Sunday 27 November 2011

బాపు...బాపు...అనే హృదయ మందిరం

బాపు..బాపు అనే హృదయ మందిరం
చూసి తీరాలని ఉండే రామ రాజ్యము....



అబ్బ బాపు గారంట....రామ రాజ్యమంట....
చూడాల్సిందేనని మనసు కి ఒకటే ఆరాటం....

అన్ని రోజులు హాస్పిటల్ లో సిలైన్ చుక్కల్లో క్షణాలు 
లెక్క పెట్టుకొన్నాను......ఎప్పుడెప్పుడు హాస్పిటల్ నుండి 
వచ్చేస్తానా అని....మరి బుద్దిగా సిలైన్ పెట్టించుకొని ,
ఇంజేక్షన్స్ వేయించుకుంటే తీసుకొని వెళతాను 
సినిమాకి అన్నారు ఈయన....


(పెద్ద జబ్బేమి లేదండి...ఏదో వాటర్ పొల్యుషన్....
నా బాధ మీకేవరికి రాకుండా వర్షాలు 
వెళ్ళే దాక నీళ్ళు కాచి తాగండి)

ఇంతా జరిగి వెళ్లి చూస్తె.....ప్చ్...అసలు రామ...రామ...
పాట యెంత బాగుంటుందో అని ఎదురు చూసాను....
కనీసం అందమైన పిల్ల వాడిని కూడా పెట్ట లేదు.....

అసలు బాపు గారు ఎలా తీయాలి అనేది బొమ్మ గీసి 
తన వ్యూ చూపిస్తారట.....మరి గ్రాపిక్స్ ఆయన వ్యూని
మింగేసాయో ఏమో.....అసలు ఈ టీవీ భాగవతం నా కళ్ళ
ముందు ఇంకా మెదులుతూనే ఉంది.ఇదైతే ఒక దృశ్య 
కావ్యం అవుతుందనుకున్నాను.



 అసలు సముద్రం దగ్గర వాళ్ళం ...మాకు అభిమానం వస్తే 
తాడెత్తు అల తలమునకలుగా ముంచి నట్లే ఉంటుంది...
యెంత పొగుడుతూ రాద్దామని అనుకొన్నాను.పోనీలే 
రమణ గారు వెళ్ళిపోయినా .....ఆయన బుడుగుగా జన్మించే
వరకు ఈయన లోటు తీరుస్తాడు అనుకొన్నాను.......

బాల కృష్ణను గూర్చి ఏమి చెప్పను...మళ్ళ అన్నగారు 
పై నుండి బాధపడుతారు....కాక పొతే డైలాగులు నాలిక 
పై నుండి కాకుండా వాళ్ళ నాన్నలా చెప్పి ఉంటె బాగుండేది.


నయన తారలో కను బొమ్మలు పెద్దగా గీసి,ఐ లాషేస్ పెట్టి,
కుంకుం పెట్టి బాపు గారు కాబట్టి సీతాదేవిని పట్టుకు రాగలిగారు.
అసలు ఆ కళ్ళలో దయ,బేలతనం ఉండాలి....కాని ఆమె 
కళ్ళలో ఆత్మా విశ్వాసం కనిపిస్తూ ఉంటుంది....అసలు సీతమ్మ
"నను బ్రోవమని" వచ్చేవారిని కరుణతో ఆదరించేలా ఉండాలి.

సత్య భామ కళ్ళు వేరు,సీతమ్మ కళ్ళు వేరు.భామ అంటే 
ధనువు పట్టినా,తనువు ముట్టినా అంతే....ఆ కళ్ళు చూస్తె
నే ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతుంటుంది.సరేలెండి ...బాగుంది.


స్క్రీన్ ప్లే అసలు పాత సినిమా చూసి చేసినా సరిపోయేది.
అనవసరమైన గ్రాపిక్స్ కి ఇచ్చేసారు టైం అంతా.సీత రాముల 
మమతలకు సరిపోనే లేదు.అసలు పాత దానిలో ఇంత సినిమా 
చూపి హాస్యానికి కూడా ఒక ట్రాక్ చూపారు.ఇక్కడ ఏమి 
లేదు.
లవ కుశులు బాగున్నారు.రాజ మందిరం లో పాడిన పాట 
చాలా బాగుంది.ఇప్పటి మ్యూజిక్ లో ఇంకా బాగా మంచి 
పాటలు చేసి ఉండ వచ్చు.

సరే లెండి ఈ కాలంలో రాముడేందుకు?
అనుకొనే వాళ్ళు ఉన్న సమయం లో సాయిబాబా గారి 
ప్రయత్నం అభినందనీయం.


అప్పటికి ఇప్పటికి ఏమి మారింది...కాలం....ఎప్పటికి 
ఆడవారు నిందలకు గురి కావలసిందే....తామే 
నిరూపించుకోవాల్సిందే.......నయం ఆమె తిరిగి 
అయోధ్యకి రాకుండా భూమి లోకి వెళ్లి మంచి పని 
చేసింది....మొదటి సారి నింద పడినా బిడ్డల కోసం 
బతికింది....ఇంకో సారి నింద పడుంటే ఇంకెలా బతికున్ను 
పా....పం.

రాముడు ఉన్నాడో లేడో....కాని మనిషి బ్రతకటానికి 
ఒక పద్దతి కావాలి......మీటర్ని కొలవటానికి ఒక కొలతను 
మ్యూజియం లో ఉంచినట్లు.......

అసలు మనిషి ఇలా ఉండాలి అనుకోటానికి ,ఆలు మగలు 
పక్కన ఉన్నప్పుడే కాదు దూరంగా ఉన్నప్పుడు కూడా 
మనసులు ఒకటిగా ఉండాలి అనుకోటానికి ఆదర్శంగా 
రాముడి తరువాత ఎవరు ఆంటే చెప్పలేక పోతున్నారు.


మన వాళ్ళు ఇచ్చిన రాముడిని కూడా "రాజు గా తన 
ధర్మాన్ని నిర్వర్తించటానికి సీతని అడవులకు పంపాడు 
కాని భార్యగా తన మనసు నుండి దూరం చేయ లేదు"
అని గట్టిగా చెప్పలేక పొతే .....మీ పిల్లలకు ఇలా బతకాలి 
మనిషి... అందరి కోసం ...స్వ సుఖాలు చూసుకోకుండా 
అని ఎవరిని చూపుతారు?


హూ......సరే మొత్తానికి పాత లవ కుశ ఎప్పటికి గొప్పదే 
అని నిరూపించారు.............

Friday 25 November 2011

ఇంకో సారి వయోలేన్సు........

మా వారి పుట్టిన రోజు సందర్బంగా 
ఇంకో సారి వయోలేన్సు వాయించాలని పించింది.

నా పెళ్ళైన కొత్తల్లో సంగతి.
 
పెళ్లి అయిన తరువాత మా ఇంటికి మా వారు వచ్చి నపుడునేను వయోలిన్ నేర్చుకోన్నానని తెలిసింది.
ఒక సారి వాయించవా?అని అడిగారు      
 
(ఖర్మ అలా అడిగించింది) 
సరే అని వేరేవాళ్ళ ఇంట్లో వయోలిన్ ఉంటె తెప్పించి
మొదలు పెట్టాను.
 
(ఎలాగయినా శబాష్ అనిపించుకొని వయోలిన్ 
కొనిపించు కోవాలని అనుకున్నాను )
 
 ఇద్దరం శ్రద్ధగా కూర్చున్న తరువాత మొదలు పెట్టాను.
మొదట మోహన రాగం అయితే నచ్చుతుంది అందరికి అని 
మొదలు పెట్టాను.గ గ పా పా ....దప సా సా....వర వీణ ...మృదు పాణి  ...వనరుహలో ..చను రాణి.....
 
పాట అయిపోయినా అయన మొహం లో ఫీలింగ్స్ లేవు
 
(ఆయనకు సంగీతం గూర్చి ఏమి తెలీదని అప్పుడు తెలిసింది)
 
అర్ధం అయితే వాయించటమే గొప్ప ఇక ఏమి రాని వాళ్లకి అర్ధం కావాలంటే ...దేముడా ఏమిటే ఈ అగ్ని పరీక్ష ?
 
కల్యాణి వాయించాను.పేస్ లో ఏమి మార్పు లేదు.
భైరవి ...ఊహు ........బ్రోచేవారెవరురా ?...........
ఊహు.......ఎవరు వచ్చి బ్రోవలేదు...............
 
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి ..........ఊహు.......
ఆమె కూడా రాలే.....
 
(ఇక్కడ వయోలిన్ కొనీడని మనకు టెన్షన్ )
 
నన్ను బ్రోవ నీకు భారమా?నీదు స్మరణ గాక వేరే ఎరుగను.......ఊహు.......ఏమిటి దారి?
రోషం వచ్చేస్తుంది,రాగాలకి ఇల్లు కదిలి పోతుంది ఈన గారి మనసు మాత్రం కరగలేదు.
 
ఒక చిన్న ఉపాయం వచ్చింది.ఎస్ అలాగే చేయాలి అనుకొన్నాను.సినిమా పాటలు వాయిస్తే
ఎలా ఉంటది అనుకోని దేవుడికి దండం పెట్టుకొని
 
(పనిలో పని కొబ్బరికాయ లంచం ఇస్తానని అనుకొన్నాను)
 
ఉపాయం బాగుంది కాని నాకేమి సినిమా పాటలు రావు.
ఒక అక్క ముద్దుగా నాకు ఒక పాట నేర్పించింది.
అదేమిటి అంటే "చూడు పిన్నమ్మ పాడు పిల్లడు.......పాట"
 
వాయించబోయి ఒక్క క్షణం ఆలోచించాను.
బుద్ధి ఉండే వాళ్ళు ఎవరైనా ఆ పాట వాయిస్తే
వయోలిన్ కొనివ్వరు అని నా బుద్ధి ఆపేసింది.
 
