Tuesday, 30 December 2014

బుద్ధుడు -బౌద్ధ ధర్మం

హమ్మయ్య ఏడాది చివరి రోజు కూడా వృధా అవకుండా మంచి 
పుస్తకం దొరికింది . ''బుద్ధుడు - బౌద్ధ ధర్మం '' 
డాక్టర్ పానుగోటి కృష్ణా రెడ్డి గారి రచన . ముందు మాట లో 
 బుద్ధుడి గూర్చి అరటిపండు వలిచి పెట్టినంత 
సులభంగా ఉంది అని చూసి ,
అదెలా సాధ్యం అనుకున్నాను . 
కాని చదివిన తరువాత నిజమే అనుకున్నాను . 
అంతంత భారీ విషయాలు చక్కగా అర్ధం
 అయ్యేట్లు వ్రాసారు . ఇంకా చాలా పుస్తకాలలో మేము 
చెప్పినదే నిజం అన్నట్లు  వ్రాస్తూ ఉంటారు . 
కాని దీనిలో ఎక్కడ అయినా కొంత వివాదం ఉంటె 
అక్కడ క్లియర్ గా దీని మీద వివాదం 
ఉంది అనే విషయం కూడా ఇచ్చి ఉన్నారు . 
బుద్ధుడి మహాభినిష్క్రమణ గూర్చి , 
చివరలో తిన్న బిక్ష గురించి , బిక్షలో మాంసాహారం తినడం 
గురించి ...... అక్కడ ఉన్న సందేహాన్ని కూడా బ్రాకెట్లో ఉంచారు . 
పాటకుల విజ్ఞతను గౌరవించినట్లు ఉంది . 

''ఆత్మో దీపో భావ '' ఏదీ గుడ్డిగా నమ్మకుండా ఎవరికి వారు 
సద్విచారణ తో తమ దీపాన్ని వెలిగించుకోవాలి . 
''మార్పు అనేది అంతిమ సత్యం '' ఒక మనిషి తోనే ఈ సమాజం 
నడవదు . ఎవరు గొప్ప అని కాక ఏది మంచిది అని ధ్యానం తో 
ఉంటూ నడవాలి . తనకు తెలిసింది చెపుతున్నాను అంటాడే కాని 
తనను దేవునిగా పూజించమని ఎక్కడా చెప్పడు . 
''తృష్ణ అన్ని బాధలకు మూలం ''
నాకు ఇది ఇష్టం ,అది ఇష్టం అనుకొంటూ ఉంటాము . కాని కొద్ది 
రోజులకు మనకు అర్ధం అవుతుంది అది యెంత తీర్చుకున్నా అంతం 
అయ్యేది కాదు . సంతృప్తి తోనే అది మాయం అయ్యేది అని . 
ఇలాంటి భావన రావాలి అంటే '' విపశ్యన '' ధ్యానం తోనే 
సాధ్యం . నిజంగా నేను ఈ ''శ్వాస మీద ధ్యాస ''ధ్యానం నేర్చుకున్నప్పుడు 
ఎంతో  ఆశ్చర్య పడ్డాను . ఎంత హాయిగా ఉంది . గురువులు లేరు . 
 ఎవరైనా ఇంట్లోనే హాయిగా చేసుకోవచ్చు .  మొదట కొంత ఆలోచనలు 
వచ్చినా ఇప్పుడు ఎంత హాయిగా ఆలోచన రహిత స్థితి కి సులభంగా 
వెళ్ళవచ్చు . 
ఇంకా కొన్ని బుద్ధుడి మాటలు 
''అప్రియమైన సత్యం చెప్పకూడదు అని చెపుతూ ఉంటారు కదా !
కాని బుద్ధుడు సత్యం అప్రియమైనదైనా సరే చెప్పాలి అంటాడు . 
సత్యం చెప్పకుండా తప్పులు సరిదిద్దడం సాధ్యం కాదు ''అంటారు . 
మామూలు మనుషులం కాసింత అటూ ఇటుగా ఉన్నా , 
ఎదుటి వారికి మంచి జరుగుతుంది అంటే కటువుగా ఉన్నా 
సత్యం చెప్పాల్సిందే . ఎవరు చెప్పినా ,ఏమి చేసినా అన్ని 
దారులు వెళ్ళాల్సింది సంఘం వైపే . సమాజ హితవు కు 
ఉపయోగపడని మనిషి జన్మ వృధా . అందుకే సంపాదించిన 
దానిలో కొంత ధర్మ కార్యాలకు ,అన్న దానానికి ఉపయోగించాలి . 
''సంఘం శరణం గచ్చామి '' 

మరి అన్నింటిలోకి ఇదే గొప్ప మతం అని ఎవరైనా చెపితే నమ్మకూడదు . 
ధ్యానం చేసుకుంటూ మనిషిగా ఏది మంచిదో అది చేయాలి . 
ఎందుకంటె ఏదో ఒక మతం లో ఇమిడినపుడు మన జ్ఞానానికి హద్దులు 
వచ్చేసినట్లే . హద్దులలో జ్ఞానం ఎప్పటికీ ఇమడదు . ఎన్నో 
విషయాలు చదివిన తరువాత , ఎన్నో అనుభవాలు పొందిన 
తరువాత మనిషికి తెలిసేది ఒక్కటే..... 
''తనకు తెలియనది ఎంతో  ఉందని ''

                    @@@@@@@@@@@@@ 
                

Thursday, 11 December 2014

అయితే ఏమిటి పెద్ద !

''భూమి ఏమి చేస్తున్నావు ?''వంటింట్లో  భార్య 
చేస్తున్న వంటలోకి తొంగి చూస్తూ సుబ్బారావు .
విసుగ్గా మొహం పెట్టి కూరలో ఆలు ముక్కలు వేసి కలయ బెట్టి 
పక్కన ఉన్న చపాతి పిండి చిన్న ముద్దలుగా చేయసాగింది . 
పిల్లలిద్దరూ హాస్టల్ లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం వాళ్ళు ఇద్దరే . 
ఉదయం ఇద్దరు ఆఫీస్ హడావడిలో మాట్లాడుకోవడం కూడా పెద్దగా 
ఉండదు . కాసింత ఊసులాడుకొనే సమయం ఇదే . 
అటు తిరిగి చపాతీలు పాముతున్న భార్య మీదకు వంగి చూస్తూ మెల్లిగా 
భుజం మీద ముక్కు రాస్తూ ఉన్న తనని చూసి , 
ఇంక మొదలు మనసులోనే అనుకుంది . 
''మా అమ్మ మరీ ఇంత చిన్న చపాతీ లు చేయదు . అందుకే 
నీ చపాతీలు ఎన్ని తిన్నా కడుపు నిండదు . కొంచెం మా అమ్మ లాగా 
చెయ్యొచ్చు కదా !''

మెల్లిగా నడుం మీద వేసిన చేయి విసిరి కొట్టి కూర వైపు కోపం గా 
తిరిగి కలియబెట్టి కొంచెం మసాలా పౌడర్ వేసింది . 
''అబ్బ మా అమ్మ లాగా నూరిన మసాలా వేయవచ్చు కదా !
మా పిన్ని చపాతి లోకి కారెట్ కూర ,పచ్చి కొబ్బరితో కలిపి 
చేస్తుంది . ఎంత బాగుంటుందో . ఏమిటి దీనిలో బటానీలు వేసావా ?
అసలు తినాలని చేస్తావో ,తినకూడదని చేస్తావో అర్ధమే కాదు . 
అసలు ఇది చపాతీ లోకి బాగా ఉండదు చూడు ''విసుగ్గా చెప్పాడు . 
ఏమి తెలుసు మీకు కోపంగా మాట జారబోయి ,ఎందుకులే గొడవలు 
అని పెదవి కొరుక్కుంది అసహనంగా . పెనం మీద చపాతీ కాలుస్తూ 
ఉండే లోపల మనసు కూడా కోపం గా ఉడుకుతూ . 
పట్టించుకోకుండా వెళ్లి టి . వి లో న్యూస్ చూడసాగాడు . 


''ఛా ....... ఎలా విరిచేస్తారు వీళ్ళు ఉండే మనసును కూడా . 
ఎంత చేసినా తృప్తి ఉండదు . ఎవరు ఎవరితోనో పోలికలు ,
అసలు ఈ రోజు ఆఫీస్ లో ఎంత పని ,పక్కన కొలీగ్ సెలవు 
పెట్టడం తో నోట్స్ తయారు చేయడంలో  అన్నం కూడా తినకుండా 
పని చేసింది . రెండు సార్లు టీ  తప్పితే ఇప్పటివరకు ఏమి తినలేదు .  
అసలు ఓపిక లేకపోయినా ఫ్రెష్ బటానీలు ఈయనకు ఇష్టం అని 
మసాలాతో కొత్తగా కూర చేస్తే పొగడటం లేదు ,కాసింత మెచ్చుకోలు 
లేదు ,ఇంకా తినక ముందే బాగుండదు అని కామెంట్లు . 
భర్త అయితే ఏమిటి పెద్ద ?పనికి విలువ ఇవ్వనప్పుడు . 
తనతో ఇంటి బరువును మోస్తున్న భార్య కు కాసింత ప్రేమను 
పంచనపుడు ''మనసులో సుడి తిరిగుతున్న బాధ రెప్పలపై 
అశక్తత తడిగా ఊరుతూ ..... కొంగుతో తుడుచుకొని కాలిన చపాతి 
హాట్ బాక్స్ లో పెట్టి ,ఇంకో వైపు ఇంకో చపాతి పామి పెనం పై వేసి 
కూర కింద స్టవ్ ఆపేసి టేబుల్ మీద పెట్టింది . అటు తిరిగి చూస్తే 
న్యూస్ లో లీనమై పోయి చూస్తున్నాడు . 

విసురుగా వంటింట్లోకి వెళ్లి చేతిలోని ప్లేట్ సింక్ లోకి విసిరేసింది 
కోపం అణుచుకోలేక .  శబ్దానికి ఇటు తిరిగి మళ్ళా అటు తిరిగాడు . 
అన్నీ రెడీ అయితే పిలుస్తుంది కదా అని . 

అంత బాధ లోనూ అమ్మమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి భూమి కి . 
''మగవాడికి అసహనం ఎక్కువ . జీవిత చక్రం మీద ఘర్షణ పడకుండా 
కందెనలా మారి  ఆడవాళ్లే అణుకువ తో కాపురం దిద్దుకోవాలి తల్లి . 
పగలగొట్టుకుంటే అది ఎవరి కాపురం !నీదే కదా . నచ్చలేదు అని 
విడాకులు తీసుకున్నా ,తరువాత వచ్చేవాళ్ళు మగ వాళ్ళే . 
అణుకువే ఆడదానికి రక్ష గుర్తుంచుకో ''

''అవును అందరు ఆడదానికి అందరు అణకువ గురించి క్లాస్ లు 
చెప్పే వాళ్ళే, ఆడదానికి ఏమి బాధ కలుగుతుందో అర్ధం చేసుకోమని 
మగ వాళ్లకు చెప్పే వాళ్ళు ఉండరు . ఛీ ఈ లోకమే ఇంత '' 
కళ్ళ నీళ్ళు కనపడకుండా తుడుచుకుంటూ అన్నీ టేబుల్ మీద సర్దింది . 
మళ్ళా అవి కనపడినా బోలెడు తిట్లు తనకే ''మాటికి కుళాయి 
తిప్పెస్తావు ,నేను ఎంత బాగా చూసుకున్నా ''అని . 
చెప్పలేని బాధకి రూపం కన్నీళ్లు అని ,అది మా ఆశక్తతకి గుర్తు 
అని వీళ్ళు ఎందుకు తెలుసుకోరు . 

భార్య కోపం అర్ధం అయినట్లుగా ఉంది . గమ్మున ప్లేట్ లో చపాతీలు 
కూర పెట్టుకొని ,నువ్వు కూడా తిను భూమి అనకుండా గబగబ
తినేసి లేచి చేయి కడుక్కున్నాడు . అగ్ని పర్వతం కింద లావా ఉబుకుతుందని 
తెలిసినపుడు దానిలో తొంగి చూసే సాహసం సుబ్బారావు చేయడు .  

మెల్లిగా కూర మూత తీసి చూసింది . ఏముంది అక్కడ ఒక్క గరిటెడు 
కూర . బాగుందని మొత్తం తినేసాడు . ఈ పాటి దానికి ఏమి బాగుండదు 
చూడు అని ముందే కామెంట్లు . కొత్త కూరనా ?తిని చెపుతాను అని 
అంటే తనకు ఎంత సంతోషంగా ఉంటుంది . కావాలంటే తిన్న తరువాత 
ఈ రుచి నచ్చ లేదురా అంటే ,తనకు ఇష్టం లేనిది ఇంకెప్పుడూ 
చేయదు కదా . భార్య అలిసిపోయినపుడు తమ ప్రేమ వాళ్ళను సేద 
తీరుస్తుందని ఈ మగ వాళ్ళు ఎప్పటికి గ్రహిస్తారో !!

కూర లేకుండా తినలేక , బాధతో ఆకలి చచ్చిపోయి వెళ్లి పడుకుంది 
మౌనంగా . ఫోన్ మోగితే తీసి మాట్లాడుతున్నాడు . 
''ఆ అమ్మా బాగున్నాము ''
''అత్త గారు కాబోలు . ఇంకేమిటి ,పాపం రా నీకు ఆలు కూర 
ఇష్టం . తిని ఎన్ని రోజులు అయిందో నువ్వు పాపం . భూమి కి 
రాదు కదా . ''అంటూ ఉంటుంది కసి గా  అనుకొని మంచం 
చివరకి గోడ దగ్గరకి జరిగి వీపు ఇటు వైపు ఉంచి ముడుచుకు 
పడుకుంది . ఆకలి కంటే మనసులో బాధే ఎక్కువగా తలగడ
తడిసిపోతూ ఉంది . 
పక్కన పడుకున్న అలికిడి కి కూడా తిరగలేదు . 

మెల్లిగా పైన వేసిన చేయి గారంగా నిమురుతూ .... 
నిజంగా స్పర్శ చాలా విసుగ్గా  ఉంది . 
తోసేస్తుంటే ఆయన  బలం ముందు తన బలం ఎంత !
''చెప్పేది విను భూమి  ,అమ్మ ఏమందో తెలుసా ?''
చేతిని భూమి ని పైకి లేవకుండా అడ్డు ఉంచి అన్నాడు . 
విని తీరాల్సిందే అనే పంతం ఆ మొరటు బలం లో . 
ఎందుకు లొంగాలి మనసులోనే గింజుకుంటూ ఉంది ,లేవాలని 
ప్రయత్నం చేసినా వీలు కావడం లేదు . 

''చెప్పేది విను ''భూమి మొహం అంత దగ్గరగా చూస్తూ ఆగలేక ,
వినను అని పక్కకి తిప్పిన మొహం పైకి వంగి చెవి ని నిమిరి 
చెప్పాడు ''భూమి చాలా మంచిదిరా . ఆఫీస్ లో అంత పని 
ఉన్నా మళ్ళా వచ్చి వంట చేస్తుంది . నేను ఇంట్లో నే 
ఉంటూ ఒక్క వంట చేసిపెట్టడానికి ఎంత కష్టపడుతున్నాను. 
అలాంటిది తను ఆఫీస్ లో ,ఇంట్లో . ఎంత శక్తి కావాలో తెలుసా 
ఇంత పనికి . ఇంత పని ఎందుకు చేస్తారో తెలుసా ఆడవాళ్ళు !
కేవలం భర్త ప్రేమ కోసమే . నువ్వు తనకు ఇవ్వగల సహాయం 
ప్రేమేరా ,ఎప్పుడూ ఇతరులతో తనని పోల్చొద్దు . ఎవరి భార్య 
వాళ్లకు ఎక్కువ . ఇద్దరి లో ఉండే బలహీనతలు బట్టి ఒకరికొకరు 
ప్రేమతో సహాయం చేసుకోవాలి . భూమి ఏడిస్తే ఇంటికి మంచిది 
కాదు . భార్య నవ్వుతూ ఉంచగల మగ వాళ్ళే కాపురం సరిగా 
చేస్తున్నట్లు . అర్ధం అయ్యేట్లు చెపితే మాట వినని వాళ్ళు ఉండరు . 
కాకుంటే మీరు చెప్పేది విసుగుతో కాక ప్రేమతో ఉండాలి '' 
అని చెప్పింది . 

''అయితే ఏమిటి మీకెలాగు నా కూర నచ్చలేదు కదా ''
మెత్తబడినట్లు తెలీకుండా కోపం నటిస్తూ .  
''నచ్చక పోవడమా సూపర్ ఉంది తెలుసా !''చటుక్కున 
బుగ్గ పై చిన్న ముద్ర ............. ''ఇంత బాగుంది ''
చిలిపిగా చూస్తూ అన్నాడు . 
ఆకలి ఎటు పోయిందో ,మనసంతా సంతోషం తో నిండిపోయి 
చేతుల మధ్య ఒదిగిపోయింది . 
''అత్తగారు థాంక్యు . ఎంత సేపు భార్యా భర్త ల మద్య అహాలు 
రెచ్చగొట్టే వాళ్ళు కాదు ,మీలాగా మగ వాళ్లకు అర్ధం చేసుకొని 
ప్రేమతో గెలవమని చెప్పే వాళ్ళు ఉండాలి ''మనసులోనే కృతఙ్ఞతలు 
చెప్పుకుంది . 
                                  @@@@@@@@@@@@@@@@@@@ 
   

Tuesday, 2 December 2014

ఇదొక లెక్కా ?(4)


( 1 ,2 ,3 parts link ikkada )
కాళేశ్వరం నుండి హనుమకొండ వెళ్ళే బస్ తిరుగు ప్రయాణం కోసం 
నేను ఈయన ,అమ్మ ,నాన్న ,పాపను ఎత్తుకొని ఎక్కాము . 
అమ్మా వాళ్ళు కొంత ముందు వెనుక సీట్స్ లో నేను ఈయన కూర్చొని ఉన్నాము . 
కిటికీ పక్కన నేనే కూర్చున్నాను . పాప కూడా మెల్లిగా తాతయ్య వాళ్ళను 
వదిలి నా వడిలోకి వచ్చేసింది . ఓపిక ఉన్నంత సేపు కిటికీ లో నుండి 
చూస్తూ చెట్టు నో పక్షి నో వచ్చినపుడల్లా నన్ను తట్టి చూపిస్తూ ,నవ్వుతూ 
ఉంది . ఆ చిన్న జుట్టే ఒక్క జడగా వేసాను .ముందు ఉండే వెంట్రుకలు గాలికి 
దాని మొహం మీద వాలుతూ ..... మెల్లిగా వేళ్ళతో వెనక్కి దువ్వుతూ 
ముద్దు మాటలు వింటూ ఉన్నాను . ఇంకా అవేమిటి అని ప్రశ్నించడం 
రాదు . చూసినదంతా మనకు కూడా తట్టి చూపిస్తుంది . పిల్లలకు వింత 
కానిది ఈ ప్రపంచం లో ఏమి ఉండదేమో !
మేము తప్ప అన్ని సీట్లలో సర్దుకున్న తెలంగాణా పల్లెతనం . కాళేశ్వరం 
చాలా లోపల ఉన్నట్లుంది ,ఇక్కడ కొంత కూడా పట్నం ఫాంట్స్ ,టీ షర్ట్స్ 
కనిపించడమే లేదు . ఆడవాళ్ళు శుబ్రంగా జడ వేసుకొని సంకలో చిన్న పిల్లలతోనో ,
పక్కన వేలు పట్టుకుని నడుస్తున్న పిల్లల తోనో ..... పిల్లలు కూడా 

నగ్నంగా నో ,అర్ధ నగ్నంగానో వంటి నిండా బట్టలు వేసుకున్నా అది 
గౌరవంగా ఉంది కాని ,డాబుసరిగా లేదు .పెద్దగా డబ్బు ఉన్న వాళ్ళు నాకు 
ఎక్కడా కనిపించలేదు . బహుశా అదంతా చిన్న పల్లెలున్న అడివి ప్రాంతం కాబోలు . 
మహా అయితే ఆడవాళ్ళ కాళ్ళకు గజ్జెలు , మెట్టెలు ,కొందరికి కమ్మలు ,బేసరి 
అంత కంటే విలువైన సొమ్ములు లేవు . చూస్తూ కూర్చున్నాను పల్లెను 
దగ్గరగా ఒక్కో సారి చెమట వాసన పల్లె ను స్పురింప చేస్తుంది . పల్లె 
ఎవరికైనా తల్లే కాకుంటే మరీ సౌకర్యాలు లేకుంటే బ్రతుకలేము . మినిమం 
అవసరాలు సరిపడా సౌకర్యం ఉంటె హాయిగానే బ్రతికెయ్యొచ్చు . ఇంత 
చిన్న పిల్లలకు కూడా ''చాయ్ తాగు ''అని త్రాగించేస్తారు . పిల్లలు చాయ్ 
తాగటం నాకు విచిత్రం . హార్లిక్స్ బూస్ట్ కదా త్రాగాలి . చాలా కొద్ది మంది 
బస్ ఆగినప్పుడల్లా ఎక్కుతోనో ,దిగుతూనో ''దిగుండ్రి ''అనే ఆదలింపులు . 
బహుశా వీళ్ళ స్థితి కి కారణం అవిద్య . విద్య ఎన్నో అద్భుతాలు చేస్తుంది . 
కాని ప్రభుత్వాలు ఎందుకో దాన్ని పెట్టుబడిగా కాక ,ఖర్చు గా లెక్క 
వేసుకొని స్కూల్స్ మూసేస్తూ ఉంటారు . ఇక్కడ కొంత మంది కొలీగ్స్ 
దగ్గర విన్నాను ''వీళ్ళకు ఎందుకు చదువులు ,అందరు గొప్పోళ్ళు 
అయితే ఇంకేంది ''(అంటే పదాలు గుర్తు లేవు కాని ఇలాంటి అభిప్రాయం 
కొంత మంది దగ్గర చూసాను . ఇది మిగతా ప్రాంతాలలో కూడా కొంత ఉండవచ్చు . 
ఇది మనిషి అహానికి సంబంధించిన ఆలోచనే కాని ప్రాంతీయం కాదు )
ఆలోచనల్లోనే కళ్ళు మూతలు పడిపోతున్నాయి . ఉదయం నుండి 
ప్రయాణం అలసట.  కిటికీ లోకనపడుతున్న అడవి అందాలు వైపు 
చూపు వెళ్ళటం లేదు . పాప ఎప్పుడో నిద్రలోకి జారిపోయింది . 
తల ముందు సీట్ కి తగులుతుందేమో అని వడిలో అడ్డంగా పడుకో బెట్టుకొని 
దాని చెంప పొట్ట కు ఆనించుకున్నాను.  కాళ్ళు ఈయన వడిలో 
వేలాడుతుంటే మెల్లిగా చేతులతో సర్ది ఈయన చేతులు పాప 
కాళ్ళకు అడ్డంగా పెట్టుకున్నాడు ,పాప నిద్రకు ఇబ్బంది లేకుండా . 
నేను పాప ఇద్దరం మెల్లిగా నిద్రలోకి జారిపోయాము . కిటికీ 
లో నుండి వీచే చల్ల గాలి ఇద్దరికీ జోల పాడుతూ . 

ఉన్నట్లుండి 'సడన్ బ్రేక్ '. ఉలిక్కిపడి ముందు సీట్ కి పాప తల 
తగల పోతుంటే చేయి తల పైన అడ్డంగా పెట్టాను . సీట్ కి నా 
వెళ్ళు తగిలి అబ్బ అన్నాను . ఎందుకు ఆగింది బస్ మధ్యలో . 
కొంత మంది లేచి నిలబడి ముందుకు తొంగి చూస్తున్నారు . 
డ్రైవర్ కనపడలేదు . ఈయన ఆందోళనగా లేచి నిలబడ్డాడు  . 
నాన్న కి ఏమి అర్ధం అయినట్లు లేదు . కింద నిలబడిన పోలీస్ 
డ్రైవర్ కి ఏదో చెపుతున్నాడు . ''అందరు దిగుండ్రి ''
''ఏమైతాంది '' ''ఏమో ఎర్క లేదు ''
అందరు దిగుతూ ఉంటె బస్ అద్దాల్లో నుండి దూరంగా పోలీస్ లు . 
వాహనాలు వెళ్ళకుండా రోడ్ మీద అడ్డంగా తాడు కట్టి ఉన్నారు . 
అందరం దిగాము . అమ్మా నాన్నలు కూడా కంగారుగా ఉన్నారు . 
ఇప్పటికే మధ్యాహ్నం అయింది . మేము ఇంకా చాలా దూరం 
ప్రయాణం చేయాలి . రాత్రికి వాళ్లకి తిరుగు ప్రయాణం రిజర్వేషన్ . 
పోతే పోనీ అనుకోలేము . 
అసలు బస్ కేమైనా అయిందా !
''ఇంకో బస్ వస్తుందా ?''
''ఇంకోటి గాదు ఇంకైతే బస్ నడ్వయి ''
ఉండవా ?ఎందుకు ?ఎవరు ఏమి సమాధానం చెప్పడం లేదు . 
గుంపులుగా చేరి మాట్లాడుకుంటున్నారు . 
ఇంటికి ఎలా వెళ్ళేది ?అసలు ఏమి జరుగుంటుంది ?
                                                           (ఇంకా ఉంది )

Thursday, 20 November 2014

ఇదొక లెక్కా ?(3)

(part 1, 2 link ikkada )
బస్ వెళుతూ ఉంటె కాళేశ్వరం ఇంకా ఎంత దూరం ఉందొ 
అనుకుంటూ దేవుడు కిటికీ లో నా కోసం ఇచ్చిన ప్రకృతి 
ఫోటో ఆల్బం చూస్తూ కూర్చున్నాను . ఉన్నట్లుండి ఒక నల్ల మబ్బు 
 సూర్యుడిని కప్పుతూనో ,దూరంగా తెలిపోతూనో ఎక్కువగా చెట్లు 
మధ్యలో చిన్న కొండ గుట్టలు .... ఇక్కడ అడవిలో జంతువులు 
ఉంటాయా ,ఉండవా ..... ఎక్కడో ఒక్క ఊరు . దానిని ఊరు 
అని కూడా అనలేము . ఒక ఇరవై ఇళ్ళు అంతే . ముందుకు చూసాను . 
నాన్న వడిలో నుండి జారి పాప పరిగెత్తుతూ ఉంది . వాళ్ళు 
నవ్వుకుంటూ పట్టుకుంటున్నారు . నేను మా వారి వంక చూసేసరికి 
ఆయనే కూతురుని గొప్పగా చూసుకుంటూ ,నవ్వుకుంటూ ఇకీ 
నా వంక చూసారు . దొంగ మొహం అమ్మమ్మ దగ్గర ఉండిపోయింది . 
కనీసం అమ్మ దగ్గర కు వెళతాను అని ఏడవడం కూడా లేదు . 
వాళ్ళు నెల్లూరు కి వెళ్ళనీ చెపుతాను . 

అదిగో ఈ ఊరిలో ఒక చిన్న ప్రభుత్వ బడి . హమ్మయ్య చూస్తే 
సంతోషం వేసింది . ఇక్కడ కూడా బడు లు ఉన్నాయి పర్వాలేదు . 
నేను కాని సి .ఎమ్ అయితే (ఇది కొంచెం ఎక్కువే కాని ,చిన్న లక్ష్యం 
నేరం అని కలాం గారు చెప్పారు కదా అందుకు ) ప్రతి ఊరికి ఒక 
స్కూల్ పెట్టి అవన్నీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ గా మార్చి శాటిలైట్ 
తో అనుసంధానం చేసేస్తాను . పెద్ద స్క్రీన్ విడియో కాన్ఫెరెన్స్ ల కోసం ,
ఇంకా ప్రతి దగ్గర నుండి ప్రతి సంస్థకు లింక్  ఉండేటట్లు ,అన్నీ సోలార్ తో 
పనిచేసేట్లు .......... ఆ ఊరి పిల్లలనే ఇద్దరినీ నిర్వహించే జాబ్ 
ఇచ్చేస్తాను . 
అసలు పల్లెటూరి లో ప్రభుత్వ బడి ఎంత స్ట్రాంగ్ గా ఎన్ని వసతులతో 
ఉంటె ప్రభుత్వం అంత చక్కగా పాలించగలదు . 
నిజమేనా ? మరి ప్రభుత్వ బడి అంటే పల్లెటూళ్ళలో ఎంత 
ఉపయోగం తెలుసా ?తుఫాన్ షెల్టర్ అదే ,చదువుల గుడి అదే ,
పోలియో టీకాలు అక్కడే ,ఎన్నికల బూత్  లు అక్కడే ,
రచ్చబండలు అక్కడే , పిల్లల ప్లే గ్రౌండ్ అదే ,కొన్ని సార్లు 
న్యూస్ పేపర్స్ దొరికే గ్రంథాలయము ,ఇంకా చదువు రాని 
వాళ్ళు ఉత్తరాలు వ్రాయించుకునే దక్కడే ,ముహూర్తాలు రొయ్యల 
చెరువు కోసం పెట్టేది అక్కడే ,గ్రామ సభలు అక్కడే ,
కష్ట సుఖాలు  అక్కడే ,ధాన్యం ఆరపోసుకుంది అక్కడే ,ఒక్కోసారి 
బర్రెలను కట్టేది అక్కడే ..... ఇంకా సెలవల్లో పేకాట రాయుళ్ళ వేసవి విడిది . 

ఇలాంటి స్కూల్స్ ని ఇంకా పెంచుకుంటూ ఉంటె అవి ప్రభుత్వానికి 
సామంమత రాజుల కోటల్లాగా ఉపయోగపడుతాయి కాని ,
రేషనలైజేషన్ పేరుతో మూసేస్తే ప్రభుత్వానికి బలం తగ్గినట్లే . 
అసలు విద్య మీద పెట్టేది ఎంత పెంచితే దేశ అభివృద్ది సూచిక అంత
పెరిగినట్లు . 

ఆలోచనల్లోనే కాళేశ్వరం వచ్చేసింది . బస్ ఆగే స్థలానికి దగ్గర లోనే 
గుడి . పెద్ద పురాతనంగా లేదు . కొత్తగా కట్టినట్లే ఉంది . 
మరి యముడు స్థాపించాడు అన్నారు . గుడి చూస్తె అలా లేదు . 
గుడిలోకి అడుగు పెట్టగానే మాధురి పరుగో పరుగు . ఇంత సేపు 
దానికి కాళ్ళు కట్టేసినట్లు ఉన్నాయి పాపం . అందరం నవ్వుకొని 
ఆడుకోనీలే అని వదిలేసాము . ప్రాంగణం లో చిన్న నాలుగు స్తంభాలతో 
ఒక మండపం . దాని పైకప్పు మన నడుములు దాక వస్తుంది . 
ఏమిటబ్బా ఇది అనుకుంటూ వంగి చూసాను . ''యమ కోణం ''
అని వ్రాసి ఉంది. వీళ్ళు అందరు నా వైపు చూస్తున్నారు . ఇలాంటి 
సత్య శోధనలు నాకు భలే ఇంట్రెస్ట్ . అక్కడ బాణం గుర్తు ఉంది . 
ఓహో చక్కగా వంగి అవతలకి దూరాను . ఏముంది ఇక్కడ ?
ఏమి లేదే !అక్కడ ఇంకో బాణం మళ్ళీ వంగి మండపం నుండి 
బయటకు వచ్చాను . మొత్తానికి మండపం లో ప్లస్ లాగా దారిలో 
వెళ్లాను . ఏమిటో ఇది అర్ధం కాలేదు . 

లోపలి వెళ్ళాము . పెద్దగా జనాలు లేరు . ఇలాగ ఉంటె నాకు చాలా 
ఇష్టం . తోసుకుంటూ ఉంటె అసలు ఇష్టం ఉండదు . లోపలికి 
వెళ్లి లింగం వైపు చూసి నమస్కరిస్తూ ఆశ్చర్య పోయాము . 
ఒకే పానపట్టం పై రెండు లింగాలు . మళ్ళా ఒక లింగం మీద 
రెండు రంద్రాలు . 
''ఏమిటి స్వామీ ఇది ?''అడిగింది అమ్మ . హేమ చేత 
నమస్కారం పెట్టించింది . ఎక్కడకు వెళ్ళినా ఆ స్థలం 
గూర్చి అడగడం శ్రద్ధగా వినడం ,మళ్ళీ పిల్లలకు అర్ధం 
అయ్యేట్లు చెప్పడం మా అమ్మా నాన్నలకు అలవాటు . 
నాకు కొద్దిగా ఇలా అడగడం అలవాటు అయింది . 


''అమ్మా ఇది యముడు చేత స్థాపితం ,ఇది కాళేశ్వరుడు
ఇది ముక్తేశ్వరుడు. ''
''మరి ఒక లింగం మీద రెండు రంద్రాలు ఏమిటి ?''
''అవి నాసికా రంద్రాలు . శివుడు మీద పడిన అభిషేక జలం 
ఈ రంద్రాల గుండా వెళ్లి గోదావరిలో కలుస్తుంది ''

బాప్రే నిజమా !అందరం ఆశ్చర్య పోయి మళ్ళా భక్తిగా 
నమస్కరించుకున్నాము . హేమా మాత్రం పెట్టను అని మొండికేసి 
ఆటలో మునిగి పోయింది పక్కన ఉండే ఉడుతను చూస్తూ .   

''స్వామీ మరి బయట ఆ పొట్టి మండపం ఏమిటి ?''అడిగాను 
ఆత్రుతగా . 
''అది యమ కోణం . ఆ బాణం గుర్తులలో అందులో తిరిగితే 
యమ బాధలు ఉండవు ''అని చెప్పారు . 
గ్రేట్ . ఇంత చిన్నగా తిరిగితే యమ బాధలు ఉండవని తెలిస్తే 
ఎవరు మాత్రం తిరగకుండా ఉంటారు . తిరుగుదామని బయటకు వెళుతూ 
ప్రహరి గోడ పక్కనుండి చూసాను . కనుచూపు ఆనేంత 
దూరం లో గోదావరి నది .ఆకాశం నుండి బ్లూ రిబ్బన్ వేలాడదీసినట్లు ,
మరి లింగం పై పడిన అభిషేక జలం 
అంత దూరం వెళ్లి కలుస్తుందా !ఏమి టెక్నాలజీ !!
బహుశా అంతకు ముందు గోదావరి గుడికి ఇంకా దగ్గరలో 
ప్రవహించేదేమో !

