Tuesday 30 December 2014

బుద్ధుడు -బౌద్ధ ధర్మం

హమ్మయ్య ఏడాది చివరి రోజు కూడా వృధా అవకుండా మంచి 
పుస్తకం దొరికింది . ''బుద్ధుడు - బౌద్ధ ధర్మం '' 
డాక్టర్ పానుగోటి కృష్ణా రెడ్డి గారి రచన . ముందు మాట లో 
 బుద్ధుడి గూర్చి అరటిపండు వలిచి పెట్టినంత 
సులభంగా ఉంది అని చూసి ,
అదెలా సాధ్యం అనుకున్నాను . 
కాని చదివిన తరువాత నిజమే అనుకున్నాను . 
అంతంత భారీ విషయాలు చక్కగా అర్ధం
 అయ్యేట్లు వ్రాసారు . ఇంకా చాలా పుస్తకాలలో మేము 
చెప్పినదే నిజం అన్నట్లు  వ్రాస్తూ ఉంటారు . 
కాని దీనిలో ఎక్కడ అయినా కొంత వివాదం ఉంటె 
అక్కడ క్లియర్ గా దీని మీద వివాదం 
ఉంది అనే విషయం కూడా ఇచ్చి ఉన్నారు . 
బుద్ధుడి మహాభినిష్క్రమణ గూర్చి , 
చివరలో తిన్న బిక్ష గురించి , బిక్షలో మాంసాహారం తినడం 
గురించి ...... అక్కడ ఉన్న సందేహాన్ని కూడా బ్రాకెట్లో ఉంచారు . 
పాటకుల విజ్ఞతను గౌరవించినట్లు ఉంది . 

''ఆత్మో దీపో భావ '' ఏదీ గుడ్డిగా నమ్మకుండా ఎవరికి వారు 
సద్విచారణ తో తమ దీపాన్ని వెలిగించుకోవాలి . 
''మార్పు అనేది అంతిమ సత్యం '' ఒక మనిషి తోనే ఈ సమాజం 
నడవదు . ఎవరు గొప్ప అని కాక ఏది మంచిది అని ధ్యానం తో 
ఉంటూ నడవాలి . తనకు తెలిసింది చెపుతున్నాను అంటాడే కాని 
తనను దేవునిగా పూజించమని ఎక్కడా చెప్పడు . 
''తృష్ణ అన్ని బాధలకు మూలం ''
నాకు ఇది ఇష్టం ,అది ఇష్టం అనుకొంటూ ఉంటాము . కాని కొద్ది 
రోజులకు మనకు అర్ధం అవుతుంది అది యెంత తీర్చుకున్నా అంతం 
అయ్యేది కాదు . సంతృప్తి తోనే అది మాయం అయ్యేది అని . 
ఇలాంటి భావన రావాలి అంటే '' విపశ్యన '' ధ్యానం తోనే 
సాధ్యం . నిజంగా నేను ఈ ''శ్వాస మీద ధ్యాస ''ధ్యానం నేర్చుకున్నప్పుడు 
ఎంతో  ఆశ్చర్య పడ్డాను . ఎంత హాయిగా ఉంది . గురువులు లేరు . 
 ఎవరైనా ఇంట్లోనే హాయిగా చేసుకోవచ్చు .  మొదట కొంత ఆలోచనలు 
వచ్చినా ఇప్పుడు ఎంత హాయిగా ఆలోచన రహిత స్థితి కి సులభంగా 
వెళ్ళవచ్చు . 
ఇంకా కొన్ని బుద్ధుడి మాటలు 
''అప్రియమైన సత్యం చెప్పకూడదు అని చెపుతూ ఉంటారు కదా !
కాని బుద్ధుడు సత్యం అప్రియమైనదైనా సరే చెప్పాలి అంటాడు . 
సత్యం చెప్పకుండా తప్పులు సరిదిద్దడం సాధ్యం కాదు ''అంటారు . 
మామూలు మనుషులం కాసింత అటూ ఇటుగా ఉన్నా , 
ఎదుటి వారికి మంచి జరుగుతుంది అంటే కటువుగా ఉన్నా 
సత్యం చెప్పాల్సిందే . ఎవరు చెప్పినా ,ఏమి చేసినా అన్ని 
దారులు వెళ్ళాల్సింది సంఘం వైపే . సమాజ హితవు కు 
ఉపయోగపడని మనిషి జన్మ వృధా . అందుకే సంపాదించిన 
దానిలో కొంత ధర్మ కార్యాలకు ,అన్న దానానికి ఉపయోగించాలి . 
''సంఘం శరణం గచ్చామి '' 

మరి అన్నింటిలోకి ఇదే గొప్ప మతం అని ఎవరైనా చెపితే నమ్మకూడదు . 
ధ్యానం చేసుకుంటూ మనిషిగా ఏది మంచిదో అది చేయాలి . 
ఎందుకంటె ఏదో ఒక మతం లో ఇమిడినపుడు మన జ్ఞానానికి హద్దులు 
వచ్చేసినట్లే . హద్దులలో జ్ఞానం ఎప్పటికీ ఇమడదు . ఎన్నో 
విషయాలు చదివిన తరువాత , ఎన్నో అనుభవాలు పొందిన 
తరువాత మనిషికి తెలిసేది ఒక్కటే..... 
''తనకు తెలియనది ఎంతో  ఉందని ''

                    @@@@@@@@@@@@@ 
                





No comments: