Monday 21 April 2014

గురువా ?శిష్యుడా ?ఎవరు గొప్ప ?

  ఇప్పుడెందుకు ఈ డిస్కషన్ ?
కొన్ని సార్లు అనవసరమైన పనిలో కూడా ఏదో 
అవసరమైన విషయం  ఏదో దొరుకుతుంది . 
అసలు దాని కోసమే దీనిని చేసామా అని కూడా 
అనిపిస్తూ ఉంటుంది . కొంత సేపు దీని గూర్చి ఆలోచిస్తే 
ఇంకేదో జ్ఞానం వస్తుందేమో ఎవరికి తెలుసు ?

భారత దేశం లో గురువు స్థానాన్నే ఉన్నతంగా 
గౌరవిస్తారు . కొన్ని కష్ట సమయాల్లో గురువుని 
తలచుకొని శిష్యులు వాటిని దాటడం చూస్తే గురువే 
గొప్పవాడు అనిపిస్తుంది . 

ఉదాహరణకు మంచి గురువు కోసం వెతికేటపుడు 
వివేకానందుల వారు రామకృష్ణ పరమహంస  ను 
చూసి ''మీరు దేవుడి ని చూసారా ?'' అని అడుగుతారు . 
అప్పుడు రామ కృష్ణుల వారు ''ఇదిగో నిన్ను ఎంత 
స్పష్టంగా చూస్తున్నానో అంత స్పష్టంగా చూసాను '' 
అని చెపుతారు . 
ఇంకా వివేకానందులు సైరన్ శబ్దం విని ధ్యానం 
చేయలేనపుడు ,పేదరికం తో ఇబ్బందులు పడుతున్నప్పుడు 
గురువే అతనికి తోడుగా ఉంటూ నడిపిస్తాడు . 
చికాగో లో కూడా చేతిలో డబ్బులు లేక ముందుకు 
పోలేని పరిస్థితి వివేకానందులకు వచ్చినపుడు 
గురువుగారి సహాయం కోరుతారు . 

పరమ హంస యోగానంద వారు  కూడా తన గురువు 
తనకు ఎన్ని సార్లు తోడుగా  నిలిచి   నడిపించారో 
వ్రాసి ఉన్నారు . తన చెల్లికి బాగా లేనపుడు ముత్యం 
ధరించమని చెప్పడం,తను ఆధ్యాత్మిక ప్రచారానికి 
చదువు కావాలి కాబట్టి పరీక్షలో తనకు వచ్చిన 
ప్రశ్నలే వస్తాయి అని చెప్పి పంపించడం ఇలాగ 
వాస్తవ జీవితం లో కూడా గురువులు తోడుగా ఉండటం 
కనిపిస్తుంది . 

కాని రామ కృష్ణుల వారే చెప్పిన 
ఒక కధ వింటే ఎవరి కోసం ఎవరు 
జన్మించారు అనే సందేహం 

వస్తుంది . 

ఒక రోజు రామకృష్ణుల వారు 
ఈ కధ చెపుతారు . 
''ఆకాశం నుండి ఒక చిన్నబాబు 
భూమి పై పుట్టడానికి వస్తూ 
మధ్యలో సప్తర్షి మండలం లో 
ఒక రుషి దగ్గర ఆగి....  
''నువ్వు తప్పక నా కోసం 
వస్తావు కదా ''అని అడిగి 
అతను నవ్విన తరువాత 
భూమికి వస్తాడు . 
దీనిలో ఆ రుషి వివేకానందులు 
అని తాను చిన్న బిడ్డ అని చెపుతారు . 

శిష్యులు ఎప్పుడు వస్తారా అని రామ కృష్ణులు వారు 
నది దగ్గరకు వెళ్లి ''నాయన లారా మీరు ఎప్పుడు వస్తారు ?
అని బిగ్గరగా అరుస్తూ దిగులుగా ఎడ్చేవారట . 
ఇంకా వివేకానందు లు  పెళ్లి వద్దని పారిపోదాము 
అనుకుంటే రామ కృష్ణులు వారు వెళ్లి నన్ను వదిలేసి 
వెళుతావా ?అని అడుగుతారు . 
పరమ హంస యోగానంద గురువు యుక్తేస్వర్ గారు 
శిష్యుడు కోసం శ్రీరాంపూర్ లోనే ఒక కాలేజ్ 
సంకల్పం తో పెట్టిస్తారు . 
గురువు నేర్పిన ఆధ్యాత్మిక జ్ఞానం ప్రపంచ మంతా 
వ్యాపించింది శిష్యుల వలననే . 
గురువులు శిష్యుల 

కోసమే ప్రతి క్షణం తపిస్తూ ఉంటారు . 

