Friday 30 November 2012

ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్

ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్ 

చాలు అర్ధం అయింది కదా.
ముఖ్యంగా మీరు కాదు మీ తరువాతి తరానికి దీని 
గూర్చి అవేర్ చేయండి.పిల్లలతో కొంతవరకైనా 
చెప్పండి.లేకుంటే మీరు ఎన్ని ఆస్తులు కూడపెట్టినా 
పిల్లలకు వృధా.మేము మంచి కార్పరేట్ స్కూల్స్ లో 
వేసాము ,మేము ఏమి చెప్పము అనుకున్నారు అంటే 
ఇక అంతే....అసలు రిస్క్ గ్రూప్స్ టీనేజ్ లోనే ఉన్నాయి.
ఎలాగో టీచర్లు లేసన్స్ లో కొంత చెపుతారు.రెండో వైపుగా 
మీరు ఇది ఒక వ్యాది ఇలాగు వ్యాపిస్తుంది అని మీరు 
చెప్పగలిగినంత వరకు చెప్పండి.అప్పుడు దీపం లాంటి వారి 
భవిష్యత్తు రెండు వైపులా చేయి ఉంచి 
కాపాడిన వారు అవుతారు.
మీ పిల్లలకు మాత్రమె కాదు మీ ఫ్రెండ్స్ పిల్లలకు కూడా 
ఫ్రెండ్లీగా మాట్లాడి విషయం అర్ధం అయ్యేటట్లు చెప్పండి.

చదువుకున్న వాళ్ళగా మనకు చేతనైనంత 
మన చుట్టూ ఉన్న వాళ్ళను అవేర్ చేయడం 
మన బాధ్యత.


ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్ 

Wednesday 28 November 2012

మలాలా యూసఫ్‌జాయ్....గొంతు నులిమిన ఒక కోయిల

అక్కడ పావురాల కుత్తుకలు ఉత్తరించబడుతాయి 
సాంప్రదాయమొక్కకి ఆహారంగా .......
కోయిలల గొంతులు ఆంక్షలకు మెలిపడుతాయి
కొత్తరాగాలు విచ్చుకోకుండా.......
లేడిని వేటాడటం......లేడీని వేదించటం 
అణగతొక్కిన మూలుగులు 
స్వేచ్చ కోసం పోరాటం 
చదువు కోసం ఆరాటం 
బురఖాల వెనుక అదుముకున్న ఆవేశాలు
నిత్యజీవితపు నరకాలు 
లోకానికి కనపడని కోణాలు ......

లేత పూరేకు నేడు విచ్చుకుంది 
ప్రశ్నగా మారి తూటాకు ఎదురుగా నిలిచి 
వేటువేసే  కొడవళ్ళ పై అక్షరాలచిత్రాన్నిపరిచి 
హక్కుల కాలరాతను 
మరణించిన మానవత్వాన్ని 
మా ఉనికి ఎక్కడనే ప్రశ్నను 
కాలపాశంలా లోకంపై విసిరింది 

వేలగొంతుకల స్వేచ్చా నినాదాలు పలుకుతున్న 
ఆ చిన్నారి మొక్కజొన్న పువ్వు 
''మలాలా యూసఫ్‌జాయ్. ''
అడ్డంకుల చేదించు 
వివక్షల సంకెళ్ళు తెంచు 
నీ హక్కులకై ఉద్యమించు 
రేపటి రోజు నీదే.....
ఇందరి ఊపిరే ....నీ శ్వాస.
కళ్ళలో పొంగే ఆశలే ...నీ ఆయుష్షు...
పదుగురికోసం కొట్టుకునే గుండె 
ఉద్యమాల మోతతో మోగే డప్పు 
ఈ రోజు నీవు వ్రాసిన మాట 
కావాలి ఎందరికో స్పూర్తినిచ్చే బాట. 

''మలాలా యూసఫ్‌జాయ్.'' గూర్చిన కధనం 
25/11/2012 నాటి ఫండే లో చాలా బాగుంది .
చదవండి.లింక్ ఇక్కడ ......
(మలైలా చీకటిని ప్రశ్నించిన వెలుగురేఖ )


ఉర్దూలో ‘గుల్ మకాయి’ అంటే మొక్కజొన్న పువ్వని అర్థమట. ‘మలాలా’ అనే పేరు ప్రపంచానికి తెలియకముందు, ఆ కలంపేరుతో తమ ప్రాంతపు వెతను ప్రపంచానికి వెల్లడించింది మలాలా యూసఫ్‌జాయ్. అప్పుడు తన వయసు పదకొండేళ్లు. ఏడో క్లాసు చదువుతోంది. ఇంత చిన్నమ్మాయి ఇదంతా చేసిందంటే అబ్బురమనిపించొచ్చు. కానీ పరిస్థితులు ఎవరినైనా అలా తీర్చిదిద్దుతాయంటుంది తను, పెద్ద ఆరిందలా. తాలిబాన్ల ప్రాబల్యం ఉన్న పాకిస్తాన్‌లోని స్వాత్ ప్రాంతంలో, బాలికల చదువు మీద నిషేధాజ్ఞలున్న విపత్కర ప్రదేశంలో దానికి వ్యతిరేకంగా గళం విప్పింది. 2009 నుంచీ ప్రసార మాధ్యమాల్లో స్పందించింది. పిన్న వయసు విద్యాహక్కుల కార్యకర్తగా మన్ననలందుకుంది. దీన్ని సహించలేని తాలిబాన్లు మొన్న అక్టోబర్ 9న ఆమె మీద కాల్పులు జరిపారు. ఒక దశలో అంతిమసంస్కారాలకు ఏర్పాట్లు చేయడం గురించి ఆలోచించారామె తల్లిదండ్రులు. కానీ క్రమంగా కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి నవంబర్ 10ని ‘మలాలా డే’గా ప్రకటించిన నేపథ్యంలో ఈ మొక్కజొన్న పువ్వు ‘బీబీసీ ఉర్దూ ఆన్‌లైన్’లో డైరీ రూపంలో పరిచిన అంతరంగం...

జనవరి 3, 2009; శనివారం:

రాత్రి నాకో భయానకమైన కలొచ్చింది. అందులో తాలిబాన్లు, హెలికాప్టర్లు! స్వాత్‌లో మిలిటరీ ఆపరేషన్ జరుగుతున్నప్పటినుంచీ ఇలాంటి కలలు తరచూ వస్తున్నాయి. 

అమ్మ చేసిన టిఫిన్ తిని స్కూలుకు వెళ్లిపోయాను. స్కూలుకు వెళ్లాలంటే భయమేస్తోంది. ఎందుకంటే, విద్యార్థిను లెవరూ పాఠశాలలకు వెళ్లకూడదని తాలిబాన్లు ఆజ్ఞాపించారు. 27 మంది ఉన్న మా క్లాసులో కేవలం 11 మందిమే వచ్చాం. నా ముగ్గురు స్నేహితురాళ్ల కుటుంబాలు వరుసగా పెషావర్, లాహోర్, రావల్పిండికి వెళ్లిపోయాయి.
స్కూలు నుంచి సాయంత్రం తిరిగొస్తుండగా, ఒకాయన ‘నేను నిన్ను చంపేస్తా,’ అనడం వినిపించింది. భయంతో వేగంగా నడుస్తూ... కొంత దూరం తర్వాత ఆయన నా వెనకే వస్తున్నాడా అని తిరిగిచూశాను. హమ్మయ్య! ఆయన మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ ఎవరినో బెదిరిస్తున్నాడు.

జనవరి 4; ఆదివారం:

ఇవ్వాళ మాకు సెలవు కాబట్టి ఆలస్యంగా పదింటికి నిద్రలేచాను. లేచేసరికి, గ్రీన్‌చౌక్‌లో పడివున్న ఏవో మూడు శవాల గురించి మా నాన్న చెబుతున్నాడు. అది వినగానే నాకు చేదుగా అనిపించింది.
ఇంతకుముందైతే ఆదివారాల్లో మార్గజార్, ఫిజాఘాట్, కుంజుకు పిక్నిక్ వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఏడాదిన్నరగా బయటికే వెళ్లలేదు. రాత్రి భోజనం తర్వాత సరదాగా వాకింగ్‌కు వెళ్లేవాళ్లం. ఇప్పుడు సూర్యాస్తమయం లోపలే ఇంట్లో ఉంటున్నాం. 

ఈరోజు ఇంట్లో అమ్మకు పనిలో సాయపడ్డాను, కొంత హోమ్‌వర్క్ ఉంటే చేశాను, కాసేపు తమ్ముడితో ఆడుకున్నాను. 

జనవరి 5; సోమవారం:

స్కూలుకు రెడీ అవుతుండగా గుర్తొ చ్చింది, మా ప్రిన్సిపల్ యూనిఫారాల్లో కాకుండా సివిల్‌డ్రెస్సుల్లో రమ్మని చెప్పిన విషయం. కాబట్టి నాకు ఇష్టమైన పింక్‌డ్రెస్ వేసుకున్నాను. మిగతా అమ్మాయిలు కూడా రంగురంగుల దుస్తులు వేసుకోవడంతో స్కూల్లో కాకుండా ఇంట్లో ఉన్నట్టనిపించింది. ఉదయపు అసెంబ్లీలో ‘రంగురంగుల దుస్తులు వేసుకోవద్దు, తాలిబాన్లు అభ్యంతరం చెబుతా’రని ప్రిన్సిపల్ అన్నారు.

ఒక ఫ్రెండ్ నా దగ్గరికొచ్చి, ‘దేవుని మీదొట్టు, నిజం చెప్పు, మన స్కూలుమీద తాలిబాన్లు దాడిచేస్తారా?’ అని అడిగింది.

స్కూలు నుంచి వచ్చేశాక లంచ్ చేసి, ట్యూషన్‌కు వెళ్లాను. సాయంత్రం టీవీ వార్తల్లో షకర్ద్రాలో పదిహేను రోజుల తరవాత కర్ఫ్యూ తొలగిస్తున్నట్టు చెప్పారు. సంతోషమేసింది. ఆ ప్రాంతంలో మా ఇంగ్లీష్ టీచర్ ఉంటారు. అయితే రేపట్నుంచి మేడమ్ స్కూలుకు వస్తారన్నమాట!

జనవరి 7; బుధవారం:

మొహర్రం కాబట్టి బునేర్ వచ్చాం. ఇక్కడి పర్వతాలు, ఆకుపచ్చటి మైదానాలంటే నాకు చాలా ఇష్టం. నా స్వాత్ ఇంతకంటే అందమైనది కానీ అక్కడ శాంతి లేదు. కానీ ఇక్కడ కాల్పులు లేవు, భయం లేదు, ప్రశాంతంగా ఉంది. 
పీర్ బాబా సమాధికి వెళ్లాం. చాలామంది జనం ఉన్నారు. దుకాణాల్లో గాజులు, చెవిరింగులు, లాకెట్స్ అమ్ముతు న్నారు. ఏవైనా కొంటే బాగుంటుందనిపిం చిందిగానీ అంతగా నచ్చలేదు. అమ్మ మాత్రం గాజులు, చెవిరింగులు తీసుకుంది.

జనవరి 14; బుధవారం:

స్కూలుకు వెళ్తున్నప్పుడు ఎందుకో మనసేమీ బాగోలేదు. రేపట్నుంచీ శీతాకాలపు సెలవులని ప్రిన్సిపల్ అనౌన్స్ అయితే చేశారుగానీ మళ్లీ ఎప్పుడు తెరుస్తారో చెప్పలేదు. ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇంతకుముందయితే తేదీ స్పష్టంగా చెప్పేవారు. దీనికి కారణం కూడా ప్రిన్సిపల్ చెప్పలేదు. నేననుకోవడం జనవరి 15 నుంచీ విద్యార్థినుల చదువు మీద తాలిబాన్లు నిషేధం ప్రకటించడమే కారణం.

సెలవులు ఇచ్చినప్పుడు సంతోషపడక పోవడం కూడా ఇదే మొదలు. తాలిబాన్లు ప్రకటించినట్టే జరిగితే మళ్లీ స్కూలుకు రావడమంటూ ఉండదు. కానైతే కొంతమంది అమ్మాయిలు మళ్లీ ఫిబ్రవరిలో స్కూలు ఓపెన్ అవుతుందన్న ఆశతో ఉన్నారు. ఇవ్వాళ చివరిరోజు కాబట్టి స్కూలు మైదానంలో ఎక్కువ సేపు ఆడుకున్నాం. తిరిగి వచ్చేటప్పుడు, మళ్లీ ఇక్కడికి రామేమో! అన్నట్టుగా స్కూలు బిల్డింగు వైపు తదేకంగా చూశాను.

జనవరి 15; గురువారం:

రాత్రంతా ఒకటే కాల్పుల శబ్దం. మూడుసార్లు మెలకువొచ్చింది. అయితే స్కూలు ఎటూ లేదు కాబట్టి పదింటికి నిద్ర లేచాను. ఒక స్నేహితురాలొస్తే కాసేపు హోమ్‌వర్క్ గురించి మాట్లాడుకున్నాం.

ఈరోజే మొదటిసారి బీబీసీ-ఉర్దూ బ్లాగులో నేను రాసిన డైరీని ఒక పేపర్ అచ్చువేస్తే చూశాను. అమ్మకు నా కలంపేరు గుల్‌మకాయ్(మొక్కజొన్న పువ్వు) బాగా నచ్చింది. ఇకనుంచీ నాపేరు అలా మారిస్తే బాగుంటుందికదా, అని నాన్నతో అంది. నాక్కూడా అలాగే అనిపించింది. నా అసలు పేరుకు అర్థం ‘దుఃఖంతో కూడిన’.
ఇంతకుముందెవరో ఈ డైరీ ప్రింట్ అవుట్ చూపించి, మా నాన్నతో ‘భలే బాగుంది,’ అన్నారట. నాన్న నవ్వి ఊరుకున్నారటగానీ రాసింది మా అమ్మాయేనని ఒక్క మాటైనా చెప్పలేదట.

జనవరి 16; శుక్రవారం:

ప్రభుత్వం మా స్కూళ్లను కాపాడుతుందని నాన్న అన్నారు. ప్రధానమంత్రి కూడా ఈ అంశం గురించి మాట్లాడారు. ముందయితే భలే సంతోషమేసిందిగానీ, నాకైతే నమ్మకం కుదరడం లేదు. స్వాత్‌లో రోజూ ఎంతోమంది సైనికులు చనిపోతున్నారు, ఎంతోమంది కిడ్నాప్ అవుతున్నారు. పోలీసులయితే ఎక్కడా కనిపించరు.
అమ్మానాన్న కూడా భయంగానే ఉన్నారు. అమ్మాయిలు స్కూళ్లకు వెళ్లొచ్చని తాలిబాన్లు ఎఫ్‌ఎం రేడియోలో ప్రకటించే దాకా నన్ను బడికి పంపమన్నారు. 

జనవరి 19; సోమవారం:

ఈరోజు మరో ఐదు స్కూళ్లు తాలిబాన్ల దాడిలో ధ్వంసమైనాయి. అందులో ఒకటి మా ఇంటి దగ్గరిది. ఎటూ స్కూళ్లు మూసేశారుకదా, మళ్లీ వాటిని పేల్చేయడమెందుకో నాకు అర్థంకాలేదు. తాలిబాన్లు పెట్టిన డెడ్‌లైన్ ప్రకారం ఎవరమూ స్కూళ్లకు వెళ్లలేదు.

జనవరి 22; గురువారం:

పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. రాత్రి మౌలానా షా దౌరాన్(తాలిబాన్ మతగురువు) ఎఫ్‌ఎం రేడియోలో ఆడవాళ్లు ఎవరూ ఇంట్లోంచి బయటకు రావొద్దని ప్రకటించారు. (స్కూళ్లకు వెళ్లొద్దని ప్రకటించింది కూడా ఈయనే.) సైన్యం తమ సెక్యూరిటీ పోస్టులుగా వాడుకుంటున్న పాఠశాలల్ని కూడా తాము పేల్చేస్తామన్నారు. హాజీ బాబా ప్రాంతంలోని స్కూళ్లల్లోకి సైన్యం వచ్చిందని నాన్న చెప్పారు. దేవుడా! వాటిని కాపాడు. ముగ్గురు దొంగలకు రేపు బహిరంగ కొరడాదెబ్బల శిక్ష అమలు చేస్తామనీ, ఇష్టమైనవాళ్లు వచ్చి చూడొచ్చనీ దౌరాన్ అన్నారు.

జనవరి 24; శనివారం:

మా యాన్యువల్ ఎగ్జామ్స్ సెలవుల తర్వాత జరగాలి. అయితే తాలిబాన్ల నిషేధం తొలగిపోతేనే అవి జరగడం సాధ్యం. కొన్ని చాప్టర్స్ చదువుకొమ్మని చెప్పారుగానీ నాకు చదవబుద్ధి కాలేదు.

ప్రతిసారీ మా స్కూళ్లో ఆనర్ బోర్డు మీద ఫస్టొచ్చిన వారి పేర్లు రాస్తారు. ఈసారి ఎవరి పేరూ ఉండేట్టు లేదు.

జనవరి 28; బుధవారం: 

మమ్మల్ని ఇస్లామాబాద్ తీసుకెళ్తానని నాన్న ఎప్పుడో మాటిచ్చారు. ఇప్పుడు నిలబెట్టుకున్నారు. రాత్రే ఇక్కడికి వచ్చాం. నాన్న స్నేహితుడి ఇంట్లో ఉన్నాం. ఇస్లామాబాద్ చూడటం ఇదే మొదటిసారి. పెద్ద బంగళాలు, వెడల్పయిన రోడ్లతో నగరం బాగుంది. మా స్వాత్‌తో పోల్చితే మాత్రం ఇక్కడ ప్రకృతి సౌందర్యం ఏమీలేదు. నాన్న మమ్మల్ని లోక్ విర్సా మ్యూజియమ్‌కు తీసుకెళ్లారు. ఇలాంటి మ్యూజియం స్వాత్‌లో కూడా ఉందిగానీ ఈ కాల్పుల్లో అది భద్రంగా ఉంటుందంటే అనుమానమే!

ఒక ముసలాయన దగ్గర నాన్న పాప్‌కార్న్ కొన్నారు. ఆయన ‘పష్తో’లో మాట్లాడుతుంటే, ‘మీది ఇస్లామాబాదేనా?’ అని నాన్న అడిగారు. ‘ఇస్లామాబాద్ ఎక్కడైనా పష్తూన్లదవు తుందా?’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. వాళ్లది మోమంద్ ఏజెన్సీ అనీ, సైనికచర్య వల్ల తమ తావు వదిలేసి బతుకుదెరువు కోసం ఇలా నగరానికి రావాల్సివచ్చిందనీ చెప్పారు. అప్పుడు అమ్మానాన్నల కళ్లల్లో కన్నీళ్లు చూశాను.

జనవరి 31; శనివారం: 

బన్ను నుంచి పెషావర్ వెళ్తుండగా మా స్నేహితురాలు ఫోన్ చేసింది. స్వాత్‌లో పరిస్థితి ఘోరంగా ఉందనీ, నన్ను తిరిగిరావొద్దనీ చెప్పింది. సైన్యానికీ తాలిబాన్లకీ పోరాటం తీవ్రమైందనీ, ఇవ్వాళ ఒక్కరోజే 37 మంది జనం చనిపోయారనీ చెప్పింది.

సాయంత్రానికి పెషావర్ వచ్చాం. చాలా అలసిపోయాం. టీవీ పెడితే స్వాత్ గురించిన రిపోర్టు. కాలినడకన, ఉత్తిచేతుల్తో స్వాత్ నుంచి వలస వెళ్తున్న జనాన్ని చూపించారు. ఇంకో ఛానల్లో ఒకామె, ‘బేనజీర్ భుట్టో హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం,’ అంటోంది. నాన్నను నేనడిగాను: మరి స్వాత్‌లో వందలాది మంది చనిపోతున్నారుకదా, దానికి ఎవరు ప్రతీకారం తీర్చుకోవాలి?

ఫిబ్రవరి 2; సోమవారం:

ఫిబ్రవరి 9న అబ్బాయిల స్కూల్స్ ప్రారంభమవుతున్నట్టుగా నోటీసు బోర్డుల్లో రాశారని నాన్న చెప్పారు. అమ్మాయిల స్కూళ్ల ముందు మాత్రం ఇలాంటి నోటీసులు పెట్టలేదట. అంటే మావి ఓపెన్ కావట్లేదన్నమాట.

ఫిబ్రవరి 9; సోమవారం:

బాలల పాఠశాలలు ప్రారంభమైనాయి. బాలికల ప్రాథమిక విద్య మీద తాలిబాన్లు నిషేధం తొలగించడంతో వారివి కూడా మొదలైనాయి. ప్రైమరీ వరకు మా స్కూల్లో కో-ఎడ్యుకేషన్ ఉంది.

మా చిన్న తమ్ముడి స్కూల్లో 49 మందికి ఆరుగురే వచ్చారట. అందులో ఒక్క పాప. మా స్కూల్లో 700 మందికి 70 మందే వెళ్లారట.

ఫిబ్రవరి 11; బుధవారం:

ఈమధ్య మేము తరచూ ఇవే మాటలు వింటున్నాం: సైన్యం, తాలిబాన్లు, రాకెట్, బాష్పవాయువు, మౌలానా ఫజుల్లా, పోలీస్, హెలీకాప్టర్, చనిపోవడం, గాయపడటం.

ఫిబ్రవరి 16; సోమవారం:

ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సైన్యానికీ తాలిబాన్లకూ శాంతి ఒప్పందం కుదిరింది. జనం మిఠాయిలు పంచుకున్నారు. నాకు శుభాకాంక్షలు చెప్పడానికి ఒక స్నేహితురాలు వచ్చింది. ఇన్ని రోజులూ తనను గదిలో బంధించినట్టుగా అనిపించిందని చెప్పింది. మా స్కూలు కూడా తెరుస్తారని ఆశగా ఉన్నాం.

ఫిబ్రవరి 18; బుధవారం:

ఇవ్వాళ మార్కెట్‌కు వెళ్లాను. రద్దీగా ఉంది. చాలా రోజుల తర్వాత ట్రాఫిక్ జామ్ అవడం చూశాను. 
సాయంత్రం, స్వాత్ జర్నలిస్టు మూసా ఖాన్‌ఖేల్‌ను ఎవరో చంపేశారని నాన్న చెప్పారు. మా శాంతి కల చెదిరి పోయినట్లనిపించింది.

ఫిబ్రవరి 23; సోమవారం: 

ఇవ్వాళ స్కూలు తెరుస్తారని తెలిసి, సంతోషమేసింది. కొంతమంది యూనిఫారాల్లోనూ, ఇంకొంతమంది సివిల్ డ్రెస్సుల్లోనూ వచ్చారు. అందరి ముఖాల్లోనూ ఎంతో సంతోషం కనబడింది. చాలారోజుల తర్వాత కలిశాం కదా, ఒకరినొకరం ఆత్మీయంగా కౌగిలించుకున్నాం.
(డైరీలోని కొన్ని భాగాలు)

స్వాత్ నుంచి సమితి వరకు...

పాకిస్తాన్ స్వాత్ జిల్లాలోని ఒక పట్టణం మింగోరా. 1,75,000 జనాభా ఉన్న మింగోరా... స్వాత్ నదికి దగ్గరగా ఉన్న అందమైన పర్యాటక ప్రదేశం. అందుకే దాన్ని ‘స్విట్జర్లాండ్’గా అభివర్ణించారు రెండో ఎలిజబెత్ రాణి. మింగోరాతో సహా స్వాత్ జిల్లాలో తాలిబాన్ల ప్రాబల్యం ఎక్కువ. పాకిస్తాన్ సైన్యానికీ వారికీ మధ్య తీవ్రమైన కాల్పుల తర్వాత ప్రస్తుతం ఈ ప్రాంతం సైన్యం అధీనంలో ఉంది. ఈ మింగోరా పట్టణంలోనే మలాలా 1997 జూలై 12న జన్మించింది. పష్తూన్ కవయిత్రి, ఆంగ్లేయులతో పోరాడిన వీరనారి మలాలాయి పేరుమీదుగా తన కూతురికి మలాలా అని నామకరణం చేశారు జియావుద్దీన్. ఈయన కవి, విద్యాసంస్థల యజమాని.
2009లో తాలిబాన్లు స్వాత్ జిల్లాను ఆక్రమించుకున్నప్పుడు జనవరి 14 నుంచీ బాలికల చదువును పూర్తిగా నిషేధించారు. దీనిమీద ఒక కార్యక్రమం రూపొందించడానికి ‘బీబీసీ’ ప్రయత్నించినప్పుడు, ప్రాణభయంతో గొంతు విప్పడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో మలాలా ధైర్యం చేసింది. తర్వాత ‘గుల్ మకాయ్’ పేరుతో అదే బీబీసీ ఉర్దూ బ్లాగులో డైరీ రాసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణకు నోచుకుంది. సొంతపేరుతో వెలుగులోకి వచ్చాక మలాలా ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు సహా ఎన్నో ఇంటర్వ్యూలిచ్చింది. అంతర్జాతీయ సమాజం ఆమెతో గొంతు కలిపింది. ఇదే తాలిబాన్లకు కంటగింపుగా మారింది.

9 అక్టోబర్ 2012న మలాలా పరీక్ష రాసి స్కూలు బస్సులో ఇంటికి తిరుగు ప్రయాణమవుతున్నప్పుడు, ముసుగు ధరించిన ఒక తుపాకీ వ్యక్తి లోపలికి ప్రవేశించి, ‘ఇందులో మలాలా ఎవరు? లేదంటే అందరినీ కాల్చిపారేస్తాను,’ అని బెదిరించాడు. మలాలాను గుర్తించిన తర్వాత తలమీద, మెడ మీద రెండుసార్లు కాల్చాడు. తీవ్రంగా రక్తమోడిన ఆమెను వెంటనే పెషావర్‌లోని ఆసుపత్రికి తరలించారు. తర్వాత రావల్పిండిలోనూ చికిత్స జరిగింది. అటుపై కేసు తీవ్రత దృష్ట్యా బర్మింగ్‌హామ్ తీసుకెళ్లారు. ఇప్పుడామె క్రమంగా కోలుకుంటోంది. ఈ దాడిలో మలాలాతో పాటు గాయపడిన మరో ఇద్దరు బాలికలు కైనాత్ రియాజ్, షాజియా రంజాన్ పరిస్థితి కూడా నిలకడగా ఉంది. అసభ్యతకు, అవిశ్వాసానికి ప్రతీకగా మలాలాను చూస్తున్నట్టుగా తాలిబాన్ పేర్కొంది. ఆమెతోపాటు, ఆమె తండ్రి జియావుద్దీన్‌ను కూడా ఎప్పటికైనా చంపేస్తామని ప్రకటించింది. అయితే, మలాలా మీద జరిగిన దాడిని నిరసిస్తూ, ఆమె మీద కాల్పులు జరిపిన వారికి వ్యతిరేకంగా సుమారు 50 మంది పాకిస్తాన్ మతగురువుల బృందం ఫత్వా జారీ చేసింది.


‘మలాలా యూసఫ్‌జాయ్ ప్రభుత్వ బాలికల మాధ్యమిక పాఠశాల’

చిన్న వయసులోనే బాలికల విద్య కోసం పోరాడుతున్న మలాలా 2011 సంవత్సరానికిగానూ ‘అంతర్జాతీయ శాంతి బహుమతి’కి నామినేట్ అయి, రన్నరప్‌గా నిలిచింది.
2011 డిసెంబరులో పాకిస్తాన్ తన మొట్టమొదటి ‘నేషనల్ యూత్ పీస్ ప్రైజ్’ను మలాలాకు బహూకరించింది. 
2012 జనవరిలో స్వాత్‌లోని ఒక ప్రభుత్వ బాలికల మాధ్యమిక పాఠశాలకు ఆమె పేరు పెట్టారు.
దాడి జరిగిన తర్వాత, అక్టోబర్ 15న ఆమె ధైర్యసాహసాలను గౌరవిస్తూ పాకిస్తాన్ అక్కడి మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘సితారా ఎ షుజాత్’ను ప్రకటించింది

Monday 19 November 2012

దేవుడు కనపడి వరమిస్తే ....

దేవుడు కనపడటమా?వరం ఇవ్వడమా ?
నాన్సెన్స్ ...ఏమిటండి పుటుక్కున అలా అనేసారు.
ఇలాగ అనుకోవడం వలన మన లక్ష్యాలు ఎన్ని 
ఉన్నాయి ఇలాగ మనకు ఒక క్లారిటీ ఏర్పడుతుంది.

సరే లెండి ....గొడవ ఎందుకు ఇప్పుడు ముందు 
టాపిక్ చూద్దాము.ఇప్పుడు టకామని మా ముందు 
దేవుడు ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి ......
ముందు మా అయన వంతు....
ఏమడుగుతాడు అంటే సింపుల్ 
''స్వామీ శశి ,పిల్లలు ఎప్పుడు బాగుండాలి''అని నా వైపు 
గొప్పగా చూస్తాడు.....నేను గుడ్ అని తలఊపి 
శేబాష్ అన్నట్లు నవ్వుతాను.అప్పుడు నాకు గుర్తుకు 
వస్తుంది.
''ఏమండీ ....కేవ్వ్వ్వవ్వ్వ్వవ్వ్వ్ మీ గూర్చి 
కోరుకోలేదు''
''ఒరే ....పర్లేదులే మీరు బాగుంటే నేను బాగుంటాను''
''ఊహు అలా కాదు మీ గూర్చి కోరుకొనాలి ''

ఇప్పుడు ఎలా?మనకేమో దేవుడు ఇంకో వరం ఇస్తాడో లేదో 
పెద్ద క్లారిటీ లేదు.అయినా మనం ఫీల్ అవుతాం కాని 
దేవునికి లెక్క ఏమిటి?అమ్మ కన్నా ఎక్కువ కదా 
మనం అంటే ఎంతో  ప్రేమ కదా...ఎన్ని అడిగినా ఇచ్చేస్తాడు కదా !
ఈయన వెంటనే వద్దు లేవే 
ఇంకోటి అడిగితె ఏమంటాడో ఏమో...సందేహం.

''మీరు ఊరుకోండి ..మీకేమి తెలీదు.నేను లేకపొతే 
ఎలా బ్రతుకుతారో ఏమో...అ..నేను అడుగుతాను 
నాకు వరం ఇంకా ఇవ్వలేదు కదా "
ఏమని అడగాలి?నా మాంగల్యం చల్లగుండాలి అంటే...
అయితే ప్రిజ్ లో పెట్టు అంటాడేమో...అయినా దేవుడు 
జోకులు వేస్తాడా ఎక్కడైనా......ఆ...ఐడియా...

''స్వామీ నేను ముత్తైదువగా చనిపోవాలి''
ఆయన చిన్నగా నవ్వాడు...తరతరాలుగా ఇదే 
డైలాగ్ ...మీరు ఇంక మారరా?సరే ఇచ్చితిని పో .....
హమ్మయ్య ....అందరం సేఫ్....మా పిల్లలు ఏమి కోరుకుంటారో?
దాని మీద నాకు క్లారిటీ లేదు.

ఇంకా కొన్ని కోరికలు కధలలో విన్నాను.ఇవి ఒక్క 
కోరిక లాగే ఉంటాయి ఆని మల్టిపుల్ అన్న మాట.

మొదటి కధ ....ఒకామె దేవుడిని కోరిందంట 
మా ఇంట్లో బంగారు ఊయలలో నా కొడుకు ఊగుతుంటే 
మా అత్తామామలు సంతోషంగా చూడాలి అని....
అంటే బంగారం,కొడుకు,అత్తమామలకు చూపు ఇలా 
ఒకే కోరికతో అనీ వచ్చేసాయి.

ఇంకో కద రాజు గారు ఒక యువకుడిని ఏమి కావాలో 
కోరుకో అనే ''మీరు మా ఊరికి వచ్చి మూడు రోజులు ఉండాలి''
అని కోరుతాడు.పాపం అని ఆ యువకుడి మీద అందరు 
జాలి పడుతారు.తీరా రాజు ఆ ఊరికి బయలుదేరితే తెలుస్తుంది 
విషయం.ఆయన కోసం ఆ ఊరికి రోడ్,బావులు,సత్రాలు,
వైద్య్యశాల,గుడి,బడి అన్ని కట్టించేస్తారు.అప్పుడు అందరు 
శెబాష్ అంటారు.
సరే ఇప్పుడు ఎవరు ఏమి కోరుతారో చూద్దాము....
ఒక క్రీడాకారుడు ఉంటె ...పతకాలు 
ఒక రచయిత ఉంటె ....రచనలకు పేరు 
వ్యాపారస్తుడు ....వ్యాపారం లో ధనం ఇలాగా 

మరి సంవత్సరం లోపు పసి బిడ్డలు ఏమి కోరుతారు?
ఏమి కోరుతారు చక్కటి నవ్వులు దేవునికే ఇచ్చి 
పంపేస్తారు.

అసలు ఏమి కోరుకోవాలి?ఏదైనా శాశ్వతంగా ఉండాలి 
అనుకుంటాము కదా....శాశ్వతం అంటే ఎప్పటికి మారనిది.
ఎప్పటికి మారనిది ఏమిటో తెలుసా?అదే సత్యం 
ఎప్పటికి మనం కోరుకోవాల్సినది ....
మనం చేరుకోవాల్సినది అదే ...
అప్పుడే మనకు అమృతత్వం 

అందుకే అన్నారు 
''అసతోమా సద్గమయా 
తమసోమా జ్యోతిర్గమయా 
మృత్యోర్మా అమృతంగమయా''

ఇక ఎప్పుడైనా మీరు కోరుకోవాల్సి వస్తే ఏమి 
కోరుకోవాలో తెలుసా?
''ఆత్మజ్ఞానం''అది ఉంటె అన్ని మన వెంటే ......

దీనికి ఏమి చేయక్కర్లేదు.కళ్ళు మూసుకొని ప్రశాంతంగా 
''శ్వాస మీద ధ్యాస''అంటే గమనిస్తూ ఉండండి.
గమనిస్తూ ఉండండి.మీలో ఎక్కడ ఏమి జరుగుతుందో గమనిస్తూ 
ఉండండి.ఒక తల్లి కడుపులో పిండం లాగా 
మీలో జరగాల్సిన మార్పులు జరిగిపోతాయి .
మీరు సత్యాన్ని చేరిపోతారు.ఎలా?అంటే ....
ఇదిగో ముందు కావాల్సిందే విశ్వాసమే .....
పాలల్లో వెన్న ఉంది అని మాత్రమె చెపుతారు.
చేయాల్సిన రీతిలో కళ్ళు మూసుకొని గమనిస్తూ 
ఆ వెన్నను చూడాల్సిన బాధ్యతా మీదే....




Tuesday 13 November 2012

మీకు అంటే చదువుకున్న అమ్మ ఉంది .....వాళ్లకి ?

ఆహా దసరా  కళకళలాడుతుంది.ఇల్లంతా సండే సందడి.
''అబ్బో మాకైతే ఏమి చేసిపెట్టవు .....కొడుకుకు మాత్రం అన్నీ 
చేసిపెడతావు''ఇంట్లో విసుర్లు ....పాప మాత్రం నవ్వుకుంటూ 
ఉంటుంది.ఇంతా చేసి వాడు మాత్రం ఒక రోజు పులిహోర,
ఒక రోజు టమాటో రైస్.ఒక రోజు పాలక్ రైస్ చేస్తే (నా కొత్త 
ప్రయోగం,పిల్లలు ఏది తినటం లేదు న్యుట్రీషియన్ గా 
లేదు అనిపిస్తే ఒక కొత్త రకం నేనే సృష్టించేస్తాను)
వాడు అది చూసి అంటాడు ''ఇదొకటి కనుక్కుందమ్మా 
మా ప్రాణానికి ...ఎప్పుడు చూసినా ఇదే''
నేను మనసులో అనుకున్నాను.''ఉండరా నీ సంగతి చెప్తాను.
డిసంబర్ లో నీ పుట్టిన రోజుకి వస్తావు కదా ...అప్పుడు చేస్తాను''
ఏమిటంటారా?''బెండకాయ ఫ్రైడ్ రైస్''....యాక్ అంటారా?
వాడికి చెప్పవాకండి ఇప్పుడే.

సరే వాడికి ,మీకు మన అందరికి చదువుకున్న అమ్మలు ఉన్నారు 
కాబట్టి మీకు ఏ ఏ విటమిన్స్ కావాలో చూసుకుని తినిపిస్తారు.

మరి పాపం అమ్మలకు జ్ఞానం లేక ,తినటానికి డబ్బులు లేక 
వాళ్ళ పరిస్తితి ఏమిటి?
పాపం చూడండి క్రింది ఫోటో ........
వాళ్లకు రక్తహీనతతో కాళ్ళు చేతులు పుల్లల్లగా అయిపోయి 
పొట్ట ముందుకు ఉబ్బి ఇంత మంది ఉన్నాము చదువుకున్న వాళ్ళం 
మన చేతిలోది కొంచెం వాళ్లకు పెట్టక పొతే పోయే......
వాళ్లకు ఏదో ఒకటి చేసే వాళ్ళను ఎంకరేజ్ చెయ్యడం 
ముఖ్యంగా వాళ్ళను ఆరోగ్యం పై చైతన్యం తేవడం 
ఏదో ఒకటి చేస్తే బాగుండును.



నేను గోదావరి పై లాంచి లో వెళ్ళినపుడు ''పేరంటాల పల్లి''అనే 
గ్రామం చూసాను .అక్కడ ''బాలానందస్వామీ''అనే యోగి 
ఆశ్రమం చూసాను.అక్కడ చల్లని గాలి,చల్లటి సెలయేరు 
ప్రశాంత వాతావరణం ,అమాయకంగా నవుతూ వెదురుబొమ్మలు 
చేసి అమ్ముతున్న గిరిజనులు......నాకు భలే నచ్చాయి.
(ఇటీవల ఆంధ్రప్రభ లో నా జీవవైవిద్యం పై వచ్చిన ఆర్టికల్ 
పైనే ఈ పేరంటాలపల్లి ఆర్టికల్  నాకు కాకతాళీయం గా అయినా 
ఆ యాత్రను గుర్తు చేసింది)
తరువాత ఆ గిరిజనులు ఏమి తింటారో తెలుసుకున్న తరువాత 
వారి జీవితాలు పెద్దల కింద ఎలా నలుగుతాయో తెలుసుకున్నాక....
అంటే చెట్టు బెరడు తీసుకొని కాచుకొని తాగుతారంట....నా మనసు 
అదోలాగా అయిపొయింది.మరి ఇప్పుడు అన్నీచేస్తూ బాగానే 
కనిపిస్తున్నారు అని అడిగాను.వేరే సంస్తలు ఇలా తయారు 
చేయడం ట్రైనింగ్ ఇచ్చాయి అని ఇప్పుడు బాగున్నాము అని చెప్పారు.

కాని నేను అక్కడ బాలానంద స్వామీ పుస్తకం కొనుక్కొని వచ్చి 
చదివితే తెలిసింది ఆయన యెంత గొప్ప తపస్సు చేసాడో,
అంతే కాక ....యోగిని అని తపస్సు చేసుకుంటూ కూర్చోకుండా 
వాళ్ళ కోసం వాళ్ళలో ఒకడిగా మెలిగి,వేలం పాటలు పాడించి 
పెద్దలను ఎదిరించి ,టీకాలు వేయించి ....నిజం యోగులు 
లోక శ్రేయస్సుకే పాటుపడుతారు.మరి ఆయన గూర్చి 
యెంత మందికి తెలుసుంటుందో నాకు అయితే కొంచెం 
అల్లూరి గుర్తుకువచ్చారు ఆ పుస్తకం చదువుతుంటే.

అక్కడే ఉండి  సేవ చేయాలంటే ఎవరికైనా కష్టమే.
కాని వాళ్లకు తెలివి ఉంది మనం అవగాహన కలిగించగలిగితే.
''పౌష్టిక ఆహారం''అని చెపితే వాళ్లకు డబ్బులు ఉండొద్దా?
చిన్నప్పుడు మాకు పాలపిండి అవీ స్కూల్స్ లో 
పెట్టేవాళ్ళు.అలాటివి ఎవరైనా వంటలుగా కనుక్కొని 
అప్పుడప్పుడు సరపరా చేసినా బాగుంటుంది.ఇంకా 
అక్కడ కొంచెం తెలివి గల వాళ్ళని ఎన్నుకొని వాళ్లకి 
ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ''ఆరోగ్యం''''నీరు''
''ఆహారం''ఉన్న వనరులతో ఎలా జీవించవచ్చో తెలియచేస్తే 
బాగుండును.ఇవన్నీ ఎవరు చేస్తారండి అంటే...అలాగ 
అనుకోవద్దు ,కొన్ని సంస్తలు ఉన్నాయి కనీసం వాటికి 
సహాయం అయినా చేయండి.

     


Friday 9 November 2012

సత్యభామ సరదాలు 5

ఏమి చెయ్యాలో తోచక బట్టలు ఒక్కోటే ఆరేస్తూ ఇంట్లోకి 
బయటకు తిరుగుతున్నాను.ఇల్లంతా నిశ్శబ్దం .......
నన్నొక్క దానినే పెద్ద లోయ లోకి విసిరేసినట్లు ,
ఒకప్పుడు లా ఉండేది కాదు ఇంటర్ కోసం పిల్లలు 
ఇద్దరు హాస్టల్ కి వెళ్లి పోయి కృత్రిమంగా నాపై కురిసిన 
ఏకాంతం.ఈయన క్యారియర్ తీసుకొని ఆఫీస్ కి వెళ్లి పోయారు.
బియ్యం చేటలోకి పోసుకొని యేరుతూ కూర్చున్నాను.
ఒక్క చిన్న గ్లాస్స్ బియ్యం యెంత సేపు ఏరుతాను?
చిన్నగా వేళ్ళు చేతలు ముగ్గు వేస్తున్నాయి...అల్లి బిల్లిగా 
గేసిన గీతలు నా నుదిటి పై రాతలు లాగే ఉన్నాయి...
నా జీవితం ఇక ఎవరి కోసం ఉపయోగించాలో తెలీనట్లు 
ఒక నిర్వేదం పొగ మంచులా కమ్మేసుకొని....కనీసం దిగులు 
కన్నీళ్ళుగా అయినా జారిపోకూడదా?ఎవరికైనా చెప్పుకున్నా 
నీకేమి రోగం హాయిగా తిని కూర్చోక అంటారు.ఎలా చెప్పాలి 
కష్టం అని కనపడకుండా మనసుని మెలి పెట్టె బాధని....
పిల్లలు లేక మూగ పోయిన గూడుని చూస్తె వచ్చే వేదన 
పిల్లలు వదిలేసిన పక్షులకే అర్ధం అవుతుంది.
గుప్పెట్లో బియ్యం తీసుకొని చేటలోకి జారుస్తూ ఉంది....
జారుతున్న ఆలోచనలను బియ్యం లో ఏరుకుంటూ...
ఉలిక్కి పడింది.''అవును'' ఈ రోజు ఏ తేది?
''అయ్యో'' అవును కదా ....ఈయన పుట్టిన రోజు ,ఎలా 
మర్చిపోయింది తను.తన ప్రాణాన్ని తన సొంత ప్రాణంగా 
చూసుకొనే శ్రీవారి పుట్టిన రోజు ....ఛా ఎలా మర్చిపోయింది?

గబా గబా ఇంట్లోకి వెళ్లాను.ఈయనకి ఇష్టమైన బక్ష్యాలు,
గారెలు చెయ్యటానికి పప్పు నానపోస్తూ ఉంటె వచ్చింది ఆలోచన .
మెల్లగా పురుడు పోసుకున్నది.....మెదడు అంతా వ్యాపించి 
ఒక రకమైన హుషారు,అంతలోనే  సిగ్గు.
నిజమే ఈయనను మర్చిపోయి ఎన్ని రోజులు అయింది తను...
పిల్లలతో మునిగిపోయి ,ఏ రోజైనా తన అసంతృప్తిని 
ఆయన నుదుటి పై బొమలు ముడి వేసి రేఖామాత్రం 
కూడా  చూపలేదే.ఎప్పుడు తనూ,పిల్లలు అంతే.అదే ప్రపంచం.
ఏ రోజు ఈ ఇంట్లో అడుగు పెట్టానో ఆ రోజే తన హృదయం 
తనకు ఇచ్చేసినట్లు దానికి తను మహారాణి లాగే చూసాడు.
పిల్లలకు పరుపులు ఇచ్చేసి తాము చాప పై పడుకున్న 
రోజులు ఎన్నో......ఇన్ని చేసిన ఆయనకు ఏదో ఒకటి 
చెప్పాలి ఈ రోజును మరుపురాని రోజుగా చేయటానికి.....
ఏమి చెప్పాలి?''ఐ లవ్  యు''అనా....ఛీ ఛీ  ...
ఈ వయసులోనా?అయినా ఇప్పుడు కొత్తగా చెప్పటమేమిటి?
ఏ రోజైతే పెళ్ళిలో ఈయనే మీ భర్త నమస్కారం చెయ్యి 
అన్నప్పటి నుండి ఆయనను ప్రేమిస్తూనే ఉంది కదా.
అలా కాదు అలా కాదు....ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి 
చేస్తున్నాయి ఏదో ఒకటి చెప్పు అని తొందరపెడుతూ.....
సరే ఎలాగోలా ఫోన్ చేసి''మీరంటే ఇష్టం అని చెప్పేస్తాను''

డైల్ చేస్తుంటే చేతులు చిత్రం ఎప్పుడూ లేనిది వణుకు,
ఎందుకంత భయం?ఎన్ని సార్లు చేసి ఉంటాను?
దేవుడా వద్దు...వద్దు...ఆపేసింది.మళ్ళా ఉండబట్టలేక 
చేసింది.మోగుతూ ఉంది.చెప్పాలి ,చెప్పెయ్యాలి...ధైర్యం 
పోగుచేసుకుంటూ భావాల రెక్కలు విప్పుతూ ఉంది...
అవతలి నుండి ''చెప్పు జయా?''కొత్తగా ఉంది.మాటలు 
రావడం లేదు అతి కష్టంగా ''ఏమండీ''హా చెప్పు ....''
ఛా  ఈ వయసులో ఏమి చెపుతాను ....''ఏమి లేదు''
అనేసింది.''సరే నువ్వు టిఫిన్ చేసావా?''అడిగాడు 
''హా అయింది''....చెప్పు చెప్పు మనసు ముందుకు తోస్తూ 
ఉంది.''లాండ్రీ అతను వస్తే బట్టలు వెయ్యి''''సరే''
భారంగా ఫోన్ పెట్టేసింది.

ఛీ . ..చీ ...నీకసలు బుద్ది లేదు ,యెంత మంచి అవకాశం 
పోయింది.అతనికి యెంత చక్కని జ్ఞాపకం అయి ఉండేది.
ఇదేనా నువ్వు చూపే కృతజ్ఞత.....తిట్టింది మనసు.
నిజమే ఎలాగైనా ఈ రోజు ఆయనకు బహుమతిగా 
ఇవ్వాల్సిందే.ఏమి చెయ్యాలో తెలీక నిస్సహాయంగా దిండు పై 
వాలింది .ఇది ఎవరికి చెప్పే సమస్యా కాదు,తనకు ఫ్రెండ్స్ 
కూడా లేరు.అందరు  ఎవరి కాపురాలు,పిల్లలు ఎవురికి 
ఎవరు గుర్తు ఉన్నారు.ఆసలు పర్సనల్ జీవితాలు ఎవరికి 
ఉన్నాయి?
''ఎస్''అలాగే చేయాలి...హుషారుగా లేచింది ,ఒక్కసారి 
కాలేజ్ చదువు గుర్తుకు తెచ్చుకుంది.పెళ్లి కుదిరి సగం లో 
మానేసినా తెలివి ఎక్కడికి పోతుంది.అవును ఒక ప్రేమ లేఖ 
వ్రాసి ఇస్తాను.ఇల్లంతా వెతికి పిల్లల అలమర నుండి 
తెల్ల కాగితం ,కలం తెచ్చుకుంది.మెల్లిగా పేపర్ ని నిమిరింది ,
చిన్నగా సిగ్గుతో కూడిన నవ్వు .....ముందు ఏమి వ్రాయాలి?
సంబోధన ఎలాగా?కాలేజ్ చదువుని అంతా ఒక్కసారి బుర్ర 
లోనే తిరగేసింది.డియర్...ఛీ కాదు ....ప్రియమైనా ..బాబోయ్ 
ఇది జరిగే పని కాదు ....సంబోధన లేకుండానే వ్రాసేస్తాను.
ఛీ...సంబోధన లేకుండా ఏమిటి ,మనసు కొంచెం కూడా దయ 
లేకుండా మందలించింది.సరే ''ఏమండీ'' అవును ఇదే హాయిగా 
ఉంది.ఏది వ్రాస్తే ఏమిటి మనకు సంతోషంగా ఉండాలి.ఇలాగే వ్రాస్తాను.
చక్కటి ముత్యాలు గొలుసులుగా దొర్లి ''ఏమండీ''అనే అక్షరాలుగా 
మారిపోయాయి.
సరే ఇప్పుడేమి వ్రాయాలి ఆలోచన లోతుల్లో నుండి అమృతపు ఘడియలను 
మనసు వెతుకుతూ ఉంది.
కను రెప్పలు పైకి ఎత్తలేక తల దించుకున్న తనను చూసి ముచ్చటపడి 
కట్నం విషయం లో పెళ్లి ఆగకుండా వెనక వేసుకొని వచ్చి మూడు ముళ్ళు 
వేసిన విషయమా?
ఏడు అడుగులు వేస్తూ చీర తట్టుకొని పడపోయిన తనని చిరు వెచ్చగా 
పొదవుకొని ఇప్పటికీ గుండెల్లో దాచుకున్న విషయమా?

కనుపాప ఊపిరి పోసుకున్నదన్న  విషయం నును సిగ్గుతో చెపితే 
హత్తుకొని పైకి ఎత్తుకున్న విషయమా?సిగ్గుతో ఆలోచనలు 
ముందుకు పోవడం లేదు.కలం నుండి ఒక్క ముక్క రాలడం లేదు.
ఇద్దరం నలుగురమై పావురాళ్ళ లా  కువ కువ లాడే ఒక పొదరిల్లులో 
ప్రతి రాత్రి నువ్వంటే నాకిష్టం అని వెచ్చని ఊపిరిని తన చెవుల పై 
అద్ది చెప్పిన విషయమా....ఎన్ని వ్రాయాలి.చేతులు లలో సన్నగా 
వణుకు ఇదేమిటి?ఇదేమిటి?తాను  ఇంకేమి చేయలేదు....నిరాశగా 
దిండు కింద పెట్టి వెళ్ళిపోయింది .వంట చేయటానికి.
దిగులుగా తల వంచుకొని సాయంత్రం భర్తకు టిఫిన్ పెట్టింది.
''అరె బక్ష్యాలు,గారెలు ఏమిటి ఈ రోజు స్పెషల్?''సంతోషం తొ 
తింటూ అడిగాడు.మౌనం గా వెళ్ళిపోయింది.
మెల్లిగా బెడ్రూమ్  లోకి వెళ్లి పడుకుంటే అతని చేతికి తగిలింది.
ఒక తెల్ల కాగితం దానిపై రాలిన రెండు పూలు,మధ్యలో 
ఏమండీ .....చిత్రం ఎందుకో అతని హృదయం ఆనందం తొ 
రెక్కలు విప్పి ఆకాశం లో విహరించింది.ముచ్చటగా
తోలి రోజులకు విహరించిన మనసు ,హృదయం తేలికగా 
ఎగిరిపోతూ .....తన చేతి స్పర్శను పరోక్షంగా అనుభూతించాలి 
అనుకొని మెల్లగా కాగితాన్ని బుగ్గకు ఆనించుకొని కళ్ళు 
మూసుకున్నాడు.....''జయా''మెల్లిగా పిలిచాడు.
వచ్చింది.''ఏమిటిది?''కొంటెగా కాగితం చూపిస్తూ 
అడిగాడు.కొంటెతనం కాక పొతే గ్రహించలేదా ఏమిటి?

''నా వల్ల  కాలేదు,నా వల్ల  కాలేదు''నిరాశ కన్నీళ్లు గా 
బుగ్గలపై జాలు వారుతూ ....మీ పుట్టిన రోజు కదా అందుకని 
వెక్కిళ్ళ మద్య చెప్పింది.''పిచ్చీ''దగ్గరగా హత్తుకున్నాడు .
గుండెలకు తగిలే చెమ్మ ఎప్పుడో పెళ్లి అయిన కొత్తలో ఎవరో 
కట్నం తక్కువ తెచ్చావు అన్నారని బాధను మోసుకొచ్చి 
చెప్పినట్లు ....ఈ రోజు జయ గుండెల్లోని ప్రేమ ను మోసుకోస్తూ...
వెక్కిళ్ళు ఆగటం లేదు.''మీరంటే ఇష్టం అని వ్రాద్దాము 
అనుకున్నాను,కాని''వ్రాయలేని అశక్తత ,వ్రాయాలనే కోరిక 
సాగర సంగమం లా నిలవలేక తీగలా అల్లుకుపోయింది.
''జయా అనీ అక్షరాలే చెప్పలేవు.నువ్వు చేసిన వంట లో లేదా 
నీ ప్రేమ ,నీ స్పర్శలో లేదా నీ ప్రేమ,నీ సేవలలో లేదా నీ ప్రేమ 
ఇన్ని విధాల నువ్వు తెలుపుతూ మళ్ళా వ్రాయడం అవసరమా?''

హ్మ్...ఏమిటో అందరికి చిన్న విషయం కూడా తనకు పెద్ద విషయం 
అయిపొయింది.ఇంత చిన్న కోరిక కూడా తీరక పోయే...
''అయినా రోజు తినే పప్పు అన్నం కంటే పండగ రోజు 
పాయసం తీపి,అది కూడా ఈయనకు అక్షరాలో 
వడ్డించలేకపోతిని '' నిరాశగా అనుకొంటూ హృదయపు 
పరుపు వెచ్చదనం కళ్ళను వాల్చేస్తూ ఉంటె .....తన 
కలల లోకం లోకి వెళ్ళిపోయింది...అక్కడైనా వ్రాస్తుందో?లేదో?





Thursday 1 November 2012

ఆట పాటల చదువు ...అప్పుడే సందడే సందడి

చిన్న పిల్లలను స్కూల్ లో వేసిన ఇల్లు...
అందమైన బుజ్జి మాటల,పాటల పొదరిల్లు.
మరి అంత అందమైన అనుభూతిని ఇంకా కొంచెం
మధురం చేసుకుందాము.
ఈ రోజు ''ఆంద్ర భూమి'' భూమిక పేజె లో నా ఆర్టికల్.

(నా ఆర్టికల్ లింక్ ఇక్కడ )

పాటలతో పాఠాలెంతో హాయ

  • - శశి తన్నీరు
  • 01/11/2012
‘దోసెమ్మ.. దోసె
అమ్మకు ఒకటి
నాన్నకు రెండు
నాకేమో మూడు’’
- పసిపిల్లలను మొదటిసారి స్కూల్‌లో చేర్పిస్తే ఇక ఇల్లంతా ఇలా... ఆటపాటలతో రాత్రిళ్ళు సందడిగా మారుతుంది. అప్పుడే స్కూల్‌లో చేరిన పిల్లలకు అక్షరాలు రాయడం వంటివి ముఖ్యం కాదు. వారు చక్కగా వినటం, పదాలు పలకటం, వస్తువులను గుర్తించడం ముఖ్యం. స్కూల్‌లో ఎంత చెప్పినా, పిల్లలు ఇంటికి వచ్చిన తరువాత తల్లిదండ్రులు చిన్న చిన్న ఆటలు, పాటలు కానీ మొదలుపెట్టి వాళ్ళతో ఆడితే అందరికీ సరదాగా ఉంటుంది. పాటలతోనే పాఠాలు నేర్పితే వాళ్లతో సాన్నిహిత్యం పెరుగుతుంది. పిల్లలు స్కూల్‌లో ఎలాంటి బెరుకు లేకుండా అన్ని విషయాలలో పాల్గొంటారు. చదువు అంటే ఆట అనుకుని, ఆడుకోవడానికి స్కూల్‌కి వెళ్లాలని అర్థం చేసుకుంటారు.
కొన్ని చిన్న ఆటలు వాళ్ళ కోసం...
మీరు ‘అ’ ఎక్కడ?- అంటే వాళ్ళు ఇంట్లో మీరు దాచి పెట్టిన అక్షరాలలో నుండి దాన్ని వెతికి తేవాలి. లేదా దూరంగా అక్షరాలన్నింటినీ కుప్పలాగా వెయ్యొచ్చు. (ఇంగ్లీష్ అక్షరాలు అయనా)
ఇంకా రంగులు కూడా. మీరు చెప్పిన రంగు ఇంట్లో ఎక్కడ ఉందని అంటే వాళ్ళు ఆ కలర్ కలిగిన వస్తువులను- ఉదాహరణకి మీరు రెడ్ అని చెపితే వాళ్ళు టొమాటో, కర్టెన్స్, వాళ్ళ డ్రెస్... ఇంకా ఏమైనా ఆ కలర్‌లో ఉన్న వాటిని తాకాలి.
రకరకాల రంగుల్లో ఉన్న అక్షరాలను ఒకే కలర్‌వి కుప్పగా వెయ్యమని పిల్లలకు చెప్పాలి. ఇందులో ఎవరు ఫస్ట్?- అని పోటీలాగా పెట్టుకుంటే వాళ్ళకు తమాషాగా ఉంటుంది. ఇలాంటి పోటీల్లో పిల్లలను అప్పుడప్పుడూ గెలిపిస్తే వాళ్ళకు అదో ఆనందం.
ఇంకా టీవీలో, పేపర్‌లో మీరు చెప్పిన అక్షరం గుర్తుపట్టమని చెప్పి దానికి చాక్లెట్స్ ఇవ్వవచ్చు అభినందనగా. మనం రోజూ ఇచ్చేవే అయినా ఇలా ఆడినపుడు ఇస్తేనే- వాళ్లలో గెలుచుకున్నామనే సంతోషం ఉంటుంది. ఇలా చేయస్తే, బస్‌లోగానీ బయట ఎక్కడ ఉన్నా అక్షరాలను గుర్తుపట్టి మీకు చూపిస్తూ ఉంటారు హుషారుగా.
చిన్న చిన్న పాటలు అభినయంతో చేయించి, మీరు ప్రేక్షకులుగా కూర్చొని వారిని ప్రోత్సహించడం మంచిదే. ఆటపాటలైనా, ఇంకేదైనా సరదాగా ఉండటమే పిల్లలకు కావాల్సింది. పిల్లలు మనసు విప్పి ఏమీ చెప్పకపోయనా, వారిని అందరిలో నిరుత్సాహ పరచడం వంటివి చెయ్యకూడదు. ఇంకా.. మీరు చెప్పిన నెంబరు మీదకు బాణం వెయ్యటం, లేకుంటే గోలీ వెయ్యటం.. ఇలా అంకెలపై కూడా అవగాహన కలిగించవచ్చు. స్కూల్‌లో ఏం చెప్పారని అని ముద్దుగా అడిగితే వాళ్ళు మిమ్మల్నే చేతులు కట్టుకోమని చక్కగా వాళ్ళ టీచర్‌లాగా అనుకరించి మాట్లాడతారు. ఇలాటపుడు కొంచెం గమనిస్తే వాళ్ళ టీచర్ పిల్లలతో ఎలా ప్రవర్తిస్తారో కూడా తెలిసిపోతుంది. పిల్లలను చిన్నప్పుడే మార్కులు, ర్యాంకుల గొడవలోకి ఇరికించవద్దు. ఆ ప్రభావం వాళ్ళ మానసిక వికాసంపై పడుతుంది. కొన్ని రోజులకు చదువంటేనే భయపడతారు. నేర్చుకోవడం ప్రధానం.
తల్లిదండ్రులకు ఇంకో ముఖ్య విషయం- మీ పనులు ఎప్పుడూ ఉండేవే. అవి అయిపోయినాక పిల్లలతో గడుపుదామని అనుకుంటే ‘‘మీరు ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు’’- వాళ్ళు పెద్ద అయిపోతారు. వాళ్ళకు మీరు ఇవ్వాల్సినది సంపాదనే కాదు, సాన్నిహిత్యాన్ని, సమయాన్ని. అప్పుడే వాళ్ల బాల్యపు తలపుల్లో మీరు మధురస్మృతిగా నిలిచిపోతారు.