ఏమిటి దారి?
 
సమస్య మళ్ళా మొదలు?సరే మిస్సమ్మ లో పాట 
"సా ని స రి మా ...రీ ని సా సా....
మాకు మేమే మీకు మీరే .....పాట మొదలెట్ట పోయాను.
 
(మళ్ళా బుద్ధి ఒక్క చరుపు చరిచింది.కొత్త పెళ్లి కొడుకు ఆ పాట పాడితే పారి పోతాడని)
       
అయ్య..........urekhaa ...........ఒక పాట గుర్తు కు వచ్చింది.
అందరికి తెలిసిన పాట.
 
దొరికిందే చాలని వాయించాను.ఏమిటంటే జనగణమన........
 కద అయిపోలేదండి.అక్కడే మొదలు అయింది.

మద్యహ్ననికల్ల రాజీవ్ గాంధి చనిపోయారు.
వారం రోజులు టివి లో,రేడియో లో
 వయోలిన్ అంటే వయోలిన్...........ఇంకేక్కడ కొనిస్తారూ........ఇరవయ్ ఏళ్ళు అయినా
నేనేదో రాజీవ్ గాంధి ని చంపినట్టు ఇంత వరకు వయోలిన్ కొనిలేదు .

Wednesday 16 November 2011

ఎందుకు ఆగిపోతున్నాము అక్కడ?

ఆగిపోకండి అక్కడే... రండి ....చైతన్యం  లోభాగం 
కావటానికి....... 
నేను నది మాస పత్రిక గూర్చి తరువాత బంధాలు -
అనుభందాలు పై నా కధ ప్రచురింప బడిన ప్రతి 
వచ్చిన తరువాత వ్రాద్దామనుకున్నాను.కాని ఎందుకో 
ఇప్పుడే వ్రాయాలని అనిపించింది.


రచయితగా,పాటకురాలిగా నది నాకు సుపరిచితం.
ప్రింటింగ్,పేజ్ నాణ్యత,బొమ్మలు కాక విలువలలో 
చాలా వాటికన్నా పైన ఈ పత్రిక ఉంటుంది.దానిలో ప్రచురించిన 
గురజాడ వారి కధ పరిచయం చేయాలనీ వ్రాస్తున్నాను.


ఎందరో రచయితలు దాంపత్య జీవనాన్ని అన్ని కోణాలలో 
ఎంతో చక్కగా ప్రతి ఒక్కరు నా కధే అనుకునేటట్లు 
వ్రాస్తున్నారు.కాని దాంపత్య జీవన ఔన్నత్యాన్ని,
భాగస్వామి పట్ల ప్రేమని, నమ్మకాన్ని నిలుపుకోవాల్సిన 
అవసరాన్ని చెప్పి వారి హృదయాన్ని తెరువలేక పోతున్నారు.


"ఎందుకు వారు మనసుతోనే ఆగిపోతున్నారు?"


ఇది నామనసులో చాలా రోజులనుండి నలుగుతూన్న ప్రశ్న.
దాంపత్య జీవిత గొప్పదనానికి పెద్ద పీట వేసి ప్రపంచం
లోనే గొప్పగా నిలిచిన సంస్కృతీ మన భారత దేశానిది.
మనసు వెళ్ళిన చోటుకు మనిషి వెళ్ళకుండా విలువలతో 
ఉండాలని అందరికి చెప్పిన దేశం మనది.మరి అందరి 
హృదయం తాకి ఆలుమగల మధ్య వలపు పూలు 
పూయించాల్సిన బాధ్యత అందరిది.


నది మాస పత్రికలో ఇచ్చిన దిద్దుబాటు అనే గురజాడ 
వారి కధ ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.హీరో గారు సామాన్య 
మానవులే.కొంచం మనసు చపలత చెందుతుంది.
మనసు వెంట మనిషి పరిగెడుతాడు.కాని తన చదువుకున్న 
భార్య(చదువు కోక పోయినా భార్య స్థానం భార్యదే)
చిన్న నాటకం ఆడి ఇంటి పరువు పోకుండా అతని 
హృదయాన్ని మేలుకోలుపుతుంది.ఎప్పటికి సమ కాలీనాలు 
గురజాడ వారి కధలు.
ఆలు మగలు ఇహానికే కాదు పరానికి కూడా ఒక్కటి గానే 
చూడబడుతారు.అదే భారతీయత లోని అర్ధనారీశ్వర 
తత్వం.
                      
                          నువ్వు నేను 
                          మాయం 
                          అదే 
                          అర్ధ నారీశ్వర తత్త్వం 


మరి ఇంత గొప్పదైన దేశం లో ఇందరం చదువు కున్న 
వారం ఉండి ఎయిడ్స్ లో మన దేశం రెండో స్థానం లో 
ఉండటం అందరం ఆలోచించాల్సిన విషయం .దీని గూర్చి 
ప్రజల ను చైతన్య పరచటం తల్లితండ్రులదో,టీచర్స్ దో
భాద్యత కాదు ఈ గాలి ,ఈ నీరు అనుభవించిన మీ అందరిది.


మేమేమి చెయ్యగలం అనుకోకండి.ఏమి చేసి అవేర్ చెయ్యాలి 
అనుకోండి....మొన్న సాక్షి ఫండే లో చూసాను ఒక బూట్ 
పాలిష్ చేసే పేద అతను ఒక రోజు ఫ్రీగా బూట్ పాలిష్ చేసి 
భగత్ సింగ్ పై తన ప్రేమను చాటు కొన్నాడు.


బిందువు....బిందువు ....కలిస్తే సింధువు....రండి ...
మన దేశాన్ని ఎయిడ్స్ నుండి కాపాడుకుందాము.


                          చైతన్యం తో 
                          కిరణం లా సాగిపో 
                          నీ పాద ముద్రలే  
                          ఓ చరిత్ర                  






గురజాడ వారి కధ చదువుకోండి.దాంపత్య జీవిత 
పరమార్ధాన్ని భారతీయులుగా గౌరవించండి.






మీరు చదువుకున్న స్కూల్ లో ఎయిడ్స్  అవేర్ నెస్ మీద 
పోటీలు జరపోచ్చు.......
ఎయిడ్స్ మీద ప్రచారం చేసే సంస్థ లకు సాయం చేయోచ్చు.....
కనీసం మన బ్లాగ్ లో ఒక పోస్టింగ్ వేయొచ్చు.....


నేను మా విద్యార్దులకు ఎప్పుడు ఒక మాట చెపుతుంటాను.


"మంచి పనికి ముందుండు...చెడు పనికి వెనక ఉండు"


మరి మంచి ,చెడు ఎవరు చెపుతారు అంటారా?మీ హృదయమే 
దానిని ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి.

Saturday 12 November 2011

హా...కృష్ణా యెంత పని చేసావు?

అసలు నీ గూర్చి రాయాలని నాకు ఎందుకు 
సంకల్పం కలిగించావు?కలిగించిన వాడివి 
కలం ముందుకు పోకుండా ఆంక్షలు ఎందుకు పెట్టావు?
   
సమయానికి వలబోజు.జ్యోతి గారు వచ్చి "శశి 
వాళ్ళేమి అనుకుంటారు....వీళ్ళు ఏమి అనుకుంటారు ....
అనుకొని వ్రాస్తే కలం కదలదు ,ఫీల్ అయ్యి వ్రాయమ్మ "
అని చెప్పబట్టి కలం కదిలింది.జ్యోతి గారికి బోల్డన్ని 
థాంక్యులు"
 ఏమిటి కన్నయ్యా....నువ్వే ఆమెను పంపావా?
ఓకే....నీకు బోల్డెన్ని థాంక్యు లు......

          కన్నయ్య 
          పలకడు
          వట్టి 
          చేతల మనిషి.....

మాలిక ఈ రోజు విడుదలైన సంచిక లో 
నా రాధా మాధవ దివ్య దీపావళి లింక్.....
once again thanks to jyothi gaaru.....
and maalika editor gaaru.


Wednesday 9 November 2011

హూ.....ఏమి చేస్తాము ప్రేమంటే అంతే

ఇల్లంతా చిన్నపోయింది .......
నవ్వుల పువ్వుల రవ్వలు ,పాటల గువ్వలు,
అల్లరి పాటలు... మాటలు... ఆటలు....ఇవన్ని ఏవి?

ఓహో...అదీ సంగతి చక్కని వెన్నెలమ్మ అలక మబ్బులో 
కూర్చొని ఉంది.

ఏమైందబ్బా?...ఊహూ...మౌనమే సమాధానం....
చ...ఇల్లే బోసి పోయింది ....అల్లరి అయితే అయింది 
అదే బాగుంది.......

చెప్పబ్బా?నువ్వు చెప్పక పొతే నాకెలా తెలుస్తుంది?
చెప్పవా ....ప్లీజ్..........

"మరైతె నాకు ఒక ప్రెమ లెఖ వ్రాయండి."

"ఇప్పుడా?""అవును ఇప్పుడే మీరు నాకెప్పుడూ వ్రాయలేదు"

"మనమెప్పుడూ దూరంగా లేక పోతిమి ...అందుకే వ్రాయలేదు"

"మరే నేను పుట్టింటికి వెళ్ళినా ఏదో ఒక సాకు చెప్పి,
బస్సు మిస్ అయిందని చెప్పి అక్కడకు వచ్చేస్తుంటిరి...
ఇక దూరంగా ఎలా ఉంటాము ?అయ్యన్నీ నాకు తెలీదు...
ఇప్పుడు వ్రాయాల్సిందే"ముచ్చటైన బుంగ మూతి మురిపెంగా...

(ఇప్పుడేమిటి దారి?ఏదో బుక్ లో చూసుంటుంది....
అసలు ఆ బుక్ వ్రాసిన వాడిని అనాలి....గొణుక్కున్నాడు)

"పిచ్చిదానా ...ప్రేమ లేఖ వ్రాయక పొతే ప్రేమ లేనట్లా?
అయినా అది ఒక ఆర్ట్ కదా అందరు వ్రాయలేరు....."

బుంగ మూతి మారలేదు.....ముద్దు అలక తీరలేదు....

నిష్టూరాల వర్షం ......"అంతే లెండి....బయట అందరికి 
ప్రేమను పంచుతారు...గౌరవాన్ని ఇస్తారు....నేను ఎక్కడకు 
పోలేనని అలుసు....నా ప్రేమ ను విసుగులుగాను,
నా ప్రేమను తిట్లు గాను,నా ప్రేమను కోపంగాను,
నా ప్రేమను మౌనంగాను,నా ప్రేమను అలసట గాను 
ఫీల్ అవ్వమని మమ్మల్ని అడుగుతారు...అంతేగాని 
ప్రేమను ప్రేమ రూపంలో ఇవ్వరు...ఏమి మేము డబ్బులు,
కెరీర్ మేమివ్వకపోయినా జీవితాంతం మీతోనే ఉంటాముగా 
మాకు కొంత టైం కేటాయిన్చావచ్చుగా....ఇక్కడ సంతోషం 
లేకపోయినా తరువాత మీరు యెంత సంపాదించింది 
ఎవరి కోసం?"

మనసుని తాకిన వెలితి...ఒక్కసారి హృదయాన్ని తెరుస్తూ......

నిజమే తనని సంతోషం గా ఉంచలేక పొతే తను భర్తగా 
ఏమి చేస్తున్నట్లు?అంతరంగంలో మమతల సునామి.....

"సరే ప్రేమ లేఖ సంగతి వదిలేయ్...నా పుట్టిన రోజుకి 
నువ్వు కూడా చీర కొనుక్కో"....ఊహూ...."సరే యేవో 
నగలు కావాలన్నావు కదా కొనుక్కో"ఊహూ.......

"సరే సినిమాకి పోదామా?"

(హన్నా సినిమాని చివర చెపుతావా?నయం ముందు 
చెపితే అలక వదిలేసి ఉండేది....మనసులో అనుకుంది)
లాభం లేదు ఏమి చేద్దాం?

"బంగారు"తన చేతిని చేతిలోకి తీసుకొన్నాడు....

(అయ్యా బాబోయ్ ...ఇదేమిటి టెలిగ్రాఫ్ లో అక్షరాలూ 
విధ్యుత్ తరంగాలుగా ప్రవహిస్తాయంట....అలా అక్షరాలను 
తరంగాలుగా మార్చి నాలో పంపెస్తున్నాడా ఏమిటి?
మరి మైండ్లో డీ కోడింగ్ మిషన్ పని చేయటం లేదా?

ఏమీ అర్ధం కావటం లేదు......

ఆ కళ్ళు బాబోయ్ దాని ద్వారా ఏమి పంపిస్తున్నాడు....
ఓయ్...మనసు అలక మాని వెళ్లవాకు.....వినటం లేదే...
వెళ్ళిపోతుంది......తరిమే స్వరమా....తడిమే వరమా.....
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా....వింటున్నావా.....
ఏమో...ఏమో...ఏమవుతుందో........

అరె ఏమిటి అలక మానేయమని చెపుతోంది....ఓటమా?

అరె ఏంటబ్బా ఈ మాంగల్య బంధానికి ఇంత శక్తి ....
ఇద్దరినీ ఒకరి కోసం ఒకరిని ఓడి పొమ్మని చేపుతుందే....
అంత శక్తి దానిలో ఉందా?అందుకే కాబోలు దానిని ఎవరికి 
కనపడకుండా హృదయానికి దగ్గరగా ఉంచుకోవాలంటారు....
ఈ శక్తి కి నైతిక విలువల సోబగులద్దితే ఓటమి కూడా 
అందంగా ఉందే.........

అరె ఇద్దరం ఓడిపొతే గెలిచేదేవారు?సమాజం లో సంసార 
గౌరవం కాబోలు.....హృదయం మెత్త బడుతూంది.......

"సరే నా గూర్చి ఒక కవిత చెప్పండి"ఇరవయ్ ఏళ్ళ కాపురం 
ఇరవై వాక్యాలు అయినా చెప్పరా.....అనే ధీమా....కళ్ళలో...

మళ్ళా నావాడు కళ్ళతోనే....తప్పదా కళ్ళలో ప్రశ్న.....
చెప్పాల్సిందే.....పట్టుదలతో కళ్ళలోకి చూడలేక 
మీసాల కింద కదిలే పెదాల వైపు చూస్తుంది.......
ముత్యాలు పడితే ఎరుకుందామా.....అన్నట్లు.....
మెల్లగా కదిలాయి పెదాలు....చిన్నగా పదాలు పేరుస్తూ.....

                    నీ కు భర్త గా 
                    కంటేనీ వడిలో 
                    బిడ్డగావాలని
                    ఉంది చిన్నారి.......

 తన కను కోలుకుల్లో నీళ్ళు ముత్యాలుగా 
మారి .....స్వర్ణాభిషేకం చేసినా ఇంత సంతోషంగా 
ఉంటుందా?తన భార్య కన్నుల్లో ఏ భర్త కి దొరకని 
అపురూప ప్రశంస.......................

(సరే ఏమి చేద్దాము ....కవి గారు ఎపుడో చెప్పారు....
ఓ చెలి....తెలుసా....తెలుసా....తెలుగు మాటలు పదివేలు....
అందులో ఒకటో రెండో.....నువ్వు చెపితే అది చాలు.....
రివర్స్ లో పాడుకుంటే సరి.....అంతరంగం నుండి వచ్చినవి 
ఆరు మాటలైనా అమృతమే.....)

కధ అయిపోయిన్దోచ్చ్..........  

మామూలే మీకు కబుర్లు చెప్పాలి కదా.......
అసలు విషయం ఏమిటంటే .....మీ లైఫ్ పార్ట్ నర్
ఎలాగా ఉండాలో మీరే ఎన్నుకున్న తరువాత మీరు 
పుట్టారు.....తన లో లోపాలు కనిపిస్తుంటే లోపాలు 
కనపడనంత తనని మీరు ప్రేమించటం లేదన్న మాట....
అసలు తను మీలో భాగం అనుకుంటే అసలు లోపాలే 
కనపడవు......

అన్నట్లు అలక రుచి,ఆవకాయి రుచి ఆలు మగలకి 
తెలిసినట్లు గూగుల్ వాడికి తెలీనట్లు ఉంది....ఇమేజెస్ 
దొరక లేదు.........అలక నీటిలో గీసిన నాగేటి చాలు.....
గీస్తూ ఉంటె వెంటనే హృదయాలు కలిసిపోతూ ఉంటాయి.....
 
 అమ్మాయిలూ....ఊరికినే అలగొద్దు....అవతలి వాళ్ళ మూడ్ 
చూసి అలగాలి......అప్పుడే అలక సరదా మీకు ...అదే వేడుక 
మాకు ....అని తీరుస్తారు.....అది కూడా వాళ్ళు పాపం 
తీర్చ దగినవే అడిగితె అవిచ్చేసి .....ఎవరెస్ట్ శిఖరం 
ఎక్కినట్లు ఫీల్ అవుతారు......లేక పొతే తోలు తీసే 
ప్రమాదం ఉంది....తరువాత నన్ను అనొద్దు.........

మరి పెళ్లి కాని వాళ్ళు ఏమి చేస్తారు పా....పం....

"ఉందిలే మంచి కాలం ముందు ముందునా ....
అందరు సుఖపడాలి నందనందనా...."అని పాడుకోండి.

ఎందుకంటె చుట్టూ మల్లె తోట ఉంటె ఆ పరిమళం 
మనలో కూడా వ్యాపించి నట్లు.....చుట్టూ అందరు 
సంతోషంగా ఉంటె ఆ సంతోషం మీలో కూడా వ్యాపిస్తుంది....

Thursday 3 November 2011

"లా"వొక్కింత కావాలి ప్లీజ్......

ఈ రోజు ఒక ఆర్టికల్ చదివాను.
మరియమ్మ అనే ఆవిడ పేదది అయినా ముసలి వాళ్ళని 
చేరదీసి వాళ్లకు అడుక్కొని తీసుకు వచ్చి ఇంత
అన్నం పెడుతుంది.
పెట్టినా ,పెట్టక పోయినా వందనం అంటుంది
కాబట్టి ఆమెను అందరు వందనాలమ్మ అంటారు.

అంతే కాదు ఈ వయసులో ఢిల్లీ దాకా వెళ్లి  ఆ సంస్తకు   
కొంత డబ్బులు శాంక్షన్ చేయించు కొని వచ్చింది.
అయితే ఇప్పుడు సమస్య ఏమిటంటే కొన్ని నెలలుగా 
ఏమి డబ్బులు రావటం లేదు.డబ్బులు రాలేదని 
అందరి ఆకలి ఆగదు కదా......

ఆరు లక్షల దాకా ఐదు రూపాయల వడ్డీ కి తెచ్చింది.
ఇప్పుడు ఆ డబ్బు యెంత కట్టాలి?ఎలా కట్టాలి?
అంత మంది ముసలి వాళ్ళు ఏమి కావాలి? 

డబ్బులు సాయం చేయమని ,కన్నీరు కార్చమని 
నేను ఇది వ్రాయలేదు...............
అవి సమస్యని ఈ రోజు తీరుస్తాయి....కాని మును ముందు 
ఎలా?
అందుకే ఎవరైనా  లా   తెలిసినా వాళ్ళు ,స్వచ్చందం గా 
సాయం చేసే వారు ఉంటె ప్రభుత్వం పై ఎలా ప్రొసీడ్ అవ్వాలో 
చెప్పండి .వాళ్లకి సాయం చెయ్యండి.

మామూలుగా పదునాలుగు సంవత్స్చారాల లోపు పిల్లలు 
తమకు చదివే హక్కు,జీవించే హక్కు ఉందని కోర్ట్ కి 
చెప్పుకోవచ్చు.

మరి పెద్ద వాళ్లకి ఈ హక్కులు ఉండవా?
"లా "వొక్కింత కావాలి ప్లీజ్.......

ఈ విషయం మీరు చక్కగా డీల్ చేస్తే అంత మంది పెద్ద 
వాళ్లకి తిండి దొరకటమే కాదు.....మీ చదువుకి సార్ధకత 
కలుగుతుంది.
     


      కన్నీళ్లు 
      కార్చొద్దు
      ఆకలిని అవి 
      ఆర్పలేవు       


ఆ ఆర్టికల్ ఇక్కడ ఇస్తున్నాను చదువుకోండి.


link for the news link in sakshi daily

Tuesday 1 November 2011

వహ్వా....ఏమి భారతీయ ఎసెన్స్ .....

ఈ రోజు మీకు ఏమి చెప్ప బోతున్నాను అంటే ....
ఏమిటి మీకు తెలుసా?.....అరె మీకేలా తెలుసు 
నేను సెవెంత్ సెన్స్ గూర్చి చెప్పబోతున్నానని........

ఓహో....మీ సిక్స్త్ సెన్స్ చెప్పిందా?ఆహా పే..ద్ద....
చెప్పండి సిక్స్త్ సెన్స్ అంటే ఏమిటి?

నన్నే చెప్పమంటారా....ఓ.కే.....మనకు ఐదు జ్ఞానేంద్రియాలు 
ఉంటాయి కదా....వాటిద్వారా మనం అన్ని గ్రహిస్తాము కదా....
కాని కొన్ని సార్లు మనకు ఎలాగో వీటి ప్రమేయం లేకుండా 
ఏమి జరగబోతుందో తెలిసిపోతుంది.....అది ఎలాగో తెలీదు...
దానినే సిక్స్త్ సెన్స్ అంటాము....ఇంకా కొన్ని విచిత్రాలు కూడా 
జరగోచ్చు....అంటే మనకు ఎవరో తెలీని వారు..చూడని వారు...
వాళ్ళ విషయాలు కూడా మనకు తెలియ వచ్చు....అయితే 
అదేమీ పెద్ద గొప్ప కాదు.....మనం రేడియో ఆన్ చేసినపుడు
 ఏ చాన్నేల్ ఫ్రేక్వేన్సి తగిలితే అది వచ్చేస్తుంది కదా....అంతే.....

మరి ఈ సెవెంత్ సెన్స్ ఏమిటో నాకు తెలీదు...
కధ విషయానికి వస్తే మామూలే ...
అంటే....దశావతారం లాగా బయో వార్ గూర్చి....
ఆంటే ఒక దేశం ఇంకో దేశం పై వైరస్ ని వ్యాప్తి చేసి 
జబ్బులు సృష్టించి దానిని లొంగ దీసుకోవాలని 
ప్రయత్నించటం.....కాక పొతే ఇక్కడ చైనా భారత్ పై 
ప్రయోగిస్తుంది.....

హీరో గూర్చి చెప్పాలంటే సూర్య ఏ పాత్ర అయినా 
విరగ దీసేస్తాడు ..... మొదట భోది ధర్మగా ........
అన్ని విద్యలు తెలిసిన వ్యక్తిగా కంచి పురం నుండి 
ఒక వ్యాది ని అరికట్టటానికి చైనా వెళతాడు...ఆ వ్యాధికి 
ఎంతో మంది చనిపోతుంటే వైద్యం చేసి వాళ్ళను 
కాపాడటమే కాక...బందిపోట్లు నుండి వాళ్ళను రక్షిస్తాడు.

అయితే యుద్దవిధ్యలె కాక కళ్ళ తో హిప్నటైజ్ చేసి 
(ఉల్ఫా మేస్సింగ్)తో వాళ్ళ లో వాళ్ళే చంపుకొని చచ్చేలా 
చేస్తాడు.అది చూసి అక్కడి వాళ్ళు అవి తమకు నేర్పమని
 కోరుతారు.అలా అక్కడే వారికి నేర్పుతూ ఉంటె, అతను
అక్కడ నుండి వెళ్ళ కూడదని వారు విషం కలిపిన అన్నం 
పెడతారు.ధర్మా కు అది తెలిసినా వాళ్ళ కోరికను మన్నించి 
తిని చనిపోతాడు.ఆయనను సమాధి చేసి షూ లైన్ అనే 
గుడి కట్టి అక్కడ అందరికి యుద్ద  విద్యలు నేర్పుతుంటారు. 

అసలు సూర్య కాదండి...డైరెక్టర్ ...
మ్యూజిక్ డైరెక్టర్ మనలను 
ఉల్ఫా మేస్సింగ్ చేసేస్తారు...
హాల్లో అందరు ఆ మ్యూజిక్ కి 
అలా సూర్యాని చూస్తుండి పోయారు.... 


తరువాత భోది ధర్మా వంశం లో ఇప్పటి కాలం లో 
పుట్టిన వాడు సూర్య.....హీరోయిన్ తన
జెనిటిక్ పరిశోధనలో భాగంగా ధర్మ లాంటి
D.N.A. ని సూర్య లో ప్రేరేపిస్తే మళ్ళా అతను
ధర్మా లాగా ఉపయోగ పడుతాడని
అతని వెనుక తిరుగుతూ ఉంటుంది.

అసలు శ్రుతి హాసన్ ఉందీ....
అసలు ఆ కళ్ళు.....
సోనాలి బింద్రే,శ్రుతి హాసన్ వాళ్ళు  అంతే.....


జిస్ దేశ్ మే గంగా బహతీ హై......
ఉస్ ఆంఖో మే భారతీయత బహతీ హై.....

(అసలు బాపు గారికి సీత గా వీళ్ళు ఇద్దరు ఎందుకు
 కనపడలేదో ఏమో...ప్చ్....)

ఈ లోపల చైనా వాళ్ళు domgle  అనే వాడి ద్వారా 
ధర్మా ఏ వైరస్ నుండి చైనా వాళ్ళని కాపాడాడో అదే 
వైరస్ ని వీది కుక్కల ద్వారా అందరికి వ్యాపింప చేయాలని 
ఇండియా కి పంపుతారు.ధర్మాకి వచ్చిన విద్యలన్నీ 
కళ్ళతో హిప్నటైజ్ చేయటం తో సహా వాడికి తెలుసు.
వాడు ఒక కుక్కకి ఆ వైరస్ ఎక్కించి మనుషులలో కూడా 
ఆ వైరస్ వ్యాప్తి చేస్తాడు.దానికి మందు ఇండియా లో లేదు 
కాబట్టి దాని కోసం ఇండియా లోంగుతుందని చైనా ప్లాన్.

కాని సూర్యాని హీరోయిన్ ధర్మా గా మార్చాలని పరిశోధన 
చేస్తున్న సంగతి తన ప్రొఫెసర్ ద్వారా చైనా కి తెలుస్తుంది.
ప్రోఫెసర్ ని  డబ్బుతో కొనేసి డోంగ్లి ద్వారా శ్రుతిని
 చంపించాలని చూస్తారు.
శృతి దేశం లో  వైరస్ వ్యాప్తి చెందటం చూసి ధర్మా 
వస్తే తప్ప వైరస్ కి మందు కనుగోనలేరని సూర్యాని 
ధర్మా గా మారుస్తుంది.

తరువాత సూర్యా డోంగ్లి ని చంపటం ,వైరస్ కి మందు 
కనిపెట్టి అందరిని రక్షించటం మామూలే.
కాక పొతే మన భారత దేశం గొప్పదనం తెలుసుకోమని ,మూడ విశ్వాసాలు అనుకునేవి సైన్సు అని అందరుతెలుసుకోవాలని 
చెపుతాడు ముగింపు లో సూర్యా.

సంగీతం చాలా బాగుంది.....స్క్రీన్ ప్లే బాగుంది.....
కెమెరా బాగుంది.....అన్నిటికి మించి ప్రేమ కంటే 
ముఖ్యం అందరికి మేలు చేయటం అనే సందేశం 
చాలా బాగుంది....కేవలం ప్రేమలో విపలమైనామని 
చనిపోయే వారు తమ జీవితం యెంత ముఖ్యమైనదో 
తెలుసు కోవాలి.

నేను రెండు విషయాలు చెపుతాను.

ఒకటి సూర్య ఒక పాటలో రక్త దానం చేస్తాడు.
అది వీలైన అందరు చేయండి....ఎందుకంటె రక్తం 
కృత్రిమంగా చేయటం ఇంకా కనుగొన లేదు....దేవుడు 
ఇచ్చిన మంచి రక్తాన్ని చెడు అలవాట్లతో కలుషితం 
 చేసుకోవాకండి.ముఖ్యంగా "ఓ" పాజిటివ్ వాళ్ళు 
దేవుడు ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడే అవకాశం మీకు 
మాత్రమె ఇచ్చాడు.ఆ కర్తవ్యాన్ని గర్వంగా పాటించండి.

రెండోది ఎన్ని వేల ఏళ్ళు అయినా మన జీన్స్ లో 
భారతీయత అనువంశికంగా ప్రవహిస్తూ ఉంటుంది.
ప్రయత్నం తో అది వెలికి దీయండి.ముఖ్యంగా 

స్త్రీలను గౌరవించటం మన సాంప్రదాయం ....

అది మీరు కూడా పాటించండి.....ఒక చక్కటి పువ్వు....
చిన్న పిల్లల చిరునవ్వు......చల్లని తెమ్మెర .......
వర్షపు జల్లు......యెంత అందంగా అస్వాదిస్తామో 
స్త్రీలు కూడా అంతే.......అంతే పవిత్రంగా వారిని 
గౌరవించాలి .....మన జాతిని కాపాడుకోవాలి......
వాటిని వాటి స్తానం లోనే గౌరవించాలి ....ఆప్పుడే
మనకు మన దేశానికి క్షేమం..