వీరిలో ఎవరు గొప్ప ?
అనే ప్రశ్న వేస్తే .... 
అసలు గొప్ప అంటే ఏమిటి 
అనే ఆలోచన వస్తుంది . 
త్రీ డి నిర్మాణం లో ఉండే ఈ లోకం లో 
కాలం ,వయసు అన్నీ రుజు మార్గం లో 
పయనిస్తాయి . 
అందుకని  ముందు ఉండేది గొప్ప అని ,
వెనుక ఉండేది తక్కువ 
అని నిర్ణయిస్తాము . 

కాని కారణ జన్ములు వచ్చిన లోకం లో అభివృద్ది 
అనేది 360 డిగ్రీల వృత్తాకారం లో ఉంటుంది . (అసలు వృత్తాకారం 
కూడా కాదు గోళాకారం లో ఉంటుంది . అంటే ఒక ఉమ్మెత్త 
కాయ ముళ్ళ లాగా ..... ఇంకా ఎక్కువ శీర్షాలతో ,అందుకే 
ఆధ్యాత్మిక సంపన్నులమైతే ''సహస్ర శీర్షం  దేవం ''అన్నారు . 
ఒక విషయం గూర్చిన జ్ఞానం అన్ని కోణాలుగా మనం అర్ధం 
చేసుకోగలం )
ఒక్కో జన్మ లో ఒక్కో కోణం . గురువు ఒక కోణం లోని జ్ఞానం
సాధిస్తే శిష్యుడు ఇంకో కోణం లోని జ్ఞానం సంపాదిస్తాడు . 
ఒకే వైపు పయనించని వారి జీవితాలని ఎవరు గొప్ప 
అనే ప్రశ్న ఎక్కడ ?ఎవరి జీవితం వారిదే .  

ఇంకా వివరంగా చెప్పాలి అంటే విద్యుత్తు ప్రసరణం కోసం 
కొన్ని లోహాలు ఆనోడ్స్ , కాతోడ్స్ గా విడిపోయినట్లు, 
ఆధ్యాత్మిక జ్ఞాన ప్రవాహం కోసం గురు శిష్యులుగా 
పుట్టిన ఆత్మలు వాళ్ళు . శరీరాలు వేరు అయినా 
వచ్చిన కార్యం, చేస్తున్న కార్యం ఒకటే . 

ఇన్ని గురుశిష్యుల పరంపరల లక్ష్యం మనకు 
ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదించడమే అని మనం తెలుసుకున్న 
రోజు మనలో ఈ ఘర్షణ ఆగిపోయి అనంత జ్ఞాన 
సముపార్జన లో మునిగిపోతాము . 


Saturday 19 April 2014

ఇది చదివారా ?

సాక్షి సాహిత్యం లో ''సాయి పాపినేని ''గారు 
వ్రాస్తున్న ''పదం నుండి పధం లోకి '' 
చదువుతున్నారా ? ఇప్పటికి ఐదు భాగాలు 
అయినాయి . 

చరిత్ర పరిశోధన లో దొరికిన అంశాలు ఆధారంగా 
అప్పటి జీవిత శకలాన్ని  ఒక కల్పిక గా వ్రాస్తున్నారు . 
ఇది పాత ప్రక్రియే అయినా చేసే వాళ్లకు తెలుస్తుంది 
ఎంత కత్తి మీద సాము అనేది . 
అంతే కాక వ్రాసే వాళ్ళ శైలి ని బట్టి చక్కగా ఆ అప్పటి 
జీవితపు విధానాన్ని మనం అనుభూతించ వచ్చు . 

ఆద్యంతము ఆపకుండా చదివించే శైలి ,ఒక్కో సారి 
ఒక్కో కోణం ... చాలా బాగున్నాయి . దీని ముందుమాట లో 
సంపాదకులు ఏమన్నారో గుర్తు  లేదు . బహుశా 
పుస్తకం కూడా వస్తుందేమో . ఇక్కడ రెండు ఇస్తున్నాను 
చదవండి . ప్రతి శనివారం రాదు . వారం మార్చి వారం 
వస్తుంది అనుకుంటాను .