Wednesday, 28 May 2014

అందరం చూడాల్సిన ''మనం ''

''శశి ఈ రోజు సినిమాకి వెళదాం . మనం కి '' అయ్యగారి 
ఉవాచ . 
అబ్బో మామూలుగా సినిమా కి పోవాలంటే నేను ఎంత స్కెచ్ 
గీస్తే ఈయన బయలుదేరుతారు . ఇప్పుడు మాత్రం చూడు ఆయనకై 
ఆయనే పోదాము అంటున్నారు . అంతేలే ఎంతైనా ''ఎ . ఎన్ . ఆర్ ''
సినిమా కదా !ప్రాణం . పోనీలే పాపం లాస్ట్ సినిమా కదా నాగేశ్వరరావ్ ది . 
నాకేమి ఎ . ఎన్ . ఆర్ అంటే  కోపం లేదబ్బా ... 
కాకుంటే మా అన్నగారు అంటే అభిమానం గాని . 
అసలు పెళ్లి చూపులు అప్పుడు మీకెవరు ఇష్టం అని అడిగుంటే 
ఏమి జరుగుండేదో !పేరుకేలెండి పెళ్లి చూపులు.అమ్మాయి మాటకేమి 
పెద్ద విలువ లేదు . ఇక అబ్బాయికి కూడా శాస్త్రానికి చూపించడమే ... 
పెద్దలకి ఇష్టమైన వాళ్ళతోనే పెళ్లి . ఒక్క హాబీ అయినా ఇద్దరికీ ఒకటి గా 
ఉందా ?నాకేమో బుక్స్ , సినిమాలు .... ఈయనకేమో గేమ్స్ ,సుడోకు ,పజిల్స్ . 
ఇద్దరం వేరే అభిమానులం అయినా ఎప్పుడూ ఒకరి కోసం ఒకర్ని 
మారమని అడిగిందే లేదు . ఇంకా ఇదిగో నీ ఫేవరేట్ సినిమా వస్తుంది 
చూడు అని హెల్ప్ చేసుకుంటూ ఉంటాము . మారటం కాదు అవతలి 
వారి స్పేస్ గౌరవించడం కూడా అవతలి వారి నిజమైన సంతోషాన్ని 
రెట్టింపు చేస్తుందేమో !

సర్లెండి పాత న్యూస్ రీల్ ఎందుకు గాని ''మనం '' సంగతి కి వద్దాము . 
నివాస్ కూడా ఫేస్ బుక్ లో ఇంకోసారి చూడాలని ఉంది అని పెట్టాడు . 
వాదికేడైనా ఇష్టం అయితే మన బాష కాకపోయినా ''బర్ఫీ ''
''చెన్నై ఎక్స్ప్రెస్ '' ఇలాంటివి డౌన్ లోడ్ చేసుకొచ్చి బలవంతంగా 
నన్ను కూర్చోపెట్టి ,అనువాదం చేసి మరీ చూపిస్తాడు . కాని ఇంత 
ఫీల్ అయి పోస్ట్ వేయడం ఎప్పుడూ చూడలేదు . 
నిజంగానే హాల్ మొత్తం ఫామిలీస్ తో అప్పటి పెద్ద వాళ్ళతో 
కళ కళ లాడుతూ ఉంటె  చాలా  సంతోషం అనిపించింది . 

ట్రైలర్  చూసారు కదా !నాగ చైతన్య తాత లాగా ,నాగేశ్వర రావ్ 
మనుమడిలాగా ... ముచ్చటగా ఉంది కదా !అది ఎలాగా అంటే 
అదే కధ . 

కధ చెప్పాలి అంటే మనసు రావడం లేదు . 
చూస్తే మీరు ఇంకా థ్రిల్ అవుతారు . 
నాగార్జున (బిట్టు ) ఆరేళ్ళ వయసులో వాళ్ళ అమ్మ నాన్న (నాగ చైతన్య ,సమంతా )
కారు ప్రమాదం లో చనిపోతారు . వాళ్ళు మళ్ళా పుడితే నాగార్జున 
గుర్తు పట్టి వాళ్ళ పెళ్లి చేయాలి అనుకుంటాడు . సరే నాగేశ్వర రావ్ 
ఎవరు అంటే బిట్టూ లాగే చిన్నప్పుడు కారు ప్రమాదం లో 
అమ్మా నాన్న లను పోగొట్టుకుంటాడు . మరి వీళ్ళతో సంబంధం 
ఏమిటి అంటే ... మీరు స్క్రీన్ మీద చూడండి . స్క్రీన్ ప్లే చాలా 
చక్కగా ఉంది . కనీసం కర్చీఫ్ మెట్ల మీద జార్చే సీన్ కూడా వదలకుండా 
చాలా బాగా వాడుకున్నారు . మ్యూసిక్ అదుర్స్ . కధ లో ఎంత లీనం 
అయిపోతాము అంటే మామూలుగా ఆడవాళ్ళు  వచ్చే దగ్గర ఈ దరిద్రపు 
సీన్స్ ఏమిటి అని మేము విసుక్కునేవి కూడా తెలీకుండానే  కధా గమనం లో 
హాయిగా దాటేస్తాము . 

కుమార్ దర్శకత్వం బాగుంది . అసలు పాత నాగార్జున ,శ్రియ ల 
మధ్య జరిగే కదా లో వాళ్ళ మధ్య ఎంత చక్కగా ఉంది అంటే 
నిజంగా అలాంటి ఒక జంట మన ముందే ఉంది అన్నట్లు అనిపించింది . 
చీర కట్టు లో సమంత ఎంత అందంగా ఉందో అనిపించింది . 
మాములుగా పౌడర్ డబ్బా అనుకుంటూ ఉంటాను . ఇప్పుడు నిజంగా 
బాగా నచ్చింది ) ఇక శ్రియ అయితే ఇంకా ... చీర కట్టు లో అందం 
నీల కంట ,శేఖర్ కమ్ముల తరువాత కుమార్ బాగా చూపించారు . 


ఇంకా విశేషాలు చెప్పమంటారా,అఖిల్ ని చివరలో ఎంట్రీ చేయడం ,
అమలను ఒక పాటలో కొంచెం చూపడం ఇలాటివి చాలా బాగున్నాయి .... 
అందరికంటే ఎవరు కనిపిస్తే 
ఎక్కువ విజిల్స్ వచ్చాయో చెప్పుకోండి ... ఎస్ ... బ్రహ్మానందం . 
అమితాబ్ కు కూడా . జోక్స్ కి కూడా బాగా నవ్వుకున్నాము . 
ఈ జన్మలేమిటి ,చావు ఏమిటి ?అని అనుకోవాకండి . 
మా తమ్ముడికి  కొడుకు పుడితే మా నాయనమ్మ బంగారు ఉగ్గిన్నె 
తో పాలు పోసింది తను బ్రతికి ఉండగానే నాలుగో తరం చూసింది అని . 
మన దేశం లో పెద్ద వాళ్ళు మళ్ళీ పుడతారు అని అంత నమ్మకం . 

నిజంగానే పెద్ద వాళ్ళ అలవాట్లతో , పోలికలతో పుట్టే వాళ్ళని 
చూస్తూ ఉంటాము కదా . మన పెద్ద వాళ్ళు పిల్లలుగా అయినా మనతో 
పుట్టారు అనుకుంటే మనకు ఎంత బాగా ఉందని అనిపిస్తుందో కదా !
ఇంకా ఇక్కడ సోల్ మేట్స్ అనే పదం వాడారు . మామూలుగా మాట్రిమొనీ లో 
కూడా చూసాను ... అది మన జంట అనే అర్ధం లోనే వాడుతున్నారు . 
కాని మన సోల్ మేట్ మన జంటే కావాల్సిన అవసరం లేదు . 
అక్క , ఫ్రెండ్ ,ఇంకా ఎవరైనా కావొచ్చు . వేరే జీవుల్లో కూడా ఉండొచ్చు . 
ఎందరో మనతో మన సోల్ నుండి పుట్టొచ్చు . దీని గురించి 
చాలా పెద్ద సిలబస్ ఉంది . 

మరి ఒకరి మీద ఒకరికి ప్రేమతో ఇలా పుడుతూనే ఉంటారా అంటే 
... అవును . ఎప్పటిదాకా అంటే .... ప్రేమ తీరేవరకు . 
ప్రేమ తీరుతుందా అంటే .... ఖచ్చితంగా తీరుతుంది . 
మన గోలీలు , గాలి పటాలు ,మట్టి బుడ్డీలు , గుజ్జెన గూళ్ళు , 
సినిమాలు సరదాలు ,భార్యతో సరసాలు ,పిల్లలతో ఆటలు 
ఎన్నిటిని మనం కొద్ది రోజులకు మార్చిపోవట్లేదు . ఇదీ అంతే . 
అసలు జన్మ మీద కూడా ఆశ తీరిపోతుంది . ఆ రోజున ఈ 
జనన మరణ వలయం నుండే మనం బయటకు వచ్చేస్తాము . 

ఆ ఒడ్డు  ఎలా ఉందా అని ఆ చివరికి ఆయాసపడుతూ ఈదుతాము . 
మళ్ళీ ఈ ఒడ్డు ఎలా ఉందో అని ఈ వైపుకు ఈదుతాము . 
ఎప్పుడో అలిసిపోయి ఇసుకులో పడుకొని ఆకాశం వైపు 
చూస్తూ ఎక్కడ చూసినా ఇంతే . ఇలాగే ఉంటుంది . ఈదటం 
అనవసరం అని తెలుసుకుంటాము . అంతే ఆట ఆ రోజుతో 
ఆగిపోతుంది . లోపలుండే చిలుక ఎగిరి పోతుంది . 