అందరం మళ్ళీ యమ కోణం దగ్గరకు వెళ్లి అందులో నుండి 
దూరి ప్రదక్షిణం చేసాము . 
''హేమా నువ్వు వెళ్ళు ''అని వదిలాను . ఎదురుగా వెళ్ళు 
అంటే పక్కకు వెళుతుంది ,పక్కకు అంటే ఎదురుగా ,
కోప్పడదాము అంటే చప్పట్లు కొట్టి పక పక నవ్వేస్తుంది . 
దాని చేత సక్రమంగా ప్రదిక్షణం చేయించే యమ బాధ పడి 
హమ్మయ్య ఇంకా ఎవరికీ యమ బాధలు ఉండవు అని 
ఆనంద పది బయటకు వచ్చాము . ప్రహరి ప్రక్కనే 
సరస్వతి దేవి గుడి అమ్మవారు చక్కగా పసుపు పూసి 
అలంకరించుకొని వీణ పట్టుకొని నిజంగా అమ్మవారే ఎదురుగా 
కూర్చున్నంత కళగా ఉన్నారు . 
ప్రశాంతంగా మండపం లో కూర్చొని తినేసరికి బస్ శబ్దం . 
నిజానికి ప్రయాణమే ఎక్కువగా ఉంది కాని గుడిలో గడిపింది 
అరగంటే . అయితేనేం ఎంత ప్రశాంతంగా ఉంది . ఈ ఊరు ,
మనుషులు ,దేవుళ్ళు అన్నీ ఎంత ప్రశాంతంగా ..... ఎందుకో 
నెల్లూరు వాళ్ళు ఇక్కడకి పెద్దగా రారు . ఇక్కడ కూతుర్నీ 
నెల్లూరు  లో కోడలుగా చూడలేదు , అక్కడ  కూతురిని 
ఇక్కడ కోడలుగా చూడలేదు . ఒక్క సారి గుడి వైపు 
హాయిగా చూసి తిరుగు బస్ ఎక్కేసాము . కానీ ఈ 
ప్రశాంతత వెనుక రాబోయే కల్లోలం నాకు తెలీదు . 
                                               (ఇంకా ఉంది )

Tuesday, 18 November 2014

ఇదొక లెక్కా ? (2)

(part 1 link )
ఉదయాన్నే లేచి ఉప్మా ,పులిహార చేసేసి పాపను రెడీ 
చేసేసాను . రెడీ చేసినంత సేపు నువ్వు ఏమైనా 
చేసుకో, అని పాప తూగుతూనే ఉంది . కాళేశ్వరానికి
గంటకో బస్ ఉంది అని చెప్పారు . అయినా తొందరగా 
వచ్చెయ్యాలి అమ్మా నాన్న రాత్రి ట్రైన్ కి నెల్లూరు కు తిరిగి 
వెళ్లిపోవాలి . అబ్బా వెళ్లి పోతారా ! మనసు కొంచెం బాధగా 
మూలిగింది . వచ్చినట్లు లేదు వెళ్ళినట్లు లేదు . నాన్న 
పాపను ముద్దు చేస్తూ కళ్ళు తెరవమని బ్రతిమిలాడుతూ ఉన్నాడు . 
''మాధురి కళ్ళు తెరువమ్మా '' ఇదేమో మబ్బులోనుండి చంద్రుడు 
తొంగి చూసినట్లు కొంచెం తెరవడం ,గబుక్కున మూయడం ,
పక పకనవ్వడం . ఈయన తాళం బుర్ర చేతిలోకి తీసుకున్నాడు . 
అందరం బయటకు వచ్చేసాము .   

బయట ఇంటి ఓనర్ భార్య ముగ్గు వేస్తూ ఉంది . మామూలుగా 
లేవదు . మేము ఎక్కడకో వెళుతున్నాము కదా అని ముగ్గు వేస్తూ 
ఉంది . నాకు ఇక్కడ ఈ పద్ద్దతి భలే నచ్చింది . పక్క వాళ్లకు 
అవసరమేమో అనిపిస్తే వాళ్ళకై వాళ్ళే వచ్చి సహాయం కావాల్నా ?
అని అడుగుతారు . పాపను చూసి ''మాధురి ''అని హెచ్చరించు కుంది . 
ఇదేమో లేస్తే కదా !మెల్లిగా బుగ్గ పట్టుకొని లేపాను ,తన వైపు 
తిప్పి చూపిస్తూ . ''పోనీయ్యి పాపం మస్తు నిద్ర లున్నట్లుంది ''
వారించింది . 

''పాలు మా ప్రిజ్ లో పెట్టుకొండ్రి . మళ్ళయితే ఈమె పరేషాన్ చేస్తాదేమో ''
''ఏమి లేవు లెండి . వచ్చేటపుడు పేకెట్ తెస్తాను చెప్పాను ''పాపను 
భుజం మీద సర్దుకుంటూ . దానికి కోపం విసుగు వచ్చేసి 
మూతి ముడిచి ''కుయి ''అనింది మొదలుపెడతాను అని సిగ్నల్ 
ఇచ్చి . మళ్ళా వీపు మీద తట్టాను . ప్రిజ్ ,టి . వి లే కాదు 
కాట్స్ కూడా లక్సరీలు అనుకునే రోజులు . ఎప్పుడైనా 
అవసరం వస్తే తనే సహాయం చేస్తుంది . నేను మొహమాట పడుతానేమో 
అని అడుగుతూ ఉంటుంది . ఎంత సహాయం చేస్తున్నారు అంటే .... 
''ఏమైతది పాలు పెట్టుకుంటే మా వాళ్లకు చదువైతే చెప్పుండ్రి చాలు ''
అంటుంది . 
''కాళేశ్వరం మస్తు దూరం బిడ్డకు పెయ్యి నొచ్చుతాదేమో ,ఈడే  ఉంచరాదా ''
బాబోయ్ నిజంగా చాలా దూరమా !అనవసరంగా పెట్టుకున్నమా ప్రయాణం . 
కాని నాన్నకి అమ్మకి పాపతో గడపాలని ఉంది . 
''వద్దు లెండి తీసుకేళతాము ''చెప్పాను . 

తాళం వేస్తున్న మా వారిని చూసి చెప్పింది . 
''అదో ఎదురింటి వాళ్లకి ట్యూషన్  కావాలంట . అడగమన్నారు''
ఎదురిల్లు అంటే మధ్యలో కారు పోయేంత చిన్న రోడ్ అడ్డం అంతే . 
అక్కడ సేట్స్ ఫ్యామిలీ . ఉమ్మడి కుటుంభం పెద్ద ఇల్లు . చాలా 
మంది పిల్లలు ఉంటారు . కాకుంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్లి చెప్పాలి . 
''లేదండి . అలాగా ఇంటికి వెళ్లి చెప్పను ''మెల్లిగా చెప్పారు ఈయన .  
పిల్లలే గురువు దగ్గరకి రావాలి చదువుకోను, అని మాత్రమె మాకు 
తెలుసు . అదే ఒక గురువుకు గౌరవం . కాని ఇలాగ గంటల 
లెక్కన ట్యూషన్ చెపుతారని , ఓన్లీ మాథ్స్ అంటే డిమాండ్ అని 
తరువాత తెలుసుకొని ఆశ్చర్య పోయాము . ఏమో ఎప్పుడూ 
నిలబడి నీళ్ళు తాగే పద్దతే మాది ,పరిగెత్తి పాలు త్రాగాలి అనుకోము . 

పాప చేత నిద్రలోనే టాటా చెప్పించి బస్ స్టాండ్ కి వెళ్ళాము .
బస్ ఎక్కిన తరువాత పాప అమ్మా నాన్న చేతిలోకి వెళ్ళిపోయింది . 
మేము ఇద్దరం వెనుక సీట్ . అందులో నేను కిటికీ పక్కన కూర్చున్నాను . 
ఇంకొక సీట్ పక్కన ఖాళీ . కండక్టర్ టికట్ రేట్ చెప్పగానే మా వారి 
వంక చూసి కళ్ళు ఎగరేసాను ఆశ్చర్యంగా అంతనా !అని . 
కాని.....  ఏమి చేద్దాము అన్నట్లు తల ఊపారు . భావాల మార్పిడి కి 
కొన్ని సార్లు మాటలు అవసరం లేదు . ముఖ్యంగా బార్యా భర్తలకు . 

బస్ కదిలి పొలిమేరలు దాటేదాకా కొద్దిగా జనాలు కనిపిస్తూ ఉన్నారు 
బయట . పోను పోను ఎక్కడో ఒక్క గ్రామం . ఎక్కే  వాళ్ళు దిగే వాళ్ళు . 
కొన్ని నెలలుగా చూసే వాళ్ళే అయినా ఇక్కడ పల్లె వాళ్లకి, మేము 
చూసిన పట్నం వాళ్లకి కొంత తేడా !పెద్ద వాళ్ళంతా అవే పంచె లు 
కడతారు కాని పిల్లలలో చాలా మార్పు పల్లెకి ,పట్నానికి . 
కాని ఎంత చదువుకున్న వారైనా వాళ్ళు పల్లె నుండి వచ్చిన 
వారైతే మనసులో బెరుకు మనకు తెలిసిపోతూ ఉంటుంది . 
పెద్దగా ఎవరికీ అహం ఉన్నట్లు అనిపించదు . తప్పకుండా 
పలకరిస్తారు . మా వైపు మనసులో బెరుకు ఉన్నా అప్పటికి అపుడు 
అవసరమైతే కొంత పులి ముసుగు వేసేస్తారు . ఇక్కడ అదింకా 
అలవాటు లేదు లాగుంది . ముక్కు పుడకలు ,నేత చీరలు , 
ఇంకా కాళ్ళకు మెట్టెలు దిగుతూ ఎక్కుతూ ,పల్లె దర్శనం 
దగ్గర నుండి పరిశీలిస్తూ నేను , మెట్టెలు చూసి వాళ్లకు పెళ్లి 
ఎన్ని  ఉంటుందో ఊహిస్తూ ఉన్నాను . మెట్టెలు అరిగి కొత్త మెట్టెలు 
తీసుకోవాలి అంటే ఇక్కడి వాళ్ళు చాలా పెద్దవి తీసుకుంటారు . 
ఎంత పెద్దవి అంటే ..... పెళ్లి అయి పదేళ్ళు అయి ఉంటె కాలి వేళ్ళకు 
చిన్న పురి కొస అంత లావు ఉంటాయి . ఇక పాతిక, ముప్పై 
ఏళ్ళు పెళ్లి అయి దాటి ఉంటె ఇంక చెప్పలేము .... కొబ్బరి తాడు 
అంత లావున ,బాబోయ్ నిజంగా ఎలా మోస్తారో వీళ్ళు . 
చదువుకున్న వాళ్ళు కూడా సంప్రదాయాలు వదులుకోవడానికి 
ఇష్టమే పడరు . మా కొలీగ్ ఎడమ చేతికి వాచ్ వేసుకొని కూడా 
దానికి మళ్ళా మట్టి గాజులు వేసుకుంటుంది . ఎందుకు అంటే 
మా అమ్మ అరుస్తుంది వేసుకోక పోతే అంటుంది . చూస్తూ 
ఉన్నాను . పంచెలు , తల పాగాలు ,మాసిన బట్టలు 
పిల్లను ఎత్తుకున్న చేతులు ,ఒక పక్క రాడ్ ను పట్టుకొని 
నిల దోక్కుకుంటూ ,ఇంకో పక్క బిడ్డను హత్తుకుంటూ మట్టి గాజుల 
చేతులు ,వాళ్ళ కూరగాయల బుట్టలు .... ఉల్లిగడ్డ దానికి 
పచ్చటి మొక్కలు ,గంగ బైలాకు ఇక్కడే చూసాను నేను . 
ఉల్లి గడ్డలతో కూరేట్లా చేస్తారో !బహుశా సాంబారు లో 
వేస్తారేమో . వాళ్ళను అటూ ఇటూ తోస్తూ ''జరంత జరుగుండ్రి ''
చిన్నగా కసుర్లు . ఎక్కే కాళ్ళు వేగంగా ,దిగే కాళ్ళు సాలోచనగా ,
మధ్యలో అక్కడక్కడ లంబాడి వాళ్ళు ,వాళ్ళ సీతాపలం గోతాలు . 
వీళ్ళకు కూడా గాజులు వేసుకోవడం లో పెళ్లి అయిన వాళ్లకి , 
కాని వాళ్లకి ఏదో తేడా ఉంది . గుర్తు లేదు . 
మా నాన్న కొందామా ?అన్నట్లు తొంగి చూసాడు . 
వద్దు అని అడ్డంగా తల ఊపాను . ఇక్కడ ఒక్కటో ,రెండో 
లేదా అరడజన్ విడిగా అమ్మరు . బస్తా కొనాల్సిందే . పెద్ద 

రేటు కూడా ఉండదు . పదుల్లొనె . అసలు పిల్లలు అయినా సరే 
ఒక్కసారి ఐదు పండ్లు ప్లేట్ లో పెట్టుకొని తినేస్తారు . అలా తినడం 
లో భలే మజా పొందుతూ ........... మాకు ఒకటి తింటే ,
అమ్మో జలుబు చేస్తుంది అనుకుంటాము . 

పోయే కొద్దీ ఊర్లు తక్కువ ,అడివి ఎక్కువ . ఎత్తుగా పెరిగిన టేకు ,మద్ది చెట్లు ,
ఇంకేవో .... గబుక్కున ఒక దగ్గర నాలుగు చినుకులు ,చెట్లకు 
చక్కగా లాల పోసేసి ....... మళ్ళా లేత ఎండ ఆకులపై నిలబడిన 
చినుకులను ముద్దాడి ఇంద్రధనుసులు సిగ్గుతో వచ్చేస్తూ .... 
ఇద్దో ఇలాంటి వేల కిటికీ పక్క సీట్ ఇవ్వు దేవుడా ఇంకేమి వద్దు 
అనుకుంటాను . అక్కడో పేరు తెలీని పిట్ట జుయ్య్ అని ఎగిరింది . 
పిట్టలు , చెట్లు మనిషిలోని పల్లెతనం ...... బాగుంది ప్రయాణం . 
రాకుండా ఉంటె ఇదంతా మిస్ అయ్యుండే దాన్ని . ఇంకా చాలా దూరం 
ప్రయాణం ఉంది . ముందేమీ జరుగుతుందో మనిషి ఊహించగలడా !

                                                            (ఇంకా ఉంది )

Thursday, 13 November 2014

ఇదొక లెక్కా ?(1)

''అమ్మా కొత్త పోస్ట్ లు ఏమి వేయలేదా ?'' అత్తగారింట్లో 
ఉన్న బంగారు తల్లి హేమ అడిగింది . అత్తగారింట్లో పువ్వుల్లో 
ఉంచుకొని చూసుకున్నా ఆడపిల్లకు కాసింత అమ్మ పై 
గాలి మళ్ళు తూనే ఉంటుంది . తన బాధ్యతా  తాను చూసుకుంటూనే 
ఉంటుంది . ఒక రకంగా మన ఆడ పిల్లలను  ఇలా ఉండటం 
చూసి ముచ్చట పడటం ఆడ పిల్ల ఉన్న ప్రతి ఇంట్లో అనుభవమే !
ఇప్పుడేమి వ్రాయాలి ?తన చిన్నప్పటి అందెల  చప్పుళ్ళా,
పెరిగిన తరువాతి నవ్వుల ముచ్చట్లా ?ఆడ పిల్లల తల్లి తండ్రుల 
గుండెను తడితే ప్రతి కణం ఏదో ఒక ముచ్చట చెపుతుంది .... తమకు పుట్టినా
''తల్లి ''అని తమ చేత పిలిపించుకున్న కూతురు గురించి . 
చిన్నప్పుడు తనకే తెలీని(గుర్తు లేని ) ఒక సంగతి వ్రాస్తాను . తన పిల్లలకు 
చెప్పుకుంటుంది వాస్తవ ప్రపంచపు ఆనవాళ్ల పరిచయం లో ...... 


పడుకున్నానే కాని మనసులో పొంగుతున్న ఆనందం తో నిద్ర రావడం లేదు . 
పక్కకి చూసాను . ఈయన మెల్లిగా నిద్రలోకి జారుకుంటూ ఉన్నారు . 
హేమ మాధురి సాయంత్రం అన్నం తినగానే నిద్ర పోయింది . అసలు ఇక్కడ 
పొద్దే ఎక్కువ ఉండదు . ఉదయం చాలా సేపుకు గాని తెల్లవారదు . 
సంతోషం పంచుకుందాము అంటే ఈ వేళ లో ఎవరు దొరుకుతారు ?
అమ్మ ,నాన్న రేపుదయం వస్తున్నారు ఇక్కడికీ అంటే ఎలా ఉంది 
అసలు ..... గాల్లో ఈక తేలినట్లు మనసు తేలిపోతుంది . ఆనందం లో 
మునకలు వేసుకో అని నిద్ర కూడా దగ్గరకు రాకుండా చోద్యం చూస్తూ 
ఉంది . మనసు మెల్లిగా పాత జ్ఞాపకాల వైపు ఊగుతూ ఉంది . 

ఎలా వచ్చాము కొన్ని నెలలు ముందు నెల్లూరు నుండి హనుమకొండకి నా 
ఉద్యోగం కోసం , కేవలం దేవుడమ్మ జ్యోస్యం చూసి ''మీరు ఎక్కడికి 
పోయినా ధర్మం పలుకుతుంది . మీకు ఎక్కడకు పోయినా అన్నం ముద్ద 
దొరుకుతుంది ''అని చెప్పిన రెండే మాటలు భరోసాగా ఉంచుకొని ,
నేను ఈయన ఇన్ని వందల కిలో మీటర్లు అయిన వాళ్ళు అందరికి 
దూరంగా మనిషిలోని మంచితనాన్ని నమ్ముకొని వచ్చేసాము . 
వెనుక ఆస్తులు కూర్చొని తింటే కరిగిపోవా !ఇద్దరికీ ఉద్యోగాలు లేవు . 
ఎవరో ఒకరు తెడ్డు వేస్తేనే కదా నావ నడిచేది . ఆడ మగ అహాల ను 
దగ్గరకు రానియ్యని మా మధ్య ప్రేమను నమ్ముకొని ఆయనకు ఉద్యోగం 
లేక పోయినా నా ఉద్యోగం నమ్ముకొని ఇక్కడకు వచ్చేసాము . 
స్కూల్ పక్కనే నరసింహా రెడ్డి గారి ఇల్లు దొరికింది . చదువుకున్న 
వాళ్లకు ,చదువు చెప్పే వాళ్లకు ఇక్కడ ఎంత గౌరవం . వారి 
ఇంట్లోనే కాదు వారి మనసులో కూడా మాకు చోటు ఇచ్చారు . 
మా పాపను సొంత బిడ్డలా వాళ్ళు  చూసుకుంటే, వాళ్ళ ఇద్దరు పిల్లలకు 
మేము చక్కగా చదువు చెప్పేవాళ్ళం . ఒకరు ఒకటో తరగతి 
ఇంకొకరు ఎల్ . కె . జి . ఎప్పుడో కాని మా ఊరు నుండి బంధువులు 
రారు . మీరే రండి అందరిని చూడొచ్చు అంటారు . జీతం లో 
నాలుగవ వంతు తినేసే చార్జీ ల దృష్ట్యా అది నిజమే . 

ఇన్ని రోజులకు మా ఊరి నుండి అదీ అమ్మా నాన్న వస్తున్నారు . 
వాళ్లకు ఇక్కడ వన్నీ చూపించాలి . దగ్గరవి వేయిస్థంబాల గుడి ,
భద్ర కాళి గుడి ఇవి సరే .... కొంచెం దూరంగా వాళ్లకు గుర్తు 
ఉండేటట్లు ఏమి చూపించాలి . అప్పుడు గుర్తుకు వచ్చింది 
''కాళేశ్వరం ''.... వేరే కొలీగ్ చెపుతుంటే విన్నాను . 
గోదావరి ఒడ్డున యముడు స్థాపించాడు అని . అదే చూపించాలి . 
ఎందుకు పుడతాయో ఇలాంటి కోరికలు అని నేను బాధ పడే 
క్షణం వస్తుందని అప్పుడు ఊహించలేదు . ఆలోచనలలో 
రెప్ప వాలక ముందే తెల్ల వారిపోయింది . వాళ్ళు స్టేషన్ నుండి 
వచ్చేసరికి నాన్నకు ఇష్టం అయిన దోస ,వేజటబుల్ కర్రి . 
అమ్మకు కారం దోస కూడా . 

అమ్మ నాన్న రాగానే ''మాధురి ఏది ''మొదటి మాట . 
బుజ్జి పిల్ల దుప్పటి లో దూరి వెచ్చగా నిద్రపోతూ ఉంది . 
''ఓయ్ ''నాన్న మెల్లిగా పరుపు మీద కూర్చొని బుగ్గలపై 
తట్టాడు . లేస్తే కదా . 
''లెయ్యి తల్లి తాతయ్య అమ్మమ్మ వచ్చారు చూడు ''నా 
మాటల్లో ఉత్సాహం ,''లేయ్యి మాధురి ''
మా వారు వంత పాడారు . ఇన్ని సుప్రభాతాలు విన్నా లేస్తుందా 
మొద్దు మొహం . ''లెయ్య వె ''లేపి కూర్చోపెట్టేసాను ,ఎందుకు 
లేయ్యదో చూద్దాము అని . ఒక్క సారి చిన్నగా రెప్పలు తెరిచింది . 
నాన్నను చూసింది . మళ్ళా రెప్పలు వాల్చేస్తూ ......... 
''చూడవే తాతయ్య వచ్చాడు ''అమ్మ చెప్పింది ఇంకా తప్పదు 
అన్నట్లు మెల్లిగా చూసింది . గుర్తు పట్టేసింది . రెండేళ్ళ పిల్ల . 
గబ్బుక్కున నాన్న భుజం మీదకి ఉరికింది ఎత్తుకో అని . 
అమ్మ నాన్న ఇద్దరు నవ్వుతున్నారు . అసలు కంటే వడ్డీ ముద్దు ,
ఇంకా మొదటి మనవరాలు ఆయే ,బోలెడు ముద్దు . ఇంకా నిద్ర తీరక 
ముక్కు కళ్ళు నలుపుతూ ఉంది . 
''ఇటివ్వమ్మా ''అని ఎత్తుకొని ''మీరు కాసేపు రెస్త్ తీసుకోండి 
మధ్యాహ్నం భద్ర కాళి గుడికి వెళదాము ''చెప్పాను . 
మధ్యాహ్నం బోజనాలు అయినాక ఆటో లో భద్ర కాళి  గుడికి 
వెళ్ళాము . చాలా పాత గుడి . అమ్మవారి మొహం బండరాతి 
మీద చెక్కినట్లు కొంచెం భయం వేసేతట్లే ఉంది . గుడి మొత్తం 
రంగులు వేసి ఉన్నారు . స్థంబాలకి చుట్టూ ఉన్న బొమ్మలకి 
కొత్తగా జీవ కళ వచ్చినట్లు . అమ్మ ఎత్తుకొని మాధురి కి 
అన్నీ చూపిస్తూ కబుర్లు చెపుతూ ఉంది . దానికేమో అర్ధం 
అయినట్లు ఊ కొడుతూ ఉంది . క్యూ గుండా వెళుతూ ఉంటె 
ముందు అమ్మవారి వాహనం ..... ఉన్నట్లుండి  
పాప గజ గజ వణికి పోయింది . 
''ఏమైంది ''అందరం కంగారు పడిపోయాము . 
పక్కకు తిరిగేసరికి పెద్ద సింహం బొమ్మ నోరు తెరుచుకొని కోరలు చూపిస్తూ ,
నోరు ఎర్రగా వేసారు . 
భయపడి ఏడుస్తున్న పాపని తీసుకొని ఓదారుస్తూ చేరాము . 
కాసేపటికి భయం నుండి తేరుకుంది . అమ్మవారిని చూసి 
బయటకు వచ్చి పక్కన ఉన్న చిన్న కొలను దగ్గర కూర్చున్నాము . 
పాపకు భయం తీరిపోయింది కాబోలు నీళ్ళు చూస్తూ 
నవ్వుకుంటూ తాతయ్య అమ్మమ్మతో ఆడుకుంటుంది . 
''రేపు కాళేశ్వరం వెళదాము ''చెప్పాను ఈయన వంక చూస్తూ . 
ఈయన మా నాన్న వైపు చూసారు . 
''ఎంత దూరమో అమ్మ ,మళ్ళీ రాత్రికి ట్రైన్ కి వెళ్ళాలి కదా ?''అన్నారు . 
''ఏమి కాదులే నాన్న రాత్రికి వచ్చేయ్యమా !''
అది ఎంత దూరమో తెలీక పోయినా అమ్మా నాన్నలకు ఏదో ఒకటి 
చూపించాలి అనే కోరికతో అనేసాను . 
ఇంటికి వచ్చి ఉదయానికి ప్రణాలికలు వేసుకుంటూ అలిసిపోయి 
పడుకున్నాము . అసలు ఆ దారి గూర్చి తెలీని నాకు హాయిగా 
నిద్ర పట్టేసింది . 
                                                                  (ఇంకా ఉంది )
  

Friday, 10 October 2014

''వింటాను చెప్పు''

''వింటాను చెప్పు'' నా కధ ఈ నెల కినిగే ఈ పత్రికలో .
కినిగే వారికి ధన్యవాధములు
''vintaanu cheppu '' kadha link ikkada 

Saturday, 27 September 2014

ఒక నేల కన్నీరు

ఒక నేల కన్నీరు ..... పాటక చేరి లో 
''సోన కాలువల పురా గాధ '' అనే 
పుస్తకం పై అభిప్రాయం ''సారంగ ఈ మాగజైన్ ''
లో చదవండి . 

(oka nela kanneeru link ikkada )


Sunday, 21 September 2014

అక్కినేని ..... ఆత్మీయతల గని

 ''అక్కినేని వారికి కొంచెం లేట్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు '' 
మా ఎన్ . టి . ఆర్ అన్నగారికి కూడా ఎప్పుడు చెప్పలేదు . 
అదీ నిన్న చెప్పలేదు . ఈ రోజు ఎందుకు చెప్పాలి అనిపించింది అంటే 
మధ్యాహ్నం ''మనం'' మీద టి . వి లో చూసిన ప్రోగ్రాం . 
ఎంత చక్కగా వాళ్ళ నాన్నగారిని గుర్తుకు తెచ్చుకున్నారో . 
ఆయనే బ్రతికి ఉన్నట్లు ఆయన తరుపున అభిమానులకు 
ఎంత బాగా థాంక్స్ చెప్పారో . పాపం నాగార్జున కు ,సుశీలాకు 
కళ్ళు తడుస్తూనే ఉన్నాయి . ఒకరు స్క్రిప్ట్ వ్రాసి ఇస్తేనో ,
ఆక్షన్ చేపెతేనో వచ్చేవా అవి !ఒక కుటుంభ పెద్దగా అందరితో 
ఆత్మీయంగా ముడి వేసుకొని ఆయన పెంచిన బంధాలు అవి . 


ఇంకా అమెరికా లో ఉన్న ఆయన అభిమానులు  ''స్టాంప్ ''కూడా 
ఆయన ఫోటో తో విడుదల చేసారు . చనిపోయినా బ్రతికి ఉండటం 
అంటే అది . అది ఏ కొందరికో దక్కుతుంది . 
మా ఎన్ . టి.  ఆర్ కి ఉన్నారు లెక్కకి అంత మంది పిల్లలు . 
ఏ రోజైనా అందరు ఒక తాటి మీద నిలిచి స్టాంప్ వేస్తారా ?
సరే లెండి పోలికలు ఎందుకు ?పైనున్న అన్నగారు బాధ పడతారు :(

నాగార్జున అంటే మా వారికి ప్రాణం . నాగార్జున వాళ్ళ నాన్న 
గూర్చి అన్న మాటలు ఎంత బాగున్నాయో !

నాన్న అంటే ప్రేమ 
నాన్న అంటే మనసు 
నాన్న అంటే మనిషి ..... చాలు మనిషి ఎలా ఉంటె జీవితం 
పరిపూర్ణంగా ప్రశాంతంగా జీవించగలడో ఆ  రహస్యం ఇదే . 

ఇప్పుడు ఆయన గూర్చి పోస్ట్ ఏమి వేయను కాని నేను  
అప్పుడు వ్రాసిన ''మనం'' మళ్ళీ లింక్ ఇస్తాను . 
(manam post link ikkada )
నివాస్ కూడా ''ఈ సినిమా మళ్ళీ చూడాలి ''అని ఫీల్ అయ్యాడు . 
వీలు అయితే మీరు కూడా మళ్ళీ చూడండి . మీ గుండె కూడా 
అక్కినేని ని చూసి లబ్ డబ్ అని కొట్టుకుంటుందేమో . 

ఆయన ఒక పరిపూర్ణమైన జీవితాన్ని గడిపారు . ఆయన గూర్చి 
బాధ పడవలసినది ఏమి లేదు అని వాళ్ళ పిల్లలే చెపుతున్నప్పుడు 
మనం బాధపడవలసిన విషయం మాత్రం ఎక్కడ ఉంది .?
దీనికి బదులు మొన్న మెడిటేషన్ క్లాస్ లో విన్న నాలుగు మంచి మాటలు 
చెపుతాను . ఈయన ఇంట్లో పని వదిలిపెట్టి పోతావా అని అంటే ...... 
ఊహూ పిల్లలకు పెళ్లి అయినాకా కూడా ఇంట్లో పనులే ముఖ్యం 
అనుకుంటే నేను జ్ఞానం ఎప్పుడు తెలుసుకోవాలి అనుకోని మరీ 
వెళ్లాను . 

క్లాస్ శ్రీనివాస్ గాంధి గారు చెప్పారు . 
హై స్కూల్ పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు అక్కడికి 
వచ్చారు . ఏదో లాభం వస్తుందనో ఎవరో ఆశ పెడితేనో వారు 
అక్కడకు వచ్చారా ?లేదే . ఏ శక్తి ఇంత మందిని ఇక్కడకు 
లాక్కొని వస్తుంది . అందరు కలిసి సామూహిక ధ్యానం అంటే 
శ్వాస మీద ధ్యాస చేస్తూ ఉంటారు . చిన్న పిల్లల అనుభవాలు 
వింటూ ఉంటె ,ఇతరుల మనసు లోని ఆలోచనలు కూడా 
వాళ్ళు చెపుతూ ఉంటె మనం ఆశ్చర్య పోతాము . 

చిత్రంగా ఆ రోజు జన్మల గురించి ఇంకా ధ్యాన పరిచయం 
గురించి చెప్పారు . కొంత వరకు ఆధ్యాత్మిక వాతావరణం లో 
పుట్టిన వారికి పునర్జన్మ ల మీద నమ్మకం తప్పక ఉంటుంది . 
ఒక్కో ఆత్మ ఎన్ని జన్మలు ఎత్తుతుందో తెలుసా ?
కీటకాలు కావొచ్చు , చెట్లు కావొచ్చు ,జంతువులు కావొచ్చు , 
మనుషులు కావొచ్చు అందులో ఆడ ,మగ ఎవరైనా  కావొచ్చు ,
కొన్ని వందల జన్మలు ఎత్తి ఉండవచ్చు . నిజమా అంటే .... 
పాలల్లో వెన్న ఉన్నంత  నిజం . కాకుంటే నీలోకి నువ్వే ప్రయాణం 
చేసుకొని చూసుకోవాలి . ఎందుకు ఇన్ని ఎత్తడం అంటే 
ఆ జన్మ యొక్క పరిపూర్ణమైన అనుభవాలను పొందడానికి . 
అసలు పాతవి చూసే కొద్ది .... ఎన్నో సార్లు ఆడవాళ్ళుగా , 
ఎన్నో సార్లు మగవాళ్ళుగా మనమే ఉండటం చూసి ఎలా 
పుడితే ఏముంది ,అందరం అక్కడి వాళ్ళమే ,ఆత్మలమే 
అని అవగతం అయ్యి ఈ తేడాలు పెద్దగా పట్టించుకోము . 
లడ్డూల రుచి నాలుక పూర్తిగా గ్రహించినపుడు అవంటే 
మనకు వెగటు వేసినట్లు ఈ జన్మలు అంతే . ....... 
దీనిలో ఏమి లేదు అని మనకు వెగటు పుట్టే దాకా 
పుడుతూనే ఉంటాము . 

మన శరీరం వేరు ,మనం వేరు అనే కాన్సెప్ట్ నమ్మడానికి 
మనకు చాలా కష్టం . కాని ధ్యానం చేసి చూసినపుడు 
ఆ అనుభవాన్ని చూడటానికి మనకు సరిపోయే ఎనెర్జీ 
వచ్చినపుడు అది మనం ఫీల్ అవ్వగలం . 

నేను మాత్రం చదువుకున్న దాన్ని ఇవన్నీ నమ్ముతానా !
కాని భారత దేశపు ఆధ్యాత్మికత నన్ను దానిలోకి లాక్కెళ్ళి 
మరీ చూపిస్తూ ఉంటుంది . మన సుకర్మ లు పాప కర్మ లు 
బాలెన్స్ అయి మనం సత్వ దశలో ఉన్నప్పుడు మనకు 
ఎక్కడో ఒక దగ్గర లేదా ఎవరో ఒకరి ద్వారా ధ్యాన పరిచయం 
కలుగుతుంది . దాని సాధన చేస్తామా లేదా అనేది మన ఇష్టం . 
కాని దాని పరిచయం జరిగింది అంటే దానిలో మనం ముందుకు 
సాగవలసిన సమయం వచ్చింది అనేది స్పష్టం . 


ఒక రోజు తెల్లవారు జామున ధ్యానం చేసినపుడు నాకు 
ఈ ఆత్మ వేరు అనే  అనుభవం కలిగింది . ఉన్నట్లుండి  
నేను ఒక గుహలో ఉన్నట్లు ఆ గుహ నా శరీరం అయినట్లు , 
నేను వేరుగా, శరీరం వేరుగా అనిపించింది . నేను ఎందుకు 
ఇక్కడ ఇరుక్కొని ఉన్నాను అనిపించింది . ఇక ఇప్పుడు 
నేను ఆత్మ వేరే, శరీరం వేరే అంట .... అది పలానా 
వాళ్ళు చెప్పారు అనాల్సిన పని లేదు . ఎందుకంటె 
అది నేను చూసాను కదా . కాకుంటే మళ్ళా మన 
మామూలు జీవితం లోకి వచ్చేస్తాము ,అంతా మామూలుగా 
నడిచిపోతుంది అంతే . 

అక్కినేని గారు మనం డైరక్టర్ విక్రం గారిని అడిగారంట ..... 
''నాగార్జున కి ,చైతన్య కి హీరోయిన్స్ ని పెట్టావు ,నాకు 
పెట్టలేదే అని '' చనిపోయే ముందు కూడా ఎంత హుషారు . 
అందరికీ పంచి పెట్టగలిగినంత  ఆనందం . మనలో ఏది ఉంటె 
అదే అందరికీ పంచుతాము . కావాల్సింది అక్కినేని 
గారి లాంటి నిష్కల్మషమైన పసిబిడ్డ లాంటి  మనసు. 
దేవుని రాజ్యం పిల్లలదే అంటే అర్ధం ఇదే . దేవుని రాజ్యం 
అంటే సంతోషం తో నిండినది .... దానిలోకి బోలెడు కల్మషాలు 
అహాలు గల పెద్దలు ఎప్పటికీ ప్రవేశించలేరు . 
మిగిలిన జీవితాలలోకి తొంగి చూసే పని ఆపేసి మీ 
జీవితాన్ని మీరు పసి పిల్లలుగా పరిపూర్ణంగా అనుభవించండి . 
మీలో ఉన్న ఆనందాన్ని మీ చుట్టూ ఉన్నవారికి పంచండి . 
అప్పుడు మీరు కూడా చనిపోయినా అందరి హృదయాలలో 
బ్రతికే ఉంటారు . 
                      @@@@@@@@@@@  

Thursday, 18 September 2014

పుట్టిన రోజు ముచ్చట (4)

పుట్టిన రోజు ముచ్చట (4)

(puttina roju muchchata 3 parts link ikkada )


''అమ్మా ఇవేంటి ''మూడేళ్ళ మాధురి వీపు మీదెక్కి ఊగుతూ 
నా వళ్ళో ఉన్న రంగుల పేపర్స్ చూపించి అడిగింది . 
పక్కన ఉన్న రెండు నెలల బాబు నివాస్ ని పాప కాలు 
తగలకుండా చిన్నగా జరిపాను . నిద్ర లో విసిగించాను కాబోలు 
''ఊ '' అని చిన్నగా మూలిగాడు . చిన్నగా కాళ్ళు విదిలించాడు . 
మధురి గబుక్కున చిచ్చు గొట్టి ''అమ్మ లేరా ''అని నచ్చచెప్పింది . 
వేలెడంత లేదు పిల్లలు అంటే ఎంత ఇష్టమో . వీడికి ఇది కూడా 
అమ్మే . 

