Showing posts with label వింటారా...మల్ల. Show all posts
Showing posts with label వింటారా...మల్ల. Show all posts

Friday, 1 May 2015

కాళోజి ,హనుమ కొండ ,కొన్ని జ్ఞాపకాలు

''శశి మేడం ,ప్రిన్స్ పాల్ మేడం గారు రమ్మంటున్నారు ''
చెప్పగానే మేడం దగ్గరకు వెళ్లాను . 
జాబ్ లో చేరి ఐదు నెలలు అయినా, మేము  జాబ్ కోసం వచ్చిన ఫస్ట్ జెనరేషన్ 
కాబట్టి ఇంకా ఇలాగ ఇంకొకరి కింద పని చేయడం ,ఆదేశాలు వినయంగా 
పాటించడం అంతగా రాలేదు . అదీ కాక మేడం మాతో నే కొద్ది రోజులు 
పని చేసి ఇంచార్జ్ తీసుకొని ఉన్నారు . 
విషయం ఏమిటన్నట్లు చూసాను . 
''శశి మేడం మీకు మా తెలుగు తల్లి పాటోస్తదా? ఇద్దరు పిల్లలకు 
జరంత నేర్పించుడ్రి '' మేడం చెప్పారు . 
పిల్లలకు పాటలు నేర్పించడం అంటే నాకు భలే సరదా !ఇంకా 
మా తెలుగు తల్లి పాట మా సంగీతం కాలేజ్ లో మాకు ప్రార్ధన గీతం . 
''సరే మేడం . ఎందుకు నేర్పడం ?''
''డి . డి సార్ చెప్పిన్రు . హన్మకొండ పార్క్ లో పద్నాలుగో తేది 
అంబేద్కర్ జయంతి జరుగుతుంది . దానిలో ప్రార్ధన పాడాలి '' 

అర్ధం అయింది వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారో ! 
అప్పటికి ఎన్ . టి . ఆర్ గారు సాంఘిక సంక్షేమ గురుకులాలు 
ఎర్పరిచినా ఇంకా వాటి మీద సోషల్ వెల్ఫేర్ అధికారం పనిచేస్తూ ఉంది . 
కాబట్టి డి . డి మాట కొంత వరకు అలెర్ట్ గా చెయ్యవలసిన పని . 
అదీ కాక సాంఘిక సంక్షేమం వారికి అంబేద్కర్ జయంతి లో 
పాల్గొనడం దేవుడి ఉత్సవం లో పాల్గొన్నంత బాధ్యత . 
సరే అని ముగ్గురు పిల్లలను ప్రిపేర్ చేసాను . 
                             *******
మళ్ళీ పిలుపు ప్రిన్స్ పాల్ రూం నుండి . వెళ్లాను . మేడం చైర్ లో 
ఎవరో అధికారి ,కుర్చీ పట్టనంతగా . ఒక బటన్ వదిలేసి నిర్లక్ష్యంగా 
కూర్చొని ఉంటె , మేడం పక్కన నిలబడి ఉన్నారు . 
మేడం చిన్నగా చెప్పారు ''డి . డి సార్ '' 
నమస్తే చెప్పాను . పిల్లలను పిలిచి పాడించమని చెప్పారు . 
పాడించాను . చివరలో కొంత రాగం తప్పు పాడుతున్నారు . 
గబుక్కున నేను అందుకొని పూర్తి చేసాను . అది కొంత వివాదం 
లోకి నన్ను లాగుతుందని నేను ఊహించలేదు . 
విని తల ఆడించారు . బయటకు వచ్చేసాము . 
తరువాత మెల్లిగా చెప్పారు ప్రిన్స్ పాల్ మేడం సార్ చెప్పిన సంగతి , 
''ఆ మేడం బాగా పాడుతున్నారు . ప్రార్ధన ఆమె చేత కూడా పాడించండి ''
అని చెప్పారంట . 
విషయం తెలీగానే మా శ్రీవారి  కి కొంత కోపం . ఇతరుల ముందు పాడటం 
కొంత నామోషి కాబోలు . '' లేదు లేదు ,పాడదు '' అనేసారు . 
చివరికి అందరు నచ్చచెప్పి నాతో ,పిల్లలు ,ఇంకో మేడం నిలబడి 
పాడేట్లు  సర్ది చెప్పారు . నిజంగా కొన్ని వివాదాలు మంచి జ్ఞాపకాలు తీసుకొని 
వస్తాయి అని నాకు తెలీదు . 

                                              ********
అంబేద్కర్ జయంతి రోజు పార్క్ లోని వేదిక దగ్గరకు వెళ్ళాము . 
సభ ప్రారంభం లో వేదిక మీదకు వెళ్లి ప్రార్ధన చేసేటపుడు ముందు వరుసలో 
ఉన్న పెద్ద వాళ్ళను చూసాను . ఒక పెద్దాయన చాలా బాగా అనిపించాడు . 
ఆయన కళ్ళ ద్దాలు కలుపుతూ ఒక గొలుసు కిందకి వేలాడుతూ ,
అందరు ఆయన దగ్గరికి వచ్చి నమస్కరిస్తూ ఉంటె చూస్తూ ఉన్నాను . 
దాదాపు ఒకటిన్నర గంటలు జరిగిన సభలో ఆయన మాటలు కోసం 
ఎదురు చూసాను . అంత పెద్దాయన ఏమి మాట్లాడుతాడు ! అని చిన్న 
క్యూరియాసిటీ . మాటల్లో చాలా స్థిరత్వం ఉంది . తాను నమ్మిన దాని 
మీద నడిచే వాళ్లకు మాత్రమె వచ్చే స్థిరత్వం . వర్గాల అంతరాల గూర్చి 
అవి సమయ వలసిన మార్గాల గూర్చి చెప్పినట్లు గుర్తు . 
ఆయన పేరు ,ఆయన గొప్పదనం అప్పుడు నాకు తెలీదు . 
కాళోజీ గారిని దగ్గర నుండి చూసాను . ఆయన భావాలను స్ప్రుశించాను ,
అని అనుకున్నప్పుడు ఇప్పుడు నాకు మనసులో ఏదో సంతోషంగా 
ఉంటుంది . ఆ ప్రార్ధన గీతం మీద కృతజ్ఞత గా ఉంటుంది . 

మనిషి గొప్పదనం అతని పేరులోనో ,అతని డబ్బులోనో ,అధికారం లోనో 
ఉండదు . అతను త్రికరణ శుద్ధి గా పాటించే విలవల్లో ఉంటుంది . 
జీవితం మనకు తెలీకుండా నే పరిచయం చేసే వాళ్ళ పరిచయం 
మనసు లోతుల్లో మిగిలిపోయే ముత్యం లాంటి విలువైన జ్ఞాపకం . 
అయ్యో ఆయన  కవి అని తెలిస్తే ,ఏదైనా మాట్లాడి ఉందును అనుకుంటూ 
ఉంటాను కాని ,కొంత జీవితం దాటి ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు 
అనిపిస్తూ ఉంటుంది ..... ఎంత గొప్ప వాళ్ళు కనపడినా ఏమి 
మాట్లాడలేము . మనసులో వీళ్ళు ఇలాగ ఉంటారన్న మాట అనుకోవడం 
తప్ప . ఎందుకంటె వాళ్ళ పరిచయం మనకు వాళ్ళ అక్షరాలుగా మాత్రమే !!
                                                @@@@@@@


Friday, 6 February 2015

ఇదొక లెక్కా (6)(అయిపొయింది )


( part 5 link ikkada )
కాళేశ్వరం నుండి హనుమకొండకు వచ్చేదారిలో బస్ ఆపేసి 
దిగి వెళ్ళమన్నారు . బాంబ్ బ్లాస్టింగ్ వలన రోడ్ పాడయ్యింది 
అని రోడ్ దిగి నడుచుకుంటూ వెళితే కొంత దూరం తరువాత 
బస్ లు దొరకచ్చు అని చెప్పారు . అప్పుడే ఏర్పడిన కాలిబాట 
లో కొంచం నలిగిన పచ్చిక మీద ముందు ఈయన , వెనుక నేను 
రెండేళ్ళ మాధురి ని ఎత్తుకొని , వెనుక అమ్మా నాన్న .... పాపం 
ఇంత జరుగుతుందని తెలిస్తే వాళ్ళను తీసుకొని వచ్చేదాన్ని కాదు . 
కాళేశ్వరం , గోదావరి చూసిన ఆనందం అంతా ఎటు పోయిందో !! 
రోడ్ మీద చెల్లా చెదురుగా  శవాలు , చూడకూడదు అనుకున్నా 
చూపుకి పక్కన ఎక్కడో తగులుతూ ..... కడుపు తిప్పేస్తుంది . 

రోడ్ మీద నుండి చూపు మరలించేటట్లు లీలగా ఏదో ముళ్ళ చెట్టు పై 
కదులుతూ ..... దగ్గర కు వచ్చేసరికి చూస్తె , ఒక పోలీస్ టోపీ 
తగులుకొని వేలాడుతూ ,మానవత్వం ఉరి తీసింది అని చెపుతున్నట్లు ..... 
ఎక్కడ రోడ్ ,ఎక్కడ కంప ..... అక్కడ నుండి ఒక మనిషి తల నుండి 
యెగిరి ఇంత దూరం వచ్చి పడింది అంటే ఎంత బ్లాస్టింగ్ జరిగి ఉండాలి . 
వంటిలో భయం తో కూడిన జలదరింపు ,ఇక రోడ్ మీద చూసే ధైర్యం 
లేదు . తల వంచుకొని ఆ టోపీ ని వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు 
వెళ్లాను . మెల్లిగా చేయి నొప్పి పుడుతుంది . సమస్య చిన్నదే అయినా 
ఎక్కువ కాలం మోస్తే తీవ్రం అనిపిస్తుంది . 
''ఏమండీ పాపను ఎత్తుకోండి '' ఇచ్చాను ఆయనకి . 
నిద్ర లోనే కళ్ళు తెరిచి మళ్ళా నాన్న స్పర్శకి భుజం మీద వాలి 
కునుకు లోకి జారింది . మెల్లిగా రోడ్ ఎక్కాము . 

అంతా సందడి సందడి గా ఉంది . మళ్ళా ఏదో లోతైన నిశ్శబ్దం ఉంది . 
వచ్చిన వెహికల్స్ అక్కదే ఆగి వెనుదిరుగుతున్నాయి . 
అదిగో హనుమకొండ వెళ్ళే బస్ . ప్రాణం లేచి వచ్చినట్లు ఉంది . 
''మావయ్య తొందరగా రండి '' ఒక్క ఉదుటున బస్ ఎక్కి బస్ 
ఆపారు ఈయన . అందరం ఎక్కి బస్ సీట్లలో సర్దుకొని కూర్చున్నాము . 
అందరు మౌనంగా ఆలోచన ల్లో  ఉన్నారు . నా కైతే ఏదో స్తబ్ధత . 
ఇప్పుడు ఈ తెలంగాణా నాకేమి నాకేమి ఆనందం కలిగించడం లేదు . 
కుండెడు నమ్మకం లో ఎవరో ఒక్క ఉప్పు రాయి వేసేసారు . 
ఎంత బాగా నమ్ముతానో ,అది వీగిపోయినపుడు అంతే బాధ పడుతాను . 
ఏదైనా సిన్సియర్ గా చేయడమే అలవాటు . అలసిన శరీరం 
నిద్రలోకి జారిపోయింది . హనుమకొండ శబ్దాలు లేపే వరకు వళ్ళు తెలీలేదు . 
మంచిది ,నిద్ర కూడా మనసు గాయానికి మందే . 

ఆటో లో ఇంటికి వస్తూ ఉంటె 
'' శశి పాపను తీసుకొని మీరు ఇంటికి వెళ్ళండి . 
నేను హోటల్ కి వెళ్లి టిఫిన్ తీసుకొని వస్తాను ''
చెప్పి దిగేశారు ఈయన . మంచిది ఇక ఒక 
గంటె టైం ఉంది ,అమ్మ వాళ్ళ ట్రైన్ కి . మళ్ళా 
కాజీపేట కు వెళ్లి ట్రైన్ ఎక్కాలి . 

ఇంటి ముందు ఆటో దిగుతుంటే అమ్మ మాధురి ని తీసుకొని 
ముద్దు పెట్టుకుంది . నిద్ర కళ్ళతోనే నవ్వింది బుజ్జి తల్లి 
అమ్మమ్మ ను గుర్తు పట్టి . నాన్న కూడా '' ఓయ్ తల్లి ''
పలకరించాడు దాన్ని . మరి ఇంకా కొంత సేపే కదా దానితో 
ఆడుకునేది . వాతావరణం కొంత తేలిక పడ్డా మనసు బరువు 
ఇంకా ఉంది . అసలు ఇక్కడ ఇంత దిస్తారబెంస్ ఉంది అనేది 
నా ఊహలో కూడా లేని విషయం . అమ్మా వాళ్ళు ఇంట్లోకి 
వెళితే ఇంటి ఓనర్ బయటకు వచ్చి నవ్వుతూ పలకరించింది . 
''అచ్చినార ,మస్తు దూరం ఉంది కదా ,పాలు ఉన్నయి 
తీసుకోండి . అట్ల పిండి కూడా ఉంది . కావల్నా ?''
గుండె లోతు గాయాన్ని ఈ గంధం లేపనం ఎలా మాన్పుతుంది . 
మాములుగా అయితే దోసె , పండు మిర్చి తొక్కు అంటే 
ఇష్టంగా తినేస్తాను . 
''వద్దు , ఈయన తెస్తాను అన్నారు '' ముభావంగా వెళుతున్న 
నన్ను చూసి ఆమె మొహం లో వేలాడుతున్న ఆశ్చర్యం . 
అందరం టిఫిన్ తింటూ ఉంటె ఇందాకటి సంఘటన మళ్ళా 
మాటల్లో దొర్లుతూ ...... 
''ఏమి చేస్తారు ?'' మానేసి వస్తారా అన్న ప్రశ్న అమ్మా , నాన్నల కళ్ళలో . 
మానేసి వెళ్ళ డమా !!! వెళ్లి ఏమి చేసేది ఇద్దరికీ ఉద్యోగం లేకుండా ..... 
బాంబ్ బ్లాస్టింగ్ కంటే పెద్దది అయిన జీవితం ఇంకా భయాన్ని కలిగిస్తూ , 
అవును నిరుద్యోగాన్ని ఎదురుకుంటూ జీవితం లాగడం కంటే 
ఈ బాంబ్ బ్లాస్టింగ్ పెద్ద లెక్క కాదు . మనుషుల కామెంట్స్ కంటే 
ఇవి బాధాకరమైనవి కాదు . అయినా టౌన్స్ లో ఇలాటివి జరగవు లే ,
అది అడివి కాబట్టి జరిగింది ..... నాన్న చెపుతున్న ధైర్యం కొంచెం 
మనసును కుదుట పరుస్తూ . 
ఇంక ఎలాగైనా ట్రాన్సఫర్ పెట్టుకొని వెళ్లిపోవాలి . అంత వరకు 
ఇక్కడ జీవితం ఈదగలం . కాదు కాదు ఈదాలి . సముద్రం లోకి 
దూకినాక నిర్ణయాలు తీసుకోవడం ఉండదు . కాళ్ళు చేతులు 
కదిలిస్తూ ప్రాణానికి క్షణాల ఆయువు కలుపుతూ ముందుకు పోవడమే .!!
జీవిత బ్లాస్టింగ్ ముందు , ''ఇదొక లెక్కా '' 

వెళుతున్న అమ్మా నాన్నలకి మాధురి చేత టాటా చెప్పించాను . 
ఇద్దరు మళ్ళీ మాధురి ని ఎత్తుకొని ముద్దులతో ముంచేశారు . 
అసలు కంటే వడ్డీ ముద్దు మరి !!
జాగ్రత్త ,ధైర్యం చెపుతూ వెళుతూ ఉంటె ఇద్దరి కళ్ళలో సన్నటి 
కన్నీటి పొర . యెంత ఎదిగినా మేము వాళ్లకు చిన్న బిడ్డలమే . 
''ఏమి కాదులే నాన్న '' నోరు తెరిచి ధైర్యం చెప్పాను . 
వెళుతున్న ఆటో చూస్తూ మెల్లిగా మాధురి ని ఎత్తుకొని 
లోపలి వెళ్లాను . 
''అసలు ఒకరిని ఒకరు ఎందుకు చంపుకుంటారు వీళ్ళు . 
ఏమో మరి నాకేమి తెలుసు !!! చంపెవాడికి కారణాలు 
ఉంటాయి ,చచ్చేవాడికి కూడా . ఎన్నో సిద్ధాంతాలు , రాద్ధాంతాలు 
మీద నిర్మింపబడిన హింస ఇది . మూలాలు బాగు చేయాలి 
అని ఎవరు అనుకోరు . ఎదుటి వారు తుపాకి చూపించినపుడు 
శాంతి కపోతాలు ఎగరేస్తూ కూర్చోరు . నా వాళ్ళు , నీ వాళ్ళు అని 
విడదీసుకుంటూ పోవడం లో ఏదో ఆనందం ఉన్నట్లుంది . 
ప్రతి దానికి కారణం ఉంటుంది . మనం ఎవరి వైపు ఉన్నాము 
అనే దాన్ని బట్టి మన మనసు తప్పు ఒప్పు ల తీర్పు ఇస్తూ 
ఉంటుంది '' 
''కారణం ఏదైనా కాని మనిషి ,మనిషి ని చంపుకోవడం 
నాగరికత మోకాళ్ళ పై తల ఉంచి బోరుమని ఏడవాల్సినంత
విషాదం '' 
నివాస్ హనుమకొండ లో మేము ఇంకో ఇంట్లోకి మారినపుడు 
పుట్టాడు . ఎనిమిది నెలల బాబుని తీసుకొని ఇక్కడకు 
వచ్చేస్తుంటే ఆ ఇంటి ఓనర్ కూతురు కి పెట్టినట్లు వడిబియ్యం 
పెట్టి ,బిడ్డని నన్ను కళ్ళ నిండా నీళ్ళతో సాగనంపిన సంగతి నేను మర్చిపోలేను . 

వీడు మొన్న హనుమకొండ కు కాలేజ్ పని మీద వెళితే కాకాజీ 
కాలనీ  కి వెళ్లి వాళ్ళను చూసి రారా అని చెప్పాను . ఎనిమిది నెలల 
బిడ్డగా ఆ వీధి చూసాడు . ఇప్పుడు తెలుస్తుందా ఆ వీధి గురించి . 
అయినా అమ్మ చెప్పింది కదా అని విజయ టాకీస్ నుండి ,ఆర్ . టీ. సి 
డిపో వరకు ప్రతీ సందు తిరిగాడు వాళ్ళ కోసం వీడు . ఫలితం లేకపోయినా 
బిడ్డ నా మాట విన్నాడు  కదా అనేది తృప్తి . 

''తెలంగాణ నా పుస్తకాల్లో దాచుకున్న నెమలీక '' అంతే .... 
ఇంక చెప్పేదేమీ లేదు .              (అయిపొయింది )  
                 @@@@@@@@@@@@@@@@ 




Monday, 26 January 2015

ఇదొక లెక్కా ? (5)

కాళేశ్వరం నుండి తిరుగు ప్రయాణం హనుమకొండ కి 
నేను ఈయన ,పాప మాతో అమ్మా నాన్న బస్ లో 
బయలుదేరాము . ఉన్నట్లుండి 'సడన్ బ్రేక్ '
( idoka lekkaa ? 4 part link )

అందరిని దిగమని పోలీస్ వాళ్ళు చెపుతున్నారు . 
''ఏమి అయి ఉంటుంది ?రాత్రికి మళ్ళా అమ్మా నాన్న కి 
రైల్ రిజర్వేషన్ ఉంది . ట్రైన్ మిస్ అవ్వకూడదు . 
సగం దారి కూడా వచ్చామో లేదో !!'' దిగులుగా 
అమ్మా వాళ్ళ వైపు చూస్తె వాళ్ళు కూడా కంగారుగా 
కనిపించారు . నాన్న విషయం కనుక్కుంటున్నారు . 
''బస్ లు ఇగ  నడ్వయి . అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది '' 
చెపుతున్నాడు పోలీస్ ఆయన , ఇదంతా మామూలే అన్నట్లు 
జనాలను రోడ్ కిందకి వెళ్ళమని సైగ చేసి వెనుక వచ్చే లారీ 
దగ్గరకు వెళ్ళాడు . 

''బాంబ్ ఏమిటి !!!'' క్షణం ఏమి అర్ధం కాలేదు . మా వారికి 
కూడా పరిస్థితి అర్ధం కాలేదు . కండక్టర్ వద్దకు వెళ్లి 
కనుక్కొని వచ్చి చెప్పారు . 
''అక్కడ బాంబ్ బ్లాస్ట్ అయ్యిందంట . రోడ్ మొత్తం పెద్ద గుంట 
పడిపోయింది . ఇక్కడ వెహికల్స్ అటు , అటువి ఇటు 
రాలేవు . ఇక బస్ వెళ్ళదు ''
అమ్మ నాన్న ల వైపు చూసాను . పాపం ఈ పది నిమిషాలకే 
నిలబడలేక ఎక్కడైనా కూర్చుంటే బాగుండును అని 
చుట్టూ చూస్తున్నారు . పిల్ల భుజం మీద నుండి లేచి కళ్ళు నులుముతుంటే 
చిచ్చు కొట్టాను . మళ్ళీ నిద్రలోకి జారుకుంది . 
''ఎప్పుడు జరిగింది ?'' అడిగాను . టైం  చెప్పాడు . 
దేవుడా !!!!!!! దానికి పది నిముషాల ముందే మేము కాళేశ్వరం వెళ్ళే 
బస్ దాటింది . అంటే పది నిముషాలు ఆలస్యం చేసి ఉంటె మేము కూడా .... 

''ఏమి కాదులే . వాళ్ళు మామూలు వాళ్ళని చంపరు. పోలీస్ లను మాత్రమె ''
ఓదార్పుగా అన్నాడు ఈయన . 
ఏమిటి పెద్ద పోలీస్ లను మాత్రమె ,అసలు ఈ చంపుకోవడాలు ఏమిటి!
అసలు ఇంత జరుగుతుందని తెలుసుంటే అమ్మా వాళ్ళని ఇంత దూరం 
తీసుకుని వచ్చేదాన్ని కాదు . ఎటూ కాకుండా ఇరుక్కొని పోయాము . 
ఇప్పుడు తిరిగి వెళ్ళడానికి బస్ పరిస్థితి ఏమిటి ?
''అందరికి ఏమైతే మనకు అలానే '' ఎదురు చూడటం తప్ప దారి 
లేదన్నట్లు చెప్పారు ఈయన . 

