Sunday 26 January 2020

నదీతీరం లో నవ్వుల పండుగ

               నదీతీరం లో నవ్వుల పండుగ 

వేల జతల కళ్ళు మిల మిల మెరుస్తూ.... ఆ నారింజ రంగు సూర్యుడు స్వర్ణముఖీ నదిలో మెరిసి ఇందరి నవ్వులు  అద్దుకొని ఏడాదికొక మారు అని దాచుకొని వెళ్లిపోతూ వెలుగు దీపాలకు తన పని చెప్పేసి వెళ్ళిపోయాడు.నిజంగా ఆ ఇసుక తిన్నె మీద ఇసుకవేస్తే రాలనంత జనం.రెండు రోజుల నుండి భోగి గా మండి భోగి ఫళ్లు గా మురిసి ,పెద్దల ను ఉత్తరాయణ పుణ్యకాలాన తలుచుకుంటూ ఇంట్లో పిల్లలతో,కూతురు అల్లుళ్ళలతో, మనుమలు మనుమరాళ్లతో నాలుగు గోడల మధ్య జరిగిన పండుగ ఇదిగో ఈ ఏటి పండుగ పుణ్యమా అని స్వర్ణముఖీ తీరాన నాయుడుపేటలో గాలిపటాలతో పోటీ పడుతూ ఎగిరింది.స్వర్ణముఖీ పండుగ పేరుతో సూళ్లూరుపేట ఎం.ఎల్.ఏ గారు చేసిన ఏర్పాట్లుతో ఒక్కొక్కరూ ఇంట్లో చేసుకున్న పండుగ ఇక మూడురోజులు సామూహిక పండుగై ఇదిగో స్వర్ణముఖీ నీటి అలలతో చెలిమి చేసింది.ఆరుబయట శబ్ద కాలుష్యం అనే మాట వదిలేసి ఎన్ని కుటుంబాలు జేబులు నింపుకొని,నిండుగా నగలు వేసుకొని,కొత్త బట్టలు కట్టుకొని,చిన్ని నవ్వులను భుజాల పై ఎత్తుకొని.....తన తీరం లో తిరుగుతూ ఉంటే ఆ నదీమ తల్లి తన బిడ్డలను చూసుకొని బంగారు నవ్వులతో మురిసిపోయింది.//నీలకంఠేశ్వరుని దర్శించుకొని పాదాలు అన్నీ నది రెండో తీరానికి పరుగులు తీసాయి. దూరంగా ఇసుకలో గాలిపటాల కోలాహలం,పైకి ఎగిరే బెలూన్స్ ను పోటీకి రమ్మంటున్నాయి.చిన్నారి తలలు అటు ఇటు తిరుగుతూ అటు చూడు,ఇటు చూడు అంటూ పెద్దల చేతులు వదిలి పరిగెత్తే దూడల్లాగా మారాం చేస్తున్నాయి.లోపల నుండి వచ్చే తిరణాల పిల్లవాడిని నిమురుతూ బయట ఉండే పిల్లల చేయి పట్టుకోలేక పెద్దల కంగారు పడుతూ మురిసిపోతున్నారు. లేజర్ లైట్స్ తో పెద్ద వేదిక,పక్కన రంగుల రాట్నాలు,చిన్నవి,పెద్దవి బొమ్మల అంగళ్ళు, దూరంగా ఒక వరుసలో ఇంత తిరిగారు తిని అలసట తీర్చుకోండి అంటూ ఆహార పదార్థాల షాప్స్,మిరప,అరటి బజ్జీలు,ముంత కింద పప్పు,ఈ రోజు పిల్లల కోసం గోబీ,పానీ పూరి,నూడుల్స్,రేగు కాయలు,ప్రతి ఒక్కరికీ లాభం బాగానే ఉంది అనే సంతోషం!//తిరణాలు జరిగినపుడు ఇందరికి సెలవు ఎలా దొరుకుతుంది!ఇంతమంది వచ్చినపుడు తిరణాలు జరగాలి కానీ.పండుగ సామూహికం అయితే ఆనందం పదింతలుగా ఉంటుంది.లోపలి కి అడుగు పెడుతూ ఉంటేనే మొదలు హాయ్ అంటూ ఎదురొచ్చే వాళ్ళతో నవ్వుల పంపకం,ఇప్పుడిక లోపలి పూలచెట్టు మమతలు ఎదుటివాళ్లకు ఇవ్వడం మొదలు అవుతుంది.ఇవ్వడం లోని సంతోషం ప్రేమలో మాత్రమే పెరుగుతుందేమో!మీ అమ్మాయి రాలేదా?ఈయనే కదా అల్లుడుగారు?మీ అబ్బాయి ఎక్కడ?పెద్దవాళ్ళ ఆరాలు,కుశల సమాచారాలు.ఫ్రెండ్స్ ను హగ్ చేసుకుంటూ కాలేజ్ కోసం దూరం అయిన స్నేహాలు,చిన్నప్పటి కబుర్లు చెప్పుకుంటూ సంకల్లో పిల్లల్ని చూపి మురుసుకునే పెళ్లి అయిన కూతుర్లు,కొత్త వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటూ పాత అయిపోతున్న అల్లుళ్ళు. సినిమా కూడా పండుగ సందడే కానీ ఇదిగో ఈ మనసుల అలాయ్ బలాయ్ అక్కడ ఉండదు.చేతులు పట్టి లాగుతూ రంగుల రాట్నాల వైపుకు బరువుగా నడుస్తూ దూరంగా వెళుతున్న మిత్రులకు చేయి ఊపుతూ ఉంటే ఆఫీస్ టెన్షన్ మొత్తం హాయిగా పక్కన పడేసి చిన్నప్పటి మనిషిగా మారిన ఫీలింగ్!//ఒక్కో రంగుల రాట్నం దగ్గర తోసుకుంటూ తండ్రులు క్యూ లో నిలబడి టికెట్ తీసుకొని జాగ్రత్తగా ఎక్కిస్తూ ఉంటే తల్లులు మెరిసే కళ్ళతో సంకలోని పాపలకు వాళ్ళ విన్యాసాలు చూపుతూ ఉన్నారు.ఎంట్రీ టికెట్ లేదు.భారీ వ్యాపారం లేదు.చక్కగా పిల్లలకు ఏ స్థాయి తండ్రి అయినా వాళ్ళ కోరిక తీరా ఆడిస్తూ ఉన్నాడు.ప్రతి తండ్రి మొహంలో గర్వం చంద్రయాన్ 2 ను తానే సాధించినట్లు మెరిసిపోతూ తన బాల్యాన్ని తానే భుజాల మోస్తూ,కొలంబస్ పడవ లో దూకి కేకలు పెడుతూ,రంగుల రాట్నం లో గిర గిర తిరుగుతూ,డ్రాగన్ రైల్లో ,బీద గొప్ప తేడాలు మరిచి ఇసుకలో తిరుగుతూ మళ్లీ బాలుడుగా మారుతున్న నాన్నతనమే ఎక్కడ చూసినా!ఇప్పుడు ఆఫీస్ టార్గెట్స్,రాజధాని గొడవలు,సి.ఏ.ఏ లు,రైలు రిజర్వేషన్ లు,ఎగిసిన జి సాట్ లు ఎవరికి కావాలి?కుటుంభం ఇంత మాత్రపు సౌలభ్యం తో జరుపుకొనే ఒక వెసులుబాటు కావాలి కానీ.దూరంగా స్టేజ్ మీద ఉపన్యాసాలు తరువాత ఊపిరి పీల్చుకుంటూ స్వరాలు వెలిగిస్తూ ఉంది వైలెన్ నాదం మహా గణపతిమ్ అంటూ స్వర్ణముఖీ కి స్వరాల ఉయ్యాలలు వేసింది.క్లాస్,మాస్ సాంగ్స్ మేము ఇద్దరం ఒకటే అని వెలుగు నీడలా మధ్య జనాల మనసులు పాదాలు లయగా ఊగేట్లు చేస్తున్నాయి.//ఆడి అలిసిన చిన్న దేహాలు,మోసిన పెద్ద భుజాలు కావాలిసినవి కొని కడుపు నింపుకున్నాయి.లేత తీవేలు అలిసిన కళ్ళను మూసి మెడ ను చుట్టుకుని కళ్ళు మూస్తూ ఉంటే,వెను దిరిగి ఇంటి వైపు నడుస్తున్న నాన్న పాదాలు రేపటి భాద్యతల బరువును తిరిగి ఆలోచనల్లో మోస్తూ భారంగా కదులుతున్నాయి.జీవితం కష్టం కానిది ఎవరికి?ఎంత చెట్టుకు అంత గాలి.ఒకరికి ఈ రోజుటి ఆకలి సమస్య అయితే,ఇంకొకరికి రేపు కట్టాల్సిన లోన్ సమస్య.సమస్యలు వేలు ఉంటేనేమి, ఈ మూడు రోజుల సంబరం మనసులో కొత్త హుషారును నింపుతూ ఉంటే. ఫర్లేదు లేరా దేహం ఉన్నవరకు బాధలు ఉండేవే, ఈ సారి పండుగకు మళ్లీ రా కాసిన్ని కబుర్లు పంచుకుందామ అని అందరినీ స్వర్ణముఖీ వీడుకోలు చెప్పింది.
                @@@@@
            #వాయుగుండ్లశశికళ

No comments: