Friday, 28 September 2012

అనుభూతులు అన్నీ అక్షరీకరించ గలమా?చల్లగా నిమురుతూ ఉన  గాలి ...తొలి కిరణాలు వెచ్చగా  
విచ్చుకుంటూ పువ్వులా ఆకాశం ..ఇదే కదా సమయం 
స్వామికి పూవులు కోయ్యటానికి...మెల్లగా వచ్చి నిలుచున్నాను 
చెట్టు కింద...కాళ్ళకు మెత్తగా గమ్మత్తుగా పలకరిస్తున్న 
భూమాత స్పర్శ.....బద్దకంగా కళ్ళు విప్పుతూ కూడా 
పూజకు అనగానే బుట్టలో బుద్దిగా చేరుతున్న సుమాలు 
స్వామిని చేరాలి అని వాటికి కూడా తొందరే సుమా...

ఉన్నట్లుంది బుజం పై జిల్లుమని వళ్ళంతా పాకుతూన్న 
కంపనాలు..యేమని చెప్పాలి...చూస్తె ఒక చక్కని పారిజాతం 
బుజ్హం పై వాలి తన ముఖం పై వాలిన మంచు ముత్యాన్ని 
మోసుకోస్తూ....చల్లదనాన్ని పంచుకోమని నాకు కొంచెం ఇచ్చింది.
మెల్లిగా పూవుని అరిచేతిలోకి తీసుకున్నాను.అరె ఇది స్వామికి 
తప్పు  వద్దు  అని బుద్ది హెచ్చరించేలోపలె ...ముక్కు పరిమళాన్ని 
పులుముకుంది.తెల్లని పూరేకుల స్వచ్చతను హృదయం హత్తుకుంది.

తెల్లని రెక్కలు చిన్నగా విప్పార్చిఎర్రటి బుజ్జి కాడలతో 
 నన్ను చూసి మెల్లిగా నవ్వుతూ ........................
ఏదో తెలియని ఆనందం వివశ ను  చేస్తుంటే తటాలున పొంగిన 
ఆవేశం పెదాల పైకి దొర్లి పూరెక్కలపై పెదాల ముద్ర గా 
మారిపోయింది.

''అయ్యో యెంత పని చేసాను పూజకు ఈ పూవు పనికి రాదు 
స్వామీ యెంత ఘోరం దీనిని వృధాగా నేలపై రాల్చ వలసినదేనా ?
మట్టి  రేణువులు అంటినా పనికి వచ్చే పారిజాత సుమం 
నేడు నా పెదాలను తాకి మలినం అయిపోయిందే?

బాధ మనసుని మెలి పెడుతుంటే పువ్వును అరి చేతిలో 
తీసుకొని వెళ్లి స్వామీ పాదాల ముందు మోకరిల్లాను.
అరచేతిలోని పువ్వు స్వామికి చూపిస్తూ 
''తండ్రి కరుణా సముద్రుడివే 
శబరి  భక్తికి మెచ్చి ఎంగిలి పండ్లను తిన్నావే 
తిన్నని భక్తీ కి మెచ్చితను  పెట్టినవి తిన్నావే?
ఈ పూవుపై నా పెదవి సోకెనని వెలి వేసేదవా?
నేను చేసిన తప్పు కు దీనికి యెంత శిక్ష ?
రక్షించవా ప్రభూ ....బాధ కళ్ళ నుండి ఉబికి 
బుగ్గల పై జాలు వారుతూ ....చేతిలోని పూవుని 
అభిషేకించింది.

చల్లని నవ్వుల రేడు కరుణతో చూస్తున్నాడు.
భావాలు తెలియాలంటే మాటలు కావాలా?
తరంగాలుగా వ్యాపించే శక్తి నా ఆత్మను ఓదారుస్తూ 
స్వామీ ప్రేమను పులుముతుంది.....గాయపడిన 
గుండెకు ఔషదం లాగా....
''పుష్పం, ఫలం,పత్రం,జలం,తోయం 
భక్తితో ఇచ్చినవి నేను ఎప్పుడు కాదు అన్నాను?
కుండలు చేసే కుమ్మరి వేళ్ళకు అంటిన మట్టిని 
కూడా సుమాలుగా స్వీకరించలేదా?
నీనుండి పెల్లుబికి పెదాలపై వాలిన ప్రేమ నేను కాదా?
మలినాలు మీ మనసులకే ,ఆత్మకు కాదు 
నువ్వు ఆత్మా నేను పరమాత్మా...రెండు కలిస్తేనే 
ఆ ఆనంద పరవశం ...తియ్యగా నవ్వుతున్న 
స్వామీ పాదాలపై రివ్వున యెగిరి చేతిలో నుండి సుమం 
వాలి పోయింది....ఎక్కడ ఉండాలో తెలిసినట్లు.

ఆత్మ వాలిపోయింది పరమాత్మ కౌగిలిలో....
ఎంతటి ఆనందం ....ఉబికి ఉబికి వస్తూ  
నిముషం నిలవనీయకుండా.....మెల్లిగా సమాధి లోకి 
జారిపోతూ ...ఎలాగా ఈ అనుభూతిని అక్షరీకరించటం .....

అన్ని అనుభూతులు అక్షరీకరించగలమా?

Thursday, 27 September 2012

''వేర్ ఇస్ బ్యూటిఫుల్ ''

''మద్యాహనం రెండు గంటలకు తిరిగి వచ్చేస్తావు కదా?''
దీనంగా ఈయన.ఇది మరీ ఎక్స్ట్రా ఇప్పుడే కదా పోతున్నాను.
మామూలుగానే ఎదురు చెప్పను.ఇప్పుడు ఇంకా బుద్దిగా తల ఊపాను.
మరి ఇప్పుడు వెళ్ళేది కోటకు అంటే అమ్మగారింటికి.
ఎలాగు అమ్మగారింటికి వెళితే మా వాచ్ లు పని చెయ్యవు 
మొబైల్స్ ఆగిపోతాయి ...అని వాళ్లకు ఎలాగు తెలుసు.
బుద్దిగా తల ఊపితే సరిపోతుంది.

బస్ స్టాండ్ లోకి రాగానే బస్ ఉంది.హమ్మయ్య ఎక్కి వెంటనే టికట్ 
తీసుకున్నాను.ఎందుకంటె హైవే మీద నుండి కోట దారి లోకి 
బస్  వెళ్ళ గానే మరిచి పోతాను....ఎందుకంటె మైమరిచిపోతాను 
కాబట్టి....స్వర్ణముఖి పక్కనే రోడ్డు.రోడ్డు మలుపు తిరిగినప్పుడల్లా 
నది పలకరిస్తూ కొండొక చోట పక్కనే నడుస్తూ అలరిస్తూ...
ఈ వైపు ఎప్పుడూ పచ్చని తివాచీ లాగా మూడు పంటలు...
చెరుకు తోటల్లో తలలు ఊపే తెల్లటి చీపురు పుల్లల గుత్తులు,
మాగాణి పై వాలి  ఉండి ఉండి  గాలి పటాల్లా పై కి ఎగిరే 
తెల్లని కొంగలు,గిజిగాడి గూళ్ళు ,చిన్న పిట్టలు,ఎగిరే తుమ్మెదలు,
నిమిరె  గాలి, దూరంగా గూడలి కొండ ..అలా...అలా..అలా...

ఈ రోజు వాతావరణం చాలా బాగుంది.
నదిని పలకరించాను కాని ఏముంది అక్కడ బోసి 
పోయిన ఇసుక దారి తప్ప.అంతే  ఇటు వైపు తిప్పెసాను తల.
పచ్చని గరికను కళ్ళతో నిమురుతూ ..అరె మధ్యలో 
పసుపు పచ్చగా ..ఏమిటి ఇవి? బంతి పూలు,ఇవి కూడా 
వేస్తున్నారా?కళ్ళలో నింపుకున్నాను.రంగులే రంగులు 
పుడమి తల్లి పూసుకున్నట్లు ,విధాత కుంచె నుండి జాలు వారిన 
వన్నెల చీర కట్టిన వర్ణ చిత్రం.రంగులు నింపుకున్న మనసుతో 
రెండో వైపు చూసాను...చిత్రం గల గలల చీర కట్టి సాగరునికై 
పరుగులు తీస్తూ ఆకాశపు అద్దం  లో చూసుకుంటున్న నదీకన్య ...
కళ్ళకు ఇందాక  కనపడనది....మనసుకి ఎలా కనపడింది.
కళ్ళతో మనసు కలిస్తే అంతేనేమో.''లైఫ్ ఈజ్ కలర్ఫుల్''

పెద్ద బాబాయి వాళ్ళ మనుమడిది అన్నప్రాసన.వెళ్లాను.
పలకరింపులు,నవ్వులు,సంతోషాలు ,వరసలు,
పిలుపులు....తడిసి ముద్ద అయ్యాను.ఇప్పటి పిల్లలు 
పొట్టతో పాకడం తక్కువ.ఒకే సారి మోకాళ్ళపై దోగాడుతున్నారు.
కాని వాడు చక్కగా పాకి వాడి జీవితం లోని 
మొదటి సాహస కృత్యం ....వాళ్ళ జేజినాయన చేయించిన 
బంగారు గ్లాస్స్ తాకేసాడు.అంతటా ఒక్కసారి విరిసిన 
నవ్వుల హరివిల్లు ''లైఫ్ ఈజ్ హార్ట్ ఫుల్ ''

''వదినా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మన హాల్ లోనే ''
అరె చూడాలి కాని తోడు?పాపం ''వేలమ్మాల్ ఇంటర్నేషనల్ 
స్కూల్'' చెన్నై నుండి వచ్చిన  ఎనిమిదో తరగతి మేనల్లుడు 
బలి.....నేను ,మా అక్క,మా చిన్న పిన్ని వెళ్ళాము 
వాడిని తీసుకొని.
కొంచెం ఊహించుకున్నాను.
శేఖర్.కమ్ముల సినిమా కాబట్టి.
సింపుల్ గా చెప్పాలి అంటే 
''సాండ్ విచ్''అంటే పై ముక్కలో 
కింద ముక్కలో అమ్మ సెంటిమెంట్ తో 
నిండిన బ్రెడ్స్,మధ్యలో ముగ్గురు 
మూడు రకాల వ్యక్తుల ప్రేమతో 
కలిసిన సలాడ్....అంతే .

అమల ఇంజనీరింగ్ చదువుతున్న పెద్ద కొడుకుని,
సీనియర్ ఇంటర్ చదువుతున్న కూతురుని 
ఒకటో క్లాస్స్ చదివే చిన్న కూతుర్ని తనకు 
క్యాన్సర్ వచ్చిన సంగతి చెప్పకుండా ఒక సంవత్చరం 
హైదరాబాద్ లో ''సన్ షైన్''కాలనీ లో ఉన్న వాళ్ళ 
అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తుంది.ఇక వాళ్ళు 
అక్కడ చిన్న కాలనీ లో ఉంటారు.ఇక హ్యాప్పీ డిస్ లో లాగా 
పక్కన గోల్డ్ ఫేజ్ లో ఉన్న గొప్ప వాళ్ళతో క్రికెట్,బేట్స్,గొడవలు,
తగాదాలు,ప్రేమలు ....కుర్ర పిల్లల చేష్టలు అనీ మామూలే.


మిక్కీ మేయర్ సంగీతం కొన్ని సార్లు అలరించిన కధా  బలం 
లేక మనకు విసుగు వచ్చేస్తుంది.చివరికి అమల కూతురు ,కొడుకు 
ప్రేమ గొడవల్లో చదువు సంగతి మర్చిపోతారు.అప్పుడు అమ్మకు 
క్యాన్సేర్ అని తెలిసి అమ్మ కు ఇచ్చిన మాట కోసం బాగా 
చదువుతారు.అందరు స్తిరపడుతారు.ఇక్కడ అమల ఆక్షన్ కి 
మా ముగ్గురి  కర్చీఫ్ లు తడిసిపోయ్యాయి.నయం 
శేఖర్.కమ్ము అమలని బ్రతికించాడు ....
లేకుంటే ఇంటికి వచ్చే దాకా ముక్కు 
చీదుతూ ఉండేవాళ్ళం.

శ్రియా,అంజన జవేరి తామింకా బ్యూటిఫుల్ అని నిరూపించారు.
ముఖ్యంగా అంజనా జవేరిని వానలో తడుపుతూ చూపినా 
ఒక చక్కని మనసు తాకే అందం,ఒక పూవు వానలో తడిసి 
ఊగుతున్నట్లు ....అవును అందం మనసుని పులకింప చెయ్యాలి 
కాని మనిషిని పశువుని చెయ్యకూడదు.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఏమిటో అర్ధం కాలేదు.శేఖర్.కమ్ముల 
తీయక పోయిన బాగుండేది.బయటకు రాగానే చెంబుడు 
కాపీ ఇస్తే తాగేద్దాము అనిపించింది నాకు.
బయటకు రాగానే మా పిన్ని అదిగో సాయి బాబా గుడి కొత్తది 
కట్టి  ఉన్నారు చూద్దాము రండి అని ఎదురుగా గుడి లోకి 
తీసుకుపోయింది.బాబాకి నమస్కరించి కూర్చున్నాను.
అప్పుడు గుర్తుకు వచ్చింది.పోయిన డిసంబర్  లో నాకు 
బాగ లేక హాస్పిటల్ లో ఉన్నప్పుడు మా అమ్మ ఈ గుడికి 
ఇస్తామని మా చేత మొక్కించింది.ఇంకా గుడి కట్టలేదు అని 
మేము మర్చిపోయ్యాము.దేముడు గుర్తు చెయ్యటానికే పిలిచాడా?

మీరు ఒక్క సారి మామూలు  రోజుల్లో గుడికి వెళ్ళండి.
యే ఆర్భాటాలు వద్దు,అలంకరణలు వద్దు.
ఆయన ఇచ్చినవి ఆయనకు మళ్ళీ ఇవ్వటం ఎందుకు?
ఏమి వద్దు.
మీ అహాలు పక్కన పెట్టండి.మొబైల్ పక్కన పెట్టండి.
టెన్షన్లు చెప్పుల దగ్గరే వదిలెయ్యండి.మెల్లిగా వంగి పాదాలు 
పట్టుకోండి బాబావి..... కూర్చోండి అలా కరుణ జాలు 
వారే కన్నులు చూస్తూ...
ప్రశాంతంగా ....అప్పుడు మీరే అంటారు 

ప్రశాంతంగా మనసు ఉన్నప్పుడు ...నిజమే 
''లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్''అని కాదా చెప్పండి?

Sunday, 23 September 2012

ఇంద్రియాలకు అతీతంగా అనుభవాలు పొందవచ్చా?


ఇంద్రియాలకు అతీతంగా అనుభవాలు పొందవచ్చా?

నిజంగా ఎవరైనా పొంది ఉన్నారా?
కొన్ని సార్లు మన సిక్స్త్ సెన్స్ హెచ్చరించటం 
మన అనుభవం లో ఉండే ఉంటుంది.
అలా ఎవరికైనా అనుభవం ఉన్నదా?
కాని మన లోకి మనం ప్రయాణించి  నపుడు ఇది 
విచిత్రం కాదు.

ధ్యానం మన లోకి మనం ప్రయాణం చేసేందుకు 
ఉపయోగపడుతుంది.అది మనం రోజు చూసే 
ప్రపంచాన్ని వేరే కోణం లో చూసి ఆనందంగా 
జీవించటానికి ఉపయోగపడుతుంది.Wednesday, 19 September 2012

సత్యభామ సరదాలు 4(3)

అలక ముత్యం లాంటి మంచు బిందువు ....
 తెల్లని వన్నె గల కాంతి కిరణం లాంటి జీవితం 
దాని లోకి వెళ్లి .....సప్త రంగుల ప్రేమనీ జీవితానికి 
అద్దుకొని వస్తుంది..ఇద్దరినీ దగ్గరగా జరుపుతూ....

భర్త తనను ఆకారణంగా పక్కింటి ఆమె ముందు తిట్టాడు అని 
అలిగి ఉంటుంది సత్య.లింక్ ఇక్కడ

ఈ లోపల జరిగిన వెనుక ఇంటి 
సంగతులు  సత్య మనసు గాయ పరచి ఉంటాయి.అన్నం కూడా 
తినకుండా దిగులుగా  పడుకొని ఉంటె సాయంత్రం  అవుతుంది.
తలుపు తీస్తే ఎదురుగా భర్త.

ముభావంగా లోపలి వెళ్లి  పోతుంది.పీక్కు పోయి ఉన్న 
సత్య మొహం చూస్తె జాలితో మనసు నిండి పోయింది మూర్తికి.
కాని ఎలా ఆ ముభావాన్ని కరిగించాలో అర్ధం కావటం లేదు .
సత్య వెనుకాల వెళితే 'టీ' తెచ్చి టేబుల్ పై ఉంచి బయట వరండాలో 
కూర్చుండి పొయ్యింది.''చా చిన్న తప్పుకు ఇంత శిక్షా ఏమిటి 
పే..ద్ద మాట్లాడక పొతే పోనీ...''విసుక్కొని పనిలో మునిగి పొయ్యాడు.
దీపాలు వెలిగి అన్నం వేళ ..అయినా ఇల్లంతా మూగగానే ఉంది.
హృదయ రాగాల సంమేలంతం తో కళ కళ లాడే ఇల్లు...శ్మశాన వైరాగ్యం.
ఎవరిది తప్పు?ఎవరిది ఒప్పు?వెలగపండు పండితే తియ్యటి వాసన ....
కాని నిజానికి అది పుల్లగానే ఉంటుంది.మనం కలిపే బెల్లమే దానికి 
తీయని రుచి ఇచ్చేది.దాంపత్యము అంతే...ప్రేమ కలిస్తేనే అది తియ్యగా 
ఉండేది.

అన్నాలు ఏదో మొక్కుబడిగా అయ్యాయి.ఇంటిలోని మౌనం ఇద్దరి మద్య గోడగా 
సత్య కనిసం ఉదయం నుండి ఉన్న బాధలోమూర్తి  గూర్చి 
ఆలోచించటం లేదు .మౌనంగా ఉండి  పోయింది అంతే .
అలాగే హాల్ లో నేల మీద వాలి పొయ్యి..కను రెప్పలు మూతలు 
పడి  పొయ్యాయి....కలువ పూలు మెల్లగా ముడుచుకున్నట్లు.
యెంత సేపు గడిచిందో .....వీపుకి గుచ్చుకున్న వెచ్చని గాలి...
ఉలిక్కి పడి  లేచింది.పక్కన భర్త.''లేదు  ..లేదు  నేను వెళ్లి పోతాను''
భయపడి చెప్పాడు.గమ్ముగా తల దించుకునింది .భావాలు కూడా 
అర్ధం కాకుండా.
''సత్యా''ఆర్ద్రంగా పిలిచాడు.''ఇలా ఉండ వద్దురా  ...నువ్వు ఇలా ఉంటె ఏమి 
బాగా లేదు    నీకెలా కావాలో అలా ఉండు...
నీ కాళ్ళు పటుకోమన్న పట్టుకుంటాను.నిజం.
అలాగైనా చేస్తాను కాని నువ్వు ఇలా ఉంటె నా గుండె ఎవరో కోసేసినట్లు ఉంది.
భరించలేక పోతున్నాను''భావాలలోని ప్రేమ తడి కన్నుల్లో ఊరుతుంది.
వింటూ ఉంది తల వంచు కొని ..కాని మొహం లో కసి లేదు ,కోపం లేదు.
ఏదో వైరాగ్యం.

'సత్య నిన్న రాత్రి కూడా ఇక్కడే కూర్చున్నాను నిన్ను లేపకుండా 
రాత్రంతా దిగులుగా చూస్తూనే ఉన్నాను.ఎప్పుడూ ఇంత శిక్ష వేయకు .
నేను ఇంతలా ఎవరిని నా జీవితం లో బాధ పెట్టింది లేదు .
ఇలాగా బాధ పడింది లేదు.నువ్వు మాట్లాడక పొతే చచ్చి పోవాలనిపిస్తుంది.
ఈ రోజు ఆఫీస్ లో ఇన్స్పెక్షన్ లో కూడా అన్ని తప్పులే.
కొంచెం  ఉంటె ఉద్యోగం ఊడిపోను.
ఫ్రెండ్స్ సహాయం చేసారు లేకుంటే ఏమి అయ్యేదో .
నా జీవన రాగానికి శృతి నీవే...నీవు లేకుంటే ..నీ ప్రేమ ఊపిరి తగలకుంటే 
అన్ని అపశ్రుతులే...నా జీవన వేణువు మూగ పోతుంది.
నేను ఇంక జీవచ్చవాన్నే నువ్వు లేకుంటే "వడి లో తల ఉంచి 
భోరుమన్నాడు.అంత బింకం ఏమయ్యిందో...
మగ వాళ్ళు చిన్న పిల్లలే....ఏకాంతం లో.

యే మాట ప్రేమ తంతువుని మీటిందోద సత్య మౌనం విడిచింది.
చిన్నగా విడివడిన రోజా రెక్కలు....పరిమళాన్ని పలికినట్లు...
''అవును అన్నీ మీరే చెపుతారు...కాని మేమంటే మనిషిని అనే స్పృహ 
మాత్రం ఉండదు.
మా మనసుకు యెంత గాయం అవుతుందో అర్ధం కాదు.
నిన్నంతా నేను యెంత విల విల లాడుంటాను.
ఆమె గూర్చి మీకేమి తెలుసు?నన్ను రోజు అలాగే నీళ్ళు రాకుండా 
ఎడిపిస్తుంటుంది.ఆ బాధ ఆమెకి తెలియాలి అని  అలాగా చేసాను.
మీరేమో తప్పు చేసిన వాళ్ళను వదిలేసి నన్ను తిట్టారు.
ఏమి తిట్టినా పడి ఉంటామా?..మాకేమి రోషం లేదా?మనుషులం కామా?
అగ్నిపర్వతం ఎగసి పడినట్లు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు.

''అది కాదు ''వివరించాపొయాడు  చేతులు పట్టుకొని...
''ఏది కాదు..మీరంతే ...మొగ వాళ్ళు అంతా రాక్షసులు.మీకు మమ్మల్ని 
ఎలా చూసుకోవాలో తెలీదు.తాగి వస్తారు ...తిరిగి వస్తారు..తంతారు,నిందలు 
వేస్తారు.మేము మొగుడు కాబట్టి ఓర్చుకోవాలి''కోపం తో 
మూర్తి నీ దూరంగా తోసి వేయ పోయింది .చటుక్కున చేతులు 
పట్టుకొన్నాడు.గింజుకుంటూ  ఉంది.
''నేను చెప్పేది విను.నాకు తెలీదా  నీ సంస్కారం 
కాని ఆమె ను  తిడితే బాగుంటుందా?
నువ్వంటే నా దానివి"ప్రేమగా గుండెల పై తల ఉంచుకున్నాడు.
''అచ్చంగా నాదనివే..నిన్ను అంటే నన్ను అనుకున్నట్లే.అయినా 
ఈ సారి గొడవ జరిగితే అక్కడ ఉండకుండా పారిపోతాను ప్రామిస్''
సత్య తల పై చేయి ఉంచాడు.ప్రేమ స్పర్శ ,పాపటి లో తగులుతున్న 
వేడి ఒపిరి,చెవులకు వినపడుతున్న గుండెలోని లయ ...విరహాన్ని 
రేపుతూ...సత్య మెత్తబడి పోతూ ఉంది.అయినా బింకం పోవటం  లేదు .

''అవును తప్పులన్నీ బాగా చేస్తారు.దరిద్రపు అలవాట్లు అనీ చేసుకొని...
పేరుకి మాత్రం ధర్మేచ ..అర్దేచ...కామేచా..మొక్షేచ...అని అగ్ని ముందు 
ప్రమాణాలు"తగ్గనంటున్న  వ్యక్తిత్వం ,అల్లుకోమంటున్న తాపం...
మనిషి నలిగి పోతుంది.

''నేను కాదు కదా అలా  చేసింది.అయినా అవి వాళ్ళ కుటుంభ విషయాలు 
సమస్యలు ఎదుర్కుంటున్న వాళ్లకి అవి ఎలా తీర్చుకోవాలో తెలుసు.
అందుకే మిమ్మల్ని క్షమయా ధరిత్రి అనేది.ఒక కుటుంభం వీదిలోకి 
రాకుండా గౌరవంగా ఉంది అంటే అది మీ వల్లనే...సహాయం కావాలి 
అనుకున్న రోజు అందరం మీ వెంట ఉంటాము''జీ హుజూర్''అని 
మీరు మహా రాణుల్లాగా ఆజ్ఞాపించాటమే తరువాయి''
అతనన్న పద్దతితకి పక పక నవ్వేసింది.

''ఆహా ముత్యాలు,పగడాలు,వజ్రాలు''కళ్ళతోఏరాడు.
అర్ధం కాక చూసింది.వంటిపై పాకుతున్న వేళ్ళ స్పర్శ అర్ధం 
చెపుతున్నట్లు,మళ్ళా  పకపకలు...
మూగ అయిన ఇంటి గోడలు ప్రేమ రాగాలకు శ్రుతి 
పలుకుతూ...

''ఇంకేమి వద్దు..ఇంకేమి వద్దు నువ్వే చాలు నీ ప్రేమ చాలు''
చిత్రం రెండు హృదయాలదీ ఇదే మాట ......
దాంపత్య మధురిమ ....మనస్సులో చిరు మువ్వ సవ్వడి.

Friday, 7 September 2012

ఆకాషిక్ రికార్డ్స్ తెలుసా?

ముందు ''విహంగ''సెప్టెంబర్ సంచికలో నా కవిత 
''చర్విత చరణం'' చదవండి......తరువాత చెపుతాను.

కవిత లింక్ ఇక్కడ


ఈ రోజు సాక్షి ఫ్యామిలీ లో కింది ఆర్టికల్ చదువుతుంటే 
మనసంతా చెప్పలేని బాధ ..ఎందుకో తెలీదు.
ఎందుకు ఆనందం గా పక్క వాళ్ళతో కలిసి తృప్తిగా 
జీవించగల జీవితాన్ని నరకం చేసుకుంటున్నాము నిజంగా....

సరే..సరే...అకాషిక్ రికార్డ్స్ అంటే నేను చదివిన దాని ప్రకారం 
మన ఆత్మ లోపలికి  ప్రయాణం అయ్యి దానితో ఉంటె 
బూత,వర్తమాన,భవిష్యత్ కాలాలలో జరిగేవి తెలుసుకోవచ్చు.
నిజమా అంటే.....ఇప్పుడు చూడండి.మీకు తెలుసు కదా 
ఒక నక్షత్రం ను మనం చూస్తున్నాము అంటే అది దాని కాంతి 
ప్రయాణించి మన కన్నుని తాకితేనే కదా.మరి అది ప్రయాణించటానికి 
పట్టిన కాలానికి ముందు ఉండే దాని బొమ్మని మనం చూస్తున్నాము 
అన్న మాట.అంటే ఆ నక్షత్రం అక్కడ ఇప్పుడు లేక పోవచ్చు కూడా.

అదే కాంతి ఇంకా ప్రయాణించి వేరొకరు దానిని చూసారు అనుకోండి .
అపుడు వాళ్ళు మనం అప్పుడెప్పుడో బూత కాలం లో చూసిన దానిని 
చూస్తున్నట్లు.ఇలాగా తరంగాల రూపం లోకాంతే  కాదు ,మన 
ఆలోచనలు కూడా ప్రయాణిస్తాయి.నిజమా మేము నమ్మము అన్నారు 
అనుకోండి,నేను ఏమి చెపుతాను అంటే.....ఒకటి మీరు నమ్మాలి అంటే 
మీ ఆలోచనా తరంగాలు పట్టుకొనే యాంటినా లాంటి వాళ్ళు చెపితే 
మీరు నమ్ముతారు లేదా మీ ఆలోచనలు పట్టుకోగల యంత్రాన్ని 
కనిపెట్టినపుడు మీరు నమ్ముతారు.

అంటే మీరు నమ్మినా నమ్మక పోయినా చాలా విషయాలు 
జరుగుతూ ఉంటాయి.వాటిలో ఆలోచనా తరంగాలు వ్యాపించటం ఒకటి.
మనం మంచి ఆలోచన చేస్తే అది విశ్వ వ్యాపితం అవుతుంది.
అందరికి సంతోషం చేకూరుతుంది.
మరి దుఖపు ఆలోచన...అంటే నెగటివ్  ఎనెర్జీ ఏమవుతుంది?
చూడండి  ఖదీర్ బాబు గారు ఏమి వ్రాసారో....

మంచి ఆలోచనలు మనకే కాక విశ్వానికి కూడా మేలు చేస్తాయి.
Tuesday, 4 September 2012

సత్యభామ సరదాలు 4(2)

సత్యభామ సరదాలు 4(2) ...రెండో భాగం 
జరిగిన కధ:సత్య మీద చిన్న విషయానికి మూర్తి 
కోప పడ్డాడు అని, సత్య మాట్లాడకుండా అలుగుతుంది.
అతను ఆఫీస్ కి వెళ్ళిన తరువాత వెనుక ఇంట్లో గొడవ 
జరుగుతూ ఉంటె చూస్తూ ఉంటుంది.ఈ లోపల కాలింగ్ బెల్ మోగితే
 తెరవటానికి వెళుతుంది.

తలుపు తీసి చూసిందిఎవరై ఉంటారా ఈ టైం లో అనుకుంటూ...
ఎదురుగా వెంకటమ్మ ,సత్య పని మనిషి.మొహం దిగులుగా వాడి పోయి ఉంది.
''ఏమి ఉదయం రాలేదు?''అడిగింది సత్య కోపంగా.
''ఏమి చేసేదమ్మా ,మా ఇంటాయానికి బాగాలేదు .ఆస్పత్రికి 
వెళ్లి సూపిచ్చుకొని వస్తుండా?''కదిలిస్తే కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి.

అంతా బాగానే ఉంది కాని నీకు ఇంటాయన ఎక్కడి నుండి వచ్చాడు?
ఆసక్తిగా అడిగింది సత్య.
వెంకటమ్మ పదిహేను ఏళ్ళ ప్పుడే ఒకరి తో 
వెళ్లి పోయింది.వాళ్ళ బాషలో లేచి పోయింది.
మోజు తీరగానే వాడు వదిలేసాడు.తరువాత ఇంకో పెళ్లి.
వాడు సాయంత్రం అయితే తాగుడు,తన్నుడు.
ఇక లాభం లేదు.బతికుంటే చాలని వాడిని వదిలేసింది.
(నయం వాళ్ళలో  ఈ మాత్రం స్వేచ్చ ఉంది.లేకుంటే అన్నానికి కూడా 
లేక చచ్చి పొయ్యేవాళ్ళు...పరువు ..పరువు అంటూ)

తరువాత ఇంకో పెళ్లి అయితే వాడికి ఎప్పుడూ అనుమానమే.
కూర్చున్నా, లేస్తున్నా ఎవరో ఒకరికి ముడి పెట్టి వీదిలోకి 
లాక్కొచ్చి తన్నటమే.
ఇవన్ని పడ లేక అందర్నీ వదిలేసి హాయిగా అందరిళ్ళలో 
పని చేసుకుంటూ ఒక్కటే ఉంటూ ఉంటుంది.నమ్మకస్తురాలు.
చక్కగా పని చేస్తూ ఉంటుంది అని అందరు అభిమానిస్తారు.
పనిలో పని అందరికి అక్కడివి ఇక్కడికి,ఇక్కడివి అక్కడికి 
కబుర్లు మోసుకేలుతూ  ఉంటుంది.
లేకుంటే ఈ అపార్ట్మెంట్స్ లో ఎవరు ఎవరో కూడా తెలీదు.