ఛా ఈ అడవి , ఈ కాళేశ్వరం , ఈ గుట్టలు , పిట్టల పాటలు నాకేమి 
నచ్చడం లేదు . పాల బుగ్గల పాపాయి లాంటి తెలంగాణా కింద 
ఎంతటి బడబాగ్ని ఉంది . అసంతృప్తి రగిలినపుడల్లా అది మృత్యువు 
పై సవారి చేస్తూ రక్తాన్నే చిమ్ముతూ ఉంటుంది . ఎవరి రక్తం అయితే 
ఏమిటి అందరు అమ్మ కన్న బిడ్డలే కదా !!!!

''ఇప్పుడేమిటి ? టికట్ డబ్బులు అయినా వాపస్ ఇస్తారేమో కనుక్కో ''
చెప్పాను . అమ్మా నాన్నలు నిలబడి ఉంటె నాకు బాధగా ఉంది . 
అయ్యో అనవసరంగా తీసుకొని వచ్చామే అని . నయం మాధురి 
అయినా నిద్రపోతూ ఉంది . లేసిందంటే నీళ్ళు ,ఆకలి అని ఏడిపిస్తుంది . 
మెల్లిగా అందరు రోడ్ దిగి రోడ్ కి కొంత దూరంగా ముళ్ళ కంపల మధ్య దారి చేసుకుంటూ 
నడక ప్రారంభించారు . ఒక్కో మాట చెవిలో పడుతూ ఉన్నాయి . 

''ఏడుగురు చనిపోయిన్రంట . ''
ఏడుగురా !!నాకు సన్నగా వణుకు . అసలు ఇలా చంపడం , రక్తం అవీ 
భలే భయం మాకు . కోటమ్మ కి కోళ్ళు బలి ఇచ్చే ద్వారం దగ్గర 
కూడా నడవనీరు పెద్ద వాళ్ళు . కోళ్ళు , మేకలు దారిలో అంతా 
బలి ఇస్తారు అని కన్పూరు జాతర కు ఎవరమూ వెళ్ళం అప్పట్లో . 
కుడుములు ఇంట్లో చేసి వెళ్ళే వాళ్ళతో ముత్యాలమ్మకి పంపిస్తాము . 
ఇప్పుడు ఈ దారిలో అన్ని శవాలు ,రక్తం చూడాల్నా ? నాకు 
భయం మెల్లిగా పాకుతూ వస్తుంది . వేళ్ళలో వణుకు . వద్దు వద్దు 
అటు చూడను . ఇప్పుడే పడిపోతనా ఏమిటి !!

'' ఇక్కడ ఇవన్నీ మామూలే '' నాన్న అమ్మతో చెపుతున్నాడు 
 ధైర్యం కోసం . ఎవరూ ఏమి మాట్లాడుకోవడం లేదు . అదొక 

రకమైన వాతావరణం , ఎవ్వరూ కోరుకోనిది . 

''శశి డబ్బులు రిటర్న్ ఇవ్వరంట . ఇక్కడ రోడ్ పక్కన దిగి ఆ కంప ల్లో 
నడిచి పొతే రెండు కిలోమీటర్లు తర్వాత రోడ్ ఎక్క వచ్చు . 
అక్కడ ఇప్పుడే వచ్చిన బస్ లు వెనక్కి వెళుతూ ఉంటాయంట . 
త్వరగా వెళితేనే అవైనా దొరుకుతాయి. ''చెప్పారు . 

మళ్ళీ ఇంత చార్జీలు చేసేదేముంది ,ముందు ఇక్కడ నుండి 
బయట పడాలి . నడిచేందుకు వీలుగా పాపని ఎత్తుకొని 
అందరం రోడ్ దిగే నడక ప్రారంభించాము . కాలి బాట 
ఏర్పడకపోయినా ముందు వాళ్ళ కాళ్ళ  కింద నలిగిన గడ్డి దారి 
చూపిస్తూ ఉంది . ఎలా అడుగులు వేస్తున్నానో నాకే తెలీదు . 
నా గుండె చప్పుడు నాకే వినిపిస్తూ ఉంది . మెల్లిగా పర్లాంగు 
దూరం లో ఉన్న రోడ్ వైపు చూసాను . తల క్రిందులుగా 
పడిపోయిన జీపు టైర్స్ పైన కనిపిస్తూ ఉన్నాయి . చుట్టూ 
శరీరాలు ఎలా అంటే అలా పడిపోయి ..... అబ్బ అదేమిటి 
ఎర్రని రక్తం మధ్యలో చేయి ,విరిగిపోయిందా !! నేను చూడలేను . 
చూపు తిప్పేసుకున్నాను . వాంతి  వచ్చేస్తే బాగుండును .  
అమ్మ నాన్న నడవలేక చిన్నగా నడుస్తున్నారు . 

''పోలీస్ లు అనుకోని బ్లాస్ట్ చేసిన్రంట . ఇద్దరే పోలీస్ లు సెక్యురిటీ కి 
అచ్చిన్రు . మిగిలినోల్లు బ్యాంక్ వొళ్ళు ''
వెనుక నుండి మాటలు వినిపించి గుండె ఇంకా వేగంగా కొట్టుకుంది . 
అంటే ఎవరు వస్తున్నారో చూసి చేస్తారా ?మరి సరిగా చూడొద్దా !!
పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పుడెలా ఏడుస్తారో , అవసరం లేని 
వాళ్ళను కూడా చంపేస్తే ,  అసలు నా మొహం చంపెదేమిటి ?
ఎలా ఆలోచిస్తున్నానో కూడా నాకే తెలీడం లేదు . భయం తో 
అడుగులు ముందుకు పడనీ విషయమే నాకు తెలుస్తుండేది . 
పాప లేచింది . 

''ఇటివ్వు మాధురిని , నువ్వు మొయ్య లేవు '' చెప్పాడు 
చేతులు చాస్తూ . 
''ఊహు నేను ఇవ్వను '' నా బుజం మీదే తల రోడ్ వైపుకు 
తిప్పకుండా చేయి అదిమి పెట్టాను . 
భద్ర కాళి గుడిలో సింహం బొమ్మను చూసే నా బిడ్డ వణికి పోయింది . 
ఇలాంటి నరమేధాలు అది చూడకూడదు . వాళ్ళు రేపటి వాళ్ళు . 
వాళ్లైనా ఈ హింస లకు దూరంగా గుండెల నిండా ప్రేమ నింపుకొని పెరగనీ . 
ఈ హింసలన్నీ  మాతోనే వెళ్లి పోవాలి . 

అసలు ఇన్ని చేస్తున్నారే , వీళ్ళ  వెనుకబాటు తనం కి కారణం 
అవిద్య అని గ్రహించలేకున్నారే !!!విద్య ప్రశ్నించడం నేర్పుతుంది . 
ప్రశ్న ఉన్న చోట ఎంత బలం అయినా నిలవదు . ఒక్క చదువుకున్న వాడు 
తన ఊరు నుండి ఐదుగురు చదువుకున్న వాళ్ళను తయారు చేస్తే 
ఇంత కంటే మంచి రాజ్యం వస్తుంది . చదవడం అంటే బట్టీ 
వేయడం కాదు . మానవత్వాన్ని , వివేకాన్ని పెంచే జ్ఞానం . 
ఇంకా తమ వనరుల్లోనే ఎంత స్వయం సమృద్ది సాదించగలం 
అనేది చూసుకోవాలి . రైతు బయటి వస్తువుల పైన ఎంత 
ఆధారపడితే అతను డబ్బు కొరతతో అంత పేదవాడు అయిపోతాడు . 

అదిగో ఆ కంచె ల పైన ఏమిటది వేలాడుతూ ....... దగ్గరకు 
వెళ్ళే కొద్ది కనిపించసాగింది . 
                                                             (ఇంకా ఉంది )


ఈ రిపబ్లిక్ డే నాడు ''ఒబామా '' '' నరేంద్ర మోది '' అమెరికా , ఇండియా ల 
స్నేహ వాతావరణాన్ని పెంచినందుకు నా వంతు గీత ...... చూడండి . 










Tuesday, 2 December 2014

ఇదొక లెక్కా ?(4)


( 1 ,2 ,3 parts link ikkada )
కాళేశ్వరం నుండి హనుమకొండ వెళ్ళే బస్ తిరుగు ప్రయాణం కోసం 
నేను ఈయన ,అమ్మ ,నాన్న ,పాపను ఎత్తుకొని ఎక్కాము . 
అమ్మా వాళ్ళు కొంత ముందు వెనుక సీట్స్ లో నేను ఈయన కూర్చొని ఉన్నాము . 
కిటికీ పక్కన నేనే కూర్చున్నాను . పాప కూడా మెల్లిగా తాతయ్య వాళ్ళను 
వదిలి నా వడిలోకి వచ్చేసింది . ఓపిక ఉన్నంత సేపు కిటికీ లో నుండి 
చూస్తూ చెట్టు నో పక్షి నో వచ్చినపుడల్లా నన్ను తట్టి చూపిస్తూ ,నవ్వుతూ 
ఉంది . ఆ చిన్న జుట్టే ఒక్క జడగా వేసాను .ముందు ఉండే వెంట్రుకలు గాలికి 
దాని మొహం మీద వాలుతూ ..... మెల్లిగా వేళ్ళతో వెనక్కి దువ్వుతూ 
ముద్దు మాటలు వింటూ ఉన్నాను . ఇంకా అవేమిటి అని ప్రశ్నించడం 
రాదు . చూసినదంతా మనకు కూడా తట్టి చూపిస్తుంది . పిల్లలకు వింత 
కానిది ఈ ప్రపంచం లో ఏమి ఉండదేమో !
మేము తప్ప అన్ని సీట్లలో సర్దుకున్న తెలంగాణా పల్లెతనం . కాళేశ్వరం 
చాలా లోపల ఉన్నట్లుంది ,ఇక్కడ కొంత కూడా పట్నం ఫాంట్స్ ,టీ షర్ట్స్ 
కనిపించడమే లేదు . ఆడవాళ్ళు శుబ్రంగా జడ వేసుకొని సంకలో చిన్న పిల్లలతోనో ,
పక్కన వేలు పట్టుకుని నడుస్తున్న పిల్లల తోనో ..... పిల్లలు కూడా 

నగ్నంగా నో ,అర్ధ నగ్నంగానో వంటి నిండా బట్టలు వేసుకున్నా అది 
గౌరవంగా ఉంది కాని ,డాబుసరిగా లేదు .పెద్దగా డబ్బు ఉన్న వాళ్ళు నాకు 
ఎక్కడా కనిపించలేదు . బహుశా అదంతా చిన్న పల్లెలున్న అడివి ప్రాంతం కాబోలు . 
మహా అయితే ఆడవాళ్ళ కాళ్ళకు గజ్జెలు , మెట్టెలు ,కొందరికి కమ్మలు ,బేసరి 
అంత కంటే విలువైన సొమ్ములు లేవు . చూస్తూ కూర్చున్నాను పల్లెను 
దగ్గరగా ఒక్కో సారి చెమట వాసన పల్లె ను స్పురింప చేస్తుంది . పల్లె 
ఎవరికైనా తల్లే కాకుంటే మరీ సౌకర్యాలు లేకుంటే బ్రతుకలేము . మినిమం 
అవసరాలు సరిపడా సౌకర్యం ఉంటె హాయిగానే బ్రతికెయ్యొచ్చు . ఇంత 
చిన్న పిల్లలకు కూడా ''చాయ్ తాగు ''అని త్రాగించేస్తారు . పిల్లలు చాయ్ 
తాగటం నాకు విచిత్రం . హార్లిక్స్ బూస్ట్ కదా త్రాగాలి . చాలా కొద్ది మంది 
బస్ ఆగినప్పుడల్లా ఎక్కుతోనో ,దిగుతూనో ''దిగుండ్రి ''అనే ఆదలింపులు . 
బహుశా వీళ్ళ స్థితి కి కారణం అవిద్య . విద్య ఎన్నో అద్భుతాలు చేస్తుంది . 
కాని ప్రభుత్వాలు ఎందుకో దాన్ని పెట్టుబడిగా కాక ,ఖర్చు గా లెక్క 
వేసుకొని స్కూల్స్ మూసేస్తూ ఉంటారు . ఇక్కడ కొంత మంది కొలీగ్స్ 
దగ్గర విన్నాను ''వీళ్ళకు ఎందుకు చదువులు ,అందరు గొప్పోళ్ళు 
అయితే ఇంకేంది ''(అంటే పదాలు గుర్తు లేవు కాని ఇలాంటి అభిప్రాయం 
కొంత మంది దగ్గర చూసాను . ఇది మిగతా ప్రాంతాలలో కూడా కొంత ఉండవచ్చు . 
ఇది మనిషి అహానికి సంబంధించిన ఆలోచనే కాని ప్రాంతీయం కాదు )
ఆలోచనల్లోనే కళ్ళు మూతలు పడిపోతున్నాయి . ఉదయం నుండి 
ప్రయాణం అలసట.  కిటికీ లోకనపడుతున్న అడవి అందాలు వైపు 
చూపు వెళ్ళటం లేదు . పాప ఎప్పుడో నిద్రలోకి జారిపోయింది . 
తల ముందు సీట్ కి తగులుతుందేమో అని వడిలో అడ్డంగా పడుకో బెట్టుకొని 
దాని చెంప పొట్ట కు ఆనించుకున్నాను.  కాళ్ళు ఈయన వడిలో 
వేలాడుతుంటే మెల్లిగా చేతులతో సర్ది ఈయన చేతులు పాప 
కాళ్ళకు అడ్డంగా పెట్టుకున్నాడు ,పాప నిద్రకు ఇబ్బంది లేకుండా . 
నేను పాప ఇద్దరం మెల్లిగా నిద్రలోకి జారిపోయాము . కిటికీ 
లో నుండి వీచే చల్ల గాలి ఇద్దరికీ జోల పాడుతూ . 

ఉన్నట్లుండి 'సడన్ బ్రేక్ '. ఉలిక్కిపడి ముందు సీట్ కి పాప తల 
తగల పోతుంటే చేయి తల పైన అడ్డంగా పెట్టాను . సీట్ కి నా 
వెళ్ళు తగిలి అబ్బ అన్నాను . ఎందుకు ఆగింది బస్ మధ్యలో . 
కొంత మంది లేచి నిలబడి ముందుకు తొంగి చూస్తున్నారు . 
డ్రైవర్ కనపడలేదు . ఈయన ఆందోళనగా లేచి నిలబడ్డాడు  . 
నాన్న కి ఏమి అర్ధం అయినట్లు లేదు . కింద నిలబడిన పోలీస్ 
డ్రైవర్ కి ఏదో చెపుతున్నాడు . ''అందరు దిగుండ్రి ''
''ఏమైతాంది '' ''ఏమో ఎర్క లేదు ''
అందరు దిగుతూ ఉంటె బస్ అద్దాల్లో నుండి దూరంగా పోలీస్ లు . 
వాహనాలు వెళ్ళకుండా రోడ్ మీద అడ్డంగా తాడు కట్టి ఉన్నారు . 
అందరం దిగాము . అమ్మా నాన్నలు కూడా కంగారుగా ఉన్నారు . 
ఇప్పటికే మధ్యాహ్నం అయింది . మేము ఇంకా చాలా దూరం 
ప్రయాణం చేయాలి . రాత్రికి వాళ్లకి తిరుగు ప్రయాణం రిజర్వేషన్ . 
పోతే పోనీ అనుకోలేము . 
అసలు బస్ కేమైనా అయిందా !
''ఇంకో బస్ వస్తుందా ?''
''ఇంకోటి గాదు ఇంకైతే బస్ నడ్వయి ''
ఉండవా ?ఎందుకు ?ఎవరు ఏమి సమాధానం చెప్పడం లేదు . 
గుంపులుగా చేరి మాట్లాడుకుంటున్నారు . 
ఇంటికి ఎలా వెళ్ళేది ?అసలు ఏమి జరుగుంటుంది ?
                                                           (ఇంకా ఉంది )

Thursday, 20 November 2014

ఇదొక లెక్కా ?(3)

(part 1, 2 link ikkada )
బస్ వెళుతూ ఉంటె కాళేశ్వరం ఇంకా ఎంత దూరం ఉందొ 
అనుకుంటూ దేవుడు కిటికీ లో నా కోసం ఇచ్చిన ప్రకృతి 
ఫోటో ఆల్బం చూస్తూ కూర్చున్నాను . ఉన్నట్లుండి ఒక నల్ల మబ్బు 
 సూర్యుడిని కప్పుతూనో ,దూరంగా తెలిపోతూనో ఎక్కువగా చెట్లు 
మధ్యలో చిన్న కొండ గుట్టలు .... ఇక్కడ అడవిలో జంతువులు 
ఉంటాయా ,ఉండవా ..... ఎక్కడో ఒక్క ఊరు . దానిని ఊరు 
అని కూడా అనలేము . ఒక ఇరవై ఇళ్ళు అంతే . ముందుకు చూసాను . 
నాన్న వడిలో నుండి జారి పాప పరిగెత్తుతూ ఉంది . వాళ్ళు 
నవ్వుకుంటూ పట్టుకుంటున్నారు . నేను మా వారి వంక చూసేసరికి 
ఆయనే కూతురుని గొప్పగా చూసుకుంటూ ,నవ్వుకుంటూ ఇకీ 
నా వంక చూసారు . దొంగ మొహం అమ్మమ్మ దగ్గర ఉండిపోయింది . 
కనీసం అమ్మ దగ్గర కు వెళతాను అని ఏడవడం కూడా లేదు . 
వాళ్ళు నెల్లూరు కి వెళ్ళనీ చెపుతాను . 

అదిగో ఈ ఊరిలో ఒక చిన్న ప్రభుత్వ బడి . హమ్మయ్య చూస్తే 
సంతోషం వేసింది . ఇక్కడ కూడా బడు లు ఉన్నాయి పర్వాలేదు . 
నేను కాని సి .ఎమ్ అయితే (ఇది కొంచెం ఎక్కువే కాని ,చిన్న లక్ష్యం 
నేరం అని కలాం గారు చెప్పారు కదా అందుకు ) ప్రతి ఊరికి ఒక 
స్కూల్ పెట్టి అవన్నీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ గా మార్చి శాటిలైట్ 
తో అనుసంధానం చేసేస్తాను . పెద్ద స్క్రీన్ విడియో కాన్ఫెరెన్స్ ల కోసం ,
ఇంకా ప్రతి దగ్గర నుండి ప్రతి సంస్థకు లింక్  ఉండేటట్లు ,అన్నీ సోలార్ తో 
పనిచేసేట్లు .......... ఆ ఊరి పిల్లలనే ఇద్దరినీ నిర్వహించే జాబ్ 
ఇచ్చేస్తాను . 
అసలు పల్లెటూరి లో ప్రభుత్వ బడి ఎంత స్ట్రాంగ్ గా ఎన్ని వసతులతో 
ఉంటె ప్రభుత్వం అంత చక్కగా పాలించగలదు . 
నిజమేనా ? మరి ప్రభుత్వ బడి అంటే పల్లెటూళ్ళలో ఎంత 
ఉపయోగం తెలుసా ?తుఫాన్ షెల్టర్ అదే ,చదువుల గుడి అదే ,
పోలియో టీకాలు అక్కడే ,ఎన్నికల బూత్  లు అక్కడే ,
రచ్చబండలు అక్కడే , పిల్లల ప్లే గ్రౌండ్ అదే ,కొన్ని సార్లు 
న్యూస్ పేపర్స్ దొరికే గ్రంథాలయము ,ఇంకా చదువు రాని 
వాళ్ళు ఉత్తరాలు వ్రాయించుకునే దక్కడే ,ముహూర్తాలు రొయ్యల 
చెరువు కోసం పెట్టేది అక్కడే ,గ్రామ సభలు అక్కడే ,
కష్ట సుఖాలు  అక్కడే ,ధాన్యం ఆరపోసుకుంది అక్కడే ,ఒక్కోసారి 
బర్రెలను కట్టేది అక్కడే ..... ఇంకా సెలవల్లో పేకాట రాయుళ్ళ వేసవి విడిది . 

ఇలాంటి స్కూల్స్ ని ఇంకా పెంచుకుంటూ ఉంటె అవి ప్రభుత్వానికి 
సామంమత రాజుల కోటల్లాగా ఉపయోగపడుతాయి కాని ,
రేషనలైజేషన్ పేరుతో మూసేస్తే ప్రభుత్వానికి బలం తగ్గినట్లే . 
అసలు విద్య మీద పెట్టేది ఎంత పెంచితే దేశ అభివృద్ది సూచిక అంత
పెరిగినట్లు . 

ఆలోచనల్లోనే కాళేశ్వరం వచ్చేసింది . బస్ ఆగే స్థలానికి దగ్గర లోనే 
గుడి . పెద్ద పురాతనంగా లేదు . కొత్తగా కట్టినట్లే ఉంది . 
మరి యముడు స్థాపించాడు అన్నారు . గుడి చూస్తె అలా లేదు . 
గుడిలోకి అడుగు పెట్టగానే మాధురి పరుగో పరుగు . ఇంత సేపు 
దానికి కాళ్ళు కట్టేసినట్లు ఉన్నాయి పాపం . అందరం నవ్వుకొని 
ఆడుకోనీలే అని వదిలేసాము . ప్రాంగణం లో చిన్న నాలుగు స్తంభాలతో 
ఒక మండపం . దాని పైకప్పు మన నడుములు దాక వస్తుంది . 
ఏమిటబ్బా ఇది అనుకుంటూ వంగి చూసాను . ''యమ కోణం ''
అని వ్రాసి ఉంది. వీళ్ళు అందరు నా వైపు చూస్తున్నారు . ఇలాంటి 
సత్య శోధనలు నాకు భలే ఇంట్రెస్ట్ . అక్కడ బాణం గుర్తు ఉంది . 
ఓహో చక్కగా వంగి అవతలకి దూరాను . ఏముంది ఇక్కడ ?
ఏమి లేదే !అక్కడ ఇంకో బాణం మళ్ళీ వంగి మండపం నుండి 
బయటకు వచ్చాను . మొత్తానికి మండపం లో ప్లస్ లాగా దారిలో 
వెళ్లాను . ఏమిటో ఇది అర్ధం కాలేదు . 

లోపలి వెళ్ళాము . పెద్దగా జనాలు లేరు . ఇలాగ ఉంటె నాకు చాలా 
ఇష్టం . తోసుకుంటూ ఉంటె అసలు ఇష్టం ఉండదు . లోపలికి 
వెళ్లి లింగం వైపు చూసి నమస్కరిస్తూ ఆశ్చర్య పోయాము . 
ఒకే పానపట్టం పై రెండు లింగాలు . మళ్ళా ఒక లింగం మీద 
రెండు రంద్రాలు . 
''ఏమిటి స్వామీ ఇది ?''అడిగింది అమ్మ . హేమ చేత 
నమస్కారం పెట్టించింది . ఎక్కడకు వెళ్ళినా ఆ స్థలం 
గూర్చి అడగడం శ్రద్ధగా వినడం ,మళ్ళీ పిల్లలకు అర్ధం 
అయ్యేట్లు చెప్పడం మా అమ్మా నాన్నలకు అలవాటు . 
నాకు కొద్దిగా ఇలా అడగడం అలవాటు అయింది . 


''అమ్మా ఇది యముడు చేత స్థాపితం ,ఇది కాళేశ్వరుడు
ఇది ముక్తేశ్వరుడు. ''
''మరి ఒక లింగం మీద రెండు రంద్రాలు ఏమిటి ?''
''అవి నాసికా రంద్రాలు . శివుడు మీద పడిన అభిషేక జలం 
ఈ రంద్రాల గుండా వెళ్లి గోదావరిలో కలుస్తుంది ''

బాప్రే నిజమా !అందరం ఆశ్చర్య పోయి మళ్ళా భక్తిగా 
నమస్కరించుకున్నాము . హేమా మాత్రం పెట్టను అని మొండికేసి 
ఆటలో మునిగి పోయింది పక్కన ఉండే ఉడుతను చూస్తూ .   

''స్వామీ మరి బయట ఆ పొట్టి మండపం ఏమిటి ?''అడిగాను 
ఆత్రుతగా . 
''అది యమ కోణం . ఆ బాణం గుర్తులలో అందులో తిరిగితే 
యమ బాధలు ఉండవు ''అని చెప్పారు . 
గ్రేట్ . ఇంత చిన్నగా తిరిగితే యమ బాధలు ఉండవని తెలిస్తే 
ఎవరు మాత్రం తిరగకుండా ఉంటారు . తిరుగుదామని బయటకు వెళుతూ 
ప్రహరి గోడ పక్కనుండి చూసాను . కనుచూపు ఆనేంత 
దూరం లో గోదావరి నది .ఆకాశం నుండి బ్లూ రిబ్బన్ వేలాడదీసినట్లు ,
మరి లింగం పై పడిన అభిషేక జలం 
అంత దూరం వెళ్లి కలుస్తుందా !ఏమి టెక్నాలజీ !!
బహుశా అంతకు ముందు గోదావరి గుడికి ఇంకా దగ్గరలో 
ప్రవహించేదేమో !

అందరం మళ్ళీ యమ కోణం దగ్గరకు వెళ్లి అందులో నుండి 
దూరి ప్రదక్షిణం చేసాము . 
''హేమా నువ్వు వెళ్ళు ''అని వదిలాను . ఎదురుగా వెళ్ళు 
అంటే పక్కకు వెళుతుంది ,పక్కకు అంటే ఎదురుగా ,
కోప్పడదాము అంటే చప్పట్లు కొట్టి పక పక నవ్వేస్తుంది . 
దాని చేత సక్రమంగా ప్రదిక్షణం చేయించే యమ బాధ పడి 
హమ్మయ్య ఇంకా ఎవరికీ యమ బాధలు ఉండవు అని 
ఆనంద పది బయటకు వచ్చాము . ప్రహరి ప్రక్కనే 
సరస్వతి దేవి గుడి అమ్మవారు చక్కగా పసుపు పూసి 
అలంకరించుకొని వీణ పట్టుకొని నిజంగా అమ్మవారే ఎదురుగా 
కూర్చున్నంత కళగా ఉన్నారు . 
ప్రశాంతంగా మండపం లో కూర్చొని తినేసరికి బస్ శబ్దం . 
నిజానికి ప్రయాణమే ఎక్కువగా ఉంది కాని గుడిలో గడిపింది 
అరగంటే . అయితేనేం ఎంత ప్రశాంతంగా ఉంది . ఈ ఊరు ,
మనుషులు ,దేవుళ్ళు అన్నీ ఎంత ప్రశాంతంగా ..... ఎందుకో 
నెల్లూరు వాళ్ళు ఇక్కడకి పెద్దగా రారు . ఇక్కడ కూతుర్నీ 
నెల్లూరు  లో కోడలుగా చూడలేదు , అక్కడ  కూతురిని 
ఇక్కడ కోడలుగా చూడలేదు . ఒక్క సారి గుడి వైపు 
హాయిగా చూసి తిరుగు బస్ ఎక్కేసాము . కానీ ఈ 
ప్రశాంతత వెనుక రాబోయే కల్లోలం నాకు తెలీదు . 
                                               (ఇంకా ఉంది )

Tuesday, 18 November 2014

ఇదొక లెక్కా ? (2)

(part 1 link )
ఉదయాన్నే లేచి ఉప్మా ,పులిహార చేసేసి పాపను రెడీ 
చేసేసాను . రెడీ చేసినంత సేపు నువ్వు ఏమైనా 
చేసుకో, అని పాప తూగుతూనే ఉంది . కాళేశ్వరానికి
గంటకో బస్ ఉంది అని చెప్పారు . అయినా తొందరగా 
వచ్చెయ్యాలి అమ్మా నాన్న రాత్రి ట్రైన్ కి నెల్లూరు కు తిరిగి 
వెళ్లిపోవాలి . అబ్బా వెళ్లి పోతారా ! మనసు కొంచెం బాధగా 
మూలిగింది . వచ్చినట్లు లేదు వెళ్ళినట్లు లేదు . నాన్న 
పాపను ముద్దు చేస్తూ కళ్ళు తెరవమని బ్రతిమిలాడుతూ ఉన్నాడు . 
''మాధురి కళ్ళు తెరువమ్మా '' ఇదేమో మబ్బులోనుండి చంద్రుడు 
తొంగి చూసినట్లు కొంచెం తెరవడం ,గబుక్కున మూయడం ,
పక పకనవ్వడం . ఈయన తాళం బుర్ర చేతిలోకి తీసుకున్నాడు . 
అందరం బయటకు వచ్చేసాము .   

బయట ఇంటి ఓనర్ భార్య ముగ్గు వేస్తూ ఉంది . మామూలుగా 
లేవదు . మేము ఎక్కడకో వెళుతున్నాము కదా అని ముగ్గు వేస్తూ 
ఉంది . నాకు ఇక్కడ ఈ పద్ద్దతి భలే నచ్చింది . పక్క వాళ్లకు 
అవసరమేమో అనిపిస్తే వాళ్ళకై వాళ్ళే వచ్చి సహాయం కావాల్నా ?
అని అడుగుతారు . పాపను చూసి ''మాధురి ''అని హెచ్చరించు కుంది . 
ఇదేమో లేస్తే కదా !మెల్లిగా బుగ్గ పట్టుకొని లేపాను ,తన వైపు 
తిప్పి చూపిస్తూ . ''పోనీయ్యి పాపం మస్తు నిద్ర లున్నట్లుంది ''
వారించింది . 

''పాలు మా ప్రిజ్ లో పెట్టుకొండ్రి . మళ్ళయితే ఈమె పరేషాన్ చేస్తాదేమో ''
''ఏమి లేవు లెండి . వచ్చేటపుడు పేకెట్ తెస్తాను చెప్పాను ''పాపను 
భుజం మీద సర్దుకుంటూ . దానికి కోపం విసుగు వచ్చేసి 
మూతి ముడిచి ''కుయి ''అనింది మొదలుపెడతాను అని సిగ్నల్ 
ఇచ్చి . మళ్ళా వీపు మీద తట్టాను . ప్రిజ్ ,టి . వి లే కాదు 
కాట్స్ కూడా లక్సరీలు అనుకునే రోజులు . ఎప్పుడైనా 
అవసరం వస్తే తనే సహాయం చేస్తుంది . నేను మొహమాట పడుతానేమో 
అని అడుగుతూ ఉంటుంది . ఎంత సహాయం చేస్తున్నారు అంటే .... 
''ఏమైతది పాలు పెట్టుకుంటే మా వాళ్లకు చదువైతే చెప్పుండ్రి చాలు ''
అంటుంది . 
''కాళేశ్వరం మస్తు దూరం బిడ్డకు పెయ్యి నొచ్చుతాదేమో ,ఈడే  ఉంచరాదా ''
బాబోయ్ నిజంగా చాలా దూరమా !అనవసరంగా పెట్టుకున్నమా ప్రయాణం . 
కాని నాన్నకి అమ్మకి పాపతో గడపాలని ఉంది . 
''వద్దు లెండి తీసుకేళతాము ''చెప్పాను . 

తాళం వేస్తున్న మా వారిని చూసి చెప్పింది . 
''అదో ఎదురింటి వాళ్లకి ట్యూషన్  కావాలంట . అడగమన్నారు''
ఎదురిల్లు అంటే మధ్యలో కారు పోయేంత చిన్న రోడ్ అడ్డం అంతే . 
అక్కడ సేట్స్ ఫ్యామిలీ . ఉమ్మడి కుటుంభం పెద్ద ఇల్లు . చాలా 
మంది పిల్లలు ఉంటారు . కాకుంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్లి చెప్పాలి . 
''లేదండి . అలాగా ఇంటికి వెళ్లి చెప్పను ''మెల్లిగా చెప్పారు ఈయన .  
పిల్లలే గురువు దగ్గరకి రావాలి చదువుకోను, అని మాత్రమె మాకు 
తెలుసు . అదే ఒక గురువుకు గౌరవం . కాని ఇలాగ గంటల 
లెక్కన ట్యూషన్ చెపుతారని , ఓన్లీ మాథ్స్ అంటే డిమాండ్ అని 
తరువాత తెలుసుకొని ఆశ్చర్య పోయాము . ఏమో ఎప్పుడూ 
నిలబడి నీళ్ళు తాగే పద్దతే మాది ,పరిగెత్తి పాలు త్రాగాలి అనుకోము . 

పాప చేత నిద్రలోనే టాటా చెప్పించి బస్ స్టాండ్ కి వెళ్ళాము .
బస్ ఎక్కిన తరువాత పాప అమ్మా నాన్న చేతిలోకి వెళ్ళిపోయింది . 
మేము ఇద్దరం వెనుక సీట్ . అందులో నేను కిటికీ పక్కన కూర్చున్నాను . 
ఇంకొక సీట్ పక్కన ఖాళీ . కండక్టర్ టికట్ రేట్ చెప్పగానే మా వారి 
వంక చూసి కళ్ళు ఎగరేసాను ఆశ్చర్యంగా అంతనా !అని . 
కాని.....  ఏమి చేద్దాము అన్నట్లు తల ఊపారు . భావాల మార్పిడి కి 
కొన్ని సార్లు మాటలు అవసరం లేదు . ముఖ్యంగా బార్యా భర్తలకు . 

