Friday, 30 January 2015

ఇంక ఇప్పుడు యోగా

''శశి మేడం ఎక్కడ ఉన్నారు ? ప్రిన్సిపాల్ రూం లో మీటింగ్ 
జరుగుతూ ఉంది '' ఫోన్ విని క్లాస్ నుండి అక్కడకి వెళ్లాను . 
ఇది  మామూలే .  మీటింగ్ లో ముందు  నేను ఎక్కడ ఉన్నానో 
వెతుకుతారు . రూం అంతా సీరియస్ గా ఉంది . వేడి తెలుస్తూ ఉంది . 
ప్రిన్సిపాల్ గారు ముభావంగా ఉన్నారు . అంటే పై నుండి ఏదో అర్జెంట్ 
పనికి సర్కులర్ వచ్చినట్లే . పని కి భయం లేదు ,కాని ఈ కంప్యుటర్ 
వచ్చినప్పటి నుండి అప్పుడే పెట్టాలి అంటున్నారు . కాలం తో 
పరిగేత్తనీకుండా చేసే  క్షేత్ర స్థాయి అడ్డంకులు  చాలా ఉంటాయి . 
ఎవరికి వాళ్ళే ఎక్కడ ఈ పని తమ మీద పని రుద్దబడుతుందో అని టెన్షన్ . 

''చాలా అర్జెంట్ గా పెట్టాలంట '' చెప్పారు కొలీగ్స్ . 
''ఎన్ని రోజులు అయింది సర్వీస్ లో చేరి , అర్జెంట్ కానిది ఏమైనా ఉంటె 
కొత్తగా చెప్పండి '' పెద్దగా నవ్వాను . 
చిన్నగా అందరి పెదాలు విచ్చుకున్నాయి . 
''అయ్యాన్నీ  నాకు తెలీదమ్మ . ఈ రోజు కధ ఈ రోజే ''చిన్నగా సంతోషం ప్రిన్సిపాల్ గారిలో . 
నిజమే పై అధికారులు చెయ్యమన్నది మనం అడ్డం చెప్పకుండా చేయాలి . 
కొంత చేసి అడ్డం వచ్చినప్పుడు చెపితే కొంత సానుకూల దృక్పధం ఉండొచ్చు . 
కాని చేయడం అందరికీ తప్పనిసరి . 

''చూడండి అందరం ఒకే పడవలో ఉన్నాము . మునిగేది మేడం అనుకోవద్దు . 
పడవ తల కిందులు అయితే అందరికీ ఇబ్బంది ''చెప్పాను . 
సాలోచనగా ఊపి  పనిని ప్లాన్ చేయడం ప్రారంభించారు . 
మెల్లిగా ప్రిన్సిపాల్ గారు కూడా వంగి ప్రేమగా సూచనలు చేయడం 
ప్రారంభించారు . బయట పని పెద్ద ముక్క . తప్పదు సీనియర్స్ తలకు 
ఎత్తుకోవాలి . ఎందుకంటె పిల్లలు చదువులకు హాస్టల్స్ కు వెళిపోతే 
కాసింత పాక్షిక నన్స్  గా మారిపోయాము . జూనియర్స్ ఇంకా 
పిల్లలు , ప్రెగ్నెంట్ లు వగైరా ...... అదీ కాక మా భర్త లకు 
సినిమాకు వెళ్ళాలి అన్నా ''నీకు డ్యూటీ లేదు కదబ్బా '' అని 
అప్పాయింట్ మెంట్ తీసుకొనే జ్ఞానోదయం అయింది . 
పాపం జూనియర్స్ భర్తలు ఇంకా భార్య ల సమయం తమదే అనే భ్రమ లో 
ఉన్నారు ,ఈ జాబ్ చేరినాక కూడా . 
ఏముంది కొన్ని జీతాలుగా కాలం దొర్లితే చిట్టీ లకి , ఇంస్టాల్ మెంట్స్ కి 
అలవాటు పడితే వాళ్లకి కూడా జ్ఞానోదయం అవుతుంది . 

మొత్తానికి బయట పనికి ఎవరో ఒకరు తల అడ్డం పెట్టినాక ఇక స్వచ్చందంగా 
అందరూ తలో పని ముక్క ప్రేమగా ఆ తలను  పెట్టిన వాళ్ళను 
పరామార్శిస్తూ తీసుకుంటారు వీలును బట్టి . 
ఇక అప్పుడు ప్రిన్సిపాల్ గారి ముఖం లో నవ్వు చిందులు వేస్తూ , 
రూం అంతా  వెలిగిపోతూ ఉంటుంది .  

అంతకు ముందు ఉన్న వేడి ఏమైంది !బిగుసుకొని కూర్చున్న వాళ్ళు 
ఎలా అందరు ప్రేమగా మారారు . చిన్న చిరు నవ్వు . 
అవును టెన్షన్ సమయం లో దాని విలువ వందల వేల రెట్లుగా ఉంటుంది . 

మరి అది ఉదయించడం ఎలా ?
''ఇక ఇప్పుడు యోగా '' సమయం దానికి కొంత 
కేటాయిస్తే కందెన వేసిన చక్రం అంత హాయిగా జీవితం దొర్లిపోతుంది . 
దానికి టైం  లేదు అనడం, కార్  లో పెట్రోల్ లేకుండా  నడపడమే . 
తెలివిగల వాళ్ళు పని బాగా జరగడానికి అవసరం అయిన 
ప్రశాంత జీవన శైలిని ముందుగా ప్లాన్ చేసుకుంటారు . అమలు 
చేస్తారు . 
మొన్న 29/1/2015 నుండి మంత్రులకు , పాలనా అధికారులకు 
బాబు గారు జగ్గీ వాసుదేవ్ గారితో యోగా ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు . 
మంచిది . నలభై రోజులు ఇచ్చినా మేలే . ఎందుకంటె మనం 
అసహనంతో తప్పు చేస్తే కూడిక లో ఒకట్లో , పదులొ స్థానం లో 
తప్పు జరుగుతుంది . కాని వాళ్ళ స్థాయి లో నిర్ణయాలు అసహనం తో 
తీసుకుంటే కోట్ల స్థానం లో తప్పు జరుగుతుంది . బాబు గారు 
మంచి నిర్ణయం తీసుకున్నారు . పాలనకు ఏమి ఇబ్బంది లేదు . 
ఇప్పుడు మాత్రం నత్త నడకే కదా నడుస్తుంది , బైఫర్గేషన్ పేరుతో . 
పనిలో పని సామాన్యుడు కు కూడా ట్రైనింగ్ ఇప్పిస్తే ఇప్పటి 
నవ్యాంధ్ర ప్రదేశ్  దెబ్బలకు తట్టుకోగలుగుతాడు . 
Tuesday, 27 January 2015

ఇలా ఎలా వెళ్ళిపోయారు ఆర్ . కె . లక్ష్మణ్ గారు !!

ఇలా ఎలా వెళ్ళిపోయారు ఆర్ . కె . లక్ష్మణ్ గారు !!
ఆహా అసలు ఎలా వెళతారు ?మేమేదో మీ కామన్ మాన్ 
మాట్లాడుతాడు ఏమో ,ఈ పాలిటిక్స్ తాట వలిచేసి శుభ్రం 
చేస్తారు అనే ఆశతో ఉంటె ..... 
ఒక వేళ నేను ఎప్పటి నుండో దాచుకున్న నా కార్టూన్స్ 
బ్లాగ్ లో ఉంచానే అనుకోండి ...... 
ఏదో గురు భక్తితో మీకు కూడా ఏకలవ్య శిష్యురాలిని అని 
చెప్పుకున్నానే అనుకోండి ...... 
నా కార్టూన్స్ నచ్చకపోతే ,ఇక్కడ నేర్చుకోమ్మా ,అనాలి కాని 
ఇలా దిగులుతో వెళ్ళిపోతారా :(

అక్కడ చూడండి ...... పైలట్ విమానానికి ఇందనం అయిపోతే 
ప్లైట్ నే పారాచూట్ తో పసిఫిక్ పై దించేసి లైఫ్ బోట్ లో 
ఈదుకుంటూ వచ్చేసాడంట...... ఒక సాహసి . బహుశా 
వెనక్కి లాగే కామెంట్స్ చేసే వాళ్ళు అక్కడ ఉండి ఉండరు . 
నాకు కూడా కొంత మంది మంచి కామెంట్స్ చేసే వాళ్ళు ఉన్నారు . 
ఎలాగోలా ఈ సముద్రాన్ని ఈది ,మీకు నా కార్టూన్స్ ప్రచురించి 
చూపించేదాన్ని . ఇంకొన్ని రోజులు ఉండకూడదా !

మీరు మళ్ళీ వస్తారు నాకు తెలుసు ,ఎలాగంటే అంతే .... 
మీకు నచ్చిన కార్టూన్ ఇంకా వెయ్యలేదు అని చెప్పారు కదా ,
అందుకని మళ్ళీ వస్తారు నాకు తెలుసు . 
పెద్ద వాళ్లకు ఇచ్చే నివాళి వాళ్లకు వేసే పూల దండ కాదు ,
వాళ్ళలో నేర్చుకొనే మంచి , అందుకనే మీకోసమే ఈ కార్టూన్ .... 


ఈ రోజు సాక్షి ఫామిలీ నివాళి చాలా బాగుంది . ఆ పెద్దాయనకి కళకి , కుంచకి 
దక్కాల్సిన గౌరవం . ఒక శంకర్ గారు గీసిన కారికేచర్ తో ఆయన గురించిన 
జ్ఞాపకం . ఇంకోటి లక్ష్మణ్ గారి ఇటీవలి ఇంటర్వ్యు . 
చూడండి . 

ఈ  కార్టూన్ తెగ శ్రధ్ధగా గీస్తుంటే ఈయన అంటారు ..... 
పిచ్చిది ఏది పడితే అదే ,వచ్చేదాకా వదలవా ..... అని . 
నేనేమి చేసేది , పిల్లలు ఇద్దరు ఒకరు పెళ్లి అయి , ఇంకొకకరు 
చదువు కోసం వెళ్లి పోతే ఒక తల్లి కి ఇంకేమి ప్రపంచం 
ఉంటుంది . ఏదో ఏమైనా నేర్చుకుందాము అని తపన . 

అంటూనే ఉంటారు , మళ్ళీ నాకు కావాల్సిన సహాయాలు అన్నీ 
చేస్తూనే ఉంటారు . 
కామన్ కాపురాల్లో ఇలాంటి అన్ కామన్ కామెంట్లు మామూలే . 
అవే దీవెనలు . 
                              @@@@@@@@ 

Monday, 26 January 2015

ఇదొక లెక్కా ? (5)

కాళేశ్వరం నుండి తిరుగు ప్రయాణం హనుమకొండ కి 
నేను ఈయన ,పాప మాతో అమ్మా నాన్న బస్ లో 
బయలుదేరాము . ఉన్నట్లుండి 'సడన్ బ్రేక్ '
( idoka lekkaa ? 4 part link )

అందరిని దిగమని పోలీస్ వాళ్ళు చెపుతున్నారు . 
''ఏమి అయి ఉంటుంది ?రాత్రికి మళ్ళా అమ్మా నాన్న కి 
రైల్ రిజర్వేషన్ ఉంది . ట్రైన్ మిస్ అవ్వకూడదు . 
సగం దారి కూడా వచ్చామో లేదో !!'' దిగులుగా 
అమ్మా వాళ్ళ వైపు చూస్తె వాళ్ళు కూడా కంగారుగా 
కనిపించారు . నాన్న విషయం కనుక్కుంటున్నారు . 
''బస్ లు ఇగ  నడ్వయి . అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది '' 
చెపుతున్నాడు పోలీస్ ఆయన , ఇదంతా మామూలే అన్నట్లు 
జనాలను రోడ్ కిందకి వెళ్ళమని సైగ చేసి వెనుక వచ్చే లారీ 
దగ్గరకు వెళ్ళాడు . 

''బాంబ్ ఏమిటి !!!'' క్షణం ఏమి అర్ధం కాలేదు . మా వారికి 
కూడా పరిస్థితి అర్ధం కాలేదు . కండక్టర్ వద్దకు వెళ్లి 
కనుక్కొని వచ్చి చెప్పారు . 
''అక్కడ బాంబ్ బ్లాస్ట్ అయ్యిందంట . రోడ్ మొత్తం పెద్ద గుంట 
పడిపోయింది . ఇక్కడ వెహికల్స్ అటు , అటువి ఇటు 
రాలేవు . ఇక బస్ వెళ్ళదు ''
అమ్మ నాన్న ల వైపు చూసాను . పాపం ఈ పది నిమిషాలకే 
నిలబడలేక ఎక్కడైనా కూర్చుంటే బాగుండును అని 
చుట్టూ చూస్తున్నారు . పిల్ల భుజం మీద నుండి లేచి కళ్ళు నులుముతుంటే 
చిచ్చు కొట్టాను . మళ్ళీ నిద్రలోకి జారుకుంది . 
''ఎప్పుడు జరిగింది ?'' అడిగాను . టైం  చెప్పాడు . 
దేవుడా !!!!!!! దానికి పది నిముషాల ముందే మేము కాళేశ్వరం వెళ్ళే 
బస్ దాటింది . అంటే పది నిముషాలు ఆలస్యం చేసి ఉంటె మేము కూడా .... 

''ఏమి కాదులే . వాళ్ళు మామూలు వాళ్ళని చంపరు. పోలీస్ లను మాత్రమె ''
ఓదార్పుగా అన్నాడు ఈయన . 
ఏమిటి పెద్ద పోలీస్ లను మాత్రమె ,అసలు ఈ చంపుకోవడాలు ఏమిటి!
అసలు ఇంత జరుగుతుందని తెలుసుంటే అమ్మా వాళ్ళని ఇంత దూరం 
తీసుకుని వచ్చేదాన్ని కాదు . ఎటూ కాకుండా ఇరుక్కొని పోయాము . 
ఇప్పుడు తిరిగి వెళ్ళడానికి బస్ పరిస్థితి ఏమిటి ?
''అందరికి ఏమైతే మనకు అలానే '' ఎదురు చూడటం తప్ప దారి 
లేదన్నట్లు చెప్పారు ఈయన . 

ఛా ఈ అడవి , ఈ కాళేశ్వరం , ఈ గుట్టలు , పిట్టల పాటలు నాకేమి 
నచ్చడం లేదు . పాల బుగ్గల పాపాయి లాంటి తెలంగాణా కింద 
ఎంతటి బడబాగ్ని ఉంది . అసంతృప్తి రగిలినపుడల్లా అది మృత్యువు 
పై సవారి చేస్తూ రక్తాన్నే చిమ్ముతూ ఉంటుంది . ఎవరి రక్తం అయితే 
ఏమిటి అందరు అమ్మ కన్న బిడ్డలే కదా !!!!

''ఇప్పుడేమిటి ? టికట్ డబ్బులు అయినా వాపస్ ఇస్తారేమో కనుక్కో ''
చెప్పాను . అమ్మా నాన్నలు నిలబడి ఉంటె నాకు బాధగా ఉంది . 
అయ్యో అనవసరంగా తీసుకొని వచ్చామే అని . నయం మాధురి 
అయినా నిద్రపోతూ ఉంది . లేసిందంటే నీళ్ళు ,ఆకలి అని ఏడిపిస్తుంది . 
మెల్లిగా అందరు రోడ్ దిగి రోడ్ కి కొంత దూరంగా ముళ్ళ కంపల మధ్య దారి చేసుకుంటూ 
నడక ప్రారంభించారు . ఒక్కో మాట చెవిలో పడుతూ ఉన్నాయి . 

''ఏడుగురు చనిపోయిన్రంట . ''
ఏడుగురా !!నాకు సన్నగా వణుకు . అసలు ఇలా చంపడం , రక్తం అవీ 
భలే భయం మాకు . కోటమ్మ కి కోళ్ళు బలి ఇచ్చే ద్వారం దగ్గర 
కూడా నడవనీరు పెద్ద వాళ్ళు . కోళ్ళు , మేకలు దారిలో అంతా 
బలి ఇస్తారు అని కన్పూరు జాతర కు ఎవరమూ వెళ్ళం అప్పట్లో . 
కుడుములు ఇంట్లో చేసి వెళ్ళే వాళ్ళతో ముత్యాలమ్మకి పంపిస్తాము . 
ఇప్పుడు ఈ దారిలో అన్ని శవాలు ,రక్తం చూడాల్నా ? నాకు 
భయం మెల్లిగా పాకుతూ వస్తుంది . వేళ్ళలో వణుకు . వద్దు వద్దు 
అటు చూడను . ఇప్పుడే పడిపోతనా ఏమిటి !!

'' ఇక్కడ ఇవన్నీ మామూలే '' నాన్న అమ్మతో చెపుతున్నాడు 
 ధైర్యం కోసం . ఎవరూ ఏమి మాట్లాడుకోవడం లేదు . అదొక 

రకమైన వాతావరణం , ఎవ్వరూ కోరుకోనిది . 

''శశి డబ్బులు రిటర్న్ ఇవ్వరంట . ఇక్కడ రోడ్ పక్కన దిగి ఆ కంప ల్లో 
నడిచి పొతే రెండు కిలోమీటర్లు తర్వాత రోడ్ ఎక్క వచ్చు . 
అక్కడ ఇప్పుడే వచ్చిన బస్ లు వెనక్కి వెళుతూ ఉంటాయంట . 
త్వరగా వెళితేనే అవైనా దొరుకుతాయి. ''చెప్పారు . 

మళ్ళీ ఇంత చార్జీలు చేసేదేముంది ,ముందు ఇక్కడ నుండి 
బయట పడాలి . నడిచేందుకు వీలుగా పాపని ఎత్తుకొని 
అందరం రోడ్ దిగే నడక ప్రారంభించాము . కాలి బాట 
ఏర్పడకపోయినా ముందు వాళ్ళ కాళ్ళ  కింద నలిగిన గడ్డి దారి 
చూపిస్తూ ఉంది . ఎలా అడుగులు వేస్తున్నానో నాకే తెలీదు . 
నా గుండె చప్పుడు నాకే వినిపిస్తూ ఉంది . మెల్లిగా పర్లాంగు 
దూరం లో ఉన్న రోడ్ వైపు చూసాను . తల క్రిందులుగా 
పడిపోయిన జీపు టైర్స్ పైన కనిపిస్తూ ఉన్నాయి . చుట్టూ 
శరీరాలు ఎలా అంటే అలా పడిపోయి ..... అబ్బ అదేమిటి 
ఎర్రని రక్తం మధ్యలో చేయి ,విరిగిపోయిందా !! నేను చూడలేను . 
చూపు తిప్పేసుకున్నాను . వాంతి  వచ్చేస్తే బాగుండును .  
అమ్మ నాన్న నడవలేక చిన్నగా నడుస్తున్నారు . 

''పోలీస్ లు అనుకోని బ్లాస్ట్ చేసిన్రంట . ఇద్దరే పోలీస్ లు సెక్యురిటీ కి 
అచ్చిన్రు . మిగిలినోల్లు బ్యాంక్ వొళ్ళు ''
వెనుక నుండి మాటలు వినిపించి గుండె ఇంకా వేగంగా కొట్టుకుంది . 
అంటే ఎవరు వస్తున్నారో చూసి చేస్తారా ?మరి సరిగా చూడొద్దా !!
పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పుడెలా ఏడుస్తారో , అవసరం లేని 
వాళ్ళను కూడా చంపేస్తే ,  అసలు నా మొహం చంపెదేమిటి ?
ఎలా ఆలోచిస్తున్నానో కూడా నాకే తెలీడం లేదు . భయం తో 
అడుగులు ముందుకు పడనీ విషయమే నాకు తెలుస్తుండేది . 
పాప లేచింది . 

''ఇటివ్వు మాధురిని , నువ్వు మొయ్య లేవు '' చెప్పాడు 
చేతులు చాస్తూ . 
''ఊహు నేను ఇవ్వను '' నా బుజం మీదే తల రోడ్ వైపుకు 
తిప్పకుండా చేయి అదిమి పెట్టాను . 
భద్ర కాళి గుడిలో సింహం బొమ్మను చూసే నా బిడ్డ వణికి పోయింది . 
ఇలాంటి నరమేధాలు అది చూడకూడదు . వాళ్ళు రేపటి వాళ్ళు . 
వాళ్లైనా ఈ హింస లకు దూరంగా గుండెల నిండా ప్రేమ నింపుకొని పెరగనీ . 
ఈ హింసలన్నీ  మాతోనే వెళ్లి పోవాలి . 

