Thursday 25 August 2011

నువ్వంటే నాకిష్టం....కాని

నువ్వంటే నా కిష్టం...
సుధా చంద్రికల నర్తించే నీ మలయానిలం  నాకిష్టం ...
శీతల జల పుష్ప తుంపరల స్నానించి 
వయ్యారపు హరివిల్లుల నడుము ఒంపు పై ఉయ్యాలా 
ఊగటం నాకిష్టం .........

(ముక్క అర్ధం కాలేదా?మరి మనకు అర్ధమయ్యే 
తెలుగింగ్లిష్ లో వ్రాయమంటారా?)

మరి మనలో మనకే తెలీకుండా లోపల ప్రకృతి
ప్రేమికులు ఒకరు ఉంటారు(ఎస్ ...అపరిచితుడి లాగా)
వాడికి (ఆమెకి)వానలో తడవటం ఇష్టం కావొచ్చు...

హరివిల్లుని కనులలో నింపుకోవటం ఇష్టం కావొచ్చు....
చల్లని చెట్టు నీడలో పడుకొని నీలాకాశం వైపు చూడటం ఇష్టం
కావొచ్చు.............

మట్టి వాసనా,పూల స్పర్శ,నీటి అలజడి,.....
ఓహ్.....పాట గుర్తుకు వచ్చేస్తుంది.....కెవ్వ్...పారిపోండి.

"ఆకులో ఆకునై ..పువ్వులో పూవునై ..కొమ్మలో కొమ్మనై..
నును లేత రెమ్మనై ఈ అడవి దాగిపోనా...."

ఈ లాగా ప్రకృతిని ప్రేమిస్తున్నాము అంటారు...కాని
ప్లాస్టిక్ వాడొద్దు అంటే...కష్టం అండి అంటారు...

నీళ్ళు కలుషితం చెయ్యొద్దు అంటే....నా చేతిలో లేదు అంటారు

సరే అందరికి అవగాహన కలిపిద్దము రండి అంటే....టైం లేదు
ఇవన్ని నిజమే కావొచ్చు.

కాని మీకు వీలయ్యే పని చెపుతానుచేయండి.

 మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాము.

"ఏమి లేదండి..ఈ సారి వినాయక చవితికి రంగులు లేని 
 మట్టి వినాయకుడిని పూజించండి.మీ ప్రేమని నిరూపించుకోండి."

 (మనం చేసే పని యెంత చిన్నదైనా మంచి మనసుతో 
చేస్తే ఎందరికో స్పూర్తిని ఇస్తుంది)

ఈ విషయం మీద "ఎకో దంతుడు"అనే ఆర్టికల్ 24-8-11
సాక్షి ఫ్యామిలీ లో ప్రచురించారు.

మరి అందులో మీ నేస్తం వాళ్ళ స్కూల్ పిల్లల చేత మట్టి
వినాయకుని చేయించి ఆ స్టెప్స్ అన్ని పోటోస్ తీసి పంపింది.
గణపతి రూప కల్పన క్రింద స్కాన్ చేసి పెట్టాను చూడండి.

గణేశ ....నీ రంగులు లేని మట్టి బొమ్మని పూజ చేసిన 
వాళ్ళ మంచి మనసుని అనుగ్రహించి వారికి కావలసినవి ఇచ్చెయ్యి...
                       గణపతి బొప్ప...మోరియా.....


Saturday 20 August 2011

కృష్ణా.....నా బుజ్జి కన్నా....

 బృందావనమాలి ..రా రా మా బ్లాగ్ కు ఒకసారి 
అలిగి చెలరేగి చేద్దాము అల్లి బిల్లి కొంటె అల్లరి....
 వచ్చేసా...శశి...నీ బక్తికి మెచ్చేసా.........శశి...నిన్నే...
నోరు మూసుకోమ్మా .....లేకుంటే ఈగలు పోతాయి...

"నీ చిరు నవ్వుల వెన్నెలలో మైమరువగా చేయగా ఏలనో..
మైమరిచిన చెలి నోరే మూయదని నవ్వుతు చెప్పెవేలనో?"

 సరే..శశి ఏమైనా కబుర్లు చెప్పమ్మా...
చెప్పనా స్వామి..అయినాగాని నువ్వు ఇందు దగ్గర 
చెప్పించు కుంటావు కదా...

 ఈ రోజు నువ్వు చెప్పమ్మా...
  
నీ లీలలే చెపుతాను...నువ్వు దేవకీ,వసుదేవులుకు
 జైలులో పుట్టావు.ఆహా...యెంత సత్యం చెప్పావు శశి 
మాకు తెలీదని పే ....ద్ద.

"తడవ తడవకు కడుపు శోకము తాళజాలక
   పెంపు కిచ్చెను దేవకీ..."
మీ అమ్మ బలే ఏడ్చింది పా...పం.

 "అరికాళ్ళ తామరములు,మా అయ్యా బొడ్డునా పారిజాతం 
  అన్ని ఉన్నాయిరా..నా తండ్రి నిన్ను ఎడబాసి నేనేటుల   జీవింతురా....శ్రీ రంగ రంగ రంగా...మా అయ్య కావేటి రంగ రంగా

ఏడుపు వస్తుంది...తరువాత చెప్పు ...

ఏముంది స్వామీ యశోదా,నందులు నిన్ను ప్రేమగా సాకారు.
నువ్వేమో అల్లరే అల్లరి ....ఏమి చేసాను శశి ......

"విన్నావ యశోదమ్మా...మీ చిన్నికృష్ణుని లీలలు"

"అల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిన గజ్జలు 
 గల్లన ,తల్లి మేలుకొని దొంగను చూసి అల్లరి 
 యేమని అడిగినందుకే ...అలిగిన వేళనే చూడాలి..."
 హ...హ.....హ....గుర్తుంది...బాగాఎడిపించేవాడిని.

తరువాత చాలా మంది రాక్షసులుని చంపావు.
 ఒక రోజు కాళియ పాముని చంపాలని మడుగు లోకి దూకావు.

"కాళింది మడుగున కాళియుని పడగల ఆ బాల గోపాలా
ఆ బాల గోపాలుని ...అచ్చెరువున..అచ్చెరువున..." 

చూసావా అనకొండ లాంటి పామును ఎలా ఆడిస్తున్ననో...నువ్వు ఉన్నావు ...అనకొండ
 సినిమాలో కాళ్ళు పైన సీట్లో పెట్టుకున్నావు.

(హుష్....చెప్పకూడదు)

శశి ఇంకా...చెప్పు....ఇంకానా...సరే...ఇంద్రునికి కోపం వచ్చి మీపై తుపాను పంపాడు లైలా లాంటిది...

ఆమె ఎవరు శశి ? అబ్బ ఆమె కాదు స్వామీ...అది తుపాన్ పేరు.

 నువ్వేమో గోవర్దన గిరి గొడుగులా పట్టి అందరిని కాపాడావు.
"లీలగా ఒక దొడ్డ కొండ ను వేలనేత్తిన దేవరా..ఏల నన్నిట 
వేల నేత్తవు గోవర్దన గిరిదారి...శౌరి శ్రీహరి కృష్ణా........"

  ఇంకా తరువాత ..బృందావనానికి వెళ్లావు.
 అక్కడ రాధతో,గోపికలతో నీ రాస లీలలు....

అంత మందిని ఎందుకు చేసుకున్నావు స్వామీ ?
చేసుకోవటం కాదమ్మా...అది పరమాత్ముని లోని సమ్మోహన శక్తి.

 భక్తీ లో అది కూడా ఒక పద్దతి ,నాలో వాళ్ళని ,వాళ్ళలో నన్ను 
ఊహించుకోవటం....రాధ మనిషి లోని ఆత్మఅది ఎప్పుడు 
పరమాత్మ అయిన నన్నుచేరుకోవాలని తపిస్తూ ఉంటుంది.

"ముని జన మానస మోహిని లోహిని బృందావనం 
మురళి రవళికి ఆడిన నాగిని బృందావనం"
 ఇంకేముంది స్వామి...దానవుడైన మీ మామ కంసుని 
చంపి మోక్షం ఇచ్చావు.

"మారుజనక మదుర వేణి మామ కంసుని
చేరి వదియించిన శౌర్య బాల మంగళం..కృష్ణ మంగళం"

   శశి బాగా చెప్పావు ఏమి కావాలో కోరుకో..

నాకేమి కావాలి ...ఇది చూసిన చదివిన..
కృష్ణా అన్న వారికందరికీ కావలసినవి అన్ని ఇచ్చెయ్యి.

నీకేమి వద్దా....అందరు బాగుంటే నేను బాగున్నట్లే కదా.
మన భారతీయలు ఏమంటారో తెలుసు కదా...

"లోకా సమస్త సుఖినోబవంతు"

అలాగే కానిమ్మ ...నీ పెళ్లి కాక ముందు నుండి కూడా
నువ్వుఏమి అడిగితె అది ఇచ్చాను కదా.

 "ఎవరు కన్నను,ఎవరు పెంచిన,చివరి కతడానంద మిచ్చినది 
ఎవరికి?....తలపు లుడిగి తత్వమేరిగి తనను ఆశ్రయించిన 
 వారికి...తనను ఆశ్రయించిన వారికీ..."

 స్వామీ చివరగా మంచి పాత పాట వినిపిస్తాను వినండి.

"రసమయ జగతిని రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మదురిమలో
  ఎల్లరి మనములు చల్లన చేసే నల్లని దేవుని అల్లరిలో..."

 ఆ......ఆ......ఆ.....ఓ...ఓ....లాహిరి లాహిరి లో....ఓహో...
జగమే...ఊగెనుగా....ఊగెనుగా...తూగెనుగా........


Friday 19 August 2011

వింటారా మల్ల ..మస్తుగుంటై కదలు...2

హలో...అలో...అలో ...ఎవరికి కదలు కావాలో వచ్చేయన్డొచ్...
 యెంత మంచి వాళ్ళో ...హనుమకొండకి వచ్చేయండి .

మరి జాబ్ లో చేరాక నేను మావారు స్కూల్ కి దూరంగా 
(2 కి.మీ )ఇల్లు తీసుకున్నాము మాకు తెలీక.అది అదాలత్ (కోర్ట్)
సుబేదారి(కలక్టర్ ఆఫీసు )అన్ని దాటినాక బస్ డిపో 
దగ్గర ఉంటుంది.

నేను ఒక్క దాన్నేసాయంత్రం స్కూల్ నుండి 
వస్తానని దైర్యంగా చెప్పాను మా వారికి.స్కూల్ అయిపోయిన 
తరువాత బస్ స్టాప్ కు వచ్చి బస్ వస్తే బస్ డిపో కి
 వెళుతుందా?అని అడిగాను.

ఆతను బస్ స్టాండ్ అనుకోని వెళుతుంది అని చెప్పారు.
నేను ఎక్కిన తరువాత ఊరంతా తిరిగి బస్ స్టాండ్ లోదింపారు.
అది మా స్కూల్ కి కొంచం దగ్గరగా ఉంటుంది .

(బూమి గుండ్రంగా ఉంటుందని అప్పుడు బాగా తెలిసింది)

నీరసంగా నడుచుకుంటూ స్కూల్ వైపువస్తున్నాను.
ఎదురుగా మా వారు కనపడ్డారు.
నిజమేనా అని కళ్ళు నులుముకొని చూసాను.
ఇంకా చూడు నిజమే.

