Monday, 27 July 2015

బాహుబలి గురించి ఇంకొంచెం


ఎలాగు రాజమౌళి బాహుబలి గురించి కొంచెం కొంచెం తీస్తూనే ఉంటాడు .
విజయేంద్ర ప్రసాద్ వ్రాస్తూనే ఉంటాడు . ఇంకా కొంచెం చెప్పేది ఉంటూనే ఉంటుంది .
ఈ తెలుగు రాష్ట్రాలకి ఏమైంది !ఎక్కడికి వెళ్ళినా రెండే ప్రశ్నలు .... 
ఒకటి పుష్కారాలకు వెళ్ళావా ?
రెండోది బాహుబలి చూసావా ?
ఇల్లు స్కూల్ తప్ప ఇంకో విషయం గురించి మాట్లాడుకోను కూడా 
ఇంటరెస్ట్ లేని మా స్టాఫ్ రూం కి కూడా ఇవి బోలెడు ఇష్టం అయిన టాపిక్ 
అయిపోయాయి . దేనికి వెళ్ళ  లేదు అన్నా .... నీ జన్మే వృధా పో అన్నట్లు 
జాలిగా చూస్తున్నారు . ఎలాగు పుష్కరాలకు వెళ్లక సగం జన్మ వృధా 
అయింది . కనీసం సినిమా చూసి అయినా జన్మ సార్ధకం ఎలా చేసుకోవాలి 
అనుకున్నప్పుడు ...... అల్లుడుగారు నెల్లూరు ఎస్ 2 కి అదీ రంజాన్ లాంటి 
రష్ రోజు టికట్స్  తెచ్చారు . అల్లుడు గారు అత్తగారు వాళ్లకు చూపించే 
మొదటి సినిమా అంటే ఈ మాత్రం గొప్పగానే ఉండాల్సిందే !అప్పుడు 
చూస్తే ఇప్పుడు వ్రాయడం ఏమిటి అంటే ఒకటి కాదు రెండు కారణాలు . 

ఒకటి నిన్న ఫండే లో చూసిన గురవారెడ్డి గారి ఆర్టికల్ బాహు బాలి మీద 
గురవా రెడ్డి గారు , చందు శైలజ గారు అక్షర ఆత్మీయులుగా మనకు 
ఈ బ్లాగ్  లోకం లో సుపరిచితులే . (ఆర్టికల్ కింద ఇచ్చాను )

రెండోది నిన్న నెల్లూరు లో ''కె శివారెడ్డి '' గారు  అతిధి గా వచ్చిన 
శ్రీ పొట్టిశ్రీరాములు రచయితల సంఘం  ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొనడం . 
ఆలస్యంగా శివారెడ్డి గారు మాట్లాడుతుండగా వచ్చిన నేను రెండో వరుసలో 
కూర్చుని బుద్ధిగా వినకుండా వెనుక ఉన్న ఆత్మీయుల కళ్ళ లోని 
ప్రశ్నార్ధకానికి సమాధానం చెపుతూ ఉన్నాను . ఉన్నట్లుండి శివారెడ్డి గారు 
మాట్లాడకుండా గమ్ముగా ఉండిపోయారు . ఏమిటని చూద్దును కదా 
''అమ్మా నీ మాటలు అయిపోతే నేను మాట్లాడుతాను '' అన్నారు . 
తప్పుకు నాలుక కరుచుకొని సభా ముఖంగా నా చిన్నతనానికి సారీ 
చెప్పేస్తే పెద్దలందరూ హుందాగా నవ్వి క్షమించేసి సభకు నిండుదనాన్ని
నాకు ఒక మంచి సాహిత్య జ్ఞాపకాన్ని ఇచ్చేసారు . నా కవిత కు బహుమతి 
వచ్చి ఆయన చేతులు మీదుగా తీసుకున్నప్పుడు నవ్వుతూ అభినందించి 
ఇంకోసారి పెద్దరికాన్ని చాటుకున్నారు . 
మీటింగ్ మధ్యలో అన్నారు ''ఆయన రాజ మౌళి ఏదో బాహు బలి అట 
తీసారు . ఏమి సత్యం చెప్పారు దాని వలన '' 
ఇంకా బోలెడు మంది బోలెడు చెప్పారు . కామెడీ లేదంట . ఏదో సినిమాకి 
కావలిసిన దినుసులు లేవట .... ఇంకా ..... ఇంకా ..... 

