భద్రపరుచుకోవాల్సిన జ్ఞాపకం
.....#వాయుగుండ్లశశికళ,21-92019
కాలం తన గుప్పిట మూసి తెచ్చి కొన్ని అద్భుతమైన రోజులు నాన్న తిరణాల నుండి మన కోసం తీసుకొని వచ్చి హఠాత్తుగా మనను కేరింతలు కొట్టే చిన్నపిల్లగా చేసేస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు.
ఇదిగో ఈ గురజాడ వారి జయంతిన జరిగింది ఒక అద్భుతం మిగిలిన జీవితానికి సర్వీస్ జ్ఞాపకంగా దాచుకొని పిల్లవాడు దాచుకున్న గవ్వలు చూసి మురిసినట్లు!
వీరభద్రుడు గారు మీ నాయుడుపేట కు జెడ్.పి.స్కూలు విజిట్ కి వచ్చియున్నారు అని ప్రతిమ అక్క మెసేజ్!గురువుగారు అంత దగ్గరకు వస్తే చూడలేకపోతే ఎలా?ఎన్ని ఏళ్ల నుండి అనుకుంటున్నాను మాట్లాడాలి అని.ఉదయం బయోమెట్రిక్ పెట్టేసాను.పని వదిలి కదలలేను. లోపల స్థిమితంగా ఉండలేక పోతున్నాను.పిల్లల కోసం వండిన నిండు కుండ దించలేక,వదలలేక అవస్థ పడుతున్న తల్లి లాగా నేను.చివరాశగా సార్ కి మెసేజ్ పెట్టాను.నేను మిమ్మల్ని కలవవచ్చా?
మీ బడి ఎక్కడ అమ్మా?చెప్పాను.
అక్కడే గేట్ దగ్గర ఉన్నాము.లోపలికి వస్తున్నాము.గబగబా పరిగెత్తాను కార్ దగ్గరకు.కాళ్ళు సహకరించడం లేదు.దేవుడు అయినా చటుక్కున ప్రత్యక్షం అయితే మర్యాదలు చేయడానికి పూలు అయినా ఉండొద్దా?సార్ తో పాటు మా సర్వశిక్షఅభియాన్ అధికారులు బ్రహ్మానందరెడ్డి గారు,విజయ లక్ష్మి గారు,లక్ష్మీ గారు మా ఎం.ఈ.ఓ లు.పి.డి గారు వచ్చారు,స్టాఫ్ అందరూ పరుగులు తీస్తూ ఉన్నారు.నాకు పై అధికారి కనపడటం లేదు మా సాహిత్య గురువుగారు తప్ప.హఠాత్తుగా కృష్ణుని చూసిన విదురుని లాగా ఉంది నా పరిస్థితి.ఏమి అతిధి మర్యాదలు చేయాలి!
ఒక వైపు శనివారం షెడ్యూల్ ప్రకారం డీర్ ప్రోగ్రాం కి (డ్రాప్ ఎవరీ థింగ్ ఎంజాయ్ రీడింగ్)
పిల్లలను సమావేశపరిచాము.ఇంతటి సాహితీ అతిధి ఏ డీర్ ప్రోగ్రాం కి వచ్చి ఉండరు.మా పిల్లల పుణ్యం.
పరిచయ కార్యక్రమ భారాన్ని నేను తీసుకున్నాను.ఫర్లేదు ఉడుత తాను మోయగలిగిన ఇసుక వారధికి మోయలేదా!