''చెప్పమ్మా '' మళ్ళీ అడిగింది . చిన్నప్పటి నుండి కూడా మరీ 
మొండికేసి విసిగించదు . మెల్లిగా అడిగి తీసుకుంటుంది . మనం 
ఏమైనా చెపితే శ్రద్ధగా వింటుంది . 
''మరి నీ పుట్టిన రోజు వస్తుంది కదా . నువ్వు కేక్ కట్ చేసేటపుడు 
ఇవన్ని ఇంట్లో చుట్టూ తగిలిస్తాము '' చెప్పాను . 
''పుట్టిన రోజు అంటే ''.... బాబోయ్ మాటలు ముద్దుగా ఉంటాయి ,
కాని ఈ పిల్లల ప్రశ్న లకు సమాధానం చెప్పటం మొదలు పెడితే 
ఇక అంతం ఉండదు . 
''అంటే ఇప్పుడు ఇక్కడ తమ్ముడ్ ఉన్నాడు కదా !
అంతకు ముందు ఎక్కడ ఉన్నాడు ?''
''నీ పొట్టలో ''చెప్పింది . కళ్ళలో కరక్ట్ చెప్పాను అనే వెలుగు . 
చిన్నగా బుగ్గ మీద ముద్దు పెట్టుకొని ..... 
''అలాగే నువ్వు నా పొట్టలో ఉన్నావు . నీ పుట్టిన రోజు అప్పుడు 
ఇదిగో తమ్ముడి లాగా పుట్టావు ''చెప్పాను . 
''నా పుట్టిన రోజు నాకెలా తెలిసింది ?''అయిపోయాను . ముందు 

విషయం డైవర్ట్ చేయాలి . 

''నువ్వు ఎప్పుడు పుడితే అప్పుడే బంగారు అది . 
చూడు నీకోసం చిన్న టోపీ చేసాను . అది పెట్టుకొని కేక్ 
కట్ చేస్తువు సరేనా ?''
''మరి ఇన్ని టోపీ లు ఎందుకు ?''
''ఇంకా పిల్లలు అందరు వస్తారు కదా వాళ్లకి . ఇంకా వాళ్లకి 
నువ్వు చాక్లెట్స్ , కేక్ ఇవ్వాలి . ఇస్తావా ?''
''ఇంకా నానమ్మకి ,జేజినాయనకి ,బాబాయిలకి ,అత్తమ్మకి 
కోట తాతయ్యకి ,అమ్మమ్మకి , రాణి పెదమ్మకి ,హర్షా కి 
అందరికీ పెడతావా ?''
''ఊ పెడతాను . తమ్ముడికి కూడా ''గుర్తు చేసింది . 

దీని మొహం . దీనికే ఉన్నాడు తమ్ముడు . ప్రతి విషయానికి 
ముందో వెనకో తమ్ముడు అని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ,
రైల్ ఇంజెన్ బోగీలను లాక్కోచ్చినట్లు . 
''తమ్ముడు తినడమ్మా ,పాలు ఒక్కటే తాగుతాడు . చిన్నవాడు కదా ''

ఇదేమిటి ఇదేమిటి అని అడుగుతూ ఉంది . 
కలర్ పేపర్స్ తో కట్ చేసిన పాప పేరు , టోపీలు ,పేపర్స్ తో 
తోరణాలు నేను హనుమకొండ లో షాప్స్ లో చూసినవన్నీ 
పుట్టిన రోజు వరకు చేస్తూనే ఉన్నాను . పాపకు ఏది కొరత 
ఉండకూడదు అని తపన .  అసలు దీనికి పుట్టిన రోజు చేయాలి 
అని ఎప్పటి కోరిక . ఏదో ఈ నివాస్ పుట్టాడు కాబట్టి ఇప్పటికి 
మెటర్నిటీ లీవ్ లో ఉండి చేయగలుగుతున్నాను . 

పుట్టిన రోజు ఉదయం నుండే సందడి . వాళ్ళ అత్తతో వెళ్లి అందరికి 
చాక్లెట్స్ ఇచ్చి కేక్ కటింగ్ కి రమ్మని అందరిని పిలిచి వచ్చింది . 
మధ్యాహ్నానికి మా అమ్మ నాన్న ,రాణి అక్క వాళ్ళ బాబు 
హర్షా అందరు వచ్చారు . సాయంత్రం అయ్యేసరికి ఇల్లంతా 
బంధువులు ,చుట్టూ పక్కల వాళ్ళు ఇల్లంతా సందడి . 
వచ్చే వాళ్ళను పలకరిస్తూ బాబాయిలు ,జేజి నాయన 
అంతా సందడి . డెకరేషన్ చూసి అందరు మెచ్చుకున్నారు . 
కేక్ తీసుకొచ్చి లోపల పెట్టారు . 

వచ్చిన వాళ్ళను పలుకరిస్తూ మర్యాదలు చేస్తూ బాబును 
చోసుకుంటూ ఉన్నాను . ఇంతలో ఎందుకో హేమా ఏది 
అనుకున్నాను . హాల్ లో కనపడలేదు . ముందు షాప్ వెనుక 
ఇల్లు కాబట్టి షాప్ లోకి వెళ్లాను . ఏమైనా వీధిలోకి వెళ్ళిందా ?
ఎందుకో భయం వేసి బయటకు వెళ్లి చూసాను . బంగారు నగలు 
కూడా ఉన్నాయి వంటి మీద పాపకి ఏమై  ఉంటుంది?
పాప ఇక్కడకు వచ్చిందా ?మామగారిని అడిగాను . 
''రాలేదే లోపలే ఉందేమో ''అన్నారు . 

లోపల ఉందా ,లేకుంటే...... గబా గబా పరిగెత్తి వంటింటి వైపుకు వెళ్లాను . 
టేబుల్ వెనుక చిన్నగా అలికిడి . చూడగానే ఒకటే నవ్వు నాకు . 
టేబుల్ అందక కాళ్ళు పైకెత్తి ఒక వేలు కేక్ మీద ముంచి క్రీమ్ 
ను తింటూ ఉంది . ''ఓయ్ ''అరిచేసరికి ఉలిక్కి పడింది . 
''తినకూడదమ్మ ఎంగిలి ''చెప్పి చేయి కడిగేసి తీసుకొచ్చాను . 
''ఇంకొంచెం ''అడిగింది . 
''అలాగేలే కేక్ కట్ చేసినాక తిందువు ''నవ్వుతూ చెప్పాను . 
ప్రతి ఒక్కటి అదలా ఎంజాయ్ చేస్తూ ఉండటం నాకు భలే సంతోషాన్ని ఇస్తూ ఉంది . 

కేక్ కట్ చేయగానే అందరు చప్పట్లు కొట్టి 
''హాపీ బర్త్ డే మాధురి '' అంటూ ఉంటె దానికి సంబరం 
చప్పట్లు కొడుతూ ఉంది . 
ఒక్కొక్కరికీ కేక్ పెట్టింది . అందరు అక్షింతలు వేసి డబ్బులు , 
బహుమతులు ఇస్తూ ఉంటె నాకు ఇస్తూ ఉంది . 
అమ్మమ్మ వచ్చి ముద్దు పెట్టుకొని చిన్న ప్లాస్టిక్ కుర్చీ 
గులాబి రంగుది ఇచ్చింది . వెంటనే ఎక్కి కూర్చుంది . 
దాని సంతోషం చూసి నాకు భలే సంతోషంగా ఉంది . 
ఇందుకు కదా నేను పుట్టిన రోజు చేయాలి అనుకున్నది . 

కాని ఏ వయసులో ముచ్చట ఆ వయసులో చేసినపుడు 
దానికి అందం ఇంకా పెరుగుతుంది . ఇప్పుడు చేయబట్టి 
ఎంత ఆనందంగా ఉంది పాప . హమ్మయ్య ఇప్పటికి 
దాని పుట్టిన రోజు ముచ్చట నాకు తీరింది . 

                                  @@@@@@@@@@@   
(అయిపొయింది ) 

Thursday, 11 September 2014

''దేహళి ''... ప్రతి కూతురు కూడా

''కాపురానికి వెళ్ళిందా అమ్మ పాప ''
''అవునక్కా '' ఇప్పుడే అమ్మాయి అల్లుడు
వెళ్ళిపోయి ఇంట్లో మనసులో ఏదో వెలితి .
అర్ధం చేసుకుంది ఎదురింటామె .
''ఇంక అంతే లేమ్మా . దగ్గరే కదా వస్తూ పోతుంటారు లే ''
ఓదార్పుగా అంది . నిజమే ఇద్దరు కూతుర్లను కన్నది .
ఈ బాధను వాళ్ళు కూడా దాటే ఉంటారు . కొంత ముందు
వెనుకగా అందరు దాటుతారు .

ఇంట్లోకి వచ్చేసరికి నివాస్ బెడ్ రూమ్ వైపు చూపిస్తూ
సైగ చేస్తున్నాడు . ఎవురున్నారు ?ఇంట్లో ఈయన
ఒక్కరే  ఉన్నారు .
''వెళ్లి చూడు . నాన్న ఏడుస్తున్నాడు ''వాడికి కొత్తగా
ఉంది . వాడు విజయవాడ కు వెళ్ళినపుడు కూడా
ఎవరం ఏడవలేదు . దగ్గరగా ఉన్న నెల్లూరు కు
అక్కను పంపిస్తే ఎందుకు ఏడవటం పాపం వాడికి
అర్ధం కాలేదు . నాకు కూడా అర్ధం కాలేదు .
ఎంతో పెద్ద సమస్యలు వచ్చినా నేను ఏడుస్తాను కాని
ఆయన ధైర్యం చెపుతూ ముందుకు తీసుకెళుతారు .

వెళ్లి చూసేసరికి దిగులుగా మొహం మీద మోచేయి ఉంచి
పడుకొని ఉన్నాడు ,చేయి పక్కన చిన్నగా జారుతున్న
తడి ......
''ఏమిటి ఏమైంది ?''ఓదారుస్తున్నాను కాని నాకే తెలీకుండా
నా కళ్ళలో కూడా ఊరుతున్న తడి .
ఏమిటో ఎవరు ఎవరికీ ఏమి కారు ,ఇదంతా ఒక నాటకం .
ఊహు ఎంత సముదాయిస్తున్నా పైకి వస్తున్న దుఃఖం .
''ఎందుకొచ్చిన వేదాంతాలు ,సిద్దాంతాలు రాద్దంతాలు ,
కాసింత కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటించలేనపుడు ''
విసుగు అనిపించింది . 

''ఛీ ఆడపిల్లను కనకూడదు ''అంటున్నారు .
''అబ్బో అప్పుడు ప్రపంచం ఏమి అయిపోవాలి ''మొండిగా అన్నాను .
అన్నీ తెలిసి  కూడా ఇలా బాధ పడటం నా మీద నాకే కోపంగా ఉంది .

''ఇరవై మూడేళ్ళు సాకి విద్యా బుద్ధులు చెప్పి ఎవరికో ఇచ్చెయ్యాలి ''
''ఆహా ఇయ్యాక పోతే ఏమి చేసుకుంటావు ?మా నాన్న మాత్రం
ఇస్తేనే కదా ఈ రోజు మీ దగ్గర ఉన్నాను ''అనునయంగా
చెప్పాను .

''రోజు ఇంటికి రాగానే పాపా పాప అని పిలిచే అలవాటు .
ఇప్పుడు ఇంకెవరున్నారు ?''

''మరీ చిత్రం గంట దూరం . చూడాలంటే ఎంతలోకి వెళ్ళొచ్చు .
కాదంటే వాళ్ళు అయినా తెచ్చి చూపిస్తారు . కావాలంటే
రోజు ఫోన్ లో మాట్లాడుకో '' ఏమి చెప్పకుండా మౌనంగా
లేచి ఆయన పనిలో మునిగిపోయారు .
రెండు రోజులకు ఇంట్లో వెలితి అలవాటు అయింది .
ఇక మేము  ఇద్దరమే ఉండాలి అనే సత్యం బోధపడింది .

ఇదిగో ఇదంతా ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసి మళ్ళా గుర్తుకు
వచ్చింది ,నీళ్ళలో రాయి వేస్తే ఒక్క సారి నీళ్ళు కలతబడినట్లు ,
కాసింత ప్రశాంతం కావాలంటే మళ్లి ఎన్ని రోజులు పడుతుందో ,
ఆడపిల్ల తల్లి తండ్రులకు :(

ఆడపిల్ల గడప మీద పెట్టిన దీపం అంట . ''దేహళి ''
రెండు లోగిళ్ళకు వెలుగు ఇస్తుంది నిజమే .
అప్పగింతల పాట మా అమ్మ నేర్పించింది .
''అత్తవారింటికి అంపే దెలాగమ్మా
అల్లారు ముద్దుల అపరంజి బొమ్మ
పోయి రావే పడతి అత్తవారింటికి
వెంకన్న మంగమ్మ అండ నీకుండా .....

పుట్టినింటికి కీర్తి
మెట్టినింటిలో శాంతి
నిలిపి వెయ్యేళ్ళు వర్ధిల్లవమ్మా !

అత్తవారింటికి అంపే దెలాగమ్మా
అల్లారు ముద్దుల అపరంజి బొమ్మ ''

మా మాధురి కూడా మాకు మంచి పేరు తెస్తుంది .
మా పాపే కాదు ప్రతి కూతురు కూడా ప్రపంచాన్ని
వెలుగుతో నింపుతున్న దీపాలే . కాదని హృదయం
ఉన్న ఎవరైనా అనగలరా ?

link ikkada
ప్రతి తండ్రికి కూతురి మీదేనా ప్రేమ ,కూతురికి తండ్రి మీద ఉండదా ?
ఏది గొప్ప అంటే లాజికల్ స్టెప్స్ తో తేల్చగల బంధాలా ఇవి !
నా కధ ''వర్షం లో గొడుగు '' ''మాలిక ఈ పత్రిక '' లో వచ్చినది . 
దాని మీద వ్రాసిన చక్కని విశ్లేషణ చూసి ఎప్పటి నుండో పోస్ట్ 
వేయాలి అనుకుంటుంటే ఇప్పటికి వీలు అయింది . 
వలబోజు జ్యోతి అక్కకు ధన్యవాదాలు . విశ్లేషణ వ్రాసిన 
మంధా భానుమతి గారికి ధన్యవాదములు . 


Monday, 1 September 2014

బాపు గారు మిమ్మల్ని మర్చిపోలేను

బాపు గారు మిమ్మల్ని మర్చిపోలేను .... 
ఇలా అంటే రమణ గారిని మర్చిపోయినట్లా ?
ఊహూ కాదు కాదు ఈయన గూర్చి అన్నవన్నీ ఆయన 
గూర్చి కూడా అనుకోండి . 31/8/2014 తేది మంచిదే కాదబ్బ . 
తలుచుకుంటే ఇంకా దిగులుగా ఉంది . పెద్ద ఈ ''బాపు ''గారు 
అదే లెండి సత్తి రాజు లక్ష్మి నారాయణ నాకేమి చిన్నాయనా ?
పెదనాయనా ?లేక అక్షరాలు దిద్దించిన అయ్యోరా ?నేను మనసులో 
పెద్ద బండరాయి పడినంత బాధ పడటానికి .... ఏమి నేర్పించాడు . 
కాదు కాదు నేర్పించాడు ,జీవితపు రసం ఎంత మధురంగా ఉంటుందో ,
కాపురాన్ని ఎంత అందంగా దిద్దుకోవోచ్చో ,రోటి పచ్చడి 
కమ్మదనము , అలకలోని అందము ..... ఒకటేమిటి మా 
పెద్దోళ్ళు మాకు చెప్పని కాపురం విషయాలు అన్నీ తెలుసుకున్నాము . 
మా కాపురాలు కాసింత నవ్వు కళ తో కళ కళ లాడుతున్నాయంటే 
ఆ జంట చూపించిన కళ తోనే అని చెపుతాను . 

అదేమిటి ఆయన బొమ్మలు వేసాడు . కార్టూన్లు వేసాడు . 

సినిమాలు తీసాడు,బుడుగు సీగాన పసూనంబ ,
సీతా కల్యాణం ,సాక్షి ..... 
 ఇవి కదా చెప్పాలి అంటే ..... 
ఏమో నాకు తెలీదు . 
ఇది నా ప్రపంచం నాకు తెలిసినవే చెపుతాను . 
 ఆయన అయ్యన్నీ చేసుండొచ్చు . 
ఇప్పుడు మీరు ఆ సినిమా ఎప్పుడు తీసారు ?
పద్మశ్రీ ఎప్పుడొచ్చింది ?
ఇయ్యన్నీ అడిగితే నాకు తెలీదు . 
అయినా ఆయనంటే ఇష్టం . 
ఎంత ఇష్టం అంటే నిన్న మా పాప హేమ మాధురి పెళ్లి శుభలేఖ లో 
సప్త పది గురించి ఆయన ఫాంట్స్ లోనే వ్రాయించాను . 
చాలా మంది ఆ ఫాంట్స్  అర్ధం కాలేదు అన్నా నా మటుకు నాకు 
తృప్తి గా అనిపించింది . 

పెళ్లి కాక ముందు పిన్నమ్మలకు చపాతీ లు చేసి 
ఇచ్చినపుడో ,వాళ్ళ పిల్లలను ఎత్తుకొని తిప్పినపుడో 
వాళ్ళ ఇచ్చే ఆంధ్ర భూమి ,ఆంద్ర జ్యోతి ,విపుల , చతుర 
వనితా జ్యోతి కొంచెం పెళ్లి అయ్యే ముందు వచ్చిన స్వాతి 
ఇదిగో ఇదే మాకు అందే విశాల ప్రపంచం . అందులో బాపు రమణ 
అనే పేర్లు వస్తే ఆగిపోయేవాళ్ళం . జోక్స్ చదివి మురిసిపోయేవాళ్ళం . 
ఇక ఆయన సినిమాల్లో చూపించేవి .... ఎన్ని చెపుతారో . 

''ఆరు నైదవతనములు ఏ చేతనుండు ,అరుగులలికే వారి అరచేతనుండు ''... 
అని ఇల్లు దిద్దుకుంటేనే కళ అని చెపుతూ ఈ కాలం లో కూడా 
రావణాసురులు ఉన్నారు పరాకుగా ఉండండి అని చెప్పకనే చెపితిరి . 
మగవాళ్ళు  కాసింత ఆశలు పెట్టి పొగిడితే పొంగిపోయే ఆడవాళ్ళకు 
''రాదే చెలి నమ్మరాదే చెలి మగ వారినెపుడూ నమ్మరాదే చెలి ''
మగవాళ్ళు కాసింత ఎక్కువ  సమానం ,
అదే లోకం తీరు సర్దుకుని పోమ్మా ,అని చూపిస్తిరి . 
మళ్ళా వ్యక్తిత్వం తో ఉంటూనే కాపురం లో తెగే దాకా జగడాలు 
ఉండకూడదు అని ''ఆగడాలు పగడాలు ఆలు మగల జగడాలు ''
అని మురిపిస్తిరి . ఒక్కో సినిమా ఆడవాళ్ళ వ్యక్తిత్వాన్ని పెంచే 
ఒక్కో ఆణిముత్యం . 
రాధా గోపాళం  లో రాధ ను కేస్ వదిలేయమని భర్త గోపాలం 
ఆర్డర్ వేస్తూ ''నేను భర్త ని '' అని గర్వంగా అంటాడు . 

అప్పుడు రాధ అనే మాటలు నాకు ఎంతలా  గుర్తుంటాయో.... 
''నేను రాధ ని , నేను మనిషిని , నేను లాయర్ ని ''

మనసు పెట్టి వినగలిగిన మగవాళ్ళకు దానిలో ఎంత అర్ధం 
కనిపిస్తుంది . కావాల్సిందల్లా మగవాళ్ళం అనే దురహంకారాన్ని 
వదిలేసి విషయాన్ని మానవత్వం తో, తన భార్య కూడా మనిషి 
అనే జ్ఞానంతో చూడటమే . బాపు రమణ లు పై అందాలనే ఎప్పుడూ 
చూపించలేదు .... వాళ్ళ పాత్రలన్నీ మానవత్వం వెలిగిపోయే సగటు 
పాత్రలే .  
నిజంగా ఆడది మెచ్చినది అందం అంటారు . నిజంగా ఆడవాళ్ళలో 
ఇంత అందం ఉందా అని నేను అబ్బురంగా చూస్తుంటాను . 
అతిశయోక్తి లాగున్నా వాళ్ళు చూపించిన కోణాలన్నీ నిజమే . 
బాపు గారి బొమ్మలు నేను దగ్గర నుండి ఎప్పుడూ చూడలేదు . 
కనీసం ఇప్పటికీ నా దగ్గర కాలెండర్ లు కూడా లేవు . 
కాని మా పెద్దక్క అత్తగారింట్లో మా పెద్దక్క బావగారు వేసిన 
బాపు బొమ్మల నకళ్ళు చూసినపుడు నేను నిజంగా ఎంత 
ఆనందపడ్డానో .... ఆ బొమ్మల అందం నాకు అప్పుడే తెలిసింది . 
ఒక ఆశ్చర్యం ,ఒక అలక ,ఒక విరహం ,ఒక సరసం , ఒక ఆరాధన ,
ఒక విరుపు ,ఒక కంటి ఎరుపు ,మురళీ గానం లో పడి  మైమరుపు .... 
ఏమిటివి ఇన్ని భావాలు రంగులను పులుముకొని నా చుట్టూ .... 
నకళ్ళే ఇంత బాగుంటే నిజమైన చిత్రాలు ఇంకెలా ఉంటాయో !
ఇంత వరకు చూసిందే లేదు దగ్గర నుండి . 

చెప్పకూడదు కాని రమణ గారు చనిపోయినపుడు బాపు గారు 
కూడా ఇంకా ఎంతో కాలం బ్రతుకరు అనుకున్నాను . 
ఎందుకంటె మాకు మెడిటేషన్ క్లాస్ లో చెపుతారు 
ఒకటిగా పుట్టిన జంట ఆత్మలు  , లేదా ఆత్మీయంగా 
ఉండే భార్యా భర్తలు ,అన్నా చెల్లెళ్ళు ఎవరైనా కానీండి ,
వాళ్ళ హృదయాల మధ్య ఒక శక్తి ప్రసారం ఎల్లప్పుడూ జరుగుతూ 
ఉంటుంది . అందుకే ఒకళ్ళ దగ్గరుంటే మరొకరికి బలం 
వచ్చినట్లు ఉంటుంది . వాళ్ళలో ఒకరు చనిపోయినపుడు 
ఈ ప్రసారపు తీగ తెగిపోతుంది . ఆ దిగులు లోపలి పాకి 
వాళ్ళు కూడా చనిపోతారు .... ఒక వేళ  వాళ్ళు కూడా 
ధ్యానులై ఈ విషయపు ఎరుకతో ఉంటె తప్ప ..... 
పోయిన వాళ్ళతో త్వరగానే వెళ్ళిపోతారు . 

ఒక కంటితో అయినా మనం చూడగలం . 
కాని పరిపూర్ణత్వం కోసం దేవుడు రెండు కళ్ళు
సృష్టించాడు . 
అదే దేవుడు కళ కు పరిపూర్ణత్వం కోసం వాళ్ళను 
ఇద్దరుగా సృష్టించాడు . కళ్ళు వేరైనా వారి 
చూపు ఒక్కటే . రూపాలు వేరైనా వారి ఆత్మ ఒక్కటే . 
వారి కళా రూపాలు కలకాలం చూసి మనం ఆనందించడమే 
మనం వారికి ఇవ్వగల నివాళి . 
                                ****************** 

Wednesday, 6 August 2014

సత్య భామే ..... అన్నపూర్ణ కూడా

 బెల్ కొట్టి కొట్టి అలిసిపోయిన తరువాత తీరికగా తలుపు 
తీయడమే కాకుండా దడా మని తలుపు వేసిన శబ్దం .... 
గుండెల్లో లబ్ డబ్ పెంచేసింది సారధికి . ఊహించిందే అయినా 
సిచ్యువేషన్ ఎదురుకునేటపుడు  ఎంతటి వాళ్ళకైనా కాసింత 
దడ గానే ఉంటుంది . ధైర్యం తెచ్చుకునేందుకు చిన్నగా దగ్గి 
''సరోజా అదీ '' గొంతు పీలగా అయిపోయి తనకే వినపడనంత గా 
ఉంది . 
ఊహూ .... తనేమి పెద్ద తప్పు చేసాడు అని భయపడాలి . 
ఏదో ఆఫీస్ నుండి తొందరగా రమ్మంటే ఫ్రెండ్ కి వర్క్ లో 
హెల్ప్ చేస్తూ లేట్ అయిపోయింది . 
మళ్ళా ''సరోజా అదీ '' ఇంకొంచెం పెద్దగా వివరణ ఇవ్వపోయాడు . 
కనీసం చెవిలో కూడా వేసుకోకుండా బెడ్ రూమ్ లోకి వెళ్లి 
పడుకుంది . 

''వెదవ వెదవ అని ..... భార్య కంటే ఎక్కడో ఉండే ఫ్రెండ్ ముఖ్యమా ?
ఇప్పుడు ఈ సన్నివేశం  వాడు ఎదురుకుంటాడా  ?అలక తీరుస్తాడా ?
తనకెందుకు ఇంకోకరి విషయాలు ?పాపం సరోజే ఎందుకు రమ్మంది . 
రైల్వే స్టేషన్ కి వెళ్లి వాళ్ళ పెదమ్మ కొడుకుకు సెండాఫ్ ఇవ్వాలి 
అని కదా !తన లాగే వాళ్లకి ప్రేమలు ఉంటాయి కదా ''మనసులో 
తనను తానె తిట్టుకుంటూ .... మళ్ళీ బెడ్ రూం లోకి తొంగి చూసాడు . 
కళ్లపై మోచేయి అడ్డం పెట్టుకొని నిద్రపోతుంది . 

భార్యకి ఆ మాత్రం అలక అప్పుడప్పుడు ఉండాలి కాదని ఎవరన్నారు .... 
కాకుంటే ఈ రోజు కాకుండా ఉంటె బాగుండును . 
లోపలికి భర్త వచ్చిన శబ్దానికి కూడా కళ్ళు తెరవలేదు . 
''అది కాదు సరోజ .... మురళి కి అర్జెంట్ వర్క్ వచ్చింది . 
చేయకుంటే మెమో ఇస్తారు . వాడు ఎన్ని సార్లు నాకు హెల్ప్ 
చేసాడు . వాడికి అవసరం అయినపుడు మనం సహాయం చేయాలి 
కదా '' మెల్లిగా చేయి తన పై వేసి చెపుతూ ఉన్నాడు . విసురుగా 
తోసేసి పక్కకు తిరిగి పడుకుంది . 
ఛా ఎంత భార్య అయినా మాత్రం ఇంత విసుగు పడకుండా  ఏదైనా 
గవర్నమెంట్ ఆర్డర్ వస్తే బాగుండును . ఏందో నా పిచ్చి కాని 
ఆ ఆర్డర్ చేసే వాళ్ళకు మాత్రం భార్యలు ఉండరా ?ఇవన్నీ చూసి 
ఉండరా ? చేసే వాళ్ళు అయితే ఇప్పటికె చేసి ఉండరా ... 
విసుగు వచ్చేస్తుంది సారధికి . ఏమైనా చేసి కోపం చల్లార్చాలి 
అనుకున్నా .... దగ్గరికి రానిస్తే కదా . 

కోపంగా తలుపును తన్ని ''ఊరికే అలగడం వలన 
నీదే రైట్ కాదు . అవతలి వారిని అర్ధం చేసుకోక పోతే 
కాపురానికే అర్ధం లేదు . నీతో మాట్లాడితే అప్పుడు చూడు ''
వెళ్ళిపోయాడు స్నానం చేయడానికి . 
మెల్లిగా మోచేయి వంపులోనుండి తొంగి చూసింది . 
వెళ్ళిపోతున్న భర్త కనిపించాడు . తప్పు చేసి ఒప్పుకోకుండా 
మళ్ళా బెదిరిస్తున్నాడు చూడు .... తిట్టుకుంది . 
మళ్ళా మనసు కొంత బాధగా మూలిగింది సరోజకి ... 
నిజంగానే మాట్లాడడా ?అయినా తగ్గాలి అనిపించక అలాగే 
పడుకుండి పోయింది , ఆకలిగా ఉన్నా కూడా . 

                       **************
స్నానం చేసి వచ్చేసరికి భలే ఆకలి అనిపించింది సారధికి . 
అసలు వండిందో లేదో .... నిజంగానే చాలా ఆకలిగా ఉంది . 
సాయంత్రం నుండి టీ కూడా తాగలేదు . సరోజ ఎదురుచూస్తూ 
ఉంటుంది అని తొందరగా వచ్చాడు . వంటిట్లో సందడి 
లేదు . ఎందుకో అమ్మ గుర్తుకు వచ్చింది . సగం రాత్రి 
ఆకలి అంటే కూడా వెంటనే ''అయ్యో నాన్న.....  లే తిందువు ,
ఆకలితో పడుకోకూడదు ''అని వెంటనే ఏదో ఒకటి పెట్టేది . 
నిద్ర మత్తులో తినలేనని  నోట్లో ముద్దలు చేసి పెట్టేది . 

''ఆడవాళ్ళకి నాన్న ,మగవాళ్ళకి అమ్మ గుర్తుకు వచ్చే 
సందర్భం పెళ్లి అయిన తరువాత తప్పకుండా ఏదో 
ఒకటి ఉంటుంది ''ఆ పోస్ట్ లు మన జీవితం పూర్తిగా 
ఎవరూ పూరించలేరు . 

వెళ్లి టేబుల్ పై చూసాడు . హాట్ బాక్స్ లో చపాతి ,పక్కనే 
మామిడి కాయ పప్పు . హమ్మయ్య . ఇంకో మూత 
తీసి చూసాడు . మెల్లిగా నవ్వు వచ్చేసి శ్రీమతి మీద 
ప్రేమ పొంగిపోయింది మనసులో ,పెరుగు కలిపిన అన్నం 
చూసి . నిజంగా కలుపుకొనే ఓపిక కూడా లేదు . 
''థాంక్యు చిన్నారి ''ప్రేమగా అనుకున్నాడు . 
గబ గబ తిన్నాడు . చూస్తే ఇంకా చపాతీలు ఉన్నాయి . 
అయ్యో తను తినలేదా ?ఛా .... నిజమే కదా తన మీద 
కోపం ,తన అన్నాను చూడలేదు అనే బాధ లో ఉంది . 
ఎంత స్వార్దంగా తను ఒక్కడే తిన్నాడు . సరోజ చూడు 
అంత కోపం లో కూడా తన కోసం అన్నీ చేసిపెట్టింది . 

ప్లేట్ లో పెట్టుకొని తీసుకెళ్ళాడు . 
''సరోజ సారీ రా ... నువ్వు తినని సంగతి గమనించనే లేదు . 
తినవా ప్లీజ్ ''
ఒక్కో సారి కొంచెం తగ్గడం కూడా కాపురంలో  స్థానాన్ని ఉన్నతం 
చేస్తుంది . 
ఎప్పటికి మాట్లాడుతాడో , ఈ గొడవ ఎప్పటికి పూర్తి అవుతుందో 
అనుకుంటున్నా సరోజకి భర్త మాటలు వినగానే చాలా 
సంతోషం వేసింది . అలుక ఎక్కడికి పోయిందో వెంటనే 
చిన్నగా అల్లుకొని కోపం పోయిందా ?అడిగింది . 
''ఎప్పుడో ....... అయినా తప్పు చేసింది నేను కదా ,
కోపం పోవాల్సింది దేవిగారికే ''మెల్లిగా మెడ నిమురుతూ 
చెప్పాడు  ''ముందు తిను ''

ప్లేట్ తీసుకుంటూ ఉంటె అమ్మ చెప్పిన విషయం గుర్తుకు 
వచ్చింది సరోజకు ''సత్య భామంత అలకలో ఉన్నా 
ఆడది భర్త ఆకలి మర్చిపోకూడదు . అదే భర్త మనసుకు 
దగ్గర దారి . ఆకలి వేళ  అన్నపూర్ణగా ఉంటేనే తన 
ప్రేమ రాజ్యానికి ఎప్పటికీ రాణి కాగలం''

''థాంక్యు అమ్మ '' మనసులోనే అనుకుంది ,
భర్త ప్రేమను తనివి తీరా ఆస్వాదిస్తూ . 

Monday, 28 July 2014

పుట్టిన రోజు ముచ్చట (3)

పుట్టిన రోజు ముచ్చట (3)

మొదటి రెండు భాగాల లింక్ ఇక్కడ 
(two parts link puttina roju muchchata )

హేమ మాధురికి బోగి పండుగ రోజు భోగి పళ్ళు పోయాలి అని 
తాతయ్య  వెంకటేశ్వర్లుగారికి  అమ్మమ్మ నాగరత్నమ్మ లకు బోలెడు 
ముచ్చట . అక్కడేమో రేగు పండ్లు దొరకలేదు . ఇంకేమి చెయ్యాలి . 
నాకు ఏమి తోచలేదు . ఇంతలో మా నాన్నే అందరు గుమస్తాల్ని 
పంపేసారు . ఎక్కడైనా వెతుక్కొని రమ్మని . చెట్లు కూడా ఎక్కడా 
లేవు . పొలం లో ఏమైనా ఉన్నాయో ఏమో . ఇప్పుడు ఎక్కడ 
వెతికేది ?చివరికి ఒకరు సంపాదించి తెచ్చారు . తీరా చూస్తే ఎన్ని !
రెండు దోసిళ్ళు . వాటితో ఎంత మంది పోయాలి ?చుట్టూ చుట్టాలే . 
పెదనాన్న , బాబాయిలు ఇంకా చాలా మంది . ఏమి చేద్దాము ?
అమ్మ వైపు చూసాను . అమ్మ కూడా ఆలోచిస్తుంది . 
చివరికి ఒక సర్దుబాటు చేసేసాము . ఆ రేగు పండ్లలోనే బోలెడు 
పూల రెక్కలు ,అక్షింతలు కలిపింది అమ్మ . భలే ఉపాయం . 
ఏదో ఆడవాళ్ళు ఇలా కనిపెట్ట బట్టి ఇన్ని పేరంటాలు , ఇన్ని 
సందడులు ... వెరసి సంస్కృతులు . నిజానికి ఒక తరం నుండి 
ఇంకో తరానికి ఇవన్నీ మోసుకెళ్లి భద్రంగా ఇచ్చేది వాళ్ళే . 

సాయంత్రం అందరిని పిలిచి కూర్చో పెట్టి మాధురి ని చిన్ని కుర్చీ లో 
కూర్చో పెట్టాము . ఏమి జరుగుతుందో దానికి తెలీదు కాని 
ఏదో జరుగుతుందని దానికి అర్ధం అయింది . పలకరిస్తే చాలు 
వాళ్ళ వైపు చేయి ఊపి నవ్వేస్తుంది . కాసేపు కూర్చుంటుంది . 
కాసేపు పరిగెత్తుతుంది . అందరు మాధురి మా దగ్గరికి రా 
అని పిలుపులు . ఇక స్కూల్ లో చదివే బాబాయి వాళ్ళ పిల్లలు ,
సువర్ణ , కాము , ప్రవీణ్ ,శిల్ప ,సిందు ..... అందరి కంటే చిన్నది 
శ్రుతి రేఖ . ఎత్తుకోలేదు కాని ఆడిస్తుంది పాపని . వాళ్ళందరికీ 
అక్క కూతురు అంటే ఒక ఆడుకొనే బొమ్మ లాగే ఉంది . 
తాము పెద్ద అయిపోయిన ఫీలింగ్ . ఇక చెల్లెలు సునీత కు 
హేమ అంటే బోలెడు ఇష్టం . అన్నీ దగ్గర ఉంది చూసుకుంటూ 
ఉంది . పండుగ అన్నా పేరంటం అన్నా డబ్బు వెదజల్లడం కాదు 
నవ్వులు వెదజల్లాలి . మనుషులతో , మమతలతో ఇల్లు 
వెలిగిపోవాలి . పల్లెటూళ్ళలో అప్పుడు వాటికి ఏమి కొదవ లేని కాలం . 
ఇరవై ఏళ్ళు దాటి వచ్చేసాము కదా . ఇప్పుడు పిలిస్తే అంత మంది రారు . 

ఒకొక్కరు వచ్చి దోసిళ్ళతో బోగి పళ్ళు 
తీసుకొని హేమ పైన పోస్తూ ఉంటె 
జారుతున్నవి చూసి చప్పట్లు కొడుతూ ఉంది
 పెళ్ళికి జారే తలంబ్రాలు చూస్తే ఇలాగే కొడుతుందా ?

ఏమో అప్పుడు కాసింత సిగ్గు వచ్చేస్తుందేమో .... చూడాలి . 
పోసిన వాళ్ళు చిన్న చిన్న బహుమతులు ఇస్తూ ఉన్నారు . 
పుట్టిన రోజు కాదు కదా ఎందుకు అన్నా వినడం లేదు . 
చిన్న పిల్ల దగ్గరికి ఖాళీ చేతులతో ఏమి వస్తాము అని ఏదో 
ఒకటి తీసుకొని వచ్చారు . 
అమ్మా నాన్న వచ్చారు . అక్షింతలు వేసిన తరువాత బయటకు 
చిన్న బహుమతి తీసింది అమ్మ . ఏమిస్తుంది ?చాలా కుతూహలంగా 
ఉంది . మెల్లిగా హేమా చేయి తీసుకొని వేలికి తొడిగింది . 
అరె !నీలం రంగు రాళ్ళతో  చిన్నవంకీ ఉంగరం . నవ్వేసాను . 
అది నాదే . చిన్నప్పటిది .  ఎంతో  భద్రంగా  దాచి పెట్టి మీ అమ్మది 
... మీ అమ్మ కూడా చిన్నప్పుడు ఇలాగే ఉండేది అని 
గుర్తు చేసినట్లు ఇచ్చింది . 

అమ్మ భలే గ్రేట్ . నా చిన్నప్పటి వన్నీ దాచుతుంది . 
ఇంకా పిల్లలకు అవి ఎప్పుడు సంతోషాన్ని ఇస్తాయో 
అప్పుడు ఇస్తుంది . నా బాల్యం , నా అల్లరి, కధలు కధలు 
గా నవ్విస్తూ .... మీ అమ్మ ఇలాగ  ,అలాగ అని మా పిల్లలకు 
చెపుతూ ఉంటుంది . నేను కూడా వీళ్ళ పిల్లలకు ఇలాంటి 
జ్ఞాపకాలు ఇవ్వాలి . ఎంత బాగుంది ఇలా దాచి పెట్టి మీ అమ్మది 
అని చెప్పి అపురూపంగా ఇవ్వడం . అది ఫోటో కావొచ్చు ,
డ్రాయింగ్ కావొచ్చు , బహుమతి కావొచ్చు .... మీ అమ్మది 
అంటే పిల్లలు ఎంత ఆనందంగా తీసుకుంటారో ! 

ఎర్రనీళ్ళు దిష్టి తీసేసి పాపను నిద్ర పుచ్చిన తరువాత మళ్ళా 
అదే ఆలోచన . ఇంకేముంది .... ఈ ఏడాది కూడా పుట్టిన రోజు 
చేయము . తరువాతి పుట్టినరోజుకు ఇంకొకరు వచ్చేస్తారు . 

ఇక చేసేదేమీ లేదు అనుకున్నాను కాని దేవుడు దీని 
మూడో పుట్టిన రోజు నిజంగా ఎంతో సంతోషం తో 
అదీ వాళ్ళ తమ్ముడితో జరుపుకునేటట్లు ప్లాన్ 
చేసి ఉన్నాడని అప్పుడు తెలీదు . 
                                                 (ఇంకా ఉంది )

Tuesday, 15 July 2014

పుట్టిన రోజు ముచ్చట (2)

పుట్టిన రోజు ముచ్చట (2)

( part 1 link ikkada )

''ఎప్పుడూ సంక్రాంతి కి మీ అత్తగారిల్లేనా ?
ఈసారి కోటకు రండి '' అమ్మా నాన్న ల ఆహ్వానం . 
కాదన లేము, అందులో అసలు కంటే వడ్డీ ముద్దు 
అని ''హేమ మాధురి '' ఫస్ట్  మనుమరాలు అయిపోయే . 
దాని బుల్లి చేతులతో భోగి మంటల్లో తాటాకు లు 
వేయించాలని అమ్మమ్మకు ,తాతయ్యకు ,మేన మామకు 
సరదా .... వాళ్ళకే కాదు  మాకు కూడా సరదాగా ఉంది . 
అందులో కొత్తగా పెళ్లి అయిన మా చెల్లి సునీత, వాళ్ళ ఆయన 
మస్తానయ్య మొదటి పండుగ కు వస్తున్నారు . ఏ విధంగా 
చూసినా వెళ్లి తీరాల్సిందే . 

''సరే వరంగల్ నుండి బయలుదేరి మా అత్తగారింటికి 
వెళ్లి వాళ్లకు ఒక మాట చెప్పి పాపను తీసుకొని 
మేము ఇద్దరం కోటకు వస్తాము '' చెప్పేసాను . 
ఇక కోటలో సందడే సందడి . తాటాకులు తెప్పించి 
ఎండలో పరిచేసారు . పండుగ కళ ఇల్లంతా .... 
                           *******
చక్కగా అడుగులు వేస్తూ మాధురి ఇల్లంతా తిరుగుతుంటే 
నవ్వులే నవ్వులు . పిన్నమ్మలు పక్కింటి వాళ్ళు 
చెల్లెళ్ళు , తమ్ముళ్ళు ..... అబ్బ ఫస్ట్ పుట్టే వాళ్ళను 
తిప్పటానికి ఎన్ని గుర్రాలో !
వచ్చే పోయే వాళ్ళ కామెంట్స్ ... 
''ఏమి బుగ్గలే పిల్లకి ,మీ వాయుగుండ్ల వాళ్ళ బుగ్గలు 
వచ్చేసాయి . మీ అత్తగారి ప్రింట్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి చెన్నూరు లో ''
అనటం . నేను టకామని దిష్టి తీయడం . 
అయ్యో పాల బుగ్గలే కదా ,   ఎవరికైనా అలాగే 
ఉంటాయి . స్కూల్ కి వెళితే  ఉండవులే అనడం . 

మొత్తానికి మామిడి తోరణాలు కట్టిన వాకిట్లోకి 
భోగి పండుగ వచ్చేసింది . తెల్లవారకే ముందే 
అందరం లేసేసాము . మా చెల్లి వచ్చి పాపను 
లేపేసింది . దానికి అర్ధం కాక ముందు వెలుగుతున్న 
మనిషంత ఎత్తు మంటను చూస్తూ నిద్ర ఇంకా ఉండేసరికి 

కళ్ళు నులుముతూ ఉంది . 
అందరు చుట్టూ చేరి మాధురి ... మధురి అని 
నవ్విస్తూ ఉండేసరికి మెల్లిగా నిద్ర మత్తు పోయి 
తాతయ్య దగ్గరకు పోయి చూస్తూ ఉంది . 
మా మరిది  గారు , ఈయన ''దామ్మా ... ఆకులు  మంటలో 
వేద్దాము ''అని పిలిచి ఎత్తుకోపోయారు . 
భయంతో చేయి లాక్కొని వాళ్ళ తాతయ్య కు 
చుట్టుకుంది . 

''భయం లేదు చూడు మేము వేస్తున్నాము . ''
అని నేను చెల్లి తాటాకులు మంటలో వేసాము . 
అయినా రావడం లేదు . 
మెల్లిగా వాళ్ళ తాతయ్య ఎత్తుకొని చిన్న తాటాకు 
దాని పిడికిలి సరిపోయేంత గా చూసి చేతిలో పెట్టాడు . 
అటూ ఇటూ ఊపింది . నచ్చిందేమో ఊపుతూ 
నవ్వుతూ ఉంది . మెల్లిగా తాతయ్య మంట దగ్గరకు 
తీసుకేల్లి విసురు అన్నాడు . వేసేసింది . 
నెలల పిల్ల గా ఉన్నప్పటి నుండి అంతే !
మా నాన్న మాట భలే వింటుంది . 

చక చకా వాకిలి ఊడ్చి నేను , చెల్లి రంగులతో 
ముగ్గు వైకుంట వాకిళ్ళు గీస్తూ ఉంటె చూస్తూ 
మా చుట్టూ తిరుగుతూ ఉంది . 
తరువాత అందరం తలంటు కొని కొత్త  బట్టలు 
వేసుకున్నాము . పాప  గౌను అందరికి చూపించాలి 
అని పిన్ని కూతుళ్ళు శిల్ప , సింధు , రేఖ 
వచ్చి తీసుకొని వెళ్ళారు పాపని . 
బిచ్చగాళ్ళకి బియ్యం , దోసలు అవీ వేస్తూ వంట 
చేస్తూ అందరం బిజీ . 
ఎప్పుడో ఖాళీ గా ఉన్నప్పుడు దీని పుట్టిన రోజు 
సంగతి గుర్తుకు వచ్చింది . ఈ సారి కూడా 
ఇరవయ్యో తేది స్కూల్ కి వెళ్ళాల్సిందే :(
మరి దీని పుట్టినా రోజు కోరిక ఎలా ?

దుఖానికి కారణం కోరికే అంటారు . కాని ఈ 
చిన్ని ముచ్చట్లు కోరిక అవుతాయా ?
లేకుంటే దీనిని తీర్చుకోవాలి అని అంత 
ఆలోచన ఎందుకు ?ఏమో పిల్లల మధ్య మూడేళ్ళు 
గాప్ ఉండాలి అని ప్లాన్ చేసుకున్నాము కాబట్టి 
పైసారికి రెండో వాళ్ళు వచ్చేస్తారు . 
ఇక దీని ముచ్చట్లకు టైం ఎక్కడ ?

అమ్మ వినగానే 
''సరే కానీ ఈ సారి కూడా 
అందరిని పిలిచి భోగి పళ్ళు పోద్దాము ''చెప్పింది . 
నాన్న వెంటనే గుమస్తాలను పంపి రేగు పళ్ళు 
తెమ్మని పంపాడు . 
వాళ్ళు మొత్తం తిరిగి 
లేవంటూ వచ్చారు . 
''ఇప్పుడెలా ?'' అందరం ఆలోచనలో పడిపోయాము . 
                                              
                                                  (ఇంకా ఉంది )


Monday, 14 July 2014

ఒక జర్నీ ఇద్దరి మధ్య వారధిగా

ఒక జర్నీ ఇద్దరి మధ్య వారధిగా ,
అదేనండి భరణి గారు , ప్రకాష్ రాజు గారు . 

ఈ రోజు తనికెళ్ళ భరణి గారి పుట్టిన రోజు 
సందర్భంగా '' సాక్షి ఫామిలీలో '' చూసారా ?

వారి స్నేహమంత ఆర్ద్రత నిండిన శైలితో ... 
వారి ఆత్మప్రయాణాన్ని అక్షరీకరించింది . 

తనికెళ్ళ భరణి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు . 
పులగం చిన్నారాయణ గారికి అభినందనలు . 


(article link ikkada )


Thursday, 10 July 2014

పుట్టిన రోజు ముచ్చట

పుట్టిన రోజు ముచ్చట (1)

''వరంగల్ కి రిటర్న్ టికెట్స్ పంతొమ్మిది రాత్రికి బుక్ 
చేసాను '' శ్రీవారి మాటల్లో రిజర్వేషన్ దొరికిన  ఆనందం . 
వళ్ళో కూర్చున్న పదకుండు నెలల మాధురికి అన్నం పెడుతూ 
ఆలోచనలో పడిపోయాను ..... మళ్ళా దీన్ని వదిలి ఉద్యోగానికి 
వెళ్ళాలి . కనీసం కొంచెం పెద్దది  అయినా తీసుకెళ్ళి 
స్కూల్ లో చేర్చుకునేదాన్ని . ఎక్కడ హనుమకొండ ,ఎక్కడ 
నెల్లూరు జిల్లా లోని చెన్నూరు . ఊరకనే ఇలా వచ్చి పాపను 
చూసి అలా ఏమి పోతాము .  అత్తగారింట్లో పాపకు ఏమి లోటు లేదు . 
పెళ్లి కాని ఆడపడుచు ఇంకా అత్తగారు మామగారు ఈయన అమ్మమ్మ ,
పిన్నమ్మ , మరుదులు పాపను అపురూపంగా చూసుకుంటారు . 
 దానిని వదిలి వెళ్ళలేక నాకే బాధ . ఇవేమీ తెలీని పాప 
హాయిగా నవ్వుకుంటూ వళ్ళో ఊగుతూ నవ్వుతూ ఉంది .
సరేలే వారం తరువాత వెళ్ళే దానికి ఇప్పటి నుండి ఎందుకు 
దిగులు పడటం . బుజ్జి పిల్లతో ఆడుకోకుండా !
మొన్న పదకుండో  నెలలో చేయించిన గుండు మీద చిన్నగా 
వచ్చిన జుట్టు . అరె మొదటి పుట్టిన రోజుకు పూలు 
కూడా పెట్టలేమే !... 

''అవును మర్చే పోయాను, దీని పుట్టిన రోజు 
ఇరవై తేది  కదా! ఆ రోజు ఉండలేము కదా . 
అయ్యో వరంగల్ లో ఉంటాము ఎలా ?
 సంక్రాంతి సెలవలు తరువాత  మొదటి పని దినం కాబట్టి 
సెలవు పెట్టుకో కూడదు . ఇక పుట్టిన రోజు నేనేమి చేస్తాను ''
దిగులుగా అత్తమ్మ తో అన్నాను . 
ఇంట్లో అందరు నిజమే  కదా అన్నట్లు జాలిగా చూసారు . 

''ఏముందిలే బోగి పండుగ రోజు అందరిని , బంధువులు ను 
పిలిచి బోగిపళ్ళు పోద్దాము . పుట్టిన రోజు లాగే చేద్దాము ''
ఒక చిన్నసలహా   చెప్పారు . కొంత వరకు తృప్తి . ఇక 
ప్రతి పుట్టిన రోజుకు ఇంతే . 

''సరే అలాగే అలాగే అరిసెలు మీద అడుగులు వేయిద్దాము . 
చిలకలు పంచుదాము '' ఓక్కొక్క సలహా  హుషారుగా కలిపారు . 
పుట్టిన రోజున అడుగులు వేసారని అరిసెలు , పలుకులు 
వస్తున్నాయని చిలకలు పంచేది సాంప్రదాయం . 
అనుకోవడం ఎంత సేపు ,పిలుపులు ఎంత సేపు 
.... బోగి పండుగ రోజు మా అమ్మావాళ్ళు , చెల్లి వాళ్ళు 
చుట్టూ పక్కల వాళ్ళు సాయంత్రం హడావడి తో ఇల్లంతా 
సందడి . 

చిన్న ఉయ్యాల వేసి డెకరేషన్ చేసాము పాపకి 
బోగిపళ్ళు పోయడానికి . చుట్టు పక్కల వారి సలహాలు , 
మాటలు ,పలకరింపులు .... ప్రతి ఒక్కరికి చేసినంత పని . 
బుజ్జి పిల్ల మాత్రం ఇంత బుగ్గలు వేసుకొని ఉయ్యాల్లొ 
ఊగుతూ నవ్వుతూ , వచ్చేవారికి చేయి తిప్పి టాటా 
చెపుతూ .... నవ్వుల్ని పంచుతూ ఉంది . అమ్మ , అత్తమ్మ 
రేగుపండ్లు తెచ్చి అక్షంతలు కూడా కలుపుతూ ఉన్నారు . 
నేను చెల్లి కింద దుప్పటి పరిచి అరిసెలు సర్దుతూ ఉన్నాము . 
ఇంతలో డుబుక్కున చిన్న శబ్దం . ఉలిక్కిపడి ఊయల వైపు 
పరిగెత్తి చేతులు కింద పెట్టాను . 
అందరిలో భయం . కింద పడుతున్న పాపని గబుక్కున 
పట్టుకొని బుజానికి హత్తుకున్నాను . ఒక్క క్షణం 
ఆలస్యం అయి ఉంటె పాప తల నేలకి ... ఊహు 
ఊహించలేకపోయాను . ఇదేమిటి ఏడవటం లేదు . 
కొంపదీసి భయపడిందా ?వళ్ళో వేసుకొని చూస్తే ... 
దొంగ మొహం ఏమి జరగనట్లు పక పక నవ్వుతుంది . 
అప్పుడే వచ్చిన రెండు పళ్ళు కనపడేటట్లు . 
రాక్షసి దీనికి భయం లేదా !నేను నవ్వేసాను . 
అందరు ఊపిరి పీల్చుకున్నారు .  

మెల్లిగా అరిసెలు దగ్గర నిలబెట్టాము . 
''అడుగులు వెయ్యి మాధురి '' అని అందరు 
ఉత్సాహపరుస్తున్నారు . 
దొంగమొహం రోజు గబ గబ వేసేది ఈ రోజు వేయనంటే 
వేయదు . పై పెచ్చు అందరి వైపు చూసి బోసి నవ్వులు . 
ఇక ఏమిటి చేసేది ?సరే నువ్వు సునీత పట్టుకొని 
నడిపించండి ... అమ్మ సలహా . చేసేదేముంది అలాగే 
చేసాము . ఫ్రాక్ బుట్ట లాగా ఎగురుతుంటే ఆవిడ 
గారు మా వేళ్ళు తన చిన్న పిడికిళ్ళతో పట్టుకొని 
బోడి గుండు గిర గిర తిప్పుతూ యువరాణి లాగా 
అరిసెలు మీద అడుగులు వేసింది . 
అమ్మమ్మ కి ,తాతయ్యకి , నాన్నమ్మ కి జేజి నాయనకు ,
మామ ,బాబాయిలు నాన్న ఒకరేమిటి అందరికి 
వాళ్ళు మొదటి అడుగు వేసినంత సంబరం . 
''నా తల్లే నా బంగారే .... అంటూ ముద్దులు కురిపించారు . 

చక్కగా పీట  వేసి కట్టిన ఉయ్యాలలో 
కూర్చోపెట్టి ఒక్కొక్కరే వచ్చి 
రేగుపళ్ళు అక్షింతలు వేసి 
ఇచ్చిన స్వీట్స్, చాక్లెట్స్ ,
తాంబూలాలు తీసుకొని 

అందరు వెళ్ళిపోయే వరకు ఇంట్లో బోలెడు అల్లరి , 
సందడి . బుజ్జి పిల్ల అంత గలభా లోనూ మెల్లిగా 
తూగుతుంది . 

''శశీ ఎర్ర నీళ్ళు దిష్టి తియ్యి . పాపకి నిద్ర వచ్చేస్తుంది ''
అలాగే అని చెప్పి తీసేసి బువ్వ పెట్టి నిద్రపుచ్చాను . 
చాలా తృప్తిగా అనిపించింది . కాని ఏదో ఒక 
మూల చిన్న అసంతృప్తి , దీని పుట్టిన రోజు ఇక ఎప్పుడు చెయ్యాలి ?
ఇక ఎప్పుడూ ఇలాగే సెలవలు అయిపోతాయి కదా అని . 
                                                  (ఇంకా ఉంది )

Tuesday, 1 July 2014

మా బంగారు జ్ఞాపకం .... మాలిక లోఆడ పిల్ల ఎప్పటికైనా ''అక్కడికి '' వెళ్ళే పిల్లే . 
కాని పంపేటపుడు కాసిన్ని వడి బియ్యంతో పాటు 
బాల్యపు జ్ఞాపకాలు కూడా మూట గట్టి పంపితే 
మనం గుర్తుకొచ్చి కన్ను చెమర్చిన రోజున కాసింత ఓదార్పుగా 
నిలుస్తాయి . చిన్నప్పటి గిలిగింతలు కిల కిలలై మెరుస్తాయి . 

అందుకే మా హేమ మాధురి కోసం కొన్ని తన జ్ఞాపకాలు 
సీరీస్ గా వ్రాయాలి అనుకున్నాను . అందులో ఒకటి 
''మాలిక ఈ మాగజైన్ '' లో చదవండి .... నా 
''ఒక మధుర జ్ఞాపకం ''
వలబోజు జ్యోతి గారికి కృతజ్ఞతలు . 
( kadha link ikkada malika  lo )


ఎక్కడకు పోయావు బంగారు తల్లి నువ్వు 
ఇంకో వంశానికి ఊతం ఇవ్వడానికే కదా !
ఇక్కడి ఆనందానికి అక్కడి ఆత్మీయతకు 
నీ కొంగు ముడితో బంధం పెంచుతావు .... 
నీ వడి నిండిన రోజున
మా కనుల ముందు నీ ఇంకో చిన్న రూపు 

నీ నవ్వులు , మాటలు,
 అలకలు , పాటలు  
ఎప్పుడూ మాకు వసంత జల్లులే 
అమ్మాయిని కన్నవాళ్ళ హృదయానికి 
నిత్యం ఇంద్ర ధనుస్సు రంగులే  :)

Monday, 2 June 2014

ముచ్చటగా మూడోసారి

''ఏమండీ రేపు ఏదో ఉత్సవం ఉందని ఇంకో రెండురోజులు 
ఉండమంటున్నారు అమ్మా నాన్న '' చెప్పింది ఫోన్ లో శ్వేత . 
అవతలి నుండి ఒక్క క్షణం నిశ్శబ్దం . 
తరువాత ''నీ ఇష్టం '' ఫోన్ కట్ . 
హ్మ్ .... అంటే ఆయనకు ఇష్టం లేదు అన్న మాట . 
మగవాళ్ళ మాటలకు అర్ధాలు వేరులే . 
అయినా తానేమి ఊరికే అమ్మగారింటికి వచ్చిందా ?
పిల్లలు చదివేవి చిన్న క్లాస్ లు అయినా మామూలుగా ఇక్కడకి 
రాలేము కదా ఈ వేసవి సెలవల్లో తప్ప . అయినా ఆయనను 
వదిలి ఉండటం నాకు ఏమైనా సరదానా ?ఏదో అన్నదమ్ములకు 
బట్టలు పెట్టి సారే ఇవ్వాలి అక్క చెల్లెళ్ళు అంటే వచ్చింది కాని !
ఎప్పుడూ అన్నదమ్ముల చేత సారే పెట్టించుకుంటాము . 
వాళ్ళు ఎలాగు భగినీ హస్త బోజనానికి దీపావళి తరువాత వచ్చేది లేదు . 
ఇలాగ అయినా వాళ్లకు బట్టలు పెట్టడం ఎంత బాగుంటుంది .  

సారె అంటే ఏమిటి ?ఆత్మీయతల మార్పిడి . బాగుండాలి అనే 
ఆకాంక్ష . నేనున్నాను అనే భరోసా . రక్త స్పర్శ .
ఏమి చెప్పినా ఈ మగవాళ్ళకు అర్ధం కాదు . 

''అమ్మా ... అమ్మా ''అరుస్తూ వచ్చారు చిన్న పాపలు ఇద్దరు . 
తల్లి మొహం చిన్న పోయిందని  గమనించకుండా రెండు చేతులు 
లాగుతూ ''మా కిద్దరికీ ఈ రోజు అమ్మమ్మ పూల జడలు వేయిస్తుందంట ''
ఇంత పొడుగు జడ .... చేతులు ఊపుతూ ,చూపిస్తూ హుషారుగా 
ఎగురుతూ . ముద్దుగా ఎగురుతున్న బొమ్మలిద్దర్నీ చూసేసరికి 
హుషారు వచ్చింది శ్వేతకి . దగ్గర తీసుకొని ముద్దులు పెట్టింది . 
''అలాగేలే . కొత్త పట్టు పావడాలు వేస్తాను . ఫోటో తీయిస్తాను ''

''పిల్లలు రండి . తాటి ముంగాలు తెచ్చాను. ముంజెలు తిందురు . 
శ్వేతా రామ్మా ,వాళ్లకి వలిచి పెడుదువు '' ప్రేమగా నాన్న పిలుపు 
వినగానే ''హయ్య తాతయ్య ముంజెలు తెచ్చాదోచ్ ''ఎగురుతూ 
వెళ్ళిపోయారు . ఆడపిల్లలు ఉండే ఇంటి అందమే వేరు గుమ్మానికి 
బంతి పూల తోరణాలు వేలాడినట్లు ,సందెవేళ జాజిపూల 
పరిమళాలు వీచినట్లు .... ఆ సందడే వేరు .   
                          *********

బస్ నుండి దిగుతున్న పిల్లలను చూసేసరికి ఆనంద్ మొహం లో 
కళ . ''డాడీ '' ఇద్దరు చుట్టేశారు వాళ్ళ నాన్నని . ఇద్దరు ఒకే రకం 
గౌన్లు వేసుకొని ,హెయిర్ బాండ్ వేసుకొని ముచ్చటగా ఉండేసరికి 
బస్ స్టాండ్ లో అందరు ఇటే  చూసారు . వెనుకనే దిగుతుండే భార్య 
చేతిలో బాగ్ తీసుకొని ముభావంగా ఉండిపోయాడు . కనీసం 
చిరునవ్వు కూడా ఇవ్వని భర్తని చూసి నిరాశ పడింది . 
ఇవేమీ తెలీని పిల్లలు ఆటోలో కూడా నాన్న భుజాలు వదలకుండా ఊగుతూ 
బోలెడు కబుర్లు చెపుతూ ఉంటే అన్య మనస్కంగా ఊ  కొడుతూ 
ఉన్నాడు . 
కోపం నా మీద కదా పిల్లలు ఏమి చేసారు అనుకుంటూ ఇంట్లోకి 
వెళ్లి వంట లో మునిగిపోయింది .  పిల్లలకు స్నానాలు చేయించి 
అన్నం తినిపించి నిద్రపుచ్చి వచ్చినా ,ఆనంద్ భోజనానికి 
రాకుండా టి . వి చూస్తూనే ఉన్నాడు . 

''భోజనానికి రండి '' తప్పని సరి అన్నట్లు వెళ్లి కూర్చున్నాడు . 
పప్పు పచ్చడి తన ప్లేట్ లో వడ్డించుకొని తనకి వడ్డించ పోయేసరికి 
వద్దు అని వారించాడు . 
గబుక్కున ప్లేట్ లో అన్నం పెట్టుకొని పెరుగు వేసుకున్నాడు . 
''ఏమిటి ఈ పని ?ఇవన్నీ తినకుండా ''కూరలు చూపించింది . 
''వద్దులే ఇలాగే అలవాటు అయిపోయింది . నువ్వు సుఖంగా 
ఉంటె చాలు కదా ? నువ్వే తిను ?'' కటినంగా అన్నాడు . 

''పదేళ్ళు అయింది మన పెళ్లి అయి . ఎప్పుడైనా ఇలాగ 
చేసానా ? అమ్మా వాళ్ళు నోరు తెరిచి అడిగితే ఎలా కాదనగలను . 
అక్కడ నేను మాత్రం అన్నానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో 
అని బాధ పడ్డానో తెలుసా ?'' విసురుగా కంచం దగ్గర నుండి 
లేచి వెళ్లి పిల్లల దగ్గర పడుకుంది . మెల్లిగా వెక్కుతున్న చప్పుడు . 

అరే బాధ పెట్టానే అనుకున్నాడు మనస్సులో . భార్య కంటి తడి 
చూసి మనసు గిల గిలా కొట్టుకుంది . తన సంగతి తెలిసి 
కూడా ఇలా ఎలా అనేసాడు ? అయినా తన బాధ తెలుసుకోవద్దా ? 
అసలు వాళ్ళు లేని ఇల్లు ఎంత విసుగ్గా ఉంటుంది ?అసలు ఇంటికి 
కూడా రాబుద్ది కాదు . తనను నవ్వించినా పర్వాలేదు , ఏడిపించినా 
పర్వాలేదు , కూరలో కరివేపాకంత తీసేసినా పర్వాలేదు ... 
తను లేకుండా గది గోడలు పట్టుకొని వేలాడే ఆ దిగులు కంటే 
నాన్సెన్స్ అయినా పర్లేదు తన మాటలు చాలు . తన ఉనికి చాలు . 
ఎలాగైనా ఓదార్చాలి . ఈ క్షమాపణలు అవీ రావే . అయినా 
నేర్చుకోవాలి తప్పదు . పెళ్లి కాక ముందు ఏమి తెలుసనీ ... 
అన్నీ నేర్చున్నట్లే ఇదీనూ . వెళ్లి శ్వేత పక్కనే పడుకున్నాడు . 
అటు తిరిగి ఉంది . ఇన్ని రోజుల తరువాత హ్యాపీ గా ఉండకుండా 
ఈ సిచ్యుయేషన్ ఏమిటి ?మనసులోనే తల బాదుకొని ... 
బుగ్గల పై మెరుస్తున్న బెడ్ లైట్ వెలుతురు చూస్తూ ... 
ఏమి మాట్లాడాలి ?

అటు తిరిగి ఉన్న శ్వేత కనురెప్పల  తడిని దిండు తుడుస్తూ ఉంది . 
పక్కన తగిలే వెచ్చదనం అర్ధం అయింది . పిల్లలు నిద్ర లేస్తే 
బాగుండు కోపంగా అనుకుంది . కొంచెం దూరంగా జరుగుతూ . 

''అది కాదు శ్వేతా , మీరు లేకుండా నాకు ఇక్కడ ఎంత విసుగ్గా 
ఉంటుంది . అన్నం హోటల్ లో సరిగా ఉండదు . నాకు జ్వరం 
కూడా వచ్చేసింది '' బోలేడంత జాలి పుట్టేటట్లు చెప్పాడు . 

''అవును జ్వరాలు వచ్చేస్తాయి . వెధవ బుద్దులూ వచ్చేస్తాయి . 
అందుకే అప్పుడప్పుడూ ఇలాంటి పరీక్షలు పెట్టాలి ''ఇంకా 
కోపం తగ్గక . 

''ఇంతకీ పాస్ అయ్యానా లేదా ?'' 
''అయ్యారు లేండి . పక్కింటి వాళ్ళను ఒక కన్ను వేసి ఉంచమని 
చెప్పాను '' చిన్నగా నవ్వుతూ చెప్పింది . 

'' అందుకేనా నన్ను రోజు ఆవిడ ఒక్క కన్నుతో చూస్తుంది ''
అల్లరిగా చేయి వేయబోయి ... అబ్బ తల పట్టుకున్నాడు 
భార్య వేసిన మొటిక్కాయకి . 
''ఏమి తింటారే పుట్టింట్లో . ఇంత బలం వచ్చేస్తుంది మీ చేతులకి ''
తల తడుముకుంటూ చెప్పాడు . 
''ఏదో సరదాకి వేస్తే .... అయినా పక్కింటి వాళ్ళను అలా అనొచ్చా ?
మనం గౌరవంగా చూస్తేనే వాళ్ళు మనకు గౌరవం ఇస్తారు '' 

''ఏమిటి ఇది సరదానా ?తిట్టదాలు కొట్టడాలు ఇయన్నీ మీకు సరదాలు 
అయితే మేము ఏమి కావాలి . ఇది గృహ హింస కాదా ?
చూడు మూడు బొప్పెలు '' 

''ఒక్కటి వేస్తే మూడు వచ్చాయా మొద్దబ్బాయి ?'' నవ్వుకుంటూ 
ఇంకోటి ఇచ్చేసింది . 
''అన్యాయం ఇదేమిటి ?ఇలాగ ఇచ్చెస్తున్నావు ?
ఇదిగో చూడు ఐదు బొప్పెలు తల మీద .... రక్షించండి ''

చిన్నగా అరుస్తూ .... నవ్వుతూ . 

అతను అన్న తీరుకు పక పక నవ్వేస్తూ గబుక్కున పిల్లల వైపు 
చూసింది . లేవకుండా ఉంటె బాగుండును అనుకుంటూ . 
''ఇవే కదా భవిష్యత్తు లో మీకు మధుర జ్ఞాపకాలు ''
ఇంకో సారి మొట్టి '' ముచ్చటగా మూడో సారి '' అంది .  
భార్య నవ్వుకు హుషారు పెరిగిపోయి మెల్లిగా చేతులు చుట్టి 
''నా మీద నమ్మకం లేక పోతే ఎలా ?పిల్లల మీద ఒట్టు 
వేసేదా ?''అడిగాడు . 

ఇష్టంగా ఒదిగిపోతూ ''వద్దు పిల్లల మీద ఒట్టు వేయొద్దు . 
ఆయుక్షీణం . అసలు ఒట్టు వేసే పరిస్థితి వస్తే మన మధ్య 
నమ్మకమే లేనట్లు . నమ్మకమే లేని పరిస్థితి వస్తే 
కాపురమే చేయను '' 
ఇంటి ఇల్లాలు ఒదిగి ఉన్నా బాగుంటుంది . కాసింత రోష పడినా 
బాగుంటుంది . ఈ బంధం ఎంత బాగుంటుంది కట్టేసి 
స్వేచ్చ లేకుండా చేసినా సరే దానిలో మహత్తు  మత్తు ఏమిటో 
ఎంత అనుభవించినా బాగుంటుంది . తృప్తి గా అనుకున్నాడు . 
                      *****************