయసుని గమనించే 
మీ సహృదయత మీద ఆధారపడి ఉంటుంది.

అయితే ఈ సేకరణ జరిగేటపుడు చాలా మంది పిల్లలు 
వచ్చి మేడం మేము కధలు ఇస్తాము అని అడిగారు.
అప్పుడు నేను ఈ సారి ''కదా సంకలనం'' వేస్తాను అని 
చెప్పి పంపేసాను.
ఈ సారి పిల్లలను వాళ్ళల అమ్మలు,తాతలు,అమ్మమ్మలు 
చెప్పిన కధలు తెమ్మని చెపుదాము అనుకుంటున్నాను.
సంకలనం పేరు''మా పిలకాయల కధలు''
ఇంతకూ ముందు జన విజ్ఞాన వేదిక వారు ఈ ప్రయత్నం 
చేసి ఒక కధాసంకలనం ''మా నెల్లూరు పిల్లోల్ల కధలు''
వెలువర్చి ఉన్నారు.కాని వారు సేకరించింది 
''పుట్టెడు వడ్ల లో పిడికెడు''ఇంకా ఎన్ని ఉన్నాయో.....

అమ్మ వొడిలో వెచ్చగా రగిలి ఊపిరి పోసుకున్న రెక్కల 
గుర్రాలు,తాతయ్య భుజాలపై ఊగుతూ సప్త సముద్రాలు 
దాటించిన కధలు,అమ్మమ్మ వేలు పట్టుకొని ఊహల 
రంగుల రాట్నం తిరిగి సృజనను ఊపిరిగా పీల్చిన కధలు....
బాల్యపు కలలను అందంగా హృదయ పుటలలో 
జ్ఞాపకాలుగా నెమలీక అంత బధ్రంగా దాచుకున్న కధలు ...
ఒక్క సారి ఆ పిల్లల కలం పై మన చెవులు ఉంచితే చాలు 
తమ ఊసులన్ని రంగావల్లులుగా తీర్చి మన ఒడిలో 
రాసులు పోస్తారు.
అయితే సమస్య ఏమిటి అంటే ''స్పాన్సర్స్''కోసం చూస్తున్నాను.
మనం అందరం దీనిలో బాగం పంచుకుంటే ఎలా 
ఉంటుంది?







Monday 3 December 2012

ఏమండోయ్ శ్రీవారు :))

''అక్కా''యెగిరి గంతులు వేసింది చెల్లెలు.
ఇప్పుడే తలస్నానం చేసి వస్తూ ఉందేమో 
తల తుడుచుకుంటూ తలుపు తీసింది.
మెడ చూద్దును కదా బోసిగా....వార్నీ ఏదో 
కొత్తగా పెళ్లి అయింది ఎలా ఉన్నారో చూసి 
పోదాము అని వస్తే ఏమిటే ఇది?లాభం లేదు 
మాంగల్య విశేషాలు ''జాజి పూలు''బ్లాగ్ స్పాట్ 
లో చూపాల్సిందే మనసులోనే గట్టిగా అనుకున్నాను.

ఇంతలోనే ''రామ్స్...మా అక్క వచ్చింది''
లోపలి చూస్తూ పిలిచింది ..కాదు ఇంట్లోకి 
రైల్ వచ్చి కూత వేసినట్లు అరిచింది.దీనికి 
ఇంకా చిన్నతనం పోలేదు నవ్వుకున్నాను.
పాపం అతను ఆఫీస్ కి వెళుతున్నట్లు ఉన్నాడు.
వచ్చి నవ్వుతూ ''బాగున్నారా''
అడుగుతూనే షూస్ వేసుకుంటూ ఉన్నాడు.అర్ధం అయింది.
పాపం అతనికి టైం అవుతూ ఉంది.
''పర్లేదులెండి ....మీరు వెళ్ళండి.దీనితో మాట్లాడుతాను.
ఇంకో సారి వస్తాను''చెప్పాను .అతను థాంక్స్ చెప్పి 
వెళ్ళిపోయాడు.
''చెప్పక్కా ఏమిటి విశేషాలు?''అడిగింది.
''నా విశేషాలు సరే నీ సంగతి ఏమిటి?
ఏమిటి పెద్ద పేరు పెట్టి పిలిచేస్తున్నావు బొత్తిగా 
భయం లేకుండా?''
''ఏమిటి భయమా?నాకా?''సంతూర్ ఆడ్ లాగా 
అడిగేసింది.
''పోక్కా ఏమండీ ఏమిటి పాట చింతకాయ పచ్చడి లాగా''
అని కూడా అనేసింది.

లాభం లేదు దీనికి క్లాస్స్ పీకాల్సిందే ....
గొంతు సవరించుకున్నాను.

కొత్తగా కాపురానికి వచ్చి కాఫీ ఇచ్చే భార్య ''ఏమండీ''అని ఒకలా అంటుంది ....

పనిమనిషి రానపుడు సింక్ లో గిన్నెలు చూసి ''ఏమండీ''అని ఒకలా అంటుంది...

షాప్ లో తగిలించిన ఛీరలు చూసినపుడు ఒకలా అంటుంది....

సినిమా పోస్టర్లు చూసినపుడు ఒకలా అంటుంది.....

పిలుపు పిలుపుకు ఒక నాదం ఉంది ,శృతి ఉంది,బ్యాక్ గ్రౌండ్ ఉంది 

దానిని వదిలేసి పిచ్చి పేర్లతో పిలిచి దానిలోని అర్ర్ధ్రత చెడగొట్టవాకు ,

మహోన్నతమైన బారతీయ సంస్కృతిని,చెడగొట్టవాకు .......

గబా గబా తిట్టేసి గ్లాసుడు హార్లిక్స్ తాగేశాను .

అర్ధం అయినట్లు తల ఊపింది.
''అక్కా' అనింది..''చెప్పు''అన్నాను.

''మరి పేరుతొ పిలవాలి అనే ముచ్చట తీరేది ఎలా?''
హ్మ్ ...నిట్టూర్చాను.,
''హేమిటో  ఈ కాలం పిల్లలు అన్నీ చెప్పాలి,అందరి ముందు ''ఏమండీ''అని 
గద్దించితే తప్పు కాని శృంగారం లో కాలు తగిలినా తప్పు లేదంట.
కర్రీస్ అంటే కరస్పాండెన్స్ కోర్స్ లో చెపుతాము కాని కాపురాలు 
ఏమి చెపుతాము....ఇలాగ చెపితే అలాగా అల్లుకొని ఇంటిని పొదరిల్లుగా అందంగా 
మార్చుకోవాలి కాని''......నవ్వి వచ్చేసాను....

(పాత్రలు,సన్నివేశాలు నూటికీ నూరు పైసలా కల్పితం) .