''చెప్పవే....ఈ ఇంటాయన  ఎవరు?''అడిగింది.

రెండో వాడె నమ్మా,వంట్లో బాగా లేదు .ఇంత గంజి 
పోసే వాళ్ళు లేక నా దగ్గిరికి  వచ్చేసాడు''
''ఎందుకు రానిచ్చావే?మళ్ళ తాగి తన్నటానికా?
నీ డబ్బులు లాక్కొని నిన్ను పస్తులు ఉంచటానికా?''
అసహ్యంగా మొహం పెట్టి అడిగింది.

''పోనీమ్మ పరాయ్యోల్లకైనా బాగా లేకుంటే సాయం చెయ్యమా...
యెంత తన్నినా మొగుడే కదా...ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి 
తాగి నపుడు తన్నినా తాగనపుడు భలే సూసుకోనేవోడు .
నువ్వు నా లచ్చిందేవి అనేటోడు''ఏమి గుర్తుకు వచ్చిందో 
సిగుపడుతూ నవ్వుకుంటుంది.
పిచ్చి మొహం ది ..మొగుడంట..మొగుడు...ఏమిటి గొప్ప?
మండిపోతూ ఉంది సత్యకి.
''నీ మొహం అందర్నీ నమ్మేస్తావు.వాడికి బాగా దొరికావు 
చాకిరికి...ఇంతకీ జబ్బు ఏమిటి?''
''ఏమోనమ్మా  ఒకటే దగ్గుతున్నాడు,పుల్ల  లాగా అయిపోయి నాడు.
ఆస్పత్రికి వెళితే రక్త పరిక్ష అని రక్తం తీసుకొని రేపు రమ్మన్నారు.
మళ్ళా ఆసుపత్రికి రేపు పోవాలా...నువ్వు ఇబంది పడుతుంటావు అని 
ఇట్తోచ్చినా.''
వివరాలు  విన్న సత్య ఉలిక్కిపడింది.''దగ్గా కొంపతీసి జ్వరం కూడా వస్తుందా?''
''అవునమ్మా,అమ్మ అందుకే ఓ రెండు వందలు ఇయ్యమ్మా
ఈ సారి లెక్క అప్ప చెప్పేస్తా''
దేవుడా భయం తో గుండెల మీద చెయ్యి వేసుకొని ....కొంపతీసి 
క్షయ,ఎయిడ్స్ బాప్రే...తనకు వచ్చిన ఆలోచనకే చిగురాకులా 
భయం తో వణికి పోయింది.

వణుకుతున్న కంటం  తో ''ఒసేయ్ నువ్వు రెండు వందలు 
ఏమి మళ్ళ ఇవ్వక్కర్లేదు కాని వాడికి ఏ రోగమో ఏమో ,
అంటూ వ్యాదేమో వాడు పిలిచినా వేల్లవాకే ...
ప్రాణాలకే ప్రమాదం''పరుగున వెళ్లి మూడు వందలు తెచ్చి 
చేతిలో పెట్టింది.
భయం తో సత్య గుండెలు దడ దడ లాడిపోతున్నాయి. 
వెంకటమ్మ అదేమీ లెక్క చెయ్యటం లేదు 
''పోనీండి  వెదవ ప్రాణాలు.వాడిని అట్టా సూస్తుంటే 
ప్రాణం తరుక్కొని పోతుంది.అందరం ఎప్పుడో ఒకప్పుడు 
సచ్చేవాల్లమే.మొగుడు కదా ..ఎట్ట వదిలేస్తాము''
వెళ్ళిపోయింది.

హతాసురాలై పోయి అలాగే దిగులుగా కూర్చండి పోయింది
సత్య.యేవో ఆలోచనలు....సాయంత్రం  అయినా అన్నం తినలేదని 
కూడా గుర్తుకు రాలేదు.అలాగే పడుకొని గమ్మున ఉండిపోయింది.
ఒక్క సారి పక్కింటి ఆమె నవ్వు గుర్తుకు వచ్చింది.
మళ్ళా మనసు బగ్గుమన్నది.చా...మొగుడు అయితే ఏది 
పడితే అది అనేస్తాడా?నాకు మనసు ఉండదా?నేను మనిషిని 
కాదా?చా అసలు ఇంకా మాట్లాడకూడదు.
మనం మనిషి అని గమనింపు లేని వాళ్ళతో ఏమిటి మాట్లాడటం.
మనసు కలుక్కుమనింది.ఈ లోపల మళ్ళా కాలింగ్ బెల్...
ఆయనే అయి ఉంటారు అనుకుంటూ వెళ్ళింది...
(సశేషం....ఈ సారి తప్పకుండా ఇద్దరినీ కలిపెస్తాను...
మీ మీద ఒట్టు)