అసలు ఇన్ని చేస్తున్నారే , వీళ్ళ  వెనుకబాటు తనం కి కారణం 
అవిద్య అని గ్రహించలేకున్నారే !!!విద్య ప్రశ్నించడం నేర్పుతుంది . 
ప్రశ్న ఉన్న చోట ఎంత బలం అయినా నిలవదు . ఒక్క చదువుకున్న వాడు 
తన ఊరు నుండి ఐదుగురు చదువుకున్న వాళ్ళను తయారు చేస్తే 
ఇంత కంటే మంచి రాజ్యం వస్తుంది . చదవడం అంటే బట్టీ 
వేయడం కాదు . మానవత్వాన్ని , వివేకాన్ని పెంచే జ్ఞానం . 
ఇంకా తమ వనరుల్లోనే ఎంత స్వయం సమృద్ది సాదించగలం 
అనేది చూసుకోవాలి . రైతు బయటి వస్తువుల పైన ఎంత 
ఆధారపడితే అతను డబ్బు కొరతతో అంత పేదవాడు అయిపోతాడు . 

అదిగో ఆ కంచె ల పైన ఏమిటది వేలాడుతూ ....... దగ్గరకు 
వెళ్ళే కొద్ది కనిపించసాగింది . 
                                                             (ఇంకా ఉంది )


ఈ రిపబ్లిక్ డే నాడు ''ఒబామా '' '' నరేంద్ర మోది '' అమెరికా , ఇండియా ల 
స్నేహ వాతావరణాన్ని పెంచినందుకు నా వంతు గీత ...... చూడండి . 


Thursday, 22 January 2015

గోపాల గోపాల ... పి . కె .... గోపాల

నిన్న ఈ ఊరిలో పత్రీజీ పిరమిడ్ ధ్యానం క్లాస్ . 
ఊరిలో ఉండే పిల్లా పాప ,పెద్దలు .... ధ్యానం అంటే కొంచెం 
అయినా ఇంటరెస్ట్ ఉండేవాళ్ళు అంతా అక్కడే ఉన్నారు . 
పోయిన ఏడాది కర్తాల్ ధ్యాన మహాచక్రం గొడవల ప్రభావం 
అంతగా లేనట్లు ఉంది . నిజమే కదా ఇక్కడ డబ్బు ప్రమేయం లేని 
సంగతి , ఎవరికి వాళ్ళం ఇంట్లో హ్యాపీ గా ధ్యానం చేసుకుంటూ 
యెంత మనః శాంతి పొందుతున్నామో మాకే తెలుసు . ఇక ఎవరో 
చెప్పిన దానిని నమ్మడం ఎందుకు !!పత్రీజీ గారు మాట్లాడుతూ 
మీరు పి . కె చూసారా ? అడిగారు . ఎవరూ చేతులు ఎత్తలేదు . 
మరి మాకు ఇక్కడ హిందీ సినిమాలు రిలీజ్ అయ్యేది పెద్దగా 
అలవాటు లేదు . సరే ''గోపాల గోపాల '' చూసారా ?
హయ్య ...... నేనున్నానోచ్ !! మరీ ఘోరం !!! సినిమాలు కూడా 
చూడకుండా ఏమిటి వీళ్ళు !!
నేను మాత్రం ధ్యానం  ధ్యానమే ,ఉద్యోగం ఉద్యోగమే ,ఇల్లాలు పోస్ట్ 
ఇల్లాలే ,రచనలకు రచనలే .... దేనికదే చేసుకుంటూ ఉంటాను . 
అసలే ఇక్కడ కొన్ని ఏళ్ళు విజిట్ కి వచ్చాము . ఇక్కడ ఏమున్నాయో 
నేర్చుకొని పోవాలి కదా !! ఇప్పుడు విదేశాలకి ఆఫీస్ పని మీద 
పోతే అదే చూసుకొని రాము కదా , చూడవలసిన ప్రదేశాలు ,విశేషాలు 
చూస్తాము కదా . మరి ఇంత పెద్ద మానవ జన్మకు వచ్చి యెంత 
జ్ఞానం ఉందొ తెలుసుకోవద్దా !!