'' ఎ . ఎన్ . ఆర్ గారు మిమ్మల్ని తెలుగు వాళ్ళం ఎప్పటికీ మరచిపోము అండి  ''

ఎవరెస్ట్ ఎక్కిన 'పూర్ణా'నందం

 ఒక్క సారి ఊహించుకోండి . ఒక ప్రపంచ రికార్డ్ ఏర్పరచాలి 
అని మీరు  బయలుదేరితే ,మీతో 65 దేశాల వాళ్ళు కూడా 
బయలుదేరితే చివరి అంకానికి పది మందే మిగిలితే .... 
అదిగో ఇక వెయ్యి అడుగుల దూరం లో మీ ప్రపంచ రికార్డ్ కనిపిస్తూ ఉంటె 
... మీ టిన్ ఫుడ్ మీకు అప్పుడే వికటిస్తే ,మీ పాదాల పట్టు 
సడులుతుంటే ,అవలాంచి మంచు ప్రవాహాల మధ్య డెత్ జోన్ లో 
అది కూడా అంతకు ముందే ఇరవై నాలుగు మంది చనిపోయారు 
ఆ ప్రదేశం లో అని తెలిస్తే ,ఇంకా గొప్ప విషయం మీరు అమ్మాయి అయితే ,
మీకు పద మూడు ఏళ్ళు మాత్రమె అయితే .... హోరుమని వీచే మంచు గాలుల 
మధ్య మీరు ఏ దారిని ఎన్నుకుంటారు ?పైకా ?ప్రాణాలు కాపాడుకోను 
క్రిందకా ?
కాని వాళ్ళు ఇద్దరు పిల్లలు ''పూర్ణా స్వారో '' ''ఆనంద్ స్వారో '' 
కొద్దిగా కూడా జడవలేదు . పెరిగిన పేదరికం ఇచ్చిన కసితో 
దృడ సంకల్పం తో ముందుకే అడుగేసారు . ఎవరెస్ట్ శికరాన్నే 
చుంబించారు . ప్రపంచ రికార్డ్ లో మొన్న 25/5/2014 ఆదివారం 
ను తమ పేరుతో ముడి వేసుకున్నారు . 
నేను ఎందుకు ఇప్పుడు వ్రాస్తున్నాను అంటున్నారా ... 
మామూలె కదండి .... 
ఎవరైనా గొప్ప పని సాధిస్తే మా వాళ్ళే 

అని కలుపుకోవడం మనవ లక్షణం . 
నేను మాత్రం దానికి మినహాయింపు 
కాదు . కాకుంటే నాకు ఇంకా దగ్గర సంభంధం వీళ్ళతో . 
ఎలా అంటే వీళ్ళకి చదువు ఇవ్వడమే కాక ,
వీళ్ళకు ఈ ట్రెకింగ్ కి స్పాన్సర్ 
చేసిన ''ఆంద్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ '' లోనే 
నేను టీచర్ గా పనిచేస్తూ ఉన్నాను . 

కాబట్టి నేను వీళ్ళకి దూరపు టీచర్ వరుస ... బాగుంది కదూ :)))

ఇంకా ఈ సాహస యాత్రకు కావలిసిన ప్రోత్సాహాన్ని అడుగడుగునా 
ఇస్తూ స్పాన్సర్ చేయించిన మా సెక్రటరీ ''ఆర్ . ఎస్ . ప్రవీణ్ కుమార్ '' ఐ . పి . ఎస్ 
గారికి అభినందనలు . కోచ్ శేఖర్ గారికి అభినందనలు 

వాళ్ళను చూడాలి అని ఉంటె కింది న్యూస్ చూడండి . మీ బ్లెస్సింగ్స్ 
అంద చేయండి . 
అతి పిన్న వయసు లోనే ఎవరెస్ట్ ఎక్కిన రికార్డ్ ఇప్పుడు 
''పూర్ణా స్వారో '' పేరు మీద వచ్చేసింది . 

విజయానికి కావాల్సింది పిల్లలకు మనం ఇచ్చే డబ్బు కాదు . 
వాళ్ళ సంకల్పం ,అదృష్టం . 
Thursday, 15 May 2014

మీ అమ్మ గుర్తుకు వచ్చిందా !

''శశి నీకే ఫోన్ '' శ్రీవారు వెనుక సీట్ లో నుండి ఇచ్చారు . 
టెంపో స్పీడ్ గా వెళుతుంటే లోపల ఎ . సి కి ,అందులో ఉదయం 
నుండి హొగనికల్స్ వాటర్ఫాల్స్ ఇంకా అటునుండి అటు ''ఆరుణాచలం''
చూసుకొని తిరిగి తిరిగి అలిసిపొయిఉన్నాము . అందులో రాత్రి పన్నెండు ... 
ఈ సమయం లో ఫోన్ ఏమిటి ?
తీసుకున్నాను ,నిద్ర మత్తులోనే ''హలో '' అన్నాను . 
అవతల నుండి ఒక గొంతు ఏమి అర్ధం కాకుండా ,
''huttina habbhabha subhashesheyagalu amma nimage....

mundhina janmadhalli ninna aammanagi hutti ninna runavannu terisuthena..''

''ఏమిటీ ''అన్నాను అర్ధం కాక . 
''అమ్మా నేనునివాస్ ని , నీకు హ్యాపీ బర్త్ డే ''చెప్పాడు పుత్రరత్నం నివాస్ . 
వార్నీ నువ్వా ? అయినా ఇప్పుడు ఇంకా పుట్టిన రోజులు చేసుకొనే 
వయసా ? కాని వాళ్ళ ప్రేమకి ముచ్చట వేసింది . టెంపో లో మరిది వాళ్ళు ,
ఆడబిడ్డ వాళ్ళు ఇంకా పిల్లలు అందరు మంచి నిద్ర లో ఉన్నారు . 
పాపం అందరికి డిస్ట్ర బెన్స్ అవుతుందేమో ! వాడేమో చెపుతున్నాడు . 

''అమ్మా నేను చెప్పింది ఏమిటో తెలుసా ?కన్నడం . 
నీకోసం ఫ్రెండ్ దగ్గర నేర్చుకొని గుర్తు పెట్టుకొని చెప్పాను . ''


''సరేలేరా దీని కోసం ఇంత సేపు మేలుకున్నావా ?ఇక నిద్రపో . 
మళ్ళా రేపు ఎక్సామ్ కదా ''చెప్పాను నవ్వుతూ . 
వాడికేమో ఇంకా మాట్లాడాలి అని . 
నేనే ఫోన్ ఆపేసాను ఉంటాను అని చెప్పేసి . 

 ''శశీ మళ్ళీ ఫోన్ '' ఇచ్చాడు ఈయన . 
అర్ధం అయిపోయింది . పాప దగ్గర నుండి . 
''అమ్మా హ్యాపి బర్త్ డే . ఛా .... మా వాడే ఫర్స్ట్ చెప్పాడు 
కదా . నేను నీ ఫోన్ కి చేస్తే నువ్వు తీస్తే కదా . 
వాడు ఇప్పుడే ఫేస్బుక్ లో చెప్పాడు . వాడే ఫస్ట్  
చెప్పాను అని ''
అబ్బా మళ్ళా వాదులాట  మొదలు పెట్టారు . 

''వాడు వెక్కిరించాడు నువ్వు వేస్ట్ . నేను ఎలా చేసావురా 
అని అడిగితే ... వేర్ థెర్ ఈస్ విల్ థెర్ ఈస్ వే . 
నేను అమ్మకి కాకుండా నాన్నకు చేసాను . అమ్మ బాగ్ 
ఎక్కడో పడేసి ఉంటుంది . నాన్న అయితే ఫోన్ జేబులో 
పెట్టుకొని ఉంటాడు . చూసావా నేను ఫస్ట్  చేసాను అని 
ఏడిపిస్తూ ఉన్నాడు ''
ఇంకా చెపుతూ ఉంది . 
''మా......  నేనేమో మూడు రోజుల నుండి నీకోసం ఒక వీడియో ప్రిపేర్ 
చేసాను . అదేమో ఫేస్బుక్ లో అప్లోడ్ చేసాను పన్నెండుకు పోస్ట్ 
వేద్దాము అని . అదేమో గంట అప్లోడ్ అయింది మా . వాడేమో 
నీ చిన్నప్పటి ఫోటో పెట్టి పోస్ట్ వేసాడు . నేనే ఫస్ట్  అని ఎడిపిస్తున్నాడు . 
నువ్వు నా వీడియో చూడమ్మా '' అంది . 

నాకు అర్ధం అయింది అందరు మేలుకొని చాటింగ్ చేస్తూ నా కోసం 
విషస్ పెడుతున్నారు ,అయ్యో నా దగ్గర కంప్యుటర్ లేకపోయే . 
కొంచెం బాధ వేసింది . ఇదిగో ఇదే వీడియో చూడండి . 
డ్రాయింగ్స్ అన్నీ పాప వేసినవే . మరీ బాగా లేవు . కాని 
ప్రతి దాని వెనుక అమ్మ ప్రేమ కనిపిస్తుంది చూడండి . ఇంతలో మళ్ళీ ఫోన్ . ఎవరబ్బా ?ఇద్దరు బుడ్డిగాళ్ళు అయిపోయారు కదా !
''ఆంటీ హ్యాపీ బర్త్ డే .'' హసిత ... మా పెద్ద తోడు కోడలు కూతురు . 
నివాస్ చదివే కాలేజ్ లోనే చదువుతుంది . 
''నీకెలా తెలుసమ్మా ?'' అడిగాను . 
''అన్నయ్య పోస్ట్ వేసాడు '' చెప్పింది . 
నాకు అర్ధం అయింది అందరు చాటింగ్ చేస్తూ పన్నెండు వరకు మేలుకొని 
నన్ను ఆనందపరచాలి అని ప్లాన్ చేసారు . పాపం పిల్లలు తూగుతూ 
కూడా అమ్మ మీద ప్రేమతో మేలుకొని ఉన్నారు . 
ప్రేమ తెలపడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా ?
కాని నన్ను ఎంత సంతోషపరిచారు . మన ఆత్మీయత ,నిబద్ధ్ద్హత 
ఎవరి హృదయాన్ని అయినా మురిపిస్తాయి . 

ఇప్పుడు ఈ పోస్ట్ వేయడం ఎందుకు అనుకున్నాను . కాని ప్లస్ లో 
ఈ విషయం షేర్ చేసినపుడు అందరు భలే ఆనందించారు . 
ఒక అమ్మగా నా ఫీలింగ్స్ మీతో  పంచుకుంటే .... మీలో పెద్ద వాళ్ళు 
ఉన్నారు , పిల్లలు ఉన్నారు . మీ  అమ్మ వడి గుర్తుకు వచ్చి 
మా అమ్మ ఎలా ఉందో అనుకుంటారు కదా !
హృదయం లో పొంగిన ప్రేమ తడి మీ కళ్ళ మీదో ,
మీ పెదాల మీదో కనిపిస్తుంది కదా . 
కనిపించిందంటే జీవితపు పోరాటం లో మీరింకా పూర్తిగా 
మర మనిషి కానట్లే . ఒక్క సారి కళ్ళు మూసుకొని మీ అమ్మని 
గుర్తుకు తెచ్చుకోండి . ఎంత హాయిగా ఉందో చూసుకోండి . 
మన బలాలు అందరు ప్రేమిస్తారు . కాని మన బలహీనతలు కూడా 
ప్రేమించి మనకు అండగా నిలిచేదే అమ్మ .... కాదంటారా ?

Wednesday, 14 May 2014

మౌనాన్ని ఆశ్రయించండి

అందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు . 

 శ్వాస మీద ధ్యాస ఉంచండి . ఆలోచనలు కట్ చేయండి . 
ఒక్కొక్కరు ప్రశాంతంగా ఒక చేతి వేళ్ళలో ఇంకో చేతి వేళ్ళు 
ఉంచి కూర్చోండి . ఏమి మంత్రం  అనుకోవద్దు . గమనిస్తూ ఉండండి 
మీలో ఏమి జరుగుతుందో . మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు 
కూర్చొని ధ్యానం చేయండి .... చెపుతూ ఉన్నారు రాఘవేంద్ర సార్ . 
మెడిటేషన్ క్లాస్ కు వెళ్లి వాళ్ళు చెప్పేవన్నీ వింటున్నాను . 
ఇంతకు ముందు గూడూరు లో మా అక్క, నేను రేవతి మేడం 
దగ్గర నేర్చుకున్నాము . ఇక ఇక్కడ నాయుడుపేట లో ఇక్కడ 
సెంటర్ ఉంది తెలిసి వచ్చాను . అందరు ఫామిలీస్ తోనే వచ్చారు . 
కొందరు చిన్న పిల్లలు కూడా ఎంత ముచ్చటగా చేస్తున్నారో !
ఇంకా చెపుతూ ఉన్నారు . ధ్యానం వలన ఆరోగ్యం బాగు అవుతుంది . 
మనసు ప్రశాంతం అవుతుంది . ఏకాగ్రత పెరుగుతుంది . 
''ఏమిటి ఇవన్నీ నిజామా ?''అడిగాను . 

''మేము చెప్పేది మేము చెప్పాము . నిజమో కాదో మీరు 
పరిశీలించి తెలుసుకోండి . ఎవరో ఏదో చెప్పారు అని నమ్మొద్దు . 
చెప్పిన వాళ్ళను దేవుళ్ళు చేయొద్దు . బియ్యం ఉడికిస్తే అన్నం 
వస్తుంది అని చెపుతాము . కాని మీరు చేసుకోవడం నేర్చుకుంటే నే 
కదా మీకు అన్నం వస్తుంది . 
అప్పో దీపో భవ 
ఎవరి కర్మ ను వాళ్ళే తొలగించుకోవాలి . ఉద్దరించుకోవాలి . 
ఎవరూ ఎవరి కోసం ఏమి చేయరు . దారి చెపుతారు అంతే . 
నడవ వలసిన వాళ్ళు మీరే '' అని చెప్పారు సార్ . 

సరే చూద్దాము . ఏదైనా చేసి చూడాలి ,సాదించాలి అనే పట్టుదల నాకు . 
మెల్లిగా అందరు కళ్ళు మూసుకొని ధ్యానం లోకి వెళ్ళిపోయారు . 
ఏవో ఆలోచనలు.... ఇప్పుడు కాదు అని వాటికి చెప్పేసి నా శ్వాస నే 
గమనిస్తూ ఉన్నాను . కళ్ళు మాత్రం తెరవాలి అనిపించడం లేదు . 
మెల్లిగా తల మీద ఏదో కొంచెం బరువుగా .... భయ పడాల్సినది 
ఏమి లేదు అని తెలుసు కాబట్టి చూస్తూ ఉన్నాను . మెల్లిగా ఏవో 
వైబ్రేషన్స్ శరీరం లోకి వస్తూ ,నడుము భుజాలు భలే నొప్పిగా అనిపిస్తూ 
ఉన్నాయి . రాఘవేంద్ర గారు ముందే చెప్పి ఉన్నారు ,అలా నొప్పిగా 
అనిపించినా ఓర్చుకొని అలాగే గమనిస్తూ ఉండండి . 
ముందు రాబోయే జబ్బులని విశ్వశక్తి శుబ్రం చేసి తొలగిస్తుంది అని . 

అందుకే గమనిస్తూ ఉన్నాను ,ఓర్చుకోలేనంత నొప్పిగా కూడా ఉంది 
కాసేపు . కళ్ళు  మాత్రం తెరవలేదు . మెల్లిగా నొప్పి తగ్గిపోయి ఎప్పుడు 
మౌనంగా ఉన్నానో నాకే తెలీదు . ఏ ఆలోచన  అనిపించదు . 
చేతులు ,శరీరం తేలిక అయిపోయినట్లు . చాలా హాయిగా ఉంది . 
అలాగే కూర్చోవాలి అనిపించేటట్లు . 
ఇంటి దగ్గర ఒక్కరమే చేసుకోవచ్చు కాని ,ఇలా 
అందరితో సామూహిక ధ్యానం చేస్తే మనం కళ్ళు తెరవము ,ఇంకా 
ధ్యాన స్థితి తొందరగా వస్తుంది . ఇంకా మనకు ఏవైనా కనపడినా ,
అనుభూతి చెందినా అలా ఎందుకు వచ్చిందో వివరిస్తారు .  

మెల్లిగా మౌనం లోకి జారిపోయిన అనుభూతి . చూస్తూనే ఉన్నాను . 
ఏదో ఒక స్తంభం బంగారు రంగులో కనపడింది . అందరు కళ్ళు 
తెరిచేసరికి నేను తెరిచాను . 
నాకు కనపడింది చెప్పి దీని అర్ధం ఏమిటి అని అడిగాను . 

''అమ్మ మీరు ఇంటికి వెళ్లి దీని అర్ధం ఏమిటి అని మనసులో 
అనుకోని దానికి సమాధానం వచ్చేవరకు ధ్యానం చేయండి ''అన్నారు . 

వదిలే రకం కాదు నేను . అలాగే ఇంటికి వెళ్లి ధ్యానం చేసాను . 
చాలా సేపటికి మళ్ళా ఆ బంగారు స్థంభం కనపడింది . 
మెల్లిగా దాని పై భాగం ,దాని పై ఒక పద్మం దానిలో శివ లింగం . 
అర్ధం కాలేదు కాని ఇంకా గమనిస్తూనే ఉన్నాను . మెల్లిగా నాలోకే 
ఏవో అక్షరాలు 
''అన్ని సత్యాలు మీకే ... అన్ని లోకాలు మీకే '' అని . 
అదే నా ఫస్ట్  మెసేజ్ . అలా వస్తుందని కూడా నాకు తెలీదు . 

కాని నాకు ఇప్పుడు తెలిసింది ఏమిటంటే మనసు తో మౌనాన్ని ఆశ్రయిస్తే 
ఎంతో జ్ఞానాన్ని ,ప్రశాంతతను పొందవచ్చు అని . 
ఇదంతా నమ్మొచ్చా ?అని మీరు అడిగితే ఒకటే చెపుతాను . 
నమ్మమని ఎవరు చెప్పారు . గుడ్డిగా ఏదీ నమ్మొద్దు . 
నిజమో కాదో కాసింత సేపు కళ్ళు మూసుకొని చూడండి . 
మీ జ్ఞానాన్ని మీరే పొందండి .  

ఎప్పుడైనా మా మేనమామ గారు ఫోన్ చేస్తే నీ ఆరా బుక్ ఎప్పుడు 
వ్రాస్తావు శశి  ?నీ ధ్యాన అనుభవాలు తెలుసుకోవాలి అని ఉంది అంటారు . 
వాటి  వలన ఎవరికైన ప్రయోజనం ఉంది అనుకున్నప్పుడు 
వ్రాస్తాను . ... లేకుంటే లేదు . 

Friday, 9 May 2014

వెబ్ కాస్టింగ్ సిబ్బంది తో ఇబ్బంధంట !

వెబ్ కాస్టింగ్ సిబ్బంది తో ఇబ్బంధంట !

దీని గూర్చి వివరించే ముందు పుస్తకం . నెట్ లో 
''కధ 2013 '' పై నా రివ్యు చదివి వచ్చెయ్యండి . 

( riview link kadha 2013 in pustakam . net )

''అమ్మా నేను ఎక్కడ ఉన్నానో చెప్పు '' పోయిన నెలలో 
నివాస్ ఫోన్ . 
ఎక్కడ ఉండటం ఏమిటి నా బంగారు కొడుకు చక్కగా 
కె . ఎల్ . యు . లో రెండో ఏడాది ఇంజినీరింగ్ చదువుకుంటూ 
కాలేజ్ లో ఉంటాడు . అదే చెప్పాను . 

''కాదు నేను నర్సాపురం లో ఉన్నాను ''కాసింత గర్వం మాటల్లో . 

వీడికి అక్కడేమి పని అదీ మా పర్మిషన్ లేకుండా ... కొంచెం 
చుర్రుమంది . ''ఎందుకు పోయ్యావు ? ''

''నేను ఇక్కడ లోకల్ ఎలేక్షన్స్ కి వెబ్ కాస్టింగ్ చేయడానికి 
వచ్చాను . కాలేజ్ లో 120 మంది విల్లింగ్ ఇస్తే నేను కూడా 
ఇచ్చి వచ్చాను . చెపితే పంపుతారా ?అందుకే చెప్పకుండా 
వచ్చాను '' 
నా బంగారు . నిజంగా ఎంప్లాయ్ కాకుండానే ఎలేక్షన్స్ విధుల్లో 
పాల్గొనడం దేశ రక్షణ సిపాయి అంత గౌరవప్రదం అయినదే . 
దానిలో పాల్గొంటే పిల్లలను కోప్పడుతామా ? కాని తప్పదు.''పిల్ల కాకికి ఏమి తెలుసు ఉండేలు దెబ్బ '' అని సామెత . 
ఎన్నిక విధులు ఎలా ఉంటాయి . పైకి తేట నీళ్ళే ,కింద ముసళ్ళు . 

కొన్ని సార్లు నేను లేడీ పి. ఓ . కాబట్టి లేడీస్ బూత్ కి వేస్తారు . 
లేకుంటే జనరల్ . ఒక సారి లేడీస్ బూత్ కి వేసారు . 
 కాబట్టి పెద్ద గొడవలు ఉండవు 
మహా అయితే ఐ . డి కార్డ్ కొంచెం ఇబ్బంది . ఏజెంట్స్ బాగున్నారు . 
అంతా బాగుంది అనుకున్నాను . 
ఒకామె వోట్ వేయడానికి వచ్చింది . 
ఏజెంట్స్ తో పాత గొడవలు కాబోలు  అతను ఆమెను 
'' వేసావు లేమ్మా పెద్ద ఓటు  ''అని అనేసాడు . 
ఆమె ఎంత రియాక్ట్ అయింది అంటే వెంటనే 
తప్పుడు మాటలు . ఎలెక్షన్ లో అంతా బాగున్నట్లే ఉంటుంది . 
ఇదిగో ఇలాంటి సెన్సిటివ్ గొడవల్లో టకామని రెండుగా విడిపోతారు . 
అసలు గొడవ ఎలా వచ్చిందో ఊహించలేము . నేను వెంటనే 
రియాక్ట్ అయి పోలీస్ ని పిలిచి ఆమెను మెల్లగా పంపేసి ఏజెంట్ 
కి సర్ది చెప్పాను
 ''ప్లీజ్ పోలింగ్ ప్రశాంతంగా జరగనివ్వండి ''అని . 
ఏదో అంటారు కదా !వాసుదేవుడు అంతటి వాడే అని .... అంటే 
సామెత కరక్ట్ కాదు కాని మా కష్టాలు అలాగే ఉంటాయి . 
పొరపాటున పోలింగ్ రద్దు అయిందో కింద వాళ్ళ దగ్గర నుండి 
పై వాళ్ళ దాకా ''కాంట్ బట్ పొజిషన్ '' అని చెప్పి రుజువు 
చేయాలి .  

ఇదిగో ఇలాంటి పరిస్థితిలో మాకు ఈ వెబ్ కాస్టింగ్ వరం 
నిజంగా . వీళ్ళు ఏమి చేస్తారు అంటే వాళ్ళ లాప్ టాప్ 
లో అంతా రికార్డ్ చేసి పై వాళ్లకు ఇస్తారు . ఇది వచ్చినాక 
ఎంతో హాయిగా ఉంది . క్రౌడ్  వచ్చినా కూడా ఆ కెమరా వైపు 
చూపిస్తే వాళ్ళే సర్దుకొని బయటకు వెళ్ళిపోతున్నారు . 

సరే ఈ వెబ్ కాస్టింగ్ చేసే సిబ్బంది ఎవరబ్బా అంటే ఇదిగో 
ఈ పిల్లలే . మొన్న ఇంటర్ దాకా అమ్మ హార్లిక్స్ లేదా టీ 
ఇస్తే వేళ కి తిని పుస్తకాల తో కుస్తీ పట్టి ఇంజినీరింగ్ 
చేరినవారు . మాకైతే రెండు రోజులు నిద్ర , ఆహారం లేకుండా 
ఏ స్కూల్ వేస్తే ఆ స్కూల్ లో దోమలతో కుట్టించుకుంటూ ,
ప్రజలతో తిట్టించుకుంటూ అందరిని సర్ది చెప్పుకుంటూ 
విజయవంతంగా ఎలేక్షన్స్ చేయడం అలవాటు . 
పాపం వీళ్ళకేమి తెలుసు ... మొన్ననే అమ్మా నాన్న గూడు 
వదిలి ప్రపంచం లోకి తల పెట్టిన వాళ్ళు . అందులో 
లోకల్ ఎలేక్షన్స్ .... డబ్బాల్లో వోట్లు వేస్తారు . పది వోట్లు 
తేడా వచ్చినా తోసుకోవడాలు , కొట్టుకోవడాలు , 
ఇంతకు ముందు అయితే గోలి షోడాలు , మండింది అంటే 
మమ్మల్ని కూడా లోపల పెట్టి తలుపు వేసేస్తారు . 
మా తల కాపాడుకునేదే మాకు పెద్ద పని . ప్రజాస్వామ్యం 
దేవుడేరుగు . 

నిన్న ఎలేక్షన్స్ లో పాపం ఆ వెబ్  కాస్టింగ్ పిల్లవాడిని చూస్తే 
నివాస్ గుర్తుకు వచ్చాడు . ఎప్పుడో నిన్ననగా నెల్లూర్ నుండి 
వచ్చాడంట . అన్నం తిని రాపో అంటే .... 
''తిరిగొచ్చాను మేడం ,ఎలేక్షన్స్ అని ఎక్కడా మెస్ లు లేవు ''
అన్నాడు . మొహం పీక్కొని పోయి ఉంది . కళ్ళ చుట్టూ
ముడతలు . రెండు అరటి పళ్ళు తిని వచ్చాడంట . మనసు 
అయ్యో అని మూలిగింది . నా పెరుగన్నం తినెసాను . 
లేకుంటే ఇచ్చేద్దును . ఇంత ప్రాణం మీద రిస్క్ ,మాతో 
సమానంగా ఆకలి పంచుకున్న పిల్లలకి వాళ్ళు ఇచ్చే 
అమౌంట్ 500. (బహుశా వాళ్లకి జీవితం లో మొదటి 
సంపాదన కావొచ్చు ). మాకైతే అథర్  పోలింగ్  వాళ్లకి 
బోథ్ దగ్గరే డబ్బులు ఇచ్చెస్తారు . వాళ్ళు అక్కడ నుండి 
ఏడు కల్లా ఇళ్ళకు వెళ్ళిపోతారు . 
కాని ఈ పిల్లలు పాపం మళ్ళా కంట్రోల్ యూనిట్ తెచ్చే 
వాళ్ళతో రిసిప్షన్ కి వచ్చి ఆ రికార్డింగ్ కాసేట్ అప్పచెప్పాలి . 
రాత్రి ఎంత పొద్దు పోతుందో తెలీదు అన్నం ఉండదు . 
ఇంతా చేస్తే డబ్బులు సరిగా ఇవ్వరు . అసలు మనం 
విడియో తీస్తే ఎంత ఇస్తాము ఇళ్ళ దగ్గర . 
 అసలు అన్ని లాప్ టాప్స్ కొనాలంటే 
ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది . 
పిల్లలు ఎంత మేలు చేస్తున్నారు . 
పిల్లల్ని ఎంత విసిగించాలో అంత విసిగిస్తారు . 
వాళ్ళు విసుగు పడి సమ్మెకు దిగుతారు . 

అదిగో అప్పుడు 
'' వెబ్ కాస్టింగ్ వాళ్ళతో ఇబ్బంది '' అంటారు . 
ఎవరు ఎవర్ని ఇబ్బంది పెడుతున్నారు ?వాళ్ళ 
వయసుని అయినా మనం గౌరవించ వద్దా  ? 
పాపం వాళ్ళ పొట్టలో ఆకలి ఎంత ఉంటుంది ?
మన లాగా భరించగలరా ?ఏమిటో అంతా మాయ !

నేను ఉన్న పోలింగ్ బూత్ లో నివాస్ ఫ్రెండ్స్ వోటు 
వేయడానికి వచ్చి ''ఆంటీ నివాస్ వోటు వేయడానికి 
రాలేదా ''అని అడిగితే కొంచెం నా మనసు బాధగా 
మూలిగింది . 

పాపం వాడు మొదటి సారి కదా వోటు వేయడానికి 
వస్తాను అంటే వాళ్ళ నాన్న 
''ఏమి  రా వద్దు . నేను, అమ్మ ఇద్దరం డ్యూటీ 
కి వెళితే నువ్వు ఎక్కడ ఉంటావు '' అని 
కటినంగా చెప్పేశారు . 

ప్రాక్టికల్ గా ఆలోచిస్తే కరక్టే . కాని పాపం వాడి వోటు 
ముచ్చట తీరలేదు కదా !ఇంకో సారి ఎలెక్షన్ 
ఉంది కదా అంటారేమో .... 

ఈ సారి ఇలాగా ఎలెక్షన్ ఉండదు .... సింపుల్ గా 
ఎవరికి వారు ఎ . టి . ఎం బోథ్ కు వెళ్ళినట్లు 
వెళ్ళడం ఫింగర్ ప్రింట్ , ఐ రిష్ ను ఐ . డి గా 
చూపడం ..... ఎ . టి ఎం లో స్వైప్ చేసినట్లు    
కావలిసిన వారికి చేయడం . ఇంత జనాభాకు 
ఎలా అంటే ఒక వారం టైం ఇస్తారు లెండి ... 
మనకు ఖాళి ఉన్నప్పుడు వెళ్లి వెయ్యడమే . 

అందరు వోట్ చేస్తారా అంటే .... 
ఏముంది వోట్ వేయని వారికి అన్ని రేష న్స్ 
కట్ అంటే వాళ్ళే పరుగు లు తీస్తూ వచ్చి 
వోట్ వేస్తారు . వంద రూపాయలు ఖర్చు చేసి 
మరీ ఆధార్  కార్డ్ తీసుకున్నారా లేదా ? అంతే . 
పైసా మే పరమాత్మా హై  :)