Monday 28 July 2014

పుట్టిన రోజు ముచ్చట (3)

పుట్టిన రోజు ముచ్చట (3)

మొదటి రెండు భాగాల లింక్ ఇక్కడ 
(two parts link puttina roju muchchata )

హేమ మాధురికి బోగి పండుగ రోజు భోగి పళ్ళు పోయాలి అని 
తాతయ్య  వెంకటేశ్వర్లుగారికి  అమ్మమ్మ నాగరత్నమ్మ లకు బోలెడు 
ముచ్చట . అక్కడేమో రేగు పండ్లు దొరకలేదు . ఇంకేమి చెయ్యాలి . 
నాకు ఏమి తోచలేదు . ఇంతలో మా నాన్నే అందరు గుమస్తాల్ని 
పంపేసారు . ఎక్కడైనా వెతుక్కొని రమ్మని . చెట్లు కూడా ఎక్కడా 
లేవు . పొలం లో ఏమైనా ఉన్నాయో ఏమో . ఇప్పుడు ఎక్కడ 
వెతికేది ?చివరికి ఒకరు సంపాదించి తెచ్చారు . తీరా చూస్తే ఎన్ని !
రెండు దోసిళ్ళు . వాటితో ఎంత మంది పోయాలి ?చుట్టూ చుట్టాలే . 
పెదనాన్న , బాబాయిలు ఇంకా చాలా మంది . ఏమి చేద్దాము ?
అమ్మ వైపు చూసాను . అమ్మ కూడా ఆలోచిస్తుంది . 
చివరికి ఒక సర్దుబాటు చేసేసాము . ఆ రేగు పండ్లలోనే బోలెడు 
పూల రెక్కలు ,అక్షింతలు కలిపింది అమ్మ . భలే ఉపాయం . 
ఏదో ఆడవాళ్ళు ఇలా కనిపెట్ట బట్టి ఇన్ని పేరంటాలు , ఇన్ని 
సందడులు ... వెరసి సంస్కృతులు . నిజానికి ఒక తరం నుండి 
ఇంకో తరానికి ఇవన్నీ మోసుకెళ్లి భద్రంగా ఇచ్చేది వాళ్ళే . 

సాయంత్రం అందరిని పిలిచి కూర్చో పెట్టి మాధురి ని చిన్ని కుర్చీ లో 
కూర్చో పెట్టాము . ఏమి జరుగుతుందో దానికి తెలీదు కాని 
ఏదో జరుగుతుందని దానికి అర్ధం అయింది . పలకరిస్తే చాలు 
వాళ్ళ వైపు చేయి ఊపి నవ్వేస్తుంది . కాసేపు కూర్చుంటుంది . 
కాసేపు పరిగెత్తుతుంది . అందరు మాధురి మా దగ్గరికి రా 
అని పిలుపులు . ఇక స్కూల్ లో చదివే బాబాయి వాళ్ళ పిల్లలు ,
సువర్ణ , కాము , ప్రవీణ్ ,శిల్ప ,సిందు ..... అందరి కంటే చిన్నది 
శ్రుతి రేఖ . ఎత్తుకోలేదు కాని ఆడిస్తుంది పాపని . వాళ్ళందరికీ 
అక్క కూతురు అంటే ఒక ఆడుకొనే బొమ్మ లాగే ఉంది . 
తాము పెద్ద అయిపోయిన ఫీలింగ్ . ఇక చెల్లెలు సునీత కు 
హేమ అంటే బోలెడు ఇష్టం . అన్నీ దగ్గర ఉంది చూసుకుంటూ 
ఉంది . పండుగ అన్నా పేరంటం అన్నా డబ్బు వెదజల్లడం కాదు 
నవ్వులు వెదజల్లాలి . మనుషులతో , మమతలతో ఇల్లు 
వెలిగిపోవాలి . పల్లెటూళ్ళలో అప్పుడు వాటికి ఏమి కొదవ లేని కాలం . 
ఇరవై ఏళ్ళు దాటి వచ్చేసాము కదా . ఇప్పుడు పిలిస్తే అంత మంది రారు . 

ఒకొక్కరు వచ్చి దోసిళ్ళతో బోగి పళ్ళు 
తీసుకొని హేమ పైన పోస్తూ ఉంటె 
జారుతున్నవి చూసి చప్పట్లు కొడుతూ ఉంది




 పెళ్ళికి జారే తలంబ్రాలు చూస్తే ఇలాగే కొడుతుందా ?

ఏమో అప్పుడు కాసింత సిగ్గు వచ్చేస్తుందేమో .... చూడాలి . 
పోసిన వాళ్ళు చిన్న చిన్న బహుమతులు ఇస్తూ ఉన్నారు . 
పుట్టిన రోజు కాదు కదా ఎందుకు అన్నా వినడం లేదు . 
చిన్న పిల్ల దగ్గరికి ఖాళీ చేతులతో ఏమి వస్తాము అని ఏదో 
ఒకటి తీసుకొని వచ్చారు . 
అమ్మా నాన్న వచ్చారు . అక్షింతలు వేసిన తరువాత బయటకు 
చిన్న బహుమతి తీసింది అమ్మ . ఏమిస్తుంది ?చాలా కుతూహలంగా 
ఉంది . మెల్లిగా హేమా చేయి తీసుకొని వేలికి తొడిగింది . 
అరె !నీలం రంగు రాళ్ళతో  చిన్నవంకీ ఉంగరం . నవ్వేసాను . 
అది నాదే . చిన్నప్పటిది .  ఎంతో  భద్రంగా  దాచి పెట్టి మీ అమ్మది 
... మీ అమ్మ కూడా చిన్నప్పుడు ఇలాగే ఉండేది అని 
గుర్తు చేసినట్లు ఇచ్చింది . 

అమ్మ భలే గ్రేట్ . నా చిన్నప్పటి వన్నీ దాచుతుంది . 
ఇంకా పిల్లలకు అవి ఎప్పుడు సంతోషాన్ని ఇస్తాయో 
అప్పుడు ఇస్తుంది . నా బాల్యం , నా అల్లరి, కధలు కధలు 
గా నవ్విస్తూ .... మీ అమ్మ ఇలాగ  ,అలాగ అని మా పిల్లలకు 
చెపుతూ ఉంటుంది . నేను కూడా వీళ్ళ పిల్లలకు ఇలాంటి 
జ్ఞాపకాలు ఇవ్వాలి . ఎంత బాగుంది ఇలా దాచి పెట్టి మీ అమ్మది 
అని చెప్పి అపురూపంగా ఇవ్వడం . అది ఫోటో కావొచ్చు ,
డ్రాయింగ్ కావొచ్చు , బహుమతి కావొచ్చు .... మీ అమ్మది 
అంటే పిల్లలు ఎంత ఆనందంగా తీసుకుంటారో ! 

ఎర్రనీళ్ళు దిష్టి తీసేసి పాపను నిద్ర పుచ్చిన తరువాత మళ్ళా 
అదే ఆలోచన . ఇంకేముంది .... ఈ ఏడాది కూడా పుట్టిన రోజు 
చేయము . తరువాతి పుట్టినరోజుకు ఇంకొకరు వచ్చేస్తారు . 

ఇక చేసేదేమీ లేదు అనుకున్నాను కాని దేవుడు దీని 
మూడో పుట్టిన రోజు నిజంగా ఎంతో సంతోషం తో 
అదీ వాళ్ళ తమ్ముడితో జరుపుకునేటట్లు ప్లాన్ 
చేసి ఉన్నాడని అప్పుడు తెలీదు . 
                                                 (ఇంకా ఉంది )

Tuesday 15 July 2014

పుట్టిన రోజు ముచ్చట (2)

పుట్టిన రోజు ముచ్చట (2)

( part 1 link ikkada )

''ఎప్పుడూ సంక్రాంతి కి మీ అత్తగారిల్లేనా ?
ఈసారి కోటకు రండి '' అమ్మా నాన్న ల ఆహ్వానం . 
కాదన లేము, అందులో అసలు కంటే వడ్డీ ముద్దు 
అని ''హేమ మాధురి '' ఫస్ట్  మనుమరాలు అయిపోయే . 
దాని బుల్లి చేతులతో భోగి మంటల్లో తాటాకు లు 
వేయించాలని అమ్మమ్మకు ,తాతయ్యకు ,మేన మామకు 
సరదా .... వాళ్ళకే కాదు  మాకు కూడా సరదాగా ఉంది . 
అందులో కొత్తగా పెళ్లి అయిన మా చెల్లి సునీత, వాళ్ళ ఆయన 
మస్తానయ్య మొదటి పండుగ కు వస్తున్నారు . ఏ విధంగా 
చూసినా వెళ్లి తీరాల్సిందే . 

''సరే వరంగల్ నుండి బయలుదేరి మా అత్తగారింటికి 
వెళ్లి వాళ్లకు ఒక మాట చెప్పి పాపను తీసుకొని 
మేము ఇద్దరం కోటకు వస్తాము '' చెప్పేసాను . 
ఇక కోటలో సందడే సందడి . తాటాకులు తెప్పించి 
ఎండలో పరిచేసారు . పండుగ కళ ఇల్లంతా .... 
                           *******
చక్కగా అడుగులు వేస్తూ మాధురి ఇల్లంతా తిరుగుతుంటే 
నవ్వులే నవ్వులు . పిన్నమ్మలు పక్కింటి వాళ్ళు 
చెల్లెళ్ళు , తమ్ముళ్ళు ..... అబ్బ ఫస్ట్ పుట్టే వాళ్ళను 
తిప్పటానికి ఎన్ని గుర్రాలో !
వచ్చే పోయే వాళ్ళ కామెంట్స్ ... 
''ఏమి బుగ్గలే పిల్లకి ,మీ వాయుగుండ్ల వాళ్ళ బుగ్గలు 
వచ్చేసాయి . మీ అత్తగారి ప్రింట్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి చెన్నూరు లో ''
అనటం . నేను టకామని దిష్టి తీయడం . 
అయ్యో పాల బుగ్గలే కదా ,   ఎవరికైనా అలాగే 
ఉంటాయి . స్కూల్ కి వెళితే  ఉండవులే అనడం . 

మొత్తానికి మామిడి తోరణాలు కట్టిన వాకిట్లోకి 
భోగి పండుగ వచ్చేసింది . తెల్లవారకే ముందే 
అందరం లేసేసాము . మా చెల్లి వచ్చి పాపను 
లేపేసింది . దానికి అర్ధం కాక ముందు వెలుగుతున్న 
మనిషంత ఎత్తు మంటను చూస్తూ నిద్ర ఇంకా ఉండేసరికి 

కళ్ళు నులుముతూ ఉంది . 
అందరు చుట్టూ చేరి మాధురి ... మధురి అని 
నవ్విస్తూ ఉండేసరికి మెల్లిగా నిద్ర మత్తు పోయి 
తాతయ్య దగ్గరకు పోయి చూస్తూ ఉంది . 
మా మరిది  గారు , ఈయన ''దామ్మా ... ఆకులు  మంటలో 
వేద్దాము ''అని పిలిచి ఎత్తుకోపోయారు . 
భయంతో చేయి లాక్కొని వాళ్ళ తాతయ్య కు 
చుట్టుకుంది . 

''భయం లేదు చూడు మేము వేస్తున్నాము . ''
అని నేను చెల్లి తాటాకులు మంటలో వేసాము . 
అయినా రావడం లేదు . 
మెల్లిగా వాళ్ళ తాతయ్య ఎత్తుకొని చిన్న తాటాకు 
దాని పిడికిలి సరిపోయేంత గా చూసి చేతిలో పెట్టాడు . 
అటూ ఇటూ ఊపింది . నచ్చిందేమో ఊపుతూ 
నవ్వుతూ ఉంది . మెల్లిగా తాతయ్య మంట దగ్గరకు 
తీసుకేల్లి విసురు అన్నాడు . వేసేసింది . 
నెలల పిల్ల గా ఉన్నప్పటి నుండి అంతే !
మా నాన్న మాట భలే వింటుంది . 

చక చకా వాకిలి ఊడ్చి నేను , చెల్లి రంగులతో 
ముగ్గు వైకుంట వాకిళ్ళు గీస్తూ ఉంటె చూస్తూ 
మా చుట్టూ తిరుగుతూ ఉంది . 
తరువాత అందరం తలంటు కొని కొత్త  బట్టలు 
వేసుకున్నాము . పాప  గౌను అందరికి చూపించాలి 
అని పిన్ని కూతుళ్ళు శిల్ప , సింధు , రేఖ 
వచ్చి తీసుకొని వెళ్ళారు పాపని . 
బిచ్చగాళ్ళకి బియ్యం , దోసలు అవీ వేస్తూ వంట 
చేస్తూ అందరం బిజీ . 
ఎప్పుడో ఖాళీ గా ఉన్నప్పుడు దీని పుట్టిన రోజు 
సంగతి గుర్తుకు వచ్చింది . ఈ సారి కూడా 
ఇరవయ్యో తేది స్కూల్ కి వెళ్ళాల్సిందే :(
మరి దీని పుట్టినా రోజు కోరిక ఎలా ?

దుఖానికి కారణం కోరికే అంటారు . కాని ఈ 
చిన్ని ముచ్చట్లు కోరిక అవుతాయా ?
లేకుంటే దీనిని తీర్చుకోవాలి అని అంత 
ఆలోచన ఎందుకు ?ఏమో పిల్లల మధ్య మూడేళ్ళు 
గాప్ ఉండాలి అని ప్లాన్ చేసుకున్నాము కాబట్టి 
పైసారికి రెండో వాళ్ళు వచ్చేస్తారు . 
ఇక దీని ముచ్చట్లకు టైం ఎక్కడ ?

అమ్మ వినగానే 
''సరే కానీ ఈ సారి కూడా 
అందరిని పిలిచి భోగి పళ్ళు పోద్దాము ''చెప్పింది . 
నాన్న వెంటనే గుమస్తాలను పంపి రేగు పళ్ళు 
తెమ్మని పంపాడు . 
వాళ్ళు మొత్తం తిరిగి 
లేవంటూ వచ్చారు . 
''ఇప్పుడెలా ?'' అందరం ఆలోచనలో పడిపోయాము . 
                                              
                                                  (ఇంకా ఉంది )


Monday 14 July 2014

ఒక జర్నీ ఇద్దరి మధ్య వారధిగా

ఒక జర్నీ ఇద్దరి మధ్య వారధిగా ,
అదేనండి భరణి గారు , ప్రకాష్ రాజు గారు . 

ఈ రోజు తనికెళ్ళ భరణి గారి పుట్టిన రోజు 
సందర్భంగా '' సాక్షి ఫామిలీలో '' చూసారా ?

వారి స్నేహమంత ఆర్ద్రత నిండిన శైలితో ... 
వారి ఆత్మప్రయాణాన్ని అక్షరీకరించింది . 

తనికెళ్ళ భరణి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు . 
పులగం చిన్నారాయణ గారికి అభినందనలు . 


(article link ikkada )


Thursday 10 July 2014

పుట్టిన రోజు ముచ్చట

పుట్టిన రోజు ముచ్చట (1)

''వరంగల్ కి రిటర్న్ టికెట్స్ పంతొమ్మిది రాత్రికి బుక్ 
చేసాను '' శ్రీవారి మాటల్లో రిజర్వేషన్ దొరికిన  ఆనందం . 
వళ్ళో కూర్చున్న పదకుండు నెలల మాధురికి అన్నం పెడుతూ 
ఆలోచనలో పడిపోయాను ..... మళ్ళా దీన్ని వదిలి ఉద్యోగానికి 
వెళ్ళాలి . కనీసం కొంచెం పెద్దది  అయినా తీసుకెళ్ళి 
స్కూల్ లో చేర్చుకునేదాన్ని . ఎక్కడ హనుమకొండ ,ఎక్కడ 
నెల్లూరు జిల్లా లోని చెన్నూరు . ఊరకనే ఇలా వచ్చి పాపను 
చూసి అలా ఏమి పోతాము .  అత్తగారింట్లో పాపకు ఏమి లోటు లేదు . 
పెళ్లి కాని ఆడపడుచు ఇంకా అత్తగారు మామగారు ఈయన అమ్మమ్మ ,
పిన్నమ్మ , మరుదులు పాపను అపురూపంగా చూసుకుంటారు . 
 దానిని వదిలి వెళ్ళలేక నాకే బాధ . ఇవేమీ తెలీని పాప 
హాయిగా నవ్వుకుంటూ వళ్ళో ఊగుతూ నవ్వుతూ ఉంది .
సరేలే వారం తరువాత వెళ్ళే దానికి ఇప్పటి నుండి ఎందుకు 
దిగులు పడటం . బుజ్జి పిల్లతో ఆడుకోకుండా !
మొన్న పదకుండో  నెలలో చేయించిన గుండు మీద చిన్నగా 
వచ్చిన జుట్టు . అరె మొదటి పుట్టిన రోజుకు పూలు 
కూడా పెట్టలేమే !... 

''అవును మర్చే పోయాను, దీని పుట్టిన రోజు 
ఇరవై తేది  కదా! ఆ రోజు ఉండలేము కదా . 
అయ్యో వరంగల్ లో ఉంటాము ఎలా ?
 సంక్రాంతి సెలవలు తరువాత  మొదటి పని దినం కాబట్టి 
సెలవు పెట్టుకో కూడదు . ఇక పుట్టిన రోజు నేనేమి చేస్తాను ''
దిగులుగా అత్తమ్మ తో అన్నాను . 
ఇంట్లో అందరు నిజమే  కదా అన్నట్లు జాలిగా చూసారు . 

''ఏముందిలే బోగి పండుగ రోజు అందరిని , బంధువులు ను 
పిలిచి బోగిపళ్ళు పోద్దాము . పుట్టిన రోజు లాగే చేద్దాము ''
ఒక చిన్నసలహా   చెప్పారు . కొంత వరకు తృప్తి . ఇక 
ప్రతి పుట్టిన రోజుకు ఇంతే . 

''సరే అలాగే అలాగే అరిసెలు మీద అడుగులు వేయిద్దాము . 
చిలకలు పంచుదాము '' ఓక్కొక్క సలహా  హుషారుగా కలిపారు . 
పుట్టిన రోజున అడుగులు వేసారని అరిసెలు , పలుకులు 
వస్తున్నాయని చిలకలు పంచేది సాంప్రదాయం . 
అనుకోవడం ఎంత సేపు ,పిలుపులు ఎంత సేపు 
.... బోగి పండుగ రోజు మా అమ్మావాళ్ళు , చెల్లి వాళ్ళు 
చుట్టూ పక్కల వాళ్ళు సాయంత్రం హడావడి తో ఇల్లంతా 
సందడి . 

చిన్న ఉయ్యాల వేసి డెకరేషన్ చేసాము పాపకి 
బోగిపళ్ళు పోయడానికి . చుట్టు పక్కల వారి సలహాలు , 
మాటలు ,పలకరింపులు .... ప్రతి ఒక్కరికి చేసినంత పని . 
బుజ్జి పిల్ల మాత్రం ఇంత బుగ్గలు వేసుకొని ఉయ్యాల్లొ 
ఊగుతూ నవ్వుతూ , వచ్చేవారికి చేయి తిప్పి టాటా 
చెపుతూ .... నవ్వుల్ని పంచుతూ ఉంది . అమ్మ , అత్తమ్మ 
రేగుపండ్లు తెచ్చి అక్షంతలు కూడా కలుపుతూ ఉన్నారు . 
నేను చెల్లి కింద దుప్పటి పరిచి అరిసెలు సర్దుతూ ఉన్నాము . 
ఇంతలో డుబుక్కున చిన్న శబ్దం . ఉలిక్కిపడి ఊయల వైపు 
పరిగెత్తి చేతులు కింద పెట్టాను . 
అందరిలో భయం . కింద పడుతున్న పాపని గబుక్కున 
పట్టుకొని బుజానికి హత్తుకున్నాను . ఒక్క క్షణం 
ఆలస్యం అయి ఉంటె పాప తల నేలకి ... ఊహు 
ఊహించలేకపోయాను . ఇదేమిటి ఏడవటం లేదు . 
కొంపదీసి భయపడిందా ?వళ్ళో వేసుకొని చూస్తే ... 
దొంగ మొహం ఏమి జరగనట్లు పక పక నవ్వుతుంది . 
అప్పుడే వచ్చిన రెండు పళ్ళు కనపడేటట్లు . 
రాక్షసి దీనికి భయం లేదా !నేను నవ్వేసాను . 
అందరు ఊపిరి పీల్చుకున్నారు .  

మెల్లిగా అరిసెలు దగ్గర నిలబెట్టాము . 
''అడుగులు వెయ్యి మాధురి '' అని అందరు 
ఉత్సాహపరుస్తున్నారు . 
దొంగమొహం రోజు గబ గబ వేసేది ఈ రోజు వేయనంటే 
వేయదు . పై పెచ్చు అందరి వైపు చూసి బోసి నవ్వులు . 
ఇక ఏమిటి చేసేది ?సరే నువ్వు సునీత పట్టుకొని 
నడిపించండి ... అమ్మ సలహా . చేసేదేముంది అలాగే 
చేసాము . ఫ్రాక్ బుట్ట లాగా ఎగురుతుంటే ఆవిడ 
గారు మా వేళ్ళు తన చిన్న పిడికిళ్ళతో పట్టుకొని 
బోడి గుండు గిర గిర తిప్పుతూ యువరాణి లాగా 
అరిసెలు మీద అడుగులు వేసింది . 
అమ్మమ్మ కి ,తాతయ్యకి , నాన్నమ్మ కి జేజి నాయనకు ,
మామ ,బాబాయిలు నాన్న ఒకరేమిటి అందరికి 
వాళ్ళు మొదటి అడుగు వేసినంత సంబరం . 
''నా తల్లే నా బంగారే .... అంటూ ముద్దులు కురిపించారు . 

చక్కగా పీట  వేసి కట్టిన ఉయ్యాలలో 
కూర్చోపెట్టి ఒక్కొక్కరే వచ్చి 
రేగుపళ్ళు అక్షింతలు వేసి 
ఇచ్చిన స్వీట్స్, చాక్లెట్స్ ,
తాంబూలాలు తీసుకొని 

అందరు వెళ్ళిపోయే వరకు ఇంట్లో బోలెడు అల్లరి , 
సందడి . బుజ్జి పిల్ల అంత గలభా లోనూ మెల్లిగా 
తూగుతుంది . 

''శశీ ఎర్ర నీళ్ళు దిష్టి తియ్యి . పాపకి నిద్ర వచ్చేస్తుంది ''
అలాగే అని చెప్పి తీసేసి బువ్వ పెట్టి నిద్రపుచ్చాను . 
చాలా తృప్తిగా అనిపించింది . కాని ఏదో ఒక 
మూల చిన్న అసంతృప్తి , దీని పుట్టిన రోజు ఇక ఎప్పుడు చెయ్యాలి ?
ఇక ఎప్పుడూ ఇలాగే సెలవలు అయిపోతాయి కదా అని . 
                                                  (ఇంకా ఉంది )

Tuesday 1 July 2014

మా బంగారు జ్ఞాపకం .... మాలిక లో



ఆడ పిల్ల ఎప్పటికైనా ''అక్కడికి '' వెళ్ళే పిల్లే . 
కాని పంపేటపుడు కాసిన్ని వడి బియ్యంతో పాటు 
బాల్యపు జ్ఞాపకాలు కూడా మూట గట్టి పంపితే 
మనం గుర్తుకొచ్చి కన్ను చెమర్చిన రోజున కాసింత ఓదార్పుగా 
నిలుస్తాయి . చిన్నప్పటి గిలిగింతలు కిల కిలలై మెరుస్తాయి . 

అందుకే మా హేమ మాధురి కోసం కొన్ని తన జ్ఞాపకాలు 
సీరీస్ గా వ్రాయాలి అనుకున్నాను . అందులో ఒకటి 
''మాలిక ఈ మాగజైన్ '' లో చదవండి .... నా 
''ఒక మధుర జ్ఞాపకం ''
వలబోజు జ్యోతి గారికి కృతజ్ఞతలు . 
( kadha link ikkada malika  lo )


ఎక్కడకు పోయావు బంగారు తల్లి నువ్వు 
ఇంకో వంశానికి ఊతం ఇవ్వడానికే కదా !
ఇక్కడి ఆనందానికి అక్కడి ఆత్మీయతకు 
నీ కొంగు ముడితో బంధం పెంచుతావు .... 
నీ వడి నిండిన రోజున
మా కనుల ముందు నీ ఇంకో చిన్న రూపు 

నీ నవ్వులు , మాటలు,
 అలకలు , పాటలు  
ఎప్పుడూ మాకు వసంత జల్లులే 
అమ్మాయిని కన్నవాళ్ళ హృదయానికి 
నిత్యం ఇంద్ర ధనుస్సు రంగులే  :)