పత్రీజీ గారు అన్నారు ....... 
''గోపాల గోపాల '' చూడండి . మూర్ఖంగా మూఢ నమ్మకాలు పెట్టుకోకూడదు . 
మనలో ఏమున్నదో ధ్యానం చేసి తెలుసుకోండి . మనిషి కి సహాయం 
చేయండి ,దేవుడ్ని చేసి మూర్ఖులు కావొద్దు . అందరం దేవుళ్ళం . 
కాకుంటేమనకు  తెలీదు . ధ్యానం చేసి మీలోకి వెళ్లి తెలుసుకోండి . 
ఎవ్వరూ ఏమి చెప్పక్కర్లేదు ,సమస్తం మీలోనే ఉంది . ధ్యానం చేయండి . 
శ్వాస్ మీద ధ్యాస . చేతుల్లో చేతులుంచి ప్రశాంతంగా కూర్చోండి . 
మీకే తెలుస్తుంది . పిల్లలు గోలీలు కోసం పోట్లాడినట్లు మీరు కోరికలు 
కోసం ఆరాట పడి జబ్బులు తెచ్చుకుంటున్నారు . ఈయనలో ఇది 
మాత్రం నాకు భలే నచ్చుతుంది . జనాలు కాళ్ళకు నమస్కారం చేయపోతే 
తిట్టేస్తారు . మూర్ఖ శిఖా మణి ఏమి చేస్తున్నావు నువ్వు !!! నేను మీలాగే 
ధ్యానిని అంతే ,అని భలే కోప్పడుతారు . చేసే వాళ్ళు తెగ సేవలు 
చేస్తుంటారు . ధ్యానం తో ఎదగాలి . అంత వరకు వాళ్ళని మనం ఏమి 
అనగలం . 
గోపాల గోపాల చూసారా ?
''ఓ మై గాడ్ '' రీ మేక్ అంట . కధ బాగుంది .  పెద్ద స్టార్స్ 
చేయడం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కృష్ణునిగా చేయడం ఈ  సినిమా 
కలక్షన్స్ కి ఎస్సెట్ . లేకుంటే మంచి సినిమా అని చెప్పినా అందరూ 
చూడరు . ''అనూప్ రూబెన్స్ ''సంగీతం సూపర్ . 
''దీంత నకర నకర '' పాట  అయితే భలే హుషారుగా ఉంది . 
సాహిత్యం కూడా బాగుంది . 
వెంకటేష్ దేవుడి బొమ్మలు ,వస్తువులు అమ్మే వ్యాపారి . 
కాని దేవుడిని మూర్ఖంగా పూజించడం ,మూఢ నమ్మకాలు 
లేని వ్యాపారి . కాని పక్కన ఉన్న  ముస్లిం అయినా ఎవరైనా 
అవసరం లో ఉంటె సహాయం చేస్తాడు .అన్నం విలువ తెలిసిన వాడు . 
యెంత అంటే పిండం వదలడానికి కూడా అంత అన్నం వృధా అవుతుందే 
అనే బాధతో ఒక సాధువు జోలె లోకి విసిరేస్తాడు దాన్ని . 
భార్య పరమ భక్తురాలు . ఆశ్రమాలు ,స్వామీజీలు , అభిషేకాలు , 
సామాన్య మానవులకున్న అన్ని నమ్మకాలు ,భయాలు ఉన్నాయి . 
ప్రతీ పూజా చేస్తూ ఉంటుంది . ఒక స్వామీజీ దగ్గర భార్య నిప్పుల 
గుండం తొక్క పోతుంటే ఆపడానికి ,
''కృష్ణుడు వెన్న తింటున్నాడు వెళ్లి పెట్టండి ''అని జనాలనందరిని 
పంపేస్తాడు . అప్పుడు ఆ స్వామీజీ కి కోపం వచ్చేసి (పోసాని ,చాలా 
బాగా చేసాడు ) నువ్వు నాశనం అయిపోతావు అని శాపం 
పెట్టేస్తాడు . నిజంగానే వెంకటేష్ షాప్ కి మాత్రమె భూకంపం 
వచ్చి షాప్ కూలి పోతుంది . ఎనబై లక్షలకి ఇన్స్యురెన్స్ క్లైమ్ 
చేస్తాడు . అప్పుడు ట్విస్ట్ . '' ఇది గాడ్ ఆఫ్ ఆక్ట్ '' కిందకి 
వస్తుంది . మేము మనీ ఇవ్వమని కంపెనీ వాళ్ళు తిరస్కరిస్తారు . 
(దొంగ మొహాలు ఈ కంపనీలు వాళ్ళు నిజంగానే రూల్స్ సరిగా 
చెప్పరు ,ఇచ్చేటపుడు మాత్రం పాపం చావక బ్రతికి ఉన్న వాళ్లకి 
చచ్చిన వాళ్ళతో వెళ్లి పోవాలి అనిపించేస్తుంది. అంతగా విసిగిస్తారు . )

పాపం వెంకటేష్ సగటు మనిషి . అంత  నష్టం భరించడం ఎలా ?
లాభం లేదని ''దేవుడే చేసాడు కాబట్టి ,దేవుడే నాకు నష్ట 
పరిహారం ఇవ్వాలి అని ''కోర్ట్ లో కేస్ వేసి అన్ని ఆశ్రమాల 
స్వాములకు సమన్లు పంపి వాదించుకుంటాడు . 
చివరికి వాళ్ళు చంపే ప్రయత్నం చేయపోతే ..... అప్పుడు 
వచ్చేస్తాడు ..... ఇంకెవరు పవన్ కళ్యాణ్ ,మన కృష్ణుడు . 
ఏమి నైస్ గా సూట్ ,షూ ,మొహం లో ప్రసన్నత ,ఆ బండి 
ఉంది చూడండి ఎంత బాగుందో . మా ఊరి జనాలందరికీ 
ఈ కృష్ణుడు కూడా నచ్చేసాడు . చప్పట్లే చప్పట్లు . 

మరి వీళ్ళు ఇద్దరు కలిసి కేస్ ఎలా గెలిచారు ?జనాలు 
మూఢ నమ్మకాలు వదిలేశారా ?అది స్క్రీన్ మీద చూడాలి . 
చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి కాని నాకే డైరక్టర్ ఏమి 
చెప్పాలి అనుకుంటున్నాడో చాలా సేపు అర్ధం కాలేదు . 
మామూలు వాళ్లకు నచ్చదేమో అనుకున్నాను . కాని 
అందరికీ బాగానే నచ్చింది . పవన్ కళ్యాణ్ శ్రియ తో 
''మీ ఆయన దేవుడు లేడు అనటం లేదు తల్లి , ప్రశ్నిస్తున్నాడు ''
అని చెప్పినపుడు నాకు కొంచెం క్లారిటీ వచ్చింది . పర్లేదు 
సినిమాని ఇంకెవరూ బాన్ చేయమని అనరు అనుకున్నాను . 

చూడండి . మంచి ఆలోచన విధానం వస్తుంది . 


చివరగా పెద్ద స్వామీజీ అంటాడు 
''జనాలను మాకు దూరం చేయగలవా ? వాళ్ళు 
గాడ్ లవర్స్ కాదు ,గాడ్ ఫియరర్స్ '' ఎంతటి నిజం . 
ఎలా ఆలోచిస్తున్నాము మనం . అది,ఇది  చేయకపోతే దేవుడు 
ఏమి చేస్తాడో అని ఎంత భయపడుతున్నాము . 
నిజంగా దేవుడు అమ్మ కంటే గొప్ప వాడు అయినపుడు ఆయన 
దగ్గర ప్రేమ ,క్షమ తప్ప కోపం ఉంటుందా ?ఒకటి మాత్రం 
నిజం పక్క మనిషికి తన సంపాదనలో కొంత అయినా 
ఇవ్వని వాడు , ఒక్కరి ఆకలి అయినా తీర్చనివాడు ఎన్ని 
పూజలు చేసినా దేవుడు మెచ్చడు . ఎందుకంటె ఆయనకు 
అందరిని ప్రేమించడం మాత్రమె తెలుసు . ప్రేమ మాత్రమె 
తెలుసు . అది ఎక్కడ ఉంటుందో ఆయన అక్కడ ఉంటాడు . 
                               @@@@@@@ Tuesday, 20 January 2015

మల్లాది గారి త్రీ మంకీస్ చదివారా ?

మల్లాది గారంటే ? ఇప్పటి వాళ్లకు కొంత ప్రశ్నార్ధకం . 
అప్పటికీ ఆయన ఎప్పటికప్పుడు తనను తానె మార్చుకుంటూ 
కాలానికి తగ్గట్లు కలాన్ని తిప్పుతూనే ఉన్నారు . ఈ మధ్య 
సాక్షి లో ఆయన ''త్రీ మంకీస్ '' సీరియల్ చదివితే ఇప్పటి అలవాట్లను ,
టేక్ ఇట్ ఈజీ లైఫ్ ని ఆయన ఎంత గా గమనిస్తున్నారో తెలుస్తుంది . 
ఇది పూర్తి అయిన తరువాత నేను వ్రాసిన ఒపీనియన్ ఈ రోజు సాక్షి ఫ్యామిలీ లో 
చదవండి . థాంక్యు సాక్షి . 

(3 monkeys pai naa sakshi opinion ikkada )

ఇప్పటి వాళ్లకి పుస్తకాలు విలువ తెలీదు చాలా మందికి ,
కాని విదేశాల్లో చాలా మంది తమ పిల్లలకు చేసే అలవాటు పుస్తకాలు చదవడం . 

పుస్తకం ఒక జీవితం , పుస్తకం ఒక మిత్రుడు ,పుస్తకం దారి చూపే దీపం ,
పుస్తకం మన ఊహలు అల్లుకునే చెట్టు కొమ్మ , పుస్తకం మన మనస్సుని 
కట్టుకొని పైకెగిరే గాలిపటం , పుస్తకం పక్క వాడి కష్టాన్ని మనకు తెలియచేసి 
గుండె బరువు దింపు కొనే అశ్రు కణం . నిజమా అంటే ..... 
నిజంగా నిజం . నాకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది దాని విలువ . 

ఆడపిల్ల ఇక బయటకి వెళ్ళకూడదు అనగానే మా కోసం ఒక కొత్త 
ప్రపంచం తెరుచుకుంటుంది . పెద్ద వాళ్ళ దగ్గర నుండి సహస్ర నామాలు ,
సుప్రభాతాలు ,రామాయణ భాగవతాలు , పినమ్మల దగ్గర నుండి 
వార ,మాస పత్రికలు ,ఆంద్ర భూమి ,జ్యోతి ,వనితా జ్యోతి ,విపుల ,చతుర 
కొంచెం పెళ్ళికి ముందు స్వాతి ఇంకొంచెం తరువాత నవ్య , ఇంకా 
ఫ్రెండ్స్ నుండి ప్రేమతో ఇచ్చి పుచ్చుకొనే నావల్స్ మల్లాది , యండమూరి ,
యద్దనపూడి ,మాదిరెడ్డి ..... లిస్టు వెళుతూనే ఉంటుంది లోకపు 
సంఘర్షణలో ,సంతోషాలో మొదటి పేజ్ తీసానంటే చివరి పేజ్ దాకా 
ఆపేది లేదు . అన్నం తింటూ కూడా చదవడమే . ఎలాగో మాకు అన్నం 
అమ్మే కలిపి ముద్దలు చేసి చేతులో పెడుతుంది . కూర ఏదైతే ఏమిటి 
అక్షరాలు నంజుకుంటే భలే రుచి . ఫ్రెండ్స్ పలకరింపు మొదటగా .... 
ఫలానా నావల్ చదివావా ?అని . పెళ్లి అయ్యి వెళ్ళే వాళ్ళు మాకు ఇచ్చి 
వెళ్ళే ప్రేమ కానుక ''లైబ్రరీ కార్డ్ '' . అదిగో అప్పటి అభిమాన రచయిత 
మల్లాది గారు . ఇప్పుడు వ్రాస్తే ఏదో ఒకటి చెప్పకుండా ఉండగలనా !
అందుకే ఇది వ్రాసాను . మల్లాది గారు మీరు నావల్స్ లో చెప్పిన 
విషయాలు మాకు తరువాత జీవితం లో చాలా ఉపయోగపడ్డాయి . 
మల్లాది గారు మిమ్మల్ని మేము మరచిపోము . థాంక్యు . 


Sunday, 11 January 2015

నేను సైతం ఒక్క గీత

నేను  సైతం ఒక్క గీత .... 
హై స్కూల్ చదివే రోజుల నుండి ఎన్ని గీతలు దాటి వచ్చాము . 
గీత ,ప్రపంచానికి అర్ధం అయ్యే భాష . దానికి ఇంకో లిపి అవసరమే 
లేదు . పెషావర్ లో కాని ,ప్రాన్స్ లో కాని ,తుళ్ళూరు లో కాని ..... 
'కానిపని' జరిగితే అది తిరగబడుతుంది ,ప్రశ్నిస్తుంది ,నిలేస్తుంది . 
మనుషుల తరుపున నిలబడి మనందరి మానవత్వపు కులాన్ని 
గుర్తుచేస్తుంది . ఒక్క గీత ను చేరిపితే వేయి గీత ల వికృత రూపం 
దాలుస్తుంది . 
మల్లిక్ ,బాపు ,రాగతి పండరి ,సరసి ,లక్ష్మణ్ ..... ఎన్ని గీతలు 
మనకు నవ్వడం నేర్పాయి ,ఆలోచించడం నేర్పాయి ,వాస్తవాలు 
చూపాయి . మాట వ్రాయగల కలం ,గీత గీసే చేయి మనసు 
స్పందించినపుడు ఊరుకొనవు . తోచిన గీతలు వ్రాయడం లోపల 
దాచుకోవడం . అప్పటి నుండి అంతే . ఇప్పుడు నా బ్లాగ్ మిత్రులతో 
పంచుకుందాము అని ఇలా తీసుకొచ్చాను :)

న్యూస్ ఇక్కడ చూడండి . కార్టూన్స్ ఇంకా నేర్చుకుందాము అని ఉంది కాని ,ఎవరి దగ్గర 
నేర్చుకోవాలో తెలీడం లేదు . 


Tuesday, 6 January 2015

కలానికి అవిటితనం అడ్డు అవుతుందా ?

కలానికి అవిటితనం అడ్డు అవుతుందా ?
మనసుకు సృజనాత్మక శక్తి ఉండాలే కాని విశ్వం లోని 
నక్షత్రాలతో కూడా లంకె వేసి జ్ఞానాన్ని సంపాదించవచ్చు అని 
''స్టీఫెన్ హాకింగ్ '' శరీరం అంతా పనిచేయకపోయినా జ్ఞానానికి 
కావలసినది మేధస్సే అని చూపించాడు . 
చుట్టూ ఉన్న సమస్యలను అక్షరాలుగా చెక్కడానికి చేతులు 
అక్కర్లేదు ,స్పందించే మనసు ,చూపించే సృజన ఉంటె చాలని 
ఈ రాజేశ్వరి నిరూపించింది . 
(rajeswari news article link ikkada )


సుద్దాల అశోక్ తేజ గారి చేత తన పుస్తకం ముద్రణ చేయించుకోవడమే కాక వారి 
అమ్మ గారి పేరు మీద నెలకొల్పబడిన అవార్డ్ అందుకొంటూ ,అంగ వైకల్యం 
శరీరానికి ఉన్నా , పేదరికం చుట్టు ముట్టి ఉన్నా సంకల్ప బలం తో 
ఏదైనా సాధించవచ్చు అని చూపిస్తుంది . 

కొందరి జీవితాలు విత్తనాలు 
హృదయాలలో నాటుకొని విస్తరిస్తారు 
కొందరి జీవితాలు వెలిగే దీపాలు 
కరిగిపోతూ కూడా కాంతులు విరజిమ్ముతారు 
కొందరి జీవితాలు ఎగసి పడే అలలు 
ఎదిరించి నిలబడిన రాయినైనా కరిగిస్తారు 
కొందరి జీవితాలు చరిత్ర దాచుకున్న స్తూపాలు 
నిబ్బరంగా నిలబడి కాలానికి సైతం దారి చూపిస్తారు .... 

''ఆనందం తో సంపూర్నేష్ బాబు ను అక్షరాలుగా పంచుకున్న మనం 
ఆర్ద్రతతో కొన్ని అక్షరాలు రాజేశ్వరి కోసం పంచుకోలేమా !!!''
                                          @@@@@@@@@@@@@@