బస్ కదిలి పొలిమేరలు దాటేదాకా కొద్దిగా జనాలు కనిపిస్తూ ఉన్నారు 
బయట . పోను పోను ఎక్కడో ఒక్క గ్రామం . ఎక్కే  వాళ్ళు దిగే వాళ్ళు . 
కొన్ని నెలలుగా చూసే వాళ్ళే అయినా ఇక్కడ పల్లె వాళ్లకి, మేము 
చూసిన పట్నం వాళ్లకి కొంత తేడా !పెద్ద వాళ్ళంతా అవే పంచె లు 
కడతారు కాని పిల్లలలో చాలా మార్పు పల్లెకి ,పట్నానికి . 
కాని ఎంత చదువుకున్న వారైనా వాళ్ళు పల్లె నుండి వచ్చిన 
వారైతే మనసులో బెరుకు మనకు తెలిసిపోతూ ఉంటుంది . 
పెద్దగా ఎవరికీ అహం ఉన్నట్లు అనిపించదు . తప్పకుండా 
పలకరిస్తారు . మా వైపు మనసులో బెరుకు ఉన్నా అప్పటికి అపుడు 
అవసరమైతే కొంత పులి ముసుగు వేసేస్తారు . ఇక్కడ అదింకా 
అలవాటు లేదు లాగుంది . ముక్కు పుడకలు ,నేత చీరలు , 
ఇంకా కాళ్ళకు మెట్టెలు దిగుతూ ఎక్కుతూ ,పల్లె దర్శనం 
దగ్గర నుండి పరిశీలిస్తూ నేను , మెట్టెలు చూసి వాళ్లకు పెళ్లి 
ఎన్ని  ఉంటుందో ఊహిస్తూ ఉన్నాను . మెట్టెలు అరిగి కొత్త మెట్టెలు 
తీసుకోవాలి అంటే ఇక్కడి వాళ్ళు చాలా పెద్దవి తీసుకుంటారు . 
ఎంత పెద్దవి అంటే ..... పెళ్లి అయి పదేళ్ళు అయి ఉంటె కాలి వేళ్ళకు 
చిన్న పురి కొస అంత లావు ఉంటాయి . ఇక పాతిక, ముప్పై 
ఏళ్ళు పెళ్లి అయి దాటి ఉంటె ఇంక చెప్పలేము .... కొబ్బరి తాడు 
అంత లావున ,బాబోయ్ నిజంగా ఎలా మోస్తారో వీళ్ళు . 
చదువుకున్న వాళ్ళు కూడా సంప్రదాయాలు వదులుకోవడానికి 
ఇష్టమే పడరు . మా కొలీగ్ ఎడమ చేతికి వాచ్ వేసుకొని కూడా 
దానికి మళ్ళా మట్టి గాజులు వేసుకుంటుంది . ఎందుకు అంటే 
మా అమ్మ అరుస్తుంది వేసుకోక పోతే అంటుంది . చూస్తూ 
ఉన్నాను . పంచెలు , తల పాగాలు ,మాసిన బట్టలు 
పిల్లను ఎత్తుకున్న చేతులు ,ఒక పక్క రాడ్ ను పట్టుకొని 
నిల దోక్కుకుంటూ ,ఇంకో పక్క బిడ్డను హత్తుకుంటూ మట్టి గాజుల 
చేతులు ,వాళ్ళ కూరగాయల బుట్టలు .... ఉల్లిగడ్డ దానికి 
పచ్చటి మొక్కలు ,గంగ బైలాకు ఇక్కడే చూసాను నేను . 
ఉల్లి గడ్డలతో కూరేట్లా చేస్తారో !బహుశా సాంబారు లో 
వేస్తారేమో . వాళ్ళను అటూ ఇటూ తోస్తూ ''జరంత జరుగుండ్రి ''
చిన్నగా కసుర్లు . ఎక్కే కాళ్ళు వేగంగా ,దిగే కాళ్ళు సాలోచనగా ,
మధ్యలో అక్కడక్కడ లంబాడి వాళ్ళు ,వాళ్ళ సీతాపలం గోతాలు . 
వీళ్ళకు కూడా గాజులు వేసుకోవడం లో పెళ్లి అయిన వాళ్లకి , 
కాని వాళ్లకి ఏదో తేడా ఉంది . గుర్తు లేదు . 
మా నాన్న కొందామా ?అన్నట్లు తొంగి చూసాడు . 
వద్దు అని అడ్డంగా తల ఊపాను . ఇక్కడ ఒక్కటో ,రెండో 
లేదా అరడజన్ విడిగా అమ్మరు . బస్తా కొనాల్సిందే . పెద్ద 

రేటు కూడా ఉండదు . పదుల్లొనె . అసలు పిల్లలు అయినా సరే 
ఒక్కసారి ఐదు పండ్లు ప్లేట్ లో పెట్టుకొని తినేస్తారు . అలా తినడం 
లో భలే మజా పొందుతూ ........... మాకు ఒకటి తింటే ,
అమ్మో జలుబు చేస్తుంది అనుకుంటాము . 

పోయే కొద్దీ ఊర్లు తక్కువ ,అడివి ఎక్కువ . ఎత్తుగా పెరిగిన టేకు ,మద్ది చెట్లు ,
ఇంకేవో .... గబుక్కున ఒక దగ్గర నాలుగు చినుకులు ,చెట్లకు 
చక్కగా లాల పోసేసి ....... మళ్ళా లేత ఎండ ఆకులపై నిలబడిన 
చినుకులను ముద్దాడి ఇంద్రధనుసులు సిగ్గుతో వచ్చేస్తూ .... 
ఇద్దో ఇలాంటి వేల కిటికీ పక్క సీట్ ఇవ్వు దేవుడా ఇంకేమి వద్దు 
అనుకుంటాను . అక్కడో పేరు తెలీని పిట్ట జుయ్య్ అని ఎగిరింది . 
పిట్టలు , చెట్లు మనిషిలోని పల్లెతనం ...... బాగుంది ప్రయాణం . 
రాకుండా ఉంటె ఇదంతా మిస్ అయ్యుండే దాన్ని . ఇంకా చాలా దూరం 
ప్రయాణం ఉంది . ముందేమీ జరుగుతుందో మనిషి ఊహించగలడా !

                                                            (ఇంకా ఉంది )

Thursday, 13 November 2014

ఇదొక లెక్కా ?(1)

''అమ్మా కొత్త పోస్ట్ లు ఏమి వేయలేదా ?'' అత్తగారింట్లో 
ఉన్న బంగారు తల్లి హేమ అడిగింది . అత్తగారింట్లో పువ్వుల్లో 
ఉంచుకొని చూసుకున్నా ఆడపిల్లకు కాసింత అమ్మ పై 
గాలి మళ్ళు తూనే ఉంటుంది . తన బాధ్యతా  తాను చూసుకుంటూనే 
ఉంటుంది . ఒక రకంగా మన ఆడ పిల్లలను  ఇలా ఉండటం 
చూసి ముచ్చట పడటం ఆడ పిల్ల ఉన్న ప్రతి ఇంట్లో అనుభవమే !
ఇప్పుడేమి వ్రాయాలి ?తన చిన్నప్పటి అందెల  చప్పుళ్ళా,
పెరిగిన తరువాతి నవ్వుల ముచ్చట్లా ?ఆడ పిల్లల తల్లి తండ్రుల 
గుండెను తడితే ప్రతి కణం ఏదో ఒక ముచ్చట చెపుతుంది .... తమకు పుట్టినా
''తల్లి ''అని తమ చేత పిలిపించుకున్న కూతురు గురించి . 
చిన్నప్పుడు తనకే తెలీని(గుర్తు లేని ) ఒక సంగతి వ్రాస్తాను . తన పిల్లలకు 
చెప్పుకుంటుంది వాస్తవ ప్రపంచపు ఆనవాళ్ల పరిచయం లో ...... 


పడుకున్నానే కాని మనసులో పొంగుతున్న ఆనందం తో నిద్ర రావడం లేదు . 
పక్కకి చూసాను . ఈయన మెల్లిగా నిద్రలోకి జారుకుంటూ ఉన్నారు . 
హేమ మాధురి సాయంత్రం అన్నం తినగానే నిద్ర పోయింది . అసలు ఇక్కడ 
పొద్దే ఎక్కువ ఉండదు . ఉదయం చాలా సేపుకు గాని తెల్లవారదు . 
సంతోషం పంచుకుందాము అంటే ఈ వేళ లో ఎవరు దొరుకుతారు ?
అమ్మ ,నాన్న రేపుదయం వస్తున్నారు ఇక్కడికీ అంటే ఎలా ఉంది 
అసలు ..... గాల్లో ఈక తేలినట్లు మనసు తేలిపోతుంది . ఆనందం లో 
మునకలు వేసుకో అని నిద్ర కూడా దగ్గరకు రాకుండా చోద్యం చూస్తూ 
ఉంది . మనసు మెల్లిగా పాత జ్ఞాపకాల వైపు ఊగుతూ ఉంది . 

ఎలా వచ్చాము కొన్ని నెలలు ముందు నెల్లూరు నుండి హనుమకొండకి నా 
ఉద్యోగం కోసం , కేవలం దేవుడమ్మ జ్యోస్యం చూసి ''మీరు ఎక్కడికి 
పోయినా ధర్మం పలుకుతుంది . మీకు ఎక్కడకు పోయినా అన్నం ముద్ద 
దొరుకుతుంది ''అని చెప్పిన రెండే మాటలు భరోసాగా ఉంచుకొని ,
నేను ఈయన ఇన్ని వందల కిలో మీటర్లు అయిన వాళ్ళు అందరికి 
దూరంగా మనిషిలోని మంచితనాన్ని నమ్ముకొని వచ్చేసాము . 
వెనుక ఆస్తులు కూర్చొని తింటే కరిగిపోవా !ఇద్దరికీ ఉద్యోగాలు లేవు . 
ఎవరో ఒకరు తెడ్డు వేస్తేనే కదా నావ నడిచేది . ఆడ మగ అహాల ను 
దగ్గరకు రానియ్యని మా మధ్య ప్రేమను నమ్ముకొని ఆయనకు ఉద్యోగం 
లేక పోయినా నా ఉద్యోగం నమ్ముకొని ఇక్కడకు వచ్చేసాము . 
స్కూల్ పక్కనే నరసింహా రెడ్డి గారి ఇల్లు దొరికింది . చదువుకున్న 
వాళ్లకు ,చదువు చెప్పే వాళ్లకు ఇక్కడ ఎంత గౌరవం . వారి 
ఇంట్లోనే కాదు వారి మనసులో కూడా మాకు చోటు ఇచ్చారు . 
మా పాపను సొంత బిడ్డలా వాళ్ళు  చూసుకుంటే, వాళ్ళ ఇద్దరు పిల్లలకు 
మేము చక్కగా చదువు చెప్పేవాళ్ళం . ఒకరు ఒకటో తరగతి 
ఇంకొకరు ఎల్ . కె . జి . ఎప్పుడో కాని మా ఊరు నుండి బంధువులు 
రారు . మీరే రండి అందరిని చూడొచ్చు అంటారు . జీతం లో 
నాలుగవ వంతు తినేసే చార్జీ ల దృష్ట్యా అది నిజమే . 

ఇన్ని రోజులకు మా ఊరి నుండి అదీ అమ్మా నాన్న వస్తున్నారు . 
వాళ్లకు ఇక్కడ వన్నీ చూపించాలి . దగ్గరవి వేయిస్థంబాల గుడి ,
భద్ర కాళి గుడి ఇవి సరే .... కొంచెం దూరంగా వాళ్లకు గుర్తు 
ఉండేటట్లు ఏమి చూపించాలి . అప్పుడు గుర్తుకు వచ్చింది 
''కాళేశ్వరం ''.... వేరే కొలీగ్ చెపుతుంటే విన్నాను . 
గోదావరి ఒడ్డున యముడు స్థాపించాడు అని . అదే చూపించాలి . 
ఎందుకు పుడతాయో ఇలాంటి కోరికలు అని నేను బాధ పడే 
క్షణం వస్తుందని అప్పుడు ఊహించలేదు . ఆలోచనలలో 
రెప్ప వాలక ముందే తెల్ల వారిపోయింది . వాళ్ళు స్టేషన్ నుండి 
వచ్చేసరికి నాన్నకు ఇష్టం అయిన దోస ,వేజటబుల్ కర్రి . 
అమ్మకు కారం దోస కూడా . 

అమ్మ నాన్న రాగానే ''మాధురి ఏది ''మొదటి మాట . 
బుజ్జి పిల్ల దుప్పటి లో దూరి వెచ్చగా నిద్రపోతూ ఉంది . 
''ఓయ్ ''నాన్న మెల్లిగా పరుపు మీద కూర్చొని బుగ్గలపై 
తట్టాడు . లేస్తే కదా . 
''లెయ్యి తల్లి తాతయ్య అమ్మమ్మ వచ్చారు చూడు ''నా 
మాటల్లో ఉత్సాహం ,''లేయ్యి మాధురి ''
మా వారు వంత పాడారు . ఇన్ని సుప్రభాతాలు విన్నా లేస్తుందా 
మొద్దు మొహం . ''లెయ్య వె ''లేపి కూర్చోపెట్టేసాను ,ఎందుకు 
లేయ్యదో చూద్దాము అని . ఒక్క సారి చిన్నగా రెప్పలు తెరిచింది . 
నాన్నను చూసింది . మళ్ళా రెప్పలు వాల్చేస్తూ ......... 
''చూడవే తాతయ్య వచ్చాడు ''అమ్మ చెప్పింది ఇంకా తప్పదు 
అన్నట్లు మెల్లిగా చూసింది . గుర్తు పట్టేసింది . రెండేళ్ళ పిల్ల . 
గబ్బుక్కున నాన్న భుజం మీదకి ఉరికింది ఎత్తుకో అని . 
అమ్మ నాన్న ఇద్దరు నవ్వుతున్నారు . అసలు కంటే వడ్డీ ముద్దు ,
ఇంకా మొదటి మనవరాలు ఆయే ,బోలెడు ముద్దు . ఇంకా నిద్ర తీరక 
ముక్కు కళ్ళు నలుపుతూ ఉంది . 
''ఇటివ్వమ్మా ''అని ఎత్తుకొని ''మీరు కాసేపు రెస్త్ తీసుకోండి 
మధ్యాహ్నం భద్ర కాళి గుడికి వెళదాము ''చెప్పాను . 
మధ్యాహ్నం బోజనాలు అయినాక ఆటో లో భద్ర కాళి  గుడికి 
వెళ్ళాము . చాలా పాత గుడి . అమ్మవారి మొహం బండరాతి 
మీద చెక్కినట్లు కొంచెం భయం వేసేతట్లే ఉంది . గుడి మొత్తం 
రంగులు వేసి ఉన్నారు . స్థంబాలకి చుట్టూ ఉన్న బొమ్మలకి 
కొత్తగా జీవ కళ వచ్చినట్లు . అమ్మ ఎత్తుకొని మాధురి కి 
అన్నీ చూపిస్తూ కబుర్లు చెపుతూ ఉంది . దానికేమో అర్ధం 
అయినట్లు ఊ కొడుతూ ఉంది . క్యూ గుండా వెళుతూ ఉంటె 
ముందు అమ్మవారి వాహనం ..... ఉన్నట్లుండి  
పాప గజ గజ వణికి పోయింది . 
''ఏమైంది ''అందరం కంగారు పడిపోయాము . 
పక్కకు తిరిగేసరికి పెద్ద సింహం బొమ్మ నోరు తెరుచుకొని కోరలు చూపిస్తూ ,
నోరు ఎర్రగా వేసారు . 
భయపడి ఏడుస్తున్న పాపని తీసుకొని ఓదారుస్తూ చేరాము . 
కాసేపటికి భయం నుండి తేరుకుంది . అమ్మవారిని చూసి 
బయటకు వచ్చి పక్కన ఉన్న చిన్న కొలను దగ్గర కూర్చున్నాము . 
పాపకు భయం తీరిపోయింది కాబోలు నీళ్ళు చూస్తూ 
నవ్వుకుంటూ తాతయ్య అమ్మమ్మతో ఆడుకుంటుంది . 
''రేపు కాళేశ్వరం వెళదాము ''చెప్పాను ఈయన వంక చూస్తూ . 
ఈయన మా నాన్న వైపు చూసారు . 
''ఎంత దూరమో అమ్మ ,మళ్ళీ రాత్రికి ట్రైన్ కి వెళ్ళాలి కదా ?''అన్నారు . 
''ఏమి కాదులే నాన్న రాత్రికి వచ్చేయ్యమా !''
అది ఎంత దూరమో తెలీక పోయినా అమ్మా నాన్నలకు ఏదో ఒకటి 
చూపించాలి అనే కోరికతో అనేసాను . 
ఇంటికి వచ్చి ఉదయానికి ప్రణాలికలు వేసుకుంటూ అలిసిపోయి 
పడుకున్నాము . అసలు ఆ దారి గూర్చి తెలీని నాకు హాయిగా 
నిద్ర పట్టేసింది . 
                                                                  (ఇంకా ఉంది )




  

Friday, 16 September 2011

జై సంజీవిని మాత..మస్తుగుంటై కదలు 3

నా ఉద్యోగ నిమిత్తం నేను, మా వారు హనుమ కొండలో 
కాపురం పెట్టాము.అయితే అప్పుడు దసరా సెలవల ముందు 
పాలు పొంగించకూడదని వంట మొదలు పెట్ట లేదు.
మేము మాలాగే చిత్తూర్ నుండి వచ్చిన జంట ఉండేవారు.
అందరం కలిసి హోటల్ లో భోజనం చేసి దగ్గరలో 
వేయిస్తంబాల గుడి ఉంటె రాత్రి దాకా అక్కడ ఉండి
వచ్చే వాళ్ళం.(మరి ఇంకెక్కడకు పోయినా జేబులో 
డబ్బులు హుష్ ..కాకి..)

మా పాప ని మా అత్తగారింట్లో వదిలి వచ్చాము.
మా వారి అన్నగారు S.B.I.లో మేనేజర్ .వాళ్ళు మా 
పెళ్లి అయిన కొత్తల్లోనే ట్రాన్స్ ఫర్  అయి వేరే ఊరికి 
వెళ్లి పోయారు.అందుకని మా పాప వాళ్ళ ఇంట్లో అపురూపం.
యెంత అంటే ఈమెకి ఎక్కడ వేడి తగులుతుందో అని 
అప్పటి కప్పుడు కూలర్ కొని మా మరుదులు రోజు ఆమెకోసం 
వేసేవాళ్ళు.ఇంక మా ఆడ బిడ్డ చెప్పనే అక్కర్లేదు......
రోజుకొక డ్రెస్,బొట్లు...రక రకాలు..మా మామ గారు అయితే 
పాపకు కొత్త డ్రెస్ వేస్తె చాలు వెంటనే ఎదురుగా పోటో స్టూడియో 
లో పోటో తీయించేవారు.ఇక మా వారి అమ్మ ,పిన్నమ్మ,అమ్మమ్మ...
అబ్బో...చెప్పలేము ఈమె యువ రాణి.............

(అసలు అన్న పిల్లలు అంటే తమ్ముళ్ళకు చాలా 
ఇష్టం ఉంటుందేమో కదా)

పాపం పాప అమ్మా నాన్న దగ్గర లేరు అని
ఇంకా గారాబంగా చూసేవారు.
వాళ్లకు కిరాణా షాప్,టెంట్ హౌస్,ఎరువుల షాప్ ఉండేవి.

ఒక రోజు మా పెద్ద మరిది ఒక పురుగుల మందు బాటిల్ 
కొంచం లీక్ అవుతుంటే హాల్లో ఒక బీరువా కింద పెట్టాడు 
టౌన్ కి పోయేటప్పుడు తీసుకెళ్ళి రిటర్న్ ఇద్దామని.
మర్చి పోయి వెళ్లి పోయాడు.ఇంకేముంది పాప చక్కగా 
దోగాడుతూ వెళ్లి బాట్టిల్ పట్టుకొని నోట్లో పెట్టుకుంది.

అప్పుడే వాళ్ళ ముత్తవ్వ చూసి అందరిని పిలిచింది.ఇక చూడండి 
హడావిడి.అందరు వచ్చి గబా గబా పాప నోరు కడిగారు.
మా చిన్న మరిది ,ఆడ బిడ్డ ఎక్కిళ్ళు పెట్టి ఎడ్చారట.

అందరు ఏడుపే ఎమవుద్దో  అని.మా వారి అమ్మమ్మ అయితే 
"అయ్యో వాళ్ళ బిడ్డ మనం ఏమి సమాదానం చెప్పాలి?"
అని ఏడుపు.ఈ లోపల మా పెద్ద మరిది వస్తే డాక్టర్ దగ్గరకు 
తీసుకెళ్ళారు.దేవుడి దయ వల్ల పాప బాగానే ఉంది.ఇక అప్పటి నుండి 
మా మరుదులు పాపని సంజీవని మాత అని పిలిచేవారు.

మేము సెలవలకు వచ్చిన తరువాత ఈ విషయం చెప్పారు.
అప్పుడు ఏముందిలే ఏమి జరగలేదు కదా అని నేను పెద్ద 
పట్టించుకోలేదు.

మొన్న ఒక రోజు టి.వి.లో న్యూస్ లో చూసాను.ఒక ఆతను
అప్పుల బాద పడలేక పురుగుల మందు తాగి చనిపోతూ ,
చనిపోయే ముందు తన రెండేళ్ళ పాపను ముద్దు పెట్టుకొన్నాడు.
ఆ నురుగు తగిలి ఆ పాప కూడా చని పోయింది.తను సరే 
చనిపోయాడు,కాని పాప ను చంపే హక్కు అతనికి ఏముంది.
పాపం పాప....
(దోగాడే పిల్లలు ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలండి.)ఇంకో కధ 
ఈ సారి... ఎదురు చూస్తూ ఉండండి.మరింకేమిటి కామెంటండి.



Friday, 19 August 2011

వింటారా మల్ల ..మస్తుగుంటై కదలు...2

హలో...అలో...అలో ...ఎవరికి కదలు కావాలో వచ్చేయన్డొచ్...
 యెంత మంచి వాళ్ళో ...హనుమకొండకి వచ్చేయండి .

మరి జాబ్ లో చేరాక నేను మావారు స్కూల్ కి దూరంగా 
(2 కి.మీ )ఇల్లు తీసుకున్నాము మాకు తెలీక.అది అదాలత్ (కోర్ట్)
సుబేదారి(కలక్టర్ ఆఫీసు )అన్ని దాటినాక బస్ డిపో 
దగ్గర ఉంటుంది.

నేను ఒక్క దాన్నేసాయంత్రం స్కూల్ నుండి 
వస్తానని దైర్యంగా చెప్పాను మా వారికి.స్కూల్ అయిపోయిన 
తరువాత బస్ స్టాప్ కు వచ్చి బస్ వస్తే బస్ డిపో కి
 వెళుతుందా?అని అడిగాను.

ఆతను బస్ స్టాండ్ అనుకోని వెళుతుంది అని చెప్పారు.
నేను ఎక్కిన తరువాత ఊరంతా తిరిగి బస్ స్టాండ్ లోదింపారు.
అది మా స్కూల్ కి కొంచం దగ్గరగా ఉంటుంది .

