Monday, 10 October 2016

స్త్రీ శక్తిఏమిటి ఈ చిత్రం , కనుబొమలు పైకి లేపి చిత్రంగా చూసాడు కృష్ణయ్య
అడ్డుగా నిలబడిన చెలికత్తలను చూసి

సత్యా దేవి గదిలో విరిసిన ప్రేమ పరిమళాలు స్వాగతమే కాని
నిరసన ల వేడి ఎప్పుడూ తగలదు తనకు .

ఆయన కళ్ళలోకి చూడలేక తల వాల్చేస్తూ చెప్పింది సత్య ప్రియ సఖి ,
అమ్మగారు కోప గృహం లో ఉన్నారు .

అలుకా ! కోపమా ! ఉలిక్కిపడ్డాడు .
అలుకయితే పర్లేదు ఇంటిరెక్క తీయగానే గాలితో కలిసి మీద బడే ఝల్లు ,
ఫర్లేదు కొంచెం ఉక్కిరి బిక్కిరి చేసినా చల్లగా అల్లుకొని హృదయాన్ని సేద తీరుస్తుంది
అదే కోపం అయితే , భూమాత గుండెల సెగలు నుండి ఉబికేశిలాద్రవమే , ఒక్క
అణువు మిగలక కాల్చేస్తుంది . కొన్ని రోజుల ముందటే చూసాడు కదా , ఆ రౌద్ర దుర్గ
రూపం , నులి వెచ్చగా వెలిగే దీపం రగిలి నరకుని కాల్చిన వైనం .
మెల్లిగా ఆలోచనలోకి జారిపోయాడు స్వామి

                      ************
ధనువు నుండి శరపరంపరలు రాలుస్తూ పక్కకు చూసాడు ,
ఇంత యుద్ద భూమిలో ఎదురుగా యుద్ధోన్మాదం తో తలపడుతున్న నరకుని
నిలువరిస్తూ కూడా ఆయన కళ్ళు తటాలున పక్కకు లాగేస్తూ ఆ జాజి కొమ్మను
చుట్టేస్తూ వదిలి రానంటున్నాయి . అందుకే ముద్దు గుమ్మలను పేరంటానికి పంపాలి కాని
యుద్ద రంగానికి వెంట తీసుకొని రాకూడదు .
అన్ని గంటల శ్రమ ముత్యాల్లాగా తన మోవి పై జారుతుంటే కొనకొంగుతో అద్దుకుంటూ
కళ్ళు పెద్దవి చేసుకొని తన స్వామీ వీర విహారం చూస్తూ ఉంది . వీరుడికి యుద్ధం , అగ్నికి ఆజ్యం
దొరకాలే కాని ఆ విజృంభణ చూడ శక్యమా ? అందులో మనసయిన లేమ పక్కన ఉండి కళ్ళతో
ప్రశంసిస్తుంటే , గెలవక ఆపగలవారు ఎవరని ?

నల్లనయ్యకి ఒక్కో సారి క్రీగంట చూసినప్పుడల్లా వేయి ఏనుగుల బలం . నరకుడు కొంచెం
తటపటాయిస్తున్నాడు . ఎదురు దెబ్బలు వేసేదానికి తడబడుతున్నాడు .
చిత్రం రోజుల దొరలింపు లో సేన హతం అవుతున్నది కాని ఎవరూ తగ్గరే !
అంతకంతకు దెబ్బ తిన్న పులిలా నరకుడు విరుచుకు పడుతున్నాడు .
నల్లనయ్య నిలువరిస్తున్నాడు .
స్వామీ యుద్ధం ఇంకా ఎంత సేపు ? పూరేకు కళ్ళలో చిన్ని పాటి అలసట .
అయ్యో ! తానూ వస్తాను అన్నా వారించవలసింది . ఎలా తీసుకొని వచ్చాను .
ఎదురు బాణాలు గుప్పిస్తూనే చేతితో సత్య నుదురు చిన్నగా నిమిరాడు .
పూల గుత్తి తో స్వేదబాష్పా లు తుడిచినట్లు .
ఆ మాత్రపు స్పర్శే ఎంతో శక్తిని ఇచ్చినట్లు పొంగిపోయింది .
కానిమ్మన్నట్లు సైగ చేసింది . నరకుని వైపు చూసింది , అభావంగా .
తప్పదు కాబట్టి తీసుకుని వచ్చాడు కాని , హృదయం మీద వాలితేనే
కందిపోయే ఆమోమును రణాంతరంగానికి తీసుకొని వస్తాడా !
ముగించాల్సిందే తప్పదు , విసురుగా ధనుష్టన్కారం చేసి శరాలను గుప్పాడు .

