Wednesday, 28 November 2012

మలాలా యూసఫ్‌జాయ్....గొంతు నులిమిన ఒక కోయిల

అక్కడ పావురాల కుత్తుకలు ఉత్తరించబడుతాయి 
సాంప్రదాయమొక్కకి ఆహారంగా .......
కోయిలల గొంతులు ఆంక్షలకు మెలిపడుతాయి
కొత్తరాగాలు విచ్చుకోకుండా.......
లేడిని వేటాడటం......లేడీని వేదించటం 
అణగతొక్కిన మూలుగులు 
స్వేచ్చ కోసం పోరాటం 
చదువు కోసం ఆరాటం 
బురఖాల వెనుక అదుముకున్న ఆవేశాలు
నిత్యజీవితపు నరకాలు 
లోకానికి కనపడని కోణాలు ......

లేత పూరేకు నేడు విచ్చుకుంది 
ప్రశ్నగా మారి తూటాకు ఎదురుగా నిలిచి 
వేటువేసే  కొడవళ్ళ పై అక్షరాలచిత్రాన్నిపరిచి 
హక్కుల కాలరాతను 
మరణించిన మానవత్వాన్ని 
మా ఉనికి ఎక్కడనే ప్రశ్నను 
కాలపాశంలా లోకంపై విసిరింది 

వేలగొంతుకల స్వేచ్చా నినాదాలు పలుకుతున్న 
ఆ చిన్నారి మొక్కజొన్న పువ్వు 
''మలాలా యూసఫ్‌జాయ్. ''
అడ్డంకుల చేదించు 
వివక్షల సంకెళ్ళు తెంచు 
నీ హక్కులకై ఉద్యమించు 
రేపటి రోజు నీదే.....
ఇందరి ఊపిరే ....నీ శ్వాస.
కళ్ళలో పొంగే ఆశలే ...నీ ఆయుష్షు...
పదుగురికోసం కొట్టుకునే గుండె 
ఉద్యమాల మోతతో మోగే డప్పు 
ఈ రోజు నీవు వ్రాసిన మాట 
కావాలి ఎందరికో స్పూర్తినిచ్చే బాట. 

''మలాలా యూసఫ్‌జాయ్.'' గూర్చిన కధనం 
25/11/2012 నాటి ఫండే లో చాలా బాగుంది .
చదవండి.లింక్ ఇక్కడ ......
(మలైలా చీకటిని ప్రశ్నించిన వెలుగురేఖ )


ఉర్దూలో ‘గుల్ మకాయి’ అంటే మొక్కజొన్న పువ్వని అర్థమట. ‘మలాలా’ అనే పేరు ప్రపంచానికి తెలియకముందు, ఆ కలంపేరుతో తమ ప్రాంతపు వెతను ప్రపంచానికి వెల్లడించింది మలాలా యూసఫ్‌జాయ్. అప్పుడు తన వయసు పదకొండేళ్లు. ఏడో క్లాసు చదువుతోంది. ఇంత చిన్నమ్మాయి ఇదంతా చేసిందంటే అబ్బురమనిపించొచ్చు. కానీ పరిస్థితులు ఎవరినైనా అలా తీర్చిదిద్దుతాయంటుంది తను, పెద్ద ఆరిందలా. తాలిబాన్ల ప్రాబల్యం ఉన్న పాకిస్తాన్‌లోని స్వాత్ ప్రాంతంలో, బాలికల చదువు మీద నిషేధాజ్ఞలున్న విపత్కర ప్రదేశంలో దానికి వ్యతిరేకంగా గళం విప్పింది. 2009 నుంచీ ప్రసార మాధ్యమాల్లో స్పందించింది. పిన్న వయసు విద్యాహక్కుల కార్యకర్తగా మన్ననలందుకుంది. దీన్ని సహించలేని తాలిబాన్లు మొన్న అక్టోబర్ 9న ఆమె మీద కాల్పులు జరిపారు. ఒక దశలో అంతిమసంస్కారాలకు ఏర్పాట్లు చేయడం గురించి ఆలోచించారామె తల్లిదండ్రులు. కానీ క్రమంగా కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి నవంబర్ 10ని ‘మలాలా డే’గా ప్రకటించిన నేపథ్యంలో ఈ మొక్కజొన్న పువ్వు ‘బీబీసీ ఉర్దూ ఆన్‌లైన్’లో డైరీ రూపంలో పరిచిన అంతరంగం...

జనవరి 3, 2009; శనివారం:

రాత్రి నాకో భయానకమైన కలొచ్చింది. అందులో తాలిబాన్లు, హెలికాప్టర్లు! స్వాత్‌లో మిలిటరీ ఆపరేషన్ జరుగుతున్నప్పటినుంచీ ఇలాంటి కలలు తరచూ వస్తున్నాయి. 

అమ్మ చేసిన టిఫిన్ తిని స్కూలుకు వెళ్లిపోయాను. స్కూలుకు వెళ్లాలంటే భయమేస్తోంది. ఎందుకంటే, విద్యార్థిను లెవరూ పాఠశాలలకు వెళ్లకూడదని తాలిబాన్లు ఆజ్ఞాపించారు. 27 మంది ఉన్న మా క్లాసులో కేవలం 11 మందిమే వచ్చాం. నా ముగ్గురు స్నేహితురాళ్ల కుటుంబాలు వరుసగా పెషావర్, లాహోర్, రావల్పిండికి వెళ్లిపోయాయి.
స్కూలు నుంచి సాయంత్రం తిరిగొస్తుండగా, ఒకాయన ‘నేను నిన్ను చంపేస్తా,’ అనడం వినిపించింది. భయంతో వేగంగా నడుస్తూ... కొంత దూరం తర్వాత ఆయన నా వెనకే వస్తున్నాడా అని తిరిగిచూశాను. హమ్మయ్య! ఆయన మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ ఎవరినో బెదిరిస్తున్నాడు.

జనవరి 4; ఆదివారం:

ఇవ్వాళ మాకు సెలవు కాబట్టి ఆలస్యంగా పదింటికి నిద్రలేచాను. లేచేసరికి, గ్రీన్‌చౌక్‌లో పడివున్న ఏవో మూడు శవాల గురించి మా నాన్న చెబుతున్నాడు. అది వినగానే నాకు చేదుగా అనిపించింది.
ఇంతకుముందైతే ఆదివారాల్లో మార్గజార్, ఫిజాఘాట్, కుంజుకు పిక్నిక్ వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఏడాదిన్నరగా బయటికే వెళ్లలేదు. రాత్రి భోజనం తర్వాత సరదాగా వాకింగ్‌కు వెళ్లేవాళ్లం. ఇప్పుడు సూర్యాస్తమయం లోపలే ఇంట్లో ఉంటున్నాం. 

ఈరోజు ఇంట్లో అమ్మకు పనిలో సాయపడ్డాను, కొంత హోమ్‌వర్క్ ఉంటే చేశాను, కాసేపు తమ్ముడితో ఆడుకున్నాను. 

జనవరి 5; సోమవారం:

స్కూలుకు రెడీ అవుతుండగా గుర్తొ చ్చింది, మా ప్రిన్సిపల్ యూనిఫారాల్లో కాకుండా సివిల్‌డ్రెస్సుల్లో రమ్మని చెప్పిన విషయం. కాబట్టి నాకు ఇష్టమైన పింక్‌డ్రెస్ వేసుకున్నాను. మిగతా అమ్మాయిలు కూడా రంగురంగుల దుస్తులు వేసుకోవడంతో స్కూల్లో కాకుండా ఇంట్లో ఉన్నట్టనిపించింది. ఉదయపు అసెంబ్లీలో ‘రంగురంగుల దుస్తులు వేసుకోవద్దు, తాలిబాన్లు అభ్యంతరం చెబుతా’రని ప్రిన్సిపల్ అన్నారు.

