Monday, 30 April 2012

నెమలీక.....నవ్వు లీక్ 4 ....

ఈ రోజు సంతోషం  అయిన రోజు మరి నాకు ...నా బ్లాగ్ కి...
ఎందుకంటె ఈ రోజు నా బ్లాగ్ పుట్టిన రోజు మరి.....ఈ రోజున 
ఏమి గుర్తుకు తెచ్చుకోవాలి......నాకు ఇష్టమైనవి.....
అంటే ఆకాశం......లేదా సముద్రం.......

సముద్రం మా ఊరికి పది కి.మీ.దూరం లోనే ఉంటుంది ....
అదే బంగాళాఖాతం.......మరి దాని దగ్గర ఉండే ఊరు ''తూపిలి పాళెం''
ఆ ఊరికి వెళితే  వ్యాన్లో  సముద్రం దగ్గరిదాకా  వెళ్ళొచ్చు. .అందుకని కోట నుండి అక్కడికే వెళుతాము సముద్రం చూడాలంటే.


''శశి నీకు ఒక గుడ్ న్యూస్ ....మనం రేపు అందరం మీ ఊరి దగ్గర 
సముద్రానికి వెళుతున్నాము''ఉత్సాహంగా చెప్పారు ఈయన.
 అప్పటికే పెళ్లి అయ్యి అత్తగారింటికి వచ్చి కొన్ని రోజులైంది.
మనసు దిగులుగా ఊరు వైపు వెళ్ళమని చెపుతూ ఉంది.
నేను చెప్పక పోయినా ఈయనకు ఎలా తెలుస్తున్దబ్బా .....నా గుబులు .

వీళ్ళకి ఊరు చుట్టూ మామిడి తోటలు,మల్లె తోటలు ఉంటాయి 
కాని సముద్రం చూడాలంటే మా ఊరు వెళ్ళాల్సిందే.
మా అత్తగారు,బావగారు,తోడుకోడలు,పాప,ఆడ బిడ్డ ,మరుదులు....
ఇంకా కొందరం కలిసి వెళ్ళాము.ముందు మా ఇంటికి వెళ్లి 
పలహారాలు అవి చేసి సముద్రానికి బయలుదేరాము.
కబుర్లు,పాటలు,నవ్వులు వ్యాన్ అంతా గువ్వల కిల కిలలతో 
నిండిన గున్న మామిడి లా ఉంది.నేను ఎంజాయ్ చేస్తూ 
మధ్యలో జోక్స్ వేస్తూ బయట గాలికి సేద తీరుతూ కిటికీ 
పక్కనే కూర్చున్నాను.

ఇసుక నేలలు కనపడుతూ సముద్రం దగ్గర అవుతున్న సంగతి చెపుతున్నాయి.
చిన్నగా సవక చెట్ల  గుబుర్లు వింజామరలు వీస్తూ ఉప్పు గాలి 
మోసుకొస్తూ ఉన్నాయి.పుట్టింటి సంతోషం నా కళ్ళలో మెరిసిపోతుందని 
ఈయన హాస్యమాడుతున్నారు.మరే ఈ గాలి,ఈ నేలా,అందరికి ఉంటాయి....
మరి మాకు సముద్రం కూడా.....ఉంది....గొప్పే కదా.....

కొంచం సేపు సవక చెట్ల నీడలో కూర్చుని ......అంత్యాక్షరి ఆడుతూ 
పాప చేత డ్యాన్స్ చేయిస్తూ తెచ్చినవి  తింటూ అల్లరి చేసాము అందరం.

ఇంకా సముద్రం దగ్గరకు వెళ్తామని వెళ్ళాము.అలలు చాలా ఎక్కువగా ఉన్నట్లు 
అనిపించాయి నాకు.....సముద్రానికి మనుషులను చూస్తె సంబరం అంట.
అలలతో యెగిరి పడుతుంది.మగ వాళ్ళు ఒక వైపు ఆడవాళ్ళు ఒక వైపు అలల్లో 
కాళ్ళు పెట్టి సంబరంగా ఎగురుతున్నారు.అల మన కాళ్ళ ను తడిపి 
వెనక్కు వెళ్ళేటపుడు భలే ఉంటుంది.మన కాళ్ళ కింద ఏదో కదిలి నట్లు ....
చక్కిలి గింతలు పెట్టి నట్లు....

మా వారికి నేను పక్కన కొత్తగా జత అయ్యేసరికి ఇంకా ఉత్సాహం గా ఉంది.
అలల్లో ఎగురుతూ లోపలి వెళుతూ ....నేను బయపడుతుంటే ఏడిపిస్తూ 
ఉన్నారు.

నేను కొంచం దూరంగా కూర్చొని కళ్ళకు అల తాకుతుంటే మురుస్తూ....
అలల సవ్వడి రాగాలు ఆలపిస్తుంటే దూరంగా ఆకాశం,పడవలు 
చూస్తూ కూర్చున్నాను.అందరు నీళ్ళ లోపలి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు.

ఒక సారి మా పిన్నమ్మలతో వెళ్లి నపుడు మధ్యలో కూర్చొని అలలో మునుగు 
దామని తల వంచాను.అంతే అల ముంచేసి ఉక్కిరి బిక్కిరి అయిపోయి 
అలతో పాటే లోపలి వెళ్లి పోబోయాను .సమయానికి వాళ్ళు ఇద్దరు చూసి 
పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది.అప్పటి నుండి లోపలి వెళ్ళను.
కాళ్ళు తడిపెదగ్గర కూర్చుంటాను.సముద్రానికి నేను అంటే ఇష్టం 
అయితే నా కాళ్ళు తాకి పోతూ చక్కిలి గిలి పెడుతూ ఉంటుంది.

నేను ఒడ్డున కూర్చుని ఉన్నాను అని మా మరిది,ఈయన వచ్చి 
వాళ్ళ ఉంగరాలు నాకు ఇచ్చి షర్ట్స్ విప్పి అక్కడ పెట్టి దూరంగా వెళ్లి పోయారు.
నేను ఆ ఉంగరాలు (రెండూ పచ్చ రాళ్ళవే) వేళ్ళకు పెట్టుకున్నాను.
కొంచం వదులుగా ఉన్నాయి.సరేలే వాళ్ళు వస్తే ఇస్తాము కదా 
అని కూర్చొని మోకాళ్ళపై తల ఉంచుకొని సముద్రాన్ని చూస్తూ 
మధ్యలో ఈయన నవ్వితే బదులు ఇస్తూ గడుపుతున్నాను.

ఈ లోపల మా తోడు కోడలు నీళ్ళలో ఫోటోలు తీసుకుందాము రా 
అని పిలిచింది.వెళ్లి పక్కన నిల బడ్డాను.ఇంతలో తటాలున పెద్ద 
అల వచ్చి మా తోడుకోడలు చెప్పు వెళిపోయింది దానిలో.
చటుక్కున ఆలోచన లేకుండా వంగి పటుకున్నాను.
అంతే చేతి వెలి ఉంగరం అలతో వెళ్లి పోయింది.గుండె గుబిల్లుమంది.
ఒక్క క్షణం ఏమి అర్ధం కాలేదు.హమ్మయ్య అది మా వారిది.
మా మరిది ఉంగరం ఉంది.అయినా నేనే పోగొట్టేసాను అని భయపడి 
పోయాను.
ఇంటికి వెళ్ళే దాకా గమ్మున తల వంచుకొనే ఉన్నాను....
కళ్ళు అయితే శ్రావణ మేఘాల్లా నీళ్ళతో నిండిపోయి ఉన్నాయి.
ఇంకా అసలు కోట వదిలి వెళ్ళను అని అనుకునేసాను.
వాళ్ళు జాలిగా మాట్లాడే మాటలు కూడా నా చెవిన దూరటం లేదు.
అమ్మను వదిలి ఈయన దగ్గరకు రాను కూడా రాలేదు.
ఏమంటారో....ఎక్కడకు తీసుకెళ్ళి పోతారో అని......

ఈయనకు అర్ధం అయిపొయింది.ఇంకేమి చెపిన వినను అని.
చిన్నగా నాన్న తో మాట్లాడుతున్నాడు.నేను పొంగే కన్నీటి ముత్యాలు 
జాలువారకుండా తుడుచుకుంటునాను.

''నాకు ఆ ఉంగరం ఇష్టం లేదు మావయ్యా''అన్నాడు.
ఓహో అనుకున్నా....అయినా తప్పు చేశా కదా .....అనుకోని 
తల ఎత్తకుండా వింటూ ఉన్నాను.