మీరందరూ సమీక్షకులు ,మీకున్నంత జ్ఞానం మాలాంటి ప్రేక్షకులకు 
లేదు . కాని సినిమాకి మౌత్ పబ్లిసిటీ ఇచ్చి , బోలెడు సార్లు చూసి 
లాభాలు తెచ్చేది మేము . సినిమా మాకు నచ్చితే చాలు . 
నిర్మాతకు కాసుల పంటే !!
అసలు సినిమాలో సత్యం ఏమిటి ?సినిమా అనేది ఒక మనసుకు 
కాలక్షేపం . మాకు లాజిక్ లు వద్దు . మాజిక్ లే కావాలి . అలాగని 
సందేశాత్మక చిత్రాలు కూడా ఆదరిస్తాము. అలాగని ప్రతి సినిమా ఒక 
సందేశం ఎలా ఇస్తుంది . అదొక ఊహ . అందమైన కల . ఊహలు 
వాస్తవం లోకి తెచ్చుకోలేని  వాళ్ళు  దర్శకుడి కళ్ళతో ఊహ ఎదురుగా 
చూసే ఒక కల్పన . ఏమో ఇక్కడ ఏదో సత్యం ఉందేమో !ఇప్పటికి 
పార్ట్ వన్ కదా అయింది . ఎన్ని పార్ట్లు ఉన్నాయో !! 
అసలు మాకు మాత్రం ఒక్కో సన్నివేశం చూసినపుడు ఒక్కో సినిమా 
గుర్తుకు రాలేదా ఏమిటి ! భైరవ ద్వీపం , అవతార్ , మహా భారతం 
ఎన్ని గుర్తుకు రాలేదు దీన్ని చూస్తుంటే . కాని దీనంత అందంగా 
అవి అనిపించలేదు . అప్పట్లో అవి గొప్పవే . ఆ జలపాతం సీన్స్ , 
ముఖ్యంగా పైన చెట్టుకు బాణం వేసి ప్రభాస్ పైకి వెళ్ళడం ,మంచు లో 
తమన్నా ప్రభాస్ జారిపోవడం ఇలా కొన్ని సీన్స్ అయితే అదరహో !!!
(నిజంగా నాకు ఇవి చూడమని చాలా మంది చెప్పారు )
ఇక కీరవాణి సంగీతం , సెంథిల్ ఫోటోగ్రఫీ ఎంత బాగా కుదిరిందో !
అసలు కామెడీ లేదు అన్నారు కాని సినిమాలో స్క్రీన్ ప్లే ఎంత 
బాగుంది అంటే మేము అసలు ఆ విషయమే గుర్తించ నంతగా 
కధలో లీనం అయిపోయాము . అయినా కాల కేయులు మాట్లాడే 
బాష కి బాగా  నవ్వాము. రమా రాజ మౌళి గారు కాస్ట్యూమ్స్ అన్నారు 
కాని అది నాకు కొంచెం నాకు నచ్చలేదు . అసలు తమన్నాకు పాపం 
ఎన్ని డ్రెస్ లు ఉన్నాయి . శివగామి గారి కాస్త్యుమ్స్ బాగున్నాయి . 
రెండో పార్ట్ లో ఇంకా బాగుంటాయి ఏమో !
అసలు ఈ పార్ట్ రాజ మౌళి గారు చెప్పినట్లు శివగామి గారిదే . 


రమ్య కృష్ణ గారి నటన ,రాజ మౌళి గారి స్క్రీన్ ప్లే నచ్చని వాళ్ళు 
లేరు . పల్లెల్లో కి వచ్చి అడగండి . తమ ఊహలలోని అద్భుతాలు కళ్ళ 
ముందు చూసాము అని చెపుతారు .  రాజ మౌళి గారు మీకెందుకు ,
మీకు ఎన్ని పార్ట్లు తీయాలని ఉంటె 
అన్ని తీయండి . ఇంకా కావాలంటే సినిమా హాళ్ళ లోనే కాకుండా 
వెయ్యి రూపాయ పేకేజ్ షో లు ఇళ్లలోని హొమ్ థియేటర్ లకి 
కూడా ఇవ్వండి . ఇలాగే అవుట్ పుట్ ఇస్తే మేము తప్పక 
చూస్తాము . థియేటర్ లు జనాలతో కళ కళ  లాడుతూ ఉండటం 
చూస్తూ ఉంటె ఎంత ఆనందం గా ఉంది . మా నాన్నగారు మా 
థియేటర్ పగల కొట్టించేస్తే ఎంత బాధ పడ్డానో !!! ఏమిటి మంచి 
సినిమాలు ,ప్రజలను హాల్ కి లాక్కొచ్చే సినిమాలు తీసే వాళ్ళే 
లేరా అని !
మీరు ఇంకా పార్ట్లు తీయండి రాజ మౌళి గారు . కాక పోతే 
కొంచెం కామెడీ ,కొన్ని పంచ్ డైలాగ్స్ ,కొన్ని సత్యాలు తక్కువ 
అయినాయి అంట . అవి ఈ సారి గుర్తు ఉంచుకొని తీయండి . 
ఇక అందరు మీ పార్టీ అయిపోతారు . ఒక ప్రపంచ సినిమా తీసిన 
మీకు అభినందనలు . 

పోయిన వారం ఫండే లో నా ఆర్టికల్ 
 (link ikkada )


గురవా రెడ్డి గారి ఆర్టికల్ 

No comments: