Saturday, 18 February 2017

ఘాజీ .... గివ్ క్లాప్స్

ఘాజీ  .... గివ్ క్లాప్స్ 

సంకల్ప రెడ్డి , 
ఇప్పుడు మొత్తం క్రెడిట్ నీకే ఇవ్వాల్నా !
విత్తనాన్ని సంరక్షించి నీ సంకల్పంతో 
అందరి సహకారాన్ని సాధించి వెండితెరకు 
ఒక ఇంగ్లిష్ మూవీ తెలుగు సినిమాగా ఇచ్చావు 
చూడు , ఆ కాన్ఫిడెన్స్  ఇవ్వాల్సిందే . 

గుడికి వెళదాము అని గూడూరుకు వెళ్లిన మమ్మల్ని 
 హర్ష సిరి ఆపేసారు , పిన్ని ఘాజీ చూడాల్సిందే . 
హిందీ మూవీ నా ? కాదు తెలుగు ?
ఇదేమి పేరు ? నా దృష్టిలోకి రాకుండా ఈ సినిమా 
ఎలా తప్పించుకుంది అనుకున్నాను . 

పిన్నీ అది పాకిస్తాన్ సబ్ మెరెన్ పేరు . దానిని ఎలా 
కూల్చారో చూపించారు . ఇప్పుడే నెల్లూరు లో 
చూసాను . నువ్వు చూడాల్సిందే , అంతే . 
అనేశాడు మా హర్ష . 

వీడి సంగతి నీకు తెలీదు , ఇంతకూ ముందు 
 యుగానికి ఒక్కడు అర్ధం కాకపోయినా చూపించాడు . 
అంటే ఇది కూడా ఖఛ్చితంగా అర్ధం కానీ క్యూట్ 
వెరైటీ సినిమా  అనుకున్నాను . 
అది  నిజం కూడా అయింది . ఎలాగూ మా నాయుడుపేటకు 
బాబుల భజనలు , వాళ్ళ బిడ్డల సినిమాలు తప్ప ఇవి 
రావు . ఇక్కడే చూడాలి . 

 కార్ లో చెప్పాడు వాడు నీ గురించి . 
ఇంత చిన్న వయసులో ఈ కథను ఆవిష్కరించాలి 
 గురించి , 25 లక్షలతో సెట్ వేసి అందరికి నీ పట్టుదల 
చూపిన సంగతి . దానిలో నీ  విశ్వాసం కనిపించింది . 
ఇంట్రెస్టింగ్ అనుకున్నాను . 

మొదట అర్ధం కాక ఊ , ఆ , అనుకున్నవాళ్ళం ఎప్పుడు 
సబ్మెరిన్ కి ముందు సీట్ పై తల ఉంచేంతగా వెళ్ళామో 
మాకే తెలీదు . ఒక టైటానిక్ గుర్తుకు వచ్చింది . కానీ 
దానిలో  జీవితాలు అల్లుకొని కథను ముందుకు నడిపాయి . 
ఇక్కడేముంది పైకి కిందకి , కిందకి పైకి , ఆ పాకిస్తాన్ 
కెప్టాన్ అన్నట్లు లిఫ్ట్ లాగే . 

 దీనిలో నువ్వు ఎన్ని కాంఫ్లిక్ట్స్ చూపగలవు ?ఎన్ని జీవిత 
సత్యాలు మా ముందు నిలుపగలవు ? 

కాదు కాదు , మర్రి విత్తనం లోని మహావృక్షాన్ని మా ముందు 
ఆవిష్కరించావు . ఒక నీలం , చీకటి అనే రంగులు తప్ప 
ఇంకేమి చూపలేని సినిమాలో ఒక మనిషి లో ఉండే 
అన్ని రంగులు చూపావు . 


ఒక సైనికుడి ప్రపంచం ఎంత  విశాలమో 
తన దేశం గెలవాలనే తపన 
ఎలా ఉంటుందో చూపావు , 
డిఫెన్స్ మనస్తత్వం గల ఒక దేశం తో పనిచేస్తూ 
మనిషి పడే అవస్థ , వార్ నెవెర్ ఎండ్స్ అని 
చూపుతూ బులెట్లకు బలి అయిన జీవితం తన 
వారిమీద  ప్రభావాన్ని , కఠినమైన నిర్ణయాలు 
తీసుకొనే వారు కూడా పిల్లల దగ్గర మారే పిల్లతనాన్ని , 
ఒక జీవం మరణం మధ్య గీతకు అటూ ఇటూ ఊగుతూ 
కూడా తమ వాళ్ళను రక్షించాలి అని పడే తపనను 
మాచే ఊపిరి తీసుకోనివ్వకుండా చూపించావు . 
పాటలు లేకుండా తెలుగు సినిమా తియ్యొచ్చుఁ , 
ఇక్కడా ప్రతిభ ఉంది అని నిరూపించావు . 

నాకు అనిపిస్తూ ఉంటుంది , చదువు  పూర్తి అవగానే 
సంపాదన లోకి యువతను తోసెయ్యకుండా కొద్ది 
రోజులు ఏదో ఒక స్కాలర్షిప్ ఇచ్చి వారి సృజనాత్మకత 
నిరూపించుకోమంటే యెంత బాగుంటుంది . కానీ 
ఇండియా లక్ష్యం  సంపాదనే . అదీ కాక మీరు బాడ్ హాబిట్స్ 
లో దిగే వయసు కూడా అదే కాబట్టి రిస్క్ తీసుకోలేము . 
ఎలాగో లోపల ఫైర్ నిలవనీని నీలాంటి వాళ్ళు 
అడ్డు వచ్చిన బండరాళ్లు సైతం పగలగొట్టుకొని పైకి 
వచ్చి చిగురిస్తారు . 