ఒక ఫ్రెండ్ నా దగ్గరికొచ్చి, ‘దేవుని మీదొట్టు, నిజం చెప్పు, మన స్కూలుమీద తాలిబాన్లు దాడిచేస్తారా?’ అని అడిగింది.

స్కూలు నుంచి వచ్చేశాక లంచ్ చేసి, ట్యూషన్‌కు వెళ్లాను. సాయంత్రం టీవీ వార్తల్లో షకర్ద్రాలో పదిహేను రోజుల తరవాత కర్ఫ్యూ తొలగిస్తున్నట్టు చెప్పారు. సంతోషమేసింది. ఆ ప్రాంతంలో మా ఇంగ్లీష్ టీచర్ ఉంటారు. అయితే రేపట్నుంచి మేడమ్ స్కూలుకు వస్తారన్నమాట!

జనవరి 7; బుధవారం:

మొహర్రం కాబట్టి బునేర్ వచ్చాం. ఇక్కడి పర్వతాలు, ఆకుపచ్చటి మైదానాలంటే నాకు చాలా ఇష్టం. నా స్వాత్ ఇంతకంటే అందమైనది కానీ అక్కడ శాంతి లేదు. కానీ ఇక్కడ కాల్పులు లేవు, భయం లేదు, ప్రశాంతంగా ఉంది. 
పీర్ బాబా సమాధికి వెళ్లాం. చాలామంది జనం ఉన్నారు. దుకాణాల్లో గాజులు, చెవిరింగులు, లాకెట్స్ అమ్ముతు న్నారు. ఏవైనా కొంటే బాగుంటుందనిపిం చిందిగానీ అంతగా నచ్చలేదు. అమ్మ మాత్రం గాజులు, చెవిరింగులు తీసుకుంది.

జనవరి 14; బుధవారం:

స్కూలుకు వెళ్తున్నప్పుడు ఎందుకో మనసేమీ బాగోలేదు. రేపట్నుంచీ శీతాకాలపు సెలవులని ప్రిన్సిపల్ అనౌన్స్ అయితే చేశారుగానీ మళ్లీ ఎప్పుడు తెరుస్తారో చెప్పలేదు. ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇంతకుముందయితే తేదీ స్పష్టంగా చెప్పేవారు. దీనికి కారణం కూడా ప్రిన్సిపల్ చెప్పలేదు. నేననుకోవడం జనవరి 15 నుంచీ విద్యార్థినుల చదువు మీద తాలిబాన్లు నిషేధం ప్రకటించడమే కారణం.

సెలవులు ఇచ్చినప్పుడు సంతోషపడక పోవడం కూడా ఇదే మొదలు. తాలిబాన్లు ప్రకటించినట్టే జరిగితే మళ్లీ స్కూలుకు రావడమంటూ ఉండదు. కానైతే కొంతమంది అమ్మాయిలు మళ్లీ ఫిబ్రవరిలో స్కూలు ఓపెన్ అవుతుందన్న ఆశతో ఉన్నారు. ఇవ్వాళ చివరిరోజు కాబట్టి స్కూలు మైదానంలో ఎక్కువ సేపు ఆడుకున్నాం. తిరిగి వచ్చేటప్పుడు, మళ్లీ ఇక్కడికి రామేమో! అన్నట్టుగా స్కూలు బిల్డింగు వైపు తదేకంగా చూశాను.

జనవరి 15; గురువారం:

రాత్రంతా ఒకటే కాల్పుల శబ్దం. మూడుసార్లు మెలకువొచ్చింది. అయితే స్కూలు ఎటూ లేదు కాబట్టి పదింటికి నిద్ర లేచాను. ఒక స్నేహితురాలొస్తే కాసేపు హోమ్‌వర్క్ గురించి మాట్లాడుకున్నాం.

ఈరోజే మొదటిసారి బీబీసీ-ఉర్దూ బ్లాగులో నేను రాసిన డైరీని ఒక పేపర్ అచ్చువేస్తే చూశాను. అమ్మకు నా కలంపేరు గుల్‌మకాయ్(మొక్కజొన్న పువ్వు) బాగా నచ్చింది. ఇకనుంచీ నాపేరు అలా మారిస్తే బాగుంటుందికదా, అని నాన్నతో అంది. నాక్కూడా అలాగే అనిపించింది. నా అసలు పేరుకు అర్థం ‘దుఃఖంతో కూడిన’.
ఇంతకుముందెవరో ఈ డైరీ ప్రింట్ అవుట్ చూపించి, మా నాన్నతో ‘భలే బాగుంది,’ అన్నారట. నాన్న నవ్వి ఊరుకున్నారటగానీ రాసింది మా అమ్మాయేనని ఒక్క మాటైనా చెప్పలేదట.

జనవరి 16; శుక్రవారం:

ప్రభుత్వం మా స్కూళ్లను కాపాడుతుందని నాన్న అన్నారు. ప్రధానమంత్రి కూడా ఈ అంశం గురించి మాట్లాడారు. ముందయితే భలే సంతోషమేసిందిగానీ, నాకైతే నమ్మకం కుదరడం లేదు. స్వాత్‌లో రోజూ ఎంతోమంది సైనికులు చనిపోతున్నారు, ఎంతోమంది కిడ్నాప్ అవుతున్నారు. పోలీసులయితే ఎక్కడా కనిపించరు.
అమ్మానాన్న కూడా భయంగానే ఉన్నారు. అమ్మాయిలు స్కూళ్లకు వెళ్లొచ్చని తాలిబాన్లు ఎఫ్‌ఎం రేడియోలో ప్రకటించే దాకా నన్ను బడికి పంపమన్నారు. 

జనవరి 19; సోమవారం:

ఈరోజు మరో ఐదు స్కూళ్లు తాలిబాన్ల దాడిలో ధ్వంసమైనాయి. అందులో ఒకటి మా ఇంటి దగ్గరిది. ఎటూ స్కూళ్లు మూసేశారుకదా, మళ్లీ వాటిని పేల్చేయడమెందుకో నాకు అర్థంకాలేదు. తాలిబాన్లు పెట్టిన డెడ్‌లైన్ ప్రకారం ఎవరమూ స్కూళ్లకు వెళ్లలేదు.

జనవరి 22; గురువారం:

పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. రాత్రి మౌలానా షా దౌరాన్(తాలిబాన్ మతగురువు) ఎఫ్‌ఎం రేడియోలో ఆడవాళ్లు ఎవరూ ఇంట్లోంచి బయటకు రావొద్దని ప్రకటించారు. (స్కూళ్లకు వెళ్లొద్దని ప్రకటించింది కూడా ఈయనే.) సైన్యం తమ సెక్యూరిటీ పోస్టులుగా వాడుకుంటున్న పాఠశాలల్ని కూడా తాము పేల్చేస్తామన్నారు. హాజీ బాబా ప్రాంతంలోని స్కూళ్లల్లోకి సైన్యం వచ్చిందని నాన్న చెప్పారు. దేవుడా! వాటిని కాపాడు. ముగ్గురు దొంగలకు రేపు బహిరంగ కొరడాదెబ్బల శిక్ష అమలు చేస్తామనీ, ఇష్టమైనవాళ్లు వచ్చి చూడొచ్చనీ దౌరాన్ అన్నారు.

జనవరి 24; శనివారం:

మా యాన్యువల్ ఎగ్జామ్స్ సెలవుల తర్వాత జరగాలి. అయితే తాలిబాన్ల నిషేధం తొలగిపోతేనే అవి జరగడం సాధ్యం. కొన్ని చాప్టర్స్ చదువుకొమ్మని చెప్పారుగానీ నాకు చదవబుద్ధి కాలేదు.

ప్రతిసారీ మా స్కూళ్లో ఆనర్ బోర్డు మీద ఫస్టొచ్చిన వారి పేర్లు రాస్తారు. ఈసారి ఎవరి పేరూ ఉండేట్టు లేదు.

జనవరి 28; బుధవారం: 

మమ్మల్ని ఇస్లామాబాద్ తీసుకెళ్తానని నాన్న ఎప్పుడో మాటిచ్చారు. ఇప్పుడు నిలబెట్టుకున్నారు. రాత్రే ఇక్కడికి వచ్చాం. నాన్న స్నేహితుడి ఇంట్లో ఉన్నాం. ఇస్లామాబాద్ చూడటం ఇదే మొదటిసారి. పెద్ద బంగళాలు, వెడల్పయిన రోడ్లతో నగరం బాగుంది. మా స్వాత్‌తో పోల్చితే మాత్రం ఇక్కడ ప్రకృతి సౌందర్యం ఏమీలేదు. నాన్న మమ్మల్ని లోక్ విర్సా మ్యూజియమ్‌కు తీసుకెళ్లారు. ఇలాంటి మ్యూజియం స్వాత్‌లో కూడా ఉందిగానీ ఈ కాల్పుల్లో అది భద్రంగా ఉంటుందంటే అనుమానమే!

ఒక ముసలాయన దగ్గర నాన్న పాప్‌కార్న్ కొన్నారు. ఆయన ‘పష్తో’లో మాట్లాడుతుంటే, ‘మీది ఇస్లామాబాదేనా?’ అని నాన్న అడిగారు. ‘ఇస్లామాబాద్ ఎక్కడైనా పష్తూన్లదవు తుందా?’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. వాళ్లది మోమంద్ ఏజెన్సీ అనీ, సైనికచర్య వల్ల తమ తావు వదిలేసి బతుకుదెరువు కోసం ఇలా నగరానికి రావాల్సివచ్చిందనీ చెప్పారు. అప్పుడు అమ్మానాన్నల కళ్లల్లో కన్నీళ్లు చూశాను.

జనవరి 31; శనివారం: 

బన్ను నుంచి పెషావర్ వెళ్తుండగా మా స్నేహితురాలు ఫోన్ చేసింది. స్వాత్‌లో పరిస్థితి ఘోరంగా ఉందనీ, నన్ను తిరిగిరావొద్దనీ చెప్పింది. సైన్యానికీ తాలిబాన్లకీ పోరాటం తీవ్రమైందనీ, ఇవ్వాళ ఒక్కరోజే 37 మంది జనం చనిపోయారనీ చెప్పింది.

సాయంత్రానికి పెషావర్ వచ్చాం. చాలా అలసిపోయాం. టీవీ పెడితే స్వాత్ గురించిన రిపోర్టు. కాలినడకన, ఉత్తిచేతుల్తో స్వాత్ నుంచి వలస వెళ్తున్న జనాన్ని చూపించారు. ఇంకో ఛానల్లో ఒకామె, ‘బేనజీర్ భుట్టో హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం,’ అంటోంది. నాన్నను నేనడిగాను: మరి స్వాత్‌లో వందలాది మంది చనిపోతున్నారుకదా, దానికి ఎవరు ప్రతీకారం తీర్చుకోవాలి?

ఫిబ్రవరి 2; సోమవారం:

ఫిబ్రవరి 9న అబ్బాయిల స్కూల్స్ ప్రారంభమవుతున్నట్టుగా నోటీసు బోర్డుల్లో రాశారని నాన్న చెప్పారు. అమ్మాయిల స్కూళ్ల ముందు మాత్రం ఇలాంటి నోటీసులు పెట్టలేదట. అంటే మావి ఓపెన్ కావట్లేదన్నమాట.

ఫిబ్రవరి 9; సోమవారం:

బాలల పాఠశాలలు ప్రారంభమైనాయి. బాలికల ప్రాథమిక విద్య మీద తాలిబాన్లు నిషేధం తొలగించడంతో వారివి కూడా మొదలైనాయి. ప్రైమరీ వరకు మా స్కూల్లో కో-ఎడ్యుకేషన్ ఉంది.

మా చిన్న తమ్ముడి స్కూల్లో 49 మందికి ఆరుగురే వచ్చారట. అందులో ఒక్క పాప. మా స్కూల్లో 700 మందికి 70 మందే వెళ్లారట.

ఫిబ్రవరి 11; బుధవారం:

ఈమధ్య మేము తరచూ ఇవే మాటలు వింటున్నాం: సైన్యం, తాలిబాన్లు, రాకెట్, బాష్పవాయువు, మౌలానా ఫజుల్లా, పోలీస్, హెలీకాప్టర్, చనిపోవడం, గాయపడటం.

ఫిబ్రవరి 16; సోమవారం:

ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సైన్యానికీ తాలిబాన్లకూ శాంతి ఒప్పందం కుదిరింది. జనం మిఠాయిలు పంచుకున్నారు. నాకు శుభాకాంక్షలు చెప్పడానికి ఒక స్నేహితురాలు వచ్చింది. ఇన్ని రోజులూ తనను గదిలో బంధించినట్టుగా అనిపించిందని చెప్పింది. మా స్కూలు కూడా తెరుస్తారని ఆశగా ఉన్నాం.

ఫిబ్రవరి 18; బుధవారం:

ఇవ్వాళ మార్కెట్‌కు వెళ్లాను. రద్దీగా ఉంది. చాలా రోజుల తర్వాత ట్రాఫిక్ జామ్ అవడం చూశాను. 
సాయంత్రం, స్వాత్ జర్నలిస్టు మూసా ఖాన్‌ఖేల్‌ను ఎవరో చంపేశారని నాన్న చెప్పారు. మా శాంతి కల చెదిరి పోయినట్లనిపించింది.

ఫిబ్రవరి 23; సోమవారం: 

ఇవ్వాళ స్కూలు తెరుస్తారని తెలిసి, సంతోషమేసింది. కొంతమంది యూనిఫారాల్లోనూ, ఇంకొంతమంది సివిల్ డ్రెస్సుల్లోనూ వచ్చారు. అందరి ముఖాల్లోనూ ఎంతో సంతోషం కనబడింది. చాలారోజుల తర్వాత కలిశాం కదా, ఒకరినొకరం ఆత్మీయంగా కౌగిలించుకున్నాం.
(డైరీలోని కొన్ని భాగాలు)

స్వాత్ నుంచి సమితి వరకు...

పాకిస్తాన్ స్వాత్ జిల్లాలోని ఒక పట్టణం మింగోరా. 1,75,000 జనాభా ఉన్న మింగోరా... స్వాత్ నదికి దగ్గరగా ఉన్న అందమైన పర్యాటక ప్రదేశం. అందుకే దాన్ని ‘స్విట్జర్లాండ్’గా అభివర్ణించారు రెండో ఎలిజబెత్ రాణి. మింగోరాతో సహా స్వాత్ జిల్లాలో తాలిబాన్ల ప్రాబల్యం ఎక్కువ. పాకిస్తాన్ సైన్యానికీ వారికీ మధ్య తీవ్రమైన కాల్పుల తర్వాత ప్రస్తుతం ఈ ప్రాంతం సైన్యం అధీనంలో ఉంది. ఈ మింగోరా పట్టణంలోనే మలాలా 1997 జూలై 12న జన్మించింది. పష్తూన్ కవయిత్రి, ఆంగ్లేయులతో పోరాడిన వీరనారి మలాలాయి పేరుమీదుగా తన కూతురికి మలాలా అని నామకరణం చేశారు జియావుద్దీన్. ఈయన కవి, విద్యాసంస్థల యజమాని.
2009లో తాలిబాన్లు స్వాత్ జిల్లాను ఆక్రమించుకున్నప్పుడు జనవరి 14 నుంచీ బాలికల చదువును పూర్తిగా నిషేధించారు. దీనిమీద ఒక కార్యక్రమం రూపొందించడానికి ‘బీబీసీ’ ప్రయత్నించినప్పుడు, ప్రాణభయంతో గొంతు విప్పడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో మలాలా ధైర్యం చేసింది. తర్వాత ‘గుల్ మకాయ్’ పేరుతో అదే బీబీసీ ఉర్దూ బ్లాగులో డైరీ రాసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణకు నోచుకుంది. సొంతపేరుతో వెలుగులోకి వచ్చాక మలాలా ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు సహా ఎన్నో ఇంటర్వ్యూలిచ్చింది. అంతర్జాతీయ సమాజం ఆమెతో గొంతు కలిపింది. ఇదే తాలిబాన్లకు కంటగింపుగా మారింది.

9 అక్టోబర్ 2012న మలాలా పరీక్ష రాసి స్కూలు బస్సులో ఇంటికి తిరుగు ప్రయాణమవుతున్నప్పుడు, ముసుగు ధరించిన ఒక తుపాకీ వ్యక్తి లోపలికి ప్రవేశించి, ‘ఇందులో మలాలా ఎవరు? లేదంటే అందరినీ కాల్చిపారేస్తాను,’ అని బెదిరించాడు. మలాలాను గుర్తించిన తర్వాత తలమీద, మెడ మీద రెండుసార్లు కాల్చాడు. తీవ్రంగా రక్తమోడిన ఆమెను వెంటనే పెషావర్‌లోని ఆసుపత్రికి తరలించారు. తర్వాత రావల్పిండిలోనూ చికిత్స జరిగింది. అటుపై కేసు తీవ్రత దృష్ట్యా బర్మింగ్‌హామ్ తీసుకెళ్లారు. ఇప్పుడామె క్రమంగా కోలుకుంటోంది. ఈ దాడిలో మలాలాతో పాటు గాయపడిన మరో ఇద్దరు బాలికలు కైనాత్ రియాజ్, షాజియా రంజాన్ పరిస్థితి కూడా నిలకడగా ఉంది. అసభ్యతకు, అవిశ్వాసానికి ప్రతీకగా మలాలాను చూస్తున్నట్టుగా తాలిబాన్ పేర్కొంది. ఆమెతోపాటు, ఆమె తండ్రి జియావుద్దీన్‌ను కూడా ఎప్పటికైనా చంపేస్తామని ప్రకటించింది. అయితే, మలాలా మీద జరిగిన దాడిని నిరసిస్తూ, ఆమె మీద కాల్పులు జరిపిన వారికి వ్యతిరేకంగా సుమారు 50 మంది పాకిస్తాన్ మతగురువుల బృందం ఫత్వా జారీ చేసింది.


‘మలాలా యూసఫ్‌జాయ్ ప్రభుత్వ బాలికల మాధ్యమిక పాఠశాల’

చిన్న వయసులోనే బాలికల విద్య కోసం పోరాడుతున్న మలాలా 2011 సంవత్సరానికిగానూ ‘అంతర్జాతీయ శాంతి బహుమతి’కి నామినేట్ అయి, రన్నరప్‌గా నిలిచింది.
2011 డిసెంబరులో పాకిస్తాన్ తన మొట్టమొదటి ‘నేషనల్ యూత్ పీస్ ప్రైజ్’ను మలాలాకు బహూకరించింది. 
2012 జనవరిలో స్వాత్‌లోని ఒక ప్రభుత్వ బాలికల మాధ్యమిక పాఠశాలకు ఆమె పేరు పెట్టారు.
దాడి జరిగిన తర్వాత, అక్టోబర్ 15న ఆమె ధైర్యసాహసాలను గౌరవిస్తూ పాకిస్తాన్ అక్కడి మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘సితారా ఎ షుజాత్’ను ప్రకటించింది

5 comments:

Chandu S said...

nice post Sasi garu

Anonymous said...

inta manchi postu esinanduku maaki tarupuna meekoo thanks chebutunnay sasi ji

fayez sheikhmuddien
hafeez pet

శశి కళ said...

శైలజ గారు థాంక్యు

శశి కళ said...

అనానమస్ గారు హ...హ...లోల్...ఎవరండి మీరు?

రాజ్ కుమార్ said...

nice post andee.. thanq very much for sharing