Friday, 28 September 2012

అనుభూతులు అన్నీ అక్షరీకరించ గలమా?చల్లగా నిమురుతూ ఉన  గాలి ...తొలి కిరణాలు వెచ్చగా  
విచ్చుకుంటూ పువ్వులా ఆకాశం ..ఇదే కదా సమయం 
స్వామికి పూవులు కోయ్యటానికి...మెల్లగా వచ్చి నిలుచున్నాను 
చెట్టు కింద...కాళ్ళకు మెత్తగా గమ్మత్తుగా పలకరిస్తున్న 
భూమాత స్పర్శ.....బద్దకంగా కళ్ళు విప్పుతూ కూడా 
పూజకు అనగానే బుట్టలో బుద్దిగా చేరుతున్న సుమాలు 
స్వామిని చేరాలి అని వాటికి కూడా తొందరే సుమా...

ఉన్నట్లుంది బుజం పై జిల్లుమని వళ్ళంతా పాకుతూన్న 
కంపనాలు..యేమని చెప్పాలి...చూస్తె ఒక చక్కని పారిజాతం 
బుజ్హం పై వాలి తన ముఖం పై వాలిన మంచు ముత్యాన్ని 
మోసుకోస్తూ....చల్లదనాన్ని పంచుకోమని నాకు కొంచెం ఇచ్చింది.
మెల్లిగా పూవుని అరిచేతిలోకి తీసుకున్నాను.అరె ఇది స్వామికి 
తప్పు  వద్దు  అని బుద్ది హెచ్చరించేలోపలె ...ముక్కు పరిమళాన్ని 
పులుముకుంది.తెల్లని పూరేకుల స్వచ్చతను హృదయం హత్తుకుంది.

తెల్లని రెక్కలు చిన్నగా విప్పార్చిఎర్రటి బుజ్జి కాడలతో 
 నన్ను చూసి మెల్లిగా నవ్వుతూ ........................
ఏదో తెలియని ఆనందం వివశ ను  చేస్తుంటే తటాలున పొంగిన 
ఆవేశం పెదాల పైకి దొర్లి పూరెక్కలపై పెదాల ముద్ర గా 
మారిపోయింది.

''అయ్యో యెంత పని చేసాను పూజకు ఈ పూవు పనికి రాదు 
స్వామీ యెంత ఘోరం దీనిని వృధాగా నేలపై రాల్చ వలసినదేనా ?
మట్టి  రేణువులు అంటినా పనికి వచ్చే పారిజాత సుమం 
నేడు నా పెదాలను తాకి మలినం అయిపోయిందే?

బాధ మనసుని మెలి పెడుతుంటే పువ్వును అరి చేతిలో 
తీసుకొని వెళ్లి స్వామీ పాదాల ముందు మోకరిల్లాను.
అరచేతిలోని పువ్వు స్వామికి చూపిస్తూ 
''తండ్రి కరుణా సముద్రుడివే 
శబరి  భక్తికి మెచ్చి ఎంగిలి పండ్లను తిన్నావే 
తిన్నని భక్తీ కి మెచ్చితను  పెట్టినవి తిన్నావే?
ఈ పూవుపై నా పెదవి సోకెనని వెలి వేసేదవా?
నేను చేసిన తప్పు కు దీనికి యెంత శిక్ష ?
రక్షించవా ప్రభూ ....బాధ కళ్ళ నుండి ఉబికి 
బుగ్గల పై జాలు వారుతూ ....చేతిలోని పూవుని 
అభిషేకించింది.

చల్లని నవ్వుల రేడు కరుణతో చూస్తున్నాడు.
భావాలు తెలియాలంటే మాటలు కావాలా?
తరంగాలుగా వ్యాపించే శక్తి నా ఆత్మను ఓదారుస్తూ 
స్వామీ ప్రేమను పులుముతుంది.....గాయపడిన 
గుండెకు ఔషదం లాగా....
''పుష్పం, ఫలం,పత్రం,జలం,తోయం 
భక్తితో ఇచ్చినవి నేను ఎప్పుడు కాదు అన్నాను?
కుండలు చేసే కుమ్మరి వేళ్ళకు అంటిన మట్టిని 
కూడా సుమాలుగా స్వీకరించలేదా?
నీనుండి పెల్లుబికి పెదాలపై వాలిన ప్రేమ నేను కాదా?
మలినాలు మీ మనసులకే ,ఆత్మకు కాదు 
నువ్వు ఆత్మా నేను పరమాత్మా...రెండు కలిస్తేనే 
ఆ ఆనంద పరవశం ...తియ్యగా నవ్వుతున్న 
స్వామీ పాదాలపై రివ్వున యెగిరి చేతిలో నుండి సుమం 
వాలి పోయింది....ఎక్కడ ఉండాలో తెలిసినట్లు.

ఆత్మ వాలిపోయింది పరమాత్మ కౌగిలిలో....
ఎంతటి ఆనందం ....ఉబికి ఉబికి వస్తూ  
నిముషం నిలవనీయకుండా.....మెల్లిగా సమాధి లోకి 
జారిపోతూ ...ఎలాగా ఈ అనుభూతిని అక్షరీకరించటం .....

అన్ని అనుభూతులు అక్షరీకరించగలమా?

1 comment:

భారతి said...

అద్భుతంగా మీ అనుభూతిని అక్షరీకరించారు. చదివి అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యాను.