కొంచెం చివరిలో సినిమాటిక్ గా ఉంది , విలన్ తెలుగు 
లాగే చూపారు , కొందరు ఫీలింగ్స్ చూపలేదు అని ఉన్నా 
అవి ఈ సారి దిద్దుకోవచ్చూ . బాల్కనీ లో కూడా 
చప్పట్లు మోగడం చూసాను . నువ్వు ఉత్సాహంగా 
ముందుకు వెళ్ళవచ్చుఁ , అందరినీ కలుపుకొని .  

తాప్సి ఉన్నా తనను ఏమీ వల్గర్ గా చూపలేదు . 
మరీ విలువలే లేని సినిమాలు చూసి విసుగ్గా 
ఉంది . మరీ ఎప్పుడూ వ్యాపారమేనా ? 
కాకుంటే కాన్సెప్ట్ హై గా ఉంది . అందరికీ అర్ధం కాదు . 
ఇనొంచెమ్ సబ్ మెరైన్ పని తీరు ఎవరైనా వీడియో 
చూపుతున్నట్లు చూపాల్సింది . ప్రెషర్ అంటే కూడా 
చాలా మందికి అర్ధం కాదు . మాన్యువల్ అంటే 
తెలీదు , 
విశ్వనాధ్ గారు చూడు ,బాపు గారు చూడు ఒక 
క్లాసిక్ మూవీని కూడా అందరికి దగ్గర చేసి పడవ 
నడిపే వాడి చేత కూడా పాడించేస్తారు . మన 
హృదయం లోకి వచ్చేసి విలువలు పాటించు 
అంటారు . కళకు ఇదే కదా ప్రయోజనం . 

నీలో ఫైర్ ఉంది . దానిని అందరికి దారి చూపేట్లు 
వెలిగించు . వాళ్ళ దారిలోకి వెళ్లి ఒప్పించు . 
నువ్వు వేసిన దారిలో నడిపించు . 

సినిమా కళామతల్లికి పట్టుచీరె కట్టినంత పద్దతిగా 
ఉంది . మీ అమ్మ కడుపు చల్లగా , 
ఆ అమ్మకి నమస్కరించినంత తృప్తిగా ఉంది . 
ఆశీస్సులు . 
                                     ఒక బిటెక్ కుర్రవాడి అమ్మ 
                                               వాశశి 

Tuesday, 14 February 2017

ప్రేమతో ఒక అడుగు

 ఇప్పుడు కోట్ల హృదయాలు లో 
ఒకటే నినాదం 
అందరి ఆశలు విజయం చేరాలని 

నింగికెగసే ఒక్క జ్యోతి 
శతాధిక ఉపగ్రహాలను గమ్యం చేరుస్తూ 

అక్కడ కక్ష్య లో తిరిగేవి 
ప్రాణం లేని ఉపగ్రహాలు కాదు 
గగనాన భారతదేశం ఎగురవేసిన 
కీర్తి బావుటాలు 

గెలవాలి పి . ఎస్ . ఎల్ . వి సి 37 
నిలపాలి భారత కీర్తిని నింగిన  వేగుచుక్కలా 

రేపటి ప్రయోగం  చరిత్రగా నిలిచిపోవాలి 
భారతదేశం గెలవాలి 
ఆ గెలుపు నీది నాది మనందరిదీ 

              ******** 
ఫిబ్రవరి 15 , 2017 ఖగోళపు విజయాన్ని నమోదు 
చేయపోతుంది . ఎన్నో విజయాలు మనకు 
అందించిన పి . ఎస్ . ఎల్ . వి ద్వారా ప్రపంచం లోనే 
మొట్టమొదటగా 104 ఉపగ్రహాలు (మూడు మనవి , మిగిలినవి 
విదేశాలవి ) కక్ష్యలో ప్రవేశపెట్టపోతున్నారు . 

శ్రీహరి కోటకు దగ్గరలో సూళ్లూరుపేట కూల్ లో పనిచేస్తూ 
నేను కూడా పిల్లల చేత ఏదో ఒకరీతిలో శుభాకాంక్షలు 
చెప్పిద్దాము అనుకున్నాను . ఎలా ? ఇదే ఆలోచిస్తూ ఉన్నాను . 

మంచి సంకల్పానికి విశ్వము ఎప్పుడూ తోడే . 
సైకత శిల్పం చేయమని సెక్రటరీ గారి నుండి ఆదేశం . 
గైడ్ కూడా వచ్చారు , సనత్ . 

ఉదయమే పిల్లలు మేము కాళింగి నది ఒడ్డున మొదలు 
పెట్టాము . ఒక మంచి పని చేస్తున్నాము అనే భావనతో 
మనసు చాలా ఆనందంగా ఉంది . పైగా పక్కనే 
చెంగాళమ్మ కు చేస్తున్న కోటి కుంకుమార్చన మంత్రాలు , 
మాకు కొత్త శక్తినిస్తున్నాయి . 
ఎండను లెక్క చేయకుండా ఒకే దీక్ష , ఒక మంచి 
సందేశాన్ని ఇస్రో వాళ్లకు ఇచ్చి శుభాకాంక్ష తెలియచేయాలని . 
చిన్నారి చేతుల్లో ఒక రాకెట్ భారత పతాకాన్ని గుర్తు చేస్తూ 
ఊపిరిపోసుకుంది . 

చేసిన పనికి ఎదురుగా నిలబడిన సైకత శిల్పం 
చూస్తుంటే ఏంటో తృప్తి మా అందరిలో . 

మొన్ననే వీరభద్రుడి గారి ప్రేమ మీద వ్రాసిన కవరుపేజ్ స్టోరీ 
చదివాను . ఈ  ప్రేమికుల దినోత్సవం రోజు అది మళ్ళీ 
గుర్తుకు వచ్చింది . ప్రేమలో కూడా కొన్ని స్థాయిలు ఉన్నాయి . 
మొదటిది నాకు మాత్రమే నువ్వు సొంతం కావాలి , మొత్తం 
నాకే కావాలి అనే ప్రేమ . ఇందులో ఒక్కరు మాత్రమే ఉంటారు . 