హమ్మయ్యా అనుకున్నాను.
ఇక ఆయనకైతే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి

(దొరికానని బాదతో అంటున్నారా? మీ సంగతి మళ్ళ చెపుతా)

అపుడు అనుకున్నాను...

ఒరే...ఏడిపించే వాళ్ళు తప్పి పోయారని కూడా ఏడుస్తారా?

 వెంటనే నిర్ణయం తీసుకున్నారు ఇల్లు మార్చేయాలని.
 స్కూల్ పక్కనే ,కాని రెంట్ చాలా ఎక్కువ ఏడు వందలు.
 అప్పుడు నాకొకటే ఉద్యోగం ,ఈయన వెతుక్కోవాలి.అసలు 
నా జీతమే 2000  రూపాయలు.అయినా సరే నాకోసం 
 ఆ ఇంట్లోకి వెళ్ళాలి అనుకొన్నాము.
పాత  ఇల్లు ఖాళి చేసి రిక్షా ఎక్కి కొత్త ఇంటికి బయలుదేరాము.
ఏమి పెద్ద సామాను లేదు.ఇంకా వంట మొదలు పెట్ట లేదు.
చాప,పరుపు,బకెట్ ,చీపురు,ఇంకా ఒక సూట్ కేస్ .
అన్నికాళ్ళ దగ్గర పెట్టుకొని సూట్ కేస్ రిక్షా వెనుక పెట్టుకొన్నాము.
ఇంట్లో అన్నికొత్త దింపుకొని లోపలి వెళ్ళాము.
    
తీరా చూస్తె సూట్ కేస్ లేదు. దేముడా ....ఇప్పుడేమి 
చేయాలి...బట్టలు ,డబ్బులు ,నగలు ,అన్నిదాన్లోనే ఉన్నాయి.
తెలీని ఊరు...ఎవరిని అడగాలి?ఇప్పట్లా సెల్ ఫోన్ లు లేవు.
  
ఇద్దరికీ ఏడుపు వచ్చేస్తుంది.మా వారు వెంటనే పరిగెత్తి 
మేము వచ్చిన వైపు వెళ్లారు రిక్షా కోసం. 
  
నేను బయటకు వచ్చి ఏడుపు మొహం తో చూస్తూ 
ఉన్నాను.ఉన్నట్లుండి రోడ్ రెండో వైపు నుండి వస్తూ 
 కనిపించాడు రిక్షా ఆతను.
"అరె మీరు పెట్టె మరిచిపోయిన్రామ్మా..అంటూ" 
తీసి నాకిచ్చాడు.
నాకైతే వెంకటేశ్వర స్వామే  వచ్చి ఇచ్చినట్లు అనిపించింది.
దణ్ణం పెట్టేసాను.
ఈలోపు మా వారు కూడా అక్కడకు పరిగెత్తి వచ్చారు.
ఇద్దరమూ థాంక్స్ చెప్పాము.

"అరె ఏం చేసిన నమ్మా మీది మీకిచ్చినా గంతే గదా"అన్నాడు.
మా వారు కొంచం డబ్బులు ఇచ్చి అవి తీసుకునే దాక ఒప్పుకోలేదు.
  
నిజం గా యెంత మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ...
 అని సంతోషంగా నిద్రపోయాము

(ఇంకేమిటి ...ఇంకో కదలో చెపుతాలే ..
మీరుకూడా నిద్రపోండి )

Monday 15 August 2011

ఇంత తెలుగా...వామ్మో....

ఆగస్ట్ 13,14,15,తేదీలలో విజయవాడలో ఆంధ్రప్రదేశ్ 
సాంస్కృతిక శాఖ ,హింది అకాడెమి భారతీయ బాషా 
 కేంద్రం,మైసూర్ సాహిత్య అకాడెమి వాళ్ళు కలసి 
కృష్ణ జిల్లా రచయితల సంఘం వారు 
  ప్రపంచ తెలుగు రచయతల రెండవ మహాసభలు 
నిర్వహించాయి.అక్కడ చాలా చర్చలు జరిగాయి.
మరి బాషలో మన మూలాలు ఉంటాయి కాబట్టి 
దానిని రక్షించుకోటానికి ఒక వేదిక కావాలి కదా.

మీకెందుకు ఇవి  చెప్పుతున్నాను అని కదా సందేహం.

మీ నేస్తం(ఆమె ఎవరు నా...నేనే బాబు.రెండురోజులకే 
 మర్చిపోయారా?)పాల్గొని తెలుగు గొప్పదనం మీద కవిత 
...పాటలాగా పాడింది అన్నమాట.పాడమంటారా......ఆ...ఆ

 (ఏమిటిమొహం అలా పెట్టారు.సుమనుడి సీరియల్ చూసినట్లు)

సరే వ్రాస్తాను చదువుకోండి....

పల్లవి: పలు మమతల కోవెల,మా తెలుగుకోయిల 
పద పుష్పపు తీవేలా,మధుర స్వర ఊయల 
మా తెలుగు కోయిలా చకోరికి వెన్నెల 
మాతెలుగు కోయిలా తేనెలూరు జలదిలా 
మా తెలుగు వైభవం ,పొగడ పూల సౌరభం
మా తెలుగు రాజసం ,సహస్ర సూర్య తేజసం....

1.షడ్రుచుల ఉగాది ,అవధానపు ఆటలు 
చమత్కార పాటలు ,చతురించే కవులు 
తేట గీతులు,ఆటవెలదులు,
సంధులు సమాసాల సరాగాల సుగంధం 
వ్యాకరణం తో వయ్యారముగా ,ఈ నాటి ది కాదయ్యా 
తెలుగు తల్లి వైభవం .........

2.మందార మకరంద మాదురోసగు పోతన 
భారతాన్ని తెనిగించిన ఆది కవి నన్నయ 
జుంటి తేనెలు ,పాల ధారలు
కలగలసిన కవిత్వం మా తిక్కనది 
అన్నమయ్యతో,క్షేత్రయ్యతో ఈ నాటిది 
 కాదయ్యా తెలుగుతల్లి వైభవం .........

ఎందుకో అవధానం లో అందరు నిషిద్ధాక్షరి 
గొప్పది అంటారు.దానివలన వారి పద కౌశల్యం,
వ్యాకరణం పై పట్టు తెలుస్తాయని.నాకు మాత్రం 
సమస్య పూరణం ఇష్టం.ఎందుకంటె అది వారిలోని 
 సృజనాత్మకత ను చూపుతుందని.ఎందుకంటె అది
నేర్చుకుంటే వచ్చేది కాదు.

నిజానికి ఈ చర్చలు,వేదికల పై కాదు తెలుగు ఉండేది
ఎక్కడ ఉందొ చెప్పమంటారా?

 చిన్నారి బాబు ని వడిలో వేసుకొని అమ్మ 
అని పెదాలు తాకించి చూపిస్తూ నేర్పించే 
ప్రేమలో ఉంది............

 చందమామ రావే ,జాబిల్లి రావే
 అని అమ్మపెట్టె గోరు ముద్దలో ఉంది........

 రావోయి బంగారి మామ ...అని పిలిచే
ఎంకి ప్రేమ లో ఉంది .............

సంకురాత్రికి దాన్యం రావాలని
కోరుతూ ప్రేమగా నాటే నారు మళ్ళలో ఉంది......

 చెల్లియో చెల్లకో..అని రాగాలాపనతో 
మేకల్ని మేపే గొంతులో ఉంది......

 భగ..భగ..మండే  సెగలా వస్తున్నాడు కదిలి 
 అని రగిలించే బుర్రకధలో ఉంది ......

తెలుగుని వదలలేక బ్లాగుల్లో వ్రాసుకుంటూ
 ప్రేమను చూపుతున్న మీ అందరిలో ఉంది ....

జనాల్లో ఉంది .....జానపదాల్లో ఉంది
 పల్లెల్లో ఉంది.....పసి పాప మనసులో ఉంది

మీరనుకుంటే మీ దగ్గరగా కల కళా రూపాల 
మీద మీరు తీయబోయే డాక్యుమెంటరీ లలో ఉంది....

 రండి.మనకు అసాధ్యమేమీ లేదు.మన చేతిలోని 
కెమెరాలతోనే దాచి పెట్టి చూసుకోవలనిపించే 
తెలుగు రూపాలు మొగిలిరేకులుగా ,నెమలి ఈక లు గా మార్చి 
అందరికి పంచుదాం.

Tuesday 9 August 2011

హుర్రే...జగదేకవీరుడు...

మీకొకటి చూపించేదా...మరి అబ్బ..బలే ఉంది అనాలి సరేనా....

బా.....గుంది కదా.మాయా బజార్ కలర్ లో చూస్తె ఆ మజా బలే
తమాషాగా ఉంది

ఇంకోటి చూపించేదా......అబ్బా ఇంకా బలే అనాలి.



(బలే అన్న వాళ్ళు మీకు మీరే సేబాష్ అనుకోండి.)


జగదేక వీరుడు కలర్ లో.చూడగానే బలే సంతోషంగా 
అనిపించింది.అసలు బ్లాక్ అండ్ వైట్ లోనే పిల్లలకు 
కాసేట్ తెచ్చి మరీ చూపించాను.

ఎందుకంటె చిన్నప్పుడు నేను పొందిన ద్రిల్ల్ వాళ్ళు కూడా 
పొందాలి కదా.

అసలు నీకు ఇంత సినిమా పిచ్చి ఏమిటి అంటారా?

(హమ్మయ్యా ...వినేవాళ్ళు దొరికారోచ్...)

అనగా ...అనగా......అప్పుడు నేను చిన్న పాపని అన్న మాట.

అప్పుడే మూడో సంవత్చరం వచ్చింది.
ఒక రోజు నేను ఎక్కడా  కనపడలేదు.

పాపం మా అమ్మ నాన్న ఊరంతా వెతికారు.


(హమ్మయ్య పొతే పోనీ అనుకోని ఉంటారు 
అనుకుంటున్నారా?)


ఎక్కడా దొరకలేదు.మా ఇంటికి కొంచం దూరంలో 
ఒక సినిమా హాల్ ఉంది .ఎవరో చెప్పారు అక్కడ 
ఒక చిన్నపాప ను చూసాము అని.
మా నాన్న పరిగెత్తుకొని వెళ్లి సినిమా హాల్ లో
వెతికారు.


బాల్కనీ,కుర్చీ లో,బెంచి లో ఎక్కడ లేను.
మా నాన్న గారికి బోల్డంత దిగులు వేసింది.


(ఇంత రాక్షసి ని అని అప్పుడు తెలీదు కదా.
తెలుసుంటే వెతికేవారు కాదు)


చివరికి స్క్రీన్ ముందు నేలలో చూస్తె అక్కడ ఉన్నాను.
అంటే ఎవరికి చెప్పకుండా అక్కడనచ్చి కూర్చునేసాను అన్న మాట.


మా నాన్నకి కోపం వచ్చి అరవబోయి నేనన్న 
మాటలకి నవ్వేసారు.


"దా నాన్నఇక్కడైతే పే....ద్ద బొమ్మ కనిపిస్తుంది"

(అంటే అప్పుడే పెద్ద einsteen  లెవెల్ లో అన్ని కోణాలలో 
స్క్రీన్ పరిసీలించానన్న మాట)

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.
సినిమా పిచ్చోళ్ళు చిన్నప్పుడే స్క్రీన్ పరిశీలిస్తారు.

అదండీ....మన సినిమా సంగతులు.

మరి కొత్త జగదేక వీరుడు అంటే కలర్ లో చూడటానికి 
రెడీ అయిపోండి.