(బూమి గుండ్రంగా ఉంటుందని అప్పుడు బాగా తెలిసింది)

నీరసంగా నడుచుకుంటూ స్కూల్ వైపువస్తున్నాను.
ఎదురుగా మా వారు కనపడ్డారు.
నిజమేనా అని కళ్ళు నులుముకొని చూసాను.
ఇంకా చూడు నిజమే.

హమ్మయ్యా అనుకున్నాను.
ఇక ఆయనకైతే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి

(దొరికానని బాదతో అంటున్నారా? మీ సంగతి మళ్ళ చెపుతా)

అపుడు అనుకున్నాను...

ఒరే...ఏడిపించే వాళ్ళు తప్పి పోయారని కూడా ఏడుస్తారా?

 వెంటనే నిర్ణయం తీసుకున్నారు ఇల్లు మార్చేయాలని.
 స్కూల్ పక్కనే ,కాని రెంట్ చాలా ఎక్కువ ఏడు వందలు.
 అప్పుడు నాకొకటే ఉద్యోగం ,ఈయన వెతుక్కోవాలి.అసలు 
నా జీతమే 2000  రూపాయలు.అయినా సరే నాకోసం 
 ఆ ఇంట్లోకి వెళ్ళాలి అనుకొన్నాము.
పాత  ఇల్లు ఖాళి చేసి రిక్షా ఎక్కి కొత్త ఇంటికి బయలుదేరాము.
ఏమి పెద్ద సామాను లేదు.ఇంకా వంట మొదలు పెట్ట లేదు.
చాప,పరుపు,బకెట్ ,చీపురు,ఇంకా ఒక సూట్ కేస్ .
అన్నికాళ్ళ దగ్గర పెట్టుకొని సూట్ కేస్ రిక్షా వెనుక పెట్టుకొన్నాము.
ఇంట్లో అన్నికొత్త దింపుకొని లోపలి వెళ్ళాము.
    
తీరా చూస్తె సూట్ కేస్ లేదు. దేముడా ....ఇప్పుడేమి 
చేయాలి...బట్టలు ,డబ్బులు ,నగలు ,అన్నిదాన్లోనే ఉన్నాయి.
తెలీని ఊరు...ఎవరిని అడగాలి?ఇప్పట్లా సెల్ ఫోన్ లు లేవు.
  
ఇద్దరికీ ఏడుపు వచ్చేస్తుంది.మా వారు వెంటనే పరిగెత్తి 
మేము వచ్చిన వైపు వెళ్లారు రిక్షా కోసం. 
  
నేను బయటకు వచ్చి ఏడుపు మొహం తో చూస్తూ 
ఉన్నాను.ఉన్నట్లుండి రోడ్ రెండో వైపు నుండి వస్తూ 
 కనిపించాడు రిక్షా ఆతను.
"అరె మీరు పెట్టె మరిచిపోయిన్రామ్మా..అంటూ" 
తీసి నాకిచ్చాడు.
నాకైతే వెంకటేశ్వర స్వామే  వచ్చి ఇచ్చినట్లు అనిపించింది.
దణ్ణం పెట్టేసాను.
ఈలోపు మా వారు కూడా అక్కడకు పరిగెత్తి వచ్చారు.
ఇద్దరమూ థాంక్స్ చెప్పాము.

"అరె ఏం చేసిన నమ్మా మీది మీకిచ్చినా గంతే గదా"అన్నాడు.
మా వారు కొంచం డబ్బులు ఇచ్చి అవి తీసుకునే దాక ఒప్పుకోలేదు.
  
నిజం గా యెంత మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ...
 అని సంతోషంగా నిద్రపోయాము

(ఇంకేమిటి ...ఇంకో కదలో చెపుతాలే ..
మీరుకూడా నిద్రపోండి )

Sunday, 19 June 2011

వింటారా మల్ల ..మస్తుగుంటై కదలు...

ఒక నొక రోజు నేను మా అత్తగారింట్లో మా పాప (8 నెలలు)
తో  ఆడుకుంటూ ఉన్నాను.ఉన్నట్లుండి ఎదురుగా మా అమ్మ ,
నాన్న ప్రత్యక్షం
(అంటే ఆకాశం నుండి రాలేదు మీరలా మాట్లాడితే చెప్పనంతే) 

మా నాన్న అయితే చాల చాల సంతోషంగా ఉన్నారు.
ఇక ఇంట్లో అందరు వచ్చేసారు విషయం తెలుసుకోవాలని.

(ఎవరు ఎవరు వచ్చారో  చెప్పమంటారా?వద్దా తెలుసా?)

విషయం ఏమిటంటే నేను పాపను తొమ్మిదో నెల ప్రెగ్నెంట్ 
గా ఉన్నపుడు హైదరాబాద్ వెళ్లి జాబ్ కోసం ఒక state level 
పరీక్ష వీర లెవల్లో రాసి వచ్చామనమాట.మనము ఏమి పోడిచామో
తెలీదు కాని వాడు దెబ్బకు బయపడి జాబ్ ఇచ్చేసాడు

(అసలు అప్పుడు మనకు జాబ్ అవసరం.ఎందుకంటె మేమిద్దరం 
బుద్దిగా BEd రిజల్ట్స్ కూడా రాక ముందే పెద్ద వాళ్ళ మాట విని పెళ్లి చేసుకోన్నాము.
మా మామగారికి ఆయనకు అన్ని షాప్ లు ఉన్నాయి కాని 
బట్టల షాప్ లేదని అది మా చేత పెట్టిచ్చాలనుకొన్నారు.
మేమేమో కొంచం నీతి ,నిజాయతి రకాలమి షాప్ తప్పించుకోవాలంటే 
జాబ్ రావాల్సిందే.) 

అవును పే....ద్ద లెవెల్ లో ఉద్యోగం 
తెచ్చుకొన్నా కదా కధకి ఊ..కొట్టక పోతే పోనీ శేబాష్ శశి అన వచ్చు కదా.

జాబ్ వచ్చింది కదా సమస్య లేదనుకోన్నారా?
అసలు సమస్య ఇప్పుడే ......ఈ  నిముషమే స్టార్ట్ అయింది.....


(అబ్బ ఏమి లేదండి.ఈ కధలో అన్ని రసాలు ఉంటాయి.
మీరన్ని తాగొచ్చు,కాని బయానక రసం లేదు దాని కోసం అలా రాసాను)

మేమేమో మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ కి క్రింద సముద్రం దగ్గర 
నెల్లూరు లో ఉన్నామా?జాబ్ ఏమో పైన వరంగల్ లోని 
హనుమకొండ లో వచ్చింది.ఎలా పంపాలి మమ్మల్ని అది ప్రాబ్లం.

(ఏమిటి అందరు ముక్కు మీద వేళ్ళు వేసుకొన్నారు తీయండి 
పెద్ద అప్పట్లో అది చాల దూరం లెక్క)

సరే మన ప్రయత్నం మనం చేయాలి కదా అని మా నాన్న ,మా వారు 
నేను హైదరాబాద్ వెళ్లి మంత్రుల ఇళ్ళు అన్ని ఒక రౌండ్ 
వేసాము.మనకు నూకలు హనుమకొండ లో రాసుంటే 
వాళ్ళెందుకు దొరుకుతారు?అందరు వినాయక చవితి 
నిమజ్జనమని దొరకనే లేదు.ఇంకేమి చేస్తాము దిగులు పడుతూ 
తిరుగు రైలు ఎక్కేసాము 
"ఆ పల్లె లో ఎలా ఉండాలో ఏమిటో అని మాట్లాడుకుంటూ "ఉన్నాము.

అప్పుడు పక్కన ఒక ఆయన మాకు జ్ఞానోదయం చేసారు.
(వెనుక వేలుతురుందా చూడలేదు)
"అరె ఏమి అంటున్నారు మీరు హనుమకొండ అంటే వరంగల్ 
అదేమీ పల్లె గాదు"అన్నారు.
దెబ్బకి మా కళ్ళుదబ్బున విచ్చుకొని వెంటనే  ఇంటికి వచ్చేసి 
మూట ముల్లె సర్దుకొని  హనుమకొండ లో జాబు లో చేరిపోయాను.
పాపం ఆ రోజే విద్యార్దినిలు కి  అదృష్టం స్టార్ట్ అయిందని 
నా ఫీలింగ్.ఎందుకంటె మన లాంటి మంచి టీచర్ దొరికింది కదా

(వాళ్ళు వేరేగా ఆలోచించారా?మీకెవరు చెప్పారు?)

పాపం వారం రోజులు వదలకుండా వాళ్ళ బుర్రలు నింపేశాను.
వాళ్ళు ఇంటికి ఉత్తరాలు వ్రాస్తే మేము చదివి పోస్ట్ చేస్తాము.
అది వాళ్లకు తెలీదు.వాళ్ళైతే ఇక్కడ  మాకు కొత్త టీచర్ వచ్చింది 
గాని ఏమి అర్ధం అవుత లేదు మల్ల అని వ్రాసున్నారు.

విషయం ఏందంటే మన బాష వాళ్లకు అర్ధం కాదు.మనకు కూడా వాళ్ళ 
బాష అర్ధం కాదు.వాళ్లకి లెక్కలలో తీసివేతలో అప్పు తెచ్చుకుంటే 
అంటే అర్ధం కాదు.ఎమనాలా?దస్కం తెచ్చుకోండి అనాలి.

వెంటనే ఆ ఉత్తరాలు చదివి నాకు బోల్డు రోషం వచ్చింది.
వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి ,బాష ని భాష తోనే సేబాష్ 
అనిపించుకోవాలి అని గాట్టిగా ......మనసులు అనుకోని 
ఆ రోజు నుండి వాళ్ళ బాష జాగ్రత్తగా వినేదాన్ని.అంతా విని 
అర్ధం కాకా పోతే మళ్ళ ఆ......అనేదాన్ని. మళ్ళా మొదటినుండి 
అంతా చెప్పేవారు.

ఒక సారి maingate లోని చిన్న గేటు తీసుకొని స్కూల్ లోపలి కి 
వస్తూ ఉన్నాను.ప్రిన్సిపాల్ ఏదో అరిచి చెప్పింది.పాట అనేది వినపడింది.
మనల్ని పాట పాడమంటుంది అనుకోని బోల్డు ఆనంద పడిపోయాను.
(మరి అడిగి పాటలు ఎవరు వింటారు )పాడపోయి ఎందుకో ఆగి 
మరలా ఆమె వైపు చూసాను. ఈ సారి పెద్దగా చెప్పింది ,
పాటక్ పెట్టు అని.నా కర్ధం కాలేదని ఆమెకి అర్ధం అయింది .
దగ్గరకు వచ్చి తలుపు గడియ వేసింది.
పాటక్ అంటే అదన్న మాట.

ఇంత కష్టపడి నేను వాళ్ళ బాష నేర్చుకొంటుంటే వాళ్ళు నా గూర్చి 
ఏమనుకొన్నారో తెలుసా?నాకు చెముడని,వినపడదని.

(అంతే జరగాలి బాగా జరిగింది అనుకుంటున్నారా?)

ఆశ,దోశ ,అప్పడం ....రమ్మని, అందరు  నేను బాగా చెపుతున్నానని 
మెచ్చుకున్నారు తెలుసా.ఇంకొన్ని రసాలు ఈ సారి ఎందుకంటె 
juice తయారుచేస్తున్నాను