రెండోది నువ్వు సంతోషంగా ఉండాలి . నువ్వు సంతోషంగా 
ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను అనే ప్రేమ . 
దీనిలో మనం  కూడా ఉంటారు . 
ప్రేమ ఇక్కడ తన పరిధిని పెంచుకుంటూ పోతుంది . 
తన నుండి మన కు వెళుతూ . 

మూడోది అందరు బాగుండాలి . విశ్వం బాగుండాలి అనే 
ప్రేమ . ఇది మొత్తం సృష్టి నే తనలో ఇముడ్చుకోగలదు . 
ఆధ్యాత్మిక మార్గం లో సృష్టింపబడిన ఈ ప్రేమ ప్రతి ఒక్కరి 
సహానుభూతి పొందుతుంది . 

మరి ఈ రోజు ఒక జాతి ని మొత్తం మా ప్రేమ లో ఉంచుకొని 
ఆ అత్యున్నతమైన ప్రేమ వైపు వేసిన అడుగు ఇది 
అనిపించింది . 

మనం ఒక్కోసారి ఒక్కోలాగా కనిపిస్తూ ఉంటాము . 
అవన్నీ సముద్రం పైన ఎగసిపడుతున్న అలలే . 
ఎవరు అందులో తొంగి చూస్తే వారి ఆరా లోని 
అనుభూతే అక్కడ కనపడుతుంది . స్నేహం అయితే స్నేహం 
ప్రేమ అయితే ప్రేమ  కోపం అయితే కోపం  . ఈ పై పై అలలు అన్నీ 
పక్క వారి మనసు సృష్టి . 
లోతులో గంభీరంగా సాగే సముద్రమే మనం . 
అక్కడ జరుగుతున్న ప్రయోగాలు ,ఒక్కో అడుగుగా
మనలోపలికి చేసే ప్రయాణాలు ఎవ్వరికీ కనపడవు . 

ఒక్క సంతోషకరమైన విషయం ఏమిటంటే మనకు 
తెలీకుండానే ప్రతీ జన్మకి మనలోని ప్రేమను 
విశాలం చేసుకుంటున్నాము . 
మనిషి మనిషిగా మారడం కంటే కావలిసినది ఏముంది !

అతని నుండి స్వార్థరహితంగా ఇచ్చే ప్రేమ తప్ప సృష్టి 
ఆశించేది ఏముంది . 
                                    @@@@@@ 
Monday, 9 January 2017

దంగల్ ,ఓ నాలుగు బాణాలు

దంగల్ ,ఓ నాలుగు బాణాలు 

మరి దంగల్ అంటే యుద్ధం అన్నారు అందుకని 
నాలుగు బాణాలు కాని బాణాలు ,వాక్బాణాలు . 
నా బ్లాగ్ రీడర్స్ కోసం . 

''పిన్ని సాయంత్రం  సినిమాకి రాను . సాయిబాబా 
గుడికి పోవాలి '' అక్క కొడుకు హర్ష ఫోన్ . 

'' నీతో రానురా ! మా అక్కతో అయితేనే చూస్తాను ''
ఖచ్చితంగా చెప్పేసాను . 

బావగారు పోయాక పిల్లలే ప్రపంచంగా ఉన్న రాణి అక్క , 
''ఏమిటే నీ పిచ్చి , నాతొ చూడాలి అని ఆ సినిమా '' 
నవ్వుతూ ప్రేమతో కసిరింది . 

ఏమైనా సరే దంగల్ సినిమా అక్క తోనే చూడాలి . 
ఈ రోజు మా విజయాల వెనుక మేము పడిన కష్ట సుఖాలు 
ఆప్యాయంగా గుర్తుకు తెచ్చుకోవాలి . 

ఎక్కడో రిలీజ్ అయిన సినిమా కోసం ఇంట్లో ఈయనను 
నొప్పించి(ఒక చిన్న యుద్ధమే జరిగింది . ఫర్లేదు భార్యా భర్తలకు 
చిన్ని తుంపర వర్షాలు అలవాటేగా  సంసారంలో !)
మరీ 30 కిలోమీటర్లు ప్రయాణం  వెళ్లాను . 

థియేటర్ లోకి   వెళ్ళేటపుడు చిన్న పశ్చాత్త్తాపం , తప్పు  చేసానా !
రిజర్వ్ క్లాస్ లో ఒక్కరు కూడా లేరు మరి . 


గేట్ కీపర్ పెద్దాయన . మమ్మల్ని చూసి 
''వెళ్లండమ్మా , ఇలాటి సినిమా ఇంక గూడూరికి రాదు . 
చాలా బాగుంటుంది '' ఎన్నో సమస్యలు చూసి ఉంటాడు 
 జీవితం లో . 
హమ్మయ్య మంచి సినిమాకి వచ్చాము . 
టైటిల్స్ చూడగానే తెలుగు .లో . 
భలే హ్యాపీ . నేను హిందీ కి ప్రిపేర్ అయి వచ్చాను . 
కుచ్ కుచ్ మాలూం హిందీ కదా , నేను . 

కథ మహా వీర ఫో గెట్ గురించి . మల్ల యుద్ధం లో 
నేషనల్ మెడల్ గెలుచుకున్న తాను ,తనకు  కుమారుడు పుట్టి 
వాడిని వరల్డ్ గోల్డ్ మెడల్ దేశానికి తెచ్చి పెట్టేలా 
తీర్చి దిద్దాలి అనుకుంటాడు . 
కానీ పాపం ! ప్రతి సారి కూతురే . అదీ నలుగురు . 
ఆశ వదిలేసుకుంటాడు . కానీ పిల్లలు ఆకతాయిలను 
కొట్టడం చూసి ,  పిల్లలకు మల్ల యుద్ధం నేర్పిద్దాము 
అనుకుంటాడు . ఆడ అయితే / ఏమిటి మగ అయితే 
ఏమిటి ? దేశానికి గోల్డ్ మెడల్ తేవాలి అనుకుంటాడు . 

ఆడ పిల్లలు , మల్ల యుద్ధం , అదీ చిన్న నిక్కర్లు 
వేసుకొని , అదీ ఆడ పిల్లలు వేస్ట్ అనుకునే రోజుల్లో , 
చిన్న పిల్లలకే చీపురు చేట ఇచ్చి  నేర్పించి పెళ్లి 
చేసి పంపిస్తే ఒక పీడా పోయింది అనుకొనే జనాల 
మధ్య , 
మల్ల యుద్ధం చేస్తుంటే వాళ్ళ పట్టు పట్టే నైపుణ్యం కాక 
షర్ట్ చినిగితే ఏమవుతుంది ,అని ఆసక్తిగా ఆడ పిల్లలను 
చూసే వాళ్ళ మధ్య . 
అసలు సాధన చెయ్యగలరా ఆడపిల్లలు ?
తల ఎత్తుకొని తిరగగలరా ?
నిలబడి బంగారు పతకం తెగలరా ? 

తేగలరు , మహా వీర ఫోగెట్ లాంటి తండ్రి ఉంటే !

అబ్బో ఆడవాళ్ళతో గెలవడం ఏమి గొప్ప అనకుండా , 
చిన్నప్పటి నుండి మగ పిల్లలను కూడా గెలిచి 
చూపిస్తారు . నేషనల్ పతకం సాధిస్తారు . 

కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది . 
ఇప్పుడు గీత కి టీనేజ్ . నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ లో 
చేరుతుంది . అంటే తండ్రి ని వదిలి దూరంగా వెళ్లడం , 
ఇంకో కోచ్ దగ్గర ట్రైనింగ్ . 

ఎంత చక్కగా చూపిస్తారో , కోచ్ అహం వర్సెస్ 
తండ్రిగా ఆశయం కల తండ్రిగా అమీర్ ఖాన్ తపన . 
తన కూతురు తప్పు దారి పడకుండా , తప్పు ఆట 
ఆడకుండా , అదీ ప్రపంచ స్థాయి యోథులతో పోటీ 
పడేటప్పుడు ఎలా తండ్రిగా అండగా నిలబడతాడో 
చూసి తీరాల్సిందే . 

ఎలాగో మనకు గీత బంగారు పతకం తెస్తుంది అని 
ముందే తెలుసు , అయినా టెన్షన్ గా చూసేట్లు 
ఉంది స్క్రీన్ ప్లే . డైరెక్షన్ . (ఆదిత్య )

ముఖ్యంగా కూతురి ఫైనల్ మ్యాచ్ తండ్రిని చూడ నివ్వకుండా 
బంధించి నప్పుడు , ఆ తండ్రి స్థానం లోకి మనం వెళ్లి 
టెన్షన్ పడిపోతాము . 
మన జాతీయ గీతం రాగానే పక్కన అక్క చెప్పేసింది , 
ఇది విని తెలుసుకుంటాడు తండ్రి తన కూతురు 
గెలిచింది అని . 

స్క్రీన్ ప్లే సూపర్ . కథ సాగ దీయకుండా గీత అన్న
చేత కథ చెప్పించడం , ఎందుకు మాకీ సాధన అని 
బాధ పడే పిల్లలకి , చిన్న వయసులో పెళ్లి చేసుకుంటున్న 
వాళ్ళ స్నేహితురాలు వాళ్ళ తండ్రి గొప్ప దనాన్ని 
వివరించడం , 
అసలెందుకు ఒక్కో డైలాగ్ కి కళ్ళనీళ్లు  తిరిగాయి . 
డబ్బింగ్ లో ఇంట చక్కని డైలాగ్స్ కుదరడం ,వాహ్ !

పాటలు బాగున్నాయి కానీ , కథ లో మునిగి సరిగా 
వినలేదు . ఇంకో సారి చూస్తేనే చెప్పగలను . 

ప్రతి ఒక్కరు ఒక జీవితాన్ని మన ముందుకు అలాగే 
తీసుకొచ్చారు . టీమ్ కి హాట్స్ ఆఫ్ !
తప్పక చూడాల్సిన సినిమా . 

మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన మా  అక్కకి బోలెడు తెలివి . 
ప్రతీ సీన్ ముందే చెప్పేసింది . అక్క నా సోల్మెట్ కదా , 
నన్ను భలే అర్ధం చేసుకుంటుంది . 
అక్కతో నవ్వు , ఏడుపు పంచుకుంటూ సినిమా చూడటం 
చాలా బాగుంటుంది . ముఖ్యం గా ఈ సినిమా ..... 

అక్కడ తండ్రి ని గెలిపించి నట్లే , నేను, అక్క చదువుకొని 
ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ మా నాన్న ఆశయాన్ని 
గెలిపించాము . అక్కడ తెర మీద   నాకు అమీర్ ఖాన్ 
కళ్ళలో అందరికి సమాధానం చెప్పి గట్టిగా నిలబడి 
మమ్మల్ని చదివించిన మా నాన్నే గుర్తుకు వచ్చాడు . 

దగ్గర వాళ్ళు , దూరం వాళ్ళు ఎన్ని సంభందాలు 
వచ్చినా ,ఆడ పిల్లలకు చదువు ఎందుకు అని 
కామెంట్ చేసినా మా ప్రపంచం నుండి ఒక్క 
అడుగు మేము ఉద్యోగాల వైపు వేసాము అంటే 
అది మా అమ్మా , నాన్న సంకల్ప బలం . 

తాంక్యూ అమ్మ , తాంక్యూ నాన్న . 
మీకు పిల్లలుగా అదీ ఆడ పిల్లలుగా పుట్టినందుకు 
వెనుక ఉండే అందరు ఆడపిల్లలకు చదువు 
దారి ఏర్పరిచినందుకు గర్వం గా ఉంది . 

                     @@@@@@@  Friday, 2 December 2016

నివాస్ నీ కోసమేహుష్ .....ఇప్పటికీ తీరింది కన్నయ్య , నీకోసం
పోస్ట్ పెట్టను ఇప్పటికీ వెసులుబాటు .
పనులు గూడ్స్ బండి లాగా వస్తాయో ,లేక
నేను గూడ్స్ బండి లాగా చేస్తున్నానో !

ఏమిరా నాన్న చెప్పు ఈ రోజు నీ పుట్టినరోజు
ఎలా జరుపుకున్నావు . ఇది నీ మొదటి సంపాదనతో
జరుపుకున్నది కదా . ఏమో నువ్వేమో పెద్ద అయిపోయాను
అమ్మ అంటావు , నాకేమో ఒక విషయం గుర్తుకు వస్తూ
ఉంటుంది .......

రే ఇట్రా రా , చేతిలో దువ్వెన పెట్టుకొని పిలిచాను .
అప్పుడే స్కూల్ కి వెళ్ళే చిన్ని బాబు భయంగా కళ్ళు
పెద్దవి చేసి
"కొట్టడానికా ! దువ్వడానికా ! "
ఇంత బుగ్గలు , చిన్నారి కళ్ళు దానిలో బోలెడు భయం .

ద్యేవుడా , ఎప్పుడైనా కొంత చిన్నగా దువ్వెనతో చురుకిఛ్చి
భయం పెట్టిన దానికి , వాడికి ఇంత భయం లోపల నిలిచి
పోయిందా ! ఛా ,ఇంకెప్పుడూ ఇలా చేయకూడదు .

"నివాస్ లేదులే నాన్నా , దువ్వడానికే దా "
దగ్గరకు తీసుకొని నుదురు మీద చిన్నగా ముద్దు పెట్టి
దువ్వాను . నా పిల్లలు ను ఇంకా దేనితో భయపెట్టకూడదు .
వాళ్ళ కళ్ళలో నేను భయం చూడకూడదు . ప్రేమ తో మెరిసే ,
చిరునవ్వులు విరిసే మొహాలే నేను చూడాలి .

అదిగో అప్పటి నుండి ప్రతి దానికి కథ అల్లడం , చెప్పడం .
నువ్వు నోరు తెరుచుకొని ఆ అంటూ వినడం .

ఇప్పుడు ఒక చిన్న కథ చెపుతాను . మిలరేప దగ్గరకు ఒకరు
వచ్చి ఆత్మ జ్ఞానం నేర్పమని అడుగుతారు .
నేర్పుతాను , ఒక గది కట్టు అంటాడు మిలరేప .

కట్టిన తరువాత ఆతను వచ్చి కట్టాను , ఇప్పుడు చెప్పండి
అంటాడు .
ఇప్పుడు ఇది నలు చదరంగా ఉంది , కూల్చేసి గుండ్రంగా కట్టు
అంటాడు మిలరేప .
ఆతను మళ్ళీ కడుతాడు .

మళ్ళీ కూల్చేసి వేరుగా కట్టమంటాడు .
చివరికి అన్నీ కూల్చేసి నిలబడతాడు ఆతను .

ఎందుకు ఇన్ని సార్లుకట్టడం , కూల్చడం .
ఏమిమిగిలింది చివరికి ., ఆతను అడుగుతాడు .

ప్రపంచం లో నువ్వు చేసినది ఏదీ మిగలదు . నీ చేతులకు
వఛ్చిన నా నైపుణ్యం , నేర్చుకున్న జ్ఞానం , ఇవే ఇంకో జన్మకు
నువ్వు తీసుకెళ్లారాదా

అంతే నాన్న వాస్తవం అదే ! ఈ పరిస్తుతుల్లో ఎలా జీవించాలి అనేది
నేర్చుకోవడానికి వచ్చాము. ఇవన్నీ మనం ఎన్నుకున్నవే .

వచ్చే ఏడాది నీ జీవితం లోకి ఇంకొకరు వస్తారేమో తెలీదు .
కాని ఇప్పుడు మాత్రం పుస్తకాలు చదువు . ఎందరి గురించి
వీలయితే అన్ని , ఒక్కో జీవిత కథ ఒక్కొక్కటి నేర్పిస్తుంది .
కొన్ని ఎలా బ్రతకాలో చెపితే కొన్ని ఎలా బ్రతుకు కూడదో
చూపుతాయి.

చదివి చదివి నీకు ఈ సమాజానికి మధ్య ,ప్రక్రుతి మధ్య ఉన్స్
హద్దు తొలగి పోవాలి . విశ్వము లో నువ్వెంతో నీకు తెలియాలి .
విశ్వ మానవుడివి కావాలి . నీవెన్ని అనుబంధాలు నిలుపుకోగలవో
అదే నీ విజయం .
వివేకానందుడి లాగా నీ హృదయం ఎల్లప్పుడూ నేను దివ్యాత్మని
అని ధైర్యంగా గర్జించగలగాలి . సంపాదన ఎంత ముఖ్యమో
వ్యక్తిత్వ వికాసము అంతే ముఖ్యం .

సీతమ్మ వాకిట్లో సినిమాలో ప్రకాష్ రాజ్ ఏమని చెపుతాడు గుర్తు ఉందా !
ఈ జన్మకే వీడు నీ అన్న , ఈ జన్మకే వీడు నీ తమ్ముడు . మళ్ళీ రమ్మన్నా
ఈ పాత్రలు ఇలాగే నీకు రావు .
ఈ నాటకాన్ని ఎంత మెచ్యూరిటీ తో నడుపుతావో అదే నీవు సాధించిన
జీవిత జ్ఞానం .

నిజం రా నివాస్ , ఒక సామాన్యమైన మనిషి సమాజానికిఏమి
ఇవ్వగలడు ! చక్కగా తీర్చిన తన పిల్లలని తప్ప .

ఇప్పుడు మీ అక్క కొమ్మకి ఇంకో చివురు బుజ్జిగాడి రూపం లో
వచ్చ్చేసింది కదా ఈ ఏడాది ☺

మేనమామ బాధ్యత , మోయగలవా ?
మేనమామ అంటే వాడికి తల్లి తరువాత తల్లి లాంటి వాడు .
భాద్యతలు బరువే అయినా ఎందుకో మరి అదో సుఖం
విజయవంతంగా మోయగలిగితే ☺

నీ కాళ్ళ మీద నువ్వు నిలబడినందుకు అభినందిస్తూ
మిగిలిన వాళ్లకు అవసరం అయినపుడు అండగా నిలబడమని
చెపుతూ మీ అమ్మ ఆశీస్సులు .

పుట్టిన రోజు శుభాకాంక్షలు కన్నయ్య .
శతమానం భవతి
Monday, 10 October 2016

స్త్రీ శక్తిఏమిటి ఈ చిత్రం , కనుబొమలు పైకి లేపి చిత్రంగా చూసాడు కృష్ణయ్య
అడ్డుగా నిలబడిన చెలికత్తలను చూసి

సత్యా దేవి గదిలో విరిసిన ప్రేమ పరిమళాలు స్వాగతమే కాని
నిరసన ల వేడి ఎప్పుడూ తగలదు తనకు .

ఆయన కళ్ళలోకి చూడలేక తల వాల్చేస్తూ చెప్పింది సత్య ప్రియ సఖి ,
అమ్మగారు కోప గృహం లో ఉన్నారు .

అలుకా ! కోపమా ! ఉలిక్కిపడ్డాడు .
అలుకయితే పర్లేదు ఇంటిరెక్క తీయగానే గాలితో కలిసి మీద బడే ఝల్లు ,
ఫర్లేదు కొంచెం ఉక్కిరి బిక్కిరి చేసినా చల్లగా అల్లుకొని హృదయాన్ని సేద తీరుస్తుంది
అదే కోపం అయితే , భూమాత గుండెల సెగలు నుండి ఉబికేశిలాద్రవమే , ఒక్క
అణువు మిగలక కాల్చేస్తుంది . కొన్ని రోజుల ముందటే చూసాడు కదా , ఆ రౌద్ర దుర్గ
రూపం , నులి వెచ్చగా వెలిగే దీపం రగిలి నరకుని కాల్చిన వైనం .
మెల్లిగా ఆలోచనలోకి జారిపోయాడు స్వామి

                      ************
ధనువు నుండి శరపరంపరలు రాలుస్తూ పక్కకు చూసాడు ,
ఇంత యుద్ద భూమిలో ఎదురుగా యుద్ధోన్మాదం తో తలపడుతున్న నరకుని
నిలువరిస్తూ కూడా ఆయన కళ్ళు తటాలున పక్కకు లాగేస్తూ ఆ జాజి కొమ్మను
చుట్టేస్తూ వదిలి రానంటున్నాయి . అందుకే ముద్దు గుమ్మలను పేరంటానికి పంపాలి కాని
యుద్ద రంగానికి వెంట తీసుకొని రాకూడదు .
అన్ని గంటల శ్రమ ముత్యాల్లాగా తన మోవి పై జారుతుంటే కొనకొంగుతో అద్దుకుంటూ
కళ్ళు పెద్దవి చేసుకొని తన స్వామీ వీర విహారం చూస్తూ ఉంది . వీరుడికి యుద్ధం , అగ్నికి ఆజ్యం
దొరకాలే కాని ఆ విజృంభణ చూడ శక్యమా ? అందులో మనసయిన లేమ పక్కన ఉండి కళ్ళతో
ప్రశంసిస్తుంటే , గెలవక ఆపగలవారు ఎవరని ?

నల్లనయ్యకి ఒక్కో సారి క్రీగంట చూసినప్పుడల్లా వేయి ఏనుగుల బలం . నరకుడు కొంచెం
తటపటాయిస్తున్నాడు . ఎదురు దెబ్బలు వేసేదానికి తడబడుతున్నాడు .
చిత్రం రోజుల దొరలింపు లో సేన హతం అవుతున్నది కాని ఎవరూ తగ్గరే !
అంతకంతకు దెబ్బ తిన్న పులిలా నరకుడు విరుచుకు పడుతున్నాడు .
నల్లనయ్య నిలువరిస్తున్నాడు .
స్వామీ యుద్ధం ఇంకా ఎంత సేపు ? పూరేకు కళ్ళలో చిన్ని పాటి అలసట .
అయ్యో ! తానూ వస్తాను అన్నా వారించవలసింది . ఎలా తీసుకొని వచ్చాను .
ఎదురు బాణాలు గుప్పిస్తూనే చేతితో సత్య నుదురు చిన్నగా నిమిరాడు .
పూల గుత్తి తో స్వేదబాష్పా లు తుడిచినట్లు .
ఆ మాత్రపు స్పర్శే ఎంతో శక్తిని ఇచ్చినట్లు పొంగిపోయింది .
కానిమ్మన్నట్లు సైగ చేసింది . నరకుని వైపు చూసింది , అభావంగా .
తప్పదు కాబట్టి తీసుకుని వచ్చాడు కాని , హృదయం మీద వాలితేనే
కందిపోయే ఆమోమును రణాంతరంగానికి తీసుకొని వస్తాడా !
ముగించాల్సిందే తప్పదు , విసురుగా ధనుష్టన్కారం చేసి శరాలను గుప్పాడు .

వచ్చిన వాటిని ఎగరేస్తూ విసిరాడు నరకుడు గదని , మెల్లిగా దూసుకొని వచ్చి
కృష్ణుని తాకింది . మెల్లిగా కూర్చుని పక్కకు వాలాడు , కళ్ళు మూసుకుని.

నటన సూత్రధారి ఇప్పుడు కదా నాటకం మొదలు అయింది .

విస్మయంగా స్వామీ వైపు చూసింది సత్య .
ఉగ్గు పాల నాడే పూతననుచంపిన వాడు , చిరుత అడుగులతోటి కాళీయుని మదం అణచినవాడు ,
నూనూగు మీసాల కంసుని వదియించిన వాడు , చిన్ని గదా ఘాతానికి మూర్ఛిల్లుటా!!!!