''పొతే పోయిందిలే మావయ్య....అదేమీ నాకు కలిసి రాదు''అన్నాడు.

మరి ఎందుకు ఉంచుకున్నట్లు.....అక్కడ కధల  మీద కధలు చెపుతున్నాడు.
నాకు ఇంటరెస్ట్ పెరిగి కొంచం తల ఎత్తాను.
ఈయనకు హుషారు పెరిగి ''అసలు అది నాకెందుకో కలిసి 
రానే రాదు.....పోయిందే మంచిది యింది......అసలు పరీక్షలు 
వ్రాసేటపుడు దానిని పక్కన తీసి పెట్టి పరీక్షలు వ్రాస్తాను....''

''పొతే పోనీలే శశి ....ఇంకోటి చేయించు కుందాము....అది ఏమి మంచిది 
కాదు''నేను కొంచం నవ్వాను......చిన్నగా....
హమ్మయ్య అనుకోని....తొందరగా బయలుదేరు....
మళ్ళా చీకటి పడిపోతుంది.
చివరికి అందరు కలిసి నా తప్పు ఏమి లేదని .......
పౌర్ణమి ముందు పుట్టింటికి 
రాకూడదని....వచ్చాను కాబట్టి ఇలా జరిగిందని తేల్చేసారు.

ఎలాగో భయం తగ్గి అత్తగారింటికి వచ్చేసాను.అయితే అక్కడ ఎవరు
 సంయమనం పాటించకున్నా.........జీవితాంతం అది ఒక చేదు జ్ఞాపకం గా 
మిగిలి ఉండేది.ఇప్పుడు అది ఒక మంచి జ్ఞాపకం నాకు........
సంతోషం లో అందరు మంచివాళ్ళే....
కాని భాదలో కూడా ఆ మంచితనం నిలుపుకుంటేనే .....నిజమైన మంచివారు.

సరే కాని అండి......మీకందరికీ ఒక విన్నపం ......

ఇక్కడ ఆ సేతు హిమాచలం ....కాదు కాదు....ఆ సేతు ప్రపంచం మొత్తం 
బ్లాగ్ మిత్రులు ఉన్నారు......

మీకు ఎక్కడ పచ్చ రాయి ఉంగరం దొరికినా ........మీరు మంచి వారు 
కాబట్టి నాకు తెచ్చి ఈయగలరు......

(చూద్దాం....ఒక పది ఉంగరాలు అన్నా దొరుకుతాయేమో )


నా బ్లాగ్ లోకి వచ్చిన నా మిత్రులందరికీ థాంక్స్ 
తెలుపుకుంటూ ఈ స్వీట్స్ మీకు అందరికి ....

Thursday, 12 April 2012

పిలక పట్టుకొని లాక్కుని రండి....ఎవరో ఆనందం అంట...

ఏమిటి మీరు ఉన్నారా?ఆనందం కావాల్సిన లిస్టులో.....
ఎవురికి వద్దంటారు లెండి.....మరి అది ఎక్కడ ఉందొ....

ప్రస్తుతానికి ముందు ఈ వేణు గారు పంచుకున్న ఫోటో చూడండి....
తరువాత మాట్లాడుదాము...

చదివారా?ఏమి అర్ధం అయింది?
ఓహో ఆనందం గా జీవించటమే పరమార్ధం అని...

మరి అది ఎలా వస్తుంది....
అది చెప్పటానికే ఈ పోస్ట్....ఇది ఇప్పుడే వ్రాయటానికి రెండు  కారణాలు ఉన్నాయి...
ఒకటి భూకంపం వచ్చింది......
రెండు యువి......

భూకంపం వలన ఏమి తెలుసుకున్నాము ఈ రోజు ఉంటె రేపు 
ఉంటాము అని గ్యారెంటీ లేదు అని......

మరి యువి .....ఏమి చెప్పాడో మీరే చూడండి...


ఇంకా ఏమి చెప్పాడు అంటే.....

''నా ఆలోచనలు మారిపోయాయి.ఆట వలన పేరు ,ప్రఖ్యాతులు 
డబ్బు అన్నీ వచ్చాయి.కాని ఇప్పుడు కుటుంభం 
స్నేహితులు తోడుగా ఉండటమే ముఖ్యం అనిపిస్తుంది.
డబ్బు ముఖ్యమే కాని అంతకంటే ఆరోగ్యం గా 
సంతోషం గా ఉండటమే ముఖ్యం అనిపిస్తుంది....ఇప్పుడు''

చూసారా మనం కష్టాలలో ఉన్నాప్పుడు డబ్బు కంటే మనుషులు 
కావాలి.కాబట్టి మీరు ఒక్క మనిషిని దూరం చేసుకున్నా....
మీరు ఎంతో కోల్పోయినట్లే.........

ఇంకా పూర్ణాత్మ పుస్తకం చెపుతుంది(link ఇక్కడ)

''మీరు ఇతరులకు ఏమిస్తారో అది ఎన్నో రెట్లు పెరిగి 
మరలా మీ దగ్గరికి వస్తుంది.కాబట్టి అహాలు పక్కన 
పెట్టేసి అందరికి ప్రేమ,ఆనందం పంచండి ...అవి 
ఎన్నో రెట్లు పెరిగి మీ దగ్గరకు వస్తాయి''

''మిమ్మల్ని మీ బలహీనతలతో సహా ప్రేమించుకోవాలి .
అదే మీరు మీకు ఇచ్చుకోగల బహుమతి.వర్తమానం లో 
ఎరుకుతో ఉంది ధ్యానం తో మీలోని మంచి లక్షణాలు 
గమనిస్తూ ఉండండి.పూర్ణాత్మ తో ఎదిగినందు వలన 
మనం తృప్తితో సంతోషంగా ఎదగగలం.ప్రశాంతం గా 
ఉండగలం.డబ్బే ఆనందాన్ని ఎప్పటికి   కొనలేదు""

ఎవరినైనా ఆనందాన్ని ఎలా పొందాలి అని అడగండి....ఒక్కోరు 
ఓక్కోటి చెపుతారు.....అంతెందుకు మీకు ఒక సారి ఆనందం కలిగించింది 
ఇంకో సారి కలిగించక  పోవచ్చు...ఇప్పుడు రెండు పాటలు చూద్దాము...

''ఉరికే చిలుకా....ఒక కంటి గీతం జల పాతం అయితే మరో కన్ను 
నవ్వదమ్మా...'' ఈ పాట ఎన్ని సార్లో వినుంటాను....ఏదో తెలీని 
బాధ మనసుని కమ్మేస్తుంటుంది.....

ఇంకో పాటుంది....అసలు అమ్మాయి పెళ్లి ఆగిపోవటమే ఎంతో బాధాకరమైన 
విషయం.....ఇక ఆ పెళ్లి ఆ అమ్మాయి వలెనే ఆగిపోతే యెంత విషాదం....
కాని ఈ పాట చూడండి  విషాదం అంతా....మబ్బులాగా యెగిరి పోతుంది....

''వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా.....వీచే వీచే పిల్ల గాలుల్లారా.....
కళ్ళ లోనా పొంగుతున్నా బాధలు ఎన్నో మాకున్నాయి''

అసలు ఈ పాటలలో దాగుండేది విషాదం...కాని ఇవి వింటే నాకు 
ఆనందం....ఇదెలా సాధ్యం?నేను లెక్కల స్టూడెంట్ ని కదా....
ఏదో ఒక జవాబే కదా రావాలి ...మరి రెండు ఎలా వీలు అవుతాయి....
కాబట్టి ఈ ఆనందం ఏ లెక్కలకు అందనిది....మరి ఎందుకు కొన్ని 
ఆనందం కలిగిస్తాయి అంటే.....

ఓషో అంటారు''ఎప్పుడైతే నువ్వు నీ జీవితంలో ఇమిడి ఉంటావో 
ఎప్పుడైతే ఆ పొందిక సామరస్యంగా ఉంటుందో 
అప్పుడు నువ్వు ఏమి చేస్తున్నా నీకు ఆనందమే''

కాబట్టి నిజం గా నీకు ఆనందం ఎక్కడ కలుగుతుందంటే ...
అది నీలోనే నీ చేతుల్లోనే ఉంది.....అది నీ జీవితం లో చక్కగా 
ఇమడటం....ఎప్పుడూ మనం మన చేతలకి భవిషత్తులో 
తల దించుకొనే పరిస్తితి తెచ్చు కోకూడదు....పక్క వాళ్ళని 
కలుపుకు పోతేనే అందరికి సంతోషం......

Tuesday, 10 April 2012

మా జీవితాలు ....గాలిలో దీపాలు...

హూ.....ఏమిటి ఇంత నిట్టూర్చాను అనుకుంటున్నారా?


ఏమి చేసేది చెప్పండి.....''గురు బ్రహ్మ ...గురు విష్ణు''
అని పూజించిన దేశంలో మా పరిస్తితి ఇలా అవుతుందని 
ఎప్పుడూ అనుకోలేదు.


ఏదోలే మంచి జాబ్ లో చేరాము....కొంచం దేశ సేవ కూడా 
చెయ్యొచ్చు.....పిల్లల మనసులో నిలిచిపోవచ్చు అని 
అనుకున్నాము....కాని ఏమిటి ఇప్పటి పరిస్తితులు....


మొన్నటికి మొన్న రాత్రి సినిమాకి పోతున్నారని నైట్ వాచ్ మాన్ 
పట్టుకుంటే.....అతనిని తంతే....పాపం అతను దవడ ఎముకకి 
స్టీల్ రాడ్ వేయించుకున్నాడు.


సుశీలా మేడం గారు చదవలేదని మందలించారని .....
కత్తితో పిల్లవాడు  దాడి చేస్తే.....చావు దాక వెళ్లి ఎలాగో బ్రతికి వచ్చింది.
పాపం తనని చూస్తె అయ్యో అనిపించింది....అసలు ముసలి వాళ్ళ కంటే 
ఘోరంగా మెట్లు ఎక్కుతూ ఉంది....అయ్యో అంటే....ఏదో లెండి 
మా పిల్లల కోసం బతికాను చాలు అంది.ఏమి తప్పు చేసింది 
చదువు అని మందలించటం కూడా తప్పేనా?


ఈ మళ్ళా న్యూస్ లో ఒక అయ్యవారు ....పాపం మెట్రిక్ లో 
కాపి కొట్టనీలేదని ఇద్దరు పిల్లలు కార్ తో గుద్ది చంపేశారు అంట....


ప్రతి వ్యవస్థ లో అంతో ఇంతో తప్పులు ఉంటాయి....కాదని అనటం 
లేదు....కానీ పిల్లవాడి మదిలో టీచర్ కి ఉన్న స్తానం ఎప్పటికి 
విలువైనది.
తల్లి తండ్రులు ఇంట్లో ఉన్న ఒక్క అడాల్సేన్స్ పిల్లవాన్ని మంచి 
దారిలో పెట్ట లేక పొతే.....కనీసం దండించకుండా అంత మందిని 
ఒక్క టీచర్ ఎలా పెట్టగలడు?
ప్రతీ టీచర్ కి మంచి  టీచర్ గా ఉండాలనే ఉంటుంది.


దండించినపుడు కూడా వృత్తి ధర్మం తో చేస్తాము కాని 
కావాలని కాదు కదా......
చదవండి ఈ న్యూస్......ఆ టీచర్ మృతికి సంతాపం తెలుపండి.
వాళ్ళ కుటుంబ సభ్యులను ఆ దేవుడు చల్లగా కాపాడాలి.....

Monday, 9 April 2012

జాబిలి తునకలు .....తుషారం 1

చిన్న పిల్లవాడు ''కర్ర''ని ''కల్ల'' అంటాడు కాని 
మనం వాడిని తప్పు చెపుతావా అని తన్నం.....
బాష అలా తప్పటడుగులు వేస్తూ వస్తుందని మనకు 
తెలుసు.


అలాగే నేను కవితా సంకలనం వెలువర్చినపుడు....
మరల ఇప్పటి దాకా పెద్ద రచయితలు,మిత్రులు 
కూడా ఎప్పుడూ ప్రోత్సహించేవారే.........
అందరు మంచి మనసున్న వారే........
ఇదే నన్ను ముందుకు నడిపించి ఎన్నో బహుమతులు 
అందుకునేలా చేసింది.
అందుకు వారు అందరికి ధన్యవాదాలు .


కొందరి మిత్రులు జాబిలితునకలు పుస్తకం చూడాలని 
అన్నారు.అయితే పుస్తకాలు అయిపోయినాయి.
అందుకని కొన్ని పేజెస్ వాళ్ళ కొరకు బ్లాగ్ లో పెడుతున్నాను.


అందరికి ధన్యవాదాలు.

Wednesday, 4 April 2012

సామాన్యుని చేతిలో బ్రహ్మాస్త్రం......

ఎండిపోయిన నది కి తెలుసు 
ఒక్క నీటి చుక్క విలువ.....
ఆదమరచి నిద్ర పోయే చిన్నారికి తెలుసు 
లాలీ పాట విలువ.....
చీత్కారాలతో చిన్నపోయిన మనసుకు తెలుసు 
ఓదార్పు విలువ.......
తప్పి పోయి దొరికిన బిడ్డకు తెలుసు 
నాన్న చేతి పట్టు విలువ.....
ఆరిపోయే చైతన్య జ్వాల కు తెలుసు 
బిగించిన ఒక్క పిడికిలి విలువ.......
విరహపు వేదన దాటినా జంట కు తెలుసు 
కోరిక విలువ.........
జారే కన్నీటి బొట్టుకు తెలుసు 
కష్టపు విలువ.......


ఒక సామాన్యునికే  తెలుసు 
సమాచార హక్కు విలువ.......


దెబ్బ తిన్న శాఖ లకు తెలుసు 
సామాన్యుడి శక్తి విలువ.....
ఆ చేతిలోని బ్రహ్మాస్త్రపు విలువ.....


ఒక్క చిన్న పాప అడిగిన సమాచారం ఈయలేక.....
అదీ మన జాతి పిత గూర్చి అడిగిన సమాచారం.....
చూడండి కింద.....న్యూస్ లో ........


తెలుసుకోండి సమాచార హక్కు విలువ.....
RIGHT TO INFORMATION 


ఎవరైనా సరే పది రూపాయలు ఖర్చు  చేసి వినతి 
పెట్టుకుంటే సదరు ప్రభుత్వ శాఖ ముప్పై రోజుల్లోగా 
దానిని గూర్చి సమాచారం ఇచ్చే తీరాలి.
చిన్న వాళ్ళు అయినా సరే......లేని వాళ్ళు అయినా సరే....
మీరు అవసరం కూడా చెప్పక్కర్లేదు......మీ పేరు వ్రాస్తే చాలు 
ఆన్ లైన్ లో కూడా అప్లై చేయొచ్చు.
ఇంకా వివరాలకు  కింది లింక్ చూడండి....


సమాచారహక్కు లింక్ ఇక్కడ


మరి అందరు ఆ పాప ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పండి......
ఇది మన డబ్బు...ఖర్చు పెట్టేది పన్నుల రూపం లో మనం కట్టిన డబ్బు.
ప్రశినించడం అనడరికి హక్కు.
ఒక సైకిల్ పోయినా ,ఒక సమాచారం కావాలన్నా ఏ 
ప్రభుత్వ కార్యాలయం లో నైనా దాని గూర్చి మనకు 
సమాచారం కావాలి అని మనం తెల్ల కాగితం పై స్టాంప్ 
అంటించి కోరవచ్చు.
ఇది అందరికి తెలియ చేయండి.ఈ దేశం మనలను చదివించింది....
పక్క వాళ్లకు కూడా విజ్ఞానం పంచి ఆ ఋణం తెర్చుకుందాము .

Sunday, 1 April 2012

ఎందుకు ....అశాంతి?

ఎన్ని చేసినా....ఎన్నో సంపాదిస్తున్నా.....
ఏదో లోపం.....అది ఉంటె అన్నీ ఉన్నట్లే....
అదే మనసుకు శాంతి....మరి అది ఎలా
వస్తుంది?
చాలా మంది చాలా దారులు చెపుతారు....
మనకు ఏది సరిపోతుందో మనమే అనుభవంతో
చూసుకోవాలి....మాష్టర్ సి.వి.వి.గారి శిష్యుడు
శార్వరి గారు తన పుస్తకాలతో చాలా అద్భుతమైన అనుభవాలు
మనకు అందిస్తారు.ఇప్పుడు ఇంకో బుక్ గూర్చి చూడండి.
వీలయితే చదవండి....ప్రశాంతతో కూడిన అద్భుతమైన
జీవితం గడపండి.