వచ్చిన వాటిని ఎగరేస్తూ విసిరాడు నరకుడు గదని , మెల్లిగా దూసుకొని వచ్చి
కృష్ణుని తాకింది . మెల్లిగా కూర్చుని పక్కకు వాలాడు , కళ్ళు మూసుకుని.

నటన సూత్రధారి ఇప్పుడు కదా నాటకం మొదలు అయింది .

విస్మయంగా స్వామీ వైపు చూసింది సత్య .
ఉగ్గు పాల నాడే పూతననుచంపిన వాడు , చిరుత అడుగులతోటి కాళీయుని మదం అణచినవాడు ,
నూనూగు మీసాల కంసుని వదియించిన వాడు , చిన్ని గదా ఘాతానికి మూర్ఛిల్లుటా!!!!

కురుస్తున్న శరాగ్నిని చూసింది . మెల్లిగా లేచి విల్లు అందుకుంది .
ఆకర్ణాంతం లాగి కొన్ని శరములు కురుస్తున్న శరములకు అడ్డుగా ఛత్రముల వలె,
మెల్లిగా వెనక్కు చూసింది , స్వామీ కనులు మూసుకొని ఉన్నారు .
అయ్య పాత్ర ఆగినపుడు అమ్మ పాత్రయే ఈ భువి ని నడిపించాల్సింది .
ఒక చేత్తో శరములు సంధిస్తూనే , వీపున పరుచుకున్న కురులు ముడిచింది .

ముడుచుకున్న భృకుటి నుండే శరాల వర్షం కురిసినట్లుగా ఉంది , మెల్లిగా
చేతిని వెనుకకు పోనిఛ్ఛి కోన కొంగు అందుకొని వడుపుగా నడుముచుట్టి గట్టిగా
దోపింది . శరములా అవి తామర తూడులా ! వెళ్ళుచున్నవే కాని నరకుని తాకుట లేదే !
వచ్చు చున్న శరాలను నిలవరించు చున్నవి అంతే !
క్రీగంట చూచుచున్న కృష్ణయ్యకు పూబంతిఆడుచున్న బంతులాటల వలే ముచ్చటగా ఉంది .
ఒక్క శరమయినా ఎదుటి రాక్షసుని నొప్పించునో లేదో . తన ప్రేమ కలశం కోపపు చుక్కయిన
రాల్చలేదా!
నరకుని శరాల నిలవరిస్తో , స్వామీ ని చూసి , ఇదేమి చిత్రం ఇంత సేపు లేవకుండా , అనుకుంటూ ఉంది .

కృష్ణయ్య చూస్తూనే ఉన్నాడు , తనకే తెలియకుండా తనలోని ప్రేమను కురిపిస్తున్న తల్లిని .
ఒక్క శరమయినా కనీసం నరకుని రధాన్ని తాకందే , ఇక నరకునిదేహాన్ని తాకుట ఎట్లు ?
జన్మఅంతర వాసన , తల్లి మనసుకు ఆ పాశం ఉంది . అదే నిలవరిస్తూ ఉంది .
తనతో ఏమి పాశం సత్య కు , బాహ్యపు మాంగల్య బంధం తప్ప . గట్టిగా తనను కట్టగల శక్తి ఏది ?
ఏదో ఒకటి చేయాలి .

మనసుకు పదహారు వేల ఆర్తనాదాలు వినిపిస్తూ రక్షణ కోసం ఆక్రోశిస్తూ ఉన్నాయి .
తప్పదు పాపా పీడా విరగడయి నవ్వుల దివ్వెలు వెలగాలి .
సత్య చేయి తప్ప ఆ మరణానికి అంకురార్పణ ఎవరూ చేయలేరు .
మాతృ పాశాన్ని తుంచే బలీయమైన శక్తి ఇప్పుడు తనకు కావాలి .

కళ్ళు మూసుకొని చిన్నగా నవ్వుకున్నాడు . చిత్రం గాలిలో దూరంగా చెదిరిపోతున్న
నరకుని శరం దారి మార్చుకొని కన్నయ్య చేతికి చురుక్కుమని గుచుకున్నది .
సత్యా , బాధగా ఆమె చేయి పట్టుకున్నాడు . పట్టుకున్న చేతి నుండి ఏదో ఆలంబన ,
ప్రేమ శక్తి ఇటు నుబడి అటుకి . ఇంటి దీపాన్ని కి ఆర్తిగా విన్నపం చేసినట్లు .

ప్రేమ పాశానికి ఒక్క క్షణం లో మాతృ పాశం బద్దలయి పోయింది .
ఎర్రటి జీరలు విరజిమ్మే కళ్ళు , కోపం అదిరే వళ్ళు , మృత్యు పాశాల్లా ఎగురుతూ కురులు ,
మహిషాసుర మర్ధిని మళ్ళీ ఉద్భవించినట్లు .
ఒక్క ఉదుటున సత్య నారి నుండి వెలువడిన క్రోధపు శరం నరకుని రొమ్ము చీలుస్తూ ఎర్రగా బయటకు
వచ్చింది .
తల్లి దెబ్బ తగలగానే , ఆదాటున విసిరిన చక్రాయుధం నరకుని నిలువుగా నరుకుతూ ....
అదిగో ఆనంద దీపావళి , అందరి గుమ్మాల్లో వెలుగు వాకలుగా నడుస్తూ .

సత్య భుజం చుట్టూ స్వామీ వారి చేయి దీపాన్ని చేతులు చుట్టి కాపాడుకుంటున్నట్లు .

                              ************
కాళ్ళకు ఏదో తగిలినట్లు ఉలిక్కిపడి లేచింది సత్య .

స్వామీ వారి శిరసు , ఎంత పాపం !
జాలువారే కన్నీళ్లతో క్షమాపణ వేడుకుంది .
లేదు సత్య నీ తప్పు లేదు .
ప్రేమ పాశాలు ఇంటిని పట్టి ఉంచుతాయి . స్త్రీ శక్తి ప్రేమ మయం గా
ఉంటేనే దానిని దీపం లాగా గౌరవం గా చూసుకున్న పురుషుడి జీవితమే
విజయ పధం లో నడుస్తుంది . లేకుంటే ఆ శక్తే నిలువునా దహిస్తుంది .

చెప్పు , అలక వద్దు , నీకేమి కావాలి ?
చిరునవ్వుల ప్రేమలు కురిపిస్తుంటే మురిసిపోవడమే కాని ,
గొంతు మూగ పోవడమే కానీ , అల్లుకుని పోవడమే కాని
స్త్రీ శక్తి కి ఇంకేమి తెలుసనీ !
ఇపుడు అక్కడ మాటలతో పని లేదు .
ఎందరికి తెలుసు ఈ రహస్య శక్తి గురించి , గీసుకున్న హద్దుల్లో
కాపాడుకుంటున్న ఆహాల గురించి తప్ప .
                     @@@@@@@@@@