చెపుతూ ఉన్నాను పిల్లలకు ఆయన గురించి,కానీ ఆకాశానికి మొదలు తుది ఎక్కడ?చక్కగా అర్హతలు పెంచుకుంటూ ఒక అధికారిక పదవి చేపట్టిన ఉన్నతుడిని చూపాలా?గిరిజనుల కోసం తన పరిధిలో ఎన్నో చేసిన ఒక సమాజ సేవకుని చూపాలా,మా లాంటి శిష్యుల కోసం నిరంతరం సాహితీ వ్యాసాలు వ్రాసే గురువును చూపాలా,అనువాదకుడిని చూపాలా,కవిని చూపాలా,నిరంతర సాహితీ అధ్యయన ప్రయాణికుని చూపాలా,తెలుసుకున్న వెలుతురు వెనుక వాళ్లకు దీపంగా పరిచిన ఆకాశ దీపాన్ని చూపాలా,ఇవన్నీ కాకుంటే ఆయనలో నేను చూపగలిగిన అత్యుత్తమ విషయం ఆయన ఈ పిల్లలలాగే గురుకుల పాఠశాల విద్యార్థి,తాడికొండలో. మా పిల్లలకు దగ్గర చేయగల ఆత్మీయసూత్రం ఇది.చెపుతూ ఉన్నాను కళ్లు మాత్రం చెమ్మగిల్లుతూనే ఉన్నాయి.వారితో వచ్చిన అధికారులు కూడా సార్ తో జ్ఞాపకాలు పిల్లలతో పంచుకున్నారు.
అందరి చూపులు భద్రుడి గారి వైపే!మెల్లిగా సాగిన గొంతు మానస సరోవరం నుండి దాటి హృషీకేశ్ వైపు గంగమ్మ ఉరవడి అందుకుంది.ఆయన మాటలు చిన్నతనపు జ్ఞాపకాల వెంట నడుస్తూ.....అన్ని కిలోమీటర్లు నడిచి గ్రంధాలయం లో చందమామలు ఆపకుండా చదివిన సంగతులు,తత్వ శాస్త్రం బోధించేవారు లేకుంటే తానే తనకు గురువై గ్రంధాలయం లో చదువుకోవడం,పరా విద్య,అపరా విద్య,ప్రేమ తో మనిషి మనీషి గా మారే క్రమంగా.....ఒకటా, రెండా!పాలు పొంగి దొర్లిపోతున్నట్లు జ్ఞానం ఆయన నుండి మాటలుగా పొంగుతూనే ఉంది.
కల లాగే మీటింగ్ అయిపోయింది.కార్ కదులుతూ ఉంది.చేతులు జోడించాను.కొండ దేవుడి దగ్గరకు రాలేకపోతే దేవుడే కొండ దగ్గరకు వస్తాడు.పిల్లలందరి ముందు గురువుగారు ఒక్క మాట అన్నారు,శశికళ నా అభిమాని, నా చెల్లెలు అని!చాలు.తాను చల్లిన ఇసుక జ్ఞాపకంగా వీపుపై మోయడానికి ఉడుత కి ఎంత భాగ్యం.
పిల్లలు పాడుతూ ఉన్నారు"మళ్లీ రాలేరా!మమ్మల్ని మరిచిపోతారా?"
ఇంత చిన్న వయసులో ఆయనను చూసిన జ్ఞాపకం దొరికింది వారికి.వారిది భాగ్యం.
మళ్లీ సమస్య గుర్తుకు వచ్చింది,విదురుడు భక్తిలో పడి తొక్క తీసి ఇచ్చినట్లు,ఫలాన్ని పొందలేక పోయినట్లు....ఇంతదూరం గురువుగారు స్కూలువిజిట్ కి వస్తే చిన్న ఆటోగ్రాఫ్ అడగకపోతిని!అప్పుడు ఇన్నిసార్లు గిల్లి చూసుకునే బాధ తప్పేది.
(వాడ్రేవు వీరభద్రుడి గారికి నమస్సులతో)
"ఒక ఉడుత జ్ఞాపకం", ప్రతిలిపిలో చదవండి:
భారతీయ భాషల్లో అపరిమిత కథలను పూర్తి ఉచితంగా చదవండి,రాయండి మరియు వినండి
No comments:
Post a Comment