Monday 30 October 2017

అదే సరదా మాకు

అదే సరదా మాకు 

నీకు ఈ విషయం తెలుసా? 
వచ్చేసాడు నాయనా గాలిగాడు. 
గాలి కంటే వేగంగా వార్తలు అందరికీ మోస్తూ ఉంటాడు. 
ఇంకా వార్తకు పెప్పర్ చల్లడం లో దిట్ట. 
అయినా బోర్ కొట్టే ఈ ఆఫీస్ పనిలో అవి కూడా ఇంట్రస్ట్ 
గా ఉంటాయి. ఇతరుల జీవితాల్లో పీపింగ్ చేసి కామెంట్ 
చేయడం బోలెడు సరదాగా ఉంటుంది. 
చేసే పని ఆపేసి చూసాను. 

మనోడి పేస్ బుక్ ఫ్రెండ్ ఇంకా దగ్గర రిలేషన్ అయిపొయింది. 

నిజమా ,అన్నాను. 

అవునురా బాబు. టూర్ కి కూడా వెళ్లపోతున్నారు. 
వాడి టేలెంట్ ఏమి ఉందిరా బాబు. ఎవరినైనా 
ఒప్పించేస్తాడు.నీకు బోలెడు తెలివి అంటావు ఎందుకు?

హుష్ లాభం లేదు,ఏదో ఒకటి చెప్పాలి అనుకున్నాను. 

నాకు బోలెడు మంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు తెలుసు కదా!

ఉండారులే పెద్ద పరస్పరంగా పొగుడుకుంటూ , 
వాళ్ళు కాదు ఒక్కరికైనా నువ్వు ప్రొపోజ్ చేసావా?

నిజమే చెయ్యలేదు.అయినా శారద గుర్తుకు వచ్చింది. 

తల అడ్డంగా ఊపాను తలవంచుకొని. లోపలెక్కడో 
ఏదో జంకు. 

మరదే నీ ఫ్రెండ్స్ లో నీకు ఇష్టమైన ఫ్రెండ్ ఎవరు?
పోనీ నీతో బాగా క్లోజ్ గా మాట్లాడేది ఎవరు? అడిగాడు. 

చెప్పాను. 

ఇంకేమిటి?నీ మీద ప్రేమ లేకుండానే అంత క్లోజ్ గా 
ఉంటుందా?చెప్పెయ్యి. వీలయితే హ్యాపీ గా ఎంజాయ్ చెయ్యొచ్చు. 

ఆమె అలాటిది కాదేమోరా!

ఏమిటి కాదు. అందరు ఇక్కడికి వచ్చేదాకా మంచివాళ్ళే. 
దీనిలోపలికి వచ్చినాక కదా లోపల మనిషి బయటకు 
వచ్చేది. 

ఇంటి దగ్గర శారద గుర్తుకు వస్తూ ఉంది. క్యారియర్ నుండి 
మెల్లిగా వచ్చే కూర వాసన,లోపల నుండి ఇంకేదో. 

మౌనంగా ఉన్నాను. 

పేస్బుక్ లో అకౌంట్ ఉందంటే అదేమీ పెద్ద .... ... కాదులే, 
నువ్వు ఇంత ఇది అయిపోవడానికి. యెంత మంది తో 
వగలు పోతూ చాట్ చేస్తుందో ఎవరికి తెలుసు?

సీరియస్ గా చూసాను. 


అది కాదు రా ..... అదీ .... అదీ..... నీళ్లు నమిలాడు. 

ముందు కొంచెం సంస్కారంగా మాట్లాడటం నేర్చుకో!
తన శరీరాన్ని అమ్ముకున్న ఆడదాన్ని అయినా మనం 
తప్పుగా అనకూడదు , నిజంగా అమ్మ తన శరీరాన్ని 
చీల్చి జన్మను ఇవ్వకపోతే మనం అసలు పుట్టి ఉంటామా?
తనను అలాగా మాట్లాడితే నేను ఒప్పుకోను. 

కోపం తో కూడిన దుఃఖం లోపల ఏదోగా ఉంది. 
ఎప్పుడూ ఇంత హార్ష్గా ఎవరితో మాట్లాడింది లేదు. 
ఎందుకు ఇప్పుడు ఇంత  ఫీల్ అవుతున్నాను. 
ఎవరో తెలీని ఒక వ్యక్తి కోసం!  

సరే సరే కూల్. నువ్వు అందరికన్నా గొప్పగా ఉండాలని 
చెప్పాను. ఇదంతా ఫెక్ వరల్డ్ రా. జస్ట్ ఫర్ ఫన్ . 
ప్రొపోజ్  చేసి చూడు , నీకే తెలుస్తుంది దానిలో 
యెంత హ్యాపీ ఉందో . 

నిజమే నా ఉనికిని  ఎవరికైనా ఒక మంచి జ్ఞాపకం 
చెయ్యగలను. కానీ తనకి ఒక మంచి జ్ఞాపకం 
ఉంటుంది. 

ఆలోచిస్తూఉన్నాను . 

ఇంకా ఏమిటిరా ఆలోచిస్తావు?ఈ రోజు రేపు ఆదివారం ఆలోచించి 
కవితో కధో వ్రాయి. దెబ్బకి నీ ఫ్రెండ్ నీ చుట్టూ తిరగాలి. 

మనసుకు లొంగని వారు ఎవరు!ఎంతటి వివేకం అయినా 
ఒడి[పోవాల్సిందే. .... మెల్లిగా తలా ఊపాను. 

ఆలోచనలో వాడు ఎప్పుడు వెళ్లిపోయాడో కూడా చూడలేదు. 

                     ***********
వచ్చారా! ఇంటికి వెళ్ళగానే హడావడిగా తిరుగుతూ పిల్లలని 
రెడీ చేస్తుంది శారద. 

టీ చేతికి ఇచ్చి,త్వరగా రెడీ కాండీ. అంది 

ఎక్కడికి? మనసులో వ్రాయాల్సి ఉత్తరం తిరుగుతూ ఉంది. 
విసుగ్గా మళ్ళీ ఎక్కడికి ?అడిగాను. 

మర్చిపోయారా?పాపకు ఈరోజు మూడో ఏడాది టీకా 
వేయించాలి. రేపు ఆదివారం జ్వరం వచ్చినా మీరు 
తోడు ఉంటారని ఈ రోజు అపాయింట్మెంట్ తీసుకున్నాము 
కదా!

మర్చేపోయాను. 
బుజ్జి తల్లి నవ్వుతూ చేతులు ఇచ్చింది,ఎత్తుకోమని. 
ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాను. 
అవి తరువాత త్వరగా పదండి. 
తొందర చేసింది. 

                     ************
ఆ పాలు ఇటివ్వండి . ఏవైనా త్రాగుతుందేమో!

శారద అడగగానే ఇచ్చాను. 

పాప ఒకటే ఏడుపు.డాక్టర్ చెప్పినట్లే జ్వరం వచ్చేసింది. 
అమ్మ వాడి దిగకుండా ఏడుస్తూనే ఉంది మూలుగుతూ!
అలిసిపోయిన గొంతుతో వెక్కుతూ ఉంటే నాకు దుఃఖం 
వచ్చేస్తూ ఉంది. 
చిన్నతల్లి కి యెంత బాధగా ఉందొ. 

ఏమండీ టెంపరేచర్ పెరుగుతూ ఉన్నట్లు ఉంది. 
ఆ తడి గుడ్డ  ఇవ్వండి తుడుస్తాను..... శారద పిలుపుకు 
ఉలిక్కిపడి నీళ్లు ,టవల్ తీసుకుని వచ్చాను. 

శారద చేతికి తీసుకుంటూ ఉంటే ,నేను తుడుస్తాను అన్నాను. 

ఒళ్ళు కాలిపోతూ ఉంది బుజ్జిదానికి.తుడుస్తూ ఉంటే 
మధ్యలో డాడీ డాడీ అని వెక్కుతూ ఉంది. 

వెధవ జ్వరం నాకు రావొచ్చు కదా,పసిదాన్ని బాధపెట్టక పొతే!
లోపల దిగులు పెరిగిపోతూ ఉంది.వద్దన్నా కళ్ళు తడుస్తూ 
ఉన్నాయి. 

శారదా కూడా అలిసిపోయి పాపను పక్కన పడుకోబెట్టుకొని 
అలాగే వాలిపోయింది. 

బాబుకి ఇడ్లీ పెట్టి నిద్రపుచ్చి వాళ్ళ మధ్యలో పడుకున్నాను. 
నిద్ర రావడం లేదు,పక్కన పాప మూలుగు  వింటూ ఉంటే!
ప్రతి తండ్రి ఇవన్నీ దాటి ఉంటాడా?వాళ్ళ మనసు ఏమైనా 
రాయి గా ఉంటుందా?

మొబైల్ మోగిన శబ్దం. ఉలిక్కిపడి లేచాను. పాప లేస్తుందేమో!
శారద ,పాప ఒకరిని ఒకరు హత్తుకొని పడుకొని ఉన్నారు. 
పైన వేసి ఉన్న బాబు కాలును పక్కకు పెట్టి మొబైల్ 
అందుకున్నాను. 

అర్ధరాత్రి దాటింది. ఎవరై ఉంటారు?
ఆన్ చేసి చూసాను. గాలిగాడు. 
ఇంత  రాత్రి ఏమి అయిఉంటుంది?

అటునుండి ఆదుర్దాగా గొంతు వినిపిస్తుంది. 
రే వాడు చేసిన ఎదవ పనులన్నీ బయటకు వచ్చి వాళ్ళ 
భార్యకు తెలిసిపోయాయి అంట.పిల్లలు డాడీ అని ఏడుస్తున్నా 
వినకుండా ఇంటి నుండి వెళ్ళిపోయింది అంట. ఇప్పుడు వాడు 
ఫోన్ చేసి చచ్చిపోతున్నాను అని చెపుతున్నాడు. నువ్వు 
తొందరగా రారా, అక్కడ ఏమవుతుందో!

ఇప్పుడు ఎలా రాగలునురా ,పాపకు అసలు బాగాలేదు. 
జ్వరం ఎక్కువ అయితే ఫిట్స్ వస్తాయి. గంట గంట కు 
టెంపరేచర్ చూసి మందు వేయాలి. 
అయినా వాడికి ఏమీ కాదురా నువ్వు చేరేలోగా నేను ఫోన్ చేసి 
ధైర్యం చెపుతూ ఉంటాను. 

సరే చెయ్యి ..... పెట్టేసాడు. 

వెంటనే ఫోన్ చేసాను.అక్కడ పశ్చాత్తాపం మాటలుగా 
జారిపోయిన ప్రేమఇంటిని మళ్ళీ కూర్చలేను అనే దైన్యం లో!
ధైర్యం చెపుతూ,మాట్లాడిస్తూ ఉన్నాను. 
ఫోన్ లో అటు నుండి గాలిగాడి గొంతు ..... భయం లేదురా . 
చేరాను. 
హమ్మయ్య గండం గట్టెక్కినట్లే. 

రే, ఇవన్నీ జోక్ కాదురా.నువ్వు నీలాగే ఉండు. 
ఇప్పుడు మనం ఒక మనిషి కాదు ఒక కుటుంభం. మనం ఏమీ తప్పు 
చేసినా ఇంట్లో అందరు బలి కావాల్సిందే. 
నువ్వన్నా హాయిగా ఉండు..... పెట్టేసాడు ఫోన్. 

నిద్రపోతున్న శారద పక్కన పడుకున్నాను. 
ఇటు తిరిగి నా చేయి మీద తలా పెట్టుకుంది...... 
నిద్రలోనే ఇష్టంగా నా చేయి లాగి. 
చూస్తూ ఉన్నాను. యెంత భద్రంగా హాయిగా నిద్రపోతూ 
ఉంది నన్ను నమ్ముకొని. కొంచెం మనసు మాట విని 
జారీ ఉంటే తిరిగి ఈ నమ్మకాన్ని నిలుపుకోగలనా?

ఇంకొంచెం దగ్గరగా తీసుకోపోయాను. మధ్యలో ఎప్పుడు దూరిందో 
బుజ్జి తల్లి,నా పొట్టకు తలా ఆనించి వెచ్చగా పడుకుని ఉంది. 

చేయి మీద ఉన్న శారద కళ్ళు తెరిచి కళ్ళు ఎగరేసింది,
తిక్క కుదిరిందా అన్నట్లు!
ఎగతాళి చేసినా ఎంత బాగుంది ఈ ప్రేమలో ఉంటే . 
ఏమి చేసినా కోపం రావడంలేదు. 
చటుక్కున నుదురు మీద చిన్నగా ముద్ర వేసాను. 
నాదంటే నాదే ఈ ప్రేమ.వెక్కిరింపు అంటే కూడా 
ఎంత ప్రేమ. అదీ ఒక సరదాగా ఉంది. చాలు నాకు 
వీళ్ళు ,ఇంకెవరూ అవసరం లేదు. 

                       @@@@@ 

Sunday 8 October 2017

గురజాడ గారు నమోనమః



గురజాడ గారు నమోనమః 
                                                    వాయుగుండ్ల శశికళ 

గురజాడ గారి జయంతి నుండి అనుకుంటూ ఉన్నాను. కొన్ని అక్షరాలు 
దగ్గరగా కూర్చి కృతజ్ఞతా హారంగా వేద్దాము అని!అప్పుడే నేను 
ఏమీ వ్రాయకుండానే చిలకమర్తి వారి జయంతి కూడా వచ్చింది. 
పర్లేదు,ఇంకా సంధర్భం మించిపోలేదు. 125 ఏళ్ళు ఉత్సవాలు 
ఇంకోసారి గుర్తుచేసుకుంటూ వ్రాయొచ్చు. మా స్థితిగతులు అంత 
బాగా వ్రాసినవారికి మా పనిభారం గురించి మాత్రం తెలియదా. క్షమించేస్తారు. 

ఇంతకీ ఇప్పుడేమి వ్రాయపోతాను!బావిలో కప్పలా ఉండే నాకు 
కన్యాశుల్కం అయినా వరకట్నం అయినా లోకం లో మా స్థితి 
ఎంత దీనంగా ఉందొ చెప్పే కన్యాశుల్కము నాటకం కంటే 
మనసుకు దగ్గర అయిన రచన ఇంకొటి లేదు. 

ఎలా నిలిచిఉంది ఈ నాటకం?సమకాలీనత అంటారు కొందరు. 
పోవలిసిన ఆధునిక జాడ ను కూడా ఇది చర్చించింది. 
ఎప్పటికి ఈ నాటకాన్ని సమకాలీనం అనకుండా చరిత్ర అంటామో 
అప్పుడు కదా గురజాడ వారి కల నెరవేరినట్లు!

ఒక రచన చదివితే అందులోని కథ తో పాటు అప్పటి పరిస్థితులు 
సామాజిక న్యాయాలు అన్నీ మన ముందుకు వచ్చేస్తాయి. 

సమయానికి కన్యాశుల్కం పుస్తకం ఇంట్లో లేదు. 
పోనీ ఆయనను మరియు  అలాటి సంస్కరణ వాదులను గుర్తుచేసుకొని 
నమస్కరించుకుంటూ కొన్ని పాత్రలు పాఠకురాలిగా 
గుర్తుచేసుకుంటాను.కొన్ని స్త్రీ పాత్రలు గుర్తుచేసుకుందాము.  

అగ్నిహోత్రావధానులు లాంటి కోపాగ్నులకు ముడి పడి 
వాళ్ళ మాటనే అనుసరిస్తూ ,వివేకం తప్పు అని చెప్పినపుడు 
వారిని ఎదిరించి భంగపడుతూ బ్రతకలేక వారితో ఉండలేక 
బావికో ,ఉరితాడుకో ప్రాణం అప్పచెప్పి కుటుంభం పరువు 
కాపాడి పోయే ఇల్లాళ్ల పాత్రలు ఇప్పటికీ మారలేదు.ఆడదాని 
మాటకు విలువేమిటి! తాంబూలాలు ఇచ్చేసాము తన్నుకుని 
చావండి అని మగవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతూనే 
ఉన్నారు. 

ఇక బుచ్చమ్మ. చిన్న వయసులో పెళ్లి చేస్తే భర్త చనిపోయిన 
విధవరాలు. తండ్రి పెత్తనానికి భర్త నుండి సంక్రమించిన ఆస్తి 
అప్ప చెప్పి తండ్రి ఇంటిలోనే ఇంటెడు చాకిరీ చేస్తూ గడుపుతూ ఉంటుంది. 
కోరికలు ఏమీ లేకుండా మిగిలిన వాళ్ళ సుఖమే తన సుఖం గా 
భావిస్తూ పనియంత్రంగా మారిపోతుంది. 
మనిషి ఎంత యంత్రంగా మారినా కొన్ని స్పందనలు ఉంటాయి. 
చెల్లికి ముసలివాడి ని ఇచ్చి పెళ్లి చేయబోయే సందర్భం లో 
తండ్రికే ఎదురు మాట్లాడుతుంది. నా సొమ్ము ఇచ్చి తమ్ముడికి 
పెళ్లి చేయమని,చెల్లిని వదిలెయ్యమని కోరుతుంది. 
కానీ తండ్రి ఆధారంగా బ్రతుకు ఈడ్చవలసిన స్త్రీ ఎంతవరకు 
పోరాడగలదు. చివరికి గిరీశం మాష్టారు గారి సహాయం కోసం 
తాను ఏమైనా సహాయం చేస్తాను అంటుంది. 
అప్పటి సమాజం లో నూటికి తొంబై మంది విధవల జీవితాలు 
ఇలాగే సాగాయేమో!

పూటకూళ్ళమ్మ. తాను కూడా విధవరాలు. ఎవరూ అండగా లేక 
స్వశక్తితో అందరికీ వండిపెడుతూ ఆధారం కోసం గిరీశం ను 
సమాజం భాషలో ఉంచుకుంటుంది. తన కష్టార్జితం మొత్తం 
ఖర్చు పెట్టేస్తున్నా ,అబద్దాలు చెప్పి జల్సా చేస్తున్నా గిరీశాన్ని 
వదలలేక అలాగే గడుపుకొని వస్తూ ఉంటుంది. చివరికి తన 
డబ్బుతో సానిసాంగత్యం కూడా గిరీశం మొదలు పెట్టేసరికి 
ఏ ఆధారము అక్కర్లేదని చీపురు తిరగేస్తుంది. సొమ్ము అవసరం 
కోసం ఉన్న బంధాలు ఎంతవరకు నిలుస్తాయి. 
డామిట్ కథ అడ్డం తిరిగింది అనుకోని గిరీశం లాంటి 
మనుషులు పారిపోతారు తమని నమ్మే ఇంకో చోటు వెతుక్కుంటూ!
ఇక ఇప్పుడు పూటకూళ్ళమ్మ కి ఒంటరి బ్రతుకే అయినా 
తన శక్తి మీద తానూ జీవిస్తూ గౌరవంగా ఉంటుంది. 

మీనాక్షిది వేరే కథ.కోరికలకు లొంగిపోయి కొంచెం సొమ్ము 
ఆశ చూపితే తండ్రికి అయినా అబద్దాలు చెప్పగలదు. 
కోరిక ఉండాలి కానీ లొంగదీసుకొనే మహానుభావులకు 
ఎప్పటికీ కొరత లేదు. కానీ పీకల మీదకు వస్తే ఆడదాన్ని ఒంటరిగా 
వదిలి అందరు పరువు ముసుగు లో పారిపోయేవారే!

అప్పటి విధవల స్థితి ఇంతే. అయితే బుచ్చమ్మ లాగా తండ్రి 
చాటునో అన్న చాటునో బ్రతుకు వెళ్లదీయడం లేదా పూటకూళ్ళమ్మ 
లాగా ఒకరిని నమ్ముకొని ఉండటం లేదా మీనాక్షి లాగా హీనంగా 
మారిపోవడం. ఇంతకంటే ఇప్పుడు స్త్రీలు మాత్రం ఎక్కడ 
ముందుకు వెళ్లారు? చదువు కుంటున్నారు. చదువుకు తగ్గ 
సంస్కారం ధైర్యం వివేకం ఎక్కడ చూపిస్తున్నారు?
సమాజ నిర్మాణం లో యెంత మంది నిలబడుతున్నారు?

స్త్రీ ఎలా ఉండాలి అనేది కూడా తన కలగా మధురవాణి పాత్రలో 
చూపిస్తారు గురజాడ. 
స్త్రీ అయినా హాయిగా నవ్వాలి అప్పుడే తాను ఒక మనిషి. 
ఆడపిల్ల నవ్వకూడదు అనే సమాజం లో ఎంత హాయిగా 
నవ్వుతుంది మధురవాణి!తన స్వేచ్ఛ అందులో ప్రజ్వరిల్లేటట్లు 
మగవాళ్ల పరువులు కొట్టుకొనిపోయేట్లు ,ఏమిటా నవ్వు అని 
అసహనపు గొంతులతో అడిగేటట్లు,ఎనరూ తనను ఏమీ 
చెయ్యలేరు అనేటట్లు,సానిది అని యెగతాళి చేసే లోకానికి 
నువ్వు అంటే నాకు ఏమీ లెక్క లేదు అని బదులు చెప్పినట్లు 
పకపకా నవ్వుతుంది మధురవాణి. 
మధురవాణి చదువు గురించి చెప్పరు కానీ సంస్కారం గురించి 
తెలివి గురించి ఆయా పాత్రలతో మాట్లాడే విధానం లో వినయం 
గురించి చెప్పకనే చెప్పారు గురజాడ స్త్రీ తన వ్యక్తిత్వాన్ని 
నిర్మించుకోవాల్సిన విధానం ఏమిటో!

మధురవాణి చేత గిరీశం తో ఒక మాట పలికిస్తారు గురజాడ 
'' మీరు నాలాగే తెలివిగల వారే కాని చేదు మార్గం లో 
వాడుతున్నారు దానిని''అని. 
మోసం చేసే వాళ్ళను మోసం చేయగలదు ,మంచి వారికి 
సహాయం చేయగలదు. ఎవరికి నూనె వ్రాసి దువ్వాలో,హెడ్ 
తో ఎలా మాట్లాడాలో, ఊరిలో పలుకుబడి ఎలా పెంచుకోవాలో 
అన్నీ తెలుసు మధురవాణి కి. నాటకం లో అబద్దాలు 
చెప్పినా, మోసం చేసినట్లు చూపినా,వలపు నటించినా 
ఒక చిన్నపిల్ల బాగుకోసమే తనకు చేతనైన సహాయం 
చేస్తుంది. 
ఆంటినాచ్ గా ఉన్న గౌరవనీయులు సౌజన్యారావు పంతులు 
చేత గౌరవింపబడే ఈ పాత్ర ఎంతో గొప్ప గా ఊహించి 
సృజించారు గురజాడ వారు. 
ఆయన వేసిన జాడలు ఇప్పటికీ మనకు అనుసరణీయం. 

                      @@@@@@