కురుస్తున్న శరాగ్నిని చూసింది . మెల్లిగా లేచి విల్లు అందుకుంది .
ఆకర్ణాంతం లాగి కొన్ని శరములు కురుస్తున్న శరములకు అడ్డుగా ఛత్రముల వలె,
మెల్లిగా వెనక్కు చూసింది , స్వామీ కనులు మూసుకొని ఉన్నారు .
అయ్య పాత్ర ఆగినపుడు అమ్మ పాత్రయే ఈ భువి ని నడిపించాల్సింది .
ఒక చేత్తో శరములు సంధిస్తూనే , వీపున పరుచుకున్న కురులు ముడిచింది .

ముడుచుకున్న భృకుటి నుండే శరాల వర్షం కురిసినట్లుగా ఉంది , మెల్లిగా
చేతిని వెనుకకు పోనిఛ్ఛి కోన కొంగు అందుకొని వడుపుగా నడుముచుట్టి గట్టిగా
దోపింది . శరములా అవి తామర తూడులా ! వెళ్ళుచున్నవే కాని నరకుని తాకుట లేదే !
వచ్చు చున్న శరాలను నిలవరించు చున్నవి అంతే !
క్రీగంట చూచుచున్న కృష్ణయ్యకు పూబంతిఆడుచున్న బంతులాటల వలే ముచ్చటగా ఉంది .
ఒక్క శరమయినా ఎదుటి రాక్షసుని నొప్పించునో లేదో . తన ప్రేమ కలశం కోపపు చుక్కయిన
రాల్చలేదా!
నరకుని శరాల నిలవరిస్తో , స్వామీ ని చూసి , ఇదేమి చిత్రం ఇంత సేపు లేవకుండా , అనుకుంటూ ఉంది .

కృష్ణయ్య చూస్తూనే ఉన్నాడు , తనకే తెలియకుండా తనలోని ప్రేమను కురిపిస్తున్న తల్లిని .
ఒక్క శరమయినా కనీసం నరకుని రధాన్ని తాకందే , ఇక నరకునిదేహాన్ని తాకుట ఎట్లు ?
జన్మఅంతర వాసన , తల్లి మనసుకు ఆ పాశం ఉంది . అదే నిలవరిస్తూ ఉంది .
తనతో ఏమి పాశం సత్య కు , బాహ్యపు మాంగల్య బంధం తప్ప . గట్టిగా తనను కట్టగల శక్తి ఏది ?
ఏదో ఒకటి చేయాలి .

మనసుకు పదహారు వేల ఆర్తనాదాలు వినిపిస్తూ రక్షణ కోసం ఆక్రోశిస్తూ ఉన్నాయి .
తప్పదు పాపా పీడా విరగడయి నవ్వుల దివ్వెలు వెలగాలి .
సత్య చేయి తప్ప ఆ మరణానికి అంకురార్పణ ఎవరూ చేయలేరు .
మాతృ పాశాన్ని తుంచే బలీయమైన శక్తి ఇప్పుడు తనకు కావాలి .

కళ్ళు మూసుకొని చిన్నగా నవ్వుకున్నాడు . చిత్రం గాలిలో దూరంగా చెదిరిపోతున్న
నరకుని శరం దారి మార్చుకొని కన్నయ్య చేతికి చురుక్కుమని గుచుకున్నది .
సత్యా , బాధగా ఆమె చేయి పట్టుకున్నాడు . పట్టుకున్న చేతి నుండి ఏదో ఆలంబన ,
ప్రేమ శక్తి ఇటు నుబడి అటుకి . ఇంటి దీపాన్ని కి ఆర్తిగా విన్నపం చేసినట్లు .

ప్రేమ పాశానికి ఒక్క క్షణం లో మాతృ పాశం బద్దలయి పోయింది .
ఎర్రటి జీరలు విరజిమ్మే కళ్ళు , కోపం అదిరే వళ్ళు , మృత్యు పాశాల్లా ఎగురుతూ కురులు ,
మహిషాసుర మర్ధిని మళ్ళీ ఉద్భవించినట్లు .
ఒక్క ఉదుటున సత్య నారి నుండి వెలువడిన క్రోధపు శరం నరకుని రొమ్ము చీలుస్తూ ఎర్రగా బయటకు
వచ్చింది .
తల్లి దెబ్బ తగలగానే , ఆదాటున విసిరిన చక్రాయుధం నరకుని నిలువుగా నరుకుతూ ....
అదిగో ఆనంద దీపావళి , అందరి గుమ్మాల్లో వెలుగు వాకలుగా నడుస్తూ .

సత్య భుజం చుట్టూ స్వామీ వారి చేయి దీపాన్ని చేతులు చుట్టి కాపాడుకుంటున్నట్లు .

                              ************
కాళ్ళకు ఏదో తగిలినట్లు ఉలిక్కిపడి లేచింది సత్య .

స్వామీ వారి శిరసు , ఎంత పాపం !
జాలువారే కన్నీళ్లతో క్షమాపణ వేడుకుంది .
లేదు సత్య నీ తప్పు లేదు .
ప్రేమ పాశాలు ఇంటిని పట్టి ఉంచుతాయి . స్త్రీ శక్తి ప్రేమ మయం గా
ఉంటేనే దానిని దీపం లాగా గౌరవం గా చూసుకున్న పురుషుడి జీవితమే
విజయ పధం లో నడుస్తుంది . లేకుంటే ఆ శక్తే నిలువునా దహిస్తుంది .

చెప్పు , అలక వద్దు , నీకేమి కావాలి ?
చిరునవ్వుల ప్రేమలు కురిపిస్తుంటే మురిసిపోవడమే కాని ,
గొంతు మూగ పోవడమే కానీ , అల్లుకుని పోవడమే కాని
స్త్రీ శక్తి కి ఇంకేమి తెలుసనీ !
ఇపుడు అక్కడ మాటలతో పని లేదు .
ఎందరికి తెలుసు ఈ రహస్య శక్తి గురించి , గీసుకున్న హద్దుల్లో
కాపాడుకుంటున్న ఆహాల గురించి తప్ప .
                     @@@@@@@@@@

Thursday, 15 September 2016

బ్లాక్ మెయిల్ హాస్య కథ

ఇది ప్రతిలిపి . కాం లో నా పేజ్
ఈ బ్లాక్ మెయిల్ కథ మాలిక వెబ్ మ్యాగ్ జైన్ లో మూడో బహుమతి
పొందినది . మరి నా కథలు అన్నీ ఈ పేజ్ కు వెళ్లి చదవండి
Thank you malik and Pratilipi
http://telugu.pratilipi.com/v-sasikala/black-mail
#freeread

http://telugu.pratilipi.com/v-sasikala/black-mail

‘త్వరగా కానీ ” పులిపిరి మొహం తొందర పెట్టింది.పబ్లిక్ ఫోన్ డైల్ చేస్తున్న కోర మీసం వేళ్ళు వణికాయి .”ఉండరా! చేస్తున్నాను ”
 ”రింగ్ అవుతుందా ?” ”హా ” తలూపాడు.”మాట్లాడు మాట్లాడు ” తొందర చేసాడు .ఊరుకోరా అన్నట్లు చేయి ఆడించాడు ,

”హలో ఎవరు ?” అవతలనుండి ఆడ గొంతు .”నేను ఎవరైతే ఏంటి ? చెప్పేది విను ” కటినంగా అన్నాడు కోర మీసం. ”నువ్వు ఎవరో తెలీకుండా నేను వినడం ఏమిటి? వెధవ మొహం నువ్వూను ”

విసుగ్గా అంది అవతలి గొంతు..ఎలా తెలిసిందబ్బా !మనసులో అనుకోని”నాది వెధవ మొహం అని నువ్వు చూసావా? చెప్పేది వినకపొతే”

“నీకే నష్టం ” అన్నాడు..”సరే ఏడువు ”పెద్దగా నవ్వాడు .”పెట్టేయ్యమంటావా ?” వటాలి నుండి అసహనం
 ”కాదు కాదు ఉండు ఉండు . చెప్పేస్తాను .నీ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి ””ఉంచుకో . దానికి నాకు చెప్పడం ఎందుకు ?”ఛీ ఛీ బ్లాక్ మెయిలర్స్ కి వాల్యు లేకుండా పోయింది . పళ్ళు పట పటలాడించాడు .
రచన - వి శశికళ

ఈ కథను పూర్తిగా చదవడానికి ఈ క్రింది చిత్రంపై క్లిక్ చేయండి

Friday, 5 August 2016

నివాస్ నీ ఫర్స్ట్ ఫ్రెండ్ ఎవరు ?
రే నివాస్ గుర్తుందా ? నువ్వు బిటెక్ అప్లికేషన్ వ్రాసిన రోజు .
అప్లికేషన్ నేను నింపబోతుంటే శ్రీనివాస్ గారు
"మీరెందుకు నింపుతున్నారు , తననే నింపనివ్వండి " అన్నారు

"తప్పులు పొతే ఎలా ? " అడిగాను .
"పోనివ్వండి . ఎలా చేస్తే కరక్టో నేర్చుకుంటాడు " సింపుల్ గా చెప్పేసాడు ,
అమ్మ మనసు ఆయనకు ఏమి తెలుస్తుంది !
తప్పులు అనే ముళ్ళు తన బిడ్డ పాదాలకు తగలకుండా
బిడ్డ పాదాల కింద తన అరచేతులు పెట్టాలి అనుకుంటుంది తల్లి .

కాని నాకు అర్ధం అయింది ఈ లోకం లోకి నువ్వు ఒక్కడివే వెళ్ళాల్సిన
రోజు వచ్చేసింది . ప్రస్తుతానికి దాని పేరు కె . ఎల్ . యు .
కాని అక్కడి నుండి నువ్వు రెక్కలు బలంగా చేసుకుంటూ ఎగరడమే కాని
ఇక నారెక్కల్లో ఒదుక్కోవు. ఇప్పటి దాకా అమ్మ గా ధైర్యాన్ని ఇచ్చింది ఈ
లోకాన్ని ఎదుర్కోవడానికే , కాని చిత్రం లోకం లోకి నువ్వు ఒంటరిగా
వెళుతున్నావు అనే బాధ !

ఒక్కటే సంతోషం , నేను నేర్పిన విషయాలు నువ్వు ఏవీ మర్చిపోలేదు ,
చుట్టూ ఉన్న లోకాన్నే నీ స్నేహం తో అమ్మగా చేసుకున్నావు .
ఇప్పుడు నిన్ను కాపాడే అమ్మ చాలపెద్దది . తన చేతులుగా నిన్ను
రక్షించే బోలెడు మంది స్నేహితులు .

విప్రో లో చేరటానికి వెళ్ళగానే , మీ నాన్న తో అన్నాను
"ఎలా చేస్తాడో వాడు , ఏది మంచిదో ఏది చెడ్డో ఎలా
తెలుస్తుంది ?"అన్నాను

ఒక్కటే ఆయన సమాధానం
" వాడెప్పుడో వాడి ఫ్రెండ్స్ దగ్గర కనుక్కొని ఉంటాడు లేవే ! "

స్నేహం తల్లి లాగా దారి చూపిస్తుంది . నీ బాధ్యతలు చేస్తూనే దానిని
ఎప్పుడూ పెంచుకో . అది విలువైన ఆస్తి .
నేస్తాలు ఒకే అమ్మకు పుట్టినపిల్లలు . ఆ అమ్మ పేరు జీవితం .
మరి అమ్మని మర్చిపోకు . అమ్మ కూడా ఒక ఫ్రెండే  :-)