Thursday, 30 July 2015

కలాం గారిని తలుచుకుంటూ

మొన్న 27/7/2015 షిల్లాంగ్ ఐ . ఐ . ఎం లో విద్యార్ధులతో 
ప్రసంగిస్తూ ఏ . పి . జె . అబ్దుల్ కలాం గారు కుప్ప కూలిపోయి 
పరమపదించారు అనే విషయం తెలిసి నప్పటి నుండి మనసు 
మనసు లో లేదు . పైకి బాగున్నా మనసులో ఏదో బాధ బరువుగా .... 
కన్నీళ్ళ విలువ ఇలాంటప్పుడే తెలుస్తూ ఉంటుంది . కాని అవి 
కూడా రావడం లేదే !!
ఎంత బాధలో ఉన్నా కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించడం అనేది 
ఉద్యోగులందరికీ అనుభవమే . ప్రిన్స్పాల్ గారితో మాట్లాడి 
ఆయనకు శ్రధ్ధాంజలికి అన్ని ఏర్పాట్లు పూలమాల తెచ్చి సభ 
ఏర్పాటు చేసాము . వారి బాల్యం ,సుభాషితాలు , అవార్డ్లు 
నిరాడంబరత ఇలా ఒక్కొక్కరు మేడమ్స్ ఒక్కో కోణాన్ని పిల్లల 
ముందు ఆవిష్కరించారు . పెద్ద వాళ్ళు వెళ్లి పోయినపుడు 
ఆ స్పూర్తిని విద్యార్ధులకు అందించి మంచి తరాన్ని చేయడం 
మా టీచర్ వృత్తిలో బాగం . 
నా వంతు  వచ్చేసరికి ఏమి చెప్పాలి . మైండ్ కి మనసుకు ఎక్కడో 
సమన్వయము లేదు . ఆయనను దగ్గర నుండి చూసిన 
జ్ఞాపకాలే మనసులో తిరుగుతున్నాయి . ఆయనను చూసిన 
అనుభవమే చెప్పాను . సమైఖ్యాంధ్ర స్ట్రైక్ లో బస్ లు లేకపోయినా 
జిల్లా నుండి ఎనిమిది మంది సెలెక్ట్ కాబడిన విద్యార్ధులను తీసుకొని 
హైదరాబాద్ కి ఆయన సభలో పాల్గొనడానికి వెళ్ళిన సంగతి 
చెప్పాను . గొప్పవారిని చూసే అవకాశం వచ్చినపుడు ఎంత 
కష్టం అయినా ఎదుర్కొని ఎలా వెళ్ళాలో చెప్పాను . ఆయనను 
చూడగానే మనసు ఎంతగా పొంగిపోయిందో చెప్పాను . పిల్లలతో 
ఆయన తన భావాలను ఎంత చక్కగా పంచుకున్నదీ ,ఆయన 
వాళ్ళ పై ఎంత ఆశలు పెట్టుకున్నది చెప్పాను . 
''కల అంటే నిద్రలో వచ్చేది కాదు . మిమ్మల్ని నిద్ర 
పోనీకుండా చేసేది ''...... అబ్దుల్ కలాం . 

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అంటే ఆయన స్ఫూర్తి ని 
విద్యార్ధులకు అందించాలి అని భావించాను . 
అవే ఈ రోజు ఈనాడు నెల్లూరు  స్పెషల్ లో వచ్చిన 
మా ''లీడ్ ఇండియా 2020'' ప్రోగ్రాం ఆర్టికల్ . 
ఇంకోటి ఆంధ్ర జ్యోతి నెల్లూరు స్పెషల్ లో వచ్చిన కవిత . 
చూడండి . 

lead india programme link in eenadu


Thank you Eenaadu and Andhra Jyothi
  రాలిపోయిన ధ్రువ తార      
ఒక్క క్షణం 
భారత దేశం నిశ్చేష్టగా నివ్వెరపోతూ 
ఒక మహామహుని తన వొడి నుండి 
కోల్పోతూ 
ఎన్ని కీర్తి కిరీటాలు తెచ్చాడో 
ఎన్ని విజయాలు పొందాడో 
అన్నీ తనను కన్న దేశమాత కోసమే !
పేపర్ బాయ్ గా మొదలైన ప్రస్థానం 
చదువుకు పేదరికం అడ్డు కాదంది 
ఎన్ ఐ టి లో కన్నస్వదేశీ  కల 
కోట్ల ప్రజల గుండె దీపాలు వెలిగించింది 
కుల మత బేధాలు లేని స్నేహం 
మాయా మర్మం తెలియని పిల్లల మనసు 
చెరగని చిరునవ్వు 
కల లు వెలిగించే స్ఫూర్తి 
నిరంతరం భోధనలోనే తృప్తి 
పద్మ భూషణ్ లు పద్మ విభూషణ్ లు 
41 డాక్టరేట్లు 
విజయ పధాన మెరిసిన ఉపగ్రహ ప్రయోగాలు 
రాష్ట్ర పతి పదవులు 
గౌరవ సన్మానాలు 
ఎన్ని మెట్లు ఎక్కినా 
ఎన్ని బిరుదులూ పొందినా 
అహపు గాలి అంటని అగ్ని అతడు 
తన ''జర్నీ '' అయిపోయిందని తాను కుప్ప కూలినా 
గుండె లోతుల్లో నిలిచిపోయిన గురుతు  అతడు 
ఒక మిస్సైల్ 
ఒక లక్ష్యం 
ఒక కల 
ఒక దేశపు శ్వాస 
ఒక చరిత్ర 
ఒక విజ్ఞాన ఖని 
ఒక యోగి 
ఎన్ని కలలకు స్ఫూర్తి అతడు 
విశ్వానికే వన్నె తెచ్చిన జ్యోతి అతడు ..... 

అబ్దుల్ కలాం గారికి కన్నీళ్ళతో శ్రద్ధాంజలి ఘటిస్తూ ...... 

Monday, 27 July 2015

బాహుబలి గురించి ఇంకొంచెం


ఎలాగు రాజమౌళి బాహుబలి గురించి కొంచెం కొంచెం తీస్తూనే ఉంటాడు .
విజయేంద్ర ప్రసాద్ వ్రాస్తూనే ఉంటాడు . ఇంకా కొంచెం చెప్పేది ఉంటూనే ఉంటుంది .
ఈ తెలుగు రాష్ట్రాలకి ఏమైంది !ఎక్కడికి వెళ్ళినా రెండే ప్రశ్నలు .... 
ఒకటి పుష్కారాలకు వెళ్ళావా ?
రెండోది బాహుబలి చూసావా ?
ఇల్లు స్కూల్ తప్ప ఇంకో విషయం గురించి మాట్లాడుకోను కూడా 
ఇంటరెస్ట్ లేని మా స్టాఫ్ రూం కి కూడా ఇవి బోలెడు ఇష్టం అయిన టాపిక్ 
అయిపోయాయి . దేనికి వెళ్ళ  లేదు అన్నా .... నీ జన్మే వృధా పో అన్నట్లు 
జాలిగా చూస్తున్నారు . ఎలాగు పుష్కరాలకు వెళ్లక సగం జన్మ వృధా 
అయింది . కనీసం సినిమా చూసి అయినా జన్మ సార్ధకం ఎలా చేసుకోవాలి 
అనుకున్నప్పుడు ...... అల్లుడుగారు నెల్లూరు ఎస్ 2 కి అదీ రంజాన్ లాంటి 
రష్ రోజు టికట్స్  తెచ్చారు . అల్లుడు గారు అత్తగారు వాళ్లకు చూపించే 
మొదటి సినిమా అంటే ఈ మాత్రం గొప్పగానే ఉండాల్సిందే !అప్పుడు 
చూస్తే ఇప్పుడు వ్రాయడం ఏమిటి అంటే ఒకటి కాదు రెండు కారణాలు . 

ఒకటి నిన్న ఫండే లో చూసిన గురవారెడ్డి గారి ఆర్టికల్ బాహు బాలి మీద 
గురవా రెడ్డి గారు , చందు శైలజ గారు అక్షర ఆత్మీయులుగా మనకు 
ఈ బ్లాగ్  లోకం లో సుపరిచితులే . (ఆర్టికల్ కింద ఇచ్చాను )

రెండోది నిన్న నెల్లూరు లో ''కె శివారెడ్డి '' గారు  అతిధి గా వచ్చిన 
శ్రీ పొట్టిశ్రీరాములు రచయితల సంఘం  ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొనడం . 
ఆలస్యంగా శివారెడ్డి గారు మాట్లాడుతుండగా వచ్చిన నేను రెండో వరుసలో 
కూర్చుని బుద్ధిగా వినకుండా వెనుక ఉన్న ఆత్మీయుల కళ్ళ లోని 
ప్రశ్నార్ధకానికి సమాధానం చెపుతూ ఉన్నాను . ఉన్నట్లుండి శివారెడ్డి గారు 
మాట్లాడకుండా గమ్ముగా ఉండిపోయారు . ఏమిటని చూద్దును కదా 
''అమ్మా నీ మాటలు అయిపోతే నేను మాట్లాడుతాను '' అన్నారు . 
తప్పుకు నాలుక కరుచుకొని సభా ముఖంగా నా చిన్నతనానికి సారీ 
చెప్పేస్తే పెద్దలందరూ హుందాగా నవ్వి క్షమించేసి సభకు నిండుదనాన్ని
నాకు ఒక మంచి సాహిత్య జ్ఞాపకాన్ని ఇచ్చేసారు . నా కవిత కు బహుమతి 
వచ్చి ఆయన చేతులు మీదుగా తీసుకున్నప్పుడు నవ్వుతూ అభినందించి 
ఇంకోసారి పెద్దరికాన్ని చాటుకున్నారు . 
మీటింగ్ మధ్యలో అన్నారు ''ఆయన రాజ మౌళి ఏదో బాహు బలి అట 
తీసారు . ఏమి సత్యం చెప్పారు దాని వలన '' 
ఇంకా బోలెడు మంది బోలెడు చెప్పారు . కామెడీ లేదంట . ఏదో సినిమాకి 
కావలిసిన దినుసులు లేవట .... ఇంకా ..... ఇంకా ..... 

మీరందరూ సమీక్షకులు ,మీకున్నంత జ్ఞానం మాలాంటి ప్రేక్షకులకు 
లేదు . కాని సినిమాకి మౌత్ పబ్లిసిటీ ఇచ్చి , బోలెడు సార్లు చూసి 
లాభాలు తెచ్చేది మేము . సినిమా మాకు నచ్చితే చాలు . 
నిర్మాతకు కాసుల పంటే !!
అసలు సినిమాలో సత్యం ఏమిటి ?సినిమా అనేది ఒక మనసుకు 
కాలక్షేపం . మాకు లాజిక్ లు వద్దు . మాజిక్ లే కావాలి . అలాగని 
సందేశాత్మక చిత్రాలు కూడా ఆదరిస్తాము. అలాగని ప్రతి సినిమా ఒక 
సందేశం ఎలా ఇస్తుంది . అదొక ఊహ . అందమైన కల . ఊహలు 
వాస్తవం లోకి తెచ్చుకోలేని  వాళ్ళు  దర్శకుడి కళ్ళతో ఊహ ఎదురుగా 
చూసే ఒక కల్పన . ఏమో ఇక్కడ ఏదో సత్యం ఉందేమో !ఇప్పటికి 
పార్ట్ వన్ కదా అయింది . ఎన్ని పార్ట్లు ఉన్నాయో !! 
అసలు మాకు మాత్రం ఒక్కో సన్నివేశం చూసినపుడు ఒక్కో సినిమా 
గుర్తుకు రాలేదా ఏమిటి ! భైరవ ద్వీపం , అవతార్ , మహా భారతం 
ఎన్ని గుర్తుకు రాలేదు దీన్ని చూస్తుంటే . కాని దీనంత అందంగా 
అవి అనిపించలేదు . అప్పట్లో అవి గొప్పవే . ఆ జలపాతం సీన్స్ , 
ముఖ్యంగా పైన చెట్టుకు బాణం వేసి ప్రభాస్ పైకి వెళ్ళడం ,మంచు లో 
తమన్నా ప్రభాస్ జారిపోవడం ఇలా కొన్ని సీన్స్ అయితే అదరహో !!!
(నిజంగా నాకు ఇవి చూడమని చాలా మంది చెప్పారు )
ఇక కీరవాణి సంగీతం , సెంథిల్ ఫోటోగ్రఫీ ఎంత బాగా కుదిరిందో !
అసలు కామెడీ లేదు అన్నారు కాని సినిమాలో స్క్రీన్ ప్లే ఎంత 
బాగుంది అంటే మేము అసలు ఆ విషయమే గుర్తించ నంతగా 
కధలో లీనం అయిపోయాము . అయినా కాల కేయులు మాట్లాడే 
బాష కి బాగా  నవ్వాము. రమా రాజ మౌళి గారు కాస్ట్యూమ్స్ అన్నారు 
కాని అది నాకు కొంచెం నాకు నచ్చలేదు . అసలు తమన్నాకు పాపం 
ఎన్ని డ్రెస్ లు ఉన్నాయి . శివగామి గారి కాస్త్యుమ్స్ బాగున్నాయి . 
రెండో పార్ట్ లో ఇంకా బాగుంటాయి ఏమో !
అసలు ఈ పార్ట్ రాజ మౌళి గారు చెప్పినట్లు శివగామి గారిదే . 


రమ్య కృష్ణ గారి నటన ,రాజ మౌళి గారి స్క్రీన్ ప్లే నచ్చని వాళ్ళు 
లేరు . పల్లెల్లో కి వచ్చి అడగండి . తమ ఊహలలోని అద్భుతాలు కళ్ళ 
ముందు చూసాము అని చెపుతారు .  రాజ మౌళి గారు మీకెందుకు ,
మీకు ఎన్ని పార్ట్లు తీయాలని ఉంటె 
అన్ని తీయండి . ఇంకా కావాలంటే సినిమా హాళ్ళ లోనే కాకుండా 
వెయ్యి రూపాయ పేకేజ్ షో లు ఇళ్లలోని హొమ్ థియేటర్ లకి 
కూడా ఇవ్వండి . ఇలాగే అవుట్ పుట్ ఇస్తే మేము తప్పక 
చూస్తాము . థియేటర్ లు జనాలతో కళ కళ  లాడుతూ ఉండటం 
చూస్తూ ఉంటె ఎంత ఆనందం గా ఉంది . మా నాన్నగారు మా 
థియేటర్ పగల కొట్టించేస్తే ఎంత బాధ పడ్డానో !!! ఏమిటి మంచి 
సినిమాలు ,ప్రజలను హాల్ కి లాక్కొచ్చే సినిమాలు తీసే వాళ్ళే 
లేరా అని !
మీరు ఇంకా పార్ట్లు తీయండి రాజ మౌళి గారు . కాక పోతే 
కొంచెం కామెడీ ,కొన్ని పంచ్ డైలాగ్స్ ,కొన్ని సత్యాలు తక్కువ 
అయినాయి అంట . అవి ఈ సారి గుర్తు ఉంచుకొని తీయండి . 
ఇక అందరు మీ పార్టీ అయిపోతారు . ఒక ప్రపంచ సినిమా తీసిన 
మీకు అభినందనలు . 

పోయిన వారం ఫండే లో నా ఆర్టికల్ 
 (link ikkada )


గురవా రెడ్డి గారి ఆర్టికల్ 

Wednesday, 15 July 2015

ఛా .... ఎంత బాగా వ్రాయాలి అనుకున్నానో పుష్కరాల గురించి :

ఛా ....  ఎంత బాగా వ్రాయాలి అనుకున్నానో పుష్కరాల గురించి :(
ఏదో జీవిత కాలం లో ఒక్కసారే వస్తాయి 144 ఏళ్ళకే మళ్ళీ వచ్చేది అని
చెప్పారు . సరే బ్లాగ్ లో వ్రాద్దాము రేపు మా మనవళ్ళు ,మనవరాళ్ళు
చూసి సంతోషపడుతారు అనుకున్నాను .
తొక్కిసలాట లో దాదాపు 30 మంది చనిపోయారు అని తెలిసి చాలా
బాధ వేసింది . పాపం ఎవరిదీ తప్పు ?నిజంగా ఇంత మంది ని ఒక
దగ్గర నియంత్రించడం ఎంత కష్టం . ఎవరికైనా పుణ్యం వస్తుంది అంటే
వెళ్ళాలి అని ఉంటుంది . కాని చిన్న పిల్లలు కూడా అవసరమా !ఇప్పుడు
బాధ పడితే పాపం పోయిన వాళ్ళ కుటుంభాలకు వాళ్ళు లేని లోటు
తీరుతుందా :(
ఇంకా పోయే వాళ్ళు అయినా కొంత సంయమనంతో జాగ్రత్తగా వెళ్ళండి .

చిత్రం ఏమిటంటే మా నెల్లూరు వాళ్ళం '' పెన్నా బంగాళా ఖాతం మధ్య ప్రదేశే ''
అంటే అంతా పెన్నా పక్కనో ,స్వర్ణ ముఖీ పక్కనో జీవితం మొత్తం ....
కాని ఏదో ఒక తీర్ధ యాత్ర కారణం తో గోదావరి పుట్టిన బ్రహ్మగిరి దగ్గర
నుండి కాళేశ్వరం ,రాజమండ్రి ,పట్టిసం .... ఇంకా అంతర్వేది దాకా
చూసాను . గోదావరి కి నాకు ఏమి అనుభందం ఉందొ కాని .
మీకోసం కొన్ని ఫోటోలు గూగోలమ్మ దగ్గర తెచ్చాను . చూడండి .


ఇది త్రయంబకేశ్వరం దగ్గర బ్రహ్మగిరి నుండి పుట్టిన గోదావరి పాయ
వచ్చే స్థలం . ఇప్పుడు ఇక్కడే కుంభ మేళ జరిగేది . ఇక్కడ
విష్ణువు శేషసాయిగా ఉంటె ఆయన పాదాల నుండి గోదావరి చిన్నగా
ఊరుతూ ఉంటుంది .

ఇది రాజమండ్రి కి కొన్ని గంటల దూరం లో ఉన్న పట్టిసం . ఇక్కడ నుండి ప్రైవేట్ ,
ప్రభుత్వ లాంచీలు పాపి కొండల మధ్య ఉన్న పేరంటాల పల్లె వరకు లేదా
భద్రాచలం వరకు ఉంటాయి . మేము పేరంటాల పల్లె వరకు వెళ్లి వచ్చాము .


చూసారా !గోదావరి మీద లాంచ్ వెళ్ళిపోతుంది . ఇక అటు ఇటు చూస్తూ ఉంటె 
మాట్లాడాలి అని కూడా అనిపించదు . 


మధ్యలో ఇలా కొండల మీద నుండి జలపాతాలు జారిపడుతూ ఉంటాయి . పాపి కొండల 
దగ్గర అయితే నీరు సుడి గుండాలుగా తిరుగుతూ ఉంటుంది . చూడండి మధ్యలో ఇసుక తిన్నె మీద లాంచీ ఆగితే ఇలాగా కనిపిస్తాయి పాపి కొండలు . 
నిజానికి రెండు కొండల వరుస మధ్య పాపతి లాగా గోదావరి ఉంటుంది కాబట్టి 
పాపిట కొండలు ..... వాడుకలో పాపి కొండలు . 


ఇదిగో పేరంటాల పల్లె ఒడ్డు  వచ్చేసి అందరు లాంచీ దిగుతున్నారు . 

దిగగానే ఇలా గిరిజనులు వెదురుతో ఎన్నో కళా రూపాలు చేసి అమ్ముతూ కనిపిస్తారు . 
వాళ్ళ కళను చూసి కొనకుండా కదలలేము . ఊరికే డబ్బులు ఇస్తాము అంటే 
తీసుకోరు . 


మరి ఇక్కడ ఏమి ఉంటుంది అంటే ..... బాలండ స్వామీ గారి ''శ్రీ రామ కృష్ణ ముని వాటం ''
అది ఇదే . ఏముంది గుడే కదా !కాకుంటే ప్రకృతి మధ్య అందంగా ప్రశాంతంగా అంటారా !
నేను అంతే అనుకున్నాను . 
కాని అక్కడ కొన్న ఆయన జీవిత చరిత్ర చదివిన తరువాత ఇవన్నీ తెలుసుకొని 
అక్కడ ప్రదేశాలు చూసి ఉంటె బాగుండును అనిపించింది . 
ఆయన చేసిన కతోరమైన తపస్సు ,తిరిగిన అడవులు ,చివరికి గిరిజనుల కోసం 
ఆయన చేసిన సేవలు .... ఎంత గ్రేట్ . 
మహానుభావులు అంతే !ఎంత తపస్సు చేసినా వాళ్ళ తపస్సు అంతా సాటి 
మనుషుల ఆకలి ,కష్టాలు తీర్చడానికే . మీకు వీలు అయితే ఆయన కధ  చదవండి . 

222222
ఇక ఇది చివరగా గోదావరి సాగరం లో కలిసే అంతర్వేది . లక్ష్మి నరసింహ స్వామీ గుడి 
నుండి పడవ లో సాగర సంగమం దగ్గరకు వెళ్ళాలి . సముద్రం దగ్గర పడుతుంటే 
కనపడే అలలు సముద్రం ఉనికి ఎక్కడ నుండి అనేది తెలిసిపోతుంది . ఒక వైపు నది ,
అది కలిసే సముద్రం అలలు బట్టి బాగా తెలుసుకోవచ్చు . 
నేను నది లో నీళ్ళు చల్లుకుందాము అని నీళ్ళలోకి రెండు అడుగులు వెసానో 
లేదో మోకాలి లోతు వండ్రు మట్టిలో దిగిపోయాను . సముద్రం లో కొంత దూరం 
పోయినా ఏమి కాదు . నది లో బురద భలే డేంజర్ . జాగ్రత్తగా ఉండాలి . 
ఇక్కడ భార్యా భర్త కలిసి మునిగితే జన్మ జన్మ లకు వాళ్ళే భార్యా భర్తలు గా 
ఉంటారు అంట . ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ,నిదానంగా అందరినీ అడిగి 
విశేషాలు తెలుసుకుంటూ చూడండి . 
''పుష్కర పుణ్య ప్రాప్తిరస్తు '' 
               @@@@@@@@@@@@