Thursday 30 July 2015

కలాం గారిని తలుచుకుంటూ

మొన్న 27/7/2015 షిల్లాంగ్ ఐ . ఐ . ఎం లో విద్యార్ధులతో 
ప్రసంగిస్తూ ఏ . పి . జె . అబ్దుల్ కలాం గారు కుప్ప కూలిపోయి 
పరమపదించారు అనే విషయం తెలిసి నప్పటి నుండి మనసు 
మనసు లో లేదు . పైకి బాగున్నా మనసులో ఏదో బాధ బరువుగా .... 
కన్నీళ్ళ విలువ ఇలాంటప్పుడే తెలుస్తూ ఉంటుంది . కాని అవి 
కూడా రావడం లేదే !!
ఎంత బాధలో ఉన్నా కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించడం అనేది 
ఉద్యోగులందరికీ అనుభవమే . ప్రిన్స్పాల్ గారితో మాట్లాడి 
ఆయనకు శ్రధ్ధాంజలికి అన్ని ఏర్పాట్లు పూలమాల తెచ్చి సభ 
ఏర్పాటు చేసాము . వారి బాల్యం ,సుభాషితాలు , అవార్డ్లు 
నిరాడంబరత ఇలా ఒక్కొక్కరు మేడమ్స్ ఒక్కో కోణాన్ని పిల్లల 
ముందు ఆవిష్కరించారు . పెద్ద వాళ్ళు వెళ్లి పోయినపుడు 
ఆ స్పూర్తిని విద్యార్ధులకు అందించి మంచి తరాన్ని చేయడం 
మా టీచర్ వృత్తిలో బాగం . 
నా వంతు  వచ్చేసరికి ఏమి చెప్పాలి . మైండ్ కి మనసుకు ఎక్కడో 
సమన్వయము లేదు . ఆయనను దగ్గర నుండి చూసిన 
జ్ఞాపకాలే మనసులో తిరుగుతున్నాయి . ఆయనను చూసిన 
అనుభవమే చెప్పాను . సమైఖ్యాంధ్ర స్ట్రైక్ లో బస్ లు లేకపోయినా 
జిల్లా నుండి ఎనిమిది మంది సెలెక్ట్ కాబడిన విద్యార్ధులను తీసుకొని 
హైదరాబాద్ కి ఆయన సభలో పాల్గొనడానికి వెళ్ళిన సంగతి 
చెప్పాను . గొప్పవారిని చూసే అవకాశం వచ్చినపుడు ఎంత 
కష్టం అయినా ఎదుర్కొని ఎలా వెళ్ళాలో చెప్పాను . ఆయనను 
చూడగానే మనసు ఎంతగా పొంగిపోయిందో చెప్పాను . పిల్లలతో 
ఆయన తన భావాలను ఎంత చక్కగా పంచుకున్నదీ ,ఆయన 
వాళ్ళ పై ఎంత ఆశలు పెట్టుకున్నది చెప్పాను . 
''కల అంటే నిద్రలో వచ్చేది కాదు . మిమ్మల్ని నిద్ర 
పోనీకుండా చేసేది ''...... అబ్దుల్ కలాం . 

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అంటే ఆయన స్ఫూర్తి ని 
విద్యార్ధులకు అందించాలి అని భావించాను . 
అవే ఈ రోజు ఈనాడు నెల్లూరు  స్పెషల్ లో వచ్చిన 
మా ''లీడ్ ఇండియా 2020'' ప్రోగ్రాం ఆర్టికల్ . 
ఇంకోటి ఆంధ్ర జ్యోతి నెల్లూరు స్పెషల్ లో వచ్చిన కవిత . 
చూడండి . 

lead india programme link in eenadu






Thank you Eenaadu and Andhra Jyothi
  రాలిపోయిన ధ్రువ తార      
ఒక్క క్షణం 
భారత దేశం నిశ్చేష్టగా నివ్వెరపోతూ 
ఒక మహామహుని తన వొడి నుండి 
కోల్పోతూ 
ఎన్ని కీర్తి కిరీటాలు తెచ్చాడో 
ఎన్ని విజయాలు పొందాడో 
అన్నీ తనను కన్న దేశమాత కోసమే !
పేపర్ బాయ్ గా మొదలైన ప్రస్థానం 
చదువుకు పేదరికం అడ్డు కాదంది 
ఎన్ ఐ టి లో కన్నస్వదేశీ  కల 
కోట్ల ప్రజల గుండె దీపాలు వెలిగించింది 
కుల మత బేధాలు లేని స్నేహం 
మాయా మర్మం తెలియని పిల్లల మనసు 
చెరగని చిరునవ్వు 
కల లు వెలిగించే స్ఫూర్తి 
నిరంతరం భోధనలోనే తృప్తి 
పద్మ భూషణ్ లు పద్మ విభూషణ్ లు 
41 డాక్టరేట్లు 
విజయ పధాన మెరిసిన ఉపగ్రహ ప్రయోగాలు 
రాష్ట్ర పతి పదవులు 
గౌరవ సన్మానాలు 
ఎన్ని మెట్లు ఎక్కినా 
ఎన్ని బిరుదులూ పొందినా 
అహపు గాలి అంటని అగ్ని అతడు 
తన ''జర్నీ '' అయిపోయిందని తాను కుప్ప కూలినా 
గుండె లోతుల్లో నిలిచిపోయిన గురుతు  అతడు 
ఒక మిస్సైల్ 
ఒక లక్ష్యం 
ఒక కల 
ఒక దేశపు శ్వాస 
ఒక చరిత్ర 
ఒక విజ్ఞాన ఖని 
ఒక యోగి 
ఎన్ని కలలకు స్ఫూర్తి అతడు 
విశ్వానికే వన్నె తెచ్చిన జ్యోతి అతడు ..... 

అబ్దుల్ కలాం గారికి కన్నీళ్ళతో శ్రద్ధాంజలి ఘటిస్